Showing posts with label Mari chi.ka. Show all posts
Showing posts with label Mari chi.ka. Show all posts

Thursday, February 4, 2016

చేలాంచలము- చిన్నకథ- కౌముది మరీ చి.క కాలమ్ ప్రచురితం


అనగనగా ఓ అబ్బాయి. ఓ రోజున అతనికి ఓ అందమైన కల వచ్చింది.అందులోని సుందరాంగి చేతులుచాచి మరీ తనలోకి చేరమని ప్రాథేయపడింది.
'అప్పుడేనా! నాకింకా నిండా పదహారేళ్లైనా నిండలేదు. ఇది తరుణంకాదుఅని తిరస్కరించాడు అబ్బాయి.
అబ్బాయికి యవ్వనం వచ్చింది. ఓ రోజు కలలో మళ్లీ మునపటి స్వప్నసుందరే  ప్రత్యక్షమయి 'తరుణం వచ్చింది కదా! తరిద్దాము రారాదా!' అని సిగ్గువిడిచి మరీ బ్రతిమాలింది.
'వయస్సు వస్తే సరిపోతుందా! నా స్వంతకాళ్లమీద నేను నిలబడవద్దా! అప్పుడూ ఈ తరించడాలు.. తడిసిపోవడాలు!' అని అప్పటికి తప్పుకొన్నాడు అబ్బాయి.
అబ్బాయి సంపాదన పరుడైన వెంటనే మళ్లా కల్లో కనిపించి కాళ్ళావేళ్లాబడినంత పని చేసింది స్వప్నసుందరి.
'పిల్లా పీచూ సంగతి చూడాలి ముందు. ఆ తరువాతే ఈ గెంతులూ.. చిందులూ!' అని సుందరిని కర్కశంగా పక్కకు తోసాసాడు ఈసారి కూడా ఆ అబ్బాయి.
అబ్బాయిగారి చివరికూతురు పెళ్ళిచేసుకొని అత్తారింటికి తరలిపోయింది.
'ఇప్పుడైనా కనికరిస్తావా మహానుభావా!' అని అడిగింది స్వప్నసుందరి పట్టువదలకుండా మళ్లా కల్లోకొచ్చి.
'పట్టినంత కాలం ఓపిక పట్టావు. మనుమలు.. మనుమరాళ్లు పుట్టుకొచ్చే సమయం. వాళ్లతోకూడా కాస్త ముద్దూ ముచ్చట్లు తీర్చుకోనీయవోయి  సుందరీ!' అంటూ వచ్చినదారే చూపించాడు ఆ సుందరికి  బడుద్దాయి అబ్బాయి.
మనమలు.. మనమరాళ్లతో ముద్దుముచ్చట్లు ముగిసిపోయాయి. చేసే ఉద్యోగానికి విరమణ అయిపోయింది. కాలసినంత తీరిక. బోలెడంత సమయం. కూర్చొని కూర్చొని విసుగొచ్చిన అబ్బాయిగారికి అప్పుడు గుర్తుకొచ్చింది స్వప్నసుందరి.
కానీ.. స్వప్నసుందరిజాడే ఇప్పుడు  కానరావడం లేదు!
స్వప్నసుందరి దర్శనం కలగాలంటే ముందు నిద్రాసౌభ్యాగ్యం అబ్బాలి. బిపి.. షుగరు.. కాళ్లతీపులు.. అజీర్తి.. అతిమూత్రవ్యాధి.. మతిమరుపు రోగం.. నరాల బలహీనత! ఇన్ని ఇబ్బందులున్నవాడికి నిద్ర పట్టేది ఎలా! స్వప్నసుందరి సందర్శనం ఇహ తీరని కలా! అయినా.. అంతలా నరాల బలహీనతలున్న అబ్బాయిగారు  కలలరాణితో కలసి చేసేదిమాత్రం ఏముంది?
స్వప్నసుందరి మరే అబ్బాయి కలలోనో బిజీగా ఉండి ఉంటుంది.
ఆ పిల్లగాడన్నా తాను చేసిన పొరపాటు చేయకూడదని గొణుక్కున్నాడు    మగతనిద్రలోనే అబ్బాయిగారు!

