ఈనాడు - హాస్యం - గల్పిక - వ్యంగ్యం
అప్పుల మోత
- రచన: కర్లపాలెం హనుమంతరావు
అప్పుల మోత
- రచన: కర్లపాలెం హనుమంతరావు
'సెల్ చేతిలో ఉందని సంబరపడ్డానేగానీ, సెల్లో పడ్డానని తెలు సుకోలేకపోయాను బాబాయ్! ఎక్కడి సింగపూరు... ఎక్కడి బెంగుళూరు? సింగరాయకొండ చవుడు భూములు చవగ్గా ఇప్పిస్తాం .. కొంటావా... చస్తావా!' అంటూ అర్ధరాత్రీ , అపరాత్రీ అని చూడకుండా గంటకోసారి ఠంగ్ ఠంగ్ మంటూ బెది రింపులు!'
'ఎవర్రా?' ఆ టెలీ విక్రమార్కులేనా? మన ప్రధాని మన్మోహన్ సింగు గారికే తప్పటంలేదీ చెవినొప్పులు. సామాన్యులం మనమెంత? నా అనుభవం కూడా అలాంటిదేరా బాబూ! సెల్ కొన్న మర్నాటి నుంచీ రోజుకో సిటీనుంచి ఏజెంట్ల తలనొప్పి. ఎలాగైనా ఏదైనా ఓ పిచ్చి పాలసీ అంటగ ట్టేదాకా ఆగదనుకుంటా ఆగం.... '
' అయినా లాభంలేదు బాబాయ్! ఓ పదిసార్లు కాల్సు చేసేసి ఓ పాలసీ మన పేర్న తీసేసి మన కార్డు డబ్బులు దానికి దోచి పెట్టేసి ఆనక వడ్డీతో సహా అసలు వసూలు చేసుకుర మ్మని రికవరీ ఏజెంట్ల ముసుగు లేసేసి యమకింకరులను మన మీదకు తోలిపారేసి తమాషా చూస్తుంటారీ టెలీ మార్కెటింగ్ వీరులు. మనం ఫోన్లు పెట్టించుకు న్నది ఈ కాలాంతకుల చేత బాధించుకునేందుకే లాగుంది బాబాయ్! ప్రాణాలు తోడేస్తున్నారనుకో! '
' ప్రణబ్ ముఖర్జీ ప్రాణాలంటేనే వాళ్లకు లెక్క లేదు. ముఖర్జీ అయినా ముఖేశ్ అంబానీ అయినా ఆ ఫోన్ రాకాసులకు.... కేవలం- ఓ ఫోన్ నెంబర్ కిందే లెక్క. కిషన్ రెడ్డి అయినా కృష్ణపరమాత్మ అయినా వాళ్లు కాల్ అంటూ చేసి నాక చచ్చినట్లు పలకాల్సిందే స్వామీ! వారెన్ ఆండర్సన్ నెంబరు మన హోం శాఖ దగ్గర ఉండకపోవచ్చుగానీ, కాల్ సెంటర్ వాళ్ళ దగ్గర ఆయన జాతకమంతా నమోదై ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఫోన్ డైరక్టరీలన్నీ రోజుకోసా రన్నా తిరగేయనిదే సిబ్బంది ఇళ్ళకు వెళ్ళరాదని వాళ్ల రూలురా నాన్నా!'
' అడిగినా ఎంగిలి చేయికూడా విదిలించని వాళ్లే అధికంగా ఉన్న ఈ కాలంలో, అడక్కపో యినా అప్పులు, ఇళ్ళు, బళ్లు ఊరికే ఇప్పించి పారేస్తామని ఎందుకలా అందరి వెంటపడుతుంటారో దేవుడికే తెలియాలి. ఆయనే ఈ తుంటరులను అదుపు చేయాలి...'
'సర్లే! ఆ దేవుడూ అదుపు చేయలేని ఆకతాయిలురా వీళ్ళు!
స్వర్గలోకం ప్యాకేజీ తమ దగ్గర తీసుకుంటే, 'తులసితీర్థం'' ఉచితమంటూ చివరిశ్వాస తీసుకునేదాకా పోయే రోగినీ విడవకుండా వేధించే ఈ కాల్ మార్కండేయులను అదుపుచేసే 'అజెండా' మన టెలీ రాజావారి దగ్గర మాత్రం ఏముందా అనేదే నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. రోజురో అయిదుసార్లు వాళ్ళలా పలకరిస్తే ఆర్థిక శాఖ మంఅకే హార్టెటాక్ వచ్చే పరిస్థితి! '
'తనదాకా వస్తేగానీ తత్వం తల కెక్కదని తాతలు ఊరికే అన్నారా? ఆ పెద్దాయనకు ఎవరు కాల్ చేశారోకానీ, వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిమీద జల్లుకోవాలి. ఇదే చిట్కా మన ప్రధానిమీదా ఎవరన్నా ప్రయోగిస్తే ఎంత బాగుంటుంది? పరగడుపునే నిద్ర లేపి చేతికో సంచీ ఇచ్చి బజారుకలా వెళ్ళి నాలుగు రకాల కూరగాయలు తెమ్మని వాళ్ల చేతనైనా చెప్పిస్తే ధర వరలు ఈ ధరాతలాన్ని వదిలి ఎంతెత్తుకు వెళ్లాయో తెలిసొస్తుంది ! '
'నిజమే బాబాయ్! పోలీసోళ్ళకి, పొలిటీషియన్లకి, టీవీ సీరియళ్లకి భయపడనివాళ్లక్కూడా బెదరని ధీర్ణు ఈ టెలీ మార్కెటింగ్ మాయగాళ్ళ ఫోన్ రింగు వినపడితే చాలు ఎందుకంతలా బెంబేలెత్తుతుందో ఇప్పుడిపపుడే బుర్ర కెక్కుతొంది! మన ప్రజాప్రతినిధుల్ని కలుసుకోవాలంటే మనమే వంతులవారీగా నిమిషానికి ఓ సారి వాళ్ళకలా రివర్సు కాల్సు చేస్తూనే ఉండే ఉద్యమం చేపడితే ఎలాగుంటుందంటావ్? '
' అవునవును ! ఈ పరిస్థితులు బాగుపడే దాకా; సెల్ఫోన్ ఎలాగూ కొన్నాను గనుక దీన్ని గంగలో పారేసే లోపల ఒక్కసారి మన రాష్ట్ర ప్రతిపక్షనేత తరపున చవాన్ గారికీ హాల్ నైట్ కాల్సు చేస్తూనే ఉంటా !
ఏమని బాబాయ్? బాబ్లీగేట్లు కూల్చేస్తావా ! లేదంటే- నీ సెల్ నెంబరు అయిదారు టెలీమార్కెటింగ్ కంపెనీలకు లీకు చేయమంటావా' అని...'
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సంపాదకీయ పుట - ప్రచురితం )
No comments:
Post a Comment