Friday, October 7, 2016

కథానికః మా తెలుగుతల్లికి మల్లెపూదండ!- రచన మాస పత్రికలో ప్రచురితం


విద్యారణ్య- 
అన్ని రకాల హైటెక్ హంగులతో నేను నడుపుతున్న విద్యాసంస్థ అది. ర్యాంకులు పండించే విద్యాక్షేత్రంలో మా సంస్థ స్థానం మొదటినుంచి మొదటి మూడింటిలో ఒకటి. శాశ్వతంగా మొదటిస్థానంలోనే స్థిరపడాలన్నది నా లక్ష్యం. ఆ లక్ష్యసాధనలో భాగంగానే ప్రపంచస్థాయి గుర్తింపున్న 'జీనియస్' గ్రూపుతో 'టై అప్' అవ్వాలని వ్యూహం. ఆ ప్రయత్నాలన్నీ ఓ కొలిక్కి వచ్చి ఇప్పుడు చివరిదశకు చేరుకొన్నాం. ఇంకో గంటలో జరగబోయే సాంస్కృతిక ప్రదర్శనల్లోకూడా మా ప్రత్యేకత నిరూపించుకుంటే.. ఇహనుంచి నగరంలో మా విద్యారణ్యదే ప్రప్రథమ స్థానం.

కల్చరల్ ఈవెంట్ ఇన్-చార్జ్ మిసెస్ కపర్దీది ఓ ప్రసిద్ధ విద్యాసంస్థకు చెందిన  ప్రధానోపాధ్యాయురాలి హోదాలో దాదాపు ముఫ్ఫైఏళ్ల అనుభవం. అక్కడ పదవీ విరమణ అయిన వెంటనే ఇక్కడకు రప్పించాను పెద్ద జీతంతో! ఆమె గత సంబధాలమూలకంగానే 'జీనియస్' దృష్టిలో మా సంస్థ పడగలిగింది. నిలబడగలిగింది.
గ్రీన్-రూంలో మిసెస్ కపర్దీ విద్యార్థులకు చివరి హచ్చరికలు జారీ చేస్తున్నది. పదో తరగతి పిల్లలు హేమ్లెట్ ప్లేలెట్, దిగువ తరగతులవాళ్ళు బెంగాలీ రవీంద్రగీత్, పంజాబీ భాంగ్రా, ఒరియా ఒడిస్సీ.. అందరికన్నా ముందు కిండర్ గార్టెన్ పసిమొగ్గలతో వందేమాతరం! అన్నీ చక్కగా అమిరినట్లే కదంబంలో పూలవరసలా!
కార్యక్రమం పర్యవేక్షణకొచ్చిన బృందంలో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో జాతీయస్థాయిలో నిష్ణాతులు. శ్యాంలీలా పర్షాద్, మాతంగి రమణ, బిజయ్ మిశ్రో, మదన్ లాల్ కథేరియా, దివిజశర్మ. దివిజశర్మకు మాత్రమే కొద్దిగా తెలుగు భాషతో పరిచయం. తెలుగు తెలిసినవారు లేకపోవడం నిజానికి ఒక అనుకూలమైన అంశం. ఒక తెలుగువాడు మరో తెలుగువాడిని ఎక్కిరానీయడన్న సామెత మనకుండనే ఉందిగదా! అదీ నా బాధ!
తెర లేచింది. 'వందేమాతరం' అద్భుతంగా పేలింది. జ్యోతి ప్రజ్వలన అనంతరం మిసెస్ కపర్దీ చేసిన ఆంగ్ల ప్రసంగమూ అంతే 'ఇంప్రెసివ్'! పావుగంట బాలే, అరగంట ఆంగ్ల నాటిక. హిందీ గీతమాలిక జరుగుతున్న సమయంలో దివిజశర్మ వచ్చింది.' మావాళ్లు మీ తెలుగు ప్రోగ్రామ్సు చూడాలనుకొంటున్నారు. ఇంటర్మిషన్ తరువాత అవే అరేంజి చేయండి! ఒక గంట చూస్తాం' అంది.
నా గుండెల్లో రాయి పడింది. కార్పొరేట్ కల్చర్ కదా! హిందీ, ఇంగ్లీష్ లాంటివాటిమీద మాత్రమే మోజుంటుందని అనుకొన్నాం!