***
-కర్లపాలెం హనుమంతరావు 
(కౌముది- ఫిబ్రవరి 2016- మరీ చి.క కాలమ్ లో ప్రచురితం)

Tuesday, February 2, 2016

గురక- మరీ చిన్నకథ- కౌముది


పద్మావతి అందం చూస్తుంటే  ప్రబంధకవులకు మాట పడిపోయుండేది. మహారాజులకైతే మతి తిరగబడుండేది. మామూలు మాచవరం నాగేశ్వర్రావు సంగతి ఇహ చెప్పాలా.. పెళ్ళిచూపులప్పుడే ఫ్లాటయిపోయాడని!
బి.కాం రెండుసార్లకు ముక్కి, అడ్డమైన దేవుళ్లకు అడ్డదిడ్డంగా మొక్కి.. సాధించిన బోడి ఏ.జీ ఆఫీసు ఎల్డీసిగాడు నాగేశ్వర్రావు. కాకి ముక్కుకు దొండపండులా దొరికిందని పెళ్ళికొచ్చి అక్షింతలు వేసినోళ్ళందరూ నోళ్ళు నొక్కుకొన్నారు. కుర్రకారైతే కుళ్ళుకొని చచ్చారు.
పద్మావతి నాయన బడిపంతులు కావడం.. మరో ముగ్గురు ఆడపిల్లలక్కూడా పెళ్లి పేరంటాలు చేయవలసిన తండ్రి కావడం.. నాగేశ్వర్రావుకి కలిసొచ్చింది. సరే.. ఇప్పటి మన కథ అది కాదు.
మొదటి రాత్రి మాటా మంచీ అయింతరువాత పుస్తకంలా పడి నిద్రపోతున్నప్పుడు నాగేశ్వర్రావు చెవిలో ఏదో నాగుపాము బుస వినిపించింది ఆగకుండా! చీమ చిటుక్కుమన్నా లేచిపోయే దౌర్భాగ్యం అతగాడిది. లేచి లైటు వేసీ వేయంగానే బుస ఆగి పోయింది! లైటు తీసిన రెండు నిమిషాలకే మళ్లీ మొదలయింది!రాత్రంతా ఇదే కథ!
మర్నాడా విచిత్రం కొత్తల్లుడు బైటకు చెప్పినా అత్తారింట్లో ఎవరూ కిక్కురుమననే లేదు. రెండో రాత్రి పద్మావతే మిస్టరీ విడదీసింది.  ‘చిన్నతనంనుంచి నాకు నిద్రలో గురక పెట్టే జబ్బు. ఎన్ని మందులు మింగినా లాభం లేకపోయింది. ఈ సంగతి  ముందే మీకు చెప్పమని మా వాళ్లతో శతపోరాను. చెప్పినట్లు లేరు' అని వెక్కి వెక్కి ఏడ్చింది.
కొత్తపెళ్లాం కొత్త బెల్లం. పద్మావతితోపాటు పద్మావతి గురకనూ మనస్ఫూర్తిగా జీవితంలోకి ఆహ్వానించేందుకే గుండెను రాయి చేసుకొన్నాడా క్షణంలోనే నాగేశ్వర్రావు.
