Wednesday, June 6, 2018

గతం ఘనం – ప్రస్తుతం సతమతం – మన తెలుగు
బుద్ధుడి బోధనలు సాగింది  పాలీ భాషలోనో, అర్థ మాగధి భాషలోనో.. మొత్తానికి ఆ భాషలో తెలుగు పదాలు కొన్ని(సుమారు 60) కనపడుతుంటాయంటారు. మనం ఇప్పటికీ వాడుతున్న అనేక తెలుగు పదాలు బుద్ధుని కాలంలో దైనందిక జీవితంలో వ్యవహారంలో ఉండేవని శ్రీ చీమకుర్తి శేషగిరిరావు తన 'తెలుగులో పాలీ పదాలు' పుస్తకంలో పేర్కొన్నారు.
పైశానీ భాషలో కూడా తెలుగు పదాలు ఉన్నాయని తిరుమల రామచంద్రగారి అభిప్రాయం. బౌద్ధ కొరియా యాత్రికుడు ఒకాయాన ఆరో శతాబ్దంలో చైనా, ఆఫ్ఘనిస్తానుల మీదుగా వచ్చి ఈ దేశంలో  కైబర్ కనుమల నుంచి మన నాగార్జునకొండ వరకు పర్యటించి వెళ్లాడు. ఆయన తనకు తెలిసిన ప్రాకృతం మాట్లాడినా ఆంధ్రదేశంలో ఎక్కడా ఇబ్బంది కలుగలేదని రాసుకున్నాడు! ప్రాకృత శబ్దం మన తెలుగు భాష పూర్వ రూపానికి దగ్గరగా ఉంటుందని  తిరుమలవారి థియరీ. 
సుమేరియన్ భాషలోనూ తెలుగు పదాలు ఉన్నాయన్నట్లు శ్రీ రాంభొట్ల కృష్ణమూర్తి ఏదో సందర్భంలో రాసినట్లు గుర్తు. ఆయన దగ్గర సుమేరియన్ భాషాకోశం మొదటి భాగం ఉందిట. (మొత్తం నలభై భాగాలు). తుర్కీ నుంచి గంగామైదానం వరకు ఏదో ఒక ఉమ్మడి నాగరికత ఒకానొక కాలంలో విలసిల్లినట్లు రాంభొట్ల అభిప్రాయం! భాషల మధ్య ఆదాన ప్రదానాలు సహజం. సుమేరియన్ల .. మన భాషల మధ్యా ఆ తరహా  ఇచ్చిపుచ్చుకోవడాలు  జరిగివుండవచ్చని కృష్ణమూర్తిగారి  ఆలోచన.
ఇప్పటి బోధన్.. ఒకప్పటి సోదనం. ఏదో పెద్ద విశ్వవిద్యాలయ ప్రాంతం కూడా అప్పట్లో. 'బావరీ' గోత్రానికి చెందిన పెద్దాయనెవరో దానికి అధిపతి. అది బుద్ధుడు జీవించి ఉన్న కాలం. తధాగతుణ్ణి కలుసుకొనేందుకు సుమారు ఓ వెయ్యి మంది బావరీ పెద్దాయన శిష్యులు రాజగృహం (పాటలీపుత్రం) పర్యటించారు. ఆ బృందంలో అదృష్టవశాత్తూ ఒక చిత్రకారుడూ ఉన్నాడు. బుద్ధుని బోధనలు సాగుతున్న సమయంలో తెర వెనక నుంచి అతగాడు ఆ శాంతమూర్తి బాహ్యరూపం (ఔట్ లైన్)  గీసుకున్నాడు. తరువాతి సిటింగులో కన్నూ, ముక్కూ, చెవులూ.. వంటివి గుర్తుంచుకొని తీరిగ్గా చిత్రం పూర్తిచేయాలని ఆలోచన. ఆ చిత్రకారుడు అనుకొన్నట్లే జరిగింది.. కానీ కొద్ది తేడాతో! తధాగతుడి బాహ్యాకారాన్ని యథాతధంగా ఉంచి ఏ ప్రాంతానికి చెందిన శిల్పులు ఆ ప్రాంతానికి చెందిన మనిషి ముఖకవళికలతో బుద్ధమూర్తిని చిత్రించుకొన్నారు! చైనా, ఆఫ్ఘనిస్తాన్, జపాన్, బర్మా, ఇండోనీషియా, భారతదేశాలలోని బుధ్ధవిగ్రహాలు ఆయా దేశవాసులను పోలివున్నా.. బాహ్యరూపం మాత్రం మన  చిత్రకారుడు సమకూర్చిన విధంగా  ఉండటం తెలుగుజాతికి గర్వకారణం.
