Sunday, August 30, 2015

నల్ల ధనం ఓ సరదా గల్పిక--శ్రీమతి గుడ్లదొన సరోజినీదేవి

"నల్ల మందు తెలుసు. నల్ల ధనం ఏమిటండీ? ఎక్కడుంటుందండీ?
రాజ్యాంగంలోని 21 వ అధికరణ కింద పౌరులకు లభించిన గోప్యతా హక్కు ఎవరి కొంపైనా ఎలా ముంచుతుందండీ? రాజ్యాంగంలోని 32(1) అధికరణ ప్రకారం ఎలాంటి సమాచారం ప్రకటించలేమని  సర్కారు చేతులు ఎందుకు కట్టేసుకుందండీ? ఎన్డియే మొన్న మే మాసంలో సుప్రీం రిటైర్డు జస్టిస్ ఎం బి షా సారథ్యంలో ప్రత్యేక బృందాన్నిఏ తమాషా కోసం నియమించిందండీ? తొందరపడి ఎవరి  పేర్లనూ బైట వద్దని అసోచామ్ ఎందుకు అడుగుతుందండీ? ద్వంద్వ పన్నుల విధానం అంటే ఏమిటీ? అది దెబ్బతింటే దేశ ప్రతిష్ఠకు, విశ్వసనీయతకు ఏ విధంగా విఘాతం కలుగుతుందండీ? ఏ  ఆరోపణలు నిరాధారమైనవని తేలితే ఏ వ్యక్తులకు  అప్రతిష్ఠ ? నల్లధనానికి ఆస్కారంలేని వ్యవస్థాగత సంస్కరణలా.. అవేమిటండీ?"

పొద్దస్తమానం అలా  వార్తా పత్రికలు ముందేసుకుని  జోగుతుంటారు గదా  శ్రీవారూ..   చిక్కు ముళ్ళేమన్నా కాస్త విప్పుతారేమోనని దగ్గరికి వెళ్ళడిగా  బుద్ధి లేక పొద్దున్నే! ముడి అనుకున్నారో ఏమో పాడు.. హుషారుగా లేచి నిలబడి ఆనక  విషయం విని చారునీళ్ళల్లో అప్పడంలా చప్పడిపోయారు "ప్చ్.. అంతంత పెద్ద విషయాలు నీ కొద్ది బుర్రలో పట్టవులే  గానీ.. మీ ఆడాళ్ల కవసరమైన ముఖ్య సమాచారం  మాత్రం చెప్తా విను" అని మాట దాటేశారు.  'ఇక్కడ సంపాదించిన సొమ్మును ఇక్కడి లెక్కల ప్రకారం పన్నులూ పాడూ కట్టకుండా..  ఇక్కడే ఖర్చు పెట్టకుండా ఇంకెక్కడో దేశంలో పూడ్చి పెడితే దాన్ని  విదేశీ నల్ల ధనం అంటారని.. అధికారంలో కొచ్చిన వంద రోజుల్లో దేశాల్లో ఉన్న నల్లధనాన్నంతా తవ్వి తెచ్చి తలా ఒక పదిహేను లక్షలు దాకా  మోదీజీ పంచబోతున్నారనీ' మా వారు చెప్పిందాన్ని బట్టి నాకు అర్థమైన సమాచార సారాంశం. డబ్బు  పంచడం వరకూ సంతోషమే  కానీండి.. ఎక్కడ దాచుకోవాలో.. ఎక్కడ పూడ్చుకోవాలో.. సంపాదించుకునే వాడి ఇష్ట ప్రకారం కాదా ఉండేదీ!  ఇదేందీ.. ఇందులో   ఏదో మతలబు ఉంది.. ఎక్కడో తంతా ఉంది!
నాలుగు రాళ్ళు ఎక్కువొచ్చే చోట.. ఇచ్చిన సొమ్ముకు కాళ్ళు రావన్న గట్టి నమ్మకం ఏర్పడ్డ చోట చూసి మరీ చక్రవడ్డీకి  అప్పులిచ్చేది మా ఊళ్ళో వెంకాయమ్మ గారు. మా పేట ఆడాళ్ళందరికీ ఆమే ఆడ చంద్రబాబు. గవర్నమెంటుకు చెప్పనంత మాత్రాన ఆమె దగ్గరున్న  చీటీపాటల డబ్బంతా   నల్లసొమ్మై పోతుందా.. విడ్డూరం కాక పొతే! ఆ మాటే మా ఇంటాయనతో అంటే ఆయన గారేమో  తల గోడకేసి మోదుకున్నారు. "నన్ను చంపక..  పోయి కప్పు కాఫీ పట్రా! అసలే ఇక్కడ నే టెన్షన్తో   చస్తూంటే మధ్యలో నీ టీవీ చర్చలు!" అని విసుగూ! వివరంగా చెప్పే విషయం కరువైనప్పుడల్లా ఇలా కరవ రావడం మా వారికి  జగన్ బాబుకు మల్లే మామూలే లేండి! సరే!.. మా సంబడాలకేం గానీ.. ముందీ నల్లధనం సంగతే ఏందో తేల్చాలి. 

