Saturday, December 4, 2021

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం ప్రజలతో పనేంటి? రచన: కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - గల్పిక- 16/09/2009 ) ప్రచురణ )

 



ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

ప్రజలతో పనేంటి? 


రచన: కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- 16/09/2009 ) ప్రచురణ ) 


"పెళ్ళినాడు విడిదింటికి పంపిన ఉప్మా వేడిగా లేదని, జీడి పప్పు దండిగా పడలేదనీ పెళ్ళానికి ఇన్నాళ్ళకు విడాకులిస్తానంటున్నాడు  మా తోడల్లుడి అల్లుడు!''


'పెళ్ళయి మూడేళ్ళయింది. ఇప్పుడా ఆ పట్టింపులు! " 


' ఎప్పుడోపోయిన జిన్నాను ఇప్పుడు మంచివాడన్నాడని జెస్వంత సింగు ను  'ఛీ .. పో' అనలేదా భాజపా? ' 


' అదేరా నేననేది!  పెద్దవాటిమీద చిన్నచూపూ, చిన్న చిన్న వాటిమీద పెద్ద చూపూ!  చిన్నా పెద్దా తేడాలేకుండా అందరికీ ఇలా బాగా అలవాటైపోతుందేమిటా అనే నా బాధ! కోట్లు ఖరీదు చేసే దేవుళ్ళ సొమ్ములు మాయమైపోతున్నాయి. అవేమై పోతున్నాయో చూడండి మహాప్రభో... అన్నా నిన్నటిదాకా పట్టించుకున్న నాథుడే లేడు. వరదనీరు మనదాకా రాకుండా పొరుగు రాష్ట్రాలు ఆనకట్టలు వరసగా కట్టేసుకుపోతుంటే మనవాళ్ళకు చీమకుట్టినట్లయినా లేకపాయె ! మొన్నటికి మొన్న పైవాళ్ళు ఏదో మూడు నాలుగు ముష్టి రాళ్ళు మన మొహాన విసిరేస్తే  ముప్పైమూడు మంది ఎంపీలున్నా ఇదేంటని గట్టిగా నిలబడి అడిగినవాడు లేడు! పెద్ద పెద్ద విషయాలేవీ మనకు పట్టవు . ఎప్పటి పింగళి వెంకయ్య... ఇప్పుడా తపాలాబిళ్ళ విడు దలయ్యేది! ఎంత పురాతనమైనదీ మన కమ్మటి తెలుగు భాష ! ప్రాచీన హోదా రావడానికి ఇన్ని ఆపసోపాలా?....


'మన జనాలు కూడా అలాగే ఉన్నారులే అన్నా! పొగతాగడం ఆరో గ్యానికి హానికరమని పెట్టె మీదుంటే పట్టించుకుంటున్నారా! ముందు సీటుపై కాలు పెట్టరాదని రాసుందని సినిమాహాల్లో ఎవడైనా ముడుచుకు కూర్చుంటున్నాడా? శిరస్త్రాణం పెట్టుకుంటే శిరోవేదన, సీటు బెల్టు పెట్టుకుంటే కడుపునొప్పి, నిదానంగా పోకపోతే ఎదుటివాడికన్నా ముందు మనమే పైకిపోయేదని పోలీసులెంత మొత్తుకున్నా పట్టించు కుంటున్నామా! ఎడమకు నడవమంటే కుడికి నడుస్తాం. ఆసుపత్రి పరి ధిలోనన్నా హారను మోగించరాదన్న ఇంగితం ముందు మనకే ఉండదు. అంబులెన్సుకైనా  దారివ్వటం నామోషీ  మనకు! ' 


' దుష్యంతుడు శకుంతలను పట్టించుకోలేదు. వాళ్ళకు పుట్టిన భరతుడి వారసులమే గదా మనం ! ' 


' పట్టించుకోక పోవడమనేది అందుకే మనకు రాజకీయాల్లాగా, వ్యాపారా ల్లాగా, సినిమా అవకాశాల్లాగా వారసత్వంగా వచ్చినట్లుందన్నా! ' 


' మనకేకాదు- మన దేవుళ్ళకీ ఈ బలహీనత ఉన్నట్లుంది. భృగు మహర్షిని బ్రహ్మరుద్రాదులు పట్టించుకోకపోబట్టేగదా శాపాల పాలయ్యారు! విదురుడి నీతులు ధృతరాష్ట్రుడు పట్టించుకున్నాడా? స్వతంత్రమొచ్చిన తరువాత జాతిపిత మాటలనే మననేతలు పట్టించుకున్న పాపానపోలేదు.' 


' పిల్లకాయలు పెద్దవాళ్ళను, శిష్యులు గురువుల్ని, పెళ్ళాలు మొగుళ్ళను పట్టిం చుకునే కాలం పోయిందన్నా! సినిమాలు విలువల్ని, బస్సులు ప్రయాణికుల్ని, వ్యాపారులు బ్యాంకులను ..  ఖాతాదారుల్ని, పోలీసులు నేరగాళ్ళను పట్టించుకుంటూ కూర్చుంటే కుదిరేపని కాదని అనుకునే కాలమొచ్చింది. 


జనానికి పర్యావరణాన్ని, పాఠ్యపుస్తకాలకు అచ్చుతప్పుల్నీ, ప్రభుత్వానికి కరవునీ పట్టించుకోవటం తప్ప వేరే పనేమీ లేదా? 


