Friday, October 13, 2017

వానా వానా వొద్దప్పా- సరదా గల్పిక- సుత్తి మెత్తంగా- ఆంధ్రప్రభ కాలమ్

వర్షాలు దంచి కొడుతున్నాయ్! ఓ రకంగా ఓ.కే నే గానీ తడి బట్టలో పట్టాన ఆరవు. వడియాలెంతకీ  ఎండి చావవు. ఒన్ డే క్రికెట్లు ఓ పట్టాన ‘ఎన్డ్’ అవనే అవవు.
వానాకాలం చదువులని వూరకే వాక్కుంటాం గానీ.. ఈ ఈ-కాలం చదువులకి ఈ ఈడ్చి కొట్టే గాలివానలు  చేసే కీడేముందసలు? జరిగే చెరుపంతా  యజ్ఞాలకి, యాగాలకి, రాజకీయ పార్టీల బహిరంగ సభలకి.   
అతి సర్వత్ర వర్జయేత్! నిజమే కానీ.. ఆ రాజనీతి  అమిత్ షాకి మల్లే  వరుణ దేవుడికీ  వక పట్టాన గుర్తుకు రాదల్లే ఉంది! ఉగ్రవాదుల దాడులన్నా ముందే పసి గట్టుడవుతుందేమో గానీ.ఉన్నట్లుండి ఆకాశం నుండి నట్లూడి పడినట్లు ఫెటిల్లు.. ఫెటిల్లు మంటూ విరుచుకు  పడే పెద్దోళ్ల  ప్రెస్ మీట్ల మాదిరి బాబూ  ఈ ఉరుములు, మెరుపులు! ఈ ఫెళఫెళారావాల ఆర్భాటాలను ఏ అర్భక జీవులు తట్టుకోగలవు?
ప్రాణం పోకడ్ని ముందస్తుగా పసిగట్టే పరిజ్ఞానం మంచిగా అభివృద్ధయింది. మంచిదే గానబ్బీ..  వాన రాకడ్ని కూడా  ముందే వాసన పట్టే వైనమూ   తెలిసుండాలి కదా! ఇష్టం లేని నియోజక వర్గాల పర్యటనలకని పై నుంచి ఆదేశాకు వస్తుంటాయెప్పుడూ!  ఏ వానపూటో చూసి ఆ ప్రయాణం పెట్టేసుకొంటే.. ఆనకో ‘సారీ’ తో   నిర్భయంగా వాయిదా వేసుకొని  మిగతా సొంత పన్లన్నీ నిశ్చింతగా చక్కబెట్టేసుకోవచ్చు!  
పిడుగు లెక్కడ ఎప్పుడు  పడతాయో ఆ చప్పుళ్లవీ   ముందస్తుగా కనిపెట్టడంలో లేదప్పా   గొప్పతనమంతా! ఎవరు  ఎందుకు  ఎప్పుడూ అట్లా పిడుగుకుట్రలు   పన్నుతున్నారో  పసి గట్టగలిగే సోయి కావాలి ముందు. గాలి వాలును ఎడ్వాన్సుగా వాసన పట్టే మోతగాడేనయ్యా  ఏ ఎదురుగాలి జడివానకైనా ఎదురొడ్డి గొడుగు పట్టి నిలబడగలిగే మొనగాడూ!  
మోదీజీ విదేశీ పర్యటనల్ని మించి, మన ముఖ్యమంత్రుల వరాల జల్లుల్ని మించి  దంచి కొడుతున్నాయిప్పుడు రెండు రాష్ట్రాల్లో పాడు  జడివానలు!  ఈ అర్థాంతర వర్షాల అంతరార్థమేంటో ముందుగా కనిపెట్టాలి. చంద్రబాబు వీడియో  కాన్ఫరెన్సులన్నా వీకెండ్లలో కాస్తంత  వీకవుతున్నాయేమో కానీ.. ఈ విడ్డూరపు వానలకు మాత్రం ఓ శనివారం లేదు.. ఆదివారం లేదు! శనిలా పట్టుకొని సతాయిస్తున్నాయి ప్రతిపక్షాలోళ్ల పిచ్చారోపణల్లాగా!
వాన దేవుడి కింత హఠాత్తుగా ఓవర్ టైమ్మీదెందుకు  గాలి  మళ్లిందో.. ఆ దేవుడికే తెలియాలి! ఎన్నికల జాతర   అయిందనిపించాక  మళ్లీ  మొహాలే  చూపించని ప్రజాప్రతినిధుల తంతే కదా వానదేవుడి తంతు  కూడా! మధ్యంతరం ముప్పు ముంచుకొస్తుందని ఉప్పందిన నేతల మాదిరి ఇప్పుడీ  వానదేవుడిగారి జడివాన దడదడలేవిఁటీ?  ఈ అకాల వరుణ కృపా కారుణ్యాల వెనకాల ఎవరి కక్షా కార్పణ్యాలు దాగున్నాయో!  ఎక్కడో తంతా ఉందే!
నగరంలో తొందర్లో అంతర్జాతీయ స్థాయి  వ్యాపార సమ్మిటేదో జరగబోతుట.. టాకు! ట్రంప్ మురిపాల కూతురు ఇవాంకా ముందుగానీ మన కంపు బైట పెట్టాలన్న కుట్రయితే కాదు కదా!
జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు పెట్టుకొన్నాడొక వంక. జనసేనాని పవన్ కళ్యాణూ పర్యాటనలకని బైల్దేరుతున్నాడింకో వంక. తెదేపా శ్రేణులు తెల్లారగట్టనుంచే కంటబడ్డ ప్రతీ కొంప తలుపు తడుతున్నారు! గిట్టని శక్తులేవఁన్నా కుట్రలూ కుతంత్రాలకు పాల్పడ్డం లేదు కదా కుండపోతల వంకన?
మన నగరాలెప్పుడూ సీమ దొరలకు ‘చీఁ’ అనిపిస్తాయంట! అమెరికా  వాళ్లకంటే ఆ మెరక మీద  హావాయి  దీవులవీ ఇవీ ఉన్నాయని మహా బడాయి!  తెలుగువాడి పరువు నిలువునా  పడిపోతుందన్న సింపతీ ఏమో పాపం..  వరుణ దేవుడుగారు  ఒకింత ఓవర్ కరుణా కటాక్షాలతో  ఏడాదికి సరిపడా నీటి వనర్లను ఒక్క వారం లోపే దిమ్మరించేస్తున్నాడు నగరం నెత్తి మీదిట్లా కుంభవృష్టిలా! అలా గరంగరమయి పోతే ఎట్లా! ఇప్పుడు కాస్కోండి! భాగ్యనగరం మొత్తం హుస్సేన్ సాగరం. షేక్ పేట టు అమీర్ పేట..  ఏ పేటకు టూరేసినా  టోటల్గా  గండిపేట చెరువే! అమెరికాకున్నది  ఆ ఒక్క బోడి  హవాయి దీవే. అదే మరి మన దగ్గరో! బోటు షికార్లు కొట్టే సర్దాలుండాలే గానీ బోర్బండా టు గోల్కొండా తక్ అన్నీ దాల్ సరస్సులే దాదా! బళ్లు ఓడలవడమంటే ఏంటో హైడ్రాబేడుకే వచ్చి చూడాలింక మరి! ఏ వాడ కెళ్లినా లైవ్ లో ఫ్లోరిడా ఇర్మాను మించి.. ఫుల్ ఎంజాయ్  మెంటు గ్యారంటీనయ్యా దొరబాబులూ!
సంబడమే కానీ.. తెరిపి లేకుండా కురిసే ఈ పాడు వర్షాలు రాబోయే ఏ సంక్షోభానికో సంకేతాలయితే కాదు గదా? తెర చాటుగా ఏమన్నా కుక్కలకీ నక్కలకీ మధ్య పొత్తుల కుదుర్తున్నాయో ఏమో కొంపదీసి? ఖర్మ కాలి కప్పల కాళ్ళు కర్ర ముక్కలుక్కట్టేసి ఊళ్లెంట గిట్టనోళ్లెవరూ వూర్కే  తిప్పేయడం లేదు గదా? గాడిదలక్కూడా కార్యాలూ గట్రా జరిపించినా చాలంట..   ఆగకుండా అదే పనిగా కుండపోతలు కురుస్తాయంట! అట్లాంటి  అఘాయిత్యాలకే   తుంటరి మూకలో పాల్పడ్డం లేదు కదా!
శరవేగంతో జరిగే అభివృద్ధిని చూసి ఓర్వలేని వార్గాలేవైనా సిగ్గూ శరం లేకుండా ఏ రాంగు రూట్నుంచో ఋష్యశృంగుడి వారసుల్ని వారాసిగూడా కూడల్లో  దింపి పోయినా చాలు..  దుంప తెంపే వాన తిప్పలు  తప్పవు. తక్షణమే కేసొకటి బుక్ చేసేసి ఏ ఏ.సి.బి కో సి.బి.సిఐ.డి కో అప్పగించేసెయ్యాలి అర్జంటుగా ముందు! కాళ్లకిందకు నీళ్లొచ్చిందాకా ఆగి.. ఆనక కన్నీళ్లు కార్చుకుంటే మాత్రం ఒరిగేదేముంది? ఎవడొచ్చి తుడిచినా కొట్టుకు పోయిన కుర్చీ మళ్లీ ఎంత కొట్టుకు చచ్చినా ఛస్తే తిరిగి రాదు.
వాతావరణ శాఖంటూ పేరుకొకటున్నా.. తడి బట్టలెప్పుడు మేడమీద ఆరేసుకోవాలో  చెప్పేందుకు తప్ప దాంతో  ప్రయోజనం సున్నా. బెస్తోళ్ళని  సముద్రంలో కెళ్లొద్దని చెప్పేందుకే అన్నేసి లక్షలు   వేతనాలుగా జనం డబ్బు  దొబ్బ బెట్టాల్నా!  ఎప్పుడు ఎన్నో నెంబరు జెండా  ఎక్కడెట్లా ఎగరేయాలో చెప్పేందుక్కూడా దానికున్న పరిజ్ఞానం సందేహమే సుమా! లాజికల్గా చూస్తే  అసలు మెటీరియోలాజికల్ డిపార్టుమెంటుకున్న హక్కే ప్రశ్నార్థకం! ఏ  మెట్టుగూడా వార్డు మెంబర్ని చాటుగా గోకినా చాలయ్యా..  చటుక్కున చెప్పేస్తాడు వాలు చూసి  జెండా మార్చేసే చమత్కారాలను గురించి.. చాట భారతమంత!
వరద వురవడిలో  పడి కొట్టుకు పోయే సగటు జీవుల్లో ఎట్టి గడ్డు పరిస్థితుల్లోనైనా పార్టీని గట్టెక్కించే  గట్టి ఓట్లు  తట్టెడుంటాయి. ఎన్నికల వరకైనా ఈ వానలు, వరదల నాపుకోలేకపోతే అన్ని పార్టీలకి ఒకే రకంగా   తట్టుకోలేనంత నష్టం. ఒక్కో శాల్తీకి రెండేసి ఓట్లు రాయించున్న పార్టీలకైతే ఆ ట్రబుల్.. డబుల్!   
కాకపోతే గమనించారో లేదో..   ప్రతీ కారుమబ్బుకీ ఓ మెరిసే వెండి అంచూ తప్పకుండా ఉంటుందంటారు. ఈ అతివృష్టులెంతలా  బీభత్సాలు  సృష్టించినా .. ఆ ప్రకృతి విపత్తు నుంచీ  'విత్తూ' మొలకెత్తే అదృష్టం కద్దునష్టనివారణ నిమిత్తం  కేంద్రం విదిల్చే చిల్లర నిధులు పార్టీ చిల్లరకేడర్ టెంపర్మెంటు  జబ్బుకి టెంపరవరీగా మంచి మందు!  
కుండపోతలు ఆగకుండా పడే చమత్కారాలు  యాగాల నిండా  బోలెడున్నాయ్.! సడే గానీ..  పడే పడే ఈ తరహా కుంభవృష్టుల్ని అలాగే ఆపేసే మంత్రాలు  ఏ తాంత్రిక శాస్త్రాల్లో  దాక్కునున్నాయో.. ముందా తంత్రాలన్నీ   తొందరగా  తెమల్చండయ్యా పంతుళ్లూ!  అందాకా ఈ జలప్రళయాన్నెలాగో ఆపద్ధర్మంగానైనా ఆపేయించుకోచాలి ముందు. ఏ కోర్టు గుమ్మం ముందు  వేళ్లాట్టానికైనా గవర్నమెంటు ప్లీడర్లు సిద్ద్గంగా  ఉండాలి!
నేరుగా ప్రభుత్వాలే  వ్యాజ్యాలు వేస్తుంటే న్యాయస్థానాలకు అదేదో నేరంలా తోస్తోందయ్యా ఈ మధ్య మరీను! పొలం, పుట్ర..  కొంపా గోడూ సర్వం కొట్టుకు పోయిన ఏ సన్నాసి అన్నదాత అడ్రసో వెదికి పట్టుకోండి! అలగాగాళ్లని అడ్డు పెట్టుకొనైనా సరే  అడ్డూ ఆపూ లేకుండా  అతివృష్టి సృష్టించే ఈ  వరుణ దేవుడి మీదో దావా పడేయాలి ముందు! ‘స్టే’ తెచ్చుకుంటే తప్ప ఎంత గొప్ప సుపరిపాలనైనా స్టేబుల్ గా ఉండలేని దౌర్భాగ్యంరా ద్యావుఁడా ఈ దేశంలో!
మధ్యంతర ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయ్! జమిలి ఎన్నికలూ అందరి  ఆలోచనల్లో తెగ  నలుగుతున్నాయ్! నోట్ల రద్దు ఫటింగు, జి.ఎస్.టి ఫిటింగు, సీనియర్ల సపరేట్ మీటింగు,  నల్ల డబ్బు దేశాల్దాటింగు, కాలుష్యాల కాటింగు, అమెరికనుద్యోగాల కటింగు .. కుల మతాల మధ్య ఫైటింగు!  కొంప కొల్లేరయిపోక  ముందే ప్రజల  ఓట్ల ప్రవాహాన్ని పార్టీలు పంటమళ్లకి మళ్లించుకోవాలి ముందు. ఓట్లేసే క్రౌడ్ క్రోధం క్లౌడ్స్ మీదకు అలాగే  మళ్లుండాలంటే.. అందుకో పాట!
‘వానా వానా వల్లప్పా!
నీకూ నాకూ చెల్లప్పా!’
-కర్లపాలెం హనుమంతరావు
*** 
(ఆంధ్రప్రభ- సుత్తి మెత్తంగా కాలమ్- 14, అక్టోబర్, 2017 సంపాదక పుట ప్రచురితం)