ఈయన గారొచ్చి వివరించక పోతే మహా  మనకిహ లోకంలో తెలిసే మార్గాలే కరువా! ఇంట్లో ఆయన  చూసే  టీవీనే నేనూ చూసేది అంతకన్నా ఎక్కువ సేపు. ఆయన గారు చదివవతల పారేసే 'ఈనాడే' నేనూ ఆనక తిరగేసేది. కాక పోతే ఎప్పుడూ చూసే సీరియళ్లూ.. సినిమా కబుర్లూ కాస్త పక్కన పెట్టి ఈ నల్లదనం  మీదా సారి దృష్టి పెడితే సరి.. సర్వం మనకే అరటి పండు వలిచినంత సులువుగా  అవగతమయి పోతుంది.

అవగతమయింది కూడాను. ఓస్! ఇంతోటి భాగ్యానికే ఇన్ని రోజుల బట్టీ దీని మీదిన్ని  కుస్తీ పట్లా! వ్యవహారం సుద్దపిక్కతో ముగ్గేసినంత సుబ్బరంగా కనిపిస్తుంటేనూ! ఓపిక .. సావకాశం ఉన్నవాళ్లేవేవో.. నానా అగచాట్లు పడి.. నాలుగు డబ్బులు గడించారే అనుకోండి.. పోనీ  అది డబ్బు కాదబ్బా.. గడ్డే అనుకుందాం.. ఎవరు మాత్రం  తినడం లేదీరోజుల్లో గడ్డీ గాదంపన్నులు కట్టనంత మాత్రాన పచ్చ నోటు ఎలా నల్లబడుతుందో నా బుర్రకింకా ఎక్కటం లేదమ్మా!

ఏనుగు బరువేయబోతే  చీమైనా ఏం చేస్తుంది? పుట్టల్లోనే నక్కుంటుంది. వేలు పెడితే ఠక్కుమని కుట్టేస్తుంది కూడానుకాల్చినా కాల్చకున్నా మనం పాత బకాయిల్తో సహా కరెంటు బిల్లులు  చచినట్లు కడుతున్నామంటే తప్పించుకునే మరో దారి లేకే గదా!  దారేదో  ఓటి ఉంది కాబట్టే   సంపన్నులంతా తమ సంపాదన్ని  దేశం దాటించేస్తున్నారు! దారి నెందుకు మూసేయడం లేదన్నదే నా పాయింటు. ఎప్పటికప్పుడు ఏవో లోపాయికారీ వ్యవహారాలు అవీ పెట్టేసుకుని.. చూసీ చూడనట్లు పోనిచ్చి..  ఓట్లేసే బికార్ల మెప్పుకోసం విదేశీ నిధులంటూ.. అక్రమాస్తులంటూ అల్లరి పెడతారా!  నెలరోజుల బట్టీ చూస్తున్నా.. విచిత్రం! ఒక లెక్కా పత్రం ఏదీ  లేనట్లుంది ఈ నల్లధనలక్ష్మి ఆకార వికారాలకి!   ఒకడు లక్ష కోట్లంటాడు. ఒకడు అర లక్ష ఖాతా లంటాడు. ఒకడు అర్థ శతాబ్దంబట్టీ సాగే లోపాయికారీ వ్యవహార మంటాడు. పార్టీ పదవుల్లో ఉన్నప్పుడు పార్టీని.. పార్టీ పదవుల్లో ఉన్నప్పుడు పార్టీని తప్పులు పడుతున్నారు. అసలు నల్ల ధనంలో ఉన్నతప్పేమిటో  ముందు తేల్చమని నాకైతే సుప్రీం కోర్టు కెళ్ళాలన్నంత కచ్చగా ఉంది.

'గట్టిగా వాగబోకే పిచ్చి మొహమా! ముందే కోర్టుల్లో నలుగుతున్న వ్యవహారాలివన్నీ! ఎతిమతంగా ఏదన్నా వాగితే నిన్నూ మూసేస్తారు" అని మా వారి రుసరుసలిక్కడ. నేనెప్పుడు  జైలుకెళ్లి చిప్పకూడు తింటానా అని ఈయనగారికీ  తహతహ లాగుంది చూస్తుంటే!

రోజులు బొత్తిగా బాలేవని నాకు మాత్రం తెలీదా? ఎప్పుడో వాడేసిన సర్కారు సొమ్ముకు ఇప్పుడు లెక్కలడిగి  బెంగుళూర్లో చిప్పకూడు తినిపించారా జయలలితమ్మ చేత.   తుఫాను మీదెవడో పిల్లాడు తెలిసీ తెలీక అవాకులూ చెవాకులూ వాగాడని  లోపల వేసేసారు! నేనేమంత మరీ యతిమతం దాన్ని కాదు. అయ్యొరామా! ఇంట్లో నాలుగ్గోడల మద్యా  మనసులోని ముచ్చట్లను కూడా  బైటపెట్టుకునే రాత లేకపోతే ఇహ ఈ సంసారమెందుకంట? టింగురంగా అంటూ బైట తిప్పుకుంటూ తిరుగుళ్లెందుకంట?

అహ.. మాట వరసకే అనుకుందాం. మా వారు మహనల్లగా ఉంటారు. అయినా మరీ ఏమంత దుర్మార్గులు కారే! నలుపంటే నాకూ ఏమంత పడి చచ్చే మోజు లేదు కానీ.. పన్ను కట్టని సొమ్ముకి  నల్ల ధనమని పేరెట్టి ఇలా అల్లరి పెట్టడడమే  ఏం బావోలేదని నా ఉద్దేశం.

నల్ల సముద్రం.. మన గుంటూరు నల్లచెరువుల్నేమన్నా మనం అపవిత్రమను కుంటున్నామా? బొగ్గంటే నల్లబంగారం అంటారు మా వారు. నలుపు నారాయణ స్వరూపం. రాముడు నీలమేఘ శ్యాముడు. కృష్ణుడు నల్లనయ్య. మన కంటిగుడ్డు నలుపు. కాటుక నలుపు. నల్లద్రాక్ష యమ  తీపి. మా చెల్లాయి  జడ నాగుబాములా నల్లగా నిగనిగలాడుతుండ బట్టే కదా మరిదిగారు కాణీ కట్నం లేకుండా చేసుకున్నదీ! దిష్టి తగలకుండా పసిబిడ్డ బుగ్గకి పెట్టే చాదు బొట్టు నలుపే కదండీ! శివరాత్రి అవావాస్యనాడొస్తుంది. దీపావళిదీ అదే తంతు. 'నల్ల' అంటే అరవంలో బహు బాగని అర్థంట. మా పక్కింటి ఆండాళమ్మగారు మా పిల్లను  పట్టుకుని పద్దస్తమానం 'నల్ల పొన్ను.. నల్ల పొన్ను' అని తెగ మెటికలిరిచుకుంటుంది.   పచ్చ నోటును పట్టుకుని నల్లడబ్బనడమే.. అన్యాయంగా ఉంది!

'తెలుపో..నలుపో.. జాన్తానై.. తేడా లిక్కడ లేనే లేవ్' అని సినిమాల్లో ఎన్ టీ ఆర్ చిందు లేసినప్పుడు చప్పట్లుకొట్టి.. ఇప్పుడేమో  నల్ల డబ్బునుగురించి .. నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడ్డం తగదన్నది  నా పాయింటు!

'ఇప్పుడీ  మహాతల్లి నల్ల ధనాన్నిలా వెనకేసుకొస్తుందేందిరా కామెడీగా!' అని మీరు విస్తుపోతున్నారని తెలుసుఉన్న మాట అనుకుంటే కామెడీగానే ఉంటుంది మరి! దార్నే పోతుంటే   రూపాయి బిళ్లే మీ కంట బడ్డదనుకోండి. ఎవరూ చూడకుంటే మీరు మాత్రం లటుక్కని తీసి  పర్సులో వేసుకోరూ! అసలుమనిషి  వచ్చి అడిగినా తిరిగిచ్చెయ్యడానికి ప్రాణం ఉసూరుమంటుందే! మరి అన్నేసి లక్షలు.. కోట్లు ! ఎట్లా సంపాదించారన్నది ఆనక.. సారి 'మనదీ' అనుకున్నాక  సొమ్మూ సమ్మంధమూ లేకుండా  మధ్యలో సర్కారోడొచ్చి  పన్నులూ పాడూ  కట్టమంటే.. ఎవరికైనా  మనసుక్కంష్టంగానే  ఉంటుంది కదండీ!

ఇవాళ ఆ జైపూరియానో, లోధీనో, టింబ్లోనో.. పేర్లే సరిగ్గా మన నోటికొచ్చి చావవు .. ఐనా  నోటికొచ్చినట్లు తిట్టి పోస్తున్నాం! న్యాయమా! రేపు మన ఊరి పెద్ద మనిషే.. మన పక్కింటి రామనాథమే.. మన పొరుగూరి పుల్లమ్మక్కే ఈ జాబితాలో దర్శనమీయచ్చు. కోర్టువారి దగ్గర ఆంజనేయుడి తోకంత జాబితా ఉందంటున్నారు మావారువిడతల వారీగా విఛారణ లుంటాయంట. ఏ రోజు పేపర్లో ఎవరి పేరొస్తుందో.. ఏ పూట ఎవడి పుట్ట ఠపాల్మని పేలిపోతుందో.. ఏ క్షణంలో ఎవరి చరిత్ర అందరం చదివే  పుస్తకం తంతవుతుందో.. ఎవరికి తెలుసు?
ఎన్నో విచిత్రాలు నిత్యం జరిగే ఈ పుణ్యభూమిలో  టీలమ్ముకునే పిల్లాడు ప్రధాని మంత్రవలా?   మునుపటి ప్రభుత్వాల్లో ప్రధాన భూమిక పోషించిన పెద్దమనిషి   తాడుతెగి  సంపాదనంతా నల్ల ధనమని తేలి  చివరికి సర్వం కోలుపోయి టీ నీళ్లక్కూడా దేబిరించ వచ్చు.   రాష్ట్రం సరిహద్దులు దాటే పప్పు ధాన్యాల లారీని పట్టుకోలేక పోవచ్చు గానీ.. సర్కారు తలుచుకుంటే పాకిస్తాన్లో దాక్కున్నా దావూద్ ఇబ్రహీం  గడ్డం పట్టుకు లాక్కురాగల్దు. స్విర్జర్లాండులో పుట్టక పోవడమే డబ్బున్న వాళ్ళ  తప్పంటే ఇహ చేసేదేమీ లేదు.

ఉన్నవాడికే కదా పన్నుల  బాధేంటో బోధ పడేది. చెల్లని పావలా కూడా మిగల్చుకోలేని   మా ఎదురింటి  కుచేల్రావూ నల్లకుబేరులని తూలనాడే వాడే!
దొంగసారా వ్యాపారం చేసి కోట్లకు పడగ లెత్తాడు మా అంకయ్య మామ. సాని పాపల్నితార్చి శరణాలయంపైన అంతస్థుల్లేపాడు మా  బల్లిశాస్త్రి బాబాయి. ఇసుకలో దుమ్మే కలిపాడో.. దుమ్ములో ఇసకే పోసాడో.. ధర రెట్టింపయిందాక దాచి కొత్త రాజధాని వస్తుందని ఆశల్లేవంగానే   బంగారం రేటుకు అమ్మేసాడు మా వీధి పచారీ కొట్టు సుబ్బయ్య శెట్టి. ఎవరూ బొట్టెట్టి  పిలవక పోయినా..లోకుల  వ్యవహారాల్లో బలవంతంగా దూరి సెటిల్మెంట్ల వంకతో సింహభాగం కొట్టేసే కోటిరెడ్డి కోట్లకు పడగలెత్తిన కథ మా వాడంతా రామాయణంలా పారాయణం చేస్తుంటాం అందరం. వాళ్లంతా  తలా రాజకీయ పార్టీలో దూరి మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు  ఓట్లడుక్కోడానికని  వస్తే  అంతటా 'ఓహో.. ఆహోఅన్న నోళ్ళే కానీ.. నొసళ్ళూ ఒహళ్ళూ చిట్లించిన పాపాన పోలేదు! ఐన కాడికి నాలుగు రాళ్లు వెనకేసుకునే సదవకాశం ఇదేనని .. ఇంట్లోనూ  ఈయనగారు  లక్షా తొంభైసార్లు తహ తహ లాడారు. మళ్లా పొద్దున్నేపత్రిక  రాగానే నల్లకుబేరుల జాబితాలో కొత్త పేర్లేవీ బైటపడటం లేదని పెదవి విరుపులు! ఎవరికీ చట్టమంటే పట్టడం లేదని.. కారాలు..మిరియాలు!!

అహ.. నాకు తెలీక అడుగుతున్నా గానీ    పేర్లు బైట పెడితే ఏమవుతుందంట? రాత్రికి రాత్రే ఆ కొచ్చారియాలు, జైపురియాలు.. సెలబ్రటీలై పోడానికా! గ్లోబల్ యుగమో ..  పాడో..  వార్తొచ్చిన ఉత్తర క్షణంలోనే ఉత్తరమెరికా నుంచి దక్షిణాఫ్రికా అడవుల దాకా పేర్లు పాకిపోతున్నాయీ మధ్య మరీ! పుట్టిన అప్పలపాలెంలోనే మొహాలు సరిగ్గా తెలీని డిప్పకాయలంతా ఇట్లాంటి లప్పనమేదో తగిలి గొప్పోళ్లై పోవడమే తప్ప ..    వాళ్ల  ముల్లేమన్నా మన చిల్లుజోలెల్లో వచ్చి  పడబోతుందా? నల్లధనంమీద నడిపించే 'బ్లాక్ మెయిల్' కాదూ ఇదంతా!

డబ్బున్న పెద్దమనుషులతో వ్యవహారాలు! ఎన్ని చూసుకోవాలిఎంత గడ్డి కరిస్తే కూడిందో ఈ ముదనష్టం! ఎన్నాళ్లని మురగ బెట్టిందో.. ఎందరెందరి  కొంపలు కూల్చి పేర్చిందో.. ఎక్కడెక్కడి గనులు తవ్వినవో.. ఎన్ని వ్యాపారాలకు, కంట్రాక్టులకు   తెగిస్తే అంత సొమ్ము  పోగయుంటుందీ!  అడగంగానే చూపించేసెయ్యడానికి ఇదేమన్నా పెళ్ళి ఆల్బం ఫొటోలా?
నాలుగు డబ్బులు బ్యాంకులో పోగయితే చాలు  అదేదో సుమతీ శతకంలో చెప్పినట్లు బెల్లం చూట్టూ ఈగల్లా మూగి పోతారు బంధు మిత్రులు. కాదంటే కారాలు.. లేదంటే మిరియాలు! చే బదుళ్లు ఇచ్చుకుంటూ కూర్చోడానికా ఇన్నిన్ని చేదనుభవాలతో   ఆర్జించిందీ! ఊరూ పేరూ కూడా తెలీని దేశాలదాకా  పోయి డబ్బలా  వూరికే పూడ్చి పెడతారా ఎవరైనా?

'ఎలుక తోక నలుపు. ఎందాక ఉదికినా తెలుపుకి తిరగేది కాదద'ని మన యోగి వేమనగారు ముందే చెప్పారు. చెవిన బెట్టే నాథుడేడీ?

ఆటల్లో మనమెలగూ పోటీకి పోలేము. పరిశోధనల్లో సైతం మన ప్రోగ్రెసు అంతంత మాత్రంగా ఉంది. అందాల పోటీల్లో గడపదగ్గరే  తూలుడు. వ్యాపారాల్లోనైతే  చైనా జపాన్లదే  ముందడుగు. ఒక్క ఈ నల్లకుబేరుల జాబితాలోనే  మనది ముందు వరసలో స్థానం. దానికీ ముప్పం తెచ్చుకునే  పనులు ముమ్మర మవుతున్నాయి. అదే బాధ

అత్తగార్లకు సంఘాలునాయి. అడుక్కునే వాళ్లకు సంఘాలున్నాయి. ఆఖరికి తాగుబోతు దేవదాసులు సైతం సంఘటితమై మత్తు హక్కులకోసం పోరాడుతున్న దేశమిది. సంఘమూ పెట్టుకోడానికి ఆస్కారం లేదనేగా నల్లకుబేరుల మీదింత విలయ తాండవాలు!

నల్లఖాతాలెవరో ఖాతాదారులకు తెలుసు. డబ్బు దాచుకున్న బ్యాంకులకూ  తెలుసు. గతపాలకుల కాలంలోనే జాబితా వచ్చింది కాబట్టి నాటి ప్రముఖులందరికీ  నల్లపేర్లన్నీ కంఠతా వచ్చుండచ్చు. నాటి జాబితానే నేటి ప్రభువుల చేతిలోనూ ఉన్నది. కాబట్టి ఇప్పటి నేతలందరికీ లోపాయికారీగా పాపులెవరో తెలిసుండచ్చు. కోర్టు సమర్పణలూ ముగిసాయి  కాబట్టి అక్కడి  యావత్ సిబ్బందికీ ఆ పేర్లన్నీ  కంఠోపాఠంగా నాలికమీదే ఆడుతుండవచ్చు. విచారణకని దిగిన సిట్టో.. స్టాండో .. వాళ్ల కార్యాలయాల్లో మాత్రం జాబితాలోని ప్రతి వివరమూ  చక్కర్లు కొట్టకుండా ఉంటాయా? ఇక తెలియని దెవరికమ్మా? యావత్ వ్యవహారంతో ఏనాడూ   సంబంధమూ  లేని.. సాధారణ పాటకజనానికి.. మీకూ.. నాకూ!
కోర్టుల్లో కేసులు రుజువై శిక్షలు ఖాయమైన పురచ్చి తలైవి ఫొటోలే చట్టసభల గోడల మీదనుంచి ఇంకా   కిందకు దిగలేదు. ఓటర్లకి తెలీకుండా ఎన్నెన్ని వ్యవహారలిక్కడ గుట్టు చప్పుడుగా చక్కబడటం లేదూ! శతకోటి బోడిలింగాల్లో నల్లధనం  ప్రహసనం ఒహటీ!

'చిట్టచివరి  చిట్టాలో ఆరొందల పై చిలుకు పేర్లున్నాయోచ్!  కోర్టు గడపల దాకా వచ్చాసాయోచ్!'  అని గంతులేస్తునారీ మధ్య మా ఇంటి హనుమంతులవారు. సరే.. మన సోమ్మేం పోయింది మధ్యలో!   సీల్డు కవర్లు.. సిట్టులు.. స్టాండప్పులు.. అన్నీ తట్టుకుని.. ఆ నల్లమొత్తాలు మొత్తానికి మన దేశంలోకి  తరలివస్తే అదీ మరో అద్బుతమే!
మోదీగారు తలా ఓ ఐదులక్షలిస్తానన్నారు గాబట్టి.. మా వారి  వాటాతో ఇంచక్కా వడ్రాణం చేయించుకోవచ్చు! నా వంతంటారా! అది స్త్రీ ధనం. నల్లధనంతో మల్లే ఆడుకుంటానంటే మాడి మసై పోతారు ఎంతటి వారైనా!*
-శ్రీమతి గుడ్లదొన సరోజినీదేవి
(సారంగ- అంతర్జాల పత్రికలో ప్రచురితం)










No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...