సూర్య - గల్పిక- హాస్యం
ప్రేమ పార్టీ జిందాబాద్
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఆంధ్రప్రభ దినపత్రిక - సంపాదక పుట - కాలమ్ - సుత్తి మెత్తగా - 10 -02 -2018 న ప్రచురితం )
' ప్రేమే దైవం యువతే లక్ష్యం '
' ఇదివరకు సేవే లక్ష్యం. అన్నట్లు గుర్తు'
"అది ముగిసిపోయిన పార్టీ పొట్టి కేషన్ బాబాయ్! ఇది ముందుకు దూసుకొస్తోన్న పార్టీ కొత్త స్టోగన్ . మాది దక్షిణాది రాష్ట్రాల మార్కు యాక్షన్ పార్టీ! అదేమో ఉత్తరాది రాష్ట్రాల మార్కు ప్రేమ పార్టీ! మాధుర్ నాథ్ చౌధురి గుర్తున్నాడా?
' మర్చిపోదగ్గ మహాను భావుడా బాబూ? పాఠాలు చెప్పమని ఉద్యోగమిస్తే ప్రేమ పాఠాలు వల్లించి మరీ ఓ పిల్ల శిష్యురాలిని ఏకంగా పెళ్లి పీటల మీదకు ఎక్కించిన మన్మథుడు! అప్పట్లో అదో సంచనలం. చాలా ఘన సన్మానాలు కూడా జరిగినట్లు గుర్తు పాత చెప్పులు వగైరా గజమాలలతో! '
' చెప్పు పడ్డంత మాత్రాన గొప్పతనమేమన్నా తరిగిపోతుందా? ఆ మాటకొస్తే ఇప్పుడున్న గొప్ప నేతల్లో చెప్పు మీదపడని వారెవరున్నారో చెప్పు!
'సర్సరే' ఇప్పుడీ పాత పురాణాలన్నీ ఎందుగ్గానీ నువ్ చెప్పాలనుకొన్న కొత్త కహానీ ఎదో చప్పున చెప్పేయ్ రా నాయనా! '
' ఆ మాధుర్ చౌధురి అప్పట్లో ప్రేమ పార్టీ ఓటి పెట్టేసి హృదయం గుర్తుతో బరిలోకి దిగినట్లే వచ్చే ఎన్నికల్లో మేమూ మరో ప్రేమ పార్టీతో దడదడలాడించబోతున్నాం బాబాయ్! ఇప్ప ట్నుంచే దేశ మంతా టూర్లతో హోరెత్తించే ప్రయత్నాల్లో ఉన్నాం'
ఎన్నికల జాతర్లు కనుచూపు మేరలో ఉంటే ఇట్లాంటి గారడీలు ఇంకెన్ని చూడాల్నో ! ఇన్నాళ్ల బట్టి జనాల గోడు అసలు పట్టించు కోకుండా ఇవాళ పరగడుపునే పక్క దిగొచ్చేసి జడి వానలా ఇలా ప్రేమలు కురిపించేస్తానంటే తడిసి ముద్దయేందుకు జనాలేమన్నా చిన్నబడి కెళ్లే బుడతకాయల్రా? బడా బడా నేతలు, బడబడవాగే అధినేతలకే చుక్కలు చూపించే తెలివి తేటలు వాళ్లవి. '
'బాబోయ్! టీవీ చర్చా కార్యక్రమాల్లోలా ఆ భాషేంటి బాబాయ్! ఈ వయస్సులో కూడా నీకే వంట్లో ఇంత పులుసుంటే.. ఇహ ఈడు మీదున్నోళ్లం మా నోళ్లెలా మూసుక్కూర్చుంటాం? '
' నా సంగతులు ఇప్పుడెందుగ్గానీ, నీ ప్రేమ పార్టీ చేసే ఘనకార్యాలేంటో కొద్దిగా విప్పి చెప్పు బాబూ విని తరిస్తాం!'
' దేశాన్నిప్పుడు పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలేంటీ? '
' ఇంకేముంటాయ్! ఏడు దశాబ్దాల పై బట్టి రెండే ప్రారబ్దాలు. కూడూ నీడా!
'ఒక్క ఓటుతో ఆ రెండు ప్రారబ్దాలనీ పటాపంచలు చేయబోతోంది మా ప్రేమ పార్టీ. ప్రేమకు ఆకలి దప్పికలుండవు కదా! తిండి తిప్పలు ఇహ ఒహ సమస్యగానే ఉండబోదు . రూపాయిక్కిలో బియ్యంలాంటి గారడీలు ఇంకేమీ చెయ్యాల్సిన ఖర్మ పట్టదు. తాగునీరో.. రబీ సీజనో అంటూ నీటి వాటాల కోసం కొట్టుకు చచ్చే దౌర్భాగ్యాలిక ముందు మా పాలనలో రాబోవు. ప్రేమలో పడ్డవాళ్లంతా ఎదుటి వాళ్ల గుండెల్లో కాస్తంత చోటు దక్కితే అదే పది వేలను కుంటారు గదా బాబాయ్! ఇంకీ డబుల్ బెడ్రూంలు, ఆవాస యోజనాల్లాంటి ప్రయోజనాల్లేని పథకాల కోసం వీసమెత్తైనా ఆందోళనలు
చేయాల్సినా అవసరముండదు . ప్రేమికులకు మన మామూలు భాషతో పనే పడదు బాబాయ్! వాళ్లవన్నీ మూగ సైగలు! సింగర్ సైగల్ కాలం నాటి బొంగురు గొంతు పాటలతో భాషాసమస్యలన్నీ ఇట్టే సమసిపోతాయ్! ప్రేమ త్యాగాన్ని తప్ప మరేదీ కోరుకోదు కదా! కొడుకులకు, కూతుళ్లకు కూడబెట్టివ్వాలన్న తాపత్రయం తగ్గిపోక తప్పదు. కుంభకోణాల ఊసే జనం శాశ్వతంగా మర్చిపోవచ్చింక హాయిగా! వారసులే దేశాన్నేలి తీరాలన్న పెద్దల వరస వల్లనే కదా ఇప్పుడిన్ని రాజకీయాలూ రాద్దాంతాలూ! ఆ అరాచకాల జోలికింకే నేతకూ, అధినేతకూ వెళ్లబుద్ధికాదు. కుంభకోణాలు, కుమ్ములాటలు, వెన్నుపోట్లు. వెన్న రాయడాల్లాంటివన్నీ ఇహ గత పాలకుల ఖాతాల్లోనుంచి హఠాత్తుగా నిద్ర లేచొచ్చే పిశాచాలు కాబోవు . ప్రేమ పార్టీ విస్తరించే కొద్దీ' అది కావాలి. . ఇది కావాలి' అనే డిమాండ్లు వాటంతటవే అణిగిపోతాయి. పైపెచ్చు ' ఇదిచ్చేస్తాం.. అదిచ్చేస్తాం! పుచ్చుకోకుంటే చంపి పాతరేస్తాం' లాంటి త్యాగనినాదా లే
కర్ణభేరులదిరి పోయేటట్లు మిన్ను ముట్టేది. ఇప్పుడు జరిగే హక్కుల పోరాటాలన్నీ ఠక్కుమని ఒక్కసారే మూతబడితే.. ఆ శాంతి భద్రతల్ని చూసి నీ లాంటి సీనియర్ సీజనల్ పొలిటీషియన్సు పాపం.. తట్టుకుంటారో లేదో! వుయ్ పిటీ యూ బాబాయ్!'
'గురజాడగారి గిర్రాయి టైపు లెచ్చర్ల తంతుగా ఉందిరా నీ
వాగుడంతా! ఇన్నేసి న్యూసు పేపర్లు, న్యూసెన్సు టీవీ ఛానల్సు క్రమం తప్పకుండా చూసే నాకే గుండె బేజారయేట్లుందే నీ భావి భారత రాజకీయ ఊహా చిత్రం! ఇహ కామ్ గా పోయే మామూలు ఆమ్ ఆద్మీ మీ బోటి ప్రేమ మాయగాళ్ల ధాటికి ఎట్లా తట్టుకుంటాదో పాపం!మీ మాధుర్ చౌధురీ మాజీ ప్రేమ పార్టీయే పెద్ద గూడుపుఠాణీరా బాబూ! ఆ మాయల మరాఠీనా మీకు మూవింగ్ ఇన్స్పిరేషన్? మూవీ, టీవీ మార్కెట్ల కంటే కాదల్ ఓ కే . మా బాగా అమ్ముడయ్యే మంచి సరుకే! మూడు పూటలా మెక్కి మంచమెక్కి తెల్లారే దాకా తొంగునే వీలుంటే తప్ప బతుగ్గడవని బక్కోళ్లకు ఈ ప్రేమలూ దోమల పార్టీలేంట్రా పిచ్చిగాకపోతే! '
' ఏళ్ల బట్టీ బూర్జువా పార్టీల తత్వం వంటబట్టిన నీ బోటి ముసలి డొక్కులకి ప్రేమంటే ముందులో కాస్తంత డోకే వస్తుందిలే! వుయ్ డోంట్ కేర్! బోల్డుగా చెబుతున్నా. నిజానికి జనాలకి మా ప్రేమ పార్టీ వల్ల కలిగే ప్రయోజనాలు బోలెడు. ఓపిగ్గా వింటానంటే ఓపెన్ చేసి మరీ వినిపిస్తా మా 'ది బెస్ట్' మ్యానిఫెస్టో! '
ఓటేసే జనాలం. వద్దంటే మాత్రం వదిలేస్తారట్రా; ఊ .. బాదేయ్!'
