‘రోజూ ఉండే
రాజకీయాలకేం గానీ ఇవాళ నీకు మహాభారతంలోని ఓ మంచి కథ చెప్పాలనుందిరా!'
'కహానీలు చెప్పడంలో
నిన్ను మించిన మొనగాడు లేడుగా! బాదేయ్ బాబాయ్!'
'సృంజయుడనే
ఓ రాజుగారికి సంతానం లేదు. నారదులవారో సారి చూడ్డానికని వచ్చినప్పుడు రాజు కోరితే
'గుణవంతుడు, రూపవంతుడయిన కొడుకు పుడతాడ’ని ఆశీర్వదించాడు.’
'గుణాన్నేమన్నా
కోసుకు తింటామా? రూపాలతో ఏమన్నా వ్యాపారాలు చేయబోతున్నామా? వాడి చెమట, రక్తం, ఉమ్మి, కన్నీళ్లుకూడా చివరికి
కాసులుగా మారిపోవాలి. అట్లాంటి రూకలు రాల్చే
పుత్రుణ్ని ప్రసాదించండి స్వామీ!' అని కోరుకున్నాడా రాజు. అట్లా పుట్టిన సుపుత్రుడే
సువర్ణష్ఠీవి.'
'ఆ నడిచే ఏటియంగానీ ఇంకా ప్రాణాలతో ఉంటే.. అర్జంటుగా అడ్రస్ చెప్పెయ్ బాబాయ్! అసలే మన కష్ణమ్సోళ్ళు గోల్డు గట్రాలు గీకే పనుల్లేక పాపం గోళ్లు గిల్లుకుంటున్నారూ!'
'హుష్ఁ! ముందు
కథ విన్రా! ఆశకొద్దీ ఆ బంగారు బాబుని దొంగలు ఎత్తుకెళ్లా రోసారి. నిధులకోసం పొట్టకోసి
చూస్తే వట్టి పేగుచుట్టలు, మాంసం ముద్దలు! రక్తధారలు మినహా మరేవీఁ కనిపించక చెత్త కుండీలో
పారేసి పోయారు చిర్రెత్తిపోయి. రాజుగారి దుఃఖం సంగతింక చెప్పాలా? నారదులవారా పుత్రశోకానికి
చలించిపోయి 'అందుకే ఎర్ర చందనం దుంగల్లాంటి బిడ్డల్ని కాదు.. ఎవర్ హీరో చంద్రబాబులాంటి
మచ్చలేని చంద్రుళ్లను కొడుకులుగా కోరుకోవాల'ని
మందలించాడు. మళ్లీ సువర్ణష్ఠీవిని బతికించి
పోయాడు'
'కథ బాగుంది
కానీ బాబాయ్ .. ఇప్పుడా గోల్డుబాబుగాడి గోలింతర్జంటుగా ఎందుగ్గుర్తుకొచ్చిందో?!’
'ఇవాళ్టి పత్రిక
పరీక్షగా చూసుంటే నీకూ ఇట్లాంటి కథే ఇంకోటేదన్నా గుర్తొంచ్చుండేదేమో! అపరాల ధరవరలు
ఆకాశాన్నంటుతున్నట్లు.. అవినీతి అధికారుల ఆమ్యాఁమ్యాఁలు కూడా అంగారక గ్రహాని కెగబాకుతున్నాయంట..
వింటంలేదా!'
'పెట్రోలు
రేట్లు తగ్గించినట్లే తగ్గించి డీజిలాయిలుమీద దొంగ దెబ్బలు తీస్తే ఎంతధికారులయితే మాత్రం
పాప మింకేం చేస్తారు బాబాయ్.. పాపిష్టి పన్లకు
పాల్పడ్డం తప్ప?'
'అందుకేనంటావా
పోయినేడాది మన అధికారుల దగ్గర పట్టుబడ్డ అక్రమార్జన సొమ్ము సిటీ మెట్రో ప్రాజెక్టు సగం నిధులకు సరిసమానంగా ఉందీ! ఈ లెక్కన ఏ.సి.బి
వాళ్లు దాడి చెయ్యని.. చెయ్యలేని.. చెయ్యడానికి మనసొప్పని సొమ్మంతా లెక్క చూస్తే మన పోలవరం పెంచిన అంచనాలక్కూడా మించుంటుందేమో గదా?!
సమాచార హక్కు చట్టాలు, అన్నాహజారేలు అన్నం నీళ్లూ మానేసి దీక్షలకు దిగడాలు, అవినీతి నిరోధక శాఖల అడుగడుగు నిఘాలు,
కాలు కదిపినా చాలు వళ్లు ఝల్లుమనిపించే విజిలెన్సువాళ్లు ఝళిపించే కొరడాలు, న్యాయస్థానాల మార్కు నిష్పాక్షిక
విచారణలు, జనాల చీదరింపులు.. ఎన్ని ముళ్ల కంచెలడ్డంగా ఉన్నా .. ఇదేందిరా 'పచ్చి గడ్డే'
పరమాన్నమంత హుషారుగా మన అధికారులిలా చేలల్లోపడ్డ ఆంబోతుల్లా లంచాలు మేసెయ్యడాలూ?!'
'లంచాలు' ఏంటి
బాబాయ్.. మరీ అంత మొరటు పిలుపు? ముడుపులు, నైవేద్యాలు, నజరానాలు, మామూళ్లు, ఫలహారాలు,
ప్రసాదాలు, చాయ్ పానీలు, విరాళాల్లాంటి నాజూకు
సహస్రనామాలు వేలకు వేలుంటేనూ! అయినా ఇవాళే ఈ అరాచకాలన్నీ కొత్తగా పుట్టినట్లా తత్తర్లేంటంట?
పరగడుపునే భగవంతుడి ముందు బోర్లాపడిపోయి 'నాకిది కావాలి.. వాడికది ఇవ్వద్దం'టూ కోరికల
చిట్టా విప్పి.. బదులుగా కొట్టే ముష్టి ' మూడ్రూపాల టెంకాయ' నే మంటారో?! దేవుడంతటి
వాడే దేవేరులవారి అనుగ్రహంకోసం పారిజాతపుష్పాన్ని సమర్పించుకోవాల్సొచ్చింది. రాజులనుగ్రహించే అగ్రహారాల కోసం కాదా కవులు ఏకాక్షులను సైతం ఏకాంబరులతో
కలిపి స్తోత్రపాఠాలు వల్లెవేసిందీ?! భూం పుట్టినప్పట్నుంచే బహుమానాలు పుట్టుకొచ్చాయంటారు
పెద్దలు. ఆదాము అవ్వలచేత సంసారం చేయించడానిక్కూడా సైతానుకి
ఆపిల్ పండు చవుఁరొదిలింది మరి! '
'ఆ లెక్కలిక్కడ
కుదరువురా తిక్క సన్నాసీ! జనంచాకిరీ చేయడానికని కదా సర్కారు నెల నెలా జీతభత్యాలు ధారపోస్తునదీ?
అదనంగా ఈ 'చాయ్ పానీ'లని గుంజటం అన్యాయ మనిపించడం లేదట్రా నీకూ?'
'నూలు పోగైనా
అందకపోతే చందమామక్కూడా వెలుగులందించాలనిపించని
రోజులు బాబాయివి! ప్రభుత్వందలాలకు బల్లకింది
చేతులదో రకమైన అందం చందం. 'ఠంచనుగా బడికి పోరా!' అంటే జీళ్లు కొనుక్కోడానికి డబ్బులిమ్మంటున్నాడు చడ్డీలేసుకోడంకూడా రాని చంటి
కుర్రాడివాళా రేపూ. నోరూ వాయీ లేని మూగ గేదైనా నోటికింత పచ్చిగడ్డందకపోతే పొదుగుమీద వేలైనా వెయ్యనివ్వదు
కదా! నోరున్న మనిషి.. అందునా సర్కారు నౌఖరు. నోరు కుట్టేసుకోమంటే దారం దబ్బనం తెచ్చేసుకుంటాడనే?!
ఇన్ని నీతులు వల్లేస్తున్నావ్ గానీ బాబాయ్.. నీ నాలిక్కే ఓ బొట్టు తేనెచుక్క అంటిందనుకో..
చప్పుమని చప్పరించెయ్యకుండా వుండగలవా? నీళ్లమడుగులో చేపలాంటిది
బాబాయ్ అధికార పదవి. తడవకుండా చేపెట్లా ఈతకొట్టలేదో..
డబ్బూ దస్కమంటకుండా అధికారి కూడా తన ధర్మానికి
న్యాయం చెయ్యలేడు.'
'ఆహాఁ! ఎంతమోఘమైనా
తర్కం లేవదిసావురా బాబ్జీ! మేతగాళ్లను కూడా ఓ గొప్ప సృజనాత్మక కళకారులుగా ఆవిష్కరించిన
తమ ఘనతను మెచ్చుకు తీరాల్సిందే!'
‘నీ మెప్పుల
మెడల్సు మెడల్లో వేసుకుని డప్పట్టుకొనూరేగాల్సింది నిజానికి నేను కాదు బాబాయ్! ఇక్కడ నయీం తరహా భాయీలతో
కల్సి అందినన్ని రాళ్ళు దండుకునే దండనాయకులు.
అక్కడ నయా నయా ప్రాజెక్టులడొంకల్లో దొరికినన్ని దోరమగ్గిన పళ్లు పోగేసుకునే సర్కారు దొరలు!
జీతమెలాగూ చేతికొచ్చేదే. గీతానికే చేతికళలవసరం.
వాటిమీదా నువ్విలా గీతాబోధనలు సాగిస్తే.. సర్కారువారి
దస్త్రాలు ఒక్కంగుళమైనా ముందుక్కదలని మొండి రథాలయిపోతాయ్. అమెరికాలాంటి అగ్రరాజ్యాల్లో
కూడా పన్లెంతో మందకొడిగా సాగే రోజుల్లో.. మన దగ్గర సర్కారు కార్యాలయాలెంత మందు దుకాణాల్లా కళకళ లాడేవో తెలుసా నీకు? అందుక్కారణం..