  

Friday, October 6, 2017

దోమాకలాపం - వ్యంగ్యం- సుత్తి మెత్తంగా- ఆంధ్రప్రభ కాలమ్-

'దేశంలోని దోమలన్నింటినీ వెంటనే నిర్మూలించాలి. ఆ దిశగా  సత్వరం  చర్యలు చేపట్టాలి. అలా అని కేంద్రాన్నిప్పుడే  ఆదేశించాలి!’
‘బాగుందిరా బాబూ నీ దోమాకలాపం! ఈ మధ్యో  పనిలేని  పెద్దమనిషి.. దినేష్ లోష్ ధన్ అనుకుంటా ఆ మహాశయుడి నామధేయం..  సర్వోన్నత న్యాయస్థానాన్నిలాగే ఆశ్రయించాడు.. అదేం మాయ రోగం? రోగ పరీక్షల వంకతో రోజూ  డయాగ్నస్టిక్ సెంటర్లెన్ని డ్రమ్ముల్తో  జనాల  నెత్తుర్లలా తోడిబోస్తున్నాయో! వాటి నడ్డుకునే నోరెవరికీ లేదు గానీ.. పాపం.. నోరూ వాయా లేవని కాబోలు.. ఈ పిచ్చి దోమల మీద మాత్ర మీ  పైత్యకారీ దాడులు! ఒక్క దోమ పీక పిసికినా దేశాని కెంతరిష్టమో.. తెలిసిడిస్తేగా మన తెలివి తక్కువ బుర్రలకీ!'
'దోమలు రకరకాల రోగ కారకాలు బాబాయ్! వాట్ని చంపవతల పారేయక చట్నీలు.. సాంబార్లూ.. చేసుకుని ఇడ్డెన్లు, దోశల్లో  నంచుకు  తినమంటావా ఏందీ..  విడ్డూరంగా!'
'దోమల్లోదీ మన నెత్తురేరా బాబీ! వాట్ని చంపేయటమంటే మనల్ని మనం చంపేసుకోవడమే కదా!’
'ఓహో.. అదా నీ బాధా? దోమలెంత వృధ్ధయితే మనమంత అభివృద్ధయిన్నట్లు  లెక్కా? భలే!'
'ఆ తిక్క కూతలే వద్దనేది! లోపలుంటే మన వంట్లో.. బైటుంటే దోమల వంట్లో!  అలాగుండాలబ్బీ దోమల్తో మన  రక్తబంధాల్లెక్క! నోట్లకట్ట లెన్ని వేలైనా పారేయ్.. వెల కట్టలేనిదిరా మన ఒంటి రక్తబ్బొట్టు!  రక్తాలతో లెటర్లు  రాస్తే తప్ప ఏ లైలా లవ్ రాస్తాలకు లైను క్లియరివ్వడం లేదని లబ్బుమంటున్నార్రా మీ తుంటరి  మజ్నూలు! ఆ బాహుబలి మార్కు  వీర తిలకం సీన్లు తిలకించు! బొటనేలు తెగ్గోసి బొటబొటా కారే  రక్తాల్తో నుదుట బొట్లు దిద్దినప్పుడే కదబ్బీ.. అబలా ప్రేక్షకులలా లబలబలాడేస్తూ కరుణ రసం సీన్లంత భీకరంగా పండించిందీ?   అవన్నీ ఒహెత్తు.. రాజకీయాల్లోని రక్తం చుక్కొహెత్తు! మాటకు ముందు..  'ఆఖరి  బొట్టు వరకూ జనం  కోసవేఁ నా నెత్తురు యావత్తూ   ధారపోసేదం'టూ వత్తి వత్తి మరీ రక్తం సీన్లు   రక్తి కట్టిస్తేనే కదా .. పెద్దాళ్లకో నాలుగోట్లు పక్కోళ్ల కన్నా ఎక్కువ ఓట్ల పెట్టెల్లో రాలిపడేది? మనుషులకంత ప్రియమైన బ్లడ్డు మరి మస్క్విటోలకు మాత్రం లడ్డూ కాకుండా.. గడ్డు జాంకాయవుతుందేవిఁట్రా ఎర్రి నాగన్నా? ప్రాణాంతకాలని తెలిసీ మళ్లా  మళ్లా ఉగ్రవాదులకు మల్లే మన బాడీల మీదన్ని సార్లు దాడులెందుకు  చేస్తాయో.. పాపం.. దోమలు! కొద్దిగానైనా  దయాదాక్షిణ్యాలు చూపించద్దా..  బుద్ధి తక్కువ మనుషులు!'
'నిర్దాక్షిణ్యంగా కుట్టి చంపే దోమల మీదనా బాబాయ్ దయా దాక్షిణ్యాలు!'
'కాస్త నిర్మాణాత్మకంగా కూడా ఆలోచించండిరా కంగారు పడకుండా! మశకాలకేమన్నా మనకులాగా మెగా స్టార్ చిరంజీవి టైపు  బ్లడ్డుబ్యాంకు డోనర్లున్నారా? నిర్మూలించేసెయ్యాలన్న యావే తప్ప.. పిచ్చి దోమల మూలకంగా వచ్చి పడే లాభాల సంగతెవరూ ఆలోచించరా? దోమా.. గీమా కుడుతుండబట్టే ఇన్నేసి రోగాలూ రొప్పులు! వాటి నిదానం  కోసం ఆసుపత్రులు! అవి కట్టుకోడం కోసం బ్యాంకప్పుల తిప్పలు. కట్టించినాక   సిబ్బందితో ఇబ్బందులు.. జీతభత్యాలు.. కరువు భత్యాలు చాల్టంలేదు.. పెంచాల్సిందేనంటూ ఆందోళనలు!   అందు కోసంగానూ ఏర్పాటయ్యే పోటా పోటీ  సంఘాలు! గుర్తింపు కోసం వాటి  మధ్య పోట్లాటలు! ప్రభుత్వాలతో నిత్యం కాట్లాటలు! పోలీసులొచ్చి వేసే లాఠీ పోట్లు! చివరాఖర్న కదా  సర్కారు పెద్దలతో భేటీలు! ముఖ్యమంత్రులే మిగతా ముఖ్యమైన పన్లన్నీ పక్కన పారేసి  రంగ ప్రవేశం చేస్తే తప్ప.. '
'ఉండుండు బాబాయ్.. ఊపిరాడ్డంలా ఇక్కడ!  బోడి దోమ కుట్టుళ్ల వెనకాల ఇంత మెగా మూవీ స్క్రీప్టుంటుంటుందా? అయ్య బాబోయ్..'
'దిసీజ్ జస్ట్  ఫ్రం సంక్షోభం సైడ్.. మై బోయ్! అటు సంక్షేమం సైడూ చూడు! దోమలే లేకుంటే డెంగ్యూ లేదు. మలేరియా రాదు, మెదడు వాయదు. చలిజొరం.. నిమ్మోనియా.. ఫ్లూ.. ఎట్సెట్రా.. ఎట్సెట్రా రోగాల  ఇన్ఫ్లుయన్సులూ  ఉండి చావవు. ఏవీ ఉండనప్పుడు సర్కారు కొలువులూ ఉండవు. ఉన్న    కొలువులకూ  సిక్ లీవుల్లిస్టులు మరీ అంత  పొడుగుండవు. రోగం వంకతో  డుమ్మా కొట్టిసి ఏ క్రికెట్ ఒన్డేకో.. మహేష్ బాబు మ్యాట్నీషోకో.. వెళ్లే వీలసలే ఉండదు. 'ఆరోగ్యశ్రీ.. ఈ భోగశ్రీ' లంటూ  సిరి వచ్చి పడే  పథకాలనేకం ఒక దానెనకాల ఒకటి తరుముకొంటూ వచ్చి పడే అవకాశాలూ ఉండవు! వాటి బిల్లుల కింద రాలిపడే రాబళ్లు   రాబట్టే సౌకర్యా లసలుండవు. సర్కారు దొరలకు  చేతి నిండా పన్లుండవు. చేతుల్లో పడే పైసలుండవు.  పైసల్రాలని కొలువులు కంచి గరుడ సేవలే కదట్రా! మరింకెవరికిరా పిలగాడా ప్రజాసేవమీద ఇప్పటంత    ఇంట్రెస్టు?   కిరికిర్లవీ ఇవీ  చేసేసి కమీషన్లు దండుకునే దళారీ దండ్లు దిండ్లేసుకునలాగే ఆఫీసుల చిడీల మీద  కునికేస్తాయా చాదస్తం కాకపోతే!   తాయిలాలు దక్కే వేరే కార్యాలకు   వలస పోతాయ్! దళారీ దండ్ల దార్లన్నీ మూసుక పోయాక  పైవాళ్ల  పుట్టి నట్టేట   నిండా మునిగి నట్టేగా! సుపరి పాలనా కుదరక.. సుపారీ పాలనా కదలక.. శిలలా  ప్రజాస్వామ్యమలా  స్తభించి పోతే .. దాని బాగోగులు గట్రా చూసే మిగతా మూడు మూల స్తంభాలూ..  మూలుగుతో మూలబడాల్సిందే బాబీ.. ఖాయంగా!'
'అయ్య బాబోయ్! ఒక్క కుయ్యాఁ  దోమను చంపితేనే  ఇన్నిన్ని అనర్థాలా బాబాయ్ మన ప్రజాస్వామ్యానికీ? మంచి ముక్క చెవిలో వేసి మా  కళ్లు మా బాగా తెరిపించావ్! నయ్యం!  ఇంటి దయ్యం పోరు పడలేక ఇంకా ఏ గుడ్నైటో.. హిట్టో.. ఇంట్లో కొట్టాలని .. ఇదిగో.. ఇప్పుడే..    కొట్టుకు బైల్దేర్తున్నా!'
'ఒక దోమను తరిమితే  మరో దోమ రాదుట్రా పిచ్చి సన్నాసీ కుట్టి చంపేయడానికి?!   దోమలనేవే లేకుండా ప్రక్షాళన  చేసేస్తే ఈ హిట్లూ.. కిట్లూ గట్రాలమ్ముకొనే కొట్లన్నీ బజార్న పడిపోవతాయా.. లేదా? అసలే పెద్దనోట్ల రద్దుతో చితికి పోయున్నాయ్ చిన్నా చితకా వ్యాపారాలన్నీ!    నువ్వూ ఇప్పుడీ దోమల ప్రక్షాళనంటూ నూతన  సంస్కరణలగ్గానీ  తెర తీసేస్తే.. లేక్స్ అండ్ క్రోర్స్ పోసి  పెట్టారే పాపం    దోమ్మందుల  కంపెనీలు.. ఓవర్ నైటా సీమ దొరల బ్యాచంతా  దిక్కూ దివాణం లేకుండా కుప్పకూలిపోదుట్రా! దోమల మీదిట్లా  సర్జికల్ దాడులు పక్క పాకిస్తోనోడి కుట్రలేమో.. విచారించుకోండి ముందు!’
'ప్లీజ్.. ప్లీజ్.. ఆపు బాబాయ్! పాడు నిద్ర. రాత్రి కాకపోతే పగలు పోవచ్చు. ఆఫీసులో అయితే అస్సలు ఇస్యూనే కాదు. ఇంటి పట్టునున్నా ఇంటావిడ పోరు ముందు ఈ దోమల సంగీతమే వీనులకు విందు!’
'గుడ్ ఐడియా!  వార్తలు రోజూ చూస్తూనే ఉన్నావుగా?  రాత్రి రాబరీలు ఓ రేంజిలో పెరిగి పోతున్నాయ్!  దోమల్తో సావాసం సహనంతో చేసావా..  ఇంటి కాపలా సమస్యా సామరస్యంగా తీరిపోతుంది. ఈ రోజుల్లో కుక్కల్నీ.. గూర్ఖాల్నీ.. పోలీసోళ్ళ  పెట్రోలింగుల్నీ నమ్మేందుకు లేదబ్బీ! ఎవడి సొత్తుకు వాడే కావలి.  అందుకైనా  దోమల తోడు    కావాలి. పనిలో పని! దేశవాళీ  సంగీతంతో  పరిచయమూ పెరుగుతుంది.  కొన్ని దోమలు కుడితే కేన్సరు కూడా దరి చేరదంటున్నారా.. ఫారిన్  సైంటిస్టులు! ఏ దోమ కొండెలో ఏ మందు దాగుందో! కదలకుండా  బబ్బో..  అదేరా సుబ్బరమైన పని!'
'ఎట్లా బాబాయ్? చెవిలో ఒహటే సొద!'
'ఏడ్చావ్ లే! నీ  టీవీలు, సినిమాలు, రోడ్లమీది రొద బళ్ళూ, సభల్లో మన నేతాజీలు  కూసే  కుళ్ళు కూతల కన్నానా?! దోమల సంగీతంలో ఓ  అందమైన లయుంది నాయనా! వింటూ బబ్బున్నావా.. ఇట్టే తెల్లారుతుంది! అందాకా  ఇంద..  చిడతలు! త్యాగయ్యగారి  కీర్తనల ఆలాపనలందుకో! 'బంటు రీతి కొలువు ఈయవే .. రామా!'
‘రామా కాదు బాబాయ్! దోమా!  బంటు రీతి కొలువు ఈయవే.. దోమా!’
‘బాగుంది.. బాగుంది.. నీ దోమాకలాపం!’
-కర్లపాలెం హనుమంతరావు
***




























































