Friday, September 11, 2020

పుష్ప వివాదము - శ్రీ యామిజాల పద్మనాభస్వామి 'పుష్ప విలాసము' నుంచి సేకరించినది.

 












(కవులూ పువ్వులూ సమాన ధర్మము కలవారు. పరిసరాలను తమ తత్త్వముతో సుగంధభరితము చేయటమే కర్తవ్యం.  యథాశక్తి  ప్రాకృతిక దీక్షతో సామాజిక సేవాబద్ధులై పదుగురితో  'శభాష్' అనిపించు కొనవలె కాని..తమలోతాము తమ తమ ఆధిక్యతను గూర్చి వృథావాదనలకు దిగి  పలుచనగుట తగదు!

కవులతోనే లోకములు తెలవారుట లేదు. ప్రొద్దు గుంకుట లేదు. ప్రాపంచిక సుఖదుఃఖములను పానపాత్రలో కవుల పాత్ర కేవలము రుచి పెంచు మధుర ఫల రసము వంటిది మాత్రమే!  

 

 

ఇట్టి ఊహలు నాలో ప్రబలముగా  ఉన్న  వేళ   నాకు యాదృచ్ఛికముగా    యామిజాల పద్మనాభస్వామిగారి - 'పుష్ప్ప విలాసము', 1953 నాటి ఉగాది భారతి సంచికలో ప్రచురితమైన కవిత కంటబడినది. నాడూ ఈనాడు వలెనె కవులు వర్గముల   మధ్య ఒక స్పర్థ వాతావరణేమేదో ఉండి ఉండవలె. అందుచేతనే ఆనాటి కోకిల స్వరములోని మందలింపుల ఒక పరి ఆలకింపవలెనన్న లక్ష్యముతో  నేటి యువకవివర్యుల  సమక్షమునకు ఈ చక్కని కవితాఖండికను తెచ్చుటకు  అయినది. హితవైన పలుకులకు పాత-కొత్తల తారతమ్యములెందుకు?!

 

"పుష్ప వివాదము"

 

అదొక పూలతోట. పలురకాల పూల జాతులు నవయవ్వనముతో మిసమిస లాడుతున్నవి. ఒక్కొక్క తీగనె పరిశీలన చేసుకుంటో పోయి నేను ఒక తిన్నెపై కూర్చున్నాను. అంతలో మలయమారుత కుమారుని చక్కిలిగింతలతో చెలరేగింది పుప్పొడి దుమారం. చివాలున లేచింది మల్లె. వాదు మొదలైనది.

 

మల్లె

ఏమే! గులాబీ! నిన్న కాక మొన్న వచ్చి నువ్వు తోటివారినందర్నీ ఆక్షేపిస్తున్నావట? ఎందుకా మిడిసిపాటు?

 

తావుల్ జల్లుదువా సుదూరముగ? పంతాలాట సైరింతువా?

ఠీవిన్ నిల్తువ రెప్పపాటయిన? చూడ్కిన్ సైతువా గట్టిగా?

క్రేవన్ బాలసమీరుండు నిలువన్ ప్రేమించి లాలింతువా?

పోవే; నెత్తురు కోతలే కదనె నీ పుట్టింటి సౌభాగ్యముల్.

 

గులాబి మాటపడుతుందా!

సరే వారన్న మాటలు వినవు చూడు!

వలపులు గ్రుమ్మరించి సుమభామల చిక్కని కౌగలింతలం-

దలరెడు తేటిరాజునకు హాయిగ స్వాగతగీతి పాడునా?

వెలువము కర్కశంబు కద; చెల్మి యెరుంగను పాపజాతితో;

తల విలువన్ గణింపవలదా? మరి సంపంగి కన్నె; మల్లికా!

 అంటూ తన వత్తాసుకై మరో ప్రియపుష్ప సేహహస్తాన్ని అందుకున్నది.

 

కేతన

అదలా వుండనీ కానీ అక్కామల్లికా!

ఈ మందార మల్లిక నన్నేమని నిందించిందో విన్నావా?

అంటూ సందు చూసుకుని మరో కేతన తగువు మధ్యకు వచ్చి దూరింది.

 

నీకే చెల్లెనె కేతకీ; కనులలో నిండార దుమ్మోయగా;

తాకిన్ నెత్తురు చింద వ్రేళ్ళు కొరుకన్; సర్పంబుగా నిల్వగా;

ఆ కంఠంబుగ పాపజాతికి శరణ్యంబై మహారణ్య మం

దేశాంతంబుగ రాణివై మెలగ; ఏరీ సాటి నీకిలన్.

అంటూ మందరా మల్లిక ఎత్తిపోసిన తిట్లన్నిటినీ తిరిగి  గుర్తుకు తెచ్చుకుంది.

