Saturday, December 4, 2021

ఈనాడు - సంపాదకీయం నవరసాల వాకిళ్లు - కళ్లు - కర్లపాలెం హనుమంతరావు

 ఈనాడు - సంపాదకీయం 

నవరసాల వాకిళ్లు - కళ్లు 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - తేదీ నా నోట్స్ లో నమోదు కాలేదు ) 


ఆది దేవుడు మూడు కన్నులవాడు. మూడు కన్నులకు మూడు మూలార్థాలు. ఓ కంట వైభోగం, ఓ కంట వైరాగ్యం, రెండింటికి నడుమ పైనున్న నెన్నుదుటినంటిన కంట- కైవల్యం.  త్రినేత్రుడి త్రికోణ దృక్కిరణ  సంపుటే  సంసార సారం  అంటారు వేదాంతులు. వాల్మీకి రాముణ్ని 'రాజీవలోచనుడు'గా ఊహిస్తే, పోతన కృష్ణుణ్ని పద్మ నయనంబులవాడు'గా ఊరించాడు. 'కమలేశు జూడని కన్నులు కన్నులే తను కుడ్య జాల రంద్రములు(శరీరమనే గోడకున్న కన్నాలు) గాక'  - అన్నంతదాకా పోయింది పోతున హరి భక్తి పారవశ్యం . ' కన్నీళ్ల రుచి తెలియకుండా కావ్యాలు రాయలేరెవరూ' అంటారు 'రుద్రాక్షలు' అనే కావ్యంలో తిరుమలవారు. నిజం. కంటికి ఇంత సూదంటుతనము ఉండబట్టేనేమో- మనుజేశ్వరాధములకు తనను అమ్మవద్దని చదువులమ్మ గుమ్మంమీద చేరి కుమిలిపోయిన వేళా  పోతన చూపు తల్లి ' కాటుక కంటి ' వెంటే అలా పరుగులు తీసింది. 'జంట నేత్రము లంటి చూచితే జాజిపూవులు పూచెరా/ కంటిలో నొక పండువెన్నెల కాయుచున్నది యేమిరా!' అంటూ కందుకూరి రుద్రయ ప్రసిద్ధ జనార్దనాష్టకం నిండా దనుజ మర్దనుడి నయన తారా విలాసాలు ఎన్నని! లౌకికులకు నేత్రద్వయం కార్యక్షేత్ర సింహద్వారమైతే... భావుకులకు అవే కళ్లు నవరసాలకు వాకిళ్లు.  జంటకవులు పింగళి-  కాటూరి మేలిమి పంట ' సౌందరనందం'లో సుందరీనందుల సరాగస్థాయిని వర్ణించే ఓ సందర్భం ఉంది. ఎర్రనెరల(ఎర్రజీరల) నందుని చూపు లింతియా/ నేందునకు గెంపుల నివాళులెత్త, సతివ/ కజ్జలపు (కాటుక) చూడ్కి ప్రియుని వక్షః కవాటి/ గట్టు దోరణములు' -  నల్ల కల్వపూల ప్రేమ ప్రారంభానికి కంటిచూపులే గదా నాంది? 'ఏటిలోని అలలు వంటి కంటిలోని కలలు కదిపి/ ఉప్పొంగిన ఉల్లములో' భావుకత్వం  సృష్టించే తెప్పల థిల్లానాలను ఇలా చెప్పుకొంటూ పోతుంటే అదే ఓ బృహత్ దృష్టి కావ్యమైపోతుంది.


కంటిచూపులన్నీ ఒకేంకంగా ఉండవు.  సమం, అలోకితం, సాచి, ప్రలోకితం, నిమీలితం, ఉల్లోకితం, అనువృత్తం, అవలోకితం- అనే అష్ట విధానాలే కాదు నాట్యశాస్త్ర నిర్వచనాలకు అందని చూపులు ఇంకెన్నో ! వసురాజు చిలిపి చూపులకు సిగ్గు సముద్రంలో మునిగి మోహావేశాన్నాపుకొన లేక  తన మనోహరుడి వైపు  వసుచరిత్ర గిరికాదేవి చూసిన ' లజ్జా మదనా మధ్యావస్థ' చూపు ఒకరకం. దర్బ ముల్లు  కాలికి గుచ్చుకున్నదన్న  మిషతో నిలిచి ధీరోదాత్తుడు దుష్యంతుడి ఉక్కుగుండె సైతం తుక్కు తుక్కయేలా కాళిదాసు- శకుంతల చూసిన ఓరచూపులు ఇంకోరకం. లతా విటపానికి(కొమ్మకు) ఏకావళి(ఒంటి పేట హారం) తగులుకొందన్న వంకతో ఊర్వశి పురూరవుడి ఎదమీదకూ అదేరకం మదనాస్త్రాన్ని దిగ్విజయంగా ప్రయోగించింది. జగన్నాథుడే అల్లుడయాడని ఉల్లాసపడే తల్లిదండ్రులకు పుత్రశోకం మిగల్చవద్దని యదువల్లభుడిని రుక్మిణి 'జడిగొన్న బాష్పములతో చూసిన ప్పటి చూపు'  మరో రకం. కార్యసాధన కోసం స్త్రీలు కంటినే పదునైన కొరముట్టుగా వాడుకుంటుంటారని ఓ అపవాదు. చడీ చప్పుడు లేకుండా లక్ష్యాన్ని సూటిగా ఛేదించాలంటే  కళ్లు రువ్వే నవ్వు పువ్వు లను మించిన మంచి సాధనం మరొకటి లేదు. కాంత కన్ను కల్లు పోస్తుందని నానుడి కనకనే ఆమె 'మదిరాక్షి' అయిందని ఓ రసికుడి చమత్కారం.  మాటలు చాలని చోట మహామహా కవులే కంటిచూపులతో సరిపెట్టుకున్న సందర్భాలు అన్ని భాషా సాహిత్యాలలో బో లెడన్ని.  సైరంధ్రిని  కూర్చమని వేధించే సోదరుడిని వారించలేక ఒక వైపు, నీతి బాహ్యమైన పనికి సాటి స్త్రీని బలిపెట్టలేక మరోవైపు విరాటరాణి సుధేష్ణ పడే మనోవేదనను వర్ణించడానికి కవిబ్రహ్మ తిక్క నకే మాటలు చాలలేదు. 'అశ్రుపూరము కనుగొనలో మ్రింగికొనుచు ' అంటూ కంటి వర్జనతో సర్దుకునిపోవలసి వచ్చింది. వ్యాసుడైనా, కాళిదాసుడైనా కంటిభాషను మించిన వ్యాఖ్యానం చేయలేరు.


వెంటబడి వేధించే తుంటరి ఓ పిచ్చి కూత కూస్తే... పెదాలతో ఏం పలకాలో తెలీక బేల ఛీత్కారంగా  చూసే చూపు- కొంగను మాడ్చే సిన కౌశికుని చూపుకున్నా వేడి! నవ మాసాలూ మోసి కన్న పసివగ్గు వంక ప్రసవ ప్రయాసనుంచి తేరుకున్న తల్లి చూసే తొలిచూపు అనుభూతి ఏ భవభూతీ యధానువాదం చేయలేనిది. నయనం సర్వేంద్రియాలకే కాదు ప్రధానం. . సర్వోదాత్తమైన అనిర్వచనీయ భావోద్వేగాలకూ అదే ప్రధాన ద్వారం. నేత్రావధానంతోనే సర్వకార్యాలూ చక్కబెట్టే ఆడవారూ, అధికారులే అందుకు సాక్ష్యం . చూపు లేకుండానే 'ద్వారం' వారు ఎంతో మధురంగా 'వయోలిన్' వాయించే వారు . ఆ జ్ఞానేంద్రియమూ ఉండుంటే ఇంకెంత ఇంద్రజాలం చేస్తుండేవారో గదా!  దృష్టికి దూరమైన మరో దురదృష్టవంతురాలు అమెరికన్ రచయిత్రి హెలెన్ కెల్లెర్. వికలాంగుల హక్కులకోసం కలం పట్టిన యోధ మూర్తి ఆమె . రెండో ప్రపంచయుద్ధంలో పెద్దపాత్ర పోషించిన అమెరికా ముప్ఫైరెండో అధ్యక్షుడు రూజ్వెల్ట్, కంటి వెలుగు పోవడ మంటే స్వర్గాన్ని పోగొట్టుకోవడమే' అన్న జాన్ మిల్టన్, అంతుబట్టని అంతరిక్ష రహస్యాలను కనుగొన్న గెలీలియో, విశ్వసాహిత్య పురస్కా రాల సుప్రసిద్ధుడు పులిట్జర్- కాంతి దర్శనానికి జీవితంలో ఏదో ఒక దశ నుంచీ దూరమైన ఈ తరహా క్రాంత దర్శకుల జాబితా చిన్నదేమీ కాదు. విద్యుత్ సరఫరాకు అంతరాయమేర్పడి కొవ్వొత్తి వెలిగే ఐదారు నిమి షాలలోనే సర్వం కోల్పోయినంతగా వ్యధ చెందుతాం మనం. ' వెలుగు దీపం దొరకడం మాకో జీవితకాలం మాత్రమేగా ఆలస్యం!' అంటారు కొందరు అంధ  ధీరోదాత్తులు. అది వారి దర్పానికి దర్పణం. కంటి రెటీనా కిందిభాగంలోనూ మూలకణాలున్నాయని, వీటిని అభివృద్ధి చేయడంద్వారా నిర్జీవమైన కటకాన్ని పునరుజ్జీవింప చేయవచ్చని పరిశోధకులు ఇప్పుడు భావిస్తున్నారు. 'న్యూయార్క్ న్యూరల్ స్టెమ్ సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీజెనరేటివ్' పరిశోధన సంస్థ నిపుణులు సాగిస్తున్న కృషి ఫలించి దృష్టిదోషమన్న మాట సృష్టిలోనే లేకుండా పోవాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - తేదీ నా నోట్స్ లో  నమోదు కాలేదు ) 

ఈనాడు- సంపాదకీయం రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - 06 -09-2012 న ప్రచురితం ) నీరే ప్రాణాధారం

 ఈనాడు- సంపాదకీయం

రచనకర్లపాలెం హనుమంతరావు

ఈనాడు - 06 -09-2012  ప్రచురితం ) 

 

నీరే ప్రాణాధారం 




ఈనాడు- సంపాదకీయం 

రచన: కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - 06 -09-2012 న ప్రచురితం ) 


నీరే ప్రాణాధారం


కొంతమేర తామరలు, కొంతమేర నల్లకలువలు, కొంతదూరం రెండూ కలిసి, కొన్నిచోట్ల వాటి పుప్పొడులు కలగలిసి.... అద్దంలా నిర్మలంగా ఉన్న గంగ సౌందర్యాన్ని రామాయణంలో వర్ణించే వేళ వాల్మీకి మహర్షి వెర్రెత్తిపోయాడు. ఏమీ తెలియని పసితనంనుంచి అన్నీ తెలుసుకుని అనుభవించిన ముదిమితనం దాకా నీరు అంటే ప్రాణం పెట్టని మనిషి లోకంలో ఉండడు. సర్వ జీవరాశులకు గాలి తరువాత నీరే ప్రధాన ప్రాణావసరం. ఆ తరవాతే ఆహారం. భూగోళంమీద మూడువంతులు నీరే. మనిషి శరీరంలో మూడింట రెండువంతులూ నీరే. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలమ్ నాందీ శ్లోకంలోనే 'యా సృష్టిః స్రష్టు రాద్యా' అన్నాడు. బమ్మెరపోతన మహాభాగవతం రెండో స్కంధం ప్రకారం నీరు అగ్నిజ. భూమి పుట్టింది నీటినుంచే. తల్లి లేనిదే బిడ్డ లేదు. నీరు లేనిదే భూమి లేదు. భూమి పై  జీవరాశులూ లేవు. జీవాన్నిచ్చేది కనుకనే నీరును 'అమృతం' అన్నారు. తిరువళ్ళువర్ తిరుక్కరళ్ కావ్యాన్ని దైవస్తుతి అనంతరం వర్షరుతువు తోనే ప్రారంభించారు. 'వాన గురియుట చేత నిర్మిలు జగతి/ - కాన అమృత మగుగాదె వర్షమ్ము' అంటుంది తిరుక్కరళ్.  ఇంత ముఖ్యమైన నీరు ఉత్తి పుణ్యానికి భువికి దిగిరాలేదు. అనంతమైన తపస్సు, శ్రమ, సంఘర్షణల సనాతన పురాతన సుదీర్ఘ ఇతిహాసం నీటిది. ప్రాణులకు పరమ శత్రువైన వృత్రుడు దుష్టబుద్ధితో సమస్తాన్నీ కట్టిపడేస్తే... ఇంద్రుడు కలగజేసుకుని ముందుగా జలవిబంధన చేయించాడని రుగ్వేదం సూక్తి.  ముత్తాతల ముక్తికి సురగంగను భువనానికి మోసుకొచ్చిన భగీరథుడి ప్రయత్నం అందరికీ తెలిసిందే. సృష్టికర్త తోయజ సంభవుడు. అల్ప ప్రవాహం నుంచి వర్ష జలధార దాకా పది హేను యజుస్సుల్లో జలరూపాలకు నమస్కారం చెప్పారు రుషులు.