Monday, October 2, 2017

హే.. గాంధీ!- ఆంధ్రప్రభ వార్తాపత్రిక వ్యంగ్యం

గాంధీజీ జయంతి సందర్భంగా

'హే.. గాంధీ!' పిలిచాడు రామచంద్రుడు. 'మహాత్మా! నువ్వు బతికున్నంత కాలం 'రఘుపతి.. రాఘవ.. రాజా.. రాం..' అంటూ పద్దాకా రాంకీర్తనలతో నా బుర్ర వూరకే తోమేవాడివి! సబ్ కో  సన్మతి ప్రసాదించమని సతాయించేవాడివి! ఆ రఘులు, రాఘవులు, రాజాలు, రాం వగైరాలంతా నీ రామరాజ్యం కలలకు ఎలా ‘రాం.. రాం’లు చెప్పే పనిలో విరామం లేకుండా శ్రమించేస్తున్నారో.. తెలుసా!’
 ‘నారాయణ.. నారయణ! అల్లా,, అల్లా! భగవంతుడి బిడ్డలమే మేమల్లా! అలా అనుకొని సర్దుకు పోరాదా సద్గుణాభిరామా!'
'ఆ అల్లా వచ్చి నచ్చి చెప్పినా మీ నారాయణా..  సత్యనారాయణలంతా  ఆవలి సంతలో చేరి పుల్లలు పెడుతున్నారు కదయ్యా కొల్లాయి బాపయ్యా!
చింతనలో పడ్డాడు గాంధీజీ.
సందు చూసుకొని అందుకొన్నాడు ఆంజనేయుడు 'బాపూ! నాకూ నరలోకంనుంచి  సమాచారం ఉంది. తమరు సత్యంతో చనిపోయేదాకా చచ్చేటన్ని ప్రయోగాలు చేసి చూపించారా! తమరి  వారసులమని బీరాలు పోయే నేతలు  ఇప్పుడక్కడ ఆ సత్యాలన్నీవట్టివే.. వట్టి నేతిబీరకాయలేనని గట్టిగా నిరూపించే పనిలో బిజీగా ఉన్నారు! ఏది సత్యమో.. ఏదసత్యమో తెలీనంత అయోమయంగా అన్ని రంగాల్లో  ప్రయోగాలు సాగిపోతున్నాయి స్వామీ అక్కడ!’
‘అసత్యంతోనా ప్రయోగాలు?!'
‘మరే! ఎన్నికలలా తన్నుకు  రాగానే ముందు అసత్యమే సత్యం మేకప్పేసేసుకొని తైతెక్కలాడేస్తోంది! ఏ పార్టీల  ఎజెండాలయితేనేమి.. అన్నీశుద్ధబద్ధాల   
ప్రయోగశాలలుగా తయారవుతున్నాయి! ఎన్ని లక్షల కోట్లక్రమార్జనల ఆసామైనా .. ఎన్నికల సంఘం ముందు ఒక్క  డొక్కు   కారుకు  మాత్రమే ఓనరు!  ఆస్తి పాస్తులకన్నా.. అప్పులు, పన్నులు, పస్తులైనా ఉండి కట్టి చావాల్సిన శిస్తులే బొచ్చెడు!'
'మరంత కష్టంలో ఉండీ మరెందుకు స్వామీ కోట్లు దండిగా వదిలే ఆ పాడు ఎన్నికల్లో  పాల్గొనేదా ఆసామీ?!'
'ప్రజాసేవ యావ మహాత్మా! గ్రాము ఎత్తు జనంరుణమైనా తీర్చకోకుంటే  ప్రజాజీవితానికి అసలు పరమార్థమే లేదు పొమ్మని.. .  తవఁరే ఎప్పుడో  సేవాగ్రాములో సెలవిచ్చారంట కదా!’
'అనుమానం అవమానం సుమా! నిజంగానే ఆ ప్రజాసేవకులు  నా సిధ్ధాంతాలను నమ్మి ఎన్నికల్లో నిలబడుతున్నారేమో.. హనుమా?'
'మరే! వాళ్లంత ఉగ్ర సేవకులు కాబట్టే తమరు తాగద్దన్నారని ఉగ్గబట్టిన  కల్లు గట్రాలలా మురికి వాడలకొదిలేసారు.  ఫక్తు  సీమ సరుకుతో తాము  సర్దుకుపోతున్నారు. ఖరీదైన కరేబియన్ డ్రగ్గుల్తో సరిపుచ్చుకుంటూ..  సన్నకారు తాగుబోతులు పుచ్చుకునేందుకు వీలుగా  చీపు లిక్కరు బట్టీలు పెట్టి తంటాలు పడిపోతున్నారు’ అబ్కారీ వసూళ్ళే  ఇప్పటి బీద సర్కార్లక్కూడా నిక్కచ్చి ఆదాయం బాపూజీ! జనమూ జాతిపిత జ్ఞాపకాలను మర్చిపోలేక నలిగిపోతున్నారు, తవఁరి జయంతి, వర్ధంతుల రోజుల్లో కూడా మందు  దుకాణాలు  బందు పడున్నా ఏ సందులోని షట్టరు సందుల నుంచో పుడిసెడైనా పుచ్చుకొంటే గానీ  పునీతులైనట్లు అనిపించటంల్లేదెవ్వరికీ స్వామీ!’  
'రామ!.. రామ! రామరాజ్యం వస్తే జగమంతా తెగ  సుఖిస్తుందని  కదయ్యా హనుమా  నా  కల?’
సుఖపడే పాలన  యధేఛ్ఛగానే కొనసాగుతోంది లేవయ్యా స్వామీ కింది లోకంలో! పబ్బుల్లో రాసలీలల స్వేఛ్చకు పెద్దింబ్బందులేవీ లేవు. మోక్షమందించే బాబా డేరాలు వందలొందలుగా పెరిగి పోరూనే ఉన్నాయ్ గొంది గొందికీ! మాయా మర్మాలతో పలు రకాల ప్రయోగాలు సాక్షాత్తూ  న్యాయదేవత కళ్లముందే   సాఫీగా సాగిపోతున్నప్పుడు ఇహ మన   సుగుణాభిరాముడొచ్చి నేరుగా పాలనలో జోక్యం చేసుకొంటే,, ఏమంత బావుంటుంది చెప్పు బాపూజీ?’
‘ఆ కొంటెతనమే వద్దు! అక్కడికీ ‘చెడు- వినొద్దు.. కనొద్దు.. అనొద్ద’ని  చెవినిల్లు కట్టుకొని మరీ పోరి  పోరి వచ్చాను కదా బతికున్నంత కాలం! నా మొత్తుకోళ్ల ఫలితం నిల్లైనట్లేనా  మరి! హరి.. హరీ!
'చెడు' అన్న పదం మాత్రం మా చెడ్డ ఇబ్బందిగా ఉన్నట్లుంది మహాశయా తమరి శిష్యబృందాలకి!ఆ అనద్దు.. కనొద్దు.. వినద్దుఅన్న  సూత్రం మాత్రం గట్టిగా పట్టుకొని  మా చెడ్డ నిబద్ధతతో పాటిస్తున్నార్లేవయ్యా నేతా.. జనతా!
'రామ.. రామ!'
'అలా ‘రామా.. రామా’ అంటు అల్లల్లాడినా బూతు మాటగా మారి అల్లరైపోతునదయ్యా కిందంతటా.  ఏ ప్రవచానానికి  ఎవరు ఏ పెడర్థం లాగి రాద్దాంతం చేస్తారో.. ఏ మేధావి ఎప్పుడే చచ్చు సిద్ధాంత పట్టుకుని పుస్తకంతో పరువు తీస్తాడో.. ఏ ముఖ పుస్తకం టపా ఠపాల్మని పేలి ఎవరు ఎప్పుడు టపా కడతారో .. అంతా  గందరగోళంగా ఉంది కింద భూగోళంలో! జీవించే హక్కు..'
'హక్కనుకుంటామే గానీ.. జీవితం క్షణభంగురమే కదా చిరంజీవీ వాస్తవంగా చూస్తే!'
'నిజవేఁకానీ స్వామీ.. మరీ భంగుతాగిన  మాదిరి తక్కుతూ తారుతూ నా జీవించేదీ? ఎంత ఇబ్బందిగా ఉంటుందీ   అర్బకుడికి? తమరు స్వాతంత్ర్యం తెచ్చి డెబ్బై ఏళ్ళు దాటినా దెబ్బై పోతున్నాడయ్యా సామాన్యుడింకా కింది లోకంలో!’
‘అవును. హనుమ చెప్పినవన్నీ అక్షరాలా నిజమే బాపూజీ! మళ్లీ నువ్వే ఓ సారి నీ  భరత ఖండం వెళ్లి రావాలి?  రామచంద్రుని స్వరం.
భక్తిగా లేచి నిలబడ్డాడు బాపూజీ.. సామాను సర్దుకుంటో!
'బొడ్దులో గడియారం, చేతిలో కర్ర, కొల్లాయి గుడ్డ, కళ్ల జోడు! బోసి నవ్వుతో ఇంత సజీవంగా వెళితే పిచ్చి నేతలతో ప్రమాదమేమో చూసుకో లోక నాయకా!’
'నడి రోడ్లమీద అడుగడుగునా నా విగ్రహలే కదా వెలిసున్నాయి  స్వామీ! మరి వాటికి లేని ప్రమాదం..?’
‘నోరు లేని విగ్రహాల కథ వేరయ్యా పిచ్చి బాపూజీ!  గల్లీ బుల్లి నాయకులు .. ఎన్నికలప్పుడు  కటౌట్లు గట్రా పడిపోకుండా నిలబెట్టుకోడానికి ఆ విగ్రహాలు పనికొస్తాయి! పండగలు,  పబ్బాలప్పుడు దండలవీ వేసి దండాలు దస్కాలు పెట్టుకునేందుకైనా నీ  బొమ్మ బండలు ఉండాలి.. తప్పదు! ఉన్నట్లుండి నువ్విలా ప్రాణాలతో వెళతానంటేనే  నాయకుల గుండెలు గుబ గుబ లాడేది’
‘పోండి స్వామీ మీరు మరీను! కొత్త రెండువేల నోటుమీదా నా మొహమే మళ్లి  ముద్రించారు తెలుసా మర్చిపోకుండా!’
కింద మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ అని రాయిస్తే  గానీ తవఁరెవఁరో ఈ నాటి జ్ఞానులకు తెలిసే అవకాశం లేదు స్వామీ! 'భలే తాత మన బాపూజీ' అంటూ బడిపిల్లల చేత మాత్రమే పాడిస్తున్నారంటేనే బడా నేతల తలల్లో ఏం దురాలోచనలున్నాయో తెల్సిపోతోంది.  పిల్లకాయలకి మాత్రమే నువ్వో రోల్ మోడలుకు! పెద్ద తలకాయల రీతి రివాజులకు నువ్వో రోడ్ రోలర్.’
‘హేఁ! రామ్!'
'చెవులిలా గట్టిగా మూసేసుకుని ఇక్కడ కుమిలిపోతూ కూర్చుంటే లోకం ఇంతకన్నా ఎక్కువగా కుళ్ళిపోతుందయ్యా అక్కడ బాపూజీ! ఎల్లుండే నీ జయంతి. ఎక్కడున్నా నీ వారసులమని చెప్పుకొనే వారంతా  ఆ రాజ్ ఘాటు  సంతకు  హాజరవుతారు ఖాయంగా. మంచి అదను. ఇది తప్పితే మళ్ళీ వర్ధంతి వరకు  నీకే దొర అప్పాయింటుమెంటూ  దొరికి చావదు'
'ఏం చెయ్యమని నీ సెలవు శ్రీరామచంద్రా?'
 'ఏం చేస్తావో.. ఎలా దారికి తెస్తావో.. నీ ఇష్టం! వారసులమని ఒకళ్లు.. జాతిపిత సిద్ధాంతాలకు తామే అసలు  కళ్లమని మరొహళ్లు! రాజకీయ స్రవంతిలోకి వరదలా వచ్చి పడుతున్నదయ్యా  బాపూ ఎక్కడా పనికిరాని మకిలి సరుకంతా! ప్రక్షాళనే తక్షణం చేప్పాట్టాల్సిన పెద్ద సంస్కరణ’
'చిత్తం స్వామీ! ఇదిగో  బైల్దేరుతున్నా!'/
'ఇలాగా! ఏ తెలుగు దేశం శివప్రసాదో మారు వేషంలో వచ్చాడని దులుపుకు పోతారయ్యా పెద్దలంతా!. వంటికి వెండి పూత దట్టంగా పట్టించు!  ఓ గంట ముందే వెళ్లి ఆ ఎండలో నీ రాజఘాటు గేటు బైట శిలావిగ్రహంలా నిలబడి పో! ఆషాఢభూతుల  చూపు నీ మీద పడ్డ తరువాత.... ఇహ నీ ఇష్టం'
ఆంజనేయుడు  దుడ్డుకర్ర అందించాడు.
కొల్లాయి గుడ్డ ఇంకాస్త గట్టిగా బిగించి ఛంగున ఛంగున ముందుకు దూకే ఆ   సత్యాగ్రహిని ఆపితాజా  ప్రధాని మోదీజీ కూడా  అక్కడ నువ్వు  ప్రబోధించిన   ప్రక్షాళనా కార్యక్రమాన్నే   మహా దీక్షగా కొనసాగిస్తున్నాడు. ఆ మహానుభావుడి రామరాజ్య స్థాపన పుణ్యకార్యానికి నువ్వూ  ఓ చెయ్యి వేయి మహాత్మా! జనం కలలు కనే సుపరిపాలన స్థాపనకి నువ్వే మళ్లీ వెళ్ళి ఓ ఇటుకరాయి వేసెయ్యి మహర్షీ! అంటూ ఆశీర్వదించాడు ఆ శ్రీరామచంద్రమూర్తి.

