Saturday, November 7, 2015

ఎండ్లూరి సుధాకర్‌ దీర్ఘకవిత ‘గోసంగి’- ఒక చిరు పరామర్శ-

కృష్ణదేవరాయల వారి పంచశత వార్షికోత్సవాల సందర్భాన్ని  పురస్కరించుకొని ఎండ్లూరి సుధాకర్‌  దీర్ఘకవిత ‘గోసంగి’ లోని కొన్ని పాదాలు ఇవి.విందు భోజనం ముందు విస్తరిలో వడ్డించే వంటకాల మచ్చుతునకలు లాంటివి. షడ్రశోపేతమైన భోజనానుభవం కావాలనుకునే వారు దీర్ఘకవితను చదువుకోవాల్సిందే!
శ్రీకృష్ణ దేవరాయలు  ‘ఆముక్తమాల్యద’  ఆరవ ఆశ్వాసంలో ‘గోసంగి’ కులాన్నిప్రస్తావించాడు. ‘మహాత్మా’ అని అతడు సంబోధించిన మాలదాసరి గోసంగే అని కవి భావన.  మంగళ కైశికీ రాగాన్ని ఆలపిస్తూ విష్ణుమూర్తిని నిష్ఠగా కొలిచే ఆ పరమభక్తుడు… ఓరోజు అడవిలో కీర్తనలు పాడుకుంటూ వెళ్ళి ఒక బ్రహ్మరాక్షసుడి పాలబడతాడు.  దేహాన్ని కాకుండా  సంగీత పుణ్యఫలాన్ని ఆ బ్రహ్మరాక్షసుడు దానంగా కోరుకొనే కథ అది. రాయలు అంత గొప్పగా కథ రాసినా ఏ దళిత గాయకుడికి…తన ఆస్థానంలో మాత్రం  స్థానం కల్పించలేదని కవి  సుధాకర్‌ ఫిర్యాదు.
రాయలువారు వరాహపురాణం కథను ఇక్కడ వాడుకోవడంలోని   పరమార్థం వేరు.  హీనకులజుడైనా  హరికీర్తన చేసి విష్ణుశరణాగతి పొందితే అతను అన్ని కులాలవారి కన్నా అధికుడే అవుతాడన్న విష్ణుతత్త్వాన్ని  ప్రచారంచేయడానికి ఉద్దేశించిన కథ ఇది. ‘శ్వపచోపి మహీపాల విష్ణుభక్తో ద్విజాధికః, విష్ణుభక్తి విహీనస్తు ద్విజోపి శ్వపచాధమః’ అనే  తత్త్వాన్ని  రామానుజ మతమూ ప్రచారం  చేసింది
దాసరిని ‘మహాత్మా’ అని రాయలు సంబోధించడంలోని రహస్యం ఇదే.
వాస్తవంలో మాత్రం  ఏ మతంలో చేరినా దళితుడు  తన  హీనకుల ముద్రని పోగొట్టుకోలేకపోయాడు. విచిత్రంగా ఆ మతాలలోనే కొత్తకులాలు పుట్టుకొచ్చాయి. ఇది ఆ చర్చకు సందర్భం కాదు.
ఇక ఈ కవిత విషయానికొస్తే…గోసంగి గురించి రాసినట్లనిపించినా, లోలోన మాత్రం దళితుల్లో అణగారిపోతున్న బలహీనుల ప్రాభవాన్ని ఎత్తిచూపాలనే ఎండ్లూరి తపన పడుతున్నట్లు తెలుస్తుంటుంది. భావాలూ, అవేదనా తీవ్రంగా ఉంటే ఉండవచ్చు అంతే తీవ్రస్థాయిలో వాటిని ఎద లోతుల్లోంచి పైకి తోడి  అక్షరసముద్రాన్ని సృష్టించడం బలమైన అభివ్యక్తి ఉన్నప్పుడే సాధ్యం. దళితజనోద్ధరణ కోసం నడుంకట్టిన కవుల దృష్టి, అవగాహన ఎంత పదునుగా పరిణితితో ఉండాలో ఎండ్లూరి…గోసంగి కవిత ద్వారా ప్రదర్శించి చూపాడనిపిస్తుంది.
