Sunday, February 14, 2016

సృజన


సృష్టి-పునఃసృష్టి జీవనం కొనసాగింపు  సహజచర్య. మానవేతర జంతుజాలం తమలాంటి జీవులను మాత్రమే సృష్టించ గలిగితే… ఇతర  రూపాలనూ, శబ్దాలనూ సృష్టించే ప్రతిభ మనిషిది. సంతాన సృష్టికి ప్రతిభతో పని లేదు.అవి జంతుజాలాలూ చేసే సృష్టికార్యమే. ఇతరేతర శబ్ద, రూపాల పునఃసృష్టికి ప్రతిభ తప్పనిసరి. ఆ  ప్రతిభనే మనం సృజనగా గుర్తిస్తున్నాం.  ఆ శక్తి గలవారిని  సృజనశీలురు, స్రష్టలు అంటున్నాం.
కళాకారులందరూ స్రష్టలే. కాని అంతకన్నా ముందు మానవులు. అలాగని మానవులందరూ కళాకారులు కాదు. కాలేరు. కొద్దో గొప్పో ప్రతి మనిషిలోనూ పిసరంతైనా కళంటూ ఏదో ఒకటి దాగుండక పోదు కానీ..ఆ కళేదో బహిర్గతమైనప్పుడే అతనికి    కళాకారుడిగా గుర్తింపొచ్చేది.
సుప్రసిద్ధ పాశ్చాత్య దార్శనికుడు డిస్కార్టిస్టు ‘ఆలోచనను బట్టే ఉనికి’ (Cogito ergo sum)సిద్ధాంతం ప్రకారం మనిషి సృజనశీలి కన్నాముందు బుద్ధిజీవి.   ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అస్తిత్వసిద్ధాంతం దీనికి బద్ధ వ్యతిరేకి.  ‘I exist.. therefore I think’ అంటుంది అస్తిత్వ వాదం. ఈ వాదం ప్రకారం మనిషి బుద్దిజీవికన్నా ముందుగా సృజనశీలి.  జెన్ తత్త్వం, మన  భారతీయుల భక్తి యోగాలకూ రసవాదంతోనే చుట్టరికం. హేతువు
కన్నాముందు  అనుభూతికే మనిషి ప్రాధాన్యత ఎందుకిస్తాడు?- ఇది అంతుబట్టని రహస్యం.  కానీ సృజన అంటే మాత్రం స్థూలంగా ఒక అభిప్రాయానికి రావచ్చు. శ్రీశ్రీ ‘దివ్యానుభూతి’ ఖండికలో మాదిరి కవితాత్మకంగా చెప్పాలంటే  అదొక
సంకుల పయోధర  చ్చటా పంకిల నిబి
డాంధకార నిర్జన వీధికాంతరముల
నా చరించెడు వేళ ప్రోన్మత్త రీతి,
అవశ మొనరించు దివ్యతేజోనుభూతి’.
లేని దాన్ని సృష్టించడం, ఉన్నదాన్ని మరో రూపంలో సృష్టించడం, చూసిన వాటిని చూడని వాటిల్లోకీ, చూడని చూడలేని వాటిని చూసిన వాటిల్లోకి తర్జుమా చేసి  తన్మయత్వం చెందటం, తోటివారినీ తన్మయపరచడానికి  ప్రయాస పడటం.. సృజనశీలత  కొన్ని  ప్రధాన  లక్షణాలు.
సరసియై చల్లనై నన్ను జలకమార్చె,
నందన నవ నీలతాంత కాంతస్రజమ్ము
గా నొక క్షణమ్ము నామెడ కౌగలించె’
అని మహాకవొచ్చి మొత్తుకున్నా సరే ‘ఎవరా ‘సరసి’ మహానుభావా?’ అని మాత్రమే వివరాలడుగబోతాడు శుద్ధ లౌకికుడు. లౌకికులకు ఒక పట్టాన అంతు పట్టని వింత చేష్టలింకా ఇలా చాలానే ఈ అలౌకిక ప్రాణుల్లో ఉంటుంటాయి మరి. నిశ్శబ్దం విసుగెత్తినప్పుడు  శబ్దాన్ని సృష్టించటం, శబ్దం ఎక్కువైనప్పుడు నిశ్శబ్దాన్ని ఆశ్రయించడం ఈ అలౌకిక లక్షణాలే. ఈ అలౌకిక మహాశయుడు శబ్దాలకేవో అర్థాలు కల్పించి కవిత్వమంటాడు. ఎక్కడా లేని ఓ ప్రత్యేక నాదాన్ని సొంతంగా సృష్టించుకుని  రాగాలాపనలోకి జారుకుంటాడు.  కొత్త లయలూ, భంగిమలూ, కదలికలూ కనిపెట్టి నృత్యం పేరుతో సొంత లోకంలో విహరిస్తుంటాడు. అనుకరణే కావచ్చు కానీ అనుసృజన అనిపించే చిత్రాలు, శిల్పాలు సృష్టించుకుని మురుస్తాడు. కవిదీ అదే వరస.’భావ మనియెడు నెత్తావి బలిసియున్న-మేలు రేకుల విప్పారు పూలు మేము’ అంటూ వాస్తవ జగత్తును అనుసరిస్తూనే   కొత్త కొత్త పదాలతో, వ్యక్తీకరణలతో  నూత్నప్రపంచమొకటి  సృష్టించుకుని అందులో  ఆనందాలను వెదుక్కుంటాడు. అనుకరణ కన్నా అనుసృజన మానుషకళలోని  చెప్పుకోదగ్గ గొప్ప ప్రజ్ఞావిశేషం.
అస్తిత్వ సిద్దాంతాన్ని పైపైన చూస్తే మాత్రం-  ప్రజ్ఞ, విజ్ఞానం అభాసాలంకారాల్లాగా ఎడపెడగా అనిపిస్తాయి కానీ అది నిజం కాదు.  మహా మేధావి ఆల్ బర్ట్ ఐన్ స్టీన్ వయోలిన్ బ్రహ్మాండంగా వాయిస్తాడు. ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త భాభా చిత్రకళ ప్రావీణ్యం అత్యద్భుతం. అమెరికా మాజీ అధ్యక్షుడు ఐసెన్ హోవర్బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి చర్చిల్ చక్కటి ప్రకృతి చిత్రకారులు. కళాభినివేశమంటూ మెలుకువతో ఉండాలే గానీ బుద్ధి ఏ రంగంలో పనిచేస్తున్నా  సృజనతృష్ణ( creative urge) మరో రూపంలో  బైటపడి తీరుతుంది. ‘సృజనశీలత ఆయాచిత వరంగా దక్కిన అదృష్టవంతులు..లౌకిక వృత్తిలో రాణిస్తూనే..ప్రవృత్తి పరంగా అలౌకిక  లోకాల్లో ఆత్మానందాన్ని వెదుక్కుంటో విహరిస్తుంటార’నేది మనోవైజ్ఞానిక శాస్త్రమే నిర్థారించిన సత్యం.
కవి ఒక కమనీయ కావ్యం, చిత్రకారుడు ఒక   అద్భుత చిత్రం, నర్తకీమణి ఒక  రమణీయ రూపకం, సంగీతవేత్త ఒక మహత్తరమైన రాగం, శిల్పి ఒక అనల్పమైన విగ్రహం..కల్పించటానికి అహోరాత్రాలు నిద్రాహారాలు కూడా మాని ఎందుకంతగా శ్రమిస్తాడంటారు?! ఎన్ని కష్టనష్టాలొచ్చి పడ్డా ఆ శ్రమ నుంచీ విముక్తి కోరుకోడెందుచేత?! ‘చల్లని వేళ సత్కవి విశాలమనంబునయందు బుట్టి సం/ ఫుల్లత నొందు హల్లకము పోల్కి నొకళ్ళ మొకళ్ళ మోలిమై/ నల్లన మేము విచ్చుచునుందుము’ అంటో  లోపల్నుంచీ ఉడుకులెత్తే సృజనశక్తి హోరెత్తిస్తుంటే ఆ వత్తిడినుంచీ ముక్తి పొందటానికిలా   ఏదో కళారూపంలో  భౌతికసృష్టి జరగాల్సిందే- కనక.
కొందరు ఎందుకంత సులభంగా  సృజనశీలులై పోగలరు? ఇంకొందరెందు కెంత తన్నుకులాడినా ఒక్క మంచి  కల్పనా చేసి వప్పించలేరు?! అనేదింకో  సందేహం. ప్రశ్నంత   సులభం కాదు సమాధానం. అనువంశికతో, మానసికతో, బాహ్య పరిసరాల అనుకూలతో, కార్యరూపం దాలిస్తే మరేమన్నాఇతరేతర ప్రేరేపక శక్తుల శబలతో..  ఇతమిత్థంగా ఇదీ అని నిర్థారించడం కుదరని ఇంకేవైనా  కారణాలో కావచ్చు – అనేది ప్రముఖ రసతత్త్వవేత్త  సంజీవ్ దేవ్ జీ మతం.  జన్మతః సృజనశీలత ఉండీ..పరిసరాల ప్రభావం వల్లా, ప్రతికూల పరిస్థితులవల్లా సంపూర్ణంగా వికసించని ప్రచ్చన్న కళాకారులు కొందరైతే..పుట్టుకతో పట్టుబడక పోయినా పట్టుదలవల్లా, అనుకూల పరిస్తితుల చలవ వల్లా శిక్షణ ద్వారా రాణించిన, రాణిస్తున్న కళాకారులు ఇంకొందరు మన సమాజంలో మన మధ్యనే  ఎప్పుడూ సంచరిస్తుంటారు’అనీ ఆయన వాదం. కాదనలేము కదా!
ఐతే సృజనకార్యంలో తలమునకలైన వాళ్ళంతా కళాకారులే ఐనా ..సహజప్రతిభకి.. బుకాయింపు కళకి మధ్య చాలా అంతరం ఉంటుంది. అసలు కళను ఆ ‘కళే’ పట్టిస్తుంది. సహజ స్రష్ట మదిలో సదా త్యాగయ్యలో మాదిరి  ఓ ఆనందజ్వాల ప్రజ్జ్వలిస్తుంటుంది.  వీరబ్రహ్మంగారి జీవితం లోలాగా బౌతిక పీడలు వాళ్ళ అంతఃచేతననెంత  మాత్రం  ప్రభావితం చేయ లేవు.  సందుఛూసుకుని మరీ  అన్నమాచార్యులవారి  అంతరంగ తపన లాగా ఇంకేదో  ఉత్కృష్ట రూపంలో విస్మయంగా  బైటికి తన్నుకొచ్చే తీరుతుంది..చెరసాల  పీడ  గోపన్నలోని రాగజ్వాలను మరింత ప్రజ్జ్వలింప చేసినట్లు.