అంవర్గ  ఇంత చిన్న విషయాల్ని పట్టించుకుంటే ఏం బావుంటుంది చెప్పు!

అని అడిగితే మరి నీ దగ్గర సమాధానముందా, ముందది చెప్పన్నా!' 


వేళాకోళానికి  వేళా పాళా లేదా ? ... ఇంతకూ నువ్వనేది ఏందిరా? ?


'కంది ధర వంద దాటింది. బంగాళ దుంపలూ బరువెక్కుతున్నాయి. పెట్రోలు ధర ఏ పూట ఎంతుంటుందో ఆ పుట్టించినవాడికైనా తెలీటం లేదు. కరెంటు కోతలు తప్పటం లేదు. రోజు మార్చి రోజైనా నీళ్ళు రావటం లేదు. ఆడపిల్లలు యాసిడ్ దాడులకు, తల్లిదండ్రులు పిల్లల చదువు ఫీజుల దెబ్బలకు కుదేలవుతున్నారు. వానలు లేక కరవులు . చినుకుపడితే రోడ్లు చెరువులు.  సన్న బియ్యం దొరకవు. ప్రతిభ ఉన్నా మంచి కళాశాలలో సీట్లు దొరకవు..' 


సరేరా .. ఎప్పుడూ ఉండే సోదేకదా ఇదీ! మన మెదళ్ళు ప్రభుత్వ కార్యా

లయాల్లోని సలహాలపెట్టెల్లాగా, భవన సముదాయాల్లోని నిప్పునార్చే యంత్రాల మాదిరి అలంకారప్రాయాలుగా మారాయనేగా నీ ఫిర్యాదు ? ఆస్కార్ వాళ్ళు మన సినిమాల్ని పట్టించుకోవడంలేదనీ, ఎంసీయే సీట్లు ఎవళ్ళకి అక్కర్లే కుండా పోయాయనీ, ఒలింపిక్స్ లో మనకు పతకాలు రాక పోతున్నా ఆటగాళ్ళకేమీ పట్టటంలేదనీ, చంద్రయానం విఫ లమైనా శాస్త్రవేత్తలు పెద్దగా బాధపడటంలేదనీ, తెలుగు యాంకర్లు వత్తులు పట్టించుకోవడం ఇంకా మొదలు పెట్టలేదనీ, విదేశాలలో  మన పిల్లలలా బాధలుపడుతున్నా ఎవరికీ చీమ కుట్టినట్లన్నా  లేకుండా పోయిందనీ, క్రికెట్ని తప్ప మరో ఆట మనవాళ్ళు ఆడటంలేదనీ, సినిమా పాటల్లో సాహిత్యాన్నేమీ పట్టించుకోకుండా సంగీతం మింగేస్తోందనీ, వంకాయల్లో పుచ్చులు ఎక్కువగా వచ్చేస్తున్నాయనీ, టీవీలో వంకర నృత్యాలెక్కువ వచ్చాయని, ఓజోన్ పొర చిరిగి ఒళ్ళు మండే ఎండలు విపరీతంగా కాస్తున్నాయనీ, వేతనాల సమీక్షా సంఘమింకా నివేదిక ఇవ్వలేదనీ... కవులూ, విలే కరూ, ఆడవాళ్ళూ, పిల్లకాయలూ తప్ప ఎవరూ ఎవర్నీ ఏమీ అసలు పట్టించుకోడంలేదనీ... పట్టించుకునేటట్లుగా కూడా లేరనీ, ఇలాంటివేగా నీవనబోయేది? '


' కాదు. ఒకవంక మహమ్మారి మాయదారి స్వైన్ఫ్లూ, డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతక జబ్బులు ముంచుకొచ్చి రోజు కొకరో ఇద్దరో పిట్టల్లా రాలిపోవటం మొదలై పదిరోజులు పైనే అయినా... మూడు నెలలకు ముందే ప్రమాద సంకేతాలు అందటం మొదలైనా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి పట్టం ఎవరి కెప్పుడు ఎలా కట్టబెట్టబోతున్నారోననేది మరీ ముఖ్యమైనట్టు మంత్రులూ సామం తులూ మనం ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు ఆందోళనపడిపోతున్నారే! ' 


'అందుకే నేననేది... పెద్దవాటి మీద చిన్న చూపు. చిన్నవాటి మీద పెద్ద చూపూ చిన్నా పెద్దా తేడాలేకుండా అందరికీ అలవాటైపో యిందని.' 


'అయితే, ఆ తప్పంతా నీదేనన్నా! గతంలో నువ్వు గెలిపించినవాడు అయిదేళ్ళపాటు నిన్నేమీ పట్టించుకోకపోయినా.. మళ్ళీ ఓటడగటానికి నీ గడపదాకా వచ్చినప్పుడు నువ్వదేమన్నా పట్టించుకున్నావా? నువ్వు పట్టించుకుంటేనే ఎవరైనా నిన్ను పట్టించుకునేది. అది ప్రజాస్వామ్య సూత్రం. అదిగో వదిన ఎందుకో అరుస్తూ వస్తుంది... ముందది చూడన్నా!'


'ఏందయ్యో! ప్రాణం బాగాలేదు, ఆసుపత్రికెళ్ళాద్దామన్నా పట్టించుకోకుండా ఈడ ముచ్చట్లు పెట్టుకుని కూకున్నావా ! పద! పద!' అంటూ పరుగులాగా నడి చొచ్చింది ఆ వదినమ్మ! 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- 16/09/2009 ) ప్రచురణ ) 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...