బడుగు జీవుల కళా వైదుష్యం గురించి కవులు, రచయితలు, మేధావులు ఎంతగా అభిమానపడాలో అంతగానూ  అభిమాన పడినప్పుడే ఇంత బలమైన కవిత బయటికి పొంగి రాగలుగుతుంది.
మహా కావ్యానికి తీసిపోని ముప్పయి పేజీల కవితామాలిక ఇది. దళిత బాధ ప్రతిఅక్షరంలో ప్రజ్వలిస్తో కనిపిస్తుంది. అర్ధ సహస్రాబ్ధం నాటి అతిదళితవ్యక్తి సిసలైన వ్యథ అసలైన చరిత్రలోకి సక్రమంగా చేరలేదన్న కవి దుఃఖం ప్రతిశబ్దంలోనూ ప్రతిద్వనిస్తుంది. ఒక వర్గం దళితుల  అస్తిత్వాన్నీ గుర్తించి గౌరవించాలన్న భావనతో నడిచిన కావ్యమైనా ఇందులోని తాత్త్వికత మాత్రం కవిత్వ సూత్రాన్నిఎక్కడా వదలక పోవడమే ఈ కవితకు  కావ్యగౌరవం తెచ్చిపెట్టింది. గోసంగుల పచ్చిగాయాలను ఎత్తి చూపిస్తూనే…  ఇతర ఉప కులాల వారి కళాప్రతిభను గుండెకు గుచ్చుకునేలా కథనం చేసి… కవికి ఉండవలసిన సార్వజనీనమైన ప్రేమదృష్టిని ప్రదర్శించారు సుధాకర్. రాయల పట్టాభిషేక మహోత్సవంసందర్భం ఒక మిష.  ఈ కావ్య సృష్టికున్న మరొక కోణాన్ని మనం గుర్తించాల్సి ఉంది.  శతాబ్దాలుగా  మానని అమానవీయ  దళిత అస్తిత్వగాయాల వెనక  ఎంత కళావైభవం మరుగున పడి ఉందో చెప్పడమే కవి లక్ష్యంగా  కనిపిస్తోంది.  గోసంగి కథ వినడానికి అర్ద్రత కావాలని కవి అన్నారు కానీ… అలఅలలో హోరు వినిపించే  ఈసముద్ర ఘోష ఎంత కుంభకర్ణుడినైనా ప్రశాంతంగా ఉండసిస్తుందా! ఆముక్తమాల్యద కథలో గోసంగి బ్రహ్మ రాక్షసునికి ముందు లొంగలేదు. రాక్షసుడికి ఎదురుతిరిగి  ముష్టియుద్దానికి దిగిన వీరుడు అతను.చివరికి కిరాతకుడి హృదయాన్ని గెలుచుకుంటాడు.సుధాకర్ ‘గోసంగి’ కూడా  ముందు సంఘంతో వివాదానికే తలబడినట్లనిపించినా అత్యున్నతమైన నిజమైన ఆర్తి, ఆర్ద్రతలతో సమ్మిశ్రితమైన తన ఆత్మగౌరవకాంక్షతో సమాజరాక్షసుడి పాషాణ హృదయాన్ని వశం చేసుకుంటాడు. చేసుకున్నాడు కూడా.
అంటరానితనం అనే ఒక సాంఘిక దురాచారాన్ని చారిత్రకంగా తర్కించి రాయడానికి ఒక కవి  ఒకానొక ప్రాచీన సందర్భాన్ని ఎంత ప్రతిభావంతమైన పరికరంగా ఉపయోగించుకున్నాడో ప్రదర్శించి ఔత్సాహిక  కవులకు ఒక మార్గసూచిగా పరిచయం చేయడమే ఈ చిన్న పరామర్శ లక్ష్యం.