బుద్ధుని విహార(బిహార) భూమిని తెలుగునేలకు తరలించిన ఘనత తెలుగువాడిది. బుద్ధుని విచారధారను బావరీ విశ్వవిద్యాలయ విచారధారగా మార్చుకున్న మేధస్సూ మన తెలుగువాడిదే.
శ్రీ పర్వతం తూర్పునున్న ఓ కుగ్రామం నాగార్జునుడి జన్మస్థానం అని ఓ నమ్మకం. అద్వైతం, మాయావాదం, నేతివాదం, అవతారాలుగా నేడు ప్రచారంలో ఉన్న హైందవ భావజాలానికి ఆ ఆచార్యుడి  అద్వం, శూన్యం, విజ్ఞానం, బోధిసత్వం ప్రభృత భావాలే మూలాలు. బౌద్ధం మహాప్రచారంలోకి వచ్చి మహాయానంగా వృద్ధిపొందిందీ మన  ఆచార్యుడి ఆధ్వర్యంలోనే! నాగార్జునుడి కొత్త ఆలోచనలకు పురిటిగడ్డ   తెలుగుభూమి! నాగార్జునుడి 'సృహుల్లేఖ' (స్రిహిల్లేఖ అని కూడా అంటారు) శాతవాహనులతో ఆచార్యునికున్న సాన్నిహిత్యం తెలియచేసే పత్రం. బౌద్ధులు కాకున్నా శాతవాహనుల నీతిపాలనకు, నేర నిరోధక చర్యలకు  బౌద్ధధర్మమే కేంద్రబిందువయిందని పరిశోధకుల మాట. దేశంలోని అధిక భాగాన్ని ఏలిన ఈ తెలుగు ప్రభువుల పాలనలో తెలుగువారి ప్రభ సహజంగానే దేశమంతటా వెలుగులు విరజిమ్మింది. పాటలీపుత్రంలో 'ఆంధ్రభృత్యులు'గా పేరొందిన శాతవాహనులలో సిముక సాతవాహనుడు దక్షిణాపథాన స్వతంత్రంగా రాజ్యమేలిన తెలుగు చక్రవర్తి. పాటలీపుత్రపు  పండితులు రాసిన పురాణాలలో 'అంధ్రుల' వంశావళి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
తదనంతరం వచ్చిన ఇక్ష్వాకులూ తెలుగు రాజులే. ఆ ప్రభువులు పాలించిన భూమి విస్తృతమైనది కాకపోవచ్చు.  కానీ సృష్టించిన శిల్పసంపద  అపారమైనది. ఇప్పటికీ తెలుగువాడలలో కనిపించే ఆ శిధిల శిల్పకళల ఆధారంగానే మాన్యులు కె.కృష్ణమూర్తి ఆనాటి ఆటపాటలు, వేషభూషణాలు, సాంఘిక పరిస్థితులను గూర్చి ఆసక్తికరమైన గ్రంథాలెన్నో ప్రచురించారు. శాతవాహనుల, ఇక్ష్వాకుల కాలం నాటి సాహిత్యం, శాసనాలు తెలుగు ప్రాకృతంలో కనిపించడం తెలుగువారికి గర్వకారణం.
తెలుగు నడిగడ్డ మీద వెలసిన శ్రీ పర్వతానికి దేశ విదేశాల నుంచి బౌద్ధులు, పండితులు విచ్చేసేవాళ్లు. అక్కడ ఒక మహావిశ్వవిద్యాలయం విలసిల్లింది కూడా. మహాయానమే కాదు.. వజ్రయానమూ ఇక్కడి నుంచే ప్రపంచం నలుదిక్కులకూ వ్యాపించిందంటారు. ఇప్పటి  టిబెట్టులో వర్ధిల్లుతున్నది ఈ వజ్రయానమే.  టిబెట్టుకీ తెలుగు గడ్డకి బౌద్ధం ఒక ఆధ్యాత్మిక బంధం.   
ఒకానొక కాలంలో ఆంధ్రదేశానికి నౌకావ్యాపారం ప్రధాన ఆదాయ వనరు. దేశదేశాల నుంచి వ్యాపారులు వచ్చి సాగించే బేరసారాలకు  వ్యావహారిక భాష  తెలుగు ప్రాకృతమే.
ఇక్ష్వాకుల కాలంలో 'శైలీయులు' బౌద్ధంలో ఒక ప్రత్యేకశాఖ. ఇండొనేషియాలో రాజులుగా వర్ధిల్లిన శైలేంద్రులు ఈ  శైలీయశాఖా సంబంధితులే కావచ్చని ఒక విశ్వాసం.
తెలుగు  ప్రాకృత సాహిత్యాన్ని విదేశీయులు .. ముఖ్యంగా జర్మనులు  సొమ్ము చెల్లించి మరీ కొనుక్కుపోయేవారు. ఇప్పటికీ జర్మనీలో పది పన్నెండు విశ్వవిద్యాలయాలు ఈ ప్రాకృతభాష మీద పరిశోధనలు కొనసాగిస్తున్నాయ్.
జైన ధర్మం, తెలుగు భాష మధ్య గల బంధం దృఢమైనది. జైనులు ఎక్కడ ఉంటే అక్కడ ప్రాంతీయ భాషలను క్రమబద్ధీకరించేందుకు తగుసూత్రాలను రూపొందించారు. సామాన్యులకు చదువు సాములు నేర్పించారు. గణితవిజ్ఞానం  బడుగులకు చేరువయింది జైనుల పుణ్యం వల్లే! జైనంతో సాహచర్యం వల్ల సమాజానికి ఆ ధర్మం పట్ల విశ్వాసం వృద్ధి అయింది. ఆలయాల్లో  గీతాలు పాడేవాళ్ళు జైనులు. ఆ గీతాలే ఇప్పుడు నాటి మన  తెలుగు భాషాచరిత్ర ఆనవాళ్ల పరిశీలనకు ఉపకరిస్తున్నాయి. బౌద్ధులూ ప్రజల చదువు సంధ్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించిన బుద్ధిజీవులే. జైనులు, బౌద్ధులు ఆంధ్రదేశంలోని శిల్పకళకు కొత్త హంగులు తీర్చిదిద్దిన  కళాకారులు, కళాపోషకులు. బౌద్ధులు బోధిసత్వుని కథలను  నిరంతరాయంగా పారాయణం చేయడం ద్వారా  ప్రజలలో  పఠనాసక్తి  పెంపొందించినట్లు పరిశోధకుల మాట.
బౌద్ధం కారణంగా ప్రపంచానికి ధర్మకేంద్రంగా వర్ధిల్లిన ఘనత మన తెలుగు గడ్డది.  సన్యాసులకు, బ్రహ్మచారులకే పరిమితం అనుకున్న బౌద్ధాన్ని  సంసారులూ ఆచరించదగ్గ ధర్మంగా ఆచార్య నాగార్జునుడు తీర్చిదిద్దాడు.  ఆంధ్రదేశంలోని జైనులూ ఆ మార్గంలోనే సాగి తమ వంతు బాధ్యతగా సామాజిక సంస్కరణలకు పూనుకున్నారు. శ్వేతాంబరులకు, దిగంబరులకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం వహించిన యూపనీయులు తెలుగుజాతికి చెందిన వారేనని ఒక విశ్వాసం.
