Monday, February 8, 2021

రామాయణం- ఒకే కవి విరచితమేనా? -కర్లపాలెం హనుమంతరావు



యావత్ స్థాస్యంతి గిరయః- సరిత శ్చ మహీతలే/తావద్ రామాయణ కథా- లోకేషు ప్రచరిష్యతి (బాల కాండ 2.36)’. మహీతలంపై ఎంత వరకు గిరులు, సరులు ఉంటాయో అంత వరకు లోకాల్లో రామాయణగాథ ప్రచారం జరుగుతుంద’ని వాల్మీకి రామాయణాన్ని ఆశీర్వదిస్తూ బ్రహ్మ అన్న మాట.  బ్రహ్మవాక్కు అనలేము కానీ..  రామాయణం అంత గాఢంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కావ్యం మరొకటి లేదు.  ఎన్నో భాషల్లో, కళాప్రక్రియల్లో  తీర్చిదిద్దిన కథ ఆదికావ్యం రామాయణంలోనిది.  పండితులను.. పామరులను, ఆస్తికులను.. నాస్తికులను    ఆకర్షించే గుణం రామాయణంలో ఉంది.

వేలాదిమంది బలశాలులు ఆయాసపడుతూ నెట్టుకొచ్చిన శివధనుస్సును బాలరాముడు సునాయాసంగా  విరవడంలాంటి అతిమానుష  సన్నివేశాలు రామాయణం నిండా ఎన్నో ఉన్నాయి. చిన్నతనంలో అవి ఆశ్చర్యానందాలను కలిగిస్తే.. ఎదిగే కొద్దీ రామచంద్రుని  మర్యాద పాలన, లక్ష్మణస్వామి సోదరప్రేమ, భరతుని త్యాగబుద్ధి, ఆంజనేయుని దాసభక్తి, సీతమ్మతల్లి పతిభక్తి వంటి సద్గుణాలు ఆకర్షిస్తాయి. వివేచనకొద్దీ ఆలోచనలు రేకెత్తించే సామాజికాంశాలు    దండిగా ఉండబట్టే రామాయణం ఒక చారిత్రక పరిశోధనాపత్రం.. ఆధ్యాత్మిక పరిచయ పత్రికను మించి  చర్చనీయమయింది. 

 

శతాబ్దాల బట్టి లెక్కలేనంత మంది సృజనశీలులు   చెయిచేసుకున్న కథ  రామాయణం. ఆ కారణంగా  భిన్నరూపాలు అనేకం ఓ క్రమం లేకుండా మూలంలో నిక్షిప్తమవడం సహజ పరిణామం.

అయితే వాల్మీకం పేరుతో ప్రచారంలో గల కథ దేశమంతటా ఒకే విధంగా లేదు. వాల్మీకి  రామాయణంలోని అన్ని భాగాలూ ఒకే కవి (వాల్మీకి) విరచితాలని కూడా గట్టిగా చెప్పేందుకు లేదు. ఒక కవి పుట్టించిన కావ్యం మరో కవి గంటంలో పెరిగి తదనంతర కాలంలో మరంతమంది కవుల  ప్రక్షిప్తాల హంగుల్ని సంతరించుకున్నదన్న వాదన ఒకటి బలంగా ప్రచారంలో ఉంది.  

‘నారదస్య తు తద్వాక్యం/ శ్రుత్వా వాక్య విశారదః/ పూజయామాన ధర్మాత్మా/ సహశిష్యో మహామునిః’ అన్న  బాల కాండ (2.1) శ్లోకం మూలకంగానే ఈ అనుమానం. కవి ప్రథమ పురుషలో (తనను గురించి తాను)వాక్యవిశారద, పూజయామాన, ధర్మాత్మ, మహాముని’ వంటి విశేషణాలతో వర్ణించుకోవడం కొన్ని  సందేహాలకు తావిస్తుంది, తరువాతి శ్లోకాలలో కనిపించే   భగవాన్ (బాల 2.9), మహాప్రాజ్ఞ, మునిపుంగవః (బాల 2.17) వంటి స్వీయ ప్రశంసలతో ఈ సందేహం మరింత బలపడుతోంది. తనకు తాను నమస్కరించుకునేటంత తక్కువ స్థాయి సంస్కారం వాల్మీకి మహర్షి ప్రదర్శించడం ఏ వివేచనపరుడినైనా ఆలోచనలో పడవేస్తుంది కదా! 

