పదండి వెనక్కు ( సరదాకి )
- కర్లపాలెం హనుమంతరావు
మార్నింగ్ గుడ్!
ఏడాదిలో మూడు వందల అరవై నాలుగు రోజులు ముందుకే కదా నడుస్తాం! ఒక్క రోజు కాస్సేపు కాస్త వెనక్కు నడవమంటే ఎందుకలా మిర్రి మిర్రి చూడడం! ఈ కొత్త వెర్రి ఏమిటా అనా?
జనవరి 30 వెనక్కి నడిచే రోజు అమెరికాలో!
మనదగ్గరయితే ఈ వెనక నడక మరీ కొత్త చోద్యమేం కాదు! అప్పులోడు ఎదురు పడితే అడుగు ముందుకు పడదు. ఎదురొచ్చిన సందు మరీ పాతబస్తీ మోడల్లో ఉంటే వెనక్కి నడిచి ఏ మలుపులోకి తప్పుకొంటేనే మానం దక్కుదల!
'పదండి ముందుకు!.. పదండి ముందుకు!' అంటూ మహాకవిశ్రీ శ్రీ మరీ కాళ్లకిందలా నిప్పులు ఎందుకు పోస్తారో! 'వెనక చూసిన కార్యమేమోయి/మంచి గతమున కొంచెమేనోయి/మందగించక ముందు అడుగేయి/వెనుకపడితే వెనకే నోయి' అంటూ గురజాడవారిదీ అదే గత్తర! ఇహ మన ఏ.పీ చంద్రబాబుగారైతే మరీ విడ్డూరం! పద్దస్తమానం పెద్దానికీ 'అలా ముందుకు పోదాం' అంటూ ఒహటే తొందర ఆయనకు! ముందుచూపుమీదే అందరి చూపైతే మరి మనకి వెనక తీసే గోతుల గతి పట్టించుకునే పరంధాముడు ఎవరంట! బొక్కబోర్లా పడ్డా తట్టుకొని లేవచ్చు. వెల్లికిలా పడ్డమంటే మళ్లీ తేలేది కైలాసంలోనే సుమా!
ఎవరెంతమంది వైతాళికులు ముందు నడకకే తాళమేసినా మన శ్రీమాన్ గిరీశంగారు మాత్రం 'అటునుంచి నరుక్కు రమ్మని' దొడ్డిదారి చూపించారు! కొంత నయం! నేటి మెజారిటీకీ ఆ దారే రహదారి! సంతోషం!
మాటవరసకేదో అనుకుంటాం గానీ.. వాస్తవంగా మన నడక ఇప్పుడు వెనక్కికాక ముందుకుందా! ఎప్పుడో వెనక తాతలు తాగిన నేతుల వాసన మనమిప్పుడు మూతులు ముందుకు చాపి చూపించుకుంటున్నామా లేదా! దేశానికి స్వేచ్చాస్వాతంత్రాలొచ్చిందే తన వెనక తరం తాతయ్య నెహ్రూ వల్లని ఇటలీ బ్లడ్ రహుల్ బాబు ఇప్పుటికీ డప్పులు కొట్టుకుంటున్నాడు! పేదల పాలిటి పెన్నిధని అత్త ఇందిర పేరు చెప్పుకొంటూ కోడలుగాంధీ పల్లకీ మోయించుకోడంలా! ఏనాడో చరిత్రపుటల్లోకి ఎగిరి వెళ్ళిపోయిన.. మహానేత వై ఎస్ పేరు మోసుకుంటూ జగజ్జేత కావాలనుకోడంలా జగన్ జీ! ‘అచ్చేదిన్’ వచ్చేదింకా ఎంతో దూరంలో లేదంటూనే.. వెనకటినాటి రామరాజ్యం మళ్లీ తెస్తామంటోంది మోదీ సర్కార్! వెనకచూపును చిన్నచూపు చూస్తున్నదెక్కడ! ముందుకు కదలాలంటే వెనక చూపు ఎంతో అవసరం.