-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ- దినపత్రిక- సెప్టెంబరు- 30- 2017 -సుత్తి మెత్తంగా కాలమ్)

Sunday, September 24, 2017

నీటి తల్లికి నిత్య నీరాజనం- ఆంధ్రప్రభ సంపాదకీయ పుట వ్యాసం




యమునేచైవ గోదావరి సరస్వతి 
 నర్మదే సింధుకావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

ఇహ పరాల అభ్యుదయం కోసం ఈ పుణ్యభూమి ఋషులు సామాన్యులకు అనుగ్రహించిన  ఈ శ్లోకం అంతరార్థం గ్రహిస్తే చాలు.. మనిషి  ఈ భువిమీదే దివిలో

మాదిరి దివ్యంగా జీవితం కొనసాగించేయవచ్చు. పాదాల అడుగులు నేలను  తాకిస్తూ ఆకాశాన ప్రభవించే సూర్యభగవానుడికి  దోసిలి నిండిన జలంతో నమస్కారాలు చేయడం  వెనక .. నేల, నింగి, గాలి, నిప్పు.. కు  నీరూ తోడుగా  జత కలిసినప్పుడే జీవితం సుసంపన్నమయేదన్న సూత్రం ఇమిడి ఉంది. మనం మనకు తెలుసు అనుకున్న అంశాలను గురించి పునర్విచారణ చేయవలసిన అవసరం నానాటికీ పెరుగుతున్నది. అందులో నదీ నదాల అంశం ప్రధానమైన వాటిలో ఒకటి. 'కలకల స్వన సలిల ఋక్ఛంద వేద సంలాప'గా కృతయుగాన  మురిపించిన  కైలాస గంగ  'నరక భీకర తమో గర్భఘూర్ణిత భయద వైతరణి వేణి'గా చెడి-  కలియుగాన్ని వణికించేస్తోంది . ఎందుకో ఆ మర్మం కనిపెట్టాలి.
నదులకు అడ్డంగా కట్టిన ఆనకట్టలను వట్టి మట్టి కట్టలుగా భావించలేదు భారతీయులు ఎన్నడూ.  'ఆధునిక దేవాలయాలు'గా  మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అభివర్ణించడంలోని ఆంతర్యం ఆ జలాశయాలూ దేవాలయాలకు మల్లే జీవితాన్ని పునీతం చేస్తాయన్న ఆధ్యాత్మిక భావనే.  కోవెలకు కోనేరుల్లాగా.. ఈ కొత్త  దేవాలయాలకు పారే ప్రవాహాలే కోనేరులు. కోనేటి  స్నానం వల్ల ఎంత  పుణ్యమో నిర్థారించేందుకు లేకపోయినా.. ఈ పారే కోనేటి చలవ వల్ల అనేకమైన ప్రజోపయోగాలు చేకూరుతున్నాయి.
గంగ అంటే కేవలం జలధార కాదు. అదో జీవధార. ఈ దేశంలో నీరు ఏ రూపంలో ఉన్నా గంగగానే భావిస్తారు భారతీయులు.   గంగ నీటికి పర్యాయ పదం. నీరు జీవితానికి ఆధారం. జలాధారిత జీవ జాలమే కాదు.. భూమ్యాకాశాల మధ్య జీవించే జీవ  సముదాయాలూ   జలాశయాలకు సమీపంగానే సంచరిస్తాయి. రామాయణ కాలంనాటి గంగావర్ణన ఇందుకు నిదర్శనం.  గంగ రెండు గట్లకు వరుసుకొని  పెరిగిన దట్టమైన అడవుల నుంచి బయటికి వచ్చిన దిట్టమైన ఏనుగుల గుంపు నదిలోకి దిగి నీళ్లు తాగుతున్నప్పుడు.. నీటి అడుగుల నుంచి మొసళ్లు వాటిని   లంకించుకోవడం కోసం వడుపుగా కాచుకొనుండడం.. వాల్మీకి మనోహరంగా వర్ణిస్తాడు. తాబేళ్లు, పాములు,  చేపలు వంటివి మన కంటికి  బైటకు కనిపించే కొన్నిరకాల  జలచరాలు మాత్రమే.   భూచరాలకన్నా 35 శాతం ఎక్కువగా  జీవ జాతులు నీటి అడుగుల్లో  జీవిస్తున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇంత అందమైన గంగ భూమ్మీదకేమీ ఉట్రవుడియంగా వచ్చి పడలేదు. భగీరథ ప్రయత్నం అవసరమైంది. మనిషి నిర్లక్ష్యం వల్ల క్రమంగా ఆ జలవనరులన్నీ  కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయి క్రమ క్రమంగా.  
నదులు అనాదివి
 '.. that ancient river, the river Kishon, O my soul, thou hast trodden down strength' అన్న హోలీ బైబిల్  వెర్స్ 21.. ఆంధ్రదేశంనుచి  సముద్రంలో కలుస్తున్న కృష్ణానదిని గురించిన ప్రస్తావనే అన్నది చరిత్రకారుల అభిప్రాయం. తెలింగాణా (తరువాతి  రూపం తెలంగాణా) పదంలోని తొలి  'తెలి' భాగం గోదావరి నదికి   సంబంచించినదనీ మరో అభిప్రాయం. ఉత్తర ప్రాంతాలనుంచి దక్షణాదికి వచ్చే సంచార జీవులు, బౌద్ధ యాత్రికులు, తెలిభాష పలికే గోదావరి ప్రాంతంలో తొలి అడుగు వేసేవారని.. నదులకు.. జనజీవనానికి మధ్య ఉండే లంకెను క్రీ.102నాటి గ్రీకు భౌగోళికుడు టాలెమీనే తేల్చి చెప్పాడు.  ప్రాంతాలు నదుల పేర్లతో ప్రసిద్ధమవడం అనాదిగా మనం చూస్తున్న చారిత్రక సత్యం! మంజీరికా దేశమని బౌద్ధ వాజ్ఞ్మయంలో పేర్కొన్న ప్రాంతం నేటి మంజీర తీరంలో వర్ధిల్లే మెతుకు సీమ. గోదావరి నది వడ్డున సాగే సంతల్లో  ఏనుగులతో ఉల్లిగడ్డలు మోయించి తెచ్చే వారు,  వరద కోతలకు తరచూ గురైనందువల్లే గోదావరి తీరాన ఇనుప ఖనిజంతో తయారైన నాణేలు నేటికీ బైటపడుతుంటాయి. నీటికి సమీపంగా మసలే  జాతుల వికాస ప్రగతి   మిగతా   జాతుల అభివృద్ధి కన్నా  ఎన్నో రెట్లు వేగవంతంగా సాగిన్నట్లు చరిత్ర రుజువులు చూపిస్తున్నది.    నీటి కోసం, నీటిలో వాటాల కోసం రాతియుగం నాటి నుంచే కాదు.. రాకెట్టు యుగం దాటి దూసుకొస్తున్నట్లు చాటుకునే  ఈ   అత్యాధునిక యుగంలో కూడా కొట్లాటలు తప్పడం లేదు.
నీరు నిత్యావసరం