క్రౌంచపక్షి హననంతో ఖిన్నుడైన వాల్మీకి ముఖతః అప్రయత్నంగా వెలువడ్డ ‘మా నిషాద’ శ్లోకం కాకతాళీయంగా అనుష్టుప్ ఛందస్సులో ఉండటం, తదనంతరం అదే ఛందస్సులో రామాయణం చివరి వరకు కథనం చేయాలని కవి సంకల్పించినట్లు చెబుతారు. కానీ వాల్మీకి రామాయణ శ్లోకాలలో అనుష్టుప్ ఛందస్సుకు భిన్నమైన ఛందస్సూ కనిపిస్తుంది! అనంతర కాలంలో వేరే మరి కొంతమంది కవులు  ప్రక్షిప్తపరిచిన శ్లోకాలగా వీటిని విశ్లేషించే సాహిత్య విమర్శకులూ కద్దు!    

నారదుడు వాల్మీకి మహర్షికి కథనం చేసిన సంక్షేప రామాయణంలో, మహాభారత అరణ్యపర్వంలోని రామోపాఖ్యానంలో బాలకాండకు సంబంధించిన కథ ఏమంత విస్తారంగా ఉండదు. ఆదికావ్యం పేరున ప్రాచుర్యంలో ఉన్న రామాయణ  బాలకాండలో  అప్రస్తుతం అనిపించే కథాభాగమంతా వాల్మీకేతరుల ప్రక్షిప్త నై’పుణ్యం’గా అనుమానించే విశ్లేషకులూ లేకపోలేదు. 

బ్రహ్మర్షి విశ్వామిత్రుడు క్షత్రియుడు. దశరథ మహారాజు ఏనుగని  భ్రమించి వధించిన బాలకుడు ఒక శూద్ర తపస్వి కన్నకొడుకు. ఇంకా లోతుల్లోకి వెళ్లి తరచి చూస్తే ఇతిహాసాల నిండా వివిధ వర్ణాలవారు ఉగ్రతపస్సులు చేసిన ఉదాహరణలు  పుష్కలంగా కనిపిస్తాయి. వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండ ‘శంబూక వధ’ కథలో తపోదీక్షకు అర్హమైన వర్ణాల ప్రస్తక్తి వస్తుంది. కృతయుగంలో బ్రాహ్మణులు,  త్రేతాయుగంలో  అదనంగా క్షత్రియులు, ద్వాపరంలో ఆ ఇద్దరికీ అదనంగా వైశ్యులు,  కలియుగంలో నాలుగు వర్ణాలవారూ అర్హులయిన్నట్లుగా ఒక విశ్వాసం ప్రచారంలో ఉంది. అందుకు విరుద్ధంగా త్రేతాయుగంలోనే  దీక్షకు దిగినందున ‘శూద్ర’ శంబూకుడు వధ్యార్హుడయినట్లు ఒక  వాదన ఒక వర్గంవారు ముందుకు తెస్తున్నారిప్పుడు. పిట్టల మీద వడిసెలరాయి ఎక్కుపెట్టినందుకే కిరాతకుడి మీద కృద్ధుడైన రుషి  వాల్మీకి. అటువంటి సామాజిక తత్త్వవేత్త వర్ణార్హతల ఆధారంగా ఒక నిర్దోషి మానవుడి వధను సమర్థించే విధంగా కథ రచించాస్తాడంటే  నమ్మబుద్ధికాదు.  తదనంతర కాలంలోనే వాల్మీకేతర కవులెవరో తాము నమ్మిన విశ్వాసాలకు ప్రామాణికత ఆపాదించుకొనే నిమిత్తం అప్పటికే సామాజికామోదం పొందిన వాల్మీకి రామాయణంలో ఈ తరహా కథలను చొప్పించినట్లు అభ్యుదయవాదులు అభియోగిస్తున్నారు.  