కళాకృతులను అమితంగా ప్రేమించి ఆరాధించే కళాభిమానులు వాటి సృష్టికర్తలను  సైతం అంతే సమున్నతంగా ఊహించుకోడం సహజం. కానీ  నిజ జీవితాలను సొంత కళాసృష్టంత సమోన్నతంగా నిర్వహించుకోడం ఏ కళాకారుడికైనా ఏమంత తేలిక వ్యవహారం కాదు. తెనాలి రామలింగడు ఎద్దేవా చేసిన ‘కూరగాయల’ కళాకారులు అప్పుడూ ఉన్నారు.ఇప్పుడూ ఉన్నారు. ఎప్పుడూ ఉంటారు. నిజ,కళాజీవితాల  ప్రస్థానాలు సరాసరి వ్యతిరేక దిశల్లో ప్రయాణించిన నీరోలు, జౌరంగజేబులు మనకు చరిత్రలో ఉండనే ఉన్నారు. సృజనవేళే వీళ్ళు అపరబ్రహ్మలు. మిగతా వేళల  వట్టి పిండి బొమ్మలు. బ్రహ్మ రాక్షసులు. మామూలు వ్యక్తుల మాదిరే వ్యావహారిక జీవితంలో చిరుకోరికలకూ, చిట్టి పొట్టి తాపాలకూ, చిరాకులకూ, చిన్నాపెద్దా బలహీనతలకూ దాసులు.  రూకల  బొబ్బట్లు, సన్మానం దుప్పట్లు, అహం చలి కాచుకునేందుకు  వెచ్చవెచ్చని చప్పట్ల  కుంపట్లు.. వాటికోసం సిగ్గు విడిచి సిగపట్లు..! ఏటి వాలులోనే వీరి నావ వీర విన్యాసాలు. నిలువీత రాకపోతే ఎంత గజీతగాడి పోజు పెట్టినా…ఆటుపోటు లెదురైనాక   బోటు గల్లంతు..
ఆదరము తగ్గె దంభమాహాత్మ్యములకు
పక్షపాతపు రచనల పస నశించె
రసికులకు మీ చరిత్ర విసువు దోచె
పరువుగా నింతట బ్రబంధపురుషులార!
కదలిపొం డెటకైనను..మీకు
నేటి కావ్యప్రపంచాన చోటు లేదు’ అంటూ   కాలప్రవాహం దయాదాక్షిణ్యాలకే  అలాంటి మిడతంభొట్లగుంపు నొదిలేయడానికి మించిన మహత్తర కార్యం మరోటి లేదు.
అలాగని లోకమంతా  ఆషాఢభూతుల బంధువులతో నిండి ఉందన్న నిస్పృహా శుభం కాదు.    ఇంత వైవిధ్యవిలాసాలతో విలసిల్లుతున్న సృష్టి ఎన్ని లక్షల స్వచ్చమైన కళాకారుల సృజనపునాదుల మీద నిర్మాణమవుతుందో అర్థం చెసుకోవాలి. కామించిన సుందరి ‘చీ.. పొమ్మన్న్దం’దుకు గోపాలుడి నడ్డమేసుకుని జావళీలు సృష్టించిన క్షేత్రయ్యలు  ఈ కళాక్షేత్రంలో కొల్లలు. అన్నహారాలు మాని అన్నమిచ్చిన వాని పుణ్యాన్ని రోజుకోతీరులో  సంకీర్తించిన  పదపితామహులు
అన్నమయ్య సాహిత్యలక్ష్మిపాదాలకి అలంకరించిన మువ్వల  మాటేమిటి!  దుండగుల కెదురుగా  నోరు తెరవాలంటే కొండతో పొట్టేలు ఢీకొన్నట్లున్న గడ్డుకాలంలో సైతం సామాజిక దురాచారాలను ఆటవెలదుల నోటితో కడిగి పారేసిన ప్రజావేదాంతి వేమన పద్యాల సంగతో! చెప్పాలంటే చేటభారతమంత. ఆ మాటకొస్తే  భారతంలో మాదిరి కళాభారతంలో కూడా ఉత్తరకుమారులున్నట్లే..ఉదాత్త కర్ణులూ..ఏకలవ్యులూ ఉన్నారు.ఉంటారు. ఎవరి దారి ఆదర్శనీయమో అనుసరణీయమో నిర్ణయించుకొనే విజ్ఞత మాత్రం ఎవరిది వారిదే.
సహృదయంతో చూడాలే కాని..నిజ జీవితాలని  సొంత  కళాకృతులను మించిన నిబద్ధతతో నిర్వహించుకున్న స్రష్టలు.. మనకు కళాసాహిత్య రంగాలనిండా శతసహస్రాలు. అందరిలో అసామాన్యంగా వెలిగే సుగుణదీపం-  హేతువాదం వికాసం.  సృజనశక్తికి సాయంగా  సమీక్ష, సహనం, నిజాయితీ, నిబద్ధత సమాంతరంగా వెలిగే ఆ కళాజ్యోతుల జీవితాల్లో ఆలోచనల అనుభూతుల కలబోత  కొట్టొచ్చినట్లు కనిపించే మరో కిరణపుంజం.  ఉత్తమ కళాకారుడు ఉత్తమ మానవుడుగా కూడా సమాజానికి సదా ఆదర్శప్రాయుడై ఉండి తీరాలని చిత్తశుద్ధితో నమ్మి ఆచరించి చూపించిన కళావైతాళికుల అడుగుజాడల్లో నడవడానికి కవులుగా మనకెవరు అడ్డొస్తున్నట్లు!

