Friday, October 21, 2016

రాచకులం కన్నా యాచకులం మిన్న- ఈనాడులో ఒకనాటి వ్యంగ్యం



యాచకులు ఎక్కడుంటారో సంపదలు అక్కడ సమృద్ధిగా ఉంటాయంటారు.
భిక్షువులే సుభిక్షానికి ప్రత్యక్ష సూచికలు. కులాల వారీగా అధికారంలో పాలు  దబాయించి మరీ అడుక్కుంటున్న ఈ కాలంలో మా మానాన మేం మౌనంగా 'భిక్షాం.. దేహీ!' అనరుచుకుంటూ తిరుగుతున్నాం. అయినా మా మీదే అందరికీ అనుమానాలు! మాకే ఎందుకో ఇన్నిన్ని అవమానాలు?! పిడికెడు ముష్టికే పాపిష్టి జనాలకి కడివెడంత పుణ్యం సంపాదించి పెట్టడమేనా మేం చేసిన పాపం?
ఆ మాట కొస్తే యాచక భుక్తి భూం పుట్టకముందునుంచీ వస్తున్నదేగా! మా కులదైవం మహాశివుడు ఆది భిక్షువు. ఆ తోలువస్త్రధారి దర్శనంకోసం అలమటించే  భక్తులు సైతం మేం కనిపిస్తే చాలు.. ‘తోలు వలిచేస్తా’మని వెంటబడతారు! సాక్షాత్తూ లక్షీనాథుడై వుండీ  విష్ణుమూర్తి వామనావతారంలో బలిని మూడడుగులు అడుక్కుంటే 'ఆహోఁ! ఏం లీల!' అంటూ ఈలలేస్తారు! మేమేదో మా జానెడు పొట్టకోసం 'భవతీ.. భిక్షాం దేహీ!' అంటూ బజార్న పడితే పెద్ద రాద్ధాంతాలు సిద్ధం చేస్తారు!
ఇంద్రుడినుంచి.. హిరణ్యకశిపుడి వరకు.. దేవదానవులందరూ ఏదో ఓ సందర్భంలో సందు చూసుకొని  చేతులు చాచిన మహానుభావులే కదా! లేనివాడండే అందరికీ లోకువే కానీ.. ఆ దౌర్భాగ్యుడనేవాడే లేకుంటే బలినుంచి.. అంబరీషుడి వరకు.. కర్ణుణ్నుంచి.. దధీచి దాకా 'మహాదాతలనే కీర్తి కిరీటాలు గడించడం సాధించగలిగేవారా? చేతికి ఎముకలేదన్న ఆ ఖ్యాతి మా యాచక వృత్తివల్లనే  కదా సాధ్యమయిందీ?
బిచ్చగాళ్లంటే సర్కారుకైనా లెక్కుండదుకానీ.. నిజాయితీగా గణాంకాలుగానీ సేకరిస్తే  మా యాచ'కుల'దే మెజారిటీ వర్గం.  దామాషా ప్రకారం మా యాచకులే అన్ని చట్టసభల్లోనూ మూడొంతులు మించి ఉండాలి.  ఎన్నికలముందీ  ప్రజాప్రతినిధులంతా మా బిచ్చగాళ్ళ ఓట్లనీ అడుక్కున్న సంగతి అప్పుడే మర్చిపోతే ఎలా?
'అడగనిదే అమ్మైనా పెట్ట'దని మీరే అంటారు.  అడుక్కుంటుంటే 'ఎద్దులా ఉన్నావ్.. ఏదైనా పని చేసుకొని బతకరాదా?' అని ఈసడించుకుంటారు! పంట పొలాలన్నింటినీ కుహనా పరిశ్రమల కప్పనంగా  ధారాదత్తం చేసి ఉన్న దున్నపోతులకీ.. ఎద్దులకే పని.. పాటా లేకుండా చేసారు. మీ మాట విని పాపం ఆ మూగజీవుల నోటికూటిక్కూడా మేం పోటీకి పోనందుకు 'శభాష్' అని భుజం చరిచి మెచ్చుకోడం పోయి ‘శనిగాళ్ల’ని శాపనార్థాలా? చిన్ని కడుపుకోసం మేం పడే పాట్లనిలా చిన్నబుచ్చుతారా? ఎంతన్యాయం?
యాచకత్వాన్నింతగా తక్కువ చేస్తున్నారుగానీ అసలు అడుక్కోవడమెంత గొప్ప కళో ఏ జ్ఞానికైనా తెలుసా? అస్తమానం హస్తిన చూట్టూ కాళ్ళరిగిపోయేట్లు సియం సార్లు ఎన్నేసి సార్లు తిరిగొస్తున్నారు? ఒక్క పథకం.. ప్రాజెక్టు.. నిధి.. నిఖార్సైనది.. ‘ప్రత్యేక హోదా’లో  లేనిది సాధించుకొచ్చారా? ‘పని చేసుకో’మని మాకు ఉచిత సలహాలు దయచేయకుండా మా సలహాలు గానీ చెవినపెట్టుంటే ప్రపంచబ్యాంకునుంచైనా సరే ఎప్పటికీ తీర్చనక్కర్లేని అప్పులు.. కుప్పలు తెప్పలుగా తెచ్చిపడుండేవాళ్ళు కదూ ఇప్పటికే!
పుట్టినప్పట్నుంచీ ముష్టిబొచ్చె పట్టడం తప్ప మరొహటి ఎరగని పరమ వీర ముష్టి చక్రవర్తులు అడుక్కొక అరడజనుకు తగ్గని ఆగర్భ గడ్డ మనది. ఒక్క ముష్టి మేథావి దగ్గరైనా యాచకశాస్త్రంలో సక్రమంగా శిక్షణ ఇప్పించి ఉంటే.. ఉత్తర కొరియావాడి అణుబాంబేంటి.. వాడి బాబు చైనావోడి ‘మేకింగ్ ‘ కళక్కూడా కాపీలు అడుక్కునైనా తెచ్చి పడేసుండే వాళ్ళు కదూ మన  యువనిపుణులు!