'నీరు కేవలం జలధారే కాదు, అందాల బిందు సందోహం. సౌందర్యలహరి సౌకుమార్య ప్రవాహం. క్రూరమైన వరద' అంటారు దాశరథి  రంగాచార్య.  శ్రీకాళహస్తి మాహాత్మ్యంలో ధూర్జటి మహాకవి 'హంస సంసదభీష్ట విహారహేతు/ వై బహూ దక హృద్యమై యప్ర తర్క్య/ మగుచు నద్వంద్వమై పంకజాక రంబు పొలిచె' అంటూ సరోవరాన్ని సంపూర్ణ పరబ్రహ్మ తత్వంతో పోల్చాడు. శివాగ్రహ దగ్ధుడు నత్కీరుడు ముక్తిసాధన కోసం చేసే తీర్ధయాత్రల మధ్యలో ఒక విచిత్రమైన సెలయేరును చూస్తాడు. ఒడ్డునున్న మర్రివృక్షం పండుటాకులు ఆ నీటిలో పడి మీనాలుగా, వెలుపల పడి విహంగాలుగా, అటూ ఇటుగా పడి మీనపక్షులుగా రూపాంతరం చెందే వింత కంటబడుతుంది. ఇది వినడానికి విచిత్రంగానే ఉన్నా... సర్వ జీవాల మీద జలప్రభావ విశేషాన్ని హృద్యంగా చిత్రించిన పద్యంగా భావించాలి. పారిజాతాపహరణంలో శ్రీకృష్ణుడు సత్యభామకు స్వర్గాన్ని చూపించే సందర్భంలో 'దరిజేరన్ రాక యుప్పొంగు'  సంసారాన్ని అంబోనిధితో పోల్చాడు. నీటికి మనిషికి మధ్యగల బంధం అంత బలమైనది . కాబట్టే  భారతంలో సైతం శకుంతల 'నుతజల పూరితం మాత్రులు సూరిటి కంటె సూనృతవ్రత యొక్క బావిమేలు' అంటుంది దుష్యంతుడితో.  ప్రజలకు జలసౌకర్యం కలిగించడం పాలకుల ప్రధాన నిధుల్లో ప్రముఖమైనది. ఒకనాటి  ధనవంతులు స్వచ్ఛందంగా  పెద్దపెద్ద తటాకాలు తవ్వించిన దాఖలాలు నేటి  తవ్వకాలలో  సైతం తరుచుగా బైటపడుతుంటాయి. నీరు లేనిదే ఊరు లేదు.  ఊరు లేనిదే రాజు లేడు . ఇప్పుడు ఎడతెగక పారు యేరు ఊరు ముఖ్యావసరాల్లో ఒక్కటిగా సుమతీ శతకకర్త ఏకాడో గుర్తించాడు.


నాగరికతలు వెల్లివిరిసింది నదీతీరాల వెంబడే . నీరు సామ్రాజ్యాల ఉత్థానపతనాలకు, జ్ఞానమార్గాలకు సాక్ష్యమో!  ఎత్తు పల్లాలను తెలిపే నిమ్నగ  నీరు. కంటికి కనిపించేది..  కనిపించకుండా తేమరూపంలో గాలితో కలిసి ఉండేది కూడా నీరే!  శరీరం బరువులో  అరవై అయిదు శాతం నీటిదే.  నీరు లేనిచే ఎముకలకు, దంతాలకు దృఢత్వం రాదు. చర్మానికి తేజస్సు,  మస్తిష్కా నికి  చురుకు  నీటి పుణ్యమే. దేహంలోని బ్రహ్మనాడి  ద్వారా నోట ఊరే లాలాలమూ నీరే - అంటుంది యోగశాస్త్రం . గుంతలక్ష్మమ్మ పేర ఇంటి ఈశాన్యంలో తవ్విన గుంతకు పసుపు కుంకుమలతో పూజించే సంప్రదాయం ఒకనాటి మన తాతలది.  ఈనాటి ఇంకుడు గుంతల ఆలోచనకు ఆ  అచారమే పునాది  కావచ్చు.  బావి లేని  పెరడు ఉండేది కాదు ఇటీవలి కాలం దాకా.  ఏరు ఎండిపోయినా దాని మధ్య నున్న ఇసుక తిన్నెలో గుంత తీస్తే పానకం వంటి నీరు చెలమ నుండి ఊరుతుండేది . మతిలేని జల విధానాలతో  భూగర్భం పూర్తిగా ఎండిపోతున్న దుస్థితి ప్రస్తుతం మనది.  ముంతలోని నీరు ఒలక పోసుకొని మేఘాల  వంక మోరెత్తి చూసే పరిస్థితి దాపురించింది.  చంద్రమండలంమీదో .. అంగారక గ్రహ గర్భంలోనో నీటిజాడల కోసం చకోరాకు మల్లే  ఎదురు చూస్తూ కూర్చుంటే గొంతు తడుస్తుందా?  గాలిలోని తేమ నుంచి నీటిని తయారుచేసే క్రియను మార్క్ పేరెంట్ అనే ఫ్రెంచ్ నిపుణుడు  కనుగొన్నాడు. కరీబియన్ దీవుల్లో ఉన్నప్పుడు, కనీస అవసరాలకు నీరు లభ్యం కాక ఆయన చేసిన పరిశోధనల సత్ఫలితం  అది . ఒక యూనిట్ తేమ గాలి  నుంచి వెయ్యి లీటర్ల నీరు తేలికగా తయారు చేసే ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి వస్తే  నీటి సమస్య సగం తొలగిపోతుందని, వలసలు తగ్గుముఖం పడతాయని మార్క్ ఆశాభావం.  శుభం.


- రచన: కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - 06 -09-2012 న ప్రచురితం ) 


తల్లిని మించిన దైవం లేదు- ( భూలోక దైవం ) - ఈనాడు - సంపాదకీయం


ఈనాడు సంపాదకీయం 

తల్లిని మించిన దైవం లేదు ( భూలోక దైవం ) 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 13 -05 - 2012 ప్రచురితం ) 


ఖాండవ వనాన్ని అగ్ని దహించే వేళ కన్నబిడ్డల్ని కాపాడలేక ఓ తల్లి పులుగు తల్లడిల్లిన వైనం నన్నయ మహాభారతం ఆదిపర్వంలో ఉంది. 'కొడుకుల బ్రహ్మవిత్తములు గోరిన యట్టుల వీరి నల్వురుం / బడసితి నిమ్మహాత్ముల నపాయము నొందక యుండ బెంచుచున్ నడుపు' యటంచు మునినాథుడు మందపాలుడు అన్న మాటలను గుర్తుచేసుకొంటూ కుమిలిపోతుందా లావుక పక్షితల్లి. ఎనభైనాలుగు లక్షల జీవరాసులున్నాయి. ఏ జాతి లక్షణం దానిదే. అమ్మతనం మాత్రం అన్నింటిలో ఒకే విధం. ' పొదుగు గిన్నెను బాలు వాసి దూడకు నిచ్చి యర్రు నాకెడు పాడియావు... / బొండంపు దిత్తులు నిండదెచ్చిన మేత బిడ్డకు దినిపించు పిట్ట.../ పాలిండ్లు పట్టు దప్పని పిల్లతో గూడి గొమ్మ గొమ్మకు దాటు కోతి.../ తాంబూల రాగ దంతముల నవ్వుల సంతతుల మోయు దానిమ్మ మెలత... ' - ఆస్వాదించగల ఆర్ద్ర హృదయం ఉండాలేగానీ... కవిపీష్వా జాషువా భావించినట్లు- విశ్వవ్యాప్తంగా అమ్మ ఆప్తకుసుమ పరిమళాలకు కొదవేముంది! 'కొమ్మ ఒళ్ళో మొగ్గలాగ లాలిత్య తమకంలో సోలి పోతూ పెరిగేవేళ/ ఎన్నో నిత్య వసంతాల్ని ఏరుకొని తెచ్చి మధుర రహస్యంగా బిడ్డ హృదిలోకి ఊదేది' అమ్మ. 'నిద్ర పొత్తిళ్ల నిండా పాటల పరిమళాలు పరచి/ భావి జీవితానికి అత్తరు జవ్వాది బావు కతను నింపే వరదాయిని' అమ్మ. హృదయానికి హత్తుకోవడం వేరు. హృదయాన్నే గంపగుత్తగా ఇచ్చేయడం వేరు. 'అమ్మ' అనే పలుకులో ఇంత కమ్మదనం ఉంది కనుకనే కాళిదాసు కవిశిశువుగా జన్మ ఎత్తిన వెంటనే 'మాతా మరకతశ్యామా మాతంగీ...' అంటూ అమ్మ పదాలను పదే పదే పలవరించాడు. భారతీయుల ధర్మం ప్రకారం- తల్లిని మించిన దైవం లేదు. వెయ్యిమంది తండ్రులు, పదిమంది గురువులు అయినా తల్లితో సమానం కాబోరు. 