కాలం గడిచి.. పుట్టుకొచ్చిన ఇద్దరు పిల్లలు పెరిగి.. పెద్దయి.. వేరే దేశాలకని ఎగిరి వెళ్ళిపోయినదాకా.. పద్మావతి గురక రహస్యం ఆ ఇంటి నాలుగ్గోడల మధ్య మాత్రమే మిగిలిపోయి గుట్టు. భారతీయులం కనక కుటుంబ బాంధవ్యాలు అంత బలంగా ఉంచుకొంటాంగానీ.. వేరే దేశంలోకి సీను మారంగానే  మన మనస్తత్వాలనూ అంతే వేగంగా  మార్చేసుకొంటాం.
కూతురు కాన్పుకోసమని ఆర్నెల్లకు అమెరికా వెళ్లిన పద్మావతి.. మూణ్నెల్లు తిరక్కుండానే  ఇండియా తిరిగొచ్చేసిందికొడుకు పిలిచాడని పడుతూ లేస్తూ వెళ్ళిన నాగేశ్వర్రావు దంపతులు.. మూడునెల్లు కూడా ఉండలేక మళ్లా అలాగే  తిరిగొచ్చేసారు.
కొడుకు కూతురులాగా.. అల్లుడు కోడలులాగా.. అత్తగారి గురకకు  అడ్జస్టవాలని లేదుగా!
గుట్టు చప్పుడు కాకుండా ఇండియా వచ్చి పడినా భగవంతుడి పరీక్షలు ఆగలేదు. ఉన్నట్ట్లుండి పద్మావతి గుండెనొప్పితో పెద్దాసుపత్రిలో చేరడం,, చూడ్డానికొచ్చిన బిడ్డలిద్దరి చేతుల్లో భర్తను పెట్టి కన్నుమూయడం! లఘుచిత్రం చూసేంత  సమయంకూడా పట్టలేదు కథ ముగింపుకి రావడానికి!
ఫ్లాప్ పిక్చర్ ఆడే డొక్కు థియేటరులాగా నిర్మానుష్యంగా ఉందిప్పుడు నాగేశ్వర్రావు కొంప. తమ దగ్గరికి పిలిపించుకోడానికి సమయం పట్టేట్లుందని మధ్యంతర ఏర్పాట్లంటూ ఓ కొత్త పద్ధతి కనిపెట్టి ఓల్డేజి హోముకు తండ్రి బాధ్యతలు అప్పగించిపోయారు బిడ్డలిద్దరు.
అంతా బాగానే ఉంది. వేళకు తిండి.. వ్యాయామం.. తనలాంటి ఇరుగుపొరుగుతో మాటా మంతీ! చీకటి బడటంతోనే  దిగులు మొదలవుతున్నది నాగేశ్వర్రావుకి. కంటినిండా నిద్ర పోయింది పద్మావతి పక్కలో పక్కనున్నరోజుల్లోనే.
ఎన్ని మందులు మింగించినా.. ఎన్ని కొత్త  వైద్యాలు ప్రయోగించినా నాగేశ్వర్రావుమీద ఫలితం చూపించలేక పోయేసరికి చేతులెత్తేసారు ఓల్డేజి నిర్వాహకులు.
సొంత వైద్యం ఆలోచన అప్పుడొచ్చింది నాగేశ్వర్రావుకి. భార్య ఫొటో పక్కనుంచుకొని.. ఆమె గురక రికార్డు ప్లేయర్లో ఆన్ చేసుకొంటే కంటిరెప్పలు కిందికి వాలుతున్నాయిప్పుడు!
పెళ్లయిన కొత్తల్లో పెళ్లాన్ని టపట్టించేందుకు దొంగచాటుగా రికార్డు చేసిన గురక కేసెట్ ది!