ఆ చూపు లోపిస్తే బతుకెంత దుర్బరమో ఒక్క రామాయణంలోనే బోలెడన్ని ఉదాహరణలు! బంగారులేడి మాయదారిదని తెలిసీ శ్రీరామచంద్రుడు వచ్చినదారి పట్టక అష్టకష్టాల పాలయ్యాడు! వ్యాస మహర్షులవారు రాసి పారేసిన అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు, భారత భాగవతాదుల్లో ఒక్కడంటే ఒక్కడికైనా వెనకచూపు లేకపోవడం విచిత్రమే కాదు.. విచారకరంకూడానూ!
బ్యాక్ టు ఫ్యూచర్ పెద్ద హిట్ పిక్చర్ హాలివుడ్లో! బ్యాక్ టు స్కూలు అమెరిన్ స్కూళ్ళు తిరిగి తెరిచే సందర్భం! ఎన్నికల వేళ మన ప్రజానిధులు వాడవాడల్లో చెడ తిరుగుతారే.. అదీ ఓ రకంగా ‘బ్యాక్ టు నియోజకవర్గం’ పథకం కిందే లెక్క! అంగారకుడిమీద పరిశోధనలు చేసే నాసా రోవర్ ‘క్యూరియాసిటీ’ వంద మీటర్ల దూరం వెనక్కి నడిచినప్పుడు అంతరిక్ష పరిశోధకుల ఆనందం అంతా ఇంతా కాదు!
వెనకనుంచి చదివే లిపి పార్శీ. కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు తప్పనిసరిగా వెనక్కి నడవాలి! చిన్నబళ్ళో పంతుళ్ళు ఎక్కాలను వెనకనుంచి ఒప్పచెప్పించేవాళ్లు. రాకెట్లు అంతరిక్షంలోకి వదిలేముందు అంకెలు వెనకనుంచి లెక్కిస్తారు! లియొనార్డో డావిన్సీ పేరు విన్నారా! ఆయన వెనకనుంచి ముందుకు రాసుకుపోవడంలో సుప్రసిద్ధుడు!
రామకృష్ణ విలోమ కావ్యం.. 14వ శతాబ్దంది.. మొత్తం 36 శ్లోకాలు.. ముందు నుంచి చివరికి చదువు.. రామాయణం, వెనకనుంచి మొదటికి రా! భారతం! ‘చిరం విరంచి: న చిరం విరంచి:/సాకారతా సత్య సతారకా సా / సాకారతా సత్య సతారకా సా /చిరం విరంచి: న చిరం విరంచి:’ సాహిత్యంలో కవులు పద్యాలు ఇలా వెల్లికిలా వల్లెవేస్తే ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టేస్తాం. కాకతీయులుకూడా విలోమ పద్ధతుల్లో వివాహాలు చేసుకున్నారయ్యా అంటే విస్తుపోయి చూస్తాం! అన్నయమంత్రని రుద్రమాంబ రెండో బిడ్డ చేసుకుంది. ఇంత పాండిత్యం విని తట్టుకోలేనంటే చిన్న ఉదాహరణ ఒహటి తగిలించి వదిలేస్తా! 'దడిగాడువానసిరా'ని తిరగేసి రాసి చూడరా! 'రాసినవాడు గాడిద' అవుతుంది అవుతుందా లేదా! గురుస్వామిలాంటి స్వాములు సినిమాపాటలు వరస చెడకుండా వెనకనుంచి పాడితే భలే అర్థమవుతాయి కదా! చేతులు నొప్పుట్టేట్లు చప్పట్లు కొట్టికూడా అభినందిస్తావూ! వెనకటి కథలే మళ్ళీ మళ్ళీ తాజాసినిమాలుగా మారి రీసైకిల్ కిల్ చేస్తున్నా 'ఇదేంట’ని ఈసడించుకోవు సరికదా.. మొదట్రోజు మొదటాటలోనే తల మోదుకొనేందుకు తయారయిపోతావ్! మనదగ్గరంటే ఆసే.తు హిమాచల పర్యంతం దాదాపు ఒకే సమయం నడుస్తుంది. అమెరికాలాంటి అఖండ ఖండాల్లో అడుక్కో రకం గడియారంనడక! ఆరునెల్లకి ఓ గంట అటుకో ఇటుకో సర్దుబాటు! గడియారాలే వెనక్కీ ముందుకీ నడవంగా లేనిది మనమో నాలుగడుగులు అవసరాన్ని బట్టి వెనక్కి నడిస్తే వెక్కిరింతలెందుకూ!