బాహ్యుబలి లాంటి భారీ విగ్రహాలు బోధన్ కేంద్రంలోనూ తెలుగువాళ్లు ప్రతిష్టించుకొన్నట్లు వినికిడి. జైన, బౌద్ధ మతాలలో భారీ విగ్రహాల ప్రతిష్టాపన ఒక ఆచారం. కక్షల కారణంగా అన్యమతస్తులు ఆ అఖండ శిల్పకళా వైభవాన్ని ఖండ ఖండలు చేయడం అన్యాయం. తెలుగునేల మీద ఊళ్ల పేర్ల పరిశోధనలకు పూనుకుంటే ఆ స్థలపురాణాల చాటున బోలెడంత తెలుగువాళ్ల చరిత్ర బైటపడుతుంది.
శాతవాహనుల తరువాత కొంత భూమిని  ఏలిన విష్ణుకుండినులకు నేటి నల్లగొండ జిల్లా ఇంద్రపాలనగరం రాజధానిగా ఉండేది. విష్ణుకుండినులు తమ పేరుకి 'ఇంద్రపాల్' అనే బిరుదును చేర్చుకొనే ఆచారం పాటించేవాళ్ళు. ఆ ఇంద్రపాలనగరం ఇప్పుడు  తెలంగాణాలోని ఏ ప్రాంతంలోదో? విష్ణుకుండినుల రాజవంశానికి చెందిన శాసనం ఒకటి బి.ఎన్.శాస్త్రిగారి పరిశోధనల్లో బైటపడింది కానీ నాటి ప్రాంతాల వివరాలు, ఆ రాజుల పాలనా ప్రాముఖ్యాలు వెలుగులోకి వచ్చే తీగెలేవీ ఆ పరిశోధన డొంకలో తగిలినట్లులేవు. డాక్టర్ అజయ్ మిత్రా చేసిన కొంత కృషి మినహా.. ఆ దిశగా  మరి దృష్టి మళ్లించిన పరిశోధకులు కరువయ్యారు! ఏదేమైనా నూతన విశ్వాసాలకు తెలుగు మాగాణం పురిటిల్లుగా మారడం ప్రతీ తెలుగుబిడ్డా ఎలుగెత్తి చాటవలసిన అంశం.
ఎవరు ఈ దేశంలో ఎక్కడ  పరిశోధనలకు పూనుకున్నా తెలుగువారికి సంబంధించిన చారిత్రకాంశాల  లింకులు కొన్నైనా తప్పక   బైటపడతాయి! దేశరాజధాని దిల్లీ తుగ్లకాబాదు ప్రాంతంలో ఒక ఆంధ్ర  ప్రముఖుని గోరీ కనిపిస్తుంది.  తుగ్లకుల ప్రధాని మాలిక్ మక్బూల్ సమాధి అది. ఆ ప్రముఖుని అసలు పేరు 'గన్నయ్య'! కాకతీయుల ప్రధానిగా ఆయన చాలా ప్రయోజకుడంటారు చరిత్రకారులు.
చరిత్ర పట్టం కట్టిన కుతుబ్ షాహీలు నిజానికి సొంతంగా ఏమంత ఘనకార్యాలు చేసిందిలేదు. పదవులను వేలం వేసి అమ్ముకునే పూర్వపు వ్యాపార ధోరణిని మానిపించి, సమర్థతను బట్టి నియమించడం, వారికీ వర్తించే విధంగా నియమ నిబంధనల రూపొందించడం ఆ వంశం చివరి పాలకుడి పాలనా సంస్కరణగా చరిత్ర శ్లాఘిస్తుంది.వాస్తవానికి ఆ సలహా పాదుషాకు ఇచ్చింది అతని ప్రధాని మాదన్న. మాదన్న తెలుగువాడు కావడం తెలుగువారికి గర్వకారణం.