తల్లి ముఖం చూడని బిడ్డ వాన ముఖం తెలియని పైరుతో సమానం. 'చులకన జలరుహ తంతువు/ చులకన తృణకంకణము దూది చుల్కన సుమ్మీ/ యిల నెగయు ధూళి చుల్కన చులకన మరి తల్లిలేని సుతుడు కుమారా/' అని సూక్తి. తల్లి లేకనే త్రైలోక్య పతి తపసి అయ్యాడని 'బసవ పురాణం'లోని బెజ్జమహాదేవి బాధ. ' ఎన్నండు వచ్చునో చిన్నారి కందువుం గన్నార గాంచు బంగారు గడియ/ ముద్దారు మూర్తి యే పొద్దు నా ప్రక్కలో బొజ్జుండునో మేను పుల్కరింప' అంటూ కలవరించని తల్లి సృష్టి మొత్తంలో ఏ జీవరాశిలో కనిపించదు. కానరాని మహాశిల్పి లోన జేరి/ రాత్రింబ వళుల యందు విశ్రాంతి లేక సృజించే ఆ శిశు కళాచాతుర్యమే ఏ అమ్మ కైనా కళ. అమ్మను సృష్టించే వేళ బ్రహ్మ పడే హైరానా శారదమ్మకే ఆశ్చర్యం కలిగించిందని ఓ కవి భావన. 'రెండు జతల చేతులు.... మూడు జతల కళ్లు తగుమాత్రపు తిండితోనే బ్రహ్మాండంగా పనిచేయాలి గదా  మరి! ఊయలై పాపాయిని ఊపేందుకో చేయి, ఒంటికి లాలలు పోయడానికింకో చేయి, నోటికి బువ్వందించేందుకు వీలుగా మూడో చేయి, దిష్టి చుక్క పెట్టేందుకు నాలుగో చేయి. ముందు నుంచి చూసేందుకు రెండు కళ్లు, వెనకనుంచి కాచేందుకు మరో జత కళ్లు కరుణ మమతలు కురిపించేందుకు మూడో జత కళ్లు' అంటూ విధాత వివరించుకుంటూ పోతుంటే- శారదమ్మ కళ్లు పంట కాలువలై పారాయని ఆ కవి చమత్కారం. పానుగంటి వారు కల్యాణరాఘవంలో భావించినట్లు తండ్రిప్రేమది పారమార్థికపు చింత... బిడ్డప్రేమది ఐహికాపేక్ష... కట్టుకున్నవారిది కలకాలం తమకే దక్కాలన్న కాంక్ష... తల్లిదయలో ద్యోతకమయ్యేది మాత్రం శుద్ధ దివ్యతత్వమే.  జనని- చెడును పీల్చి మంచిని పంచే ప్రేమ'ధమని' అని వేటూరివారి చమత్కారం. 'నిన్నటిలో చీకటి తుడిచి, మనుగడలో మీగడ పరచి/ ముద్దులనే ముద్దలు కలిపి తినిపించే 'అమ్మ' ప్రేమ కమ్మదనం వ్యాసవాల్మీకులకైనా సంపూర్ణంగా పొగడతరం కానిది. బిడ్డ- తల్లికి 'కోరిక లుబ్బగా దిగిన కుచ్చుల పల్లిక (బుట్ట)' . తల్లి బిడ్డను 'కొండ కొమ్ముకు చేర్చే పల్లకి' . ఆవంత్స సోమసుందర్ భాషలో చెప్పాలంటే, 'రక్తంలో నిక్షిప్తమైన ఒక సుందర స్వప్నం అమ్మ'. తల్లీబిడ్డల అనుబంధాన్ని మించిన అందమైన కావ్యం, తల్లీ బిడ్డల్ని సృష్టించిన దైవం కూడా సృజించలేనిది. 'ఊపిరి ఉన్న చాలు కొడుకో గిడుకో ఎవరైన నొక్కటే/ చేపిన ప్రేమ జుర్రుకొను చిట్టి పెదాలెవియైన నొక్కటే/ లోపలి పేగు బంధమెదలో మెదిలే మమతానుబంధమున్ చూపెడి పాంచ భౌతిక రూపపు సృష్టిక ర్తగా/ అమ్మడో... గుమ్మడో... ఏ పసికూనయైన నొకటే' అనే అమ్మను మించిన చెలి, గురువు, చేయిపట్టుకుని నడిపించే మార్గ దర్శి- బిడ్డకు మరెక్కడైనా దొరుకుతుందా! కన్నతల్లి ఒడిలో ఒయ్యా రంగా కూర్చున్న చిన్నికన్నయ్య రూపాన్ని సంభావించుకున్న తర వాతే బమ్మెర పోతన మహాభాగవతాన్ని ఆరంభించాడు. ముఖా న్నెంత అరచేతులతో ఆదిమిపెట్టుకున్నా వేళ్ల సందుల గుండానైనా పొంగి పొర్లకుండా ఉండలేనిది 'అమ్మ' నది. నీరింకిపోవచ్చు ప్రవా హపు అచ్చులు శాశ్వతం. బిడ్డల జ్ఞాపకాలవెంట అలుపెరుగని పరుగే అమ్మకిష్టమైన ఆట. అమ్మ మెట్లమీద నుంచే ఏ ఆకాశ మైనా బిడ్డకు అందివచ్చేది. బిడ్డల సేవలో ముగ్గయిపోయినా తల మీది ఆకాశాన్ని తోసేయాలనిపించకపోవమే తల్లిదనం. బట్టకట్టే బిడ్డకోసం నెత్తురై ప్రవహించే తల్లికి ఏమి చెల్లిస్తే రుణం తీరేను?! నేడు మాతృదినోత్సవం. కవితలకు వస్తువుగా, ఉత్సవాలకు సందే శంగా సరిపుచ్చితే సరా! అమ్మను చదువుకుంటూ జీవితం నెగ్గితే చాలదు... అందరూ 'అమ్మ'ను తలచుకునే తీరులో ఎదగడమే బిడ్డ ఏ తల్లికైనా ఇచ్చే నిజమైన నివాళి.


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 13 -05 - 2012 ప్రచురితం ) 

ఈనాడు - హాస్యం తీరం దాటని తుఫాను - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం - 20 -05 - 2003 న ప్రచురితం )





ఈనాడు - హాస్యం 

తీరం దాటని తుఫాను 

- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం - 20 -05 - 2003 న ప్రచురితం ) 




మంగళవారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారానికల్లా బలపడి గురు వారం తమిళనాడు తీరాన్ని తాకటంతో ఆంధ్ర ప్రదేశ్ లో  పెనుతుపాను మొదలయింది. 'గాలులు మాకూ... వానలూ తమిళనాడుకూనా ' అని ఆంధ్రులు ఆవేశంతో ఊగిపోతున్నారు.


' ఇది ప్రభుత్వ వైఫల్యం... కడలూరులో వానలు పడకుండా ఆపలేని అసమర్థ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి' అని కాంగ్రెస్ విరుచుకుపడింది. 


ఆంధ్రాలోని అనావృష్టిని... తమిళ నాడు అతివృష్టిని పార్టీ హైకమాండ్ ఖండించింది.


రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి ప్రపంచ బ్యాంకు ఆదేశానుసారం తుఫానుని  తమిళనాడుకు తరలించిన చంద్రబాబు చర్యను తీవ్రంగా నిరసిస్తూ విశాఖపట్నం నుంచి మచిలీపట్నం దాకా మానవహారం నిర్మించాలని వామపక్ష ప్రగతిశీల ప్రజాస్వామ్య లౌకిక శక్తుల ఐక్య సంఘటన పిలుపు నిచ్చింది . 


'తుపాకులతోనే తుపానులు సాధ్యం' అని వార్ తూర్పు దిక్కు పడమర శాఖ కోర్ కమిటీ ఒక కరపత్రంలో ప్రకటిస్తూ 'ఆంధ్రా బంద్' అంది.


తూప్రాను మున్సిపాలిటీ భవనం మీద నుంచి ఒక పౌరుడు డిప్రెషన్తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

రాష్ట్రం అంతటా ర్యాలీలు, ధర్నాలు రాస్తారోకోలు... వాతావరణం తుపాను తరువాతి పరిస్థితికన్నా అస్తవ్యస్తంగా ఉంది.


'మిత్రపక్షాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా ఏకపక్షంగా తుపానులనిలా పొరుగు తీరాలకు తరలించటం ప్రభుత్వానికి తగని పని. సముద్రంలో మళ్ళీ ఇప్పటికిప్పుడు తుపాను సృష్టిం చటంలో కేంద్రానికెన్ని ఇబ్బందులున్నాయో కనుక్కోవాలి' అంది మిత్రపక్షం గోడమీది పిల్లివాటుగా. 


పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వమూ ఒక ప్రకటన చేయా ల్సొచ్చింది. 'తుపాను హెచ్చరిక కేంద్రాన్ని అనేకసార్లు హెచ్చ రించాం. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ అనర్థం జరిగింది. నివేదిక అందిన తరువాత అదే రుజువవుతుంది. తుఫాను  రాజకీ యాలు మంచివి కాదు. తుపానుగాలి బాధితులకు అన్నివి ధాలా ప్రభుత్వం సహాయ పడుతుంది' అని హామీ ఇచ్చింది.


'తుపాను జన్మభూమిని నిర్వహించుకుందాము. అవగాహన సదస్సులను ఏర్పాటు చేసుకుందాము. వీడియో కాన్ఫరెన్సుల ద్వారా నేను ప్రతి క్షణమూ తుఫాను  పరిస్థితిని సమీక్షిస్తుం టాను.  ఆవిధంగా మనం ముందుకు పోదాం ' అంటూ ముఖ్యమంత్రి ప్రజలతో ముఖాముఖీలో ప్రకటించారు.


బందరు ఓడరేవులో అధికారులు సమయానికి రెండో నెంబరు జెండా కనపడక తెలుగుదేశం జండా ఎగరేశారని, అందువల్లే  తీరందాకా వచ్చిన తుపాను అలిగి గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయిందని అఖిలపక్ష కమిటీ నిజనిర్ధారణ చేసింది. 


తొందరలో ఎన్నికలున్నందువల్లనేమో  తుపానుకు ముందే ఈసారి కేంద్రబృందం రాష్ట్రంలో పర్యటించి పరిస్థితుల్ని అంచనా వేసిపోయింది. 


తుపాను గాలి బాధితుల సహాయనిధికి పంపే విరాళాలకు పన్నుపోటు ఉండదని ఆదాయపు పన్ను శాఖ ఆనందంగా ప్రకటించింది. 


సముద్రంలోకి వెళ్ళకుండా పస్తులుంచినందుకు నష్టపరిహారంగా ఉచితంగా బ్యాంకు రుణాలిప్పించి ఆదుకోవాలని అఖిల భారత ఆంధ్ర కోస్తా మత్యకా రుల సంఘం డిమాండు  చేసింది.


రాహుకాలంలో పుట్టిన వాయుగుండు ప్రభుత్వానికి యమగండంగా మారనున్నందున పక్షం రోజులు భగవాన్ శ్రీ ముక్తేశ్వరస్వామివారి ఆశ్రమంలో శాంతి యజ్ఞం నిర్వహించనున్నా మని... భక్తులు విరివిగా పాల్గొని విరాళాలు సమర్పించుకోవచ్చని బ్రహ్మశ్రీ ధనానంద స్వామి విజ్ఞాపన చేశారు. 


తుఫాను  రావాల్సిన దినాలలో కార్యాలయాలు  తెరిచి ఉంచినందుకు నష్టప రిహారం కింద అదనపు జీతంతోపాటు తుపానుభత్యం కూడా ఇవ్వాలని ప్రభుత్వోద్యోగుల సమన్వయ సంఘం ముఖ్యమంత్రి కి మెమోరాండం సమర్పించింది. నిబంధనల ప్రకారం సైక్లోన్ రిలీఫ్ రుణాలిచ్చే దాకా 'వర్క్ టు రూల్' పాటిస్తామని కూడా  హెచ్చ రించింది.


ఈ సందర్భంగా 'సైక్లోస్ క్లోనింగ్ సబబా...!' అనే చర్చను భారతీయ సంస్కృతి విలువల పరిరక్షణ సమితి చేపట్టింది.


రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తుపానులు అవసరమా . . కాదా - అనే అంశం పై  ఇంటర్నెట్లో పోలింగ్  పెడితే 'చెప్పలేమని' తొంభైయ్యెనిమిది శాతం చెప్పారు. 


తుఫాను  తమిళనాడు తీరంనుంచి ఒరిస్సా వైపు కదులుతున్నదన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మొత్తంలో పాకిస్థాన్ ఐ.ఎస్.ఐ. హస్తమేమైనా ఉందేమో  సమగ్రంగా పరిశీలించాల్సుందని కేంద్ర హోం శాఖ అభిప్రాయపడింది. 


'తుఫాను  కదలికల విషయంలో మూడో శక్తి జోక్యం సహించేది లేదన్న మన విధాన ప్రకటనకు ఆమె రికా ఆమోదంకోసం ఎదురుచూస్తున్నాం' అని విదేశీ వ్యవహా రాల శాఖ ప్రకటించింది.