***
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది- ఫిబ్రవరి 2016 సంచిక 'మరీ చి.క' కాలమ్ ప్రచురితం)

Friday, January 1, 2016

ఒక్క నిమిషం- కౌముది కథలు




ఒక్క నిమిషం ముందు పుట్టినందుకు కవలపిల్లలయినా అన్నహోదా దక్కింది రామాయణంలో రామచంద్రుడికి.
ఒక్కనిమిషం ఆలస్యమయి వుంటే పసిబిడ్డ ప్రాణాలు రక్షించడం కష్టమై ఉండేది’- ఆసుపత్రిలో వైద్యులు.
ఓన్లీ ఒన్ మినిట్!’- పరీక్ష హాల్లో పర్యవేక్షకుడి చవరి హెచ్చరిక.
 'ఒక్క నిమిషం'..  అంటూ  మాట్లాడేఫోను పక్కన పెట్టేసి బైటికి వెళ్ళినందువల్లే వీరభద్రం ప్రాణాలు నిలబడ్డయి! లేకపోతే కుటుంబసభ్యులందరికిమల్లేనే ఇంటికప్పుకింద పడినుజ్జు నుజ్జు అయిపోయుండేవాడు’. ఓ పత్రిక ప్రమాద కథనంలో భాగం.
ఒక్క నిమిషం  రావడం లేటయినా సుబ్రహ్మణ్యానికిలా రైలుకింద పడి చచ్చే కర్మ తప్పుండేది’ ఒక కన్నతండ్రి ఆక్రోశం.
'ఒక్క నిమిషం స్థిమితంగా ఆలోచించి చూడు. విషయాలన్నీ నీకే చక్కగా బోధపడతాయి' అపార్థం చేసుకొన్న గర్ల్ ఫ్రెండుతో సుబ్బారావు వేడికోలు.
'ఒక్కనిమిషమే టైముంది. నీ చివరి ప్రార్థన చేసుకో!' ఉరితీయబోయేముందు ఖైదీకి  జైలు సూపరింటెండెంటు సౌకర్యం.
ఒక్క నిమిషంలో ఎవరు ఎక్కువ ఇడ్డెన్లు తింటారో వాడే ఈ ఏడాదికి విజేత. లక్షరూపాయల బహుమతి గ్రహీత!- తిండిపోతుల పోటీ ప్రకటన.
ఒక్క నిమిషం లెక్కతప్పినా ఏళ్లతరబడి కోట్లు పోసి తయారు చేసిన
సాట్ లైటు లాంచింగు ఫ్లాపయి ఉండేది’ ఇన్సాట్ ప్రయోగం విజయవంతమైన పిదప ఊపిరి పీల్చుకొంటూ బృందనాయకుడి ఉద్వేగ ప్రకటన.
'ఒక్కనిమిషం ముందుగా వచ్చుంటే చివరి చూపులు దక్కుండేవి' కడసారి తల్లిని కళ్ళారా సజీవంగా చూసుకోలేని ఓ కన్న కూతురి ఆవేదన.
ఒక్క నిమిషం అయిపోయింది. 'ఒక్కనిమిషం' కథ చదవడం అయిపోయింది.

***
-కర్లపాలెం హనుమ ంతరావు
(కౌముది అంతర్జాల మాసపత్రిక జనవరి సంచికలో ప్రచురితం)
https://onedrive.live.com/redir?resid=4B36C8046FCB7142!84841&authkey=!AInemVE-5v_XOYo&ithint=file%2cpdf




ఆకలి మింగిన రోకలి- కౌముది కథానిక

చంద్రగ్రహణం పట్టిన రోజున  నీళ్ళు పోసి నిలబెడితే పడకుండా గ్రహణం ఉన్నంతసేపూ రోకలి అలాగే నిలబడి ఉంటుంది! రోకలికి గ్రహణంతో ఏం సంబధమో విజ్ఞానశాస్త్రమే వివరించాలి! రోలొచ్చి రోకలితో మొరపెట్టుకొందని మనకో సామెతా ఉంది.
'పిచ్చి ముదిరింది. రోకలి తలకు చుట్ట'మని మరో నానుడి. పిచ్చికి రోకలి ఎలా  మందయిందో తెలీదుగాని.. ఆకలికి మాత్రం రోకలే మంచిమందని మనవాళ్ళు మనసారా నమ్మినట్లున్నారు.
'అమ్మా! ఆకలేస్తుందే!' అని ఆ పిల్లాడు కొంగుపట్టుకొని వేళ్లాడుతుంటే ఆ వేధింపులకు తాళలేక 'ఆకలేస్తే  రోకలి మింగు!' అని ఈసడించుకొంది ఆ తల్లి.
అడక్కుండానే బిడ్డకు అన్నం పెట్టాలన్న ద్యాస ఏ తల్లికైనా ఎందుకుండదు!
ఘోరకరువులు! మూడేళ్ళుగా వరసబెట్టి వచ్చి దుంపతెంపి పోతుంటే ఊరు ఊరంతా బీడుగా మారి పోయుంది. గాదెలో దాచిన ధాన్యమూ పూర్తిగా నిండుకొని అడుగు తాటాకు బద్దల్ని గీరుకు తింటున్నాయి ఎలుకలు.
పనులుంటే ఆ ఇంటి యజమానేమైనా పాలుమాలే రకమా!
పస్తులుంచడం ఆ ఇంటి ఇల్లాలుకేమన్నా వ్రతమా!
పనిపాటలు లేక పల్లెలకు పల్లెలే పట్టణాలకు వలసబాట పట్టడం మొదలయి రెండేళ్ళు దాటింది. అదీ వల్లగాని నిర్భాగ్యులతో మాత్రమే ప్రస్తుతంపల్లె నిండి ఉంది.
పిల్లాడి ఆకలి తీర్చే మార్గంవెదుక్కుంటూ ఇల్లాలు వీధులెంట బడింది.  ఇంట్లో వంటరితనం. కడుపులో ఎలుకల రొద. ఆలకించే నాథుడు కరువై బైటికి వచ్చి నిలబడ్డాడు బుడతడు.
ఎదురింటి డాబా ఆవరణలో ఐదేళ్ళ పాప అన్నాలాట ఆడుతుంది. నాన్నకోసం వెదుకుతున్నట్లుంది. ఏడిచే బుడ్డాడిని చెయ్యిపెట్టి పిలిచింది.. ‘రా.. రమ్మ’ని.
'అన్నాలాట ఆడుకుందాం! వస్తావా!' అని ఆహ్వానం, 'నేను అమ్మను. నువ్వు నాన్నవు' అనికూడా పాత్రలు నిర్దేశించింది.
'అయితే ఆకలేస్తే అన్నం వండి పెడతావా? అట్లాగయితేనే వస్తాను' అని ఆశగా అడిగాడు మూడేళ్ళ బుడతడు.
'' అంటూ చేటలో బియ్యం పోసుకొని చెరిగి చట్టిలోని నీళ్లలో పోసి ఎసరు పెట్టి ..'రోటి పచ్చడి చేస్తాను.. ఉండండీ!' అంటూ కారం సరంజామా కోసం ఇంట్లోకి పోయింది.. పాప.. పెద్ద ఆరిందాలాగా.
పోయిన పిల్లతల్లి ఎంతకూ బైటకు రాదే!
అసలే ఆకలిమీదున్నాడేమో అమ్మమాట గుర్తుకొచ్చింది నాన్న బుడతడికి.  అక్కడే పడున్న చెక్కపేడు రోకలిని గభుక్కున మింగేశాడు!
***
ఆనక పెద్దాసుపత్రిలో సమయానికి వైద్యందొరికి ఈ లోకలోకి గనక వస్తే గిస్తే..' ‘రోకలి ఎందుకు మింగావురా వెధవా!' ని ఎవరైనా అడిగారనుకోండి..
'అమ్మ చెప్పింది' అని నిజం కక్కేస్తాడేమో!
పాడు కలికాలమా,, ఎంతకు తెగించావూ!
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది అంతర్జాల మాసపత్రిక జనవరి సంచికలో ప్రచురితం)


అనుబంధం- కౌముది కథానిక


రామచంద్రుడు మంచి బాలుడు.. ఒక్క పొగ విషయంలో మినహా!
కళాశాల రోజుల్లో అయిన అలవాటు. మిత్రుడు మృత్యుంజయుడు చలవ! మృత్యుంజయుడు పోయాడుగానీ.. పొగ వ్యసనంగా మిగిలిపోయింది.
నిరుద్యోగంలో, ఇంటి సభ్యులతో వచ్చిన మనస్పర్థల్లో, ఒంటరితనంలో, ప్రేమ వైఫల్యంలో పొగే తనకు ఊరటనిచ్చింది.
పెళ్ళిచూపుల్లో శారద విడిగా  పిలిచి బిడియం వదిలి అడిగినప్పుడు అబద్ధం చెప్పాడు రామచంద్రుడు .. అందమైన పిల్లని వదులుకొనేందుకు మనసొప్పక.
మొగుడు బొంకాడని మొదటిరాత్రే గ్రహించినా సర్దుకుపోయింది శారద.
మొదటి బిడ్డ శరత్ పుట్టినప్పుడు శారద గట్టిగా షరతు పెట్టినప్పుడూ సిగరెట్టుకోసం బిడ్డముద్దులను దూరంగా ఉంచాడు. రెండో బిడ్డ సరితను దొంగతనంగానే సిగిరెట్టుపెదాలతో ముద్దులాడాడు.
కాలంతో పాటు అంతా మారి.. శరత్ అమెరికాలో .. సరిత ఆస్ట్రేలియాలో సెటిలయి.. చేసే ఉద్యోగానికి పదవీవిరమణయి.. పనిలేక ఆరోగ్యం దెబ్బతింటున్నప్పుడూ రామచంద్రుడు సిగిరెట్టును దూరం పెట్టలేక పోయాడు.
అమెరికా వెళ్లినప్పుడుగాని అసలు అగ్నిపరీక్ష మొదలవలేదు రామచంద్రుడికి.
అగ్రరాజ్యంలో తాగడానికి సిగిరెట్టు లభించడం అంత సులభం కాదు. కేవలం సిగిరెట్లకోసం పక్కింటి ఇంగ్లీషుబామ్మగారితో సిగ్గు విడిచి స్నేహం చేసాడు రామచంద్రుడు. ఇంట్లోవాళ్ళు పసిగట్టకుండా ఆమె ఇంట్లోనే నాలుగు దమ్ములు లాగించి వాసన తెలీకుండా ఏ చాక్లెట్టో చప్పరించే వాడు.
శరత్ ఆరునెల్ల చంటిబిడ్డ ఉన్నట్లుండి గుడ్లు తేలేస్తే.. ఎమర్జన్సీలో నోట్లోనుంచి సిగిరెట్టు పీక బైటికి లాగినప్పుడు రామచంద్రుడి బండారం బైటపడింది.
ఆరునెలలు ఉందామనుకొని వెళ్ళిన దంపతులు మూడు నెలలు తిరక్కుండానే ఇండియా వచ్చేయడం బంధువర్గాల నోటికి చాలినంత మేత ఇచ్చింది. సర్దిచెప్పలేక విసిగిన  శారద ఒకరోజు అవమానంతో నిద్రబిళ్లలు మోతాదుకి మించి మింగేసింది. ‘సిగిరెట్లు  తాగడం శాశ్వతంగా మానేస్తానని శారద చేతిలో  ఒట్టేసి అతికష్టంమీద భార్యప్రాణాలు కాపాడుకొన్నాడు రామచంద్రుడు. త్రేతాయుగంనాటి రామచంద్రుడిలాగే ఈసారి మాటా నిలబెట్టుకున్నాడు.
కానీ కాలం మరో విధంగా తన తీర్పు ప్రకటించడానికి సిద్దపడింది.
బైటపడేసరికే రామచంద్రుడికి సెకండ్ స్టేజీ లంగ్ కేన్సర్! ఏడాదికి మించి వైద్యులు  గ్యారంటీ ఇవ్వకున్నా.. ఆరునెలలు తిరక్కుండానే మృత్యుశయ్యమీదకు చేరిపోయాడు రామచంద్రుడు.