నీరు జీవితానికి ప్రతీక. నీరు లేనిదే జీవి లేదు. జీవనమూ లేదు. నీటికి అందుకే జీవనం అనే మరో పేరుంది. నీరెక్కడుంటే అక్కడ జీవి ఉండే ఆస్కారం ఉంది కాబట్టే.. గ్రహాంతరాలలో నీటి జాడలకోసం అంతరిక్ష శాస్త్రం అంతలా పరిశోధనలు సాగిస్తోంది. వనరులు  పుష్కలంగా ఉన్నప్పటికీ భూ వాసి నీటి నిజమైన విలువ తెలుసుకోలేక.. నిర్లక్ష్యం చేస్తున్నాడు. తనకు తానుగా భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుకుంటున్నాడు.  నీరు శిశువులా అవతరిస్తుంది. మనిషి జీవితంలానే  పయనం కొనసాగిస్తుంది. కొన్ని చోట్ల పొంగులతో.. కొన్ని చోట్ల వంపులతో ముందుకు సాగి వార్థక్యంలోలాగా సంగమ స్థానంలో బలహీనపడి సాగర సంపర్కంతో ఉనికిని  కోల్పోతుంది. బిందువు నుంచి సిందువుదాకా నది సాగించే ప్రయాణ మార్గమే జీవజాతులమీద ప్రభావం చూపించేదిప్రధానంగా అనాదిగా మానవ జాతి నది నడక వల్ల అధికంగా ప్రభావితం అయింది.
ఏ నది కథ అయినా ఒకే మాదిరిది. జన్మస్థలం.. పయన మార్గం.. సంగమ తీర్థాల్లోనే తేడా! ఏ నదీ ప్రవాహలు స్నానయోగ్యాలు, ఏ నదీమ తల్లి గర్భంలో ఏ జాతి జీవ
సంపద వర్ధిల్లుతున్నది.. ఆ వివరాలన్నీపూసగుచ్చినట్లు  ఋషులు గ్రంథస్థం చేసిన జ్ఞానభూమి ఈ గడ్డ.  గోదావరిలా తెల్లంగా.. కృష్ణవేణిలా  నల్లంగా.. రంగుల్లో భేదాలున్నా..   రుచుల్లో రకాలున్నా ..  స్రవంతులన్నీ జీవ శిశువులకు ఆప్యాయంగా చన్నిచ్చి   పోషించే తల్లులే! నదులను నదీమ తల్లులుగా భావించుకోవడంలోని ఆంతర్యం  కేవలం భౌతికమైనది కాదంటారు భారతీయులు అందుకే.  భాగీరథి ఎన్ని  నాగరికతలకు, జ్ఞాన మార్గాలకు మూగ సాక్ష్యమో! మహాభారతంలో గంగ భీష్మపితామహుడికి తల్లి. గంగానది చూపులకు కేవలం ఓ జలధార మాత్రమే కావచ్చు కానీ  ప్రకృతి ప్రేమికులకు ఆ రాయంచ నడకల నంగనాచి  ఒక సౌందర్యలహరి, రామాయణంలో వాల్మీకి చేసిన గంగావర్ణన ఓ   కమనీయమైన అనుష్టుప్ గానం.   దిగితే కానీ  లోతు తెలీని ఈ మాదిరి  నదులు దేశం నిండా 500కు పైగానే ఉన్నాయని పర్యావరణ శాస్త్రవేత్తల   అంచనా.    
నదులను అనుసరించి ఏర్పడ్డ నగరాలే నదుల ఉనికికి యమగండాలుగా మారడం ఆందోళన కరం. 'నదులే కదా? మనకేమిటికిలే?' అని చిటికెలేసి ఆవలించి నిద్రకి జారుకుంటే  మెలుకొచ్చే వేళకి కళ్లముందు కనిపించేది గుక్కెడు నీటికి కరువ్వాచే ఎడారి మేటలు! ఒడ్డునే నిలబడి ఓ చెంబెడు నీళ్లు ఒంటి మీద వంపుకొని.. మరో చెంబు భద్రంగా  బంధు మిత్రులకని వెంట తెచ్చుకొనే పాటి భక్తి శ్రద్ధలతో సరిపుచ్చుకుంటే చాలదు. నదుల కాలుష్యం నివారణకు ప్రభుత్వాలు, ప్రజలు  చేయవల్సింది సముద్రమంత ముందు ఉంది. మనదేశంలో ప్రవహించే 500 నదుల్లో ప్రధానమైన జీవనదులు కేవలం పదిమీద ఓ నాలుగుఆ కాసిని జీవనదులమీద ఆధార పడే నూటికి 85 మంది బతుకులీడుస్తున్నారు. తెల్లవాడి రాక ముందు  దేశంలోని నదులన్నీ నిండు కుండల్లాగా కళ కళ లాడుతుండేవి. పారిశ్రామీకరణ అంతగా పుంజుకోని కారణాన  సకాలంలో వర్షాలు విస్తృతంగా పడుతుండేవి. ఏటా వచ్చిపడే వరదలతో సర్దుబాటు చేసుకు బతికే సగటు భారతీయుడికి తెల్ల వ్యాపారి అత్యాశల మూలకంగా వర్షాబావం, కరవు కాటకం అంటే ఏమిటో చవిచూడా
ల్సొచ్చింది. తక్షణ లాభాలకు కక్కుర్తి పడి ఘరానా వ్యక్తులు చేసే జలదోపిడీకి అడ్డుపడనందు వల్ల చివరికి ఇప్పుడు మిగిలింది తాగు.. సాగు యోగ్యం కాని  అపార జల కాసారాలు! వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర నదులు కేవలం గత రెండు శతాబ్దాలలో కాలుష్యమయం అయిపోవడం ఆందోళనకరం.  గతంలో తొలి జామున నదీ తీరాన నిలబడి గుప్పెడు జల గుక్కెట పడితే అమృతం సేవించినంత స్త్రాణ ఉద్దీపమయేది. నదుల్లోకి ప్రవహించే మురికిని చూస్తూ ఇప్పుడెవరైనా అంత సాహసానికి ఒడిగట్ట గలరా? దేశరాజధానిని ఆ స్థాయికి తెచ్చిన యమునా నది ప్రస్తుతం ఒక మృత ప్రవాహం.  నదుల విస్తీర్ణం రోజు రోజుకూ కుచించుకు పోతోంది. గత ముప్పై ఏళ్లల్లో కృష్ణవేణి 60 శాతం చిక్కిపొయిందని ఓ అనధికారిక అంచనా.
నదుల జల లభ్యతలోనూ గణనీయమైన తగ్గుదల. క్రమప్రవాహాలలోనూ నిలకడలేమి. భూతాపం, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు  మనిషి నిర్లక్ష్య ధోరణీ తోడయి నదుల రూపు రేఖలకు చెరుపు కలుగుతోందన్న మాట వంద శాతం నిజం.  గట్లను యధేచ్చగా తవ్వుకుంటు పోతుంటే దేశంలోని అన్ని నదులకు సరస్వతీ నది దుర్గతి ఖాయం. ఇసుక దోపిడీ ఇప్పుడు సాగుతున్న విశృంఖలంగా ఇంతకు మునుపెన్నడూ లేదని స్థానికులు వాపోతున్నా.. పట్టించుకొనే పాలకులు కరువవుతున్నారు.
నదుల ఒడ్డున పచ్చదనం జీవనదుల జవసత్వాలను మరింత పెంచుతుంది. వరదల ముప్పును తగ్గిస్తుంది. కరవు కాటకాలను నివారిస్తుంది. భూగర్భ జలాలు పెరుగుతాయిసకాలంలో సాదారణ స్థాయి వర్షాలు కురుస్తాయి. వాతావరణం హఠాత్పరిణామం నివారిస్తుంది. భూమి కోతలను నిరోధించవచ్చు. నీటి నాణ్యత పెరుగుతుంది. భూసారం మెరుగవుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైన జీవ వైవిధ్యం కొనసాగుతుంది.