తుపాను పరిస్థితులను అధ్యయనం చేయటానికి అన్ని రాజ కీయ పార్టీల సభ్యులతో కూడిన ఒక నిపుణుల కమిటీ జపానులో తుఫాన్ పర్యటనకు బయలుదేరి వెళ్ళింది. 


మూడో రోజే జపాన్ ప్రధానమంత్రి నుంచి ఫోన్... దయచేసి మీ పర్యటన బృందాన్ని వెనక్కి పిలిపించండి బాబూ ! కావలిస్తే తుఫాను  గాలినే పంపించండి. దానికైతే ఏదయినా నేర్పించగ లమ'ని గోల. 


 బృందంలోని మంత్రివర్గ సభ్యులు ముఖ్యమంత్రిని విడిగా కలిసినప్పుడు 'తుపాను సృష్టించటం కష్టం. వదంతిని పుట్టించడం తేలిక. వచ్చే ఎన్నికల్లో మనం నెగ్గాలంటే కచ్చితంగా జనం దృష్టిని మళ్లించాల్సిందే. తుపాన్ని మళ్ళించిన ఘనుడెవడో తెలిస్తే బాగుణ్ణు..  ఉపాయం కనుక్కోవచ్చు' అవి రహస్య నివేదిక అందించారు. 


ముఖ్యమంత్రిగారు ముసిముసిగా నవ్వారు 'బందరు రేవులో రెండో నంబరు జండాను దాచిపెట్టిందెవరనుకున్నారూ!... తెలుగుదేశం జండా చూస్తే ఎంత భయంకరమైన తుఫానైనా  వెనక్కి తగ్గుతుంది మరి!' అన్నారు. 


మంత్రుల మొహంలో ఆశ్చర్యాభినయం.


'నువ్వెప్పుడూ ఇట్లాంటి తిరకాసు కబుర్లే అల్లుతావురా.... తుపాను తప్పినందుకు రాష్ట్రంలో సంతోషపడ్డ వాళ్ళే లేరా? ' అనడిగాడు సంతోషరావు చిరాగ్గా. 


'ఎందుకులేరోయ్...? జిల్లా యంత్రాంగం.. మినరల్ వాటర్ అండ్ బాటిల్ వ్యాపారస్తుల సంఘం మరీ ముఖ్యంగా మేడమీద వడియాలారేసుకున్న మా బామ్మ... అలిండియా రేడియో...


'చివర్లో ఈ రేడియో ఎందుకూ?!' 


' తుఫాను  సమయంలో ఆకాశవాణివారు ప్రసారం చేసిన వాతావరణ సూచనలు ఉత్తమ వినోద కార్యక్రమంగా గుర్తించి కేంద్ర సమాచార శాఖ అవార్డు ఇవ్వబోతొంది .. అందుకూ..! 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం - 20 -05 - 2003 న ప్రచురితం ) 

ఈనాడు - సంపాదకీయం జీవనం ఓ మైత్రీవనం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపాదకీయం - ప్రచురణ తేదీ - 07 -08 -2011 )

 ఈనాడు - సంపాదకీయం

జీవనం  మైత్రీవనం

రచన - కర్లపాలెం హనుమంతరావు

ఈనాడు - సంపాదకీయం - ప్రచురణ తేదీ - 07 -08 -2011 ) 

 ఈనాడు - సంపాదకీయం 

జీవనం ఓ మైత్రీవనం

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - ప్రచురణ తేదీ - 07 -08 -2011 ) 


ప్రకృతి మన వేళ్లమధ్య సందుల్ని ఎందుకు వదిలింది? ఓ శిష్యుడి ఈ సందేహానికి గురువు ఇచ్చిన బదులుకు మించిన మంచి వివరణ స్నేహానికి మరేదీ లేదు. వేళ్లసందులతో మరో వేళ్ల సందులను సంధానించడానికన్నది ఆ జ్ఞాని సమాధానం.  పెద్దలు ప్రవచించిన  సప్త సుగుణాలలో  స్నేహ సౌఖ్యం ప్రముఖమైనది. మనసుతో మనసు, రహస్యంతో రహస్యం, ప్రజ్ఞతో ప్రజ్ఞ క్షీరనీర న్యాయంగా కలగలసి పోవడమే స్నేహం- అని శ్రీసుభాషిత రత్నావళి సూక్తి.  ఆదిశంక రులు ప్రబోధించిన ముక్తిమార్గమూ సజ్జన సాంగత్య సోపాన నిర్మి తమే. లౌకిక పరంగా  చూసుకున్నా మనిషి దుర్భాగ్యాన్ని మాపగలిగే ముఖ్యమైన నాలుగు సాధనాలలో  సన్మిత్ర సాహచర్యం ప్రధానమైదని భర్తృహరి భావన.  మనిషి సంఘజీవి. 'చివరికి మిగిలేది'లో బుచ్చిబాబు తర్కించుకొన్న విధంగా - లోకంతో సంపర్కం లేకుండా ఏకాం తంలో మనం సాధించిన జీవిత రహస్యమే యధార్ధమని నమ్మి సమాధానపరచుకోవడం మనిషన్న వాడికి సాధ్యమా? పద్యపాదం చక్కటి నడకకు యతిమైత్రి ఎలాగో.. జీవితం మంచి నడతకు సన్నితుడి తోడు. అలాగ ప్రేమతో విత్తనాలు వేసుకోవడానికి, కృత జ్ఞతతో పంట కోసుకోవడానికి పనికివచ్చే మన పొలంలాంటివాడు నిజమైన మిత్రుడు- అంటాడు ఖలీల్ జిబ్రాన్. ధన సాధన సంపత్తి లేనివారైనా బుద్ధిమంతులు పరస్పర మైత్రి సంపాదించుకొని స్వకార్యం సాధించుకుంటారన్నది పంచతంత్రంలో మిత్రలాభం మొదటి కధ చెప్పే నీతి. పొరుగువాడితో స్నేహపూర్వకంగా మసలుకోవడమే భూలోకవాసానికి మనమిచ్చే సరైన కిరాయి-  అన్న అ లనాటి బాక్సింగ్ యోధుడు మహమ్మదాలీ వాదం నిజమేకదా! ప్రేమభావంతో చూస్తే జీవనం సర్వస్వం మైత్రీవనమే.


మిత్రుడు అంటే సూర్యుడని మరో అర్ధం. ఏ లాభాపేక్ష లేకుం డానే తన చుట్టూ పరిభ్రమించే భూగోళాదిగ్రహాలకు ఉదారంగా వెలుగురేకలు పంచిపెట్టే ప్రభాకరుడు నిజంగా సార్ధక నామధే యుడే. ' మేఘుడు బుద్ధికి బోయి జలంబులు దెచ్చి యీయడే /వాస సమస్త జీవులకు వాంఛిత 

మింపెన లార' అని భాస్కర శతక పద్యం: మేఘం చెట్టుకు చుట్టమా, పక్కమా? ఉసిరితొక్కును దానంచేసిన పేదగృహిణి ఇంట కనకధారలు కురిపించడానికి శంకరుణ్ని ప్రేరేపించింది పరోపకారమే పరమార్ధంగా ఉన్న స్నేహభా వమే. పెదవి విప్పి చెప్ప పనిలేదు. మౌనహృదయం లయను కూడా గుర్తించగలడు నిజమైన నేస్తం.  కలిమి లేములకు సంబంధం లేనిది చెలిమి .  కృష్ణ కువేల సంబంధమే దానికి ఉత్తమ ఉదాహరణ. రాధా మాధవుల మధ్య నెలకొన్నది ప్రేమభావానికి అతీతమైన స్నేహసౌందర్యమే.  స్థాయీ భేదాలతో నిమిత్తం లేనిది స్నేహం. నరనారాయణుల సాహచర్యమే దీనికి చక్కని తార్కాణం. శ్రీకృష్ణుని నిర్యాణానంతరం హస్తినకు తిరిగి వచ్చిన పార్ధుడు అన్నగారితో ఆవేదనగా పలికిన మాటలే చాలు నేస్తభావన  సంపూర్ణ నిర్వచనానికి.  స్నేహితుడు సన్నిహితుడు, సారధి, సచివుడు, వియ్యం, సఖుడు, బాంధవుడు, విభుడు, గురువు.. అన్నిటికీ మించి దేవర గజేంద్రమోక్షంలో కరిరాజు మొరపెట్టుకున్నట్లు ' పెంజీకటి కవ్వల నెవ్వడు /నేకాకృతి వెలుగునో, ఆ వెలుగే మన అంతరంగాన్ని వెలిగించే స్నేహదీపం. ఒంటరైనా ఓటమైనా... వెంట నడిచే నీడ నేస్తం. తడికన్నులను తుడిచే ఆ స్నేహహస్తం ఒడుదొడుకుల బతుకుబాటలో చివరివరకు తోడు దొరకటమే.... మనిషి జన్మ ఎత్తినందుకు మనం చేసుకునే అదృష్టం.


వేడితే గాని వరాలివ్వని దేవుడి కన్నా వేడుకలా మన జీవితంలోకి నడిచి వచ్చే నేస్తం ఎందులో తక్కువ? ఎక్కడుంటాడో తెలి యని దైవం కన్నా కష్టంలో సుఖంలో, ఎత్తులో పతనంలో... ఎన్నడూ చేయి విడవక పక్కనుండే సన్మిత్రుడి సన్నిధిని మించిన పెన్నిధి మరేముంటుంది? కృష్ణపరమాత్మను చెలికాడిగా పొందిన గోపబాలకుల జన్మే జన్మమని వ్యాస భగవానుడిలా మనమూ ఈసుపొందాల్సిన పనిలేదు. ఠాగోర్‌ చెప్పినట్లు మన హృదయ కవాటం తెరిచి ఉంచాలేగాని... చొచ్చుకుని వచ్చేందుకు ప్రేమవాటి కలో తచ్చాడే నెచ్చెలులు లక్షలు లక్షలు. తండ్రి బిడ్డకు స్నేహితుడు. భార్య భర్తకు సహచరి. ఇరుగిల్లు పొరుగిల్లుకు తోడు. లోకమే ఏకైక కుటుంబంగా మారిన ఈ కాలంలో స్నేహసామ్రాజ్యం విస్త రించుకోవడానికి కులాలు, మతాలు, ప్రాంతాలు, వయసు, స్థాయీ భేదాలు- అడ్డుకావు. అమృత సాధనకోసం దేవదానవులే ఒక్కటై శ్రమించారు. స్నేహామృత సాధనకోసం జాతి మతాలకు అతీతంగా అందరూ ఒకటి కావడానికి అడ్డుగోడల్ని పడగొట్టలేమా? సంకల్పం చెప్పుకొనే సందర్భం ఈ రోజు 'అంతర్జాతీయ స్నేహదినం. ఆస్ట్రియా సామాజిక శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం- స్నేహబంధం కలిగించే ఆత్మసంతృప్తి మరే ఇతర బంధం కలిగించలేనంత బలమైనది. హృదయపూర్వకంగా స్నేహహస్తం చాచేవారికి హృద్రోగ సంబంధ రుగ్మతలూ అధికంగా రావంటున్నారు. మైత్రికి విలువి ఇచ్చే  వారి జీవితకాలం ఒంటరిజీవులకన్నా ఎక్కువనీ వారి పరిశోధనల సారం. ఆరుద్ర చెప్పినట్లు- ఎవరినీ ప్రేమించకపోవడం ఒక నేరం, ప్రేమ తెలియని జీవితం భూమికి భారం!


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - ప్రచురణ తేదీ - 07 -08 -2011 ) 

ఈనాడు - సంపాదకీయం మొక్కై వంగనిది... రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈ నాడులో ప్రచురితం)


ఈనాడు - సంపాదకీయం 


మొక్కై వంగనిది...

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈ నాడులో ప్రచురితం) 

తనయుడు అన్నా తనూజ అన్నా తనలోనుంచి జన్మించినవారనే అర్ధం. పున్నామనరకం నుంచి తప్పిస్తారనే కాదు, పుడమి మీద తమ పేరు నిలచెడతారనేదీ    బిడ్డల కోసం  తల్లిదండ్రులు పడే  తాపత్రయం . చంద్రుడు రాత్రికి వెలుగు, సూర్యుడు పగటికి వెలుగు. ఇంటి దీపాలవంటి బిడ్డలు రేయింబవళ్ళు కంటికి వెలుగు. తైత్తిరీయోపనిషత్ 'మాతృదేవోభవ... పితృదేవోభవ' అని చెబుతుంది. తల్లికి సేవచేసే వేళ వచ్చిన తన ప్రత్యక్షదైవం రంగడిని ఓ పక్క ఇటుక రాయిమీద కూర్చోబెట్టేశాడు పుండరీకుడు. మాతాపితల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి గణాధిపత్యం సాధించుకు న్నాడు వినాయకుడు. తల్లిదండ్రులకన్నా మన హితం కోరుకునే వారు ఎవరూ ఉండరు. పుట్టిన బిడ్డను గంగార్పణం చేస్తూ తొట్టె లోని పొత్తిళ్ళు పసికందుకు ఎక్కడ వత్తుకుంటాయోనని వ్యాకులపడే మాతృహృదయం  'కుంతీకుమారి'లో కరుణశ్రీ కలం ద్వారా  కళ్ళు చెమర్చేలా వర్ణితం. తండ్రి ప్రేమకు దశరథుడు ప్రతిరూపమైతే, తల్లి వాత్సల్యానికి యశోదమ్మ ప్రతీక. 'ఓయమ్మ! నీ కుమారుడు మా ఇండ్లను పాలుపెరుగు మననీడమ్మా!' అంటూ ఇరుగుపొరుగు అమ్మలక్కలొచ్చి కొండేలు చెబితే ఎంత ప్రేమ ఉన్నా బిడ్డను దండించకుండా ఉండలేకపోయింది ఆ తల్లి. గాంధారీ ధృతరాష్ట్రు లకు మల్లే గుడ్డిగా గారాబంచేసి బిడ్డలను ఎవరూ చెడగొట్టుకోవాలనుకోరు. తోటకూరనాడే తప్పు అని చెప్పనందుకు కొడుకుచేతే ముక్కు కొరికించుకునే దౌర్భాగ్యం పట్టకూడదనుకుంటే- మొక్కగా ఉన్నప్పుడే బిడ్డ చెడును తుంచాలి. నిదానంగానైనా భారవిలాగా బిడ్డలు పెద్దల మనసునర్ధం చేసుకుంటారు.


చేపను చూసి నీటిలో, పక్షిని చూసి గాలిలో తేలే మనిషి నేల మీదా మనిషిలాగే బతకాలని మన తాతలు బోలెడన్ని నీతులను  పురాణాలు, ఇతిహాసాలుగా మలిచి చెప్పారు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో కణ్వమహర్షి- శకుంతలను దుష్యంతుని వద్దకు పంపుతూ మెట్టినింట ఎలా మెలగాలో కళ్ళకు కట్టినట్లు చెబుతాడు. దీనిని  తెనిగించిన పిల్లలమర్రి పినవీరభద్రుడు కన్యకా ధర్మాలను ఎనిమిది పద్యాల్లో అత్యంత హృద్యంగా వర్ణించాడు. పిల్లను అత్తా రింటికి అంపకాలు పెట్టేవేళ 'నీతివాక్యములను నిర్మించి చెప్పెద ఖ్యాతితో నుండుము నాతిరో  నీవు!' అంటూ తల్లి సుద్దులు చెప్పే చక్కటి సంప్రదాయం మనది. అప్పలనరసింహకవి తేటతేట తెలుగులో బాల బాలికలకు బతుకుబాటలో ఎలా నడుచుకుంటూ ముందుకు సాగాలో  కుమారశతకం, కుమారీశతకంలో చెప్పుకొచ్చాడు. 'అమ్మకు రెండబ్బుకు రెండిమ్మహి దిట్టించు కూతురెందుకు; ధరనా దిమ్మరి పుట్టకపోయిన నిమ్మళమని యండ్రు జనులు'  అంటూ ఆడపిల్లకూ, 'తనయుడు చెడుగై యుండిన జనకుని తప్పన్న మాట సత్యమెఱుగు గావున నీ జననీ జనకులకు నపఖ్యాతియగు రీతి గొనకు' అంటూ మగపిల్లవాడికి ఎన్నో నీతులు బోధించాడు. జోల పాటల నుంచి, ఉగ్గుపాటల దాకా, గోరుముద్దల దశనుంచి కోర మీసం ఎదిగేదాకా బిడ్డ- ప్రతి అడుగులో మంచిచెడ్డలను తరిచి చూసే మంచి కుటుంబ సంప్రదాయం మన సొంతం. పాల్కురికి సోమనాథుడి బసవపురాణంలో బెజ్జ మహాదేవి శివుడిని తన శిశు వుగా భావించి బాల్యోపచారాలు చేసే తీరు చూస్తే, ఆనాటి తల్లుల 

 మమతానురాగాలు ఎంత విశాలంగా ఉంటాయో తెలిసి ఒళ్ళు పుల కరిస్తుంది. రాయి రప్ప, చెట్టు పుట్టలలో  సైతం దైవత్వాన్ని కనుగొ ని అమృతతుల్యమైన మాతృ వాత్సల్యాన్ని చూపించే తత్వం భార తీయత్వం. బిడ్డలను ప్రయోజకులుగా సాకే మెలకువలను ఉగ్గు పాలతో పట్టించేదే తరతరాల మన ఘన సంస్కృతీ వారసత్వం!


ప్రపంచం చిన్నదైపోతున్నా మనిషి మనసు చిన్నదైపోరాదు. పండుటాకుల్లాగా మారి రాలిపోయేదాకా తల్లిదండ్రులను గుండెల్లో పెట్టుకునే మన నిండు కుటుంబ వ్యవస్థను వదులుకుని అవస్థల పాలు కావటం వివేకం కాబోదు. కాటికి మోసుకుపోయే వేళా మనిషి తిరిగొస్తాడేమోనని దింపుడు కళ్ళెం పేరుతో ఆశపడే ప్రేమలను కాదనుకుంటే మనకీ బండరాయికీ తేడా ఏముంటుంది? పెద్దరికాన్ని హేళనగా చూడటం, ఆడపిల్లలను ప్రేమ పేరుతో ఏడి పించటం, చిన్న కారణాలకే ప్రాణాలు తీయటం, తీసేసుకోవటం, డబ్బుకోసం ఏం చేసినా తప్పు కాదనుకోవటం, చూసినదంతా తానొ క్కడే అనుభవించేయాలని ఈ తరంలో ఎక్కువమంది యావపడుతున్నారనేదే పెద్దల ఫిర్యాదైతే- ఆ పాపంలో సింహభాగం వారిదే. ఏమి చేసైనా సరే సంతానాన్ని అమెరికా తోసేయటానికి చదివిస్తు న్నామే గానీ... మంచి పౌరుడిగా మలిచే విద్యాబుద్ధులపై శ్రద్ధ పెడుతున్నామా? మొక్కై వంగనిది మానై వంగునా అన్నది నానుడి. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియని తల్లిదండ్రులు చిన్నారు ల దృష్టిలో కేవలం ఏటీఎం (ఎనీటైం మనీ)లుగా మిగిలిపోతున్న దుస్థితి ఇప్పుడుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, విడాకుల కారణంగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి చెంతే పిల్లలు పెరగాల్సి రావడం- పెంపకాన్ని సమస్యగా కాదు, సామాజిక సంక్షోభంగా మార్చేస్తోంది. పిల్లలను పెంచడంపై ప్రత్యేక కోర్సులు ప్రారంభిం చిన విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలోనే మదురై కామరాజ్ యూనివర్శిటీ సైతం- అమ్మానాన్నలుగా ఎలా వ్యవహరించాలో దూరవిద్యద్వారా బోధించనుంది. చైనా నమూనాలో చెప్పనున్న చదువు భారతీయ బుడతల్ని ఎలా దారిన పెడుతుందో చూడాలి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన ఫలితంగా మొగ్గ తొడిగిన ఈ రుగ్మత- మానవీయ సంబంధాలను  మళ్ళీ ముడివేసుకోవడం ద్వారానే నయం కాగలదన్న స్పృహ కలిగేదాకా పెంపకం పాఠాలను  బట్టీయం  పట్టాల్సిందేమరి!


-  కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు- సంపాదకీయం - తేదీ నా నోట్సులో నమోదు కాలేదు ) 

ఈనాడు - గల్పిక- వ్యంగ్యం జైలు తల్లీ ! నీకు జేజేలు! రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - గల్పిక- వ్యంగ్యం - 26-09-2002 ప్రచురితం)

 



ఈనాడు - గల్పిక- వ్యంగ్యం


జైలు తల్లీ ! నీకు జేజేలు! 


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - గల్పిక- వ్యంగ్యం - 26-09-2002 ప్రచురితం) 



'ప్రపంచమొక నాటకరంగం. మనమంతా అందులోని పాత్రధారులం' అన్నాడు షేక్స్పియరు . 


' నాటకాలు రాసే టాయన కనక ఆయన అలాగన్నాడు కానీ...

నిజానికి.. ప్రపంచమొక బందిఖానా.. అందులోని బందీలం మనమందరం' అనాలని చంద్రస్వామిలాంటి సాధువొకాయన

సెలవిచ్చిన మాటే నిజం.' 


'ఎలా?'


'నాటి యాదవకుల సంజాతుడయిన శ్రీ కృష్ణ పరమాత్ముని జన్మవృత్తాంతం మొదలు, నేటి లల్లూ ప్రసాదు యాదవుగారి ఉదంతం వరకూ ఈ నిజం క్షణం క్షణం రుజువవుతూనే ఉంది కదా!'


' గ్రహచారం బావోలేక లాలూగారికి అలా కారాగారమయిందిగానీ, గడ్డి తినే ప్రతివాడికి చిప్పకూడే గతి అవుతుందా ఏందీ?' 


'చిప్పకూడు అనొద్దు. . ప్లీజ్! చిప్స్... కూడు అను . బిర్యానీ పొట్లాలూ, కోడి కూర పేకెట్లు మధ్య మధ్య మద్యం బొట్లు... ఆ భోగం అత్తారింటిని నిజంగానే గుర్తుకు తెస్తుంది గురూ!'


'బొక్కలో ఉంటే మాత్రం... బొక్కకూడ దని రూలుందా! తాలిబాను యుద్ధ ఖైదీ లను క్యూబా కేంపుల్లో కుళ్ళబొడుస్తున్నారని మానవ సంఘాల వాళ్లు గోల పెడుతున్నవేళ. ఆ అమెరికన్లు మనల్ని చూసి కొద్దిగా నైనా నేర్చుకోవాల్సింది ఉంది' 


' ఏంటది?'


'ఖైదీలనయినా మామూలు మానవులుగా చూడాలని మానవహక్కుల సంఘాల వాళ్లు మొత్తుకొంటుంటే కనీసం కొద్దిమంది ఖైదీలనయినా మనం మానవులుగా ఏం ఏకంగా దేవుళ్లకన్నా ఎక్కువగా చూసుకుంటూ, అన్నింటిలోనూ దైవాన్ని చూసే మన అతి విశాల హృదయ సంప్రదాయాన్ని సగర్వంగా కొనసాగిస్తున్నాం చూడూ.. అదీ' 


' అందుకనే కాబోలు చాలామందిప్పుడు బైట కన్నా జైలు పదిలమని కటకటాల పూచలు పట్టుకు వేలాడుతున్నది! ' 

ఫో. . ఫో వేల పొమ్మికన్' అని విదిలించి కొడు తున్నా వినడంలేదుట  '


'మరి సెల్లో  ఉన్న సేష్టీ , సెక్యూరిటీ బైట అంత ఫ్రీగా దొరకద్దూ! సెటిల్ మెంట్లూ పథకాలూ, వ్యూహరచనలూ... అన్నీ పద్ధతి ప్రకారం సజావుగా సాగే చోటిదేనని చాలామంది కనిపెట్టేశారు. అందుకే డిమాండు చేసి మరీ రిమాండులోకొస్తు న్నారు. సెల్ లైపు నడ్డుపెట్టి, సెల్ఫోన్లాపలేరు. ఖైదంటే విలాసమే గానీ, షేమే లేదని అందరికీ తెలిసింది  లాగుంది స్వామీ!'


ఇలాంటి విషయాలేవీ తెలియకనే . . పాపం, ముందు తరం వాళ్లు ప్రిజననగానే బెదిరిపోయి, మాయరోగాలు మీదకు తెచ్చు కుని, ఆసుపత్రుల్లో అనారోగ్య బాధలు నటించలేక అల్లాడేవాళ్లు . 


కడుపారా తిన లేక, కంటినిండా కునుకులేక, మనసారా మాట్లాడలేక, కరవుతీరా తిరగలేక... మంచాలకే కట్టిపడేసుంచే ఆసుపత్రులు వాళ్ల పాలిట జైళ్లే! ... ఈ తరం చెరల భోగం  వాళ్లకేవీ తెలీవు పాపం! ' 


' ఇంకా ముందుతరం నాయకులు మరీ అమాయకులు.  నెల్సన్ మండేలా సగం జీవితం జైల్లోనే సైలెంట్ గా  గడిపేశారు. గాంధీకయితే జైలయినా బయలయినా ఒకటేననుకో!  జైలనంగానే అన్నీ కట్టి పెట్టి పుస్తకాల దొంతర్లు ముందు పెట్టుకుని, చదువుకుంటూనో, రాసుకుంటూనో, గోడల మీద గోళ్లతో గీసుకుంటూనో ఏళ్ల తరబడి అలా కాలక్షేపం చేసేవాళ్లు పాపం ఆనాటి అమాయక నాయకులు . 


'జైల్లో పడేస్తేనేగాని ఇండియాను డిస్క వర్ చేయలేకపోయారు జవహర్లాల్ నెహ్రూ.  జైల్లో ఉంటూనే అంతా 'కవర్ చేయగల పవర్ సంపాదించుకుంటున్నాడు ఎంత  ఛోటా నాయకుడైనా ఈ నాడు ...' 


' ఇంకా ముందు తరం భక్తుడొకాయనైతే మంది సొమ్ము 'గుడికోసం ఖర్చు పెట్టి  ఖైదు పాలయింతరువాతనేగా, అలా ' ఎందు కయ్యా ఉంచినావూ.... బందిఖానాలో ' అని అల్లాడుతూ  గొప్ప గొప్ప సంకీర్త నలకీ అల్లేసిందీ  !'


' అందుకేనా.. ఇప్పుడు కొంతమంది 'గుడి' సొమ్మును మందికి మళ్ళీద్దామని ముందుగా తమ వాటా కింద అందినంత జమ చేసుకునేదీ !'


'దమ్ముంటే వాళ్లను పట్టుకోవాలి ముందు' 


'పడక్కుర్చీలో చేరగిలబడి  అలా ప్రపంచాన్నూరికే  పడతిడితే ఊరుకోం ! '  అని వార్నింగిచ్చాడీ మధ్యనే ఓ పెద్దాఫీసరు  . 


పిస్తోళ్లు బొడ్డులో దోపుకుని పట్టపగలే బహిరంగంగా  తిరిగే గూండాగాళ్లని, తుప్పు తుపాకుల్తో ఎట్లా అదుపు చేస్తారు ఎంత పేరు గొప్ప పోలీసులైతే మాత్రం ? కనిస్టేబులో  మనలాంటి మానవుడే గదా! ' 


' నిజం .  ఈ అస్తవ్యస్త వ్యవస్థలో వాళ్ల అవస్థలు వాళ్లవి. 


' సమాజహితం... జనాభిమతం' అని ఎన్నన్నా గన్లు పట్టుకునే వాళ్ల స్లోగన్లు స్లోగా నైనా  జనం మీద పనిచేయవు . 

సహకారం కోరి మైత్రీసంఘాలని పేరేదో పెట్టినా సహజంగానే అవి దళారుల మయమనే జనం నమ్మకం.  పరువు పైరవీకారుల పరం చేసి ఇప్పుడు బీరాలు పలికినా ఫలం శూన్యం . ' 


' ఈ - కాప్స్' కేప్షన్తో ఈ మధ్య కంప్యూటర్ పద్ధతోటి  మొదలు పెట్టారు . కానీ, కాట్రిడ్జిలు కొనటా నిక్కూడా కాపర్సుకు కరువు! ' 


' పాపం, ప్రపంచం మొత్తంలోనే అతి పెద్ద బీద రక్షకభట వర్గం మన భారతదేశానిదే. ' 


' ఆ ఆపప్రధ పోగొట్టుకొనేందుకేనా ఏకంగా ఒక ప్రయివేట్ బ్యాంకునే మెయింటైన్ చెయ్యగల సూపర్నింట్లను తయారు చేస్తున్నారిప్పుడు .. అందుకే ' 


' ప్రయివేటుగా ఎన్ని కోట్లున్నా. . పబ్లిగ్గా వాడుకొనే వెసులుబాటు ఉండదు కదా!'


ఠాణాల్లో  న్యాయానికి రఠికాణాలేదని పేపర్ల వాళ్లు రాసి రంపాక పెట్టేస్తోంటే, ప్రయివేటుగానన్నా ఇన్ఫార్మర్లని పెట్టుకుని రీఫార్మస్ తెద్దామని పాపం పోలీసులు తెగ ఆయాసపడిపోతున్నారు. అదర్థం చేసుకోరూ!   'ఉన్నవాడికి దండాలు, లేనివాడికి అరదండాలు' అంటూ మళ్ళీ దండయాత్రలు మాతం  మొదలు ! 


'పేపర్లో రాసింది నమ్మకపోతే సొంతంగా  పోయి ' ఆసాంతం ' చెకింగ్ ' చేసుకోవచ్చుగా? '


'అమ్మో! ఖైదీల తాలూకు  చెక్ - ఇన్ లు తప్ప.. తతిమ్మా  చెకింగ్ లేవీ సహించేది లేదని  ఒక కనిపించని మూడా సింహం గాండ్రించిం తరువాత కూడానా!  నువు కూడా పొరపడి.. త్వరపడి  అటు వేపుకు పోకు సుమా! రెండు రెళ్లు నాలుగని కుండ బద్దలేసే మొండితనం నీది .   ఏ గూండా యాక్టు కిందో నిన్ను బుక్కు చేసి  బొక్కలు తొక్కేస్తే .. ' 


' బైలుక్కూడా ట్రై చెయ్యను . బైట బోలెడన్ని బాకీలు! కాబూలీల నుంచి కామన్ మేనుకు రక్షణ  ప్రస్తుతానికి కారాగారాలే! కాబట్టి ' జైలు తల్లీ నీకు జైజైలు' అని ఇంచక్క పాడుకుంటూ కులాసాగా చక్కీ పిసుక్కుంటూ కాలం గడిపేస్తానూ! ' 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - గల్పిక- వ్యంగ్యం - 26-09-2002 ప్రచురితం) 

ఈనాడు - సంపాదకీయం రేపటి పౌరులు రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపా - 13 - 11 - 2013 - ప్రచురితం )

 

ఈనాడు - సంపాదకీయం

రేపటి పౌరులు

 

రచనకర్లపాలెం హనుమంతరావు

ఈనాడు - సంపా - 13 - 11 - 2013 - ప్రచురితం ) 



 ఈనాడు - సంపాదకీయం 

పితృదేవోభవ! 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపా - 12-06-2011 ప్రచురితం ) 


ప్రాణి భూమి పై పడకముందే భగవానుడు రెండు అవతారాలతో సదా సిద్ధంగా ఉంటాడన్నది సర్వమత సమ్మతమైన సిద్ధాంతం. ఒకటి అమ్మ అవతారమైతే, రెండవది  నాన్న అవతారమన్న భావన... ఎంత ఉదాత్తం! దేవుడనేవాడే లేడనేవారైనా కాదనలేనంత కమనీయ భావన కదా ఇది! బాల ధ్రువుడు తండ్రి ఒడిచేరలేక ఖిన్నుడైన వేళ తల్లి సునీతి- అందరికీ తండ్రి ఆ శ్రీమన్నారాయణుడే అని హితోపదేశం చేసింది. తల్లి మాటల్లోనే దైవత్వానికి పితృత్వానికి మధ్యగల అద్వైత తత్వం ధ్రువుడికి బోధపడుతుంది. పితృవాక్పరిపాలనా మహత్యాన్ని లోకానికి చూపదలచే సాక్షాత్ ఆ భగవత్స్వరూపుడు దాశరథిగా  దివి నుంచి దిగివచ్చాడన్నది వాల్మీకి రామాయణ సారం. తండ్రి ఆదేశం మీద కన్నతల్లి శిరచ్ఛేదనకైనా  వెన్నుచూపని మరో పితృవాక్పరిపాలనా శిరోధారి అవతారం భార్గవరాముడిది. కన్నవారిని జన్మంతా కావడిలో మోసుకు తిరిగిన శ్రావణ కుమారుడినుంచి జన్మనిచ్చిన తండ్రికి తన యౌవన సర్వసాన్ని తృణప్రాయంగా ధారపోసిన పురూరవుడిదాకా మన పురాణాలు, ఇతిహాసాలలో తల్లులతో సమానంగా తండ్రులనూ సమాదరించిన సత్పుత్రులు కోకొల్లలు. 'ఎవరి వలన ఈ భౌతిక దేహం ఉనికి కొచ్చిందో... ఆ మూల ప్రేరకుడు సర్వజ్ఞమూర్తి సాక్షాత్ భగ వత్ స్వరూపుడు నన్ను కన్నతండ్రి. ఆ జీవదాతకు వేనవేల నమస్కా రాలు' అన్నది తైత్తరీయోపనిషత్ చేసే  కన్నతండ్రి ప్రార్ధన. మాతను సర్వ అర్ధమయిగా భావించిన మన సంప్రదాయమే పితనూ సర్వదేవతామయుడిగా సంభావించిందన్న సంగతి ఈ తరం మరచిపోరాదు.


