Sunday, September 6, 2020

వనభోజనాల పుణ్యం - -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు దినపత్రిక, 22 జూన్, 2003 నాటి సంపాదకీయ పుటలో ప్రచురితం)

 



 

'ముందస్తుగా సభను రద్దు చేస్తే ఎలాగుంటుంది?' అని అడిగాడు అధినాయకుడు.

'స్వార్థం. ఒప్పుకోం!' అంది ప్రతిపక్షం.

'వ్యర్థం. ఊరుకోం!' అంది మిత్రపక్షం.

'చూద్దాం' అంది అధికారపక్షం ప్రతినాయకపక్షం.

హఠాత్తుగా ఎవరికోచ్చిందో ఆలోచన 'కార్తీక మాసం కదా! వనభోజనాలకు పోదాం! పదండి! ఎప్పుడూ ఉండే రాజకీయాలే కదా! ప్రొటోకాల్స్ కూ ఫోన్ కాల్స్ కూ దూరంగా పెళ్లాం పిల్లల్తో గడిపొస్తే ప్రాణానికి తెరపి. నేచర్ థెరపీ!' అనుకుంటుండగానే సుందరం ఒక రౌండు చందాలు దండుకొచ్చేశాడు.

సుందరం అందరికీ కావాల్సినవాడు. కాంగ్రెస్ లో పుట్టి కమ్యూనిష్టుల మధ్య పెరిగి భాజపాలో చేరి టిడిపికి మారి టిక్కెట్టు దొరక్క తెరాసా గుర్తు మీద తూగో జిల్లాలో ముస్లిం లీగ్ మద్దతుతో తుక్కుతుక్కుగా ఓడి ప్రస్తుతం పక్క రాష్టం ఎగువసభలో నామినేటెడ్ సభ్యుడుగా ఉన్నాడు. రాజకీయం అంటే ఒక ఒరలో రెండు కత్తులో, రెండు వరల్లో ఒకే కత్తో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ప్రస్తుత రాజకీయాలు నడుస్తుంటే.. తలలు పండిన వాళ్లందర్నీ ఒక్క బంతిన కూర్చోబెట్టడం పూలబంతిని చుట్టడమంత తేలికా! పార్టీ ఫండనో, పెద్దింట్లో పెళ్లనో, సహాయనిధనో, సానుభూతి సభనో.. ఎప్పుడూ చందా దందా చేసేవాళ్ల మూటలు విప్పించడం మామూలు వాళ్లకు మాటలా? అందుకే సుందరమే స్వయంగా ఎవరూ అడక్కముందే ఈ వ్యవ'హారం' మెళ్లో వేసుకున్నది!

వనభోజనంలో పాల్గొనేందుకు బెయిలివ్వమని జైల్లో ఉన్న స్కాం లీడరు చేత రిట్టేయించడంతో పని ప్రారంభమయినట్లయింది. ఏదయినా సరే ఎదిరించి అడగనిదే ఊరుకోలేని ప్రతిపక్షనాయకుడు కూడా 'ఇది రాజకీయాలకు అతీతమైన భోజన కార్యక్రమం. సామూహికంగా తినాలన్న ఊహే సాహసోపేతమైన చర్య' అని ప్రశంసించాడు.

ఎలాగూ యాత్ర అర్థాంతరంగా ఆగిపోయింది కనుక బస్సులయ్యినా బాడుక్కి తిప్పుకోవచ్చని ఆయన వ్యూహం. కమిటీ ఫామ్ అయింది. విధివిధానాలు చర్చకు వచ్చాయి.

'తలకెంతకనుకుందాం..' అనడిగారెవరో.

'తలల లెక్కెందుకులే! తేలిచావదు కానీ, శాల్తీల లెక్క చొప్పున పోదాం ఈ సారికి'

'ఏ నుండి జడ్ వరకు ఒక్కోరికి ఒక్కో కేటగిరీ!'

'ఆ లెక్కైనా సులభంగా తేలదు'

'భోజనాల వ్యవహారం కాబట్టి పొట్టల సైజును iబట్టి వసూళ్లు చేస్తే పోలా' అంది ఒక అతివాదపక్షి.

'పెళ్లాం పిల్లలు కూడా ఉంటిరి. ఆ పద్ధతి కుదర్దు కానీ, మెంబరుకో వెయ్యనుకుందాం' అని తేల్చేశాడు సుందరం.

స్థలం విషయంలో మళ్లీ ప్రతిష్ఠంభన ఏర్పడింది. 'తెలంగాణా హద్దులు దాటి మేం రాం' అని మోగింది ఒక విభజన స్వరం.

'తలకోనయితే మాకు భయం' అని మరో నిరసన గళం మారాం.

గందరగోళం.. గందరగోళం. అందరినీ సుందరమే ఆపాడు. 'వార్' అంటేనే కదా మనకు దడ? వాళ్లనే హోస్టులుగా పెట్టుకుంటే పోలా! జనజీవన స్రవంతిలో కలవాలని కోరుకునే అతివాదులతో మాట్లాడతా! భోజన సదుపాయాలు.. అవీ.. ఏర్పాటుచేయమని షరతు పెడదాం!' అన్నాడు.

'ఐనా సరే! మా మిస్సెస్సులు రాలేరయ్యా! సీరియల్సు మిస్సవుతామని బెంగ. కస్సుబుస్సుమంటారు' అన్నదో సంసారపక్షి.

'ఆడవాళ్లకు టీవీ సెట్లు, మగవాళ్లకు పేక సెట్లు ఏర్పాటు చేస్తే సరి. ప్రత్యక్ష ప్రసారం బాధలెక్కడా లేకుండా చూసుకుందాం. సరా? పదిమందికి ఒక విస్తరి ఫ్రీ.. అంటే అంతా వచ్చి కలుస్తారు.'అన్నాడు సుందరం.

సుందరం మాటే నిజమయింది. నాలుగు బస్సుల జనం పోగయ్యారు. బస్సులు వేళకు మూడే దొరికాయ్! 'పోనీ .. మేం పాదయాత్ర చేస్తూ వస్తాం' అంది ప్రతిపక్షంలోని ఒక పక్షం.

'అట్లయితే మేం సైకిళ్ల మీద రావాల్సుంటుంది' ప్ర్రభుత్వపక్షం బెదిరింపు.

దారి పొడుగుతా విమర్శల దాడులే దాడులు. అందరికీ సమాధానం చెప్పగల సత్తా సుందరానికి ఉంది కనక సరిపోయింది. 

'కొండలన్నావూ! ఏవీ కొండలు? ఇంకా మేం ముందుకు రాలేం' అని ఒక వర్గం మారాం.

'అలాగే అన్నారు. పోనీ మనమే  తెప్పిందామా కొండల్ని. కంగారెందుకు?' సుందరం జవాబు.

'ఎత్తిపోతలన్నావూ! ఎత్తుభారమన్నావూ! ..ఏవీ?' మరో వర్గ ఎత్తిపొడుపు.

'ఎత్తిపోతలేగా! ఎత్తి పోయిద్దాం! అదీ ప్రాబ్లమేనా!' సుందరం చిర్నవ్వు సమాధానం.

'ఉసిరిచెట్లయినా లేకుండా ఇవేం వనభోజనాలయ్యా?' ఎవరో కసురుకున్నారు గాట్టిగా!

'పెద్దాయన పేరు చెబితే ఉసిరేం ఖర్మ సార్! ఏకంగా కల్పవృక్షమే కదిలొచ్చేస్తుంది. కాస్త కామ్ గా ఉందురు! 'అంటుండగానే బస్సులు బండల మధ్య ఆగిపోయాయ్!

రెండు గంటలవుతుంది. ఆకులు దొరకవని ఆకలి ఆగుతుందా?

ఉభయ కమ్యూనిష్టులకు ఒకే విస్తరి పరిచారు. కుడి ఎడమలు కుదరక అది కాస్తా చిరిగింది!

చీకటి పడిందాకా పేకాట మాత్రం జోరుగా సాగుతూనే ఉంది. ధర్మారావు తన నియోజకవర్గం ఓడిపోయాడు. వీడియో లైట్లలో కూడా ఆట కొనసాగేదేమో కానీ, ఆడవాళ్ల గోల పెరిగిపోయింది.

అంతలోనే మీడియోవాళ్లు ఊడిపడ్డారు హడావుడిగా. 'అవతల సభ రద్దైపోతుంటే మీరిక్కడ దాక్కొని విందు వినోదాలతో  ఎంజాయ్ చేస్తున్నారా?'అంటూ ఫటాఫటా ఫోటోలు పీక్కుంటున్నారు.

అంతటా హాహాకారాలు

మోసం.. కుట్ర.. ఘోరం.. అంటూ ఘొల్లుమంటున్నారు వనభోజనానికని వచ్చేసిన భోక్తలందరూ. చెట్టాపట్టాలేసుకుని వచ్చినవాళ్లు చెట్టుకొకళ్లు, పుట్టకొకళ్లుగా పారిపోయారు.  కడిగేద్దామంటే సుందరం కంటబడితేనా? ఇఫ్తార్ విందుకని ఎప్పుడో సిటీలోకి చెక్కేశాట్ట!

ఆటవిడుపు పేరుతో మూకుమ్మడిగా వల్లో చిక్కినట్లు తెల్లారి గాని తెలిసిరాలేదు పెద్దమనుషులెవ్వరికీ.

ఇంటికొచ్చిన రహస్య వీడియో చూసి వణికిపోయాడు అధికార ప్రతిపక్షనాయకుడు. 'వార్' వాళ్ల దగ్గర్నుంచి ముడుపులు అందుకుంటున్నట్లుంది వీడియోలో పేకాటలో తాను గెల్చుకున్న కౌంట్ కు  వాళ్ల నుండి డబ్బులు తీసుకునే దృశ్యం! అది గానీ బయటపడిందో తన పొలిటికల్ చాప్టర్ క్లోజ్!

'రాజ్యాంగం అయితే ప్రాబ్లం లేదయ్యా! పేక ముట్టనని పెళ్లాం దగ్గర ప్రమాణం చేసి మరీ వచ్చానయ్యా !'అని వాపోతున్నడు అలాంటి వీడియోనే మరోటి అందుకున్న అధికారపక్ష ప్రతినాయకుడు. 'అయితేనేం? ఆ ఆవిడ ఆయన పక్కనే ఉంది కదా.. పేకాటాడేప్పుడు?' అనడిగారెవరో!

'అదే కదా అసలు ప్రాబ్లమ్! ఆ ఆవిడ ఈవిడ ఒకరు కాదు! వీడియో బైట పడితే ఈవిడగారు మెళ్లో దిగేసిన సొమ్ము సమ్మంధాల మీద అటు ఆదాయప్పన్ను మొగుళ్లు, ఇటు ఇంట్లో పెళ్లామూ కళ్లుపడతాయని వణికిపోతున్నాడు. సభలో చెలరేగేవాళ్లూ, వార్ వాళ్లతో పేకాటాడేవాళ్లైతే మాత్రం ఆదాయ ప్పన్నువాళ్లకూ , పెళ్లాలకి వణక్కూడదా ఏం?'

 'మిత్ర పక్షాలవాళ్లకేమయింది? జరిగిందంతా  కుట్రేనని ఎప్పట్లా ఓ స్టేట్మెంటయినా పారేయచ్చుగా వాళ్లు ?'

'వనభోజనంలో విస్తట్లో పడిందంతా వన్యమృగాల ఆహరంట! లొట్టలేసుకుంటూ తిని చచ్చాం!' అన్నాడో బిక్కచచ్చిన మిత్రపక్షి.

'అర్థాంతరంగా సభను రద్దుచేయడం ఎంతో అర్థవంతమైన చర్య. ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలపరిచే ఈ చర్యను మేమంతా ముక్తకంఠంతో సమర్థిస్తున్నాం' అంటూ సభ చేసిన  ఓ ఉమ్మడి ప్రకటన జారీతో అంతా సర్దుకుంది ఆఖరుకి.

సుందరానికి ఈ సారైనా అధికార పక్షం టిక్కెట్టు ఖాయమేనా? ఎన్నికల   ఖర్చుక్కూడా ఇబ్బందీ లేదు. అంతా వనభోజనాల పుణ్యం!

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు దినపత్రిక, 22 జూన్, 2003 నాటి సంపాదకీయ పుటలో ప్రచురితం



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...