మా చిన్నతనంలో
వార్తాపత్రికల ప్రయోజనాలను గురించి రాయమన్న ప్రశ్న తరచూ మార్చి మార్చి వస్తుండేది.
వార్తాపత్రికలమీద పెట్టిన దృష్టి అవి తయారయే కాగితంమీద ఎందుకు పెట్టలేదనే సందేహం
ఎప్పుడూ నన్ను పీడిస్తుంటుంది.
రాతకు కాగితం
తప్పని సరి. కాగితాలు అందుబాటులో ఉండబట్టే కవులు.. కథకలూ.. మన జీవితాలతో చెలగాడమాడుతున్నది.
‘అలా కాదు.. కాగితం అంటూ ఒకటి హద్దుగా ఉండబట్టే కదా వాళ్ల ధాటికి సమాజం
తట్టుకో గలుగుతున్నది?’ లేకపోతే.. వాళ్ల ఆశుధారాశక్తికి మానవ
సంఘం ఎప్పుడో కొట్టుకు పోయుండేది.. అనే విరసలూ కద్దు. ఆ ఊసులు మనకిప్పుడు వద్దు. కాగితాలతో ఒనగూడే ఇతర ప్రయోజనాలూ బోలెడున్నాయి.
ముఖ్యంగా రాజకీయాల్లో! వాటిని గురించి ముచ్చటించుకుందాం.. ముచ్చటగా
ఉంటుంది.
మన దేశ మంత్రివర్యుడొకడు
చైనా సందర్శనకు వెళ్లాడుట ఒకసారి. అక్కడి అభివృద్ధిని ప్రత్యక్షంగా చూపించే
సందర్భంలో వంద కి.మీ పొడుగున్న ఒక వంతెనను చూపించి ఎంత పకడ్బందీగా అది కట్టబడిందో.. ఆ కట్టుబడికి ఎన్ని మిలియన్లు ఖర్చు అయిందో వివరించాడు చైనా మంత్రివర్యుడు.
మరో సందర్భంలో అదే మహాశయుడు ఇంకేదో టూరు సందర్భంగా ఇండియా వచ్చినప్పుడు.. ఇక్కడి అభివృద్ద్జిని
అతగాడికి వివరించాల్సిన బాధ్యత ఇదివరకటి మంత్రివర్యుడికే అప్పగించబడింది. ఆ నేపథ్యంలో ఒక ప్రాంతాన్ని
చూపిస్తూ 'మీ దగ్గరున్న వంద కి.మీ వంతెనకన్నా.. రెట్టింపుంటుందీ
నిర్మాణం. కాకపోతే ఖర్చు కట్టుబకి కాస్త ఎక్కువయింది..' అనంటూ ఏవేవో వివరాలు ఇచ్చుకుంటూ
పోతున్నాడు. అసలక్కడ ఏ వంతెనా లేకపోవడంతో నోరు వెళ్ల బెట్టిన చైనా పెద్దమనిషి.. అదే విషయం అడిగితే 'అక్కడే ఉంది.. మీకూ మాకూ తేడా.
మీకు కాగితాల ప్రయోజనం పరిమితంగానే తెలుసు. మాకు అపరిమితంగా తెలుసు' అనేసాడు మన ఇండియా పెద్దాసామి.
కాగితాలనగానే
సాధారణంగా మన మనసుల్లో మెదిలేవి బడిపిల్లకాయలు బస్తాల్లాంటి సంచుల్లో కుక్కుకొని మోసుకుంటూ
తిరిగే బుక్కులు..
వార్తా పత్రికలు, కార్యాలయాల తాలూకు దస్త్రాలు.. గట్రా!
రోడ్లమీద, పార్కుల్లో.. చెల్లా చెదరుగా
పడుండే పోగులు. రచయితలు, కవులు.. వాడే వాటితో ఏ ఉపయోగమూ ఉండక పోవచ్చుగానీ.. పాతకాగితాలను రోట్లో రుబ్బి ఆ గుజ్జుతో బుట్టలు చేసేది మా అవ్వ. కాగితాలను
రకరకాలుగా కత్తిరించి రంగులద్ది ఆ ముచ్చటైన బొమ్మల్ని ఇంటి గుమ్మాలకు వేలాడదీసేది మా
అత్త. కాగితాలు ఉండలుగా మార్చి పురుగూ పుట్రా లోపలికి రాకుండా తూములకు అడ్డం పెడుతుండేవాడు
మా తాత. బస్తాలకి
బెజ్జం పడి ధాన్యం
కారిపోకుండా కాగితాలడ్డం పెట్టి మా మామయ్య.. రాసుకునే బల్ల ఎత్తుపల్లాలు
సరిచేసుకునేందుకు ఉపయోగించి మా నాన్న.. కాగితాలు బహుళార్థ సాధకాలని నిరూపించారు. ఎదురింటి రెండు జడల సీతకి పొద్దస్తమానం మా బాబాయి పై డాబామీదనుంచి
గురిచూసి విసిరేదీ కాగితాలతో చేసిన రాకెట్లనే. మా పెద్దతమ్ముడు కాగితాలతో గాలి
పటాలు. చిన్న
తమ్ముడు కత్తి పడవలు చేసి ఆడుకునేవాళ్లు చిన్నతనంలో.
కాగితాల్తో
అన్నీ ప్రయోజనాలే అనుకొంటే పప్పులో కాలేసినట్లే. ఊళ్ళో మనుషుల్లేకుండా .. పొలం పుట్రా
ఉన్నవాళ్ల తాలూకు పత్రాలకి నకిలీలు సృష్టించి అమ్ముకునే మా ఊరి పుల్లారావులాంటి
నమ్మకద్రోహులకి ఈ కాగితాలే ఆసరా! కొంచెం బాధాకరమే కదా! మా ఊరి కరణం ఆంజనేయులుగారు ఇలాంటి
లాలూచీ వ్యవహారాల్లోనే బోల్డన్ని పచ్చకాగితాలు కళ్లచూసాడని చెప్పుకునే వాళ్ళు చుట్టుపక్కల
ఊళ్లల్లో.
అన్నట్లు
రూపాయి.. పది రూపాయల్లాంటి వాటి ముద్రణక్కూడా కాగితాలే కదా గతి! దేశ ఆర్థికస్థితంతా బంగారంమీదుందంటారుగానీ.. వట్టిదే. అదీ వట్టి కాగితాలమీదే
అధారపడుంది. మన దేశంలో బంగారం నిల్వలకు తగ్గంతగా మాత్రమే కరెన్సీ చలామణిలో ఉందంటే
నమ్మదగ్గ మాటేనా?
ఉత్తరాలు..
ఆత్మకథలు.. మంచి మంచి పుస్తకాల్లాంటి వాటికీ కాగితాలే ఆధారం. కాబట్టే.. ఆ పెద్దలు.. మహాత్ములెవ్వరూ మన కంటి ముందుక్కిడ ఇప్పుడు లేకపోయినా.. వాళ్ళు బోధించిన
మంచి సూక్తులు.. ఆలోచనలు మన మేథస్సుల ఎదుగుదలకు అంతో ఇంతో దోహదం చేస్తున్నాయి.
గత్సంలో పెద్దలమధ్య.. దేశాలమధ్య జరిగిన ఒప్పందాలు.. రాతకోతలన్నింటికీ
కాగితమే వేదిక. కాబట్టే కట్టెదుట వాళ్ళు కనిపించక పోయినా 'conversation
with the legends' సాధ్యమవుతోంది. గాంధీ మహాత్ముడు ఈ కాగితం విషయంలో
ఎంతో పీనాసితనం చూపించేవాడంటారు. తనకొచ్చిన ఉత్తరాల వెనక ఉన్న
ఖాళీ జాగానికూడా ఆయన వృథా పోనిచ్చేవాడు
కాదుట. మరీ వ్యక్తిగతానికి సంబంధించిన విశేషాలను మినహాయించి మిగతా సంగతులేవైనా సరే రాసుకొనేందుకు వాటిని ఉపయోగించే వాడుట. తనకొచ్చిన
కవర్లను చింపి కాగితాలుగా మార్చి వాటినీ వాడిన విచిత్రమైన పొదుపరితనం బాపూజీది. మరీ ఉపయోగం లేని చెత్తకాగితాలతో ఆశ్రమానికి అవసరమైన బుట్టలు.. తట్టలు.. వగైరా తయారు చేయించేవాడని వినికిడి.
ఆడపిల్లల సంసారాలతో
చెడుగుడు ఆడుకునే ఆకాశరామన్నలకూ ఈ కాగితాలే ఉత్తరాల రూపంలో సాయపట్టడం కొంత
విచారకరమైన విషయం. ఇప్పుడంటే విద్యుత్ బుగ్గలు కానీ.. ఒకానొక కాలంలో మునిమాపటి చీకట్లు
కమ్ముకోడానికి ఇంత సమయం ఉందనగానే నూనె దీపాలు శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉండేవాళ్ళు
ఆడంగులు. ముందురోజు దీపం గ్లాసులకు పట్టిన మసిని తుడిచేందుకు బొగ్గు.. ఆ తరువాత ఆ బొగ్గుమరకలు
పోవడానికి కాగితాలనే వాడేవాళ్ళు. కుంపటి
రాజేసుకొనేందుకు కావాల్సిన
మంటను అమ్మ కాగితాలు అంటించే సాధించేది. అద్దాలమీద మరకలు పోవాలన్నా.. ముందు ఏ పౌడరుతోనో
శుభ్రం చేసి ఆనక కాగితంతో తుడిచేస్తే అద్దం ఆడపిల్ల చెక్కిళ్లలాగా తళ తళలాడుతుంది.
ఇన్నేసి ప్రయోజనాలున్న
కాగితాన్ని ఆధునిక సాంకేతిక విజ్ఞానం పక్కన పెట్టేస్తోంది. పేపర్లెస్ ఆఫీసులమీద
మోజు పెంచేస్తోంది. విదేశాలలో టాయిలెట్ అవసరాలక్కూడా టిస్యూ పేపర్ వాడుతున్నారు.
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ స్థానంలో పేపర్ బ్యాగులను ప్రోత్సహిస్తున్నారు.
అయినా డిజిటల్ వర్చ్యవల్ వరల్డ్ విస్తురిస్తున్న కొద్దీ పేపరు ప్రపంచం
కుచించుకుపోతోంది.
ఒక రీము పేపరు
తయారవడానికి పెరట్లోని చెట్టూ చేమా ఉపయోగించాలి. పచ్చదనం తగ్గిపోతున్న కొద్దీ పర్యావరణానికి ముప్పు
పెరుగుతోందని పర్యావరణ శాస్త్రవేత్తల ఆందోళన.
కాదనలేం కానీ..
కాగితాల కత్తిపడవలతో.. గాలిపటాలతో బాల్యానికున్న అనుబంధాన్ని అంత తొందరగా మర్చిపోలేం
కదా! వేళకి జీతాలు రాని బడిపంతుళ్ల
ఇళ్లల్లో పుట్టిన పిల్లలం. మావి చిన్ని
బొజ్జలే అయినా వాటిని నింపేందుకూ ఆ కాలంనాటి అమ్మలను ఈ కాగితాలే ఆదుకొనేవి. పదో
పన్నెండో పాత వార్తా పత్రికల పేపర్లను సీతయ్య చిల్లర దుకాణంలో మారకానికని వేస్తే
వచ్చిన పప్పూ బియ్యంతోనే బిడ్డలకొక పూటైనా కడుపు నిండేది. పొట్టకోస్తే కనిపించే
అక్షరం ముక్కే కాదు.. పొట్ట హరాయించుకొన్న పులుసు ముక్కలక్కూడా కాగితాలే ఆధారంగా గడిచిన
ఆ కాలాన్ని అంత తొందరగా మర్చిపోగలమా?!
అలాంటి కాగితంమీదకు
జాగిలంలా వచ్చిదూకుతోంది ఆధునిక సాంకేతిక
విజ్ఞానం. అభివృద్ధికి కాలడ్డం లేం.. అలాగని మధుర స్మృతుల
పేటికను కాలప్రవాహానికి వడ్డలేం! ఇదో విచిత్రమైన సంధి దశ చీలే
రెండు సంస్కృతుల కూడలిమీద నిలబడ్డ మా తరానికి.
--కర్లపాలెం హనుమంతరావు
వాకిలి- ‘లాఫింగ్ గ్యాస్ ‘- అక్టోబరు, 2016 సంచిక ప్రచురణ
No comments:
Post a Comment