నడవడకయ నడచివచ్చితి
నడచిన నే నడచిరాను నడచెడునటులన్
నడిపింప నడవనేరను
నడవడికలు చూచి నన్ను నడిపింపరయా!’
అని కదా సృజన  బులపరింపు!
పరిసర ప్రభావాలెంత ప్రతికూలంగా ఉన్నాస్వయంప్రతిభతో ఆ పిలుపునందుకుని ఎత్తుల కెదిగే ప్రయత్నం సొంతంగా  చేయడం,   సాటి సహోదరులకూ చేతనైనంత  చేయూతనిచ్చి పైకి చేదుకోవడమూట -మనలోని సృజనశీలత ఇంకా సజీవంగానే ఉన్నదని నిరూపించుకునే రుజువులు. కాదంటారా?

-కర్లపాలెం హనుమంతరావు

Saturday, February 13, 2016

మళ్ళీ 'దోడ తిత్తివా!' అని ఆ సారు అడిగితే వినాలనుంది!


ఈతిబాధలు ఎప్పుడు ఉండేవే! నీతిబోధలూ ఎప్పుడూ ఉండేవే!  ఈతిరీతిని  నిలదీసే పలుకులకు ములుకురాగాలు చెక్కి   అరుణ్ సాగర్ సారుకి మల్లే సంధించగల విలుకాడు మళ్లీ ఎన్నటికి దొరికేనో!
మేల్ కొలుపులో కోలుపోతను కలిపి.. భోరుమనే  జాలిఅక్షరాలెన్నింటినో  కుండపోతగా కురిసి.. గుండెల్ని ముంచెత్తెయ్యడం ఎంతమందికి తెలుసో తెలీదు! అరుణ్ సాగర్ సారుకి తెలుసన్న మాట మాత్రం తెలుసు. 
ఆ జడివానల్లో తడిసి ముద్దైన ఓ నాటి ఎన్నటికీ మరుపురాని  ఆ తీపిచేదు ముంపుఅనుభవాల సాక్షికంగా  అనుకుంటున్న మాటలివన్నీ.
ఒక్కసారా సార్! 
పచ్చదనమంతా ఆవిరయి.. మబ్బుదేవుడు విదిల్చే ఆ ఒక్కవాన చినుక్కోసం  ఒంటికాలి జపంచేసే.. మోడుముని మాదిరి.. ఎన్ని లక్షణ క్షణాలు తపించిపోయిందో   పిచ్చి మనసు!  
తప్పిపోయిన తల్లిని  ముక్కుపచ్చలారని బిడ్డ సంతలోపడి వెక్కివెక్కి ఏడుస్తూ వెదుక్కొన్నట్లు!
ఆ అరుణ సాగరంనుంచి ఆవిర్లై లేచి గాలిమబ్బు ముసుగులో సాగొచ్చి   బీడుదాహం తీర్చింది  వట్టి నీటిచుక్కే అయుంటే ఈ ఏడుపంతా ఇప్పుడెందుకు! 
శిశిరంలో పరిసరాలు  బరిబెత్తలు కావడం.. 
వసంతుడలా విలాసంగా వచ్చి యధావిధి  పచ్చడాలు  కప్పిపోయే ఇచ్చకాల  విధాయకాల కాలచట్రానికి చిక్కి ముక్కే చమత్కారాలో .. సత్కారాలో కాదు! గాడిదగుడ్డు కారాలు అంతకన్నా కానే   కాదింతా! 
నాలుగు మెతుకులు కతికిన ఎద సొద!