ఆ రోజు మరీ ముంచుకొచ్చింది. బిడ్డలకు కబురు చేయించింది శారద. వాళ్ళు అన్ని ఏర్పాట్లు చూసుకొని వచ్చేందుకు కనీసం  రెండు రోజులు పడుతోంది. అప్పటివరకు అపోలోలో  వెంటిలేటరుమీద అందించే ప్రాణవాయువే ఆసరా!
పడకమీద అచేతనంగా పడివున్నాడు రామచంద్రుడు. భర్తను ఒక్కక్షణం వదిలి పక్కకు పోవడానికి ఇష్ట పడటంలేదు శారద.
తెల్లారడం కష్టం అని డాక్టర్లు చెప్పి పోయారు. పక్కమీద రామచంద్రుడు  అదే పనిగా కలవరిస్తున్నాడు.
'సిగిరెట్టు.. సిగిరెట్టు' అంటూ పెదాలు పదే పదే తడుపుకొంటున్నాడు.

నర్సు బైటికి వెళ్లడం చూసి  తలుపులు లోపలికి బిగించి బ్యాగులోనుంచి సిగిరెట్టు పాకెట్టు బైటికి తీసి ఒకటి భర్త పాలిపోయిన పెదాలమధ్య ఉంచి అగ్గిపుల్ల వెలిగించింది శారద!
***
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది అంతర్జాల మాసపత్రిక జనవరి 2016లో మరీచి.క కాలమ్ లో ప్రచురితం)



అనగనగా ఓ అమ్మ- కౌముది కథ



అనగనగా ఓ అమ్మ. ఆ అమ్మకు బుడిబుడి అడుగులు వేసే  ఓ పాపాయి. ఆ పాపాయి బుడిబుడి నడకలతో బైటికి పోకుండా తన కొంగు చివరకి ముడి వేసుకొని పనిపాటలు చూసుకొనేది అమ్మ.
పాపాయి ఎదుగుతున్నది. కిటికీగుండా బైట కనిపించే కొండా కోనా, చెటూ పుట్టా.. పాపాయిని రారమ్మని బులిపిస్తున్నాయి! పాపాయికేమో.. పాపం..  తల్లికొంగు బంధమాయ!
ఆ రోజు బ్రహ్మాండంగా వాన కురిసి వెలిసింది. ఆకాశంలో ఏడురంగుల ఇంద్రధనుస్సు విరిసింది. పాపాయిని అదే పనిగా అందుకొమ్మని.. ఆడుకొందాం రమ్మని.. ఆగకుండా ఆహ్వానిస్తున్నది.
తల్లి గాఢనిద్రలో ఉంది.  అదను చూసి చాకుతో చీరకొంగు కోసి.. గడప దాటి..  గబగబా కొండకొమ్ముకేసి ఎగబాకుడు మొదలుపెట్టింది పాపాయి. ఇంద్రచాపం ఎక్కి   జారుడుబండ ఆటాడాలని  పాపాయి పంతం. ఆత్రం. ఆ తొందరలో పాచిబండమీద కాలు జారింది.  భయంతో 'అమ్మా! అమ్మా!' అని అరవసాగింది పాపాయి.
లోయలోకి జారిపడే చివరి క్షణంలో ఠకాలుమని ఆడ్డుపడి ఆపేసింది.. రెండుబండలమధ్య ఇరుక్కున్న అమ్మకట్టిన లావుపాటి కొంగుముడి!
దూరంనుంచి పరుగెత్తుకొస్తున్న అమ్మను చూసి 'హమ్మయ్య' అనుకొన్నది  పాపాయి. ***
-కర్లపాలెం హనుమంతరావు





మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...