Monday, August 24, 2015

తెలుగుతక్కువతనం- ఓ సరదా గల్పిక

రాళ్ళులేని బియ్యమైనా చౌకధరల దుకాణాల్లో దొరకటం తేలికేమోకానీ.. దొరలభాష దొర్లని తెలుగుపలుకులు వినటం దుర్లభంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల  శాసనసభల్లోనూ ఇదే దుస్థితి. 'అమ్మా' అని అమ్మభాషలో పిలిస్తే అమ్మయినా 'ఓయ్' అని పలికే పరిస్థితి లేదు ప్రస్తుతం. తెలుగు బోధించే ఉపాధ్యాయులకు సైతం తెలుగులో సంతకం చేయటం నామోషీ. రాజకీయ నినాదాలకు మినహా తెలుగు ఇప్పుడు ఆకాశవాణి సంస్కృత వార్తల్లాగా ఎవరికీ పట్టని గోడుగా మారింది ! ఎందుకిలా? !

సున్నా కనుక్కున్నది భారతీయుడే అయినా అరసున్నాని కనిపెట్టి మరీ  వాడుకున్నదిమాత్రం మన తెలుగువాడే !  మన 'అజంత భాష' తెలుగును బ్రౌనుదొర  ఎంతగా ప్రేమించాడు! తెలుగువాడికే ఎందుకో మొదటినుంచి పరాయితనం మీదంత పరమ మోజు!
ఆంధ్రులకోసం భారతాన్ని తెనుగిస్తున్నానన్న నన్నయ భట్టారకుడు ఆరంభంలోనే సంస్కృత శ్లోకంతో శ్రీకారం చుట్టాడు! ఆంధ్ర కేసరి, ఆంధ్రాస్కాటు, ఆంధ్ర హేస్, ఆంధ్రా దేవానందంటూ అస్తమానం పరాయితనంతోనే గుర్తింపు పొందాలన్న తాపత్రయమేందో తెలుగువాడికి.. ఖర్మ కాకపోతే!   
'ఆంధ్రత్వం తపస్సిద్ధి పుణ్యం' అన్నాడు అరవ పండితుడు అప్పయ్య దీక్షితులు. 'సుందర తెనుంగు' గా  తెలుగుకి  హారతి  పట్టాడు
తమిళ  భారతి. 'కన్నడం వచ్చుగదా! ఆముక్తమాల్యదను తెలుగులోనే రాయాలని ఎందుకనిపించిందయ్యా రాయలా!' అని అడిగితే 'నేను తెలుగు రాజును. నాది తెలుగు భాష. దేశ భాషలందు తెలుగు లెస్స కనక' అంటూ పలుకారణాలు వినిపించిన రాయలు పిచ్చివాడా?! అచ్చులతో అంతమయ్యే అపురూప పదసంపద తెలుగు సొంతం. డాంటే వంటి ఉద్దండపిండాలకేమో ఇది  'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్'! తాటాకుపాలెం చంటాడికేమో ఇది 'వేస్టు'! ఆంగ్లంలో వర్ణక్రమాలు తప్పుల్లేకుండా చెప్పి కప్పులు కొట్టుకొచ్చే తెలుగుపిల్లలుకూడా  తెలుగుపత్రిక పుటలోని ఒక్క పేరాని  తప్పుల్లేకుండా గడగడా చదవమంటే మాత్రం  తడబడిపోతారు!

అమ్మఒడే బడి అంటారు. ఆ అమ్మకే  కమ్మని తెలుగు నూరారా పలకటం నామర్దా మారిపోయిన దుర్దశ ప్రస్తుతం  నడుస్తున్నది. 
'మా తెలుగుతల్లికి మెల్లెపూదండ' అంటూ పిల్లలకు  పాటలు నేర్పేందుకే గురువూ దొరకడం లేదు.  మన గుర్తు పూర్ణకుంభం,  మన పిట్ట పాలపిట్ట, మన ఆట క్రికెట్టు కాదు.. కబడ్డీ’ అని కన్నతండ్రికి తెలిస్తేనే కదా చిన్నబిడ్డకు నూరిపోసేది! ‘గొడుగు’ అంటే ఎండా కాలంలో వాడేదని .. ‘గిడుగు’ అంటే వానాకాలంలోవాడేదని గురువుకు తేడా తెలిసుంటేనే గదా శిష్యుడికి నేర్పగలిగేది! 'తెలుగు పలకటమే నేరమనే బడులకు భారీరుసుములు కట్టి మరీ ఎగబడే మన తల్లిదండ్రుల వేలంవెర్రిని ఏమని పిలుచుకోవాలి! నాణేలమీద ఆనాటి  కాలంలో  ఆంగ్లం, హిందీ, బెంగాలీ భాషలతోపాటు 'ఒక అణా' అని ఒక్కతెలుగులోనే రాసేవారు. నాలుగు వందల పదాల సాయంతోనే తెలుగింటి ఆచార వ్యవహారాలన్నింటిని స్పష్టంగా చెప్పుకోవచ్చని తాపీ ధర్మారావు గారు  ఏనాడో చెప్పుకొచ్చారు. ఆలకించే నాథుడేడీ!

గోరింటాకును ఆంగ్లంలో ఏమంటాం? గోరుముద్దలకు కాకియెంగిగిలికి ఆంగ్లంలో సమానార్థక పదాలున్నాయా? 'బుజ్జివెధవ'నే పిలుపులోని  మధురిమ చెడకుండా  మనం అస్తమానం నెత్తికెక్కించుకొని ఊరేగే  ఏ భాషలోకైనా  తర్జుమా చేసి చూపమనండి! మంగళంపల్లి బాలమురళైనా మంగళ హారతిని శుద్ద ఆంగ్లంలో పాడి తలూపించగలరా?

'విద్యనిగూడ విత్త'మని ఏనుగు లక్ష్మణకవి ఏ ముహూర్తంలో అన్నాడో గానీ- నేడు మనం విద్యనికూడా కేవలం విదేశీ విమానమెక్కే  నిచ్చెనగా మాత్రమే చూస్తున్నాం. తెలుగుగడ్డమీద ఒకబిడ్డ పుడితే భావి అమెరికాపౌరుడొకడు పెరిగినట్లే భావిస్తున్నాం!
ఓనమాల వర్ణమాలకు ఏనాడో పంగనామాలు పెట్టేసుకొన్నాం. ఏ మారుమూల చిన్నబడిలో చూసినా ఏబిసిడీలే మారుమోతే!  సరైన పరిజ్ఞానం,  శిక్షణలేని ఉపాధ్యాయులు ఆంగ్లపాఠాలను   తెలుగులిపిలో రాసి వినిపిస్తున్నారని వింటుంటే- గురజాడ మార్కు గిరీశం 'మనవాళ్ళుట్టి వెధవాయిలోయ్' అన్న మాటే  అక్షరాఆ  నిజమనిపించడంలా!

తెలుగు ప్రాచీనభాషగా గుర్తింపుపొందినందుకు సంతోషమే! కానీ.. దాన్ని మరింత సరళం, అధునికం చేసి..  నేటి అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దకపోతే ముందుతరాలతో నిందపడేది మన తరమే! చిన్నతనంలోమాతృభాషలో విద్య నేర్పనందుకు ఔరంగజేబు చేత గురువు ముల్లాసాహెబు పడ్డ నిందవంటిదే ఆ నింద. ఆ నిందాభయమైనా నిద్రాణమైవున్న  ఆత్మగౌరవాన్ని తట్టిలేపి తెలుగుతక్కువదన్నాన్ని తరిమిగొడితే బాగుణ్ణు!
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు సంపాదక పుటలో ప్రచురితం)

***

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...