గమనికః వచన కవిత-ఒక అలోచన అన్న ‘కవిసంగమం’లోని నా
పోస్ట్ కి స్పందిస్తూ భాస్కర్ కొండారెడ్డి
గారు ఫ్రీవెర్స్ ను గురించి మరికాస్త వివరించమని
సూచించారు.విజ్ఞుల సలహాలెప్పుడూ శిరొధార్యమే.స్థలాభావాన్ని,చదువరుల సమయవిలువను దృష్టిలో పెట్టుకుని ఒక పది వాక్యాలలో
మరి కొంత వివరణను ఇక్కడ జత చేసే ప్రయత్నం చేసాను. Academic
Discussionలో విషయావగాహనకు స్పందన, ప్రతిస్పందనలు అవసరమే. ముందుముందు కూడా సందేహాలకి
నాపరిమితిలో సమాధానాలు ఇచ్చే బాధ్యతను గుర్తుంచుకుంటాను. భాస్కర్ గారికి ధన్యవాదాలు
ఫ్రీవర్స్ అంటే సూటి అర్థం చందస్సు నుంచీ విడివడ్డదని.
బైబిల్ కి జాన్ విక్లిఫ్ చేసిన అనువాదాల్లో దీని తొలిరూపం ఉందనే ఒక అభిప్రాయం
ఉంది. యూరోప్ లో వచ్చిన మతసంస్కరణోద్యమాలకీ ఈ ఫ్రీవెర్స్ కీ సంబంధముంది. అక్కడ
మతసంస్కరణలూ
బూర్జువాజి ఒకే సారి వచ్చాయి.రెండూ వ్యక్తివాదాన్ని బలపరిచే
మార్గాలే. ఫ్రీవెర్స్ కూడా వ్యక్తినిష్ఠను నొక్కి చెప్పేది అని మనకు తెలుసు.
బైబిల్నుంచీ హీబ్రూ కవిత్వం నుంచీ వాల్ట్ విట్మన్ లాంటి వాళ్ళు ప్రభావితం
అయ్యారు.ఇవాళ మనం వచన కవితగా భావించే రూపానికి వాల్ట్ విట్మన్ పితామహుడుగా
భావించినా తప్పు కాదేమో!
రాజకీయంగా, మతపరంగా
అవ్యవస్థ, అనిశ్చితి ఉన్నప్పుడు పాత వ్యవస్థలు కూలిపోవాలని, కొత్తరూపాలు స్థిరపడాలని జనసామాన్యం కోరుకోవడం సహజమే.
కవిత్వంలో కూడా అదే జరిగిందనుకుంటాను. సంప్రదాయ కవితనుంచీ, నియమనిబంధనల మధ్య నలిగే కవిత్వానికి సంపూర్ణ స్వేచ్చ
కల్పించాలన్న కాంక్ష నుంచే తెలుగునాటా 1930ల దశకంలో ఇప్పటి వచన కవిత తొలిరూపం పుట్టినట్లు విమర్శకులు
భావిస్తున్నారు. ప్రపంచ సాహిత్యాన్ని అప్పటికే విపరీతంగా ప్రభావితం చేసిన
ఫ్రీవెర్స్ రూపమే సహజంగా మన తెలుగుకవిత్వాన్ని ప్రభావితం చేసిందనుకోవాలి.
ముద్దుకృష్ణ జ్వాల తొలి సంచికలో వచనకవితావాదాన్ని స్పష్టమైన
గొంతుతోనే వినిపించే ప్రయత్నం చేశాడు.”ప్రపంచం ఒక ఇల్లుగా, మానవజాతి ఒక కుటుంబంగా మారిపోయే రోజులు వస్తున్నవి. హిందూ
సమాజంకూడా కదిలింది. నూతన సత్యాన్ని, నీతిని అంగీకరిస్తున్నది.ధర్మాలలో, సంఘంలో, భాషలో, భావంలో మార్పు తప్పదు.దీనికి అడ్డు వీల్లేదు. వచ్చినా ఆగదు.
నచ్చని పాతబంధాలను తెంపివేయడానికి ఎంతైనా సాహసిస్తాము.నచ్చిన కొత్తదనానికి
దూకుతాము.సర్వమతాలని అంగీకరిస్తాము.మాకు మతం లేదు.జాతి లేదు.వర్ణం లేదు.
ఆడవాళ్ళిందుకూ…మగవాళ్ళందుకూ అనే బేధం లేదు.యువకులు ఉద్రేకంతో ఏది తెచ్చినా దాన్నే
ప్రచారంలో పెడతాము.ఉన్నది ఉన్నట్టు అంగీకరించి నిర్జీవంగా తుప్పు పట్టడంకన్నా
నష్టం కలిగించినా సాహసించి ఏదో యత్నించి జీవించడం ఉత్తమం” ఫ్రీవెర్స్ ప్రాదుర్బావం
మూలాలు కూడా సరిగ్గా ఇవే కావడం మనం గమనించాలి.
చందోనియమాలనుండి విడివడటమొక్కటే వచనకవిత లక్షణం అనుకుంటే
పప్పులో కాలేసినట్లే.నన్నయగారి నాటినుంచీ మనకు వచనంతో పరిచయం ఉంది.మన ప్రాచీన
కావ్యాలు చాలావరకూ చంపూ కావ్యాలే.పద్యగద్య మిశ్రితాలు. పద్యాలకు పద్యాలకు మధ్య
వచనమే వచ్చేది. ఆశ్వాసాంతాలలో గద్యమే ఉండేది.వామనుడు లాంటి సంస్కృత లాక్షణికులు
వచనాన్ని వృత్థగంధి, చూర్ణిక, ఉత్కళికగా విభజించడం గమనించాలి. కృష్ణమాచార్యుల ‘సింహగిరి
వచనాలకి, పెదతిరుమలాచార్య వెంకటేశ్వర వచనాలకి ఇవాళ మనం రాసే వచనకవితా రూపానికి పోలిక
లేనేలేదు. రూపం, భాష, భావం, ఫిలాసఫీ, ప్రయోగం, ప్రయో
జనం..ఏదృష్టితో చూసినా రెండింటి దారులు వేరు వేరు.ఇవాళ మనం వాడుతున్న వచనకవితకు
మూలాలు కచ్చితంగా పాశ్చాత్య సాహిత్యంలోనే ఉన్నాయి.ఆ మూలం పేరే ఫ్రీవెర్స్. చందస్సు, మాత్రాగణాలు,
గ్రంధభాష,
గ్రంధవ్యాకరణం…లాంటి ఏ నియమనిబంధనలకూ ఒదగాలని
చూడకుండా అనుభూతిని యథాతధంగా హృదయం ఎలా కంపిస్తే అలా కవిత్వం పాలు తగ్గకుండా
వ్యక్టీకరించడంగా వచనకవిత ఫిలాసఫీని చెప్పుకోవచ్చు.ఈ లక్షణాలన్నీ వున్నకవితారూపం
పేరే ఫ్రీవెర్స్. ఎజ్రాపుండ్, విలియం కార్గోస్, విలియమ్స్ రాసినట్లే
దాని అధునాతన సానపెట్టిన రూపాన్ని ఇవాళ
మన హెచ్చార్కె, దర్భశయనం, శిఖామణి, అఫ్సర్, విమల, స్కైబాబా,ఎండ్లూరి వంటి ఎందరో
వాడుతున్నారు-
-కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment