Saturday, December 4, 2021

ఈనాడు - గల్పిక- వ్యంగ్యం - హాస్యం పెట్టని గోడ రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - గల్పిక- సం.పు- 08 -07 - 2002 న ప్రచురితం )

 






ఈనాడు - గల్పిక- వ్యంగ్యం - హాస్యం 

పెట్టని గోడ 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - గల్పిక- సం.పు- 08 -07 - 2002  న ప్రచురితం ) 


భారత దేశమునకు ఉత్తరమున హిమాలయ పర్వతములు పెట్టని గోడవలె ఉన్నవి- అని చదువుతూ చదువుతూ హఠాత్తుగా పెట్ట నిగోడ అంటే ఏంటి మమ్మీ అనడిగాడు మా చిన్నాడు.


పక్కనే కూర్చుని వాడి హోమ్ వర్క్ చేస్తున్న వాళ్ళమ్మ' ఎవరూ కట్టకుండానే  ఉన్న గోడ అన్న మాట - అంది. 


ఎవరూ కట్టకపోతే గోడెలా వస్తుందనలు. నిలదీశాడు  మళ్ళీ.  


వెదవ ప్రశ్నలు మానేసి  ముందు పాఠం చదువు - అని విసుక్కుంది వాళ్ల అమ్మ . 


పిల్లల ప్రశ్నలకి విసుక్కోకుండా సమాధానం  వాళ్ళ కర్ధమయ్యే విధంగా  చెప్పటం పెద్దల విధి. 


అబ్బో!  నీతులకు తక్కువలేదు. ఒక్క పూట వాడిపక్కన కూర్చుని పాఠం చెప్పండి .. తెలుస్తుంది' అంది శ్రీమతి ఉక్రోషంగా. 


పోనీ..  మీరు చెప్పండంకుల్!  పెట్టని గోడ అంటే  ఏమిటో-  అన్నాడు అప్పుడే వచ్చిన పక్కింటి  పరమేశంగారబ్బాయి. వాడు మా పెద్దాడి క్లాస్ మేట్ .  చనుపుకొద్దీ మా ఇంటికి వస్తుంటాడు. 


కాంట్రాక్టర్లు సిండికేట్లు, కంకరా సిమెంటూ గట్రాల గోల లేకుండా ఎత్తుగా తయారయిన ఒక కట్టడమనుకో- అన్నాను. 


  భలే చెప్పారంకుల్.... ఇంకా చెప్పండి- అని చప్పట్లు కొట్టాడు ఎంకరేజింగ్ గా . 


ఈ పిట్టలదొర కబుర్లే  నచ్చాయా  నీకు...? అంది శ్రీమతి ఈ పిల్లాడితో . 


ఎలాగూ పిట్టల దొర అని బిరుదిచ్చావు కాబట్టి ఈ పెట్టని గోడ మీద ఒక పిట్ట కథ కూడా చెబుతాను .. వినండి- అన్నాన్నేను.


నేను ఒక పల్లెటూర్లో బ్యాంకులో పనిచేస్తున్నప్పటి సంగతి.  వెంకయ్య అని ఒక పల్లెటూరు పెద్దాయన మా మేనేజరు దగ్గరికొచ్చి గోడకట్టుకోవటానికి ఒక పదివేల రూపాయలు లోను కావాల్సార్- అని అడిగాడు.  


మా మేనేజర్ రూల్స్  మనిషి . ముక్కుసూటిగా 'గోడలు కట్టుకోవటానికయితే లోన్ దొరకదు... ' అనేశాడు. 


ఒకవంక మేధావులంతా  మనిషికి మనిషికి మధ్య వున్న గోడలు కూల్చేయ్యం డయ్యా అని గోల పెడుతుంటే ఈ వెంకయ్యేందయ్యా గోడలు కడతానంటాడు: - అన్నాడు నాతో . 


వెంకయ్య బుర్ర బరబరా గోక్కుంటూ'మడిసికి మడిసికీ మధ్యకాదయ్యా నా చేనికీ , పుల్లయ్య చేనికీ  మధ్య గుట్ట కట్టుకుంటానన్నాడు.


గుట్ట అనూ పుట్ట అనూ  నీవే పేరైనా పెట్టుకో! అది గోడే కదా.... రూల్సొప్పుకోవు- అన్నాడు మేనేజరు మళ్లీ . 


వెంకయ్య వెర్రిమొగవేసుకుని బైటికొస్తుంటే నేనే వెనక్కి  పిలిచి విషయమేమిటని అడిగా.  


వెంకయ్య పొలం మెరకమీదుంది . పుల్లయ్య పొలం పల్లంలో వుంది. వర్షం కురిస్తే నీళ్లు తన పొలం నుండి పులయ్య పొలంలోకి వెళ్ళ కుండా మధ్య గట్టుమీద కాస్త ఎత్తుగా ఏర్పాటు చేసుకుందామనుకున్నాడు ఈ పిచ్చి మానవుడు.  


మా చాదస్తం మొగుడికి రూల్సు  తప్ప ఇంకేమీ పట్టవు. వెంకయ్య చెవిలో నేనొక మంత్రం ఊదాను. 


మర్నాడు పొద్దున మళ్ళీ వెళ్ళి అదే మేనేజరు దగ్గర - పదివేలు

కాదు .. పాతిక వేలు లోను సంపాదించుకున్నాడు వెంకయ్య . 


మీరేం మంత్రం ఊదారంకుల్ వెంకయ్య చెవిలో ? - పరమేశంగారబ్బాయి ప్రశ్న . 


పొలం మెరకలో వుంది. చదునుచేయాలి. కాలువ పూడిపోయింది. పూడిక తీయాలి- అని చెప్పించా.  ఠప్పుమని పాతికవేలు లోను శాంక్ష నయింది.


గోడ కట్టుకోడానికి, కాలువ పూడిక తీయటానికి ఏమిటి సంబంధం? 


ఉంది. చదునుచేసిన మట్టి పూడికతీసిన ఇసుక గట్టుమీద ఎత్తుగా పోస్తే అదే గోడ.. పెట్టని గోడ . 


భళ్లుమని  నవ్వాడు పరమేశం కొడుకు


ఇంకా ఏమన్నా ఇలాంటివే చెప్పండంన్నాడుత్సాహంగా. 


ఈ పిల్లాడి జ్ఞానతృష్ణ ఇగిరిపోకముందే ఎప్పటినుంచో నా మనసులో ఉన్న రెండు  ముక్కలు చెబుదామనుకున్నాను.


పెట్టనిగోడ అనేమాట  మన వాళ్ళకి చాలా ప్రెటీ  వర్డ్  .  హిమాలయ పర్వతాలే కాదు. ఇలాంటి పెట్టని గోడలు  చాలానే ఉన్నాయి మన సంస్కృతిలో.  కులం పేరుతో, మతం పేరుతో మనిషి మనిషికి మధ్య పెరిగిన  ఈ పెట్టని గోడలు  హిమాలయాలంత అనాదివి. ఇది చాలదన్నట్లు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ, ఈ నేల ప్రభావమేమో. . ఈ గాలి తీరే అంతో.. తమ పరిపాలనా  సౌలభ్యం కోసం మరిన్ని పెట్టని గోడలు సృష్టించిపోయారు. 


ఇంగ్లీషువాడు పోతూ పోతూ ఇండియాను రెండుగా చీల్చి ఇద్దరి 

మధ్య నా విద్వేషమనే పెట్టనిగోడను శాశ్వతంగా సృష్టించిపోయాడు. ఇవిగాక వర్గం .. లింగం .. పేరుతో మరిన్ని పెట్టనిగోడలు! మా చా దస్తపు మేనేజరు చెప్పింది ఈ  గోడల సంగతే. 


గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కన్నా మన పెట్టని గోడల్నే ప్రపంచవింతల్లో ఒకటిగా పెట్టి  ఉండాల్సింది- అన్నాడు పరమేశం కొడుకు. 


ఈ గోడలన్నింటినీ కూల్చేయటం పెద్ద కాంట్రాక్టే .  మీలాంటి వాళ్ళు పదవిలోకొస్తే టెండర్లు పిలిచినప్పుడు కాంట్రాక్ట్ నాకిప్పించండకుల్ .  ఉత్తరాన పెట్టనిగోడ ఉందన్న  భరోసాతో మన నాయకులు గాఢనిద్రలో ఉన్నారు. ముష్కరులెవరైనా  ఆ కలుగుల్లోంచి దూరొస్తే  డేంజర్ . ఆ ప్రమాదం రాకుండా   పనిలోపనిగా అంతా ప్లాస్టరింగ్ కూడా చేయిస్తా.. కంట్రీ సేఫ్ -  అంటూ హుషారుగా వెళ్ళిపోయాడా అబ్బాయి .


పిట్టలదొర కబుర్లయిపోయాయా! - అంటూ  లోపలికొచ్చింది శ్రీమతి.  . అప్పటిదాకా పెరట్లో పిట్టగోడ దగ్గరిచేరి పొరుగుమ్మతో కబురు చెబుతున్నామె కాస్తా  . 


పెట్టనిగోడ అంటే ఏంటి?  అని అడిగిన మా బడుద్ధాయి మాత్రం పిట్టగోడ మీదెక్కి  పక్కింటివాళ్ల జామపిందెల్ని తెంపటంలో మునిగివున్నాడు.


ఆ పరమేశం కొడుకును చూసి బుద్ధి తెచ్చుకోండిరా!  ఎంత జ్ఞానతృష్ణా!  అన్నాను మెచ్చుకుంటూ . 


గోంగూర కదూ  ! వాడీ రోజు స్కూల్లో పిట్టల దొర వేషం వేస్తున్నాడు . ఐడియాల కోసం నన్ను వేపుకు తింటుంటే  నేనే వాడిని ఇక్కడకు పిలిపించా! - అన్నాడు మా పెద్ద ప్రబుద్ధుడు! 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- సం.పు- 08 -07 - 2002  న ప్రచురితం ) 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...