సంస్కృతంలో పంచకావ్యాలకు  సుబోధకమైన  వ్యాఖ్యలు రాసిన  వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథసూరి మన మెదక్ జిల్లా కొల్చారంలో పుట్టిన  తెలుగు బిడ్డ. ‘న మూలం లిఖ్యతే/నానపేక్షిత ముచ్యతే’(మూలంలో లేనిది చెప్పను, అనవసరమైనదీ చెప్పను) అంటూ తన  రచనా సరళి గురించి  సగర్వంగా ప్రకటించుకున్న ఆ తెలుగు పండితుడి వ్యాఖ్యల సాయం  లేకుండా  సంస్కృత కావ్యాల పఠనం అంగుళమైనా ముందుకు సాగదు.
దేశదేశాల సంగీత విద్వాంసులు తన్మయత్వంతో ఊగిపోతూ స్వరార్చనచేసే త్యాగరాజస్వామి అరవదేశానికి తరలి వెళ్ళిన  మన తెలుగు తల్లి ఈత!
తెలుగు పండితులకు పొత్తాలకు పొత్తాలు వివరాలు నమోదు చేసే ఓపిక బొత్తిగా లేదన్న అపవాదు కద్దు. అందుకు విరుద్ధంగా మానపల్లి రామకృష్ణకవి పరిశోధనారంగంలో తన అసమాన ప్రతిభాసామర్థ్యాలను ప్రదర్శించిన విద్యావేత్త. భాండార్కర్, ఆప్టే, రనడే, సంపుర్ణానంద్, మజుందార్ వంటి ఉత్తమశ్రేణి పరిశోధకులతో పోల్చదగిన ఆ పరిశోధక విద్వాంసుడు ప్రతీ తెలుగువాడికీ గర్వకారణం.
సంస్కృతాన్ని జాతీయయభాషగా ప్రకటించాలని బెల్గాం జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో పట్టుబట్టిన కావ్యకంఠ శ్రీ గణపతి ముని తన పదో ఏట నుంచే బహుళ కావ్య రచనావతంస, నిరంతర పరిశోధక జిజ్ఞాసి. భారతీయ సంకీర్తనం అయనంతగా చేసిన వేదపండితుడు దేశం మొత్తంలోనే దొరకడు. ఆ సంస్కృతాంధ్ర మహాపండితుడూ  తెలుగుతల్లి నోముల పంటే!
వేదకాలపు సంస్కృతం పరాయి భాషలకు పదాలు పంచిపెట్టింది.  లౌకికభాష పేరున ఇతర భాషల  నుంచి తానూ పదాలు స్వీకరించింది. సంస్కృతంలో చాలా తెలుగు శబ్దాలు ఈ విధంగా చేరేందుకు ఆస్కారం ఉంది. 'తెలుగులో సంస్కృత పదాలు ఎందుకు వాడాలి?' అని మొండిగా వాదించే ప్రబుద్ధులు కొందరు అచ్చు తెలుగు పేరుతో  వికార శబ్దఘోషకు తెగబడడం విచారకరం. సంస్కృతం పేరుతో చలామణీ అయ్యే పదాలు ఎన్నో  తెలుగు ప్రాకృతాల నుంచి ఎగుమతి అయిన శబ్దభవాలేనని ఎంత తొందరగా  పెద్దలు  గ్రహిస్తే తెలుగు భాషకు అంత మేలు! సంస్కృతం ఏ రాష్ట్రానికీ చెందిన  ప్రాంతీయభాష కాదు. అది అఖండ భారతావనికి  చెందిన వాఙ్మయ సంపద. అందులో తెలుగుకూ సింహభాగం అధికారముంది.
దాదాపు రెండువేల ఏళ్ల కిందటే బౌద్ధ సాహిత్యం  తెలుగు, తమిళ భాషల్లోకి అనువాదమయింది. నాటకాలూ వేసేవాళ్లు ఆయా భాషల్లో. అప్పట్లో ఎవ్వరూ 'జననీ తమిళ భాషా' అని నినాదాలు చెయ్యలేదు. 'అవునవును' అంటూ ఏ తెలుగువాడు చప్పట్లు కొట్టిందీ లేదు.