ఈ పండితుల గోల మనకెంకుగ్గానీ మామూలు రాజకీయాలు చూసుకొందాం. వెనక చూపంటూ లేకుంటే చొక్కామీద వెనకనుంచి ఎవరు ఎప్పుడు ఏ సిరాచుక్క చక్కా విదిలించి పోతారో ఎలా తెలుస్తుంది! ఒలంపిక్సు పరుగుపందేల్లో ఎలాగూ కప్పులు తెచ్చే ఒకప్పటి గొప్ప ఆటగాళ్ళు పిటి ఉష.. అశ్వినీ నాచప్పల ఇప్పుడు లేరు. కనీసం కంచుకప్పులైనా కొట్టుకు రావాలంటే వెనక్కి పరుగెత్తే పందేలు పెట్టించి వాటిలో మన కుర్రబ్యేచికి తర్ఫీదివ్వాలి.. తప్పదు మరి! పురచ్చితలైవి జయలలిత.. లాంటి నేతలు మనముందుంటే వెనక్కి తిరిగి నడవడం వీలుండదుగానీ గుళ్లో అయినా పృష్టభాగం చూపించకుండా ప్రదక్షిణాలు చెయ్యడం కుదరదు గదా! వెనక నడకంటే ఇంకా పస్తాయింపులెందుకు!
వెనకనడక వల్ల బోలెడన్ని లాభాలుకూడానూ! కవిసమ్మేళనాలప్పుడు వెనక బెంచీల్లో కూర్చుంటే కవితాగానం జరిగేటప్పుడు నిశ్శబ్దంగా బైటికి పోవడం సులభమవుతుంది. పెద్దపెద్దవైద్యులు నొక్కి చెప్పే ప్రకారం పీల్చిన గాలిని వెనక్కి వదిలేయడమంటే వంట్లోని మలినాలను బయటకు తరిమేయడమే! అదే యోగానిపుణులు చేయమని మొత్తుకొనే విలోమ యోగాసనం! పద్మాసనంలో కుదురుకొని కుడిముక్కు మూసుకో! ఎడం ముక్కుతో గాలి పీల్చి వెనక్కి వదిలేయ్! లోపలికి లాక్కోవడమేగానీ బైటకు వదిల్లేని బలహీనత ఇక్కడా ప్రదర్శిస్తే ప్రమాదం! భీష్మాచార్యులవారికి మల్లే అంపశయ్యమీదే ఆఖరి శ్వాస వదిలేయాల్సొస్తుంది!
'ముందు మున్సిపాలిటీ అయినా వెనక పర్శనాలిటీ' చాలామంది సుందరాంగులకి. మనీ పర్శుకూడా వెనకజేబులోనే కదా దోపుకొనేదీ! ఇక మడమ తిప్పకుండా వెనక్కి తిరిగి చూడకుండా బజారులో బేరాలు చేసేది ఎలా? ఆడవాళ్లను చూసైనా ఇంగితం తెచ్చుకోవాలి! ముందు.. వెనక బేధం ఉండదు సింగారానికి. నీలవేణుల వెనకున్న వాల్జడలు చూసే చాలామంది కవులు సంపూర్ణంగా మతులు పోగొట్టుకున్నారు! శ్రీరాములవారి సహాయము కావలెను- అని కాదు రాసుకోవాల్సింది. కనీసం ఇవాళైనా 'నులెవ కాము యహా సరివాలము రాశ్రీ' అని తిరగేసి రాసి చూడండి! పట్టించుకోకుండా పోయిన భాగ్య సంపదలు ఠక్కున వెనక్కి రాకపోతే అప్పుడు అడగండి!