ఖాళీ కడుపుతో నకనకలాడుతూ వీధులవెంట వెర్రిగా తిరిగే రోజుల్లో  ఆ సారు  ఇంటి వసారా గుప్పెడు మెతుకులూ  పొట్ట నింపాయి. 
ఆ ఇంటికబళం ఒక్కమెతుకు వాసనకే ఓ పూటంతా  మిఠాయిదుకాణం సరుకు  వెగటనిపించేది! 
ఆ దొడ్డయ్య ఏం పెట్టి  వండుతాడో! తిన్నదంతా వంటికా పట్టింది! 
ఆత్మగుజ్జుకు అంటుకున్న ఆ మెతుకుల రుచయ్యా! మరుపుకెలా వస్తుంది.. ఊపిరిలో ఉత్సాహం చచ్చుబడిందాకా!
మాయదారి కాలం! 
ఉన్న కాసిన్ని మంచిమనసుల్ని ఇలా ఆత్మనాలికమీద గీకి  
'హుఫ్ .. కాకి!' అంటూ  ఇప్పుడు అర్థాంతరంగా దాచేయడం ఏమిటి! 
ఇదేం ఆట.. !
మళ్లీ మా అరుణ్ సాగర్ మాట వినాలనుంది! 
'దోడ తిత్తివా!' అంటూ ఆ సారు  మూలవాసుల యాసలో పలకరిస్తుంటే 
చెవులు రిక్కించి మరీ వినాలనుంది! 
కుదరదా! 
అయినా 
రెక్కీఅయినా నిర్వహించకుండా   
కర్కశంగా ఇలా రెక్కుచ్చుకుని మంచివాళ్ళనే లాక్కుపోవడమేమిటి
కాలమా! 
నీ సాడిజం మరోసారి రుజువయింది!
ఈ హేట్ యూ 
యాజ్ లాంగ్ యాజ్ ఐ లవ్ అవర్  అరుణ్ సాగర్ సార్!

***
(విలక్షణ కవి, ప్రజా పాత్రికేయుడు కామ్రేడ్ అరుణ్ సాగర్ 
హఠాన్మరణానికి  విలపిల్లుతూ)

Friday, February 12, 2016

అమ్మల పండుగ- ఈనాడు సంపాదకీయం

"ఈనాడు ఆదివారం సంపాదకీయాలకు సంబధించి నాకు తోచిన నాలుగు మాటలు.
ఈనాడు ఆదివారం సంపాదకీయం  ఒక రకంగా తెలుగు పాఠం. ఆదివారంనాటి  సంపాదకీయం  సాహిత్యవిశేషాలతో  పుష్టిగా ఉంటుంది.  సంపాదకీయం ఉటంకించే సంగతులు ప్రధానంగా పురావైభవానికి సంబదించినవి.  శిష్టగ్రాంధికం సజీవ ప్రదర్శనకు అక్షర  వేదిక ఆదివారం సంపాదకీయం.   ప్రాచీనసాహిత్యక్షీరం  మధించి తీసిన  వెన్నముద్దరుచి పదప్రయోగాలు.. మీగడతరకతీపి పెద్దలసూక్తులు బారులు తీరి అలరించే పద్యపాదాల.. పదాలకొలువు ఈనాడు సంపాదకీయం. భాషలో పొదుపు  ఈ రచనల ప్రత్యేకత. సాధారణ పాఠకుడికి  సాహిత్య పరిజ్ఞానం రేఖామాత్రంగానైనా అందించాలన్న ఆరాటం ప్రతి అక్షరంలోనూ ప్రత్యక్షమవుతుంటుంది. దైనందిక వార్తావేదిక అయినందువల్లనేమో సమకాలీన స్పృహనూ  సంపాదకీయం విస్మరించ జాలదు. ఆ వారం జరిగిన ఏదైనా విశేషాన్నో.. ఆదివారానికి అటూ ఇటుగా వచ్చే ప్రత్యేకదినోత్సవాన్నో.. ఏదీ లేదంటే విశ్వవ్యాప్తంగా విజ్ఞానశాస్త్రాల్లో వికసించే  నవ్యపరిశోదనల్లోనుంచి విత్యవ్యహారానికి సంబంధించి ఉత్సుకత పెంచే ఆంశాన్నో..  సూత్రంగా మలుచుకొని  అందంగా అల్లే మూడుమూరల పదకదంబం ఆదివారం సంపాదకీయం.  'భళా!' అనే రీతిలో సాగి సానుకూల ఆలోచనలతో స్వస్తివాక్యం పలికే  ఈ తరహా సంపాదకీయాలు నాకు తెలిసి తెలుగులో నాటికీ నేటికీ ఈనాడులోనే నిరంతరాయంగా వస్తున్నాయనిపిస్తుంది. సాధారణంగా వీలున్నంత వరకూ   ఈ సంపాదకీయభ్రమరం తెలుగురుచి కుసుమం చూట్టూతానే పరిభ్రమించడమూ అభినందనీయం.
చక్కని చిక్కని శిష్టతెలుగులో కృషిచేయాలని
కోరుకొనే సాహితీ ప్రేమికులకు ఈనాడు ప్రతీ ఆదివారంనాడు ప్రచురించే సంపాదకీయం ఓ నమ్మదగిన తోడు"
***


అమ్మల పండుగ- ఈనాడు సంపాదకీయం
కౌసల్య తన 'పేరేమిటో' చెప్పమంది. 'రా' అనే అక్షరం, 'డు' అనే అక్షరం పలకడం రాని చిన్నారి రాముడు  'లాములు' అంటాడు. 'నాన్నపేరేమిటి నాన్నా?' అని అడుగుతుందీ సారి. 'దాచాతమాలాలు ' అంటాడు బాలుడు ముద్దుగా. 'మరి నా పేరో?' రెట్టించిన ఉత్సాహంతో మరో ప్రశ్న.  అమ్మతోనే కానీ..ఆమె పేరుతో పనేంటి చంటి పిల్లలకి? 'అమ్మగాలు' అంటాడు.. పాపం..ఆ బాలరాముడు అత్యంత కష్టం మీద. 'కౌసల్య తండ్రీ' అని బిడ్డడ్ని సరిదిద్దబోయి అప్పటికే నాలుక
తిప్పటం రాని రాముని కళ్ళలోని చిప్పిల్లిన నీరు చూసి తల్లి గుండె చెరువైపోతుంది. 'కౌసల్యను కానులేరా నాన్నా!.. 'వట్టి అమ్మనేరా నా చిట్టి రామా !' అంటో అమాంతం  ఆ పసికందుని తల్లి గుండెలకు హత్తుకునే రమణీయ దృశ్యం విశ్వనాథ వారి 'రామాయణ కల్పవృక్షం'లోది. నవ మాసాలు మోసి రక్త మాంసాలను పంచి కన్న- పాప కనుపాప కన్న ఎక్కువ అనటం  'సుమధుర భావనామృత సుశోభిత మాతృ హృదంతమ్ము'ను  తక్కువ చేయడమే. సంత్ జ్ఞానానంద యోగి ప్రవచించినట్లు తాయి 'సంతతి సంతత యోగ దాయి.' 'చల్లగ కావుమంచు మనసార పదింబది దైవ సన్నిధిన్ మ్రొక్కు' మాత  వాత్సల్యాన్ని ప్రసిద్ద ఆంగ్ల రచయిత రాబర్ట్ బ్రాల్ట్  మాటల్లో చెప్పాలంటే 'తల్లి నివేదనకన్నా ముందుగా బిడ్డ కామన  చేరగలిగే ప్రార్థనాస్థలి సృష్టి మొత్తం గాలించినా ఎక్కడా దొరకదు'. గణాధిపత్యం కోసం శివపుత్రులిద్దరి మధ్య స్పర్థ ఏర్పడింది. మయూరవాహనుడికి సర్వ తీర్థాలలో తనకన్న ముందుగా  అన్నగారే మూషికారూఢుడై సందర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తల్లి కామన వల్లే సిద్ధివినాయకుడికా విజయం సిద్ధించిందన్న ధర్మసూత్రం