''ఫైవ్ ఆర్ టెన్ మినిట్సు అంటే ఏదో మేనేజ్ చేయగలంగానీ.. ఇప్పటికిప్పుడు గంటపాటు తెలుగు ప్రోగ్రామంటే ఎలా సార్?!' అని నాకే ఎదురు ప్రశ్న వేసింది మిసెస్ కపర్దీ!
'ఏదో ఒకటి మేనేజ్ చేయండి మ్యాడమ్! నెక్స్ట్ ప్రోగ్రాం మాత్రం తెలుగులోనే ఉండాలి. ఏం చేస్తారో .. మీ ఇష్టం!' అని చెప్పి  నా ఛాంబరుకి వచ్చేసాను.
వచ్చానన్నమాటేగానీ.. మనసు మనసులో లేదు. పర్యవేక్షక బృందం ఏదో ఆంతరంగిక చర్చల్లో ఉంది.. లంచ్ చేస్తూనే! వాళ్ల మధ్యలో దూరడం మర్యాదకాదు గనక కాఫీ  నా చాంబరుకి కాఫీ తెప్పించుకొని తాగుతూ కూర్చున్నాను. ఆరు దశాబ్దాల కిందట బెనారస్ యూనివర్సిటీలో నేను చదువుతున్నప్పటి సంఘటన గుర్తుకొచ్చింది.
అవి నేను ఎమ్మెస్సీలో ఫిజిక్సు చేసే రోజులు. అన్ని భాషలవాళ్లకి మల్లేనే తెలుగువాళ్ళకీ ఒక ప్రత్యేకమైన మెస్సు ఉండేది. ఓ చలికాలం ఆదివారం మధ్యాహ్నం. భోజనం లాగించి ఆరుబైట బండలమీద వెచ్చదనంకోసం కూర్చొని ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకొంటున్నాం తెలుగు విద్యార్థులం.
ఒక పొట్టి మనిషి. నుదుట పట్టెనామాలు. ముతక పంచె.. లాల్చీ.  చేతిసంచీ ఊపుకొంటో  మా మధ్యకొచ్చి నిలబడి 'మీరంతా తెలుగు పిల్లలే కదుటోయ్! నాకో పని చేసి పెట్టాలి. ఓ గంటపాటు నేనో ఉపస్యాసం ఇచ్చిపోతా.  తెలుగు తెలిసినవాళ్లందర్నీ  వెంటనే పోగేయాలి!' అన్నాడు!
'ఈయనెవడ్రా బాబూ! పిలవని పేరంటానికొచ్చిందికాక.. ఉపన్యాసాలిస్తానంటున్నాడు!' అని మాకు ఒకటే ఆశ్చర్యం. మా బృందనాయకుడు సుబ్బరాజుకి మొహమాటం తక్కువ. పొట్టిమనిషి మొహంమీదే 'తమరెవరు మహానుభావా?' అంటూ   వెటకారంగా వెళ్ళబోసాడు.
పొట్టాయన ఆ వెటకారాన్నేమాత్రం పట్టించుకోలేదు. 'మా తెలుగుతల్లికి మల్లెపూదండ!' పాట ఎప్పుడన్నా విన్నారుటోయ్? ఆ గీతాన్ని రాసింది నేనే!' అనేసాడు.
ఇండియాకు స్వాతంత్ర్యంవచ్చి అప్పటికి నిండా పదేళ్ళుకూడా నిండలేదు. జనంలో ఇంకా దేశభక్తి ఇప్పట్లా పూర్తిగా ఇంకిపోని కాలం. 'మా తెలుగుతల్లి' పాట చాలా సార్లు వినివుండటంచేత మా ఎదురుగా నిలబడి ఉన్నది శంకరంబాడి సుందరాచారిగారని తెలుసుకొన్నాం. అమాంతం గౌరవం పెరిగిపోయింది. సుబ్బరాజూ అందుకు మినహాయింపు కాదు. స్వరంలోని మునుపటి దురుసుతనం తగ్గించుకొని ‘ఇప్పటికిప్పుడు జనాలని పొగేయాలంటే ఎలా సార్?' అని నసిగాడు.'సరేలేవోయ్! రేపు నాలుగ్గంటలకి పెట్టుకోండి. నేను నేరుగా మీ మీటింగుహాలుకే వచ్చేస్తా!' అంటూ చేతిసంచి ఊపుకొంటూ మాయమైపోయారు శకరంబాడి సుందరాచారిగారు.
తెలుగు సంఘం ఎన్నికలు ఎలాగూ దగ్గరపడుతున్నాయి. ఈ వంకతో ఒక కార్యక్రమం ఏర్పాటుచేస్తే ఎన్నికల్లో అది తనకు ఉపయోగపడుతుందని సుబ్బరాజు ఎత్తుగడ. వాడి పూనికతో భారీగానే పోగయ్యారు జనం.
నాలుగ్గంటలకు అనుకొన్న కార్యక్రమం ఆరుగంటలగ్గానీ మొదలవలేదు. ఆలస్యానికి కారణం సుందరాచారిగారే! ఆలస్యానికి క్షమాపణలైనా అడగలేదు. వచ్చీ రాగానే మైకు అందుకోబాయారు. 'ఇప్పుడు మొదలైతే ఎప్పటికయ్యేను? ఇంకో రెండు గంటలయితే మెస్సుకూడా మూసేస్తారు!' అంటూ సుబ్బరాజు బిగ్గరగానే గొణుకుడు.
విన్నారులాగుంది పెద్దాయన 'తిండికోసం వెంపర్లాడేవాళ్ళకోసం కాదు నా ప్రసంగం. ఇష్టం లేనివాళ్ళు నిక్షేపంగా వెళ్ళిపోవచ్చు.. ఇప్పుడైనా.. ఎప్పుడైనా!' అంటూ మైకందుకొన్నారు.
ఆద్యంతం ఆయన ఉపన్యాసం సాగిన తీరు అత్యద్భుతం. తెలుగుభాష విశిష్టతనుగూర్చి సాగిన ఆ ప్రసంగం ఓ రసగంగాప్రవాహం. తలమునకలా ఆ గంగలో తడిసి ముద్దవని తెలుగువాడు లేడు.
తొలిఝాములో వినిపించే కోడికూతలనుంచి పొద్దుపోయిన తరువాత వీధుల్లో సంచరించే కుక్కల అరుపులదాకా.. ఆయన అనుకరించని జీవజాలం లేదు. పల్లెజీవనంలోని తెలుగుదనం కమ్మదనం సుందరాచారిగారి స్వరంలో ఆవిష్కరణ అయిన వైనం మామూలు మాటల్లో వర్ణించనలవి కానిది.
తొలిసంజె వెలుగుల్లో ఇంటిగుమ్మాలముందు  రంగవల్లులు తీరుస్తూ ఇంతులు పాడుకొనే పాటలు, కోడికూతతో లేచి పొలంబాట పట్టే రైతన్నలు ఆలమందలని అదిలించుకొంటూ తీసుకొనే కూనిరాగాలు, అత్తాకోడళ్ళు, వదినామరదళ్ళు రోటిపోటుల దగ్గర ఆడిపోసుకొనే సరదా సూటిపోటు పాటలు, పెద్దపండుగ సంబరాల్లో వీధివీధీ తిరిగే హరిదాసయ్యల చిందులు,  ఇంటిల్లిపాదిని ఆశీర్వదించిగాని పక్కగుమ్మం తొక్కని గంగిరెద్దుల ఆటలు.. శంకరాచారిగారి గొంతులోనుంచి అలా అలా జాలువారుతుంటే మెస్సు భోజనం సంగతి ఇంకేం గుర్తుకొస్తుందెవరికైనా?! 'తప్పయిపోయింది స్వామీ! క్షమించండి' అంటూ సుబ్బరాజే చివరికి చేతులు జోడించాల్సి వచ్చింది. అంతకన్నా తమాషా ఆయన అవేవీ పట్టించుకోకుండా అప్యాయంగా సుబ్బరాజును అక్కున చేర్చుకోవడం!
మెస్సువాళ్లూ సభలోనే ఉండిపోవడంతో అందరికీ ఉపవాస బాధ తప్పిందనుకోండి ఆఖరికి!
ఆ రాత్రంతా సుందరాచారిగారు మా హాస్టలుగదిలోనే బస చేసారు. ఉపన్యాసం ఎంత ఉదాత్తంగా ఉందో.. ఆ పూట ఆయన చెప్పిన మాటలు అంతకన్నా ఉత్తేజకరంగా ఉన్నాయి. 'తేనెలొలికే తెలుగుభాష సౌందర్యాన్ని వివరించి చెప్పడం నా బోటి వామనుడికి తలకుమించిన పని. అయినా కాని, చేతకాదని చేతులు ముడుచుకొని మూల వదిగే మనస్తత్వం కాదు నాది.  కాబట్టే చేతనైనంతలో అమ్మభాష కమ్మదనాన్ని నేల నాలుగుచరగులా ప్రచారం చేయడానికి పూనుకొన్నది.' అంటో చేతిసంచిలోనుంచి కొన్ని పుస్తకాలని తీసి పంచిపెట్టారు మాకందరికీ! అదృష్టంకొద్దీ నాకూ ఒక పుస్తకం దక్కింది సుందరాచారిగారు స్వహస్తాలతో  చేసిన సంతకంతో సహా! ఆ నాటి ఆ పల్లెపదాల పుస్తకం  ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది.
పండిత పామర జనరంజకంగా తెలుగుభాషా సౌందర్యాన్ని పుస్తకరూపంలో ప్రచురించాలని సుందరాచారిగారి ఆశయంట. అందుకోసం ఓ అయిదంచల ప్రణాళిక సిద్ధంచేసుకొని  ఆర్థికవ్యవహారాలను చక్కబెట్టుకొనే ఉద్దేశంతో పెద్దలందరిని కలుస్తున్నారుట. అప్పట్లో హస్తినలో పండిట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యక్షపదవిలో ఉన్నారు. 'ఆయన్ని కలసి తిరిగి వెళుతూ ‘తెలుగు పిల్లలు మీరిక్కడ ఉన్నారని తెలిసి వచ్చాను. తెలుగు ఎక్కడుంటే నేనక్కడ ఉండాలన్నది  నా ఆకాంక్ష. తెలుగును ఎవరన్నా చిన్నచూపుచూస్తే నాకు తిక్కరేగుతుంది. వేల ఏళ్ళ చరిత్రగల మన తెలుగు ఇతర భాషల ధాష్టీకంవల్ల నష్టపోరాదన్నదే నా పంతం' అని చెప్పుకొచ్చారాయన.. ఆ రాత్రంతా నిద్రమానుకొని.. మమ్మల్నీ నిద్ర పోనీయకుండా!
'ఇప్పటి నా కష్టాన్నికూడా గట్టెక్కించడానికి రాకూడదా గురువుగారూ!' అనిపించింది నాకు ఆ క్షణంలో. మరుక్షణంలోనే నా పిచ్చి ఊహకు నవ్వూ వచ్చింది. ఎక్కడో ఓ కంఠం ఖంగున మోగుతుంటే ఈ లోకంలోకొచ్చి పడ్డాను.
'అదే గొంతు! అదే వాగ్ధార! శంకరంబాడి సుందరాచారిగారిది! ఇక్కడికి ఎందుకొస్తారు? ఎలా వస్తారు? నా భ్రమ కాకపోతే!' లేచి ఛాంబర్ బైటికి వచ్చాను.
వేదికమీద మైకుముందు కార్యక్రమాలకని ఏర్పాటుచేసిన అలంకరణ విద్యుద్దీపాల వెలుగులో సుందరాచారిగారు కంచుకంఠంతో ఉపన్యాసం దంచేస్తున్నారు.. తెలుగులో! తెలుగురాని పర్యవేక్షకబృందంకూడా మంత్రముగ్ధమయినట్లు వింటోంది! కనురెప్ప కొట్టడంకూడా మర్చిపోయేటంతగా కనికట్టు చేసున్నది ఆ మాట.. పాట.. ఆట!
మధ్య మధ్యలో ఆంగ్లపదాలతో.. హిందీపదప్రయోగాలతో.. సంస్కృతశ్లోక భూయిష్టంగా తెలుగుభాష ఔన్నత్యాన్నిగూర్చి ఆయన చేసేప్రసంగం అచ్చు శంకరంబాడిగారి శైలిలోనే ఉద్వేగంగా ఉరకలేస్తోంది!
'మంచి ప్రసంగం!' అంటూ మధ్యలో దివిజశర్మ లేచొచ్చి నన్ను అభినందించడంతో ఫలితం సగం తెలిసిపోయినట్లయింది.
శంకరాచారిగారి ఉపన్యాసంలోని చాలా అంశాలు నాకే చురకలు అంటించే విధంగా ఉన్నాయి. '
నెవ్వర్ స్పీక్ ఇన్ తెలుగు' అని రాసిన పలకలు పసిపిల్లల మెడల్లో వేయడంకన్నా అమానుషం మరోటుందా? మాతృభాష ప్రాముఖ్యం తెలీని మూర్ఖులు చేసే వికృత చేష్టలవి. పసిబిడ్డల్ని తల్లిభాషనుంచి వేరుచేయాలనుకోవడం తల్లినుంచి వేరుచేయడమంత పాపం. పరిసరాలనుంచి సహజసిద్దంగా అబ్బేసంపద తల్లిభాషద్వారా అందే విజ్ఞానం. దానికి దూరమయే బిడ్డడు భాగ్యవంతుడు ఎలా అవుతాడు? బాల్యంలో అమ్మభాష సాయంతో లోకాన్ని అర్థంచేసుకొన్నవాడే ఎదిగివచ్చిన తరువాత  కొత్తభాషల సారాన్ని జుర్రుకొనేది.  భాషావేత్తలనుంచి, మానసిక శాస్త్రవేత్తలదాకా అందరూ నిర్ధారిస్తున్న సత్యం ఇదే! ఇహ తెలుగుకి వద్దాం! ఇటాలియన్ భాషకి మల్లే పదం చివర హఠాత్తుగా విరగని మంచిగుణం తెలుగుకి వరం. వేదాలు ఆదిలో తెలుగులోనే ఉన్నాయని ఊహించడానికి ఈ సంగీతగుణమే కారణం. ఏ భాషాపదాన్నయినా తల్లి బిడ్డను పొదువుకొన్నట్లు పొదువుకోగలదు తెలుగుభాష. సంగీతంలోని ఏ శబ్దానికైనా తెలుగంత సమీపంలోకి  రాగల ద్రావిడభాష మరొకటి లేదు. కంప్యూటర్లో వాడే బైట్స్(bytes) పరిజ్ఞానానికి తెలుగంత అనుకూలత ఆంగ్లానిక్కూడా లేదని ఏనాడో 'సైన్స్య్ టు డే' లాంటి వైజ్ఞానిక పత్రికలు పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురించాయి. జనం నాలికలమీద సహజంగా పలికే భాషలో చెబితేనే ఏ విషయమైనా చొచ్చుకుపోవడం సులభమవుతుంది.  క్రైస్తవమత ప్రచారకులనుంచి, శైవమత ప్రచారకులవరకు అర్థమయిన ఈ విషయం మన తెలుగునవనాగరీకులకే ఎందుకో తలకెక్కడం లేదు! ఆంగ్లం పట్టుబడకపోతే నేటి పోటీప్రపంచం ధాటికి తట్టుకోవడం కష్టమని తల్లిదండ్రుల భయం. ఆ భయం అర్థం చేసుకోదగ్గదే! కానీ.. అందుకోసం బిడ్డ కడుపులో పడ్డనాటినుంచే ఏబిసిడిలు తప్ప మరోటి ‘అనరాదు.. వినరాదు.. కనరాదు' అని ఆంక్షలు విధించడమే విడ్డూరం! వసతో పాటు ఆంగ్లాన్ని రంగరించి పోయాలన్న తల్లిదండ్రుల ఆత్రం  చూస్తే నవ్వొస్తోంది. కోపమూ వస్తోంది. అభివృద్ధికి ఆంగ్లానికి ముడిపెట్టేవాళ్ళు చైనా, రష్యాల్లాంటి దేశాల ప్రగతికి ఏం సమాధానం చెబుతారు?! సొంతభాషంటే సొంత ఉనికిని చాటే ప్రకటన, తమిళుడికి తమిళమంటే ప్రేమ. కన్నడిగుడికి కన్నడమంటే ప్రాణం. మరాఠీవాడికి మల్లే మనమూ మనభాషను ఠీవీకి దర్పణంగా ఎందుకు భావించమో అర్థంకాదు! పిల్లల క్కాదు.. ముందు బుద్ధి రావాల్సింది పెద్దలకి, తల్లిదండ్రులకి, విద్యావేత్తలకి! ముఖ్యంగా  ఈ తెలుగుగడ్డమీద! ఆముక్క చెప్పిపోదామనే నేనిక్కడదాకా వచ్చింది' అంటుంటే హాలు హాలంతా కరతాళ ద్వనులతో మిన్నుముట్టింది.
'స్టాండింగ్ ఒవేషన్' ఇచ్చిన వాళ్ళలో పర్యవేక్షక బృందమూ ఉంది.
*                              *                      *


'జీనియస్'సంస్ఠ నగరఫ్రాంచైసీ మా 'విద్యారణ్య'కే దక్కిందని వేరే చెప్పవల్సిన పని లేదనుకొంటా.
అరవైఏళ్ళ కిందట పిలవని పేరంటానికి వచ్చి మమ్మల్నంతా మంత్రముగ్ధుల్నిచేసారు శంకరంబాడి సుందరాచారిగారు.  మళ్ళీ అదే తరహా మాయాజాలంచేసి మమ్మల్ని గట్టెక్కించి పోవడానికి రావడం ఎలా సంభవం?!
ఎవరు పిలిచారని ఇక్కడిదాకా వచ్చి తెలుగు ఔన్నత్యంతో పాటు  అవసరాన్ని గురించీ కుండబద్దలు కొట్టినట్లు!
వేదికమీద ప్రసంగంచేసిన సుందరాచారిగారు సుందరాచారిగారు కాదు. ఆయన శిష్యపరమాణువులాంటి రామాచారిగారుట! గంటపాటు తెలుగుకార్యక్రమం సమర్పించక తప్పని పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు   మిసెస్ కపర్దీకి ఠక్కుమని గుర్తుకొచ్చిన ఆపద్భాంధవుడు ఆయన. మిసెస్ కపర్దీ పూర్వం పనిచేసిన కార్పొరేట్ విద్యాసంస్థలో ఆంగ్ల ఉపాధ్యాయుడు. పిల్లలకి ఆంగ్లపాఠాలు చెబుతూనే తెలుగుభాష గొప్పతనాన్ని గురించీ కథలు, పాటలు, పద్యాలు చెబుతుండేవాడుట! ఆ విషయమై యాజమాన్యంతో గొడవలైతే  ఉద్యోగం వదులుకోవడానిక్కూడా సిద్ధపడ్డాడుట! ‘పోటీపరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు  ఆంగ్ల, తెలుగు సజ్జెక్టుల్లో  తర్ఫీదు ఇచ్చే ఏదో కోచింగు సెంటర్లో అత్తెసరు జీతానికి  పొట్టపోసుకొంటున్నాడు ప్రస్తుతం’ అని మిసెస్ కపర్దీ వివరించింది.
రామాచారిగారు చేసిన ఉపకారానికి తృణమో ఫణమో ఇద్దామనుకొన్నాను. తృణంలాగే తృణీకరించాడా సాయాన్ని! ఫణంగా కోరిన కోర్కె మాత్రం విచిత్రమైనది. 'మీ ఉదయంపూట ప్రార్థనల్లో  'మా తెలుగుతల్లికి మల్లెపూదండ' పాట పాడించండి చాలు! అలాగైనా పిల్లలకు ‘మన తెలుగుభాషం’టూ ఒకటుందని మన్నన ఉంటుంది' అనేసాడు.
ఆ పని  ఎటూ నేను చేయాలనుకొన్నదే!
పాఠ్యప్రణాళికతో నిమిత్తం లేకపోయినా  మాతృభాషను కనీసం ఐదు తరగతులవరకైనా ఐచ్చికంగా నేర్చుకోవడానికి సిద్దపడ్డ పిల్లలకే  మా విద్యారణ్యలో ప్రవేశం. ఆ నిబంధన విధించడానికి అంగీకరించిన తరువాతే జీనియస్ సంస్థ మాతో టై-అప్ అవడానికి సిద్ధపడింది. .
‘తెలుగు విభాగానికి రామాచారిగారినే బాధ్యులని చేస్తే సరి. సుందరాచారిగారే మన మధ్య మసలుతున్నట్లుంది గదా సార్!’ అని సలహా ఇచ్చింది మిసెస్ కపర్దీ.
మంచి సూచన. ‘తెలుగు ఎక్కడ ఉంటుందో తనక్కడ ఉండాలన్న గురువుగారి ఆకాంక్షా నెరవేర్చినట్లుంటుంది’ అనిపించింది నాకు.
'అది సరి కాదేమో సార్! సుందరాచారిగారిలాంటి వాళ్ళెక్కడ ఉంటే అక్కడ మాత్రమే తెలుగు వినబడే పరిస్థితి వచ్చిందేమో!' అన్నాడు రామాచారిగారు ఆ తరువాత కలిసినప్పుడు!
కాదనగలమా!
-కర్లపాలెం హనుమంతరావు
మా 'తెలుగు తల్లి' గీతం వినాలనుకొనేవారికోసం ఈ లంకెః
https://youtu.be/uNE4RJ36ONU

***

(రచన మాస పత్రిక అక్టోబర్, 2016  సంచికలో ప్రచురితం)







No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...