మొదటి రామాయణ కర్త వాల్మీకి రామునికి సమకాలీనుడని  భావన! కథ జరగక ముందే ఉత్తరకాండను ఆ కవి ఊహించి రాసాడా?   హేతువుకు దూరంగా లేదా ఈ ఆలోచన? కావ్యారంభంలో వాల్మీకి తయారు చేసుకున్న కథాగమన ప్రణాళికలో ఉత్తరకాండ కూడా ఉంది కదా అని వాదించ వచ్చు. కానీ ఆ సర్గలో సైతం మార్పులకు అనుగుణంగా   చేర్పులు చేయడం ఏమంత కష్టం?

లంకాధిపతి విశిష్ట వేదపాండిత్యమున్న   పౌలస్త్య బ్రాహ్మణుడన్న వాదనా ప్రశ్నార్హమే. వేదవిధుల మీద విశ్వాసమున్న వ్యక్తి యజ్ఞాయాగాదులు భగ్నత కోరుకుంటాడా?! పోనీ పౌలస్త్య వంశజుడు రావణుడు రాక్షసుడు. అసురుడుగా జరిగిన ప్రచారం చరిత్ర దృష్ట్యా  దోషం’ అనుకుందాం. కానీ సుందరకాండలో దానికి విరుద్ధమైన భావం (సుందర 20. 5-6) పొడగడుతుందే! మనసు దిటవు పరుచుకొనేటందుకు వీలుగా   ఎత్తుకొచ్చిన స్త్రీకి ఒక సంవత్సరం పాటు అవకాశం ఇవ్వాలని రాక్షసవివాహ నీతి. అప్పటికీ ఒల్లని ఆడదానిని భక్షించడం ఆదిమజాతుల్లో తప్పుకాదు. రాక్షసజాతికి చెందినవాడు కాబట్టే రావణుడు సీతను చంపి తింటానని బెదిరించాడు గానీ బలాత్కరిస్తానని ఎక్కడా అనినట్లు కనిపించదు! ‘కామం కామః శరీరే మే/యథా కామం ప్రవర్తతాం’ (మన్మథుడు నా శరీరంలో ఎంత యధేచ్చగానైనా ప్రవర్తించనీయి నా పై కామనలేని నిన్ను నేను తాకను) అంటాడు. ఒక ఉదాత్త ప్రేమికుడి  ఆదర్శనీయమైన భావన రాక్షసుడిలో! ప్రధానపాత్రలలోనే  ఇన్ని పరస్పర వైరుధ్యాలున్న నేపథ్యంలో రామాయణ రచన ఒకే కవి చేతి మీదుగా మాత్రమే సాగిందనుకోవడానికి మనసొప్పడంలేదు.  

ఆచారాలనుబట్టి, భాషలనుబట్టి రామాయణంలోని వానరలు సవర జాతివారు అయివుండవచ్చని గో. రామదాసుగారు (భారతి 1926 మార్చి, ఏప్రియల్ సంచికలు)  ఓ వ్యాసంలో అభిప్రాయ పడ్డారు. సవర భాషలో ‘ఆర్శి’ అంటే కోతి. ఆర్శిలలో మగవాళ్ళు లంగోటి కట్టే విధానం వెనక వేలాడే తోకను తలపిస్తుంది. రామాయణంలోని లంక, జన స్థానాలకి  ‘లంకాన్, జైతాన్’ అనే సవర పదాలు  మూలాలని రామదాసుగారు  ఊహిస్తున్నారు. ‘దండకా’ అన్న పదానికీ వ్యుత్పత్తి  చెప్పారాయన. సవర భాషలో ‘దాన్’ అంటే నీరు. ’డాక్’ అన్నా నీరే. ‘దాన్ డాక్’ అంటే నీరే నీరు. ‘దాన్డాక్’ మీద ‘ఆ’ అనే షష్టీ విభక్తి ప్రత్యయం చేరి ‘దన్డకా’.. (దండకా) అయిందని రామదాసు గారి ప్రతిపాదన. దండకారణ్యంలో  విశేషంగా నీరు ఉండబట్టే  అరణ్యకాండ (11. 40-41) లో ‘స్థాలీప్రాయే వనోద్దేశే పిప్పలీవన శోభితే/బహుపుష్పఫలే రమ్యే నానా శకుని నాదితే/పద్మిన్యో వివిధా స్తత్ర ప్రసన్న సలిలాశ్రితాః/హంసకారండవాకీర్ణా శ్చక్రవాకోశోభితాః’ అనే శ్లోకంలో చెప్పినట్లు అగస్త్యాశ్రమం పిప్పిలోవన శోభితమైన సమతలం మీద రకరకాల పుష్పాలు, ఫలాలు,  పక్షుల రవాలు,  హంసలు, సారసాలు, చక్రవాకాలతో శోభాయమానంగా ఉంద’నే వర్ణనకు  అతికినట్లు సరిపోతుంది.