  వల్లీనాథుడుడికి అప్పుడు కాని బోధపడలేదు.   వానలో వస్తే తడిసినందుకు నాన్న తిడతాడు. అదే అమ్మైతే? 'ఈ పాడు వాన నా బిడ్డ ఇంటికి వచ్చిందాకా ఆగకూడదా!' అంటో వాననే శాపనార్థాలు పెడుతో బిడ్డ తలతుడుస్తుందిట. అమ్మంటే అది. హిందువులు  సంధ్యావందనంలో 'తల్లిలా కాపాడమని' జలదేవతను ప్రార్థించేది అందుకే.



ఏడాదికి పన్నెండు మాసాల పర్యంతం వారంలో ఒక్క రోజైనా విశ్రాంతి లేకుండా ఇరవై నాలుగ్గంటలూ  అనుక్షణం బిడ్డమీద వాత్సల్యం
కురిపించినా తృప్తి చెందనిది సృష్టిలో అమ్మ ఒక్కతే. 'తండ్రిం జూడము తల్లి జూడము యశోదాదేవియున్ నీవు మా/తండ్రిం దల్లియు నంచు నుండుదుము..యింతటివారమైతిమి గదా తత్త ద్వయోలీలలన్' అంటో రెండు చేతులూ జోడిస్తాడు ముకుందుడంతటి వాడు నందుని సందర్శనార్థమై రేపల్లె వచ్చిన  సందర్భంలో భాగవతంలో. ఈశుడు ఓంప్రథమంగా సృష్టించిన  ఈశానాం(లక్ష్మీ దేవి) ఈశిత్రి( జగత్తు)ని అమ్మలా పాలిస్తుందని పరాశరబట్టర్ ద్వయమంత్ర శ్లోక సారంశం. అమ్మతో కూడున్నవేళ ఆ భగవానుడు  చేసే జగత్పాలనా విలక్షణంగా ఉంటుందని ఆళ్వారుల నమ్మకం. 'జగన్నాథుడిని అలా తీర్చిదిద్దే యుక్తి అమ్మదే. 'నాయన  గొప్ప సంపద అమ్మే' అని కదా  శ్రీస్తవ స్తోత్రం! సర్వ భూతాలలో ద్యోతకమయ్యే దివ్యశక్తిని మాతృరూపిగానే సంభావిస్తుంది దుర్గా సప్తశతి. 'తల్లుల చల్లని ప్రేమలు,/పిల్లల మాటలు, నగవులు, ప్రియమగు పాటల్/ ఫుల్ల ధవళ కుసుమ సరము/లల్లా తెల్లని మనసున కతి ముదము నిడున్' అని అల్లా చల్లని దయమీదో చక్కని  అష్టకం ఉంది. అకాళికమూ, అసాయి, అనల్లా, అనేసు అనేవి ప్రేమలోకంలో చెల్లవు. దుర్గా, ఫాతిమా, మేరీ, బుద్ధుని మేనత్త  గోతమి, బహాయీల తాయి  తాహిరి, మహావీరుని తల్లి  త్రిషాల.. మాతృ ప్రేమకు కులమతాలని దేశకాలాలని ఎల్లలేముంటాయిగ్రీకులకు వార్షిక వసంతోత్సవాలలో దేవతల తల్లిని ఆరాధించడం ఆనవాయితీ. ప్రాచీన రోమన్లు హీఠారియా పేరిట దేవతామూర్తి సిబెల్‌ను మాతృపీఠం ఎక్కించారు. యేసు తల్లి గౌరవార్థం ప్రాచీన క్రైస్తవులు మాతృదినోత్సవం జరుపుకునే వారు. ఇంగ్లాండ్‌లో తల్లులందరికీ  'మదరింగ్ డే' పేరిట ఆటవిడుపు. మే రెండో ఆదివారాన్ని అమెరికా దేశమూ 'తల్లుల దినోత్సవం'గా ఆమోదించి వచ్చే ఏటికి శతాబ్దం. ప్రపంచీకరణ ప్రభావం..ఇవాళ్టి రోజును  మరెన్నోదేశాలూ తల్లికి నివాళులిచ్చే  ఓ సంబరంగా జరుపుకుంటున్నాయి. ప్రేమాభిమానాలు భారతీయులకేం తక్కువ? మాతృదినోత్సవం ప్రస్తుతం మనకూ ఓ ముఖ్యమైన పండుగ అవడం అబ్బురం కాదు.