పెరటి చెట్లం కాబట్టి మా కళ మీకెందుకూ కొరగాకుండా పోతోంది గానీ.. అమెరికా ఒబామాగారుకూడా మన యాచక నైపుణ్యాన్ని గూర్చి సందర్బం వచ్చినప్పుడల్లా ఆకాశానికెత్తేస్తుండేవారు.
పంచయితీలని, మండలాలని, జిల్లాలని, మంత్రి పదవులని, మంచి అధికార పదవులని, నిధుల్లో కోటాలని, పనుల్లో వాటాలని.. దేనికో దానికి.. ఎవరో ఒకరు.. ఎప్పుడంటే అప్పుడు.. దేవురించడం అధర్మం కాదు కానీ.. ఏదో రోడ్డువారగానో.. గుడి మెట్లమీదనో.. ఇంటి గుమ్మంలోనో.. ఒదిగొదిగి  నిలబడి 'ఒక్క రూపాయి ధర్మం చేయమ'ని వచ్చే పోయే అమ్మలు.. అయ్యలముందు  మేం చేయి చాపి అడగడంమాత్రం అధర్మం! ఏ రాజ్యాంగంలోని సెక్షన్ల ప్రకారం అడుక్కు తినడం శిక్షార్హమవుతుందో తేల్చాలి!
చదువుకున్న బాబుల్లాగా సర్కారు జాబులిప్పించాలని డిమాండ్లేమన్నా చేస్తున్నామా? డబుల్ బెడ్రూం ఫ్లాట్లు కావాలని.. రేషను బియ్యం కోటాలు పెంచాలని.. ధరలమాంతం పాతాళానికి దించాలని.. ధర్నాలేమన్నా చేస్తున్నామా? మగపిల్లకాయల మాదిరి ప్రేమించి తీరాలని యాసిడ్ సీసాల్తో ఆడపిల్లలెంట పడుతున్నామా? శనల్లుళ్లకు మల్లే అదనపు కట్నకానుకలు ముట్టకపోతే కట్టుకున్నదనైనా జాల్లేకుండా గేసునూనెతో కాలుస్తామని అల్లర్లు పెడుతున్నామా? ‘చందా’మావఁలకన్నా.. పార్టీ విరాళాలకు వేధించే యములాళ్లకన్నా.. పనులు తెమలాలంటే 'చాయ్.. పానీ'ల సంగేతేంటని నిలదీసే అవినీతివంతులకన్నా.. చీటికి మాటికి చీకటి మాటున తోటి తల్లులనైనా చూడకుండా ‘చీరలిప్ప’మని చికాకులేమన్నా పెడుతున్నామా? 'మాదా కబళం తల్లీ!' అంటూ మర్యాదపుర్వకంగానే కదా మా దారిన మేం  ఇంటి గుమ్మాలముందు గంటలకొద్దీ నిలబడుతున్నాం?
గొంతెత్తి అరవడం, గొప్పలు చెప్పడం , ఇచ్చకాలు పోవడం, భట్రాజులకు మల్లే  స్తోత్రాలు చదవడం.. యాచకుల నీచలక్షణాలని వెనకటి కెవరో మహానుభావుడు యాచకగుణాన్నిగూర్చి నిర్వచించాడంట! మంచిది. ఆ కొలమానం ప్రకారం చూసుకొన్నా కాన్డబ్బులకోసం జోలట్టుకు తిరిగే మా కుచేలజాతికన్నా ముందుచ్చోది నిత్యం రాజకీయాల్లో నలిగే పెద్దమనుషులేనంటే చిన్నబుచ్చుకోకూడదు మరి!
'సాధు మేధానిధి' అనే శతకంలో పుష్పగిరి అమ్మన అనే పెద్ద పండితుడు - ప్రపంచంలో బిల్ గేట్స్ బికారిలాగాను..  బికారి బిర్లా తాతలాగానూ మారువేషాల్లో తిరుగుతూ మాయ చేస్తుంటారని కుండబద్దలు కొట్టేసాడు. ఏ మాయలు మంత్రాల జోలికి పోకుండా కేవలం పొట్టకూటి కింత ముద్ద కోసం మాత్రమే జోలె పట్టుకొని తిరిగే మేమే ఎన్ని అవమానాలైనా భరించే అమాయకులం.
ఏ అమెరికానుంచి అధ్యక్షులవారో.. బ్రిక్స్  దేశాల్నుంచీ అధినేతలో   వ్యాపారొప్పందాలు అడుక్కునేందుకు  మన దేశానికి ఎప్పుడూ వచ్చి పోతుంటారు.  ఎప్పుడు పడితే అప్పుడు మమ్మల్ని వీధుల్లో కనిపించకుండా దాచేయాలనుకోడం..  చిన్నగాళ్లమనేనా పెద్దబిచ్చగాళ్లముందు మా కిన్నేసి అవమానాలు?! ధర్మం కాదు!
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు 24 అక్టోబరు, 2009 నాటి సంపాదకీయ పుటలో ప్రచురితం- చిన్ని సవరణలతో)

 (ఈనాడు యాఅమాన్యానికి- కార్టూనిష్టు శ్రిధర్ గారికి ధన్యవాదాలతో)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...