చిన్నవాడు పెద్దవాడి భార్యను పెండ్లాడవచ్చు. పెద్దవాడు చిన్నవాడి భార్యను మాత్రం ముట్టుకోకూడదన్నది సవరల ఆచారం. రామాయణంలోని వాలిసుగ్రీవుల కథ తదనుగుణంగానే ఉంది కాబట్టి రామాయణంలోని వానరులు ఒకానొక సవర జాతివారేనని గో. రామదాసుగారి సిద్ధాంతం. తథాస్తు అందామనిపించినా తత్ సిద్ధాంతానికి తభావతు కలిగించే అంశాలు వాల్మీకంలోనే నిక్షిప్తమై ఉన్నాయి! 

చరిత్ర ప్రకారం వానరులు దక్షిణభారతంలో మహా బలవంతులు. ప్రముఖులు. బుద్ధిమంతులు. ఆర్యులకు స్నేహపాత్రులు. రామ లక్ష్మణులతో ప్రథమ పరిచయం వేళ హనుమంతుడు ధరించిన  భిక్షు రూపం, ప్రదర్శించిన భాషాపాటవం, సముద్ర లంఘనంలో లాఘవం, సందర్భశుద్ధితో  పెద్దలకు వందనాదులు చేసే సంస్కారం  వానరజాతి నాగరికలక్షణ విశేషాలు. అభివృద్ధిపరంగా  ఎంతో వెనకంజలో ఉండే సవర జాతిగా వారు  ఏ కారణం చేత ఎప్పుడు దిగజారిపోయినట్లు? నమ్మదగ్గ  అదారాలేమీ దొరకనంత వరకు రామదాసుగారి ‘సవర’ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా స్వీకరించలేమనుకోండి.  కిష్కింధగా చెప్పుకునే ఆ ప్రాంతంలో ఇప్పుడు సవర జాతివారూ దాదాపుగా  లేరు. కోతులు మాత్రం చాలా ఎక్కువ.  అదో  వింత!

రామాయణంలోని జటాయువూ ఒక ఆటవిక జాతి మనిషని సురవరం ప్రతాపరెడ్డిగారి సిద్ధాంతం. కొమర్రాజు వెంకట లక్ష్మణరావుగారు ప్రకటించిన విష్ణుకుండి మూడవ మాధవశర్మ శాసనం ప్రస్తావించిన ‘గుద్దవాది’.. ఇప్పటి గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలూకు రంపచోడవరమని మల్లంపల్లివారూ అభిప్రాయపడ్డారు. ఆ గుద్దవాదే పూర్వం గుద్రహారము. గృధ్ర శబ్దం సంస్కృతీకరించిన గుద్ర శబ్దంకాగా  కాలక్రమేణా అది గద్దగా  ‘పెంచిన రామాయాణం’లో రూపాంతరం చెందివుంటుందని  పెద్దల ఊహ. కానీ వాల్మీకి రామాయణంలో రావణుడు సీతమ్మవారిని ఆకాశమార్గానే తీసుకు పోయినట్లుంది. జటాయువూ ఒక పక్షిమాత్రంగానే వర్ణితం. ఈ వైవిధ్యాలకీ ప్రక్షిప్తాలే కారణాలా? 

