1970.. మట్టిగుంట
సుబ్బయ్యతాత, సుందరమ్మమామ్మ ప్రయాణిస్తోన్న ఒంటెద్దు బండి డొంక రోడ్డులో గడ్డ అడ్డమొచ్చి గుంటలోకి పల్టీకొట్టింది.
బాగా గాయాలయి అపస్మారకంలోకి జారిపోయారిద్దరూ! ఆచారులగారి ఒకరోజు సపర్యల అనంతరం కళ్లు తెరిచిన ఉత్తర క్షణం సుబ్బయ్యతాత ఆందోళనగా అడిగిన మొదటి ప్రశ్న 'దానికి (భార్యకు) ఎలా ఉంది?' అని. ఒక అరగంట విరామంలో కళ్లు తెరిపిడి పడ్డ సుందరమ్మ మామ్మ 'ఎలా ఉందమ్మా ఇప్పుడూ?' అని ఆచారులవారు వేసిన ప్రశ్నకు బదులుగా తనే మరో ప్రశ్న వేసింది 'ముందాయనకు ఎలా ఉందోచెప్పండి?' అని. 'బాగానే ఉంది' అనే సమాధానం విన్న వెంటనే మెడలోని పుస్తెలతాడును కళ్లకద్దుకుంది!
1990.. విజయవాడ
సుబ్బారావు, సుందరి కనకదుర్గమ్మను దర్శనం చేసుకుని గుడి మెట్లు దిగి వస్తూండగా వెనక నుంచి ఎవరో ఇద్దరు దెబ్బలాడుకుంటో ఆ దంపతుల మీదకు వచ్చి పడ్డారు. సుందరి పట్టు తప్పి సుబ్బారావు మీద పడడం.. అనుకోని ఆ తోపుడుకు సుబ్బారావూ తూలడం!
సుబ్బారావు కళ్లు తెరిచి చుట్టూ చూసి తానున్నది ఓ మధ్య తరగతి ఆసుపత్రి బెడ్డు మీదని గుర్తించాడు.
' ఏమయింది నాకు?'అని అడిగితే జరిగింది చెప్పి 'సమయానికి రక్తం దొరికింది.కాబట్టి గండం గడిచిందీ' అని సమాధానం వచ్చింది నర్సు దగ్గర్నుంచి. తనది, సుందరిదీ ఒకే గ్రూపు రక్తం. ఆమె రక్తం ఇచ్చివుంటుందీ! 'ఠేంక్స్ సుందరీ!' అన్నాడు బెడ్ పక్కనే కూర్చుని ఉన్న భార్యను చూసి. 'మొగుడూ పెళ్లాల మధ్య ఈ మర్యాదలేంటి కొత్తగా! ఎవరైనా వింటే నవ్విపోతారు! ఆపండి! మీ కోసం
కాకపోయినా నా పచ్చతాడుకోసమైనా ఆ మాత్రం చేసుకోకపోతే నలుగురూ నన్నే అంటారు!' అనేసింది సుందరి!
2018.. హైదరాబాద్
సుబ్బేష్ కి ,సుందీకి ఘనంగా పెళ్లి జరిగిన మూడో రోజు. నృసింహస్వామి మొక్కు తీర్చుకున్నట్లు ఉంటుంది. యాదగిరి గుట్ట వెళదాం' అని సుందీ ప్రపోజల్ పెడితే .. 'అవును .. ఒంటరిగా ఓ పూట గడిపే అవకాశం' అని సుబ్బేష్ తలాడించాడు.
పెద్దాళ్లు ఇద్దరికీ తగు జాగ్రత్తలు చెప్పి చీకటి పడే లోగా వచ్చేయండి! హెవీలోడ్ లారీలు రేష్ గా తిరుగుతుంటాయ్!' అంటూ వంద హెచ్చరికలు చేసి మరీ పంపినా తిరుగు ప్రయణంలో చీకటి మలుపులో దొంగలెవరో ఇద్దర్నీ స్పృహ తప్పేటట్లు చితకబాది
సుందీ నగలు, సుబ్బేష్ స్మార్ట్ ఫోను పట్టుకు పోయారు. దారేపోయే వాళ్లెవరో స్పృహలేని ఆ జంటను దగ్గర్లోని ఆసుపత్రిలో జమచేశారు.
ఆసుపత్రి బెడ్డు మీద మూలిగే సుబ్బేష్ ని తట్టి లేపుతూ 'వాటీజ్ దిస్ బ్రదర్?' అనడిగాడు
ఖాకీ యునీఫాంలో ఉన్న పోలీస్ అధికారి ఒకరు. 'నాకు దెబ్బలు తగిలితే తగిలాయ్ కానీ..ఆ పిశాచి పీడా విరగడయింది మొత్తానికి ఈ క్రెడిట్ నీదే వైశాలీ. థేంక్స్ ఫర్ ది స్మార్ట్ ఐడియా డియర్!' అని వినవస్టోంది. ఆ గొంతు సుబ్బేష్ దే!
'నీ బెటర్ హాఫ్ కూడా సేమ్ టు సేమ్ డైలాగ్ మూలుగుతోందయ్యా పక్క రూం బెడ్లో!డిఫరెన్సల్లా ఒక్క చిన్న పేరులోనే! నువ్వు 'వైశాలీ'అంటోన్నట్లుగానే ఆమ్యాడంగారు ఎవరో 'విశ్వేషూ' అని మూలుగుతోంది మిష్టర్! కాలం మారింది మరి!' అంటూ ఓ సర్కేస్టిక్ పంచ్ విసిరాడు స్టిక్ ఆడించే ఆ పోలీసాఫీసర్!
- కర్లపాలెం హనుమంతరావు
10-09-2018
***
No comments:
Post a Comment