74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని మోదీ తన 86 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో భద్రత, సార్వభౌమత్వాల పైన మాత్రమే కాకుండా దేశానికి తక్షణమే అవసరమని ప్రభుత్వం భావించే ప్రధాన ఆర్థిక, సామాజిక సంస్కరణలను కూడా ప్రస్తావించారు. సామాజిక రంగ సంస్కరణలలో భాగంగా బాలికల వివాహ కనీస వయస్సుపై ప్రభుత్వానికి గల పునరాలోచననూ ఆ సందర్భంలో దేశం ముందుంచారు. ఇదే ఏడాది ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమర్పిణ సమయంలో ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ బాలికల వివాహ కనీస వయస్సు విషయమై ఒక ప్రతిపాదన చేశారు. నాటి సభలో ఆమె చేసిన ప్రసంగం ప్రకారం తల్లీబిడ్డల ఆరోగ్యం, వారి పోషణల వంటి ప్రధానాంశాల పైన వివాహ వయస్సు చూపించే ప్రభావాల అధ్యయనం, ఆరు నెలల్లోగా సిఫార్సుల రూపంలో ప్రభుత్వానికి పత్ర సమర్పణ సమర్పించవలసి బాధ్యత అప్పగిస్తూ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటును గురించినదా ప్రతిపాదన. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ వంటి మేధావులతో సహా పలు శాఖల ఉన్నతాధికారులు కార్యాచరణ సభ్యులుగా సమతాపార్టీ మాజీ చైర్మన్ జయా జైట్లీ నేతృత్వంలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ జూన్ 2న టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడంతో కేంద్ర మంత్రి చేసింది ఉత్తుత్తి రాజకీయ ప్రకటన కాదని అర్థమయింది.
దేశం ప్రగతిపథంలోనే సాగుతోందని, ఉన్నత విద్యతో సహా మహిళలకు ఉద్యోగ, ఉపాధి రంగాలలో
మెరుగైన అవకాశాలు నిలకడగా పెరుగుతున్నాయన్న మంత్రిగారి ప్రసంగంలోని పరిశీలన
అవాస్తమనేందుకు లేదు. మాతాశిశు మరణాలను మరింత తగ్గించడంతో సహా వారి పోషకాహార స్థాయిలలో గణనీయమైన మెరుగుదల సాధించడం స్త్రీ శిశు సంరక్షణ సంస్కరణలకు
సంబంధించి ప్రధానమైన అంశం. ఏ వయసులో ఆడపిల్ల
ప్రసూతి దశలోకి ప్రవేశిస్తే తల్లీ బిడ్డలిద్దరికీ క్షేమమో ముందు లోతుగా అధ్యయనం చేయాలి. టాస్క్ ఫోర్స్
ఏర్పాటు ప్రతిపాదనలోని అంతరార్థం కూడా అదే!
ఆడపిల్లల వివాహానికి సంబంధించిన కనీస వయస్సు ఎంతో కాలంగా ప్రభుత్వాల ఆలోచనల్లో నలుగుతున్న
మాట నిజమే! మాతా శిశువుల ఆరోగ్యానికి సంబంధించి పెళ్లి వయస్సు ఒక ప్రధానమైన అంశం అన్నది న్యాయ మంత్రిత్వశాఖ అభిప్రాయం. కౌమార
దశ పరిపక్వ స్థితికి చేరక ముందే వివాహబంధంలో ఇరుక్కున్న ఆడపిల్లలకు అవాంఛిత గర్భధారణ బాధ ఒక్కటే కాదు, లైంగిక వ్యాధుల పీడ అంతకు మించి ప్రాణాంతకంగా మారుతున్నదని వైద్యనిపుణుల ఆందోళన చెందుతున్నారు. వివాహ వయస్సుకు మాతృత్వానికి మధ్యన ఉండే సంబంధం పరిశీలించడం, తల్లీ బిడ్డల మరణాల రేటు గణనీయంగా తగ్గించడం, మహిళలలోని పోషకాహారస్థాయిని గురించి కచ్చితమైన అంచనాకు రావడం.. టాస్క్ ఫోర్స్ కు విధించిన లక్ష్యాలలో కొన్ని! గర్భధారణ వయస్సు, ప్రసవించే సమయం, తదనంతరం తల్లి, నవజాత శిశువుల పోషణ స్థాయి.. తదితర ముఖ్యమైన అంశాలలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారానికై మార్గాలను సుగమంచేసే తీరుతెన్నులు సూచించడమూ టాస్క్ ఫోర్స్ కు నిర్దేశించిన లక్ష్యాలే. మాతాశిశువుల మరణాల తగ్గుదల, మొత్తంగా దేశాభివృద్ధిని ప్రభావితం చేసే సంతానోత్పత్తి రేటు, లింగ నిష్పత్తి వంటి పరామితులను పరిగణనలోకి తీసుకొని ఏ వయస్సులో పెళ్ళి జరిపిస్తే అటు బాలికలకు, ఇటు సమాజానికి కూడా క్షేమకరమో ఒక విస్పష్టమైన నిర్ధారణకు రావడం టాస్క్ ఫోర్స్ అంతిమ లక్ష్యంగా నిర్దేశించబడింది. మగపిల్లల ప్రస్తుత వివాహ కనీస వయస్సు 21 ఏళ్లు. దానికి సరిసమానంగా ఆడపిల్లల పెళ్లి వయస్సూ పెంచడం ద్వారా భావితరాలకు బలమైన పునాదులు వేయడం సాధ్యమవుతుందని టాస్క్ ఫోర్స్ చివరకు నివేదిక ఖరారు చేసింది. ఆ నివేదికే ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లో ఉన్నది. కేంద్రం
టాస్క్ ఫోర్స్ సిఫార్సుల మేరకు మగపిల్లలతో
సరిసమానంగా ఆడపిల్లల వివాహ కనీస వయస్సును 21 ఏళ్ళకు పెంచడమే సబబన్న నిర్ధారణకు వచ్చినట్లు
సమాచారం అందుతున్నది.
భారతదేశంలో, వివాహానికి కనీస వయస్సును
చట్టబద్ధం చెయ్యాలన్న
ఆలోచన మొట్టమొదట 1880 లో ప్రారంభమయింది. శారదాచట్టం ద్వారా బాల్య వివాహాల నిషేధం 1929 నాటికి న్యాయవ్యవస్థ
చట్రానికి చిక్కింది. ఆనాటి శాసనం ప్రకారం బాలికల కనీస వివాహ
వయస్సు 16 సంవత్సరాలు; బాలులకయితే 18. 1978లో బాలికలకు మరో రెండు, బాలులకు మూడేళ్లు పెంచుతూ చట్టం సవరించారు. ప్రస్తుతం అమలులో ఉన్న
చట్టం అదే. కనీస వివాహ వయస్సును పెంచేందుకు
వీలుగా అప్పట్లో శారదాచట్టాన్ని సవరించిన తీరులోనే ఇప్పుడూ మరో సవరణ రూపంలో స్త్రీ శిశు సంక్షేమ రంగాలలో కొత్త మార్పుకు చట్టబద్ధత తెచ్చి నూతన సంస్కరణలకు
శ్రీకారం చుట్టాలన్నది ప్రభుత్వ సంకల్పం.
మహిళలకు మగవారితో సరిసమానంగా
హక్కులు కల్పించడాన్ని రాజ్యాంగం కూడా గట్టిగా సమర్థిస్తున్నది. అబ్బాయిలకు
మల్లేనే అమ్మాయిలూ 18వ ఏట నుంచి ఓటు హక్కు, డ్రైవింగ్ లైసెన్స్, స్వంతంగా కంపెనీ
ప్రారంభించుకునే అధికారాలు కలిగివున్నప్పుడు ఒక్క వివాహ విషయంలోనే వివక్ష ఎందుకు? అన్న తర్కం వైజ్ఞానిక స్పృహ
పెరుగుతోన్న ఈ కాలంలో సమాజాన్ని తరచూ నిలదీస్తున్న మాట నిజం. ఆడవారి పట్ల అట్లా చిన్నచూపు
చూడాలని రాజ్యాంగంలో కూడా ఎక్కడా ప్రత్యేకంగా రాసిపెట్టి లేదనేదే న్యాయనిపుణులు చెబుతున్నారు.
చట్టం ఆచారాలు, మత సంప్రదాయాల క్రోడీకరణగా
చూడాలని వాదించే ఛాందసులు నుంచి మాత్రమే
స్త్రీల వివాహ వయస్సు పెంపుపై కొంత నసనసలు వినవస్తున్నాయి. భార్య
భర్త కంటే వయసులో పిన్నదై ఉండాలని ప్రాచీన సంప్రదాయం స్మృతులు ప్రమాణాలుగా చూపిస్తున్నాయన్నది వారి వాదన. ఇటీవల ఒక లా కమిషన్ పత్రిక కూడా అదే అంశం స్పష్టంగా పేర్కొనడం విశేషమే,
కానీ అది ఒకానొక ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని యధాలాపంగా చేసిన
వ్యాఖ్య మాత్రమే!
పురాతన కాలం నుంచి
ప్రపంచమంతటా వధూవరుల యుక్తవయస్సుల్లో అంతరం కొట్టొచ్చినట్లు కనిపించడం గమనించదగ్గ
విశేషం. కానీ నాటి సామాజిక పరిస్థితులకు
నేటి సామాజిక పరిస్థితులకు మధ్య హస్తిమశకాంతరం భేదం కద్దు. లాలా లజ్ పతిరాయ్ రచించిన 'ఏ హిస్టరీ ఆఫ్ ది ఆర్య
సమాజ్ ' గ్రంథంలోనూ వధూవరుల వివాహ కనీస
వయస్సు 16.. 25 సంవత్సరాలుగా నిర్దేశించబడింది. ఈ తేడా లైంగిక కోణంలో వారి వారి శారీరక
నిర్మాణాల ఆధారంగా సాగిన హిందువుల ఆలోచనగా మాత్రమే భావించాలి. పురుషులతో సమానంగా
ఆయుష్షు ఉన్నప్పటికీ వారి కంటే స్త్రీల శరీర నిర్మాణం మరింత పరిణతి చెందివుంటుందని
మహిళా హక్కు సంఘాల ప్రగాఢ విశ్వాసం. స్త్రీలు సాధ్యమైనంత తొందరగా పవిత్రమైన వివాహబంధంలోకి
ప్రవేశించడాన్ని అందుకే ఆ హక్కుల సంఘాలు ఆట్టే తప్పుపట్టే ఆలోచన
చేయనిది. కానీ, మాతా శిశువుల సంక్షేమం, సంరక్షణల విషయమై
వారి ఆందోళనలో ఏ మాత్రం రాజీ లేదు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్త్రీ, పురుషుల వివాహ కనీస వయస్సు సరిసమానంగా ఉండవలసిన అవసరాన్ని
ప్రశిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే జాతులు, మతాలన్నింటిలోనూ మహిళలకు, పురుషులకు మధ్య కనీసంగా చెల్లుబాటు అయ్యే వివాహ వయస్సు 18
సంవత్సరాలు నుంచి ప్రారంభమవుతున్న పరిస్థితి.
2018 నాటి మన ఫ్యామిలీ యాక్ట్
(కుటుంబ చట్టం)పై సాగిన సంప్రదింపుల పత్రంలోనూ ‘లా కమిషన్’.. భార్యాభర్తల మధ్య
వయసు తేడాకు సంబంధించి ఎట్లాంటి చట్టపరమైన
ప్రాతిపదికా లేద’ని విస్పష్టంగా చెప్పింది.
ఇద్దరు వ్యక్తులు జీవిత భాగస్వాములుగా మారటం అంటేనే, ఆ భాగస్వామ్యాలు సమాన హోదా కలిగివుండటం! రెండు
భాగాలకు సమాన స్థాయిలో గుర్తింపు
లభించినప్పుడే ఆ వివాహం అర్థవంతమైన సంసారానికి
దారితీసేది! స్త్రీల పట్ల అన్ని రకాల
వివక్షలను నిర్మూలించాలనే హక్కు సదస్సులు కూడా బాలికల వివాహ కనీస వయస్సు పెంపు పట్ల
ఎక్కడా పెద్దగా పట్టింపు పెట్టుకున్నట్లుగా కనిపించదు. అంతమాత్రం చేత మహిళల శారీరక, మేధో వృద్ధి రేటు
పురుషులను బట్టి మారుతుందని భావించే చట్టాల రద్దు పట్ల వాటికి పట్టుదల లేదని కాదు అర్థం.