పూర్తికవితను శ్రద్ధగా అధ్యయనం చేయగలిగితే కొత్తకవులు  తమ కవితాశిల్పానికి, సామాజిక లక్ష్యాలకీ మరిన్నిస్పష్టమైన  మెరుగులు దిద్దుకునే అవకాశం మెండుగా ఉంది.
ఎండ్లూరి సుధాకర్‌  దీర్ఘకవిత ‘గోసంగి’లోని కొన్ని భాగాలు ఇక్కడ చదువుకోవచ్చుః


యండ్లూరి సుదాకర్
ఒక విషాద శతాబ్దంలో జీవించినవాణ్ణి
ఒక అంధకార యుగంలో
అస్పృశ్యతను అనుభవించినవాణ్ణి
పేర్కొనడానికి
వీలులేని కులంలో పుట్టినవాణ్ణి
ముట్టుకోవడానికి ఇష్టపడని మురికి జలాన్ని
ఐదువందల సంవత్సరాలుగా
హైందవ లోక అవమానితుణ్ణి
***
 నేను గొడారి గోసంగిని
నన్నే పేరుతో పిలిస్తేనేం
నా దేహానికీ
దేవాలయానికీ మధ్యన
అంటు గోడలున్నంత కాలం
నేను పదహారో శతాబ్దపు పీడకలని
***
 నన్ను గుర్తుపట్టలేదా కృష్ణరాయా!
నేనయ్యా దాసరి మాలను
మంగళ కైశికీ రాగవేదిక మీద
నర్తించిన సింహ క్ష్వేళను
నేను ప్రభూ! చర్మకారుణ్ణి
భూదిగంతరాల ప్రతిధ్వనించిన
జంబూద్వీప ఆది స్వరాన్ని
శ్రీరంగధాముని ముందు
 సంగీత స్వర సముద్ర ఘోషని
మంగళ కైశికీరాగ గోసంగిని
***
నా కన్నీటి లందలో నేనే చర్మాన్ని
మనువు కట్టిన బొందలో మగ్గుతున్న ధర్మాన్ని!
***
నీళ్లు
మమ్మల్ని చూసినప్పుడల్లా
కన్నీళ్లు పెట్టుకునేవి…
నీటికి మతమున్న దేశంలో
మేము పుట్టడం నేటికీ గొప్ప విషాదం
***
ఇవి కల్పనా కథలు కావు
మా కన్నీటి గాధలు
అడగండి గోదావరిని
ఆరా తీయండి కావేరిని

కవిలె కట్టలు వెలికితీసి
చీకటి చరిత్ర పుటలు విప్పండి
***
నాలో ఆగమ జ్ఞాన నిధులు లేవు
నాకు వేదవేదాంగ శ్లోకాలు రావు
బ్రహ్మీదత్తవర ప్రసాదుడ కాను
చాత్తాద వైష్ణవ చారు దత్తుడను కాను
బ్రహ్మ కూడా నన్ను చూసి
ముఖం తిప్పుకున్నాడేమో!
నా తల రాతలు లేవు
నా తాతల గీతలూ లేవు
***
కాటికి దగ్గరలోనే నా కాపురం
శివుడు మా పక్కింటివాడు
మా డప్పుకు ఢమరుకం గొంతు కలిపేది
మా చిందుకు శివతాండవం కాలు కదిపేది…
 మా డప్పు విన్నాడా
శివుడు చిందేయాల్సిందే!
మా చెప్పు కొన్నాడా
కుబేరుడు పాదాభివందనం చేయాల్సిందే!
మా కిన్నెర మోత విన్నాడా
నారద మహర్షి మహతిని మర్చిపోవాల్సిందే!
మా గోంగూర మాంసం తిన్నాడా
ఇంద్రుడు ఇంటి భోజనం విడిచిపెట్టాల్సిందే!
మా పెద్దింటి స్త్రీలు పెట్టే
లచ్చించారు రుచి చూశాడా
విష్ణుమూర్తి పాలకడలి విడిచి
మా కూర చట్టి తెచ్చుకోవాల్సిందే!
మా గోరోజన విద్య తెలుసుకున్నాడా
అపర ధన్వంతరి మా దారికి రావాల్సిందే!
మా వాడ తెలుగు చెవిన బడితే
కృష్ణరాయలు మా వూరికి రావల్సిందే!…

