ఈనాడు - గల్పిక
ఎవరు గొప్ప?
కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - గల్పిక- 24 - 04 - 2009
ప్రచారాలు ముగిశాయి. ఎన్నికలు పూర్త య్యాయి.
ఊరూవాడా తిరిగి తిరిగి అలిసిపో యిన నేత పడకమీద పడి కలత నిద్రలో ఉన్నాడు.
అలవాటుగా అవయవాలన్నీ సభ పెట్టాయి.
' మేం లేకపోతే గురుగారికి గుర్తింపే లేదు. ఎవరెన్ని రథయాత్రలు చేసి రాష్ట్రం మొత్తం టముకులు కొట్టొచ్చినా పాదయాత్రతో వచ్చిన పేరు ముందు అవన్నీ బలా దూర్ . సారుకి మేమంటేనే ప్రేమ' అని వాదన మొదలు పెట్టాయి పాదాలు బడాయిగా.
'హలో' అంతొద్దు! తమరొట్టి కాళ్లు గారే. మేం మోకాళ్లం. మీకన్నా ఒక మెట్టు పైనే ఉన్నామని గుర్తుపె టుకుంటే మంచిది. తిరిగింది తమరే అయినా అరిగింది మేమే అన్నా! అప్పుడే మా త్యాగాలను మరిచిపోతే ఎట్లా? బాసుకి మేమంటేనే భయం. కావాలంటే బోడిగుండు నడ గండి!' అంది మోకాలు .
నుదురు కిసుక్కుమని నవ్వింది, ' మోకాలికి బోడిగుండుకీ లంకె అంటే ఇదే' అంటూ.
బుర్రకు ఉక్రోషమొచ్చింది. 'బోడి... బోడిగుండని ఊరికే తీసి పారేయద్దు. అందరి నాయకుల బుర్రలూ ఒకేలా ఉంటాయి... టోపీలే తేడా, తెలుసా?'
చప్పట్లు కొట్టి అన్నాయి చేతులు- 'గ్రేట్! గుండు బ్రహ్మాండంగా చెప్పిందిగానీ, అందరూ ఒకటి గుర్తుంచు కోండి! దండం పెట్టాలన్నా, అభయహస్తం చూపెట్టాలన్నా, నెత్తిమీద చెయ్యి పెట్టాలన్నా గురూగారికి కావా ల్సింది మేమే. అందుకే హస్తాన్ని పార్టీ గుర్తుగా కూడా పెట్టుకున్నారు. అర్ధమయిందా మా లెవెలూ బాబులూ !'
వేళ్లకు పొడుచుకొచ్చింది 'బాబు బాబు అంటూ డాబు కొడుతున్నావు. మీ బాబుగారు అస్తమానం హస్తాన్ని గాల్లోకి ఊపుతూ మా వేళ్లనే చూపిస్తుంటారు! విజయా నికీ, ఉత్సాహానికి మా రెండు వేళ్లే కొండగుర్తు... తెలిసిందా?
' ఆ వేళ్లకు గోళ్లు లేకపోతే టోపీలేని నెహ్రూగారిలాగా ఎవరూ గుర్తు పట్టలేరు' అంటూ గోరు ముక్తాయించింది.
' వేలెడంత లేరు. గోరుగారు కూడా మాట్లాడేవారే! అవునులే.. ఎన్నికల కాలం గదా! ... ఆమాత్రం గోరోజనం లేకపోతే జనాల్లో గుర్తింపొచ్చేదెలా?' అని నోరు నవ్వింది.
'గోరు గోరని అలా తీసి పారెయ్యద్దు... రేప్పొద్దున్న ఓడినవాడు గిల్లుకుంటూ కూర్చోవాల్సింది గోళ్లనే కదా!' అంది నొసలు ఎద్దేవాగా.
కడుపుకి మండింది. 'మీకసలు బుద్ధుందా? బకాసురుడిలాగా నేనిక్కడొక పెద్దదాన్ని పడున్నానని ఎవరికైనా గుర్తుందా? మనస్వాములు భూములు, గనులు, ప్రాజె క్టులు, ఎయిరుపోర్టులూ, కేరిడార్లూ, కంపెనీలూ అంటూ ఎక్కడెక్కడి సొమ్మునూ గుటకాయస్వాహా చేస్తుంటే చోటు పట్టకున్నా .. నా లోపల భద్రంగా దాచుకొస్తున్నానా! నన్ను పట్టించుకోనంటే ఎలానర్రా! రాజాగారికి ఎలాగైనా నేనంటే ప్రియం... భయం. ముందాసంగతి తెలుసు కోండి!'
'కడుపా! మరీ అంత చించుకోకు... కాళ్ళమీద పడి
పోగలవు' అంది గుండెకాయ.
'నీ అవస్థ చూస్తుంటే నిజంగానే గుండె
తరుక్కుపోయే ట్టుందన్నయ్యా! నిరాహారదీక్ష వేళ కూడా నీకూ నాకూ క్షణం విరామం దొరకదాయె' అంది నోరు అరిగిపోయిన గొంతుతో.
'నేనున్నవాడికే రాజ్యం, సభలో . బైట కూడా సారుగారు నన్ను పెట్టుకునే బతుకున్నారు. అదీ నా గొప్పతనం అధ్యక్షా! ఒప్పుకొని తీరాలెవరైనా' అంది నోరు.
'మహా గొప్ప' అని గొణుక్కుంది నాలుక.
'ఎవరా సణిగేది?' అంది చెవి.
' గర్జనల దెబ్బకు నీకు దిబ్బెళ్లు పడ్డట్టున్నాయిగా! ... నేనేలే నాలుకని అంది నాలుక.
' అదే.. ఏ నాలుకని? '
' సెటైరా? మేమింతమంది నాయికలం ఉండబట్టే సాబు పొద్దున చెప్పింది. . సాయంకాలానికల్లా చెప్పలేదని తప్పించుకోగలుగుతున్నారమ్మా! రాజకీయాలలో ఒకే నాలికంటే తేలికయిపోతా రెవరైనా! కావాలంటే ఇదిగో.. మన మెదడు గారి నడిగి చూడరాదా! '
' మెదడా? అదెక్కడుంది?.. అహ.. తలలో కనబడకపోతేనూ.. లేదనుకున్నామే! | అన్నాయి రెండు కళ్లూ.
' లేకుండా పోవటానికి అదేమన్నా సిగ్గా... శరమా? మోకాలు దగ్గరికి షికారుకెళ్ళినట్లుంది పాపం' అంది ముక్కు ఎకసెక్కంగా.
'ముక్కా' మరీ అంత సూటిపోటీలొద్దమ్మా! కాస్త మూసుకొంటేనే నీకూ బాసుకూ మంచిది' అన్నాయి కళ్లు.
' ఈ ఎన్నికలైన తరువాత అది చేసే పని ఎలాగూ ఆదే గానీ" ముందు నీ సంగతి చూసుకొంటే మంచిది. . నెత్తికెక్కి కూర్చున్నావు ' అంది నోరు.
'ఎక్కడుంటే ఏంటిలే! మాలో ఇన్ని నీళ్లు గిర్రున తిరిగితే చాలు. . ఎక్కడికక్కడ సానుభూతి వచ్చి పడుతుంది. వద్దనుకున్న వాళ్లే టికెట్లిచ్చిపోవాలి... వరసలో నిలబడి మరీ జనం ఓట్లేసి పోవాలి . చూపుతోనే కాల్చేసే పవరు బ్రదర్సూ మా కళ్లదీ! అందుకే మన బాసుకి మామీదే అందరికన్నా ప్రేమ అదుర్సు'
తొడలు అదిరిపడి లేచాయి.
మీసాలు రోషంగా ముందుకు దూకాయి.
బాసు పడుకున్న పడక మొత్తం టికెట్టిచ్చే ముందు పార్టీ కార్యాలయం మాదిరి గడబిడగా తయారైంది .' మేము గొప్పంటే ... మేం గొప్ప ... బాసుకు మేమంటేనే అందరికన్నా ఎక్కువ ఇష్టం. మేమంటేనే సారుకు అందరికన్నా ఎక్కువ భయం కూడా! ' అంటూ చట్టసభ తరహాలో రభస మొదలుపెట్టాయ్.
ఆ గలభాకి నేత లేవనే లేచాడు.
అవయవాల గోల ఓపికగా విన్నాడు.
చివరకి నిదానంగా పెదాలమీదకు అదోరకమైన అలవాటు నవ్వును అలవోకగా పులుముకొని అన్నాడూ . . 'ఇంకా నయం. కార్యకర్తలంటే నాయకుడికి భయమెందుకూ ? నయానో, భయానో ఎవరినైనా దారికి తెచ్చుకునే శక్తి లీడర్ సాంతం . కలర్ టీవీ ఇస్తే కళ్లు లొంగిపోతాయి. సెల్ ఫోన్ బహుమతిస్తే చెవులు పొంగిపోతాయి. మందుబాటిలిస్తే నోరు మూతబడిపోతుంది. వెయ్యి నోటు చూపిస్తే కడుపు చల్లబడిపోతుంది. ఇదిగో.. దేనికీ లొంగనిది .. ఓటరుగాడి మనస్సులో దాక్కుని ఉండేది ఈ అంతరాత్మే. అదిగానీ నిద్రి లేచిందా... మా బోటి నాయకుల పని గోవిందా! సో అంతరాత్మే పాలిటిక్సులో అందరికన్నూ ది మోస్ట్ పవర్ ఫుల్ !
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - గల్పిక- 24 - 04 - 2009