కాలప్రవాహంలో కనుమరుగయిపోవడం  ఇతిహాసం సహజ లక్షణం.  వీలున్నంత  వరకు అందుకే దార్శనికులు చరిత్రగా దొరికిన విశేషాలను నమోదు చేస్తుంటారు.  తెలుగునాట ఈ తరహా చారిత్రిక జిజ్ఞాస  మొదటి నుంచీ కాస్త తక్కువే. కాబట్టే  తమవారు నడిచిన వచ్చిన దారుల్లో వారి అడుగుజాడల ఆనవాళ్ళు పట్టేందుకు తెలుగువాడు ఈనాడు ఇంతలా ప్రయాస పడుతున్నాడు.
ఈ దేశాన్ని తెల్లవాళ్లు పాలించే రోజుల్లో బ్రిటన్ నుంచి దిగివచ్చిన దొరలకు ఇక్కడి భాష, సంస్కృతల గురించి  ప్రముఖులు అవగాహన కల్పించే పాలనావిధానం అమలులో ఉండేది.  ఆ విధంగా ఉపన్యసించేందుకని వచ్చిన జర్మన్ పండితుడు మాక్స్ ముల్లర్  ఒక సందర్భంలో ఆర్య.. ద్రావిడ 'జాతుల'ను గూర్చి ప్రసంగించి వెళ్లిపోయాడు. కొంత కాలం తరువాత మరోసారి ఉపన్యసించడానికని వచ్చినప్పుడు గతంలో తాను చేసిన  పొరపాటున సరిదిద్దుకొనే ప్రయత్నం చేయబోయాడు. ఆర్య.. ద్రావిడ వైరుధ్యాలని   'జాతుల' మధ్య వైరుధ్యాలుగా తాను పొరపడ్డానని.. నిజానికి అవి 'సంస్కృతుల' మధ్య సంభవించిన వైరుధ్యాలని సరిదిద్దుకొనే ప్రయత్నం అది. 'ఆ తప్పు ఇప్పుడు సరిదిద్దుకోవడం కుదరదు' అన్నది ఇక్కడి దొరతనం. కారణం..  అప్పటికే ఇక్కడి అమాయక  భారతీయులని ఆర్య.. ద్రావిడ 'జాతులు'గా పాలకులు తమ పాలనా సౌలభ్యం కోసం  పూర్తిగా విడగొట్టేసేయడం!  విజ్ఞానశాస్త్రం కానీయండి, సంస్కృతులు కానీయండి, భాషలు కానీయండి.. రాజకీయాలకు విడగొట్టరానిదంటూ ఏదీ ఉండదుతమకు గిట్టుబాటు వ్యవహారంగా ఉండాలి.. అదే ప్రధానం
ఈ దేశంలోని చాలా ప్రాంతీయభాషలు ఆనాటి  విభజన రాజకీయాల మూలకంగా  ఇవాళ ఎన్నో విధాలా నష్టపోయాయి!  ఎక్కువ నష్టం దక్షిణాది భాషలదయితే.. వాటిలో  అత్యధిక నష్టం తెలుగు భాషది. ఎవరినో నిందించడం ఎందుకు? తెలుగు భాష నేటి దైన్యస్థితి తెలుగువాడి స్వయంకృతం.
తెలుగువాడు ఈ దేశం  గడ్డ మీద ఎన్నో  శతాబ్దాల బట్టి వివిధ రాజ్యాలు చలాయించిన మొనగాడు. ఘనమైన మన గతం అవగతం కాకే  భాష వాడకం మీదింతలా  సతమతం ప్రస్తుతం. తెలుగు చరిత్ర మీద చిన్నచూపు. ఇకనైనా సరిదిద్దుకుందామా.. కనీసం పదిమంది మధ్య పరువుగా నిలబెట్టే ఆత్మసమ్మానానికైనా!
***
-కర్లపాలెం హనుమంతరావు
06 -06 -2018
(భారత ఇతిహాసంలో ఆంధ్ర దేశం - జి.కృష్ణ- ఆంధ్రప్రదేశ్ - ఏప్రిల్ 1994 సంచిక- పు.13 -16- వ్యాసం ప్రేరణతో}