 

చేమంతిః మూతి మూడు వంకలు తిప్పి అంది

ఓహో! దాని అందానికి అది మురిసిపోవాలిః

పరువంబా! ఎదలోన మెత్తదనమా?భావోల్బణ ప్రక్రియన్ 

గరువంబా!మకరంద గంధ విలసత్ కళ్యాణ సౌందర్యమా?

బిరుసై నిప్పులముద్దమోము కద; యీ పేలాపనంబేల? సం

బరమా? వచ్చిన దాని నోర్చుకొనునా పైపెచ్చు మందారమా?

అనేసింది.

మందార వదనం మరింత ఎర్రబారింది రోషకషాయిత గళముతో

'ఔనౌను నీ శౌభాగ్యనికి నన్నాక్షేపిచ వద్దూ?'

పంతములాడబోకె పయివారలు విన్నను నవ్వుకొందురె;

ఇంతులు దండలల్లకొని యెంతయు ముచ్చటతో ధరింతురం

చెంతువు నీ విలాసము 'లిహీ' యగు మాలతికన్నె ముందు చే

మంతిరొ! ఊక రేకుల సుమంబను పేరది  నీది కాదటే;

అని తగులుకుంది.

(అంతలో చేరువలో నున్న సరోజిని ఫక్కున నవ్వి)

దానికెమిలే! మాలతిలో గర్వమున్నది.

అది రేరాణినటంచు త్రుళ్ళి పడునమ్మా! దాని లేనవ్వులో

పదముల్ పాడునటమ్మ! తుమ్మెదలు; శుబ్రజ్యోత్స్నపైపూతతో

పెదవుల్ నొక్కునటమ్మ! చందురుడు, నన్వీక్షించి బల్ టెక్కుతో

ఎదో అలాపము సేయు మాలతిని నేనిన్నాళ్ళు సైరింతునే?

అని రెచ్చగొట్టేసింది మరంత అనంద ప్రదర్శనయో సన్నివేశం రక్తి కట్టిస్తో!

 

మాలతి ముక్కు ఎగబీల్చి

సైరింపక యేమి సేయగలవే? నీ వాడిన మాటలో?

బంగరు కొండపై పసిమి వెన్నెల చిన్నెల బాలభామ రే

ఖంగనవో యటంచును  ఎగాదిగ చూచెద నన్ను; నీవు రే

లం గమనీయ హాస సువిలాస వికాసములొప్పువాని చం

ద్రుంగని మూతి మూసుకొని క్రుంగవొ? నీ బ్రతు కే రెఱుంగరో?

                      *              *                *    

చతురత మీర నిట్టి సరసా లిక చాలును కట్టిపెట్టు నీ

బ్రతుకు భవిశ్యమున్ కడిగివైచెద; నాచున బుట్టి, పీతలన్

కుతకన్ దాల్చి, నీదు కనుగొల్కుల చిమ్ముదు; నీటి పుర్వువై

అతుకులబొంతవై; కసబువాతెర విప్పకుమా సరోజినీ!

అంటూ ఏకంగా మొదటి పుష్పం మందారం మళ్లీ మాటలు అందుకోవడం౿

 

ఇల్లా ఒకరినొకరు ఆక్షేపిచుకుంటూ ఉండగా శ్రుతి మించిందని

కోకిలమ్మ

భళిరా! పువ్వ్వుల కన్నెలార మన సంబంధంబుతో లోకముల్

తెలవారున్, క్షయి సేయు, నవ్వుకొను, ప్రీతిం జెందు; మీ లోన మీ

రలయింపన్ తగవా? యటంచు పగలన్ న్యాయంబుగా తీర్చు రే

ఖిల పో పొండన గూసె 'కో' యని కుగూకారమ్బు తోరంబుగన్.

అంటూ మందలింపులకు దిగిపోయింది!

 

పూలు తమ తొందరపాటుకు సిగ్గ్గుతో తలలు వంచుకున్నవి. ఒకింత సేపు గడవనిచ్చి ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నవి. తిరిగి పువ్వుల తోట నవ్వుల తోటలా మారిపోయింది.

పువ్వులకన్నా  ఘనులమని కదా మనం మన కవులను  మహా గారవించెదము. ఆ అభిమానమును  నిలుపుకొనవలెను గాని.. దురభిమానము పూనగా పూతన బంధువర్గమును మించి ఈ పరస్పర యుద్ధములేమిటికోయి కవిమిత్రులారా! మరువము దండను బోలు సుగంధ పరిమళములు జల్లు మానవతా మాలికలకు చుట్టుకొను పూవులుగా అలరించుడు! చాలించుడిక ఈ ఈశు బుట్టు విసువు మాటల  రాళ్ల బుట్ట బుగ్గిలో బోర్లించుడు!

***

సేకరణః 

కర్లపాలెం హనుమంతరావు

11 -09 -2020

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...