కాలం సనాతనమైనా.. అధునాతనమైనా అమ్మ పాత్రలో మాత్రం మారని అదే సౌజన్యం. బిడ్డ కోరితే గుండైనా కోసిచ్చే త్యాగ గుణం. కోటి తప్పిదాలనైనా చిరునవ్వుతో క్షమించేయగల సహనం. గుళ్లోని దేవుణ్నిఅడిగాడు ఓ సత్యాన్వేషి  'అమ్మ' అంటే  ఏమిటని? 'తెలిస్తే ఆమె కడుపునే పుట్టనా!'అని దేవుడి  ఉత్తరం. భిక్షమడిగే బికారి నడిగాడీసారి. 'బొచ్చెలోని పచ్చడి మెతుకుల'ని సమాధానం. మానవులతో పని కాదని చివరికి  పిల్లిపిల్లను చేరి అడిగితే.. కసిగా కరవబోయిందా పిల్లతల్లి. నడిచే దారిలో  ఓ రాయి తాకి తూలి పడినప్పుడు కాని తెలిసి రాలేదా సత్యాన్వేషికి  తన పెదాల మీదే  సదా 'అమ్మా!'లా   దాగుండేదే అమ్మేనని. విలువ తెలియని వారికి అమ్మ అంటే 'ఇంతేనా'. తెలుసుకున్న వారికి 'అమ్మో..ఇంతనా!' 'ఆపదవచ్చినవేళ నారడి బడినవేళ/పాపపు వేళల భయపడిన వేళ/వోపినంత హరినామమొక్కటే గతి..' అనే అన్నమాచార్యులవారి సంకీర్తన హరినామానికి అమ్మపదమొక్కటే ఇలలో సరి. అడ్దాలనాటి బిడ్డలకి గడ్డాలు మొలుచుకొచ్చి ఆలి బెల్లం..తల్లి అల్లమతున్న రోజులివి. కాలమెంతైనా మారనీ..పెరటి తులసి వంటి అమ్మలో మాత్రం మార్పు లేదు. రాబోదు. అందుకేనా చులకనా?బిడ్డను చెట్టులా సాకేది తల్లి. ఆ తల్లికే చివరిదశన కాస్తింత చెట్టునీడ కరవవుతున్నది.పేగు పంచి ఇచ్చిన ఆ తల్లికి  'జీవించే హక్కు' ఇప్పుడు ప్రశ్నార్థకం! తల్లి కన్నీటికి కారణమైనాక బిడ్డ ఎన్నిఘనకార్యాలు ఉద్ధరించినా సార్థకమేది? కన్నీటి తడితో కూడా బిడ్డ మేలును మాత్రమే కోరేది సృష్తి మొత్తంలో తల్లి ఒక్కతే. 'అమ్మకై పూదండ/లల్లుకుని వచ్చాను/అందులో సగభాగ/మాశ పెడుతున్నాను/ మా యమ్మ మాకిత్తువా దైవమా!/మాలలన్నియు నిత్తురా!' అని మాతృవిహీనుడైన  ఓ కవిగారి మొత్తుకోలు. అమ్మ పాదాలు దివ్య శోభాకరాలు, పరమ కృపాస్పదాలు, సకల భయాపహాలు.. అమ్మ పాదాలు కొండంత అండ! స్తోత్రాలు సరే. 'అమ్మపండుగ' ఏడాదికి ఒక్కనాడే. నిండు మనసుతో బిడ్డ ఆదరించిన ప్రతిక్షణమూ అమ్మకు  నిజమైన పండుగ. ఈ 'అమ్మల పండుగ' నుండైనా చాలు..  అమ్మ మేలుకు బిడ్డలు పునరంకితమవుతే.. అదే పదివేలు.
***
(ఈనాడు దినపత్రిక సౌజన్యంతో- కృతజ్ఞలతో)

Saturday, February 6, 2016

పాడు రాజకీయాలు- సరదా గల్పిక


ఆహారభద్రత సోనియాజీ మానస పుత్రిక. చట్టసభలో దాని గతి ఏమవుతుందోనన్న దుగ్ధతోనే  ఆతల్లి ఆరోగ్యంపాడయిందని అప్పట్లో  వార్త. రాజకీయ నేతలను వూరికే ఆడిపోసుకుంటాంగానీ రాజకీయాలంటే ఆట కాదు. ప్రాణాలతో చెలగాటం.

లక్షలకోట్ల  అక్రమార్జన కేసులో ఏడాదికిపైగా
  జైల్లో మగ్గాడు.. పాపం! పాడు రాజకీయాల జోలికి వెళ్ళకుండా వుంటే ఇంచక్కా లోటస్ పాండు ప్యాలెస్ లో కాలుమీద కాలేసుకుని  చెలాయించాల్సిన దొరబాబు కాదూ జగన్ బాబు!  ఇంటికూటిక్కూడా కొర్ట్లెంటబడి దేబిరించాల్సిన దుస్థితి. బెయిలైనా రాకుండా బెడిసికొట్టడానికి పీడాకారం పాలిటిక్సే కారణం. బ్యాడ్ పాలిటిక్స్! బెయిలుమీద వచ్చి బైట చెడతిరుగున్నా.. ఏ నిమిషంలో ఈ. డీ .. సి బి ఐ మళ్లా పిల్చి చేతులకు బేడీలేస్తారోనన్న దిగులు  ఆ మొగంలో దాచుకోడం ఎంత దయనీయమైన దుస్థితి!

పనికిమాలిన  రాజకీయాల్లోకి రాకుండా వుండుంటే ఈ పాటికి ఎంచక్కా ఏ ప్రపంచబ్యాంకు చీఫుగానో పదవీ విరమణ చేసుండాల్సిన పెద్దమనిషి చంద్రబాబు. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన పాపానికి పదేళ్ళుగా పడరాని పాట్లు పడ్డాడు! ఎప్పుడు చూసినా ఏవో యాత్రలు..జాతర్లు. పుళ్ళుపడ్డ కాళ్ళకు చెప్పులైనా లేకుండా పాపం గట్టిరోడ్డుమీద గట్టిగా నాలుగడుకుగులైనా పడని పరిస్థితి. దేశాన్ని నడిపించాల్సిన దీర్ఘదర్శి స్వయంగా నడవలేని స్థితి పాడురాజకీయాల జోళ్ళల్లో కాళ్ళు పెట్టడం వల్ల కాదూ! ఇంత చేసీ చీలికలైపోయిన పదమూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అయిన తరువాతైనా సుఖపడుతున్నాడా! సుఖంగా నిద్రపోతున్నాడా!

ఓ పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రైనా    'కర్రీ-పాయింట్' పెట్టుకోమని ఎద్దేవా
చేసేవాళ్ళు! 'సభాపతిగా పదిమందిచేత 'శభాష'నిపించుకున్నానన్నతృప్తి రెండ్రోజులైనా మిగ లేదు.  పైన అక్కడ అధిష్టానానికీ గులాం.. కిందిక్కడ అడ్డమైనవాళ్ళకీ సలాం! క్రికెట్టాటను నమ్ముకున్నా ఈ పాటికి  ఏ పెద్ద స్టారుహోదాలోనో వెలుగుతుండాల్సింది మన కిరణ్    సారు. క్షణభంగురమైన రాజకీయాలనిలా నమ్ముకున్నందువల్లే కదా ఇన్నేసి భంగపాట్లు కుమార్ సారుకి!

