ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం
గురువులకు చదువులు
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సం.పు- 25-07-2013 న ప్రచురితం )
బండెడు పుస్తకాలకు బస్సెడు గురుబ్రహ్మలు తోడైన కొత్త విద్యావిధానం వచ్చేసిందా!
ఒక ఉపాధ్యాయుడికి నలభై మంది శిష్యపరమాణువులు అనే సిద్ధాంతం ఇహ పాతబడినట్లేనా! ఒక విద్యార్థికి నలభై మంది గురువర్యులన్న కొత్త ప్రణాళిక మొదలుకాబోతోందా!
నవీన విధానం
విద్యుత్తు బుగ్గ, ఆకాశవాణి, చరవాణి లాంటి ఆవిష్క రణలకైతే పనిగట్టుకొని పనులు మానేసి పెద్దబుర్రలు తలలు బద్దలేసుకున్నారు! కేవలం మన రాజకీయవే త్తలు, అధికారంలేని అధికార వర్గాలు, ఉద్యోగ సంఘాల బుద్ధికుశలతవల్ల మనకిప్పుడు ఓ సరికొత్త విద్యావిధానం దొరికిందోచ్...
చదువు సాములు మెరుగుపడాలని, బడిపిల్లగాడి అవ సరాలకు తగ్గట్లు అభ్యసన విధానం మారాలని అభ్యు దయ భావాలతో సర్కారు పెద్ద హేతుబద్ధీక రణకు 'సై' అంటోంది. ప్రభుత్వం బుద్ధికుశలతకు మించిన కొత్త పద్ధతులు బాలల విద్యావిధానంలో వచ్చే స్తున్నాయ్! పాఠ్యప్రణాళిక శుద్ధంగా అమలు చేయాలంటే బస్సెడు ఏం ఖర్మ... జంబో విమానమంత గురుసైన్యం తయారు కావాలి.
తెలుగులో అచ్చులు నేర్పించడానికి ఓ ఉపాధ్యా యుడు, హల్లులు వల్లె వేయించేందుకు మరో గురువు గారు, గణితంలో ఒంట్లు పిల్లాడి ఒంటికి పట్టించేందుకు ఒక పట్టుదలగల పంతులు, ఎక్కాలు బుర్రల్లోకి ఎక్కిం చేందుకు ఇద్దరు పెద్ద బుర్రలు- ఒకరు పైనుంచి కిందికి నేర్పిస్తే... మరొకరు కిందనుంచి పైకి చదవడం నేర్పిం చేందుకు ;
ఆంగ్లంలో మూడు బళ్లు ఏడ్చినప్పుడు ఒక్కో బడికి ఒక్కో గట్టిపిండం అవసరమే గదా!
సాంఘిక శాస్త్రంలో పర్యావరణమనే కొత్త అంశం పుట్టుకొచ్చింది. పిల్లకాయలను తోటలవెంట దొడ్లవెంట తిప్పుతూ ప్రకృతి తిరకాసును విప్పిచెప్పే మాస్టార్ల అవసరం ఎంతైనా ఉంది.
మోరల్ క్లాసులు పీకేందుకు మోటా జ్ఞానంగల పెద్దల సహకారం అవసరం.
సామాన్య శాస్త్రం మాత్రం సామాన్యంగా ఉందా?
భౌతిక, రసాయన శాస్త్రాల సూత్రాల వివరణ... ప్రయోగశాలలో వాటి సత్యనిరూ పణ- మొత్తంగా నలుగురు సైన్సు మాస్టార్లు సిద్ధంగా ఉండాలి.
చిత్రకళ, సంగీతం వంటి విశేషాలను పిల్లకాయల చేత కాయించి వడగట్టించేందుకు ఎంతమంది కళాకారులు కావాలి?
ఇక పరుగెత్తడం, గెంతడం, దూకడం, గుద్దులా డుకోవడం వంటి విద్యలు, విన్యాసాలు నేర్పడానికి డ్రిల్లు మాస్టార్లూ తప్పనిసరి!
ఇవన్నీ పిల్లకాయలకు అవసరమా అన్న సందేహం మంచిది కాదు.
జీవించడానికి అవసర మైన కీచులాటల్లో లాఘవం రావాలంటే బాల్యంనుంచే కండబలం చూపించే ఇలాంటి విద్యలూ అవసరమే.
అవ సరాలకు తగిన శిక్షణ పిల్లలకు ఇవ్వాలనేగా హేతుబద్ధీక రణకు సర్కారు 'సై' అన్నదీ!
గురువులకు కరవు లేదు. తరగతి గదిలో చుక్కల్లో నల్లపూసలా మెరిసే ఒక్క విద్యార్థికి ఒకే సమయంలో ఒక్క నాలుగు గంటల్లో విద్య గరపటమెలా అన్నదే సమస్య.
సంక్షోభం వచ్చినప్పుడే సమస్యకు పరిష్కారం బయటప డేది! గతంలో నల్లబల్ల దగ్గర యమకింకరుడి మాదిరిగా
టీచర్ బెత్తంతో విద్యార్థిని వణికించే ఉపాధ్యాయుడు.. కిందకు దిగి, బెంచీల మీద బుద్ధిగా కూర్చుంటాడు.
నిష్పత్తిలో ఒక్క శాతంగా ఉన్న విద్యార్థి పైకెక్కి బల్లముందు కూర్చుంటాడు. మారిన కొత్త విద్యాభ్యాస విధానంలో విద్యార్థి వేసే హాజరుకు ఉపాధ్యాయులంతా 'జీ' హుజూర్ అన్న తరువాత విద్యాభాసం మొదలవుతుంది.
బిడ్డ కళ్ళు మూసుకొని వేలు ఎవరివైపు చూపిస్తే ఆ పంతులుకు పాఠం చెప్పే సువర్ణావకాశం దక్కుతుంది.
శిక్షణ సమయంలో పక్క గురువులు కక్షతోనో, కడుపు మంటతోనో అల్లరికి తెగబడితే పిల్లవాడు వేసే శిక్షలు దారుణంగా ఉంటాయి.
ఆ పూట పాఠం చెప్పే అవకాశం కోల్పోవడమే కాకుండా... బెంచీ ఎక్కడమో, గోడకుర్చీ వేయడమో తప్పనిసరి. అల్లరి మరీ మితిమీరితే బయట ఎండలో నిలబడటమూ తప్పదు గురువులకు .
పాఠం వినే సమయంలో సాధార ణంగా ఏ పిల్లవాడూ పెదవి విప్పడు. తెలివితక్కువ వెధవ ఎవడైనా ఖర్మగాలి సందేహం వెలిబుచ్చితే పంతులు నోటి నుంచి ఠక్కున బదులు రావాలి. వివరణ లు సంతృప్తికరంగా లేకపోతే గురువుకు గుంజీలు తప్పవు. శిష్యుడి చేతిలో బెత్తం ఆడుతున్నంత సేపూ గురువుల గుండెల్లో మెట్రో రైళ్లు పరుగెత్తుతుంటాయ్!
ఇంటి దగ్గర పాఠం సరిగ్గా తర్పీదు కాకుండా వచ్చే అయ్యవారి పని గోవిందే! 'ఐ నెవ్వర్ టెల్ ఎనీ లెసన్' లాంటి పలకలు పంతుళ్ల మెడలో వేలాడదీసినా ఎదురు అడిగే విధానం కొత్త పద్ధతిలో పూర్తిగా రద్దయినట్లే! 'వ్యాపారంలో విని యోగదారుడే రాజు అయినట్లే మారే కొత్త విద్యావిధానంలో విద్యార్థే రారాజు!
సర్కారు వారి విద్యారంగం హేతుబద్ధీకరణను హేళన చేయకుండా ఇలాంటి 'జంబలకిడిపంబ' సూత్రం అమలు చేస్తే తప్పేముంది? కాకపోతే కొద్దిగా తయారీరంగంలో మార్పులు అవసరం.
ఉపాధ్యాయులకు ముందస్తు శిక్షణ ఉన్నట్లే, ఇకపై కొత్త పద్ధతిలో విద్యార్థికీ శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.
ఒక్క గురువు వేధింపులకే తట్టుకోలేక పసివాళ్లు అఘాయిత్యాలకు ఒడిగడుతు న్నారు. ఇంతమంది యమ గురువులను ఒకేసారి ఒకే చోట ఎదుర్కొనే సామర్థ్యాలను బడికి పంపేముందే విద్యార్థికి శిక్షణ రూపంలో అలవరచాలి.
పిల్లనటులు పెద్ద దర్శకులను అదుపులో పెడుతు న్నారు. బొడ్డూడని పసిపిల్లలు కన్నవారిని కనుసన్నల్లో ఆడిస్తున్నారు. సర్కారు కార్యాలయ అజమాయిషీ మొత్తం అధికారులు చేతుల మీదుగానే సాగిపోతోంది. కార్యకర్తల ఆదేశాలమీద రాజకీయ నేతలు పార్టీ గోడలు దూకుతున్నారు. పూజారుల లెక్కల ప్రకారమే ఆ ఏడు కొండలవాడూ నామాల పొడుగు సరిదిద్దుకుంటున్న ప్పుడు, పిల్లకాయలు బెత్తం ముందు పాఠాలు చెప్పే గురు వులు చేతులు కట్టుకుని నిలబడి ఉంటే దోషమేముంది?
మీడియా హోరు, చిత్రాల బోరు, సీరియళ్ల జోరు ముందు బేజారు కాకుండా గట్టిగా నిలబడాలంటే చిన్న బడి నుంచే పెద్ద గురువులను అదుపుచేయడంలో తర్ఫీదు పొందాలేమో!
ఎన్నికలవేళ వందలాది నేతలు వేలాది హామీలను ఒకేసారి గుప్పిస్తారు . ఓటరుగా ఆ నొప్పిని సహించాలన్నా, విద్యార్థి దశనుంచే సమాయత్తం చేయవలసిన అవసరం చాలా ఉంది .
హేతుబద్ధీకరణ అసలు ఉద్దేశం కూడా అదే కావచ్చు! ఏమంటారు పిల్లలూ!
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సం.పు- 25-07-2013 న ప్రచురితం )
No comments:
Post a Comment