మనం పురాణలలోని వృత్రాసురులమా?  దేవేంద్రులమా?
పురాణాలలో వృత్రుడు నదులను నలుదిశలనుంచి కట్టిపెట్టి కట్టడి చేసాడని వినికిడి. ఇంద్రుడు వజ్రాయుధంతో వాడి దౌష్ట్యాన్ని నేల కూల్చి జల విముక్తి కావించాడు. పారే పారే నీటివాలును స్వలాభం కోసం మళ్లించడం.. నదులని పూడ్చి స్వార్థ ప్రయోజనాల కోసం భవంతులు నిర్మించడం, విషపదార్థాలు ఉత్పన్నమయే కర్మాగారాలను అక్రమ మార్గాల్లో  నిర్మాణం చేసి.. బై ప్రొడక్టు  కాలుష్యాలను నిశ్శబ్దంగా నదుల్లోకి వదులడం,  తాగు.. సాగు నీటిని నిరుపయోగం చేసే స్వార్థపర వర్గాలేవైనా.. అవన్నీ  ఆ వృత్రాసురుడి కలియుగ వారసులుగానే భావించాలి. దేశంలోని ఐదొందల నదుల్లో 2012నాటి లెక్కల ప్రకారం  121 నదులు నిరుపయోగంగా మారిపోయాయి. మరో మూడేళ్లల్లో కాలుష్య నివారణ చర్యలు ముమ్మరం చేయకపోతే మరన్ని నదులు మృతప్రాయమవుతాయని కేంద్ర కాలుష్య నివారన మండలి తాజా నివేదికలో హెచ్చరించింది.  జల కాలుష్యాధముల   ఆట కట్టించే పర్యావరణ కార్యశీలులే     ప్రజావళికి ఇవాళ్టి నిజమైన దేవేంద్రులు. భగీరథుడు భువికి దించిన గంగ పవిత్రులైన అరవై వేలమంది సగరులకు  స్వర్గలోకం రుచి చూపించింది. ప్రవహించిన దారి పొడుగునా అడుగు అడుగునా  పేరుకున్న   భస్మరాసులను పరిశుభం చేసింది. అంత మహిమాన్విత  జీవదాత గంగామాత తిరిగి అంతే పునీతంగా భూమి తల్లి   కడుపు తడపాలంటే కంటి తుడుపు చర్యలు   కాదు. కావాల్సింది.. కఠినమైన నిర్ణయాలు. చిత్తశుధ్ధి నిండిన సంకల్పాలు..   మొక్కవోని దీక్షతో ముందుకు పోయే కార్యాచరణలు.

నదుల అనుసంధానం
వ్యవసాయ దేశం మనది.  అధిక భాగం వర్షాధారితం. జల  వనరుల నిలవ విధానాలు మెరుగు పడితే తప్ప  సాగురంగం లాభదాయకం కాబోదు.  ఆ దిశగా చర్చలు దశాబ్దాల బట్టి కొనసాగుతూనే ఉన్నా.. మోదీ ఆధ్వర్యంలోని ఎన్ డి యే అధికారంలోకి వచ్చిన తరువాతే  నదుల అనుసందాన  కార్యాచరణమీద మళ్లీ దృష్టి మళ్లింది. ఈ  బృహత్తర పథకాల  సాకారతకు జాతీయంగా.. అంతర్జాతీయంగా  సవాలక్ష సవాళ్లు.    డాక్టర్‌ కేఎల్‌ రావు కేంద్రమంత్రిగా ఉన్నహయాంలోనే గంగను కావేరీకి మళ్లించే  రెండువేల చిల్లర కిలోమీటర్ల పొడవు అనుసంధాన పథకం  ప్రతిపాదన దశదాకా వచ్చింది. అట్లాంటి భారీ పథకాలు  ఆచరణ యోగ్యం కావంటూ అప్పటి ప్రభుత్వాలు తిప్పిగొట్టిన తరువాత మిగులు జలాలు    నీటి తరుగున్న చోట్లకు తరలించే చిన్న పథకాలకు జాతీయ జలవనరుల  సంఘం ప్రాథాన్యత ఇచ్చింది.   అస్తమానం వరదలు సృష్టించే ఉత్తరాది జీవనదుల నీటిని తరచూ  కరువుల పాలయ్యే దక్షిణానికి తరలించడం ఉభయత్రా మేలే కదా!  సర్వోన్నత న్యాయస్థానం జోక్యంతో, 2002 అక్టోబరు 31నాటి   కేంద్రం తీర్మానంతో   ఎనిమిది మంది సభ్యులుండే  టాస్క్‌ఫోర్సు ఏర్పాటయి  2016 డిసెంబరు 31 నాటికి నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తవాలని ఆదేశించడంతో 14 హిమాలయ నదులు, 16 ద్వీపకల్ప నదుల అనుసంధాన ప్రణాళిక సిద్ధమయింది.  
పర్యావరణ వేత్తల   నిరసనలుసామాజిక  శాస్త్రవేత్తల  భిన్న వాదనలు, గంగానదిలో తగినంత నీరుందో లేదో..  అధిక వ్యయ ప్రయాసలకోర్చి పథకం అమలు చేసినా ఆశించినంత  ఫలం చేకూరుతుందో లేదో అని  ఎన్నో గుంజాటనలు.  అధిక వ్యవసాయోత్పత్తికి, జల విద్యుత్ ఉత్పాదనకు, జలమార్గంలో రవాణాకు దోహదపడుతుంది కాబట్టి  నదుల అనుసంధానం అమలు సాంకేతికంగా లాభదాయకమేనన్న వాదన ఊపందుకున్న తరువాతే పథకాల్లో కదలిక మొదలయింది.
తాగు, సాగు నీటి కొరతకు చక్కటి పరిష్కారం  కాబట్టి పర్యావరణ సమస్యలను కొంత మేర పక్కకు పెట్టినా తప్పేముంది? గంగ- కావేరీ అనుసంధాన ప్రాజెక్టు మొత్తానికి మోదీ హయాంలోనే మొదలవడం ముదావహం. గంగలోతమ వాటా నీటికి  ఇప్పటికే కటకటగా ఉందని..  దేశం ఎడారిగా మారుతుందని బంగ్లాదేశ్ భయం. పథకం పట్టాలెక్కాలంటే  ఆ దేశం అనుమతి తప్పనిసరి.  కోసి, గండకి, కర్నాలి, మహాకాళిల వంటి గంగ ఉపనదుల నీటి తరలింపులకు  నేపాలు కొండ ప్రాంతాల్లో భారీ జలాశయాలు నిర్మాణాలు తప్పని సరి.  నేపాలు అందుకు ఒప్పుకోవాలి. గంగ- బ్రహ్మపుత్ర  అనుసంధానానికి కాలువల త్రవ్వాలి. బంగ్లా అందుకు అనుమతి ఇవ్వాలి.
జాతీయమైన చిక్కులూ తక్కువేమీ లేవు. నీటి హక్కులు కోల్పోయే   ఎగువ రాష్ట్రాలు సహజంగానే  అనుసంధానానికి అడ్డు. లాభ నష్టాలను బట్టి మధ్యనుండే రాష్ట్రాలు తమ వైఖరులను మార్చుకోవడం! ఒక్క దిగువునున్న రాష్ట్రాలకు మాత్రమే  నదుల అనుసంధానంలో ఆసక్తి జాస్తి. 
మహానది మిగులు జలాల నుంచి 230 శతకోటి ఘనపుటడుగుల(శ.కో.ఘ.) నీటిని చేర్చిమరి కొంత గోదావరి జలాలతో కలిపి మొత్తంగా 769 .కో.ఘనపుటడుగుల నీటిని గోదావరినుంచి..   కరవుతో అల్లాడే కృష్ణ, పెన్న, కావేరి, వైగా నదీ బేసిన్లకు మళ్లించాలన్నది జాతీయ జలవనరుల సంస్థ ప్రతిపాదనలలో ఒకటి. మహానదిలో మిగులు జలాలు లేవని ఒడిశా మొండి చెయ్యి చూపుస్తున్నది. ఎగువ  నీరు తరలి వస్తేనే గానీ  గోదావరి జలాలు దిగువకు వదిలేది లేదన్నది  ఆంధ్రప్రదేశ్‌ పట్టుదల..
15 ఏళ్లనాటి అంచనాల ప్రకారం రు. 5.60 లక్షల కోట్లు. ఆలస్యమయే కొద్దీ ఆ  వ్యయం తడిసి మోపెడవుతూనే ఉంటుంది.. జాతి భావి విశాల ప్రయోజనాల దృష్ట్యా పథకాలు  సత్వరం పట్టాలెక్కాలి కనక భా.. పా నే  కేంద్రంలో ఉంది కాబట్టి   రాష్ట్రాల్లోనూ అదే పార్టీ ప్రభుత్వాల్లో  ఉన్న   యు.పి.. ఎం.పి ల కు సంబంధించిన 'కెన్‌-బెత్వా నదుల అనుసంధానం' ముందుకు తెచ్చింది. ఆ పథకం పూర్తి చేసి  మిగతా ప్రాజెక్టులకు స్ఫూర్తి నివ్వాలని  ప్రధాని సంకల్పం. ఎవరితో సంబంధం లేదు కాబట్టి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్ళించే పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టి ఆంధ్రప్రదేశ్‌ దిగ్విజయంగా పూర్తిచేసింది. ఈ ఏడాది ఖరీఫ్‌ పంటకు కృష్ణా డెల్టాకు నీరంది రైతుల పంట తంటాలకు కొంతలో కొంతైనా పరిష్కారం దొరికింది.

అదే స్ఫూర్తి మిగతా అన్ని రాష్ట్రాలు మనస్ఫూర్తిగా ప్రదర్శిస్తే నదుల అనుసంధానం మరీ అంత అసాధ్యమయిన పథకం కాబోదు. . పర్యావరణం, విద్య, వైద్యం, తాగునీరు వంటివి  మౌలిక అవసరాలు, జలాశయాల నిర్మాణాల్లో నిర్వాసితుల తరలింపులు తప్పనప్పుడు.. ముందస్తుగానే వాటికి సంతృప్తికరమైన ప్రత్యామ్నాయాలు చూపించగలిగితే లేనిపోని న్యాయపరమైన చిక్కులతో వృథా కాలయాపన తప్పినట్లవుతుంది.
రాబోయే మూడు దశాబ్దాలలో ఇప్పటి జనాభా 167 కోట్లకు మించుతుందని ఓ అంచనా. అప్పటి నీటి సమస్యలకు ఇప్పటినుంచే పరిష్కారం వెదక్కబోతే తిప్పలు  తప్పవు. నదుల అనుసంధానం తప్పించి మరో సులభ పరిష్కారం కనిపించదు. అదీ అంత సులభంగా వగదిగే మార్గం కనిపించడం లేదు. ప్రపంచ జల వనరుల్లో నాలుగు శాతం గల భారత దేశానిది తన నదీ జల్లాలో కనీసం  రెండు శాతమైనా సద్వినియోగం చేసుకోలేని నిశ్చేష్టత్వం. నదుల అనుసంధాన  మహాక్రతువు నిష్టతో పూర్తి చేస్తే వరదల ముప్పునుంచి తప్పించడమే కాదు.. కరవు పీడిత ప్రాంతాలకు జల సిరులు వరంగా దక్కించినట్లవుతుంది. దశాబ్దం కిందటి నాటి ప్రధాని మానస పుత్రిక ఈ నదుల అనుసంధానం మహాయాగం. దస్త్రాలలో దుమ్ముకొట్టుకొనే ఈ భూరి భగీరథ పథకాలకు కనీసం మోదీ హయాంలోనైనా వెలుగు సోకితే సర్వ భారతావని సుజలాం సుఫలాంగా మారి తీరుతుంది.ఆహారం, విద్యుత్తు, తాగునీటి సమస్యలకు నదుల అనుసంధానమే ఏకైక పరిష్కారమని దాదాపు దేశంలొని నలభై చిల్లర మేధావులు నొక్కి చెబుతున్నప్పుడు.. మీన మేషాలు లెక్కించడం పొరపాటు. ఏ సందేహాలకైనా సమాధానాలు చెప్పేందుకు జలరంగ నిపుణులు  ముందుకొస్తున్నప్పుడు ఇంకా ఆలస్యం చేస్తే ఆ కాస్త అమృతం కూడా విషమయమయిపోదా?

భారత దేశంలో నదుల పట్ల ఉన్నంత  భక్తి గౌరవాలు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. ఋషులు, ఆధ్యాత్మిక చింతనాపరుల బోధనల ఫలితం ఇదంతా. ఏటా నదుల్లో మునిగే పుష్కర సంస్కృతి  వెనక ఉన్నది ఒక్క ఆధ్యాత్మిక  భావనే కాదు. కోట్లాదిమంది కుంభమేళావంటి  పుష్కర  ఘట్టాలలో కలబడి  పునీత స్నానాలు చేయడం వేరే సంస్కృతలవారికి ఎప్పటికీ అంతుబట్టని ఎనిమిదో వింత! తరాల  అభిరుచుల్లో ఎంతో మార్పు కనిపిస్తున్నా నదీ నదాల పట్ల చూపించే భక్తి ప్రవత్తుల్లో మాత్రం  కించిత్తయినా గౌరవ మర్యాదలు తగ్గకపోవడాన్ని ఎలా అన్వయించుకోవాలో తెలీక తలలు బాదుకునే  పాశ్చాత్యులు బోలెడంత మందున్నారు. వరదలొస్తే శాంతించమని పూజలు చేస్తాడు. కరువులొస్తే కరుణించమని ప్రార్థిస్తాడు భారతీయుడు. నదులను తల్లులుగా భావించి తమ ఉనికికి ఫలానా నదీ తీరాలు మూలాలని సమంత్ర పూర్వకంగా చెప్పుకొనే సంప్రదాయం భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా కనిపిస్తుంది.
హరప్పా నాగరికత సింధునదీ ప్రభావంతో ఏర్పడ్డది. గంగానదీ తటాకం పొడుగూతా వేద సంస్కృతి ఈ నాటికీ నిరాటంకంగా వర్ధిల్లుతోంది. ఆచార్య నాగార్జునుడు కృష్టానదీ తీరంలొ కొలువు తీరి ఉన్నప్పుడే బౌద్ధారాధనను ఓ సువ్యవస్థగా మార్చి విశ్వం నలుదిక్కులా ప్రచారం చేయించింది. పవిత్ర పుణ్యక్షేత్రాలు, పాలనాకేంద్రాలన్నీ దాదాపుగా నదీ తీరాల్లో వెలసిల్లినవే! యమునా నది వడ్దున హస్తిన, అడయార్, కూపమ్ నదుల తీరంలో చెన్నయి, మూసీ నది తటాకాన భాగ్యనగరి. అమరావతి వంటి  ఆధునిక రాజధాని నిర్మాణానికీ కృష్ణానదీ తటాకమే ప్రాతిపదిక అయింది. పౌరుల నిత్య జీవితావసరాల  నదులే ప్రధాన ఉపాధులయినప్పుడు ప్రజాస్వామ్య  ప్రభుత్వాల దృష్టీ  సహజంగానే వాటిమీద నుంచి పక్కకు మళ్లదు. అందుకే కేంద్రం గంగానది పారిశుద్యం..  రాష్ట్రాల హరిత దినోత్సవాలు! రెండు తెలుగు రాష్ట్రాల దృష్టి నీటి వనరులమీద నుంచి ఏ నాడూ పక్కకు మళ్ళడం లేదు.  తెలంగాణా ప్రభుత్వం చెరువుల ప్రక్షాళన, ఆంధ్ర ప్రదేశ్ అందుకొన్న జలరాశికి హారతి ఇందుకు ఉదాహరణ. పక్కా అధ్యాత్మిక కార్యక్రమంగా  జలరాశికి హారతి బైటికి కనపడుతున్నా..  ఆ పథకం వెనకున్నది వాస్తవానికి ప్రజా సంక్షేమ కాంక్షే!
నీరుంటే  చెట్లు కాదు. చెట్లుంటేనే నీరు. ఇప్పుడున్న అటవీ సంపదను రక్షించుకోవడంతో పాటు.. కొత్త అటవీ వాతావరణాన్ని సృష్టించుకొంటేనే పర్యావరణానికి నూతనోత్తేజం సిద్ధించేది. ఒక్క రోజులో కోట్లాది మొక్కలు నాటి కొత్త గిన్నీస్ రికార్డులు సృష్టించడం కన్నా.. నాటిన మొక్క ఏ మేకా మెక్కేయకుండా వృక్షంగా అభివృద్ధి అయే దాకా పరిరక్షణ చర్యలు చేపట్టినప్పుడే పర్యావరణానికి మళ్ళీ ప్రాణం పొసినట్లయేది. అడవులు పెరిగితే వర్షాలు పెరుగుతాయి. బక్క చిక్కిన జలాశయాలకు కొత్త కళలు వచ్చేస్తాయి.
ఉన్న   జల వనరులు వృథాగా ఉప్పు సముద్రాల పాలవకుండా పౌరులలోనే జల సంరక్షణ స్పృహను మరింత రగిలించవలసిన తరుణం ఆసన్నమయింది. నదులు కలుషితం కాకుండా కఠిన చర్యలు కావాలి. పరిశ్రామిక వ్యర్థాలు నదుల్లోకి వదలకుండా తగిన నిఘా అవసరం. ఇప్పటికే కలుషితమైన జలాలను ప్రక్షాళించే కార్యక్రమాలు మరింత చిత్తశుద్ధితో ముందుకు సాగాలి. నదీ తటాకాలు అక్రమాక్రమణలకు  గురి కాకుండా రక్షించాలి.  విచక్షణారహిత జలవినియోగానికి అడ్డుకట్ట పడాల్సుంది. నదీ ప్రవాహాల సహజ మార్గాలు మళ్లింపుకు గురికాకుండా చూడడం చాలా ముఖ్యం.
భవిష్యత్  అవసరాల దృష్ట్యా నీటి పరిరక్షణ ప్రధాన  బాధ్యతగా  పాలకులంతా గుర్తిస్తున్న వేళ నదుల అనుసంధానం  క్రమంగా ఊపందుకోవడం ముదావహం. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు  జలవనరుల  పరిరక్షణ  విషయంలో నిరంతరం జాగరూకతతో పలుసంక్షేమ పథకాలకు శ్రికారం చుట్టడం పర్యావరణవేత్తల ప్రశంసలూ అందుకొంటున్నది. ఇటీవలే రెండు రాష్ట్రాలలో మొక్కలు నాటే వివిధ పథకాలు ముమ్మరమవడం గమనార్హం. నదుల అనుసంధానంలో భాగంగా అతి తక్కువ కాలంలో  గోదావరి నదీజలాలను పట్టిసీమకు మళ్లించి కొత్త రికార్డు సృష్టించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది.  తెలంగాణా అంతటా చెరువుల మరమ్మత్తులు మునుపెన్నడూ లేనంత ఉద్యమ దీక్షతో కొనసాగడమూ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్రావు ముందుచూపు పర్యావరణ పరిరక్షణ చర్య.
జలసిరికి హారతి
నదుల అనుసంధానం, చెరువులు బావుల తవ్వకాలతో సరిపెట్టకుండా.. నీటికీ ప్రజలకూ మధ్య గల ఆధ్యాత్మిక అనుబంధాన్నీ పునరిద్ధరించే ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మొదలయ్యాయి. గంగానదికి వారణాశి, హరిద్వార్లలో పట్టే రీతిలో.. గోదావరికి రాజమండ్రిలో, కృష్ణమ్మ తల్లికి విజయవాడ ఇబ్రహీంపట్నంలో నిత్య హారతులు పట్టే ఆధ్యాత్మక పథకమొకటి ఈ మధ్యనే మొదలయింది. కేవలం జీవనదులుగా భావించే కృష్ణా గోదావరులకే కాకుండా.. జనజీవనానికి అమృత పానీయం అందించే జల వనరులు చెరువులు, బావులు, వాగులు, వంకలు.. చిన్నవా.. పెద్దవా అన్న బేధం లేకుండా అన్నింటికీ నిత్య హారతులు అందించాలన్న చంద్రబాబు వినూత్న ప్రయోగం స్వఛ్చమైన మనసున్న వారంతా తప్పక స్వాగతించాలి. నదంటే ఓ నీటి ప్రవాహం. నీరు  దేవత ఎలా అవుతుంది? అని వాదించే వ్యక్తిని మూడు  రోజుల పాటు ఓ నిర్జల స్థలంలో ఉంచి  నాలుగో పూట  గుక్కెడు నీరు అందించండి!  నదికి కాదు .. ముందా లోటా నీటికి నమస్కరిస్తాడు. తాగే నీరే కాదు, పీల్చే గాలితినే తిండి వాదనకు కేవలం బౌతిక రూపాలే కావచ్చు కాని .. వాస్తవంలో అవి జీవి ప్రాణదీపం ఆరిపోకుండా అడ్డుపడే దైవిక హస్తాలు! బతుకు ఇచ్చినందుకు, బతకనిస్తున్నందుకు, బతికున్నంత కాలం బాగోగులు చూసుకొంటున్నందుకు కన్నవారంటే గౌరవాభిమానాలు కనబరుస్తున్నప్పుడు.. ఆ వాత్సల్యమే చవి చూపించే ప్రకృతి శక్తుల పట్లా  కృతజ్ఞత చూపించడం మూర్ఖత్వం ఎట్లా అవుతుంది? నదులకు హారతులు ఇవ్వడం ఇవాళే కొత్తగా పుట్టుకొచ్చిన సంప్రదాయం కాదు. పాప ప్రక్షాళన జరుగుతుందన్న ఆశతోనే కదా భగవంతుడి ముందు భక్తితో మోకరిల్లేది. నదిదీ దైవ స్వభావమే. ఎంత మురికి వదిలినా  కిమ్మనదు. ఎవరు తన ఒడికి చేరబోయినా 'వద్దు.. పొమ్మన'దు. దైవత్వానికి ఇంతకన్నా మెరుగైన ఔదార్యమేముంది? దేవతా మూర్తులకు హారతులు పట్టటంలో లేని అభ్యంతరం జలరాశికి హారతులు పట్టడంలో ఎందుకు చూపెట్టడం?
పైకి పూజా విధానంగా  అనిపించే ఈ నిత్యారాధన వెనక లోతైన సంక్షేమ ఆలోచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. జలవనరుల కలుషితానికి జనంలో భయం కలగజేయడం ఈ పూజా పునస్కారాల వెనకున్న అసలైన ఆంతర్యం. కాలుష్యాలు, మానవ విసర్జితాలు, చెత్తా చెదారం నిర్లక్ష్యంగా  వదిలే జనం దుర్లక్షణానికి దైవంగా భావించే జలవనరులను దూరంగా ఉంచాలన్నదే ఈ ప్రయత్నం వెనకున్న సంక్షేమ భావం. ఎంత వరకు సఫలీకృతమవుతుందో ముందు ముందు చూడాల్సుంది. ఆసాంతం విజయవంత అవకపోయినా.. కొంతలో కొంత  సత్ఫలితాలను ఇచ్చినా 'జలసిరికి హారతి' లక్ష్యం సక్రమంగా నెరవేరినట్లే!.  ప్రభుత్వాలు  ఆచరించే జలకాలుష్య నివారణ చర్యలకు ఒక మంచి వాతావారణం జనంనుంచి రాబట్టడానికి  మించి  జలహారతి ప్రసాదించే  మంచి ఫలితం ఏముంటుంది?
--కర్లపాలెం హనుమంతరావు
(చిత్రాలు-motivateme.in- సౌజన్యంతో- దన్యవాదాలతో)
(ఆంధ్రప్రభ, దిన పత్రిక 23-09-2017 నాటి సంపాదకీయ పుట వ్యాసం)




మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...