Saturday, October 22, 2016

వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు- వానికి భుక్తి లేదు


'పొలాలనన్నీ/హలాల దున్నీ/ ఇలాతలంలో హేమం పిండే' విరామ మెరుగని శ్రామికుడు- కర్షకవీరుడు. 'ఎవరు నాటిరో, ఎవరు పెంచిరో/ వివిధ సుందర తరువుల/ మివుల చల్లని దయాధారల/తవిలి కురిపించి?' అని కృష్ణశాస్త్రి సందేహం. సందేహమెందుకు? ఆ దయామూర్తి నిశ్చయంగా కర్షక చక్రవర్తే! సర్వజీవుల హృదయపూర్వక వందనాలందుకోగల అర్హత అన్నదాతకుగాక మరెవరికుంది? తెలతెలవారకముందే పల్లెకన్నా ముందు లేచిన రైతుకు నులివెచ్చని చలి మంటలు హారతులు పడుతుంటే, చెట్టూచేమా వింజామరలు వీస్తాయి. నాగులేటి వాగునీళ్లు కాళ్లు కడుగుతుంటే,
జామకొమ్మ చిలకమ్మ యోగక్షేమాలు విచారిస్తుంది. పువ్వునూ కాయనూ పేరుపేరునా పలకరిస్తో పొలం పనుల్లోకి దిగే హలంధరుణ్ని సాక్షాత్ బలరాముడి వారసుడిగా ప్రస్తుతిస్తాడొక ఆధునిక భావుకుడు. పాల కంకులను పసిపాపలకుమల్లే సాకే ఆ సాగుదొరను 'ఆకుపచ్చని చందమామ'గా పిలుచుకుని మురిసిపోతాడు ఇంకో గేయకవి- సుద్దాల. 'మట్టి దాహంతోటి నోరు తెరవంగా/ మబ్బు కమ్మీ నింగి జల్లు కురవంగా' వీలు తెలిసి వాలుగా విత్తులు జల్లితేనేగదా పాతరలోని పాతగింజకైనా పోయిన ప్రాణం లేచివచ్చేది! పుడమితల్లి పురిటి సలుపులకు రైతన్న మంత్రసానితనం వల్లనేకదా చల్లంగా సాంత్వన చేకూరేది! కలుపు పెరగకుండ ఒడుపుగా ఏరి అవతల పారవేయడం, బలుపు తరగకుండ తగు ఎరువు తగిన మోతాదులో అందించడం, తెగులంటకుండ ఆకుమళ్లపై పురుగుమందులు చల్లడం, పురుగు  తగిలిన  ఆకులు గిల్లి పారబోయడం, పశువుకు  కంచెలా.. పక్షికి వడిసెల రాయిలా మారి అహర్నిశలు  కాపుకాయడం!  పంట చేతికి దక్కడమంటే చంక బిడ్డను మీసకట్టు దాకా పెంచడంకన్నా కష్టం. కృషీవలుడు అందుకే రుషితుల్యుడు.
అరచేతి గీతలు అరిగిపోయేదాకా అరక తిప్పడం తప్ప మరో లోకం పట్టని ఆ నిష్కాముకత్వం అమాయకత్వం కాదు. నమ్ముకున్న వాళ్లందరికీ ఇంత బువ్వ పెట్టాలన్న అమ్మతనం అదంతా! ఆరు గాలాలూ శ్రమించి పుడమితల్లిని సేవించినా ఫలం అందనప్పుడు తల్లడిల్లేది తానొక్కడికోసమేనా? బిడ్డ ఆకలి తీర్చలేనితల్లి పడే ఆవేదన అది! మట్టితో సాగుబడి బంధం పేగుముడికన్నా బలమైనది. 'ప్రాణములొడ్డి ఘోర గహ/ నాటవులన్ బడగొట్టి, మంచిమా/గాణములన్ సృజించి, ఎము/కల్ నుసి జేసి పొలాలు దున్ని/ భోషాణముల్' జాతికి నింపిపెడుతున్నా సొంతానికి చారెడు నూకలైనా చేటలో మిగలని రైతు దుస్థితికి కలవరపడిన కవులెందరో! 'వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు/వానికి భుక్తి లేదు' అని కవిజాషువాలాగా ఆర్తిచెందిన భావుకులు తెలుగు నేలమీద ఏటుకూరి వేంకట నర్సయ్యనుంచి దర్భశయనం శ్రీనివాసాచార్యదాకా కో కొల్లలు. సింగమనేని నారాయణ అన్నట్లు  నిజానికి 'ఎర్రటి నేలలో నాగలి మొనదించి యుగాలుగా విత్తనాన్ని మొలకెత్తిస్తున్న ప్రతీ అన్నదాతా కవులకు స్ఫూర్తిప్రదాతే. ఆ కర్షకుడి హృదిలోకి జొరబడి, కనుకొనుకుల్లో నిలబడి, కన్నీటికీ పన్నీటికీ కినిసి, మురిసిన దువ్వూరివారైతే ఏకంగా 'కృషీవలుడు' అనే కర్షకకావ్యాన్నేసృజించారు. శాస్త్రవిజ్ఞానం ఎంత శరవేగంగా దూసుకుపోతున్నా సాగుదారుడు లేకపోతే బతుకు బండి ముందుకు సాగదు. ఏడు నక్షత్రాల హోటలు పాయసాల పాలనుంచి.. ఏడడుగులు నడిచే వధూవరులమీద జల్లే తలంబ్రాలదాకా..  అన్నీ అన్నదాత స్వేదయాగ ఫలాలే! ఆకలి తీర్చాల్సిన నేలతల్లి రైతు బతుకుల్ని మింగే రాక్షసబల్లిగా మారుతుండటమే సాగుభారతంలో నేడు నడుస్తున్న విషాదపర్వం.