ఈ వెనక పండుగ రోజున ఏం చేయాలని సందేహమా! ఊహ ఊండాలేగానీ ఆకాశమే హద్దు! చొక్కా తిరగేసి తోడుక్కో! తొక్కతిని అరటి గుజ్జు వదిలేయ్! చెప్పులు కాళ్లు మార్చి వేసుకొని నడువు! కళ్లజోడు నెత్తికి పెట్టుకొని ఊరేగు! సెల్ఫోన్ రింగవంగానే 'బై' అని మొదలెట్టి 'హాయ్' అని ముగించు! టీవీని వెనకనుంచి విను!
గాడిదలకు మాత్రం వెనగ్గా పోవద్దు సుమా! లారీల వెనక నిలబడ వద్దు! ఆడపిల్లల వెనక్కూడా పడవద్దు. బివేరాఫ్ ‘షి’ టీమ్స్! ప్యాంటు పైన అండర్ వేర్ అంటే సూపర మేన్ వరకు ‘ఓ. కే’ నే గానీ ఎంత ‘వెనక్కి తిరిగే దినోత్సవ’మే అయినా కుక్కలకు ఆ విషయాలేవీ తెలీవు కదా! వెనకబడగలవు! శ్రీకారం చివర్లో.. స్వస్తి మొదట్లోనే చెప్పేవరకూ బాగానే ఉంటుంది..కానీ 'శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ../..గడియెక్కి భానుడు కంబపువ్వు ఛాయ/కంబపువ్వు మీద కాకారీ పూఛాయ' అంటూ నడిరాత్రి మేలుకొలుపులుగానీ లంకించుకున్నావనుకో .. పండగ స్వారస్యం తెలియని పక్కింటి సూర్యనారాయాణ నిజంగానే గడకర్ర పుచ్చుకొని గడపముందుకొచ్చేయచ్చు! 'పసిడి పాదుకలూని పడతి సీత కేలూని/ పవళింప వేంచేయు సమయము స్వామీ!' అంటూ నిద్రపుచ్చే పాటలకు పరగడుపునే తగులుకుంటే ఎదురింటి పవనకుమారుడుగారు తన మజిల్ పవరు చూపించగలరు! తస్మాత్ జాగ్రత్త! ‘బేక్ వర్డు డే’ కదా అని యోగా చేస్తూ వెనక్కి వంగితే నడుం పట్టేయచ్చు. భద్రం!
'మరల నిదేల రామాయణం బన్నచో,/ నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ/తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు/ తన రుచి బ్రదుకులు తనివి గాన/చేసిన
అన్నారు మహాకవి విశ్వనాథ సత్యనారాయన గారుకూడా! విలోమ దినం విశిష్టతేంటో ప్రభుత్వాలక్కూడా తెలిసొచ్చినట్లుంది! ఆదివారమని కూడా చూసుకోకుండా ప్రచారానికొస్తున్నారు పాపం ఎన్నికల అభ్యర్థులు!. రోటీనుకి భిన్నంగా ‘గ్రేటరు’ వాళ్లూ రోజంతా వాటరిస్తున్నారు. కరెంటిస్తున్నారు. రోజూ తాగి వచ్చి, భార్యను తంతేగాని నిద్రపట్టని తాతారావుకూడా ‘ఈ ‘వెనక్కి తిరిగే దినోత్సవ సంబరాన్ని పురస్కరించుకొని ఎప్పట్లా కాకుండా రాత్రినిద్ర బైట కానించి.. పొద్దున్నే వచ్చి తన్నుడు కార్యక్రమం మొదలు పెట్టాడు!
