పగలు రాత్రికి ప్రతిద్వని
బొంది జీవితంవైతరణిని దాటించే డింగీ
ఆకలి కబళానికి ఆహారం
నీటిబొట్టు దాహం ప్రాణం
మరో బాల్యంతో ఆడుకోవాలంటే
ముదిమి డొంకనబడి ఈదాల్సిందే
ఏమీ లేదని తెలియడానికి ఎన్నెన్ని చదువుకోవాలీ!
భ్రమానుభవానికి ప్రేమే దొడ్డిదారి
కేరింతల సెలయేళ్ళన్నీ ఆఖరికి కలిసేది
కన్నీటి సముద్రంలోనే
ముళ్ళంటే
వాడి రాలిన పూల ఆనవాళ్ళే సుమా!
చరణాలమీదనుంచే
పాట
రాగాలతీగనల్లుకుంటో
పల్లవినంటుకునేది
ఆకాశాన గిరిటీలు కొట్టటానిక్కాదు
చెట్టుకొమ్మను శోధించడానికి
పక్షికి రెక్కలు
షడ్జమంనుంచీ
పల్లానికి పారితేనే
సప్తస్వరాలు
సత్యమైన నిశ్శబ్దంగా గడ్డకట్టేది
పరుగుపందెం ముందు వరసపాదాల
ద్యాసంతా ఆ చివరి అంచె నిశ్చలత్వం మీదే
ఔనా..కాదా!
ఏకవినైనా అడగండి
స్వస్తి పూర్తి తరువాతే
శీర్షిక పైన దృష్టి పెట్టేది
ప్రకృతిదీ అదే మిలోమ పద్ధతి
చివరికణంలో సైతం
విజయవంతంగా
జీవం నింపిందాకా
గడ్డిపూవునైనా
భూతలం మీదకు వదలదు
అంతమనేది లేకపోతే ఆదికి ఉనికేది!
పసిపిల్లల్ని చూడరాదూ
మెట్లేక్కే హుషారంతా
జారుడుబండమీది మోజుతోనే కదా!
ఆ మట్టితినే బాల్యంలో
మళ్ళీ మనం మేలుకోవాలంటే
శిఖరాలెక్కుతున్నప్పుడూ
లోయల్లోనే లీనమవాలి
మెట్టవేదాంతం కాదు
ఆకాశంమట్టివేదాంతాన్ని
వంటబట్టించుకొంటేనే
లోకాస్సర్వే సుఖినో భవన్తు
-కర్లపాలెం హనుమంత రావు
14-11-2012
No comments:
Post a Comment