ముందా జాతిని గురించి ఒక వ్యాసం రాస్తూ శరశ్చంద్రరాయ్ గారు ‘ముందాలలోని  ఉరోవన్ అనే ఒక  శాఖ తాము రావణ సంతతికి చెందిన వారమని చెప్పుకుంటుంద’న్నారు. ఆయన సిధ్ధాంతం ప్రకారం కోరమండల్  తీరం ఖరమండలం అనే మూలపదం  నుంచి ఉద్భవించింది.  రామాయణంలో చెప్పిన ఖరమండలం ప్రాంతం ఇదే  కావచ్చన్న రాయ్ గారి  అభిప్రాయం సత్యానికి ఎంత సమీపంలో ఉందో చెప్పలేని పరిస్థితి. శాస్త్రబద్ధంగా పరిశోధనలేవీ సవ్యంగా సాగని నేపథ్యంలో రామాయణంలోని ప్రతి అంశమూ, ప్రాంతమూ ఇలాగే పలుప్రశ్నలకు గురవుతున్నవన్న మాట ఒక్కటే అంతిమ సత్యంగా మిగిలింది.

‘రామాయణంలోని లంక నేటి సింహళం. సముద్ర తీరానికి అది నూరు యోజనాల దూరం’ అన్నది బహుళ ప్రచారంలో ఉన్న ఒక విశ్వాసం. సురవరం ప్రతాపరెడ్డిగారి అభిప్రాయం మరో విధంగా ఉంది. చుట్టూ రెండు మూడు దిక్కుల నీరున్నా లంకలుగానే చలామణి అయ్యేవని.. గోదావరీ ప్రాంతంలోని ఒక లంక రామాయణంలోని లంకయి ఉండవచ్చని రెడ్డిగారి అంచనా.  ఆంజనేయుడు సముద్ర లంఘనం చేసాడని రామాయణంలో స్పష్టంగా ఉన్నప్పుడు గోదావరీ ప్రాంతంలోని ఏదేని ఒక కాలవను మాత్రమే దాటాడని అనడం దుస్సాహసమే అవుతుంది!  రామాయణ కాలంనాటి నైసర్గిక స్థితిలో భారతదేశానికి లంకకు మధ్య నూరు యోజనాల దూరం ఉండేదా! నాటి లంక నైసర్గిక స్వరూపం నిర్ధారణ అయేదాకా సింహళంలోని లంకే రామాయణంలోని లంక అనుకోవడం మినహా మరో మార్గం ఏముంది?

ఆధార లవలేశాలపై చేసిన ఈ కేవల ఊహావిశేషాలూ  సందేహాతీతాలేమీ కావు కూడా. ప్రథమ రామాయణ కర్త రాముడికి సమకాలికుడు కాకపోయే అవకాశమూ కొట్టి పారేయలేం. నిజంగా సమకాలీనుడే అయితే ఎంత కావ్యమైనా  గోరంత వాస్తవికతకు  కొండంత అభూత కల్పనలు కల్పిస్తాడా? గతంలో జరిగిన కథేదో కాలమాళిగలో వూరి వూరి  ప్రథమ రామాయణ కర్తృత్వం జరిగే నాటికి కల్పనలు, కవితోక్తులతో  ఓ అందమైన కావ్యానికి సరిపడినంత  సరంజామాగా సమకూరిందనుకున్నా పేచీ లేదు. తదనంతర కాలంలో  ఆ కావ్యంలోకొచ్చి పడ్డ  ప్రక్షిప్తాల తంతు  సరే సరి! 

అనుష్టుప్ కి భిన్నమైన శ్లోకాలయితేనేమి? అందులోనూ ఎంతో ప్రతిభావంతమైన కవిత్వం  ఉంది. రెండో వాల్మీకీ(ఉండి ఉంటే) మొదటి వాల్మీకులవారికి ప్రతిభాపాటవాలలో తీసిపోని మహాకవే. కాబట్టే ప్రక్షిప్తాల పోలికల్లో ఇంత సంక్లిష్టత! 

రామాయణం భారతానికి సుమారు వెయ్యి సంవత్సరాల ముందైనా జరిగి వుంటుందని  ఒక అంచనా. నాటి సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక  పరిస్థితులకు అనుగుణంగా అల్లిన కథ రామాయణం. నేటి సమాజ విలువలతొ వాటిని బేరీజు వేయబూనడం సబబు కూడా కాదు.  

