ఈనాడు - హాస్యం - వ్యంగ్యం
శరభ శరభ
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - గల్పిక - 02-03-2004 - ప్రచురితం )
దేవుళ్ళూ దేవుళ్ళూ అని ఊరికే లెంపలు వాయించుకుంటాంగానీ... ఒక్కోసారి వీళ్లూ మామూలు మనుషులకన్నా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు బాబాయ్!
పండుగపూట ఈ దైవదూషణ ఏంటిరా బాబూ, ఉన్న కష్టాలు చాలకనా- ఇంతకీ నీ ఫిర్యాదు ఏమిటి?
శివుడూ అల్లుడేగదా! యజ్ఞం చేసుకునే ఆ దక్షుడు అందర్నీ పిలిచి సొంతబిడ్డను పిలవకపోవడమేమిటి? పిలవని పేరంటానికి సతీదేవి పోవడమేంటి? ఆ తరవాత అందరికీ ముక్కుమీద కోపాలేమిటి? నిరాకారులూ నిరంజనులూ అని పొగిడించుకునేవాళ్లూ ఇలా పంతాలకు, పట్టింపులకూపోయి దాడులకు ఎదురుదాడు లకూ దిగితే ఇక వాళ్ళు మనకన్నా దేనిలో మిన్న? మామూలు వాళ్ళకు ఎవరు రక్షణ?
నిజమేరా నాయనా! ఈ మధ్యనే ఎక్కడో విన్నాను. కర్నూలు జిల్లా నెరుకుప్పలనే ఊళ్ళో కాళమ్మ అనే దేవత వెలసిందట. ఆమె వీరభ ద్రస్వామిని ప్రేమించి పెళ్ళిచేసుకోమని వెంటబడితే, ఆ మహానుభావుడు ఏ కళనున్నాడో- కుదరదు పొమ్మన్నాడట! ఈవిడగారు ఉక్రోషంతో పిడకలు విసిరిందట. దాన్ని వేడుకగా అక్కడ ప్రతి ఏడాదీ భక్తులు జరుపుకొంటున్నారు?
అంటే బురద జల్లుకోవడమూ ఇవాళ కొత్తగా మనం కనిపెట్టిన విద్య కాదని తేలి నట్లేగా!
ఏవీ ఎప్పుడూ కొత్తగా పుట్టుకురావురా నాయనా! అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయి.... అని ఊరికే అన్నారా! శివరాత్రి పేరు చెప్పుకొని మనం ఇప్పుడు చేసుకునే ఉపవాసాలూ, జాగారణలు మాత్రం మనకు కొత్తవా!
అవును బాబాయ్! కిలో యాభై పెట్టినా కందిపప్పు మంచిరకం దొరకడంలేదు. బియ్యం ఓ మాదిరివి కొనా లన్నా పాతిక కక్కక తప్పడంలేదు. పేరుకేదో కంచం ముందు కూర్చుని లేస్తున్నాంగానీ, రోజూ చాలామంది చేస్తున్నది ఉపవాసాలే.
జాగారం సంగతి చెప్పు. కరెంటు కోతలతో కంటిమీద కునుకు ఉండటంలేదు. నగరం నడిబొడ్డున జరిగే దొంగ తనాల గురించి వింటుంటే ఇక కళ్ళేం మూతపడతాయి! అదిసరే, ఎప్పుడూ లేనిది నువ్వు ఈసారి ఉపవాసాలు, జాగారాల బాట పట్టావేంటి?
మన ప్రణబ్ దాదా ఏమన్నా బోళాశంకరుడి బాపతా! ఇన్ని నీళ్ళు చిలకరించి, చిటికెడు బూడిద పూస్తే ఉబ్బి పోయి కల్పవృక్షాన్ని మన పెరట్లో పాతేసి, కామధేనువును దానికి కట్టేసి పోవడానికి!
మరి, ఆ నల్లధనం కూడేసిన దొంగదొరల మీద మూడోకన్ను తెరిచి బూడిద చేయమని కోరుకొంటున్నావా ఏంటీ? ... అవన్నీ మీడియా వాళ్ళు సంచలనాలకోసం పడే తంటాలు . ఏ గొడవలూ లేకుండా కనీసం ఏ నెల జీతం ఆ నెల అయిదో తారీకులోపలో వస్తే చాలు. సిద్ధి, బుద్ధి శివుడి కోడళ్లట గదా! వాళ్ళిద్దర్నీ పంపి మన పెద్దమనుషుల బుర్రల్ని శుద్ధి చేయించమని వేడుకోవాలని అనుకుంటున్నా.
స్వామి సర్వాంతర్యామి. అయినా ఆ టూజీ అయ స్కాంత తరంగాల కుంభకోణాలను ఆపగలిగాడా? ఎంత పంచభూతాల్లోకి చొచ్చుకు వెళ్ళే చొరవ ఉన్నా- మన పెద్ద మనుషుల మనసుల్లోకి జొరబడే శక్తి లేదనుకుంటా!
నిజమే బాబాయ్ ! పెద్దకొడుకు వాహనం, తన మెడ లోని ఆభరణం, సొంత వాహనం, భార్య ఎక్కి తిరిగే పెద్దపులి, రెండోవాడి నెమలి... వేటికీ ఒకటంటే మరోదా నికి ఏమాత్రం పొసగదు . అయినా అందర్నీ కలిపి ఉంచి, అంత హాయిగా సంసారం చేసే మహానుభావుడు- ఆ మంత్రమేదో మనవాళ్ళ చెవుల్లో కూడా ఊడిపోవచ్చుగా... అందరం సుఖపడిపోతాం గదా!'
'చెవుల్లో ఊదడానికి ఆయనేమన్నా మనం పెట్టుకున్న సలహాదారుడా! మనమే అన్నీ చూసి నేర్చు కోవాలిగానీ, జగదీశ్వరి ప్రేమించి పెళ్ళిచేసు కోమని అడిగితే ' నా ఇల్లు శ్మశానం. వృత్తి భిక్షాటన, కట్టుకోవడానికి పట్టుపీతాంబరాలు గట్రా లేవు' అంటూ నిజం చెప్పుకొన్న తిక్కశంకరయ్య ఆయన. ఆ నిజాయతీలో ఒక్క శాతమైనా మన నాయకులకు ఉండిఉంటే- ఎన్నికల ముందూ తరవాతా ఇన్నిన్ని హామీలు, నివేదికలు, ప్రాజెక్టులు, ప్రణాళికలంటూ జనాలను అయోమయంలో పడేసేవారా?
అవును బాబాయ్! తమ్మిపూలూ, ఆకులురాలే శిశిర రుతువూ, చలీ, మంచూ కలిసిన తెల్లారుఝాము, చిమ్మచీ కటి నిండిన కృష్ణ చతుర్దశి తిథి, భస్మం, రుద్రాక్షలు, పుర్రె, ఏనుగుతోలు లాంటి వస్తువులను తాను ఉంచుకుని... మల్లెలు, వసంత రుతువు, నిండుపున్నమి. మంచి గంధం, నవరత్నాలు, చీనిచీనాంబరాలు వంటి మంచి వస్తువులను అన్నింటినీ మనకు వదిలేసిన తండ్రి ఆయన. మరి మనం ఎన్నుకున్న నేతలో? అందుకు పూర్తిగా విరుద్ధం. ఇన్ని చేసినా ఏ ఆర్భాటాన్ని కోరుకోని మహానుభావుడు ఇన్ని నీళ్లతో అభి షేకం చేస్తేచాలు- పొంగిపోయి అష్టశ్వర్యాలను ప్రసాదిస్తాడంటారు. ఏమిచేయకపోయినా నోట్లకట్టలతో దండలు వేయించుకునేందుకు, దారికి అడ్డంగా విగ్రహాలు పెట్టించుకునేందుకు తయారవుతున్నారు మన నేతలు!
అవును, అమ్మ వాక్కు అయితే ఆయన అర్ధం అంటారు. మరి అర్థంపర్థంలేని పిచ్చి మాటలతో నేతలు మన చెవులకు తూట్లు పొడిచేస్తున్నారు. మనమీద కనికరం ఉంటే ముందు వాళ్ళకు వాకుృద్ధి కలిగించకూడదా!
అర్ధాంగికి శరీరంలో సగభాగం ఇచ్చి గౌరవించిన గౌరీ పతి ఆయన. చట్టసభలో సాటి స్త్రీలకు మూడోవంతు ఇవ్వడానికి మీనమేషాలు లెక్క పెట్టే ఈ నాయకులకు సద్బుద్ది కలిగించాలి.
బద్ధకస్తులను, పశువులను, మచ్చపడినవాళ్ళను రెండు నాలుకలవాళ్ళను. ఆ మహానుభావుడు మంచి దృష్టితో చేరదీస్తే, మన మహానాయకులు సొంత లాభంకోసం చేరదీస్తున్నారు. అదే మన దౌర్భాగ్యం.
చీమల్లాంటివాళ్లం. మనం చేయగలిగింది ఏముంది?
కుట్టడానికి ఆజ్ఞ ఇవ్వమని వేడుకొందాం. అవకాశం వచ్చినప్పుడు కుట్టిపారేద్దాం!
కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - గల్పిక - 02-03-2004 - ప్రచురితం )
No comments:
Post a Comment