అశ్వినీ దేవతలు ఆకాశంలో నిలిచి
తెల్లారి మా పల్లె పాటలు వినిపోయేవారు…
మా బోనాలూ
మా యక్ష గానాలూ
మా గోసంగి పురాణాలూ
రేణుకాదేవి కథలూ
మెట్ల కిన్నెర మోతలూ
జాతి మెచ్చిన జాజర పాటలూ
ఆరు బయట ఆరంజోతి ముచ్చట్లూ
పున్నమి చంద్రుడు కూడా వింటూ
పులకించి పోయేవాడు…
మా పంబల పాటలకు
రత్న కంబళ్లు విప్పేసి
ఆ రంభలు కూడా
ప్రారంభ గీతాలు పాడేందుకు
మా పేటలకు రావాల్సిందే!
***
వెన్నెల
కన్నుల నీరు నింపుకుని
నా వాడ మీద
నా వాళ్ల మీద
దీనంగా కురుస్తున్నట్టున్నది
***
కృష్ణరాయా!
కీర్తి కాయా!
నీ భువన విజయంలో
నా కవనం కనబడుతుందా?…
అష్టాదశ వర్ణనల్లో
అస్పృశ్య వర్ణం నిషిద్ధం
కవిలోక కావ్యాల్లో
వాడ నాయకుడు నిషిద్ధం…
***
నీ భువన విజయంలో మేం కాలు మోపివుంటే
అష్టదిగ్గజాలేం కర్మ
వేల దిగ్గజాలు గండపెండేరాలతో ఘల్లుమనేవి
***
వాల్మీకి తెలియదు
వాత్సాయనుడు తెలియదు
కాళిదాసును చదవలేదు
కొక్కోక శాస్త్రం చూడలేదు
వాడ తప్ప
వర్ణమాల తెలియనివాణ్ణి
బతుకు తప్ప
భారతం చదవనివాణ్ణి
నేను చూసిందల్లా
కాగిన సీసం పోసిన చెవుల్ని
తెగిన రక్తపు నాలుకల్ని
***
భయపడకుండా
బ్రహ్మరాక్షసి దగ్గరకు
నేను తప్ప మరెవ్వరు వెళ్లగలరు?…
బ్రహ్మరాక్షసికి నేను భయపడలేదు గానీ
కుల రాక్షసి దెబ్బకు కుంగి పోయాను
***
లేవు చందన లేప సుగంధాలు
లేవు నారాయణ దివ్య ప్రబంధాలు
లేవు నిరుపహతి స్థలాలు
లేవు నిర్మల తీర్థజలాలు
లేవు నా బతుకున ఆనందగీతికలు
లేవు నా చుట్టూ రమణీప్రియ దూతికలు
నా నలువైపులా అస్పృశ్య గీతికలు…
మంగళ కైశికీ రాగాలతో రాళ్లు కరిగించి
నా మనసు గంగడోలును నిమురుకున్నాను
నా అస్పృశ్య ఆత్మవనంలో
ప్రేమ ధేనువును దయగా పెంచుకున్నాను
***
ఎన్నిసార్లు నేను
కుక్క తిండి తిన్నానో!
 ఎన్నిసార్లు నేను
పస్తులు పడుకున్నానో!…
ఆకలి తపస్సు చేస్తుంటాను…
కృపయా భోక్తవ్య’మంటూ
నన్ను సహపంక్తికి పిలవలేదు…
***
కృష్ణరాయా!
నిన్నిప్పుడు ప్రశ్నవేయ
సముచితమో కాదో గానీ
నీ కీర్తి కిరీటంలోని కలికి తురాయి
అంటరానిదేనని గుర్తించలేకపోయాను…
జోహార్! మూరురాయరగండ
నీ వైపే చూస్తున్నది
నీవు జయించలేకపోయిన
అంటరాని కొండ
***
అక్షరాలా ఐదు వందల గాయాల
చరిత్రనయ్యాను
కృష్ణరాయా! వండిన అన్నమూ ఉండదు
చచ్చిన పీనుగూ ఉండదు
ఉన్నదంతా మంచి చెడ్డలే
ఉత్త మట్టి గడ్డలే! …
***
For further enlightenment:
Amar Biswas: Essence of Dalit Literature
Dalit woman and child. Image courtesy- allvoices.com
In a few words ‘Dalit Literature’ can be defined as the literature created from dalit-consciousness. When the very realisation of the existence of exploitation in the society prompts the exploited to depict and capture their sufferings and exploitations in the form of a literature, it becomes Dalit-Literature. Putting it in a different way it may be said that Dalit-Literature is the product of the contemporary Hindu social order characterised by division of the society into certain vertical divisions in the form of age-old hierarchical caste system.
Dalits, the people living at the lowest stratum of the social hierarchy have observed with great shock and pain that they are hated, neglected, exploited and oppressed by the people of the upper strata for no fault on their part and the so-called upper-caste people are interested in preserving and perpetuating the existing heirarchical Caste system for obvious reasons. The Dalits, therefore, started a silent revolution through their writings aimed at capturing the ills and evils of the society viz. social discriminations, injustice, exploitations, oppressions etc. which they are constantly subjected to in the hands of the people living at the upper strata of the society.
-కర్లపాలెం హనుమంతరావు


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...