ప్రభుత్వం తాలూకు కామందులవారి క్కావలసినంత
మందు- మాకూ అందుతుండటమే! ఆర్థికరంగం పరిపుష్టి సర్కారు నౌకర్ల ‘ముష్టి’ పన్లమీదే ఆధార
పడుండేది.’
'బాగుందిరా
బాబూ తర్కం! నీ వాలకం చూస్తుంటే.. సర్కారు మార్కు అక్రమార్జనను కూడా ఏ సవరణలైనా చేసి
రాజ్యాంగబద్ధం చెయ్యాలనేట్లున్నావుగా?!'
'సందర్భానికి
తగ్గ సూచనిచ్చినందుకు నిన్నభినందించకుండా ఉండలేక పోతున్నా బాబాయ్! అక్రామార్జనను సర్కారుద్యోగుల
హక్కుగా గుర్తించి తీరాల్సిందే! సిటిజన్ ఛార్టుల్లో మాదిరి ప్రభుత్వ కార్యాలయాల్లో
'ఈ ఫలానా పనికి పైన ఇంత.. ఆ ఫలానా పనికి అడుగునింతింత'ని రేట్లు ఫిక్స్ చేసేస్తే.. అస్పష్టత తొలగిపోతుంది. అవాయిడబుల్ పోటీలు.. అన్వాంటెడ్ లిటిగేషన్లతో అయే జాప్యం నివారణయిపోతుంది. ఆదాయానికి
మించిన ఆస్తులున్నవారిని గుర్తించి గౌరవిస్తే.. తరువాతొచ్చే తరాలకు ప్రేరణ కల్పించినట్లవుతుంది. ఆదాయప్పన్ను వెల్లడి
పత్రాల్లో కూడా అదనపు ఆస్తులు ప్రకటించుకునే
సంస్కరణలు వెంటనే చేపటాల్సుంది. జీతభత్యాల తరహాలో గీతభత్యాలమీదా రాయితీలు ప్రకటించాలి. అవినీతి
నిరోధక శాఖ, విజిలెన్సు డిపార్టుమెంటులాంటి అభివృద్ధి నిరోధక శాఖలను వెంటనే రద్దు చేసెయ్యాలి.
ఆ ఆఫీసు కార్యాలయాలను సర్కారుద్యోగుల బేరసారాల
కేంద్రాలుగా మార్చాల్సుంది వెంటనే. ఆవినీతి
నిరోధక శాఖ సిబ్బందిని నీతి నిరోధక కార్యకలాపాలకు ఉపయోగించుకోవడం ద్వారా సమస్యలుత్పన్నం కాకుండా చూసుకోవచ్చు. అక్రమ కట్టడాలను
క్రమబద్ధీకరించే పద్ధతిలోనే అక్రమార్జనలనుకూడా సక్రమార్జనలుగా గుర్తించే పథకాలు వెంటనే
చేపట్టాల్సుంది. అధికారులు.. ఉద్యోగులు నానాగడ్డీ
కరిచి పోగేసుకొనే సంపదలను దాచుకొనేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో స్వఛ్ఛంద
ప్రకటనలు వచ్చే వరకు నల్లసరుకును భద్రపరుచుకొనేందుకు
సర్కార్లే గిడ్డంగులను నిర్వహించాల్సుంది. ఇసుక తవ్వకాల్లాంటి భారీ ప్రాజెక్టుల్లో
పోగైన సొమ్ముకా గిడ్డంగులు చాలని పక్షంలో నేలమాళిగలు ఏర్పాట్ల దిశగా వెంటనే
చర్యలు చేపట్టాల్సుంది. లంచగొండులకు తగినంత ధీమా కలిగిస్తే. విదేశాల్లో మూలిగే మన సొమ్మంతా స్వదేశానికి తరలొచ్చి జాతివనరుల నిర్మాణంలో
తనవంతు నిర్మాణాత్మక పాత్ర తప్పక పోషిస్తుంది. ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో ఎప్పుడూ
మనదేశం నుంచీ కేవలం ఒక్కరడజను మించి పేర్లు కనిపించక పోవడం సిగ్గుపడే విషయం. నల్లధనానిక్కూడా చట్టబద్ధత కల్పిస్తే
ఒక్క మనదేశంనుంచే ఊరికి వకరడజనుకు తగ్గకుండా
కుబేరులు బైటపడ్డం ఖాయం. ఏమంటావ్ బాబాయ్?'
'నా మనసులోని
ముచ్చట బైట పెట్టాలంటే నువ్వు నాకూ ముందొక వెయ్యినూటపదహార్లచ్చుకోవాలంటాను. హ్హాఁ..
హ్హాఁ.. హ్హాం!'
‘!..!..!’
-కర్లపాలెం హనుమంతరావు
((ఈనాడు 18, నవంబరు, 2011లోని సంపాదకీయం పుటలో ప్రచురితం-కొద్ది సవరణలతో)
No comments:
Post a Comment