తోటి ఆడపిల్లలు హాయిగా కాపురాలు చేసుకుంటుంటే.. షర్మిలమ్మకే పాపం యాత్రలెంట యాత్రల తిప్పట. పుట్టింటివాళ్ళు పుట్టెడు రాజకీయ దుఃఖంలో కొట్టుమిట్టాడుతుండబట్టి కాదూ అన్న విడిచిన బాణంలా అన్నేసి ఊళ్ళ సంచారం లేతవయసులో ఆ పిల్లకు! పగవాడిక్కూడా రావాలని కోరుకోరానిది బాబూ పాలిటిక్సు కుటుంబంలో ఆడపిల్ల పుట్టుక!

అన్నెం పున్నెం ఎరక్కపోయినా అటు కట్టుకున్న మనిషి .. ఇటు కన్నపేగు
పాలిటిక్సుని పట్టుకుని వేళ్ళాడబట్టేగా.. బైబిల్ చేతబట్టి కన్నీళ్ళు పెట్టుకుంటో దీక్షలు చేపట్టాల్సొ చ్చింది విజయలక్ష్మమ్మతల్లికి పెద్దవయసులో! ఐనా రాజకీయాలింకా లాభసాటి బేరమేనంటే.. ఇహ  చెప్పేందుకేముంది.. చెప్పుతో చెంపలు పగిలేట్లు కొట్టుకోడం తప్పించి!

తప్పు చేసిన వాణ్ని తన్ని ఊరుబౖటికి తరిమేసే శిక్ష అమల్లో ఉండేది ఒకానొకప్పుడు. నిండా పబ్లిక్కుని ముంచిన గూండాభాయీలుకూడా గుండీలిప్పుకుని మరీ నడిబజారులో ఊరేగే రోజుల్లో.. పాడు పాలిటిక్సులో దూరి పులిమీద స్వారీ ఏ శనిముహూర్తంలో 'తూచ్' మని తుమ్మి ఆరంభించాడో కానీ కె సి ఆర్ సార్.. సెల్ఫ్ఎగ్జైల్ మోడల్లో ఏడాదిలో సగం  ఫాం-హౌసులోనే మంత్రాంగం. వయసు ముదరక ముందే వానప్రస్థమంటే.. మరి సన్నాసి  రాజకీయాల పుణ్యఫలమా కాదా? సరే.. ఇప్పుడు కొత్తగా తెలంగాణా అంటూ రాష్ట్రం  చేతికొచ్చినాక జనంలో కాక ఉన్నంతా కాలం రాజ్య  చెల్లుతుందనుకో! అయినా.. ఆ నడినెత్తిమీద ఎల్లకాలం ఓ పిడిబాకు వేలాడుతూనే ఉంటుంది కదా.. పాడు పాలిటిక్సు మూలకంగా ఎవర్ని ఎప్పుడు ఎంతమేర నమ్మాలో కొలుచుకుంటూ కూర్చోవాల్సిందేగదా కుర్చీమీద మమకారం పోనంతకాలం!  

డాలర్లు డ్రాచేస్తూ డాబుగా తిరిగేటి  తారకబాబుకు ఎవరు నూరిపోసారోగాని
పాపం.. రొచ్చుగుంట రాజకీయాలలోకొచ్చి పడ్డాడు చివరికి! యునైటెడ్ స్టేటులో ఎస్టేటులు కొని సెటిలయ్యే సుఖమెక్కాడా ? సెటిల్మెంటారోపణల్ని ఖండించుకుంటూ దినాం స్టేట్ మెంటులిచ్చుకోవాల్సిన దుఃఖమెక్కడా? చాయిస్సులో చెత్త రాజకీయాలకు టిక్కు పెట్టబట్టేగా ఇన్ని ఇక్కట్లు వచ్చి పడేది!

సభల రభస ఇహ చెప్పనలవి కాని అడవిగోస. ఆ కంఠసోషకు అంతే
ఉండదు. ఎప్పుడే మూలనుంచి చెప్పులొచ్చి పడతాయో తెలీదు. చప్పున వగదిగించుకు దిగిపోదామంటే  పక్కమనిషి ఎక్కడెక్కుతాడోనని అదో దిగులు. ముక్కూమొగం తెలీని వాడితో కలిసి దిగే ఫొటోలతో ఎప్పుడే చిక్కో.. అదో మిస్టరీ. ఖర్మ.. అడ్డమైనవాడి చేతులు గాట్టిగా  పట్టుకుని గాల్లోకి వూపుతూనే ఉండాలి. వూపి వూపి వేళ్ళు వాచిపోతే రెండు ముద్దలు కడుపునిండా తింటానికైనా ఉండదుఎవరెవరితోనో కావలింపులు. నెత్తిమీదకి కొమ్ముల తలపాగాలు. భుజంమీదకి నల్లమేకలు. తప్పనిసరి ఈ  తలనొప్పంతా రాజకీయాల వల్లొచ్చిన తిప్పలవల్లేనంటే కాదంటావా? అనగలవా!

వచ్చినా రాకపోయినా  పిచ్చిచిందులు. ఇంట్లో బిడ్డనుకూడా మనసారా ఎత్తుకునాడించేందుకు పెళ్లంటూ ముందొకటి ముగించుకోవాలి కదా! దానికి సమయం దొరకదు కానీ.. ఎవరెవరో కన్నబిడ్డల్ని గారాబం చేసేందుకు సమయం దొరకబుచ్చుకోవాలి. కారే ముక్కూమూతుల్ని ఆప్యాయంగా తుడవాలి. ఈ రోతంతా రోజంతా నటించే దౌర్భాగ్యం కేవలం రాజకీయాలని ఓ కెరీరు కింద తీసుకోక తప్పని కుటుంబంలో పుట్టిన ఖర్మాన కదా పాపం రాహుల్ బాబుకి!

చిత్రాల్లో చేస్తే  చచ్చే పేరొచ్చే నటనంతా చచ్చినట్లు చేసినా చివరికి మిగిలేది
  'చీ' 'చా' అనే చీదరలే రాజకీయాల్లో! మెగాస్టారు  చిరంజీవిని ఆడిగి చూడు ..ఈ రాజకీయజీవితం అంటే ఎంత వెగటో తెలుస్తుంది!