సాహిత్యంలో ప్రధానంగా ఎంచవలసింది నాటి విశ్వాసాలు.. ఆ విశ్వాసాలు ఆయా పాత్రలను నడిపించే తీరు.. అంతిమంగా మానవత్వం ప్రకటితమైన వైనం. ఆ దృష్టితో  చూస్తే రామాయణం నిశ్చయంగా అత్యుత్తమమైన  విలువలతో కూడిన మనోవికాస గ్రంథమే.

కర్తృత్వం సంగతి కాసేపు పక్కన ఉంచుదాం! ఆ ఆదికావ్యంలోని కవిత్వం, కథా నిర్వహణ, పాత్ర పోషణ అపూర్వం. వివాదాలన్నింటికీ అతీతం. పురుషోత్తముడైన రాముని కథ ఎవరైనా కానీయండి ఒక కవిశ్రేష్టుడు  మలిచిన తీరు అనితర సాధ్యం. శోకం, శృంగారం, శౌర్యం, వేదాంతం, నీతి.. మహాకవి పట్టుకున్న ప్రతీ రసం మన మానసాలని   తేనెపట్టులాగా పట్టుకుని ఒక పట్టాన వదలదు.  పురంనుంచి, వనంవరకు కవి కావ్యంలో చేసిన వర్ణనలో? అత్యద్భుతం. సహజ సుందరం.  కథ కల్పనల్లో విహరించినా.. వర్ణనలు వాస్తవికతకు అద్దం పడుతుంటాయి.  ప్రతి సన్నివేశం విస్పష్టం. విశిష్టం.  వెరసి రామాయణం వంటి కావ్యం న భూతో న భవిష్యతి. సీతారాముల దాంపత్య సరళిని వాల్మీకి మలిచిన తీరుకి విశ్వజనావళి మొత్తం నివాళులెత్తుతున్నది ఇవాళ్టికీ. 

మానవుడైన రాముణ్ణి వాల్మీకి తన లేఖినితో దేవుణ్ణి చేసాడు. భారతావనిలో ఇవాళ రాముడులేని ఊరులేదు. రామకథ వినబడని పుణ్యస్థలం లేదు. సీతారాముల్ని చిత్రించని  కళారూపం అసంపూర్ణం. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో స్పర్శిచని భారతీయ సాహిత్యం అసమగ్రం.   దేశదేశాలలో, పలు భాషలలో సైతం గుబాళిస్తుదా రామకథా సుగంధ సుమం. 

ఎక్కడో ఆకాశంలో విహరించకుండా.. మన మధ్య మసలుతూనే  మానవ విలువలను గురించి, మంచి పాలన గురించి, కుటుంబ నిష్ఠతను గురించి   ఉత్తమ మార్గమేదో స్వీయప్రవర్తన ద్వారా రుచి చూపించిన పురుషోత్తముడు రాముడు. కల్పనో.. వాస్తవమో.. రెండు చేతులా నిండు మనసుతో మనం చేసే సునమస్సులకు నూరు శాతం యోగ్యులు సీతారాములు. ఆ ఆదర్శ దంపతులను క్షుభిత జాతికి అందించిన కవియోగులు.. ప్రథములైనా..ద్వితీయులైనా.. అందరూ 

- కర్లపాలెం హనుమంతరావు 

బోథెల్ ; యూఎస్ఎ

09 -02 -2021 


సంప్రదించిన కొన్ని రచనలుః

వాల్మీకి రామాయణము- ఉప్పులూరి కామేశ్వరరావు

రామాయణ సమాలోచనము- కాళూరి హనుమంతరావు

రామాయణ విశేషములు- సురవరం ప్రతాపరెడ్డి

రామాయణమునందు వానరులు ఎవరు? - గో. రామదాసు

రామాయణము- బాలకాండము- కాళూరి వ్యాసమూర్తి

The Riddle of Ramayana- C.V. Vaidya


కర్లపాలెం హనుమంతరావు


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...