'ఇప్పుడు నడిచేవన్నీ కులరాజకీయాలే కదా బాబాయ్! మత ప్రాతిపదికనేదే లేకుండా మంత్రాంగం నడవని రాజకీయాలు మనవి. ప్రేమ జీవులకసలు కుల మతాలతో ప్రమేయమే ఉండదు. జాతి పురోగతికి అందుకే మా ప్రేమ పార్టీనే చివరికి గతి. ఎవరెవరితోనో పొత్తులంటూ తొత్తులుగా మారే కన్నా మా ప్రేమ పార్టీతో చేతులు కలిపమనండి!
ఏడాదిలోగా అధికారం దోరమగ్గిన పండులా వళ్లోకొచ్చి వాలకుంటే అప్పుడడగండి. మా లక్ష్యాలు నెరవేరడానికి మేం ఎవరితోనైనా ఖత్తు కలిపేందుకు ఎవర్రెడీ '
' ఏంటి బాబూ అంతలా మీ లక్ష్యాలు?'
' ప్రేమ కోసం జీవితాలను ఫణం పెట్టిన అమర జీ వులు దేవదా.. పారు; ఏంటొనీ.. క్లియోపాట్రా! వారి భారీ విగ్రహాలని పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిష్టించాలి. పసివగ్గులక్కూడా ప్రేమకథలను గూర్చి ఉగ్గుపాలతో మరీ రంగరించి పోయాలి. సిగ్గు ఎగుల్లేకుండా ప్రేమించుకోవాలంటే ప్రాథమిక దశ నుంచే లైలా మజ్నూల్లాంట్టి లవ్ బర్డ్స్ చరిత్రలు పాఠ్యప్రణాళికల్లో చేర్చి తీరాలి. ప్రేమ కథా చిత్రాలను మాత్రమే నిర్మించే విధంగా సినిమాటోగ్రఫీ చట్టాలలో సవరణలు చేపట్టాలి. ప్రేమను కించపరిచే ఏ కళారూపాన్నైనా పర్మినెంటుగా బహిష్కరించే సెక్షన్లు ఐపిసి కోడుల్లో చేర్పించాలి. ప్రేమ విరోధులకు విధించే శిక్షలు తతిమ్మా ప్రణయద్వేషులకు వణుకు పుట్టించేటంత తీవ్రంగా ఉండి తీరాలి. ప్రేమ వివాహాలను ప్రభుత్వాలే స్వంత ఖర్చుతో భారీగా ప్రతి ప్రేమికుల దినం రోజూ జపించాలి.
ప్రేమపక్షుల విహారానికి అనుకూలమైన స్థలాలను ప్రభుత్వాలే సేకరించాలి. పార్కులుగా అభివృద్ధి పరచాలి. విఫల ప్రేమికులకు సరికొత్త ప్రేమికులు దొరికే వరకు ప్రభుత్వాలే 'వియోగ భత్యం' కింద మందూ మాకులకు నెల నెలా ఇంతని చెల్లించాలి. ప్లాపైన ప్రేమ చిత్ర నిర్మాతలకు ఉద్దీపన పథకాలు, రేంటింగు తగిన ప్రేమ సోపులకు భారీ సబ్సిడీలు బడ్జెట్లల్లో కేటాయించాలి. విఫల ప్రేమికులు పునఃప్రేమకు తాము చేసే సర్వ ప్రయత్నాలు పునః విఫలమై పూర్తి విరక్తితో ఆత్మాహుతి తలపడితే దూకి చచ్చేందు కు సరిపడా లోతైన కాలువలు తవ్వించాలి. తల పెట్టుకుని పడుకునేందుకు ప్రత్యేక రైలు పట్టాలు ఏర్పాటు చేసి, వేళకు రైళ్లు ఆ ట్రాకుల మీదుగా పోయే ఏర్పాట్లు చేసితీరాలి. ప్రేమికుల చేత పళ్లు రాలగొట్టించుకొనే ఔత్సాహిక ప్రేమికులకు 'ప్రేమశ్రీ' పథకం కింద ఉచిత చికిత్సలు, దంత వైద్యశాలలు తక్షణమే ఏర్పాటు చేయాల్సుంది. అన్నట్లు నూతన ప్రేమికులకు పరిమితి లేని ఉచిత సెల్ ఫోన్ కాల్స్ సౌకర్యం విధిగా ప్రభుత్వాలే కల్పిస్తే మరీ మంచిది'
'అసల్ది మరిచావురా భడవా ప్రేమ మైకంలో పడి . ప్రేమ గుడ్డిది . మీది కళ్లు లేని కబోదుల పార్టీ కదా! పిచ్చాసుపత్రుల్లో బెడ్డు కూడా మరిన్ని పెంచాలని డిమాండు పెట్టడం మర్చి పోయావ్!'
- కర్లపాలెం హనుమంతరావు
( ఆంధ్రప్రభ దినపత్రిక - సంపాదక పుట - కాలమ్ - సుత్తి మెత్తగా - 10 -02 -2018 న ప్రచురితం )
No comments:
Post a Comment