ప్రపంచంలో 140 దేశాలలో
మహిళలతో సహా పురుషులకూ వివాహ కనీస వయస్సు 18 సంవత్సరాలు. మన దేశంలోనూ లా కమిషన్
మహిళకు వివాహం చేసుకునే కనీస వయస్సు 18 సంవత్సరాలుగానే
సిఫార్సు చేసివుంది గతంలో. ప్రభుత్వమూ ఆ తరహా ఆలోచనే చేస్తున్నప్పటికీ, ఆచరణ దగ్గరే తటపటాయింపు
ధోరణి తప్పడంలేదు. ప్రస్తుతమున్న వాస్తవ
గడ్డు పరిస్థితులే అందుకు ప్రధాన కారణం. అత్యంత వేగంగా పెరిగే ‘దేశజనాభా’ చింత
ప్రధాని మునుపటి
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కూడా ప్రతిఫలించడం గమనించాలి. వివాహ వయస్సును గురించి ప్రభుత్వ పునరాలోచన కూడా..
వాస్తవంగా చెప్పాలంటే.. అంతూపొంతూ లేకుండా పెరుగుతోన్న దేశ జనాభాను కట్టడి
చెయ్యాలన్న బాధ్యతాయుత భావన నుంచి పుట్టుకొచ్చినదే!
తొలి చూలు సందర్భం
మాతాశిశువుల ఆరోగ్య పోషణల పైన
అత్యధిక ప్రభావం చూపిస్తుందని వైద్యశాస్త్రం నిర్ధారిస్తోంది. మాతా శిశు ప్రసూతి మరణాల రేటులో పెరుగుదలకు
కారణం బాలికలు కౌమార దశలోనే తల్లులుగా మారడమని నివేదికలు మొత్తుకుంటున్నాయి. ఒక తాజా ‘నమూనా రిజిస్ట్రేషన్ విధానం’ ప్రకారం నేడు
దేశంలో ప్రసూతి మరణాల రేటు లక్షకు 122. బాగా తగ్గాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 (2015-16)
గణాంకాలు కితాబిచ్చుకున్నప్పటికీ.. ‘బాల్యవివాహాల
సమస్య’ దేశాన్నిప్పటికీ తీవ్రంగా సలుపుతోనే
ఉంది. భారతదేశంలో 18 ఏళ్ల లోపు సుమారు ఒకటిన్నర లక్షల మంది ఆడపిల్లలకు
పెళ్లిళ్ళు జరిగిపోతు న్నట్లు యునిసెఫ్ అంచనా వేసింది. ప్రపంచంలో మూడోవంతు
బాలికలతో కొలకొలలాడే మన దేశం బాల్యవివాహాలలో మాత్రం మొదటి స్థానంలో ఉండడం ఆందోళనకరమే కదా! అదీ 15 నుంచి 19 ఏళ్ల మధ్య
వయస్సులోనే వందలో 16 మంది బాలికలు వివాహితలుగా
మారుతున్న నేపథ్యంలో! జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత
అమర్త్య సేన్ ఆవేదన చెందినట్లు- పేదరికం, విద్యా స్థాయిలతో
ముడిపడి ఉండటమే బాల్యవివాహాల చిక్కుముడికి ముఖ్య కారణం. కోవిడ్-19 మహమ్మారి పురులు విప్పిన తాజా నేపథ్యంలో పెరుగుతున్న బాల్యవివాహాలే
అందుకు తిరుగులేని ఉదాహరణ.