ప్రైవేట్ లైఫంతా పబ్లిక్కేనాయ. చట్టసభలో కాస్తంత  కంటిరెప్ప కిందకి వాలితే .. కుంభకర్ణుడుతో పోలిక! సరదా పడి వీడియో చూసినా దసరాబుల్లోడు తొడుగులు. పండగనాడైనా నిండాసంతోషంతో పేకాటా, పందేలని పబ్లిగ్గా కనపడేందుకు లేదు. పడగ్గదిక్కూడా ఎవడో కెమేరా అమర్చిపెట్టుంటాడని డౌటు. వంటినొప్పులకని  కంటికి నదురైన పాపచేత కాస్త కాపడం పెట్టించుకున్నా..   ఇహ చూడు.. నిన్నా పరమేశ్వరుడైనా  కాపాడలేడు. కోరి తెచ్చుకునే కొరివి కాదని ఎవరనగలరీ రాజకీయాలని!
కడుపు కాలుతున్నా దీక్షలు చేపట్టాలి. దిష్టిబొమ్మలవతారాల్లో లక్షలసార్లు  తగలబడాలి. ఇహ సిబిఐ మొగుడు.. ఉండనే ఉన్నాడు. మీడియా ఎప్పుడే కూర వండుతుందో తెలీదు. నానాయాగీ చేస్తే నాలుగు డబ్బులు కూడినా.. లెక్కలు అడిగే యముళ్ళే దిక్కునుంచొచ్చి పడునో.. యూ నో.. చెప్పడం కాదు.. ఆ ముదనష్టం లెక్కలు  ఎక్కడా దొరక్కుండా నచ్చచెప్పడంలోనే ఉంది అసలు కష్టమంతా! ఇంత గడించినా  గదిలోపల గడియేసుకుని  చూసుకుని మురుసుకోవాల్సిందే గాని  అనుభవించే యోగం నుదుట రాసున్న నేత ఎక్కడున్నాడురా ఈ కాలంలో! పైవాడి హుండీలో అజ్ఞాత దాతగా  తోయడానికి, కిందివాడి చేతిలో ఎన్నికలవేళ పోయడానికే ఇన్నేసి కోట్లు.. ఆ ముదనష్టాన్ని సంపాదించడానికి  పడరాని పాట్లు. ఏ కాస్త బుర్రా బుద్ధి వున్నా  ఈ బురదగంటలోకి చూస్తూ చూస్తూ ఎవరూ కాలెయ్యరు."
"ఇదంతా ఇప్పుడు నాకెందుకన్నా చెబుతున్నావూ?!"
"రేపొచ్చే ఎన్నికల్లో మన నియోజకవర్గాన్నుంచి పోటీ చేసే ఆలోచన నువ్విప్పుడైనా మానుకుంటావని! కాలరు మాయని పనులు సవాలక్ష రకాలున్నాయిరా నీకు.  ఈ మాయదారి రాజకీయాలు దేనిగ్గానీ నీకు..  దేనికీ పనికి రాక బేవార్సుగా తిరిగే మా పెద్దబ్బాయున్నాడు..  చూడు.. వాణ్ని నిలబెడదామా  ఈ సారికి"
-కర్లపాలెం హనుమంతరావు


***

Thursday, February 4, 2016

చేలాంచలము- చిన్నకథ- కౌముది మరీ చి.క కాలమ్ ప్రచురితం


అనగనగా ఓ అబ్బాయి. ఓ రోజున అతనికి ఓ అందమైన కల వచ్చింది.అందులోని సుందరాంగి చేతులుచాచి మరీ తనలోకి చేరమని ప్రాథేయపడింది.
'అప్పుడేనా! నాకింకా నిండా పదహారేళ్లైనా నిండలేదు. ఇది తరుణంకాదుఅని తిరస్కరించాడు అబ్బాయి.
అబ్బాయికి యవ్వనం వచ్చింది. ఓ రోజు కలలో మళ్లీ మునపటి స్వప్నసుందరే  ప్రత్యక్షమయి 'తరుణం వచ్చింది కదా! తరిద్దాము రారాదా!' అని సిగ్గువిడిచి మరీ బ్రతిమాలింది.
'వయస్సు వస్తే సరిపోతుందా! నా స్వంతకాళ్లమీద నేను నిలబడవద్దా! అప్పుడూ ఈ తరించడాలు.. తడిసిపోవడాలు!' అని అప్పటికి తప్పుకొన్నాడు అబ్బాయి.
అబ్బాయి సంపాదన పరుడైన వెంటనే మళ్లా కల్లో కనిపించి కాళ్ళావేళ్లాబడినంత పని చేసింది స్వప్నసుందరి.
'పిల్లా పీచూ సంగతి చూడాలి ముందు. ఆ తరువాతే ఈ గెంతులూ.. చిందులూ!' అని సుందరిని కర్కశంగా పక్కకు తోసాసాడు ఈసారి కూడా ఆ అబ్బాయి.
అబ్బాయిగారి చివరికూతురు పెళ్ళిచేసుకొని అత్తారింటికి తరలిపోయింది.
'ఇప్పుడైనా కనికరిస్తావా మహానుభావా!' అని అడిగింది స్వప్నసుందరి పట్టువదలకుండా మళ్లా కల్లోకొచ్చి.
'పట్టినంత కాలం ఓపిక పట్టావు. మనుమలు.. మనుమరాళ్లు పుట్టుకొచ్చే సమయం. వాళ్లతోకూడా కాస్త ముద్దూ ముచ్చట్లు తీర్చుకోనీయవోయి  సుందరీ!' అంటూ వచ్చినదారే చూపించాడు ఆ సుందరికి  బడుద్దాయి అబ్బాయి.
మనమలు.. మనమరాళ్లతో ముద్దుముచ్చట్లు ముగిసిపోయాయి. చేసే ఉద్యోగానికి విరమణ అయిపోయింది. కాలసినంత తీరిక. బోలెడంత సమయం. కూర్చొని కూర్చొని విసుగొచ్చిన అబ్బాయిగారికి అప్పుడు గుర్తుకొచ్చింది స్వప్నసుందరి.
కానీ.. స్వప్నసుందరిజాడే ఇప్పుడు  కానరావడం లేదు!
స్వప్నసుందరి దర్శనం కలగాలంటే ముందు నిద్రాసౌభ్యాగ్యం అబ్బాలి. బిపి.. షుగరు.. కాళ్లతీపులు.. అజీర్తి.. అతిమూత్రవ్యాధి.. మతిమరుపు రోగం.. నరాల బలహీనత! ఇన్ని ఇబ్బందులున్నవాడికి నిద్ర పట్టేది ఎలా! స్వప్నసుందరి సందర్శనం ఇహ తీరని కలా! అయినా.. అంతలా నరాల బలహీనతలున్న అబ్బాయిగారు  కలలరాణితో కలసి చేసేదిమాత్రం ఏముంది?
స్వప్నసుందరి మరే అబ్బాయి కలలోనో బిజీగా ఉండి ఉంటుంది.
ఆ పిల్లగాడన్నా తాను చేసిన పొరపాటు చేయకూడదని గొణుక్కున్నాడు    మగతనిద్రలోనే అబ్బాయిగారు!

***
-కర్లపాలెం హనుమంతరావు 
(కౌముది- ఫిబ్రవరి 2016- మరీ చి.క కాలమ్ లో ప్రచురితం)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...