తెలుగు దేశం మళ్లీ అధికారంలోకి రావాలని అన్నవరంనుంచి తిరుపతి వరకు వెనక నడకన యాత్ర చేసాడొక తమ్ముడు ఈ మధ్యనే! రొటీన్ కి భిన్నంగా మోదీజీ ప్యారిస్ నుంచి తిరిగొస్తూ కాబూల్ లో దిగిపోయారా మధ్య! రొటీన్ కి భిన్నంగా ఎన్నికలప్పుడు పార్టీలే ఓటర్ల చిరునామాలు వెదుక్కొంటూ తిరుగుతున్నాయి! పురస్కారాలు ఈ వెనక పండక్కి చాలా ముందునుంచే రివర్సులో తిరిగి ఇచ్చే ఉద్యమం మొదలయింది! ఇప్పుడు మళ్లీ అకాడమీ తిరిగి వెనక్కి ప్రదానం చేసే కార్యక్రమంలో ఉంది. ఇప్పటి వరకు భారత్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో విదేశాలకు తరలి వెళుతున్నారా! ఈ సారే వనక్కి తిరిగి వచ్చేస్తున్నారు!
‘పీచే ముడ్!.. ఆగే బడ్!’ లలో ఏది ఎప్పటికి శ్రేష్టమో అదే అప్పటికి అనుసరించడం ఉత్తమ రాజకీయవేత్త లక్షణం. చైనా, జపాన్లు వెనక్కి నడవడాన్ని ఓ కళగా అఅభివృద్ధి చేస్తున్నాయి!
మనమూ కొన్ని రంగాలలో వెనకబడేమీ లేమనుకోండి! ఇక్కడ రైళ్లు, బస్సులు నడుస్తుంటాయి. విమానాలు కూడా వి ఐ పి లు పిలిస్తే ‘ఓయ్’ అంటూ చక్రాలు వెనక్కి తిప్పుకుంటాయి!. రూపాయి వెనక్కి నడుస్తుంది. పాపాయి రూపాయిని చూస్తే వెనక్కి నడుస్తుంది. వెనక తింటున్న కందమూలాలనే మళ్లీ మనం తింటున్నది.. ఆరోగ్య స్పృహ మరీ పెరిగిపోయి. వెనక ఆదిమయుగం మానవులు కట్టిన పిక్కల్లోకి వచ్చే దుస్తుల్నే మళ్లీ మన ఆడవాళ్ళు ఇవాళ ఆదరిస్తున్నది! వెనక వాడిన రుబ్బురోళ్ళు.. రోకళ్ళు.. బుడ్డి దీపాలే మళ్లీ ఆరోగ్యదృష్ట్యా మంచివని ఇళ్లల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ముందుకు పోయే వేగం పెరుగుతుందని వెనకబడిన తరగతుల్లో చేర్చమని కొన్ని వర్గాలు ఉద్యమాలుకూడా జోరుగా చేస్తున్న దేశం మనది. ఐదేళ్లకోసారి ‘మమ’ అనిపించే ఎన్నికల్లో మనం ఓట్లేసి గెలిపించే ప్రజాప్రతినిధి ముందుచూపుతో నాలుగురాళ్లు వెనకేసుకొంటున్నాడే అనుకోండి! అతగాడిని మళ్లీ వెనక్కి పిలిపించేందుకు అవకాశం ఉందా మన ప్రజాస్వామిక పాలనావిధానంలో! ప్రగతి పథంలొ ముందుకు దూసుకుపోయే ప్రజాస్వామ్య వ్యవస్థకైనా సరే వెనక చూపు అందుకే తప్పనిసరి అనేది!
!గో బ్యాక్!’ అని వూరికే నినాదాలు చేస్తే ఏమొస్తుంది! సమయం సందర్భం చూసుకొని వెనక్కి నడిచినప్పుడే ముందుకు పోయే అవకాశం చేజిక్కించుకొనేది!
ఈ క్షణంనుంచే వెనక్కి నడవడం ఆరంభిద్దాం!
పదండి వెనక్కు!.. సారీ.. క్కునవె డిందప!
***
- కర్లపాలెం హనుమంతరావు
01 - 03-2021