బడులు మూతబడి ఆన్ లైన్
చదువుల సదుపాయం లేని మైనర్ బాలికల మీద పెళ్లిళ్ల కోసమై తల్లిదండ్రులు
వత్తిడి పెంచుతున్నట్లు వార్తలొస్తున్నాయి. చైల్డ్ హెల్ప్ లైన్ ద్వారా సమాచారం అందుకున్న
బాలల హక్కు సంఘాలు జోక్యం చేసుకున్న బాల్యవివాహ సంఘటనలు ఈ ఆగష్టు చివరి నాటికి సుమారు 5,584. దేశవ్యాప్తంగా పాఠశాలలు
మూతబడి, పేదరికం జడలు విదిల్చిన తరుణంలో మహమ్మారి పుణ్యమా అని పెళ్లిళ్లు సాధారణ దినాలలో
కన్నా చవకలో అవగొట్టేయచ్చన్న కన్నవారి కాపీనమే బాల్య వివాహాల పెరుగుదలకు ప్రధాన
కారణం.
విద్యకు వివాహానికి మధ్య విడదీయరాని సంబంధం ఉంది. 18 ఏళ్ల లోపు
వివాహితలలో దాదాపు సగం శాతం (44.7) బొత్తిగా పలక పట్టడమే రాని నిరక్షర కుక్షులని గణాంకాలు లెక్కలు తేల్చాయి. ‘బేటీ బచావో బేటీ పఢావో’
లక్ష్యం ఎంత ముఖ్యమో ‘బేటీ పఢావో.. బేటీ
బచావో’ కూడా అంతే ప్రధానమైన స్త్రీ
సంస్కరణ. బాలికల వివాహ కనీస వయస్సు
మరంత పెంచడం ద్వారా మాతా శిశు సంక్షేమం ఎంత వరకు సాధ్యమో నిర్ధరించలేని అంశం. బాలికల 'చదువు సంధ్యల’ పై మరింత ధ్యాస పెట్టవలసిన అగత్యానికి ప్రభుత్వాలు
ముందు గుర్తించాల్సుంది. బాలికా విద్య,
మహిళా సాధికారతల ద్వారా సానుకూలపడే వాతావరణంలో పేదరికపు వత్తిళ్లు తగ్గితే,
బాల్యవివాహాల బాదరబందీ దానంతటదే క్రమేపీ తగ్గుముఖం పడుతుందన్న సామాజిక
శాస్త్రవేత్తల వాదనలో వాస్తవముంది.
ఒకే తరగతి చదివే ‘అమ్మాయి-అబ్బాయి’ల మధ్య ఆమోదయోగ్యంగా
మారిన సమానత్వ సూత్రం వివాహ వయస్సుకూ వర్తింపచేయాలన్న
ఆలోచనకే ఆఖరుకు ప్రభుత్వం
మొగ్గుచూపిస్తున్నట్లనిపిస్తుంది. బాల్య వివాహాలు, మైనర్ బాలికల పైన పెరుగుతున్న లైంగిక వేధింపుల వంటి అంశాలలో ఇప్పుడున్న చట్టాలను గట్టిగా అమలు చేసినా చాలు.. గణనీయమైన
సానుకూల దృక్పథం సమాజంలో ప్రోదిగొల్పవచ్చన్నది సామాజిక శాస్త్రవేత్తల ఆలోచన.
బాలికల వివాహ కనీస వయస్సు అంతకంతకూ పెంచుతో
చట్టసవరణలు చేసినా.. చట్టాన్ని పట్టించుకోని మొరటు సమాజం ముందు అవన్నీ కోరల్లేని పాము
బుసలే! ప్రభుత్వాలు ముందు దృష్టి మళ్లింఛవలసింది.. పరిధిని దాటే ముందు సమాజం ఒకటికి రెండు సార్లు జంకేలా ఏ విధమైన కఠినాతి కఠిన చర్యలు సత్వరమే తీసుకోవాలా అని. పర్యవేక్షణ యంత్రాంగాలు పరాకులు కట్టిబెట్టి కరాఖండీ
కార్యాచరణకు మనస్ఫూర్తిగా పూనుకుంటే తప్ప,
ప్రభుత్వాలు ఎంతో మధన పడి మరీ చట్ట
పరధిలోకి తెచ్చే బాలికల వివాహ కనీస వయస్సు వంటి
సంక్షేమ సంస్కరణలు సత్ఫలితాలను ఇచ్చేది.
-కర్లపాలెం హనుమంతరావు
***
(సూర్య దినపత్రిక ఆదివారం దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం)
No comments:
Post a Comment