జీవనదులెన్ని ఉన్నా మాయదారి కరువు పీడిస్తోంది. ఉత్తరానివి ఉత్తుత్తి ఉరుములు, దక్షిణానివి దాక్షిణ్య మెరుగని మెరుపులు. పడిన చినుకులకు ఎడతెరిపి తోచదు. పాలుతాగే చంటిపిల్ల నీటమునిగితే తల్లి కెంత కడుపు కోతో, పంట మునిగిన రైతు కంత గుండెకోత. చేతులారా పెంచుకున్న పంటకు చేజేతులా నిప్పంటించుకున్నా ప్రభుత్వాలకు పట్టటం లేదు.   గోడలేని పొలాలకు గొళ్లేలు బిగించుకున్నా గోడు వినేందుకు ఏ నాథుడూ రాడు. కళ్ళాల దగ్గరేకాదు.. అంగళ్లలో సైతం ఆసరా దొరకదు. నిల్వలకు నీడలేక నడి బజారులో నిండు జీవితాన్ని పొర్లబోసుకుంటున్నాడు నేడు రైతు. ఓటమని తెలిసీ కడవరకూ పోరాడవలసిన కర్ణుడవుతున్నాడు కర్షకుడు. పొలంగుండెలు  తొలుచుకుంటూ పొగగొట్టాలు లేస్తున్నాయి.
పంటచేల కంఠాలకు ఆర్థిక మండళ్ల ఉరితాళ్ల ముళ్లు బిగుస్తున్నాయి. ఉరి రద్దుకు పరితపించే పెద్దలకైనా పట్టదా ప్రాణదాత ఉసురుకు ముంచుకొచ్చే ఆపద?! రైతు చావుదెబ్బ జాతికి శాపం కాదా! వట్టొట్టి సానుభూతి వచనాలు కురవని నైరుతీ రుతుపవనాలు. వేదికలమీది వాదనలు రైతు లావేదనలు  ఆరుస్తాయా.. తీరుస్తాయా? అన్నదాత కన్నీటికి కావాల్సింది ఇప్పుడు చిత్తశుద్ధితో వేసే ఆనకట్ట. ఆ పని వెంటనే ప్రారంభం కాకపోతే ఆ ప్రవాహంలో జాతి మొత్తం కొట్టుకొనిపోయే ప్రమాదం ఆట్టే దూరంలో లేదు. కాడి ఇంతదాకా పడేయక పోవడం సేద్యగాడి చేతకానితనం కాదు. 'కార్తె కార్తె ఓ కన్నీటి బిందువై/ చెక్కిళ్లమీద జాలిగా జారుతున్నా/ ఒక్క వాన చుక్కయినా చాలు/ వచ్చే 'కాఱు'కి 'చాలు'లో విత్తేందుకు చారెడు గింజలైనా దక్కేందుకు' అన్నది అన్నదాత ఆశావాదం. ఏ అమాత్యుల వారయినా సభల సాక్షిగా వల్లెవేసే  మన వ్యవసాయ సంస్కృతిలోని విలక్షణత వాస్తవానికి అదే. 'మూలావర్షం ముంచినా జ్యేష్ఠజల్లు తేలుస్తుంది' అన్న ఆశే అన్నదాతను ఇంకా కాడి కింద జార్చకుండా బతుకీడవనిస్త్తోంది. నూకలు కతికి బతికే జీవులకు బతుకులు మిగులుస్తోంది.
-కర్లపాలెం హనుమంతరావు
***




No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...