పేగు అమ్మదైతే పేరు నాన్నది. అమ్మఒడి గుడి అయితే నాన్న భుజం లోకాన్ని చూపే బడి . అమ్మ జోలపాట ఎలాగో నాన్న నీతి పాఠం అలాగ. వెరసి ఇద్దరూ పెద్దబాలశిక్షలోని పదాలూ అర్థాలూ. కాళిదాసు చెప్పిన వాగర్థావివ సంపృక్తా శ్లోకం పరమార్ధం ఇదే. గుండెల్లో దాచుకున్న అమ్మప్రేమ గొప్పదా, గుండెలమీద గుద్దినా కిమ్మ నక నవ్వే నాన్నప్రేమ గొప్పదా? జన్మనిచ్చిన బ్రహ్మకైనా జవాబు తోచని చిక్కు ప్రశ్న ఇది. అమ్మానాన్నల కలగలసిన అనురాగం అలా నిత్య జలంలా ఊరకబోతే  బిడ్డ బతుకుబావి నిర్జలం కావడం ఖాయం. అదొక్కటే సత్యం. కన్నప్రేమకు కలతచెందిన ద్రాక్షాఫలం నల్లబడింది. కలకండ బండబారింది. అమృతం స్వర్గానికి పారిపోయింది- అని శ్రీ సుభాషిత రత్నావళి చమత్కారం. 'నాది' అని బిడ్డ భావించే ప్రతిదానికి పునాదిగా ఉండి సాధనకు తోడుపడేవి బాల్యంలో తండ్రితో కలిసి ప్రేరణ పొందిన మధుర క్షణాలే - అంటుంది మన స్తత్వ శాస్త్రం. మబ్బులు మూగితే సూర్యచంద్రులు, డబ్బులు పోతే బంధుమిత్రులు, ఓపిక ఉడిగితే కన్నబిడ్డలు కనిపించకపోవచ్చుగానీ... ఉన్నవేళా, లేనివేళా ఉండేది ఎంత వ్యాపార ప్రపంచంలోనైనా, కన్న వారి ఆశీర్వాదాలే! 'మా నాన్న ముందు హిమాలయం ఓ మంచుగుట్ట. హిందూ మహాసముద్రం ఓ పిల్లకాలువ' అని ఓ హిందీ హైకూ.  చైనా 'బా' అయినా బాంగ్లా 'బాబా' అయినా, హిబ్రూ 'అబ్బా' అయినా, లోకంలోని ఏ నాయనకైనా- కన్నబిడ్డ తోడిదే లోకం. ఏ శాస్త్ర విశ్లే షణకైనా అందని ఆకర్షణా విశేషం ఆయనది. తనకన్నా మిన్నగా బిడ్డ తయారు కావాలన్న కలలు కనేదీ పోటీ ప్రపంచంలో ఒక్క కన్నతండ్రే. కాలం బాటమీద కనిపించని సాధకుడు ఎక్కు పెట్టిన బాణం బిడ్డడైతే, వంచిన విల్లు, వారి తల్లిదండ్రులు- అంటాడు. ఖలీల్ జిబ్రాన్. శర లక్ష్యసాధనకు శక్తిమేరా వంగటమే తల్లిదం డ్రులతనం. ఎంత వంగితే అంత ఆనందమనుకునే ఆ కన్నవారి రుణం బిడ్డ ఎన్ని జన్మలెత్తినా తీరేదేనా?


చిన్నతనాన నాన్న చెప్పుల జతతో తప్పటడుగులతోనే ఏ బిడ్డ యినా జీవిత పరుగుపందెం ప్రారంభించేది. గెలుపు వడుపు నేర్పిన తండ్రి తలపే చిన్న తనమనిపించే పెద్దరికం ఎవరి ఉద్ధరణ  కొరకు? '  సర్వమతములకు సమ్మతమైన పేరిడి/ నిన్ను పెంచిన వారెవరే? ' అని త్యాగయ్యలాగా ఎవరైనా అడిగితే తటాలున వేలు చూపాల్సింది. . ముందు పాలిచ్చి పెంచిన తల్లినీ, పిదప తన జీవితంలోని పాలు ( వాటా ) ఇచ్చి  పోషిం చిన తండ్రినే గదా! మరి వెన్న అరచేతిలో ఉన్నా నేతికోసం వెతుకు లాడే మితిమీరిన తెలివితేటలు నేటితరంలో దేనికి సంకేతం? 'అమ్మాయయ్య యటంచు నెవ్వరిని నేనన్నన్ శివా! నిన్నే సుమ్మీ' అన్న ధూర్జటి తరంనుంచి 'అమ్మా లేదు... నాన్నా లేడు... ఏక్ 'నిరంజన్' అని శోకన్నాలు పెట్టడమే పెద్ద నాగరికత అనుకునేదాకా మనం సాధించిన ప్రగతి నిజానికి పురోగతా, తిరోగతా? సత్కుటుం బంలో పుట్టి చెడు నడతలు పట్టిపోయే పట్టికి పది హేడుమంది పరమ మూర్ఖుల్లో ప్రథమ తాంబూలమిచ్చింది మహాభారతం. జన్మ నివ్వడం, ఉపనయనం, చదువు చెప్పడం, తిండి పెట్టడం, భయం పోగొట్టడం పంచప్రాణ లక్షణాలని చాణక్య నీతి. ఆ పంచప్రాణాలను  పంచి, పెంచి, పోషించి తనను మించినవాడిగా తయారుచేయడానికి తపించే తల్లిదండ్రులను పెద్దతనంలో పంచకో, పంచుకొనేటందుకో మాత్రమే బిడ్డలు పరిమితం చేయడం దారుణం. చిట్టిచిట్టి చేతులు పట్టి లోక చిత్రాలను చూపించిన కన్నవారి చేతులు పిన్నవారికోసం చివరి శ్వాసదాకా అలా ఆశగా చాచే ఉంటాయి. ఆ చాచిన చేతుల్లో బిడ్డ లేకపోవడాన్ని మించిన శోకం ఈ లోకంలో తల్లిదండ్రులకు మరేదీ ఉండదు। ఇహపరాలు సాధించే హితమిచ్చిన కన్నవారు కనిపించినప్ప ప్రతిసారీ  కన్నీళ్లతో కాళ్లు కడగ పనిలేదు కానీ- వారి కంటిలో చివరి క్షణందాకా నీటిచుక్క ఊరకుండా చూసుకుంటే చాలు... అదే పున్నామ నరకాన్ని తప్పించినంత సంతోషం. పితృదినోత్సవంనాడే కాదు. ప్రతి క్షణం అలా నడుచుకునే పిల్లలున్న తల్లిదండ్రులకు జీవితమంతా నిజంగా ఒక ఉత్సవమే.


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపా - 12-06-2011 ప్రచురితం ) 

ఈనాడు - సంపాదకీయం పితృదేవోభవ రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపా - 12-06-2011 ప్రచురితం )

ఈనాడు - సంపాదకీయం 

పితృదేవోభవ! 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపా - 12-06-2011 ప్రచురితం ) 


ప్రాణి భూమి పై పడకముందే భగవానుడు రెండు అవతారాలతో సదా సిద్ధంగా ఉంటాడన్నది సర్వమత సమ్మతమైన సిద్ధాంతం. ఒకటి అమ్మ అవతారమైతే, రెండవది  నాన్న అవతారమన్న భావన... ఎంత ఉదాత్తం! దేవుడనేవాడే లేడనేవారైనా కాదనలేనంత కమనీయ భావన కదా ఇది! బాల ధ్రువుడు తండ్రి ఒడిచేరలేక ఖిన్నుడైన వేళ తల్లి సునీతి- అందరికీ తండ్రి ఆ శ్రీమన్నారాయణుడే అని హితోపదేశం చేసింది. తల్లి మాటల్లోనే దైవత్వానికి పితృత్వానికి మధ్యగల అద్వైత తత్వం ధ్రువుడికి బోధపడుతుంది. పితృవాక్పరిపాలనా మహత్యాన్ని లోకానికి చూపదలచే సాక్షాత్ ఆ భగవత్స్వరూపుడు దాశరథిగా  దివి నుంచి దిగివచ్చాడన్నది వాల్మీకి రామాయణ సారం. తండ్రి ఆదేశం మీద కన్నతల్లి శిరచ్ఛేదనకైనా  వెన్నుచూపని మరో పితృవాక్పరిపాలనా శిరోధారి అవతారం భార్గవరాముడిది. కన్నవారిని జన్మంతా కావడిలో మోసుకు తిరిగిన శ్రావణ కుమారుడినుంచి జన్మనిచ్చిన తండ్రికి తన యౌవన సర్వసాన్ని తృణప్రాయంగా ధారపోసిన పురూరవుడిదాకా మన పురాణాలు, ఇతిహాసాలలో తల్లులతో సమానంగా తండ్రులనూ సమాదరించిన సత్పుత్రులు కోకొల్లలు. 'ఎవరి వలన ఈ భౌతిక దేహం ఉనికి కొచ్చిందో... ఆ మూల ప్రేరకుడు సర్వజ్ఞమూర్తి సాక్షాత్ భగ వత్ స్వరూపుడు నన్ను కన్నతండ్రి. ఆ జీవదాతకు వేనవేల నమస్కా రాలు' అన్నది తైత్తరీయోపనిషత్ చేసే  కన్నతండ్రి ప్రార్ధన. మాతను సర్వ అర్ధమయిగా భావించిన మన సంప్రదాయమే పితనూ సర్వదేవతామయుడిగా సంభావించిందన్న సంగతి ఈ తరం మరచిపోరాదు.


పేగు అమ్మదైతే పేరు నాన్నది. అమ్మఒడి గుడి అయితే నాన్న భుజం లోకాన్ని చూపే బడి . అమ్మ జోలపాట ఎలాగో నాన్న నీతి పాఠం అలాగ. వెరసి ఇద్దరూ పెద్దబాలశిక్షలోని పదాలూ అర్థాలూ. కాళిదాసు చెప్పిన వాగర్థావివ సంపృక్తా శ్లోకం పరమార్ధం ఇదే. గుండెల్లో దాచుకున్న అమ్మప్రేమ గొప్పదా, గుండెలమీద గుద్దినా కిమ్మ నక నవ్వే నాన్నప్రేమ గొప్పదా? జన్మనిచ్చిన బ్రహ్మకైనా జవాబు తోచని చిక్కు ప్రశ్న ఇది. అమ్మానాన్నల కలగలసిన అనురాగం అలా నిత్య జలంలా ఊరకబోతే  బిడ్డ బతుకుబావి నిర్జలం కావడం ఖాయం. అదొక్కటే సత్యం. కన్నప్రేమకు కలతచెందిన ద్రాక్షాఫలం నల్లబడింది. కలకండ బండబారింది. అమృతం స్వర్గానికి పారిపోయింది- అని శ్రీ సుభాషిత రత్నావళి చమత్కారం. 'నాది' అని బిడ్డ భావించే ప్రతిదానికి పునాదిగా ఉండి సాధనకు తోడుపడేవి బాల్యంలో తండ్రితో కలిసి ప్రేరణ పొందిన మధుర క్షణాలే - అంటుంది మన స్తత్వ శాస్త్రం. మబ్బులు మూగితే సూర్యచంద్రులు, డబ్బులు పోతే బంధుమిత్రులు, ఓపిక ఉడిగితే కన్నబిడ్డలు కనిపించకపోవచ్చుగానీ... ఉన్నవేళా, లేనివేళా ఉండేది ఎంత వ్యాపార ప్రపంచంలోనైనా, కన్న వారి ఆశీర్వాదాలే! 'మా నాన్న ముందు హిమాలయం ఓ మంచుగుట్ట. హిందూ మహాసముద్రం ఓ పిల్లకాలువ' అని ఓ హిందీ హైకూ.  చైనా 'బా' అయినా బాంగ్లా 'బాబా' అయినా, హిబ్రూ 'అబ్బా' అయినా, లోకంలోని ఏ నాయనకైనా- కన్నబిడ్డ తోడిదే లోకం. ఏ శాస్త్ర విశ్లే షణకైనా అందని ఆకర్షణా విశేషం ఆయనది. తనకన్నా మిన్నగా బిడ్డ తయారు కావాలన్న కలలు కనేదీ పోటీ ప్రపంచంలో ఒక్క కన్నతండ్రే. కాలం బాటమీద కనిపించని సాధకుడు ఎక్కు పెట్టిన బాణం బిడ్డడైతే, వంచిన విల్లు, వారి తల్లిదండ్రులు- అంటాడు. ఖలీల్ జిబ్రాన్. శర లక్ష్యసాధనకు శక్తిమేరా వంగటమే తల్లిదం డ్రులతనం. ఎంత వంగితే అంత ఆనందమనుకునే ఆ కన్నవారి రుణం బిడ్డ ఎన్ని జన్మలెత్తినా తీరేదేనా?


చిన్నతనాన నాన్న చెప్పుల జతతో తప్పటడుగులతోనే ఏ బిడ్డ యినా జీవిత పరుగుపందెం ప్రారంభించేది. గెలుపు వడుపు నేర్పిన తండ్రి తలపే చిన్న తనమనిపించే పెద్దరికం ఎవరి ఉద్ధరణ  కొరకు? '  సర్వమతములకు సమ్మతమైన పేరిడి/ నిన్ను పెంచిన వారెవరే? ' అని త్యాగయ్యలాగా ఎవరైనా అడిగితే తటాలున వేలు చూపాల్సింది. . ముందు పాలిచ్చి పెంచిన తల్లినీ, పిదప తన జీవితంలోని పాలు ( వాటా ) ఇచ్చి  పోషిం చిన తండ్రినే గదా! మరి వెన్న అరచేతిలో ఉన్నా నేతికోసం వెతుకు లాడే మితిమీరిన తెలివితేటలు నేటితరంలో దేనికి సంకేతం? 'అమ్మాయయ్య యటంచు నెవ్వరిని నేనన్నన్ శివా! నిన్నే సుమ్మీ' అన్న ధూర్జటి తరంనుంచి 'అమ్మా లేదు... నాన్నా లేడు... ఏక్ 'నిరంజన్' అని శోకన్నాలు పెట్టడమే పెద్ద నాగరికత అనుకునేదాకా మనం సాధించిన ప్రగతి నిజానికి పురోగతా, తిరోగతా? సత్కుటుం బంలో పుట్టి చెడు నడతలు పట్టిపోయే పట్టికి పది హేడుమంది పరమ మూర్ఖుల్లో ప్రథమ తాంబూలమిచ్చింది మహాభారతం. జన్మ నివ్వడం, ఉపనయనం, చదువు చెప్పడం, తిండి పెట్టడం, భయం పోగొట్టడం పంచప్రాణ లక్షణాలని చాణక్య నీతి. ఆ పంచప్రాణాలను  పంచి, పెంచి, పోషించి తనను మించినవాడిగా తయారుచేయడానికి తపించే తల్లిదండ్రులను పెద్దతనంలో పంచకో, పంచుకొనేటందుకో మాత్రమే బిడ్డలు పరిమితం చేయడం దారుణం. చిట్టిచిట్టి చేతులు పట్టి లోక చిత్రాలను చూపించిన కన్నవారి చేతులు పిన్నవారికోసం చివరి శ్వాసదాకా అలా ఆశగా చాచే ఉంటాయి. ఆ చాచిన చేతుల్లో బిడ్డ లేకపోవడాన్ని మించిన శోకం ఈ లోకంలో తల్లిదండ్రులకు మరేదీ ఉండదు। ఇహపరాలు సాధించే హితమిచ్చిన కన్నవారు కనిపించినప్ప ప్రతిసారీ  కన్నీళ్లతో కాళ్లు కడగ పనిలేదు కానీ- వారి కంటిలో చివరి క్షణందాకా నీటిచుక్క ఊరకుండా చూసుకుంటే చాలు... అదే పున్నామ నరకాన్ని తప్పించినంత సంతోషం. పితృదినోత్సవంనాడే కాదు. ప్రతి క్షణం అలా నడుచుకునే పిల్లలున్న తల్లిదండ్రులకు జీవితమంతా నిజంగా ఒక ఉత్సవమే.


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపా - 12-06-2011 ప్రచురితం ) 

సాధించకే మనసా.. రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - నేను రాసిన సంపాదకీయం - 07 - 05 - 2009 న ప్రచురితం )

ఈనాడు - సంపాదకీయం 


సాధించకే మనసా.. 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - నేను రాసిన సంపాదకీయం - 07 - 05 - 2009 న  ప్రచురితం ) 


ఎంత నేర్చిన, ఎంత జూచిన, ఎంత వారలైన కాంతదాసులేనన్నాడు. త్యాగరాజస్వామి. బ్రహ్మవాక్కులా నాదబ్రహ్మ వాక్కూ తిరుగులేనిది. అందుకు దృష్టాంతాలు బోలెడు. సాక్షాత్తు దేవుళ్లూ తమ దేవేరుల్ని ఆ స్థాయిలో అందలాలెక్కించి గౌరవించినవారే. సుర గంగను శివయ్య శిరంపై  ధరించాడు. సిరితల్లి శ్రీమహాలక్ష్మిని విష్ణువు తన వక్ష స్థలంలో దాచాడు . సంగీత సాహిత్య సమలంకృతమూర్తి సరస్వతిని బ్రహ్మ రసనాగ్రంపై నిలుపుకొన్నాడు. తమ దారలు ముగురమ్మలను అలా తమ తనువుల్లో పొదువుకున్న ఆ అయ్యలపై వేమన ' స్త్రీ నెత్తిన రుద్రునకు/ స్త్రీ నోటను బ్రహ్మకెపుడు/ సిరి గుల్కంగా స్త్రీ నెరిరొమ్మున హరికిని' అంటూ చెణుకు విసిరాడు. బహుశా దాన్ని అందిపుచ్చుకునే కాబోలు ఓ కవి- మొగలాయి దర్బారులో వలెనే, మా దేవతల స్వర్గంలోనూ శిరస్దదార్, ఉరస్థదార్, ముఖస్థదార్లు ఉన్నారని చమత్కరించాడు. భగవంతుణ్ని చేరుకోవడానికి పెద్దలు చూపిన నవ విధ భక్తిమార్గాల్లో సఖ్యం, దాసత్వం కూడా ఉన్నాయి. అనురక్తితో భామకు చేరువ కావడానికి ఆ రెండు దారులు అనుసరణీయాలే. పర మేశ్వరుడంతటివాడికే వాటిని ఆశ్రయించక తప్పింది కాదు . తాను కొత్తగా పెళ్లాడిన గంగను జటాజూటంలో దాచుకుని, అత్తారింటినుంచి కైలా సానికి తిరిగి వచ్చిన ఆయనను భార్య పార్వతీదేవి గుమ్మంలోనే నిలువరించి పరిపరి విధాల నిలదీసింది. 'ఇడుముల బెట్టు జనులెందరైనా గలరు/ అలరు సఖ్యత జూడనొందజాలరుగా' అంటూ... పరులు చెప్పే చాడీలు నమ్మవద్దని శివయ్య ఎంత వేడుకున్నా ఆమె వినిపిం చుకోలేదు. ఆఖరికి- ' పదివేల నేరములు భామరో నావల్ల- పదివేల దండములు భామరో నీకు' అని శివుడు ప్రాధేయపడ్డాకే శివాని శాంతించింది. దాసుని తప్పులు దండముతో సరి అన్న సామెతను నిజం చేస్తూ, ఆయనను లోనికి రానిచ్చింది. ఆ తరువాత, తన వంతుగా అలిగిన గంగ శంకరుని నిష్ఠురాలాడి   పుట్టింటి దారిపట్టింది. పోతూపోతూ పార్వతితో- 'నీలకంఠుడు, నీవు నిఖిల సంతోషమున కేశవినోదముల ఓలలాడండి/ ఇంతపని కలిగిన ఇంతి నీ వద్దకు రాను/ వస్తే ఒట్టు పూనుకుంటాను' అని పంతగించి మరీ పుట్టింటికి వెళ్లడం- జానపదుల శివానందలహరిలో ఓ రసమయ వీచిక!


కాచి వడపోశాం, కొంగున కట్టేసుకున్నామని మనం అనుకోవడ కానీ, ఈ మగవాళ్లు ఎంతకైనా తగుదురని ఆడవాళ్లు రూఢి పరచుకునేలానే  ఉంటాయి ఒక్కోసారి మగవారి చేతలు! అటువంటి సంద ర్యాలలో  ఇంటావిడ అలనాటి రాధ మాదిరో, అపర సత్యభామ వలెనో ఇంటాయనను సాధించడంలో అబ్బురమేముంటుంది? 'నిన్ను ప్రేమించి సహనమ్ము నేర్చినాను/ అలిగి నన్నేమి సాధించగలవు నీవు? ' అని అతగాడు అన్నా, అవి మెరమెచ్చు మాటలుగానే మిగిలి పోతాయి తప్ప మురిపించవు, మరిపించవు. తనపై కినిసిన రాధికను ప్రసన్నం చేసుకునేందుకై  కృష్ణుడు ఎన్నిపాట్లు పడ్డాడని! కోపం మాని తనతో మళ్ళీ చెలిమి చేయమని అర్ధించాడు. మనవి వినమని వేడుకున్నాడు . మొగమెత్తి చూడవె అని ప్రార్ధించాడు. తన ప్రేమను గుర్తిం చమంటూ చేతులు జోడించాడు. 'నిలువ దరంబుగాదు, కరుణింపవే నన్నిక భామినీమణీ' అని ఆమె పాదాలకు ప్రణమిల్లాడు. అంత చేసినా ఆ నల్లనయ్యను రాధిక తొలుత కరుణించిందా, లేదు. అసలు నిన్ను ఎవ్వరు పిల్చిరిచ్చటికి? ఎందుకు వచ్చితివి? ... నే నెవ్వతె నీవెవండవు! ఇక ఎవ్వరికెవ్వరు? దేనికేది' అంటూ గోపాలుణ్ని నలిపి పారేసింది! తన మందిరానికి వచ్చినట్లు 'మీ జవ్వని విన్న రవ్వలిడు' అని రుసరుసలాడుతూ, ఆ ఇళాదేవి ఇంటికే పొమ్మని ఆయనను గసిరింది. ఇక- కృష్ణయ్యపై సత్యాగ్రహం గురించి చెప్పనే అక్కర్లేదు. ఆయన అనునయ వాక్యాలు కేవలం మొగమెచ్చు మాటలే పొమ్మంది. సాత్రాజితి. ప్రణయకలహాల వేళల్లోనే ప్రియవిభుణ్ని అంత పరుషో క్తులతో ఆ కధానాయికలు సాధించడం ఎంతకైనా తగుదురనిపించేలా వ్యవహరించే నేటి కాలపు జతగాళ్లకు కనువిప్పు కావాలి.


భర్త తోడిదే తన లోకమని భార్య పరవశించడం సహజం. తనవాడనుకున్న మనిషి తనను చులకన చేయడం హృదయశల్యమై ఆమెను బాధిస్తుంది. ఏ విషయంలోనూ తన మాట చెలికాడు వినిపించుకోకపోవడం ఆమె మనసును గాయపరుస్తుంది. అతడు తనను ఏమాత్రం పట్టించుకోకపోతే ఆమె వేదన ఇంక వర్ణనాతీతమే. సమా జంలో అటువంటి భర్తలూ లేకపోలేదు. అలా తనను విస్మరిస్తూ, తన మాట పెడచెవిన పెడుతున్న భర్తను దారికి తెచ్చుకోవడానికి భార్య నడుం బిగించక తప్పదన్నది మారియా గార్సియా-కాబ్ ఉవాచ: అందుకు దిక్సూచిగా- 'మీ భర్తను వేధించడానికి నూటొక్క మార్గాలు (101 వేస్ టు టార్చర్ యువర్ హజ్సెండ్)' పేరిట ఏకంగా ఓ పుస్తకం రాసిందామె. మాట వినని భర్తకు సంక్లిష్టభరితమైన నృత్యాలు చేసేలా శిక్షణ ఇప్పించడం, ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకని వస్తువుల జాబితా ఇచ్చి వాటిని తెచ్చి తీరాలని కోరడం- ఆమె పేర్కొన్న చిట్కాల్లో కొన్ని. 'తన మాటను ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసే భర్త చేత భార్య ఈ పనులు మాత్రం ఎలా చేయించగలుగు తుంది చెప్మా!' అన్నది ధర్మసందేహం. 'భర్తను వేధించడానికి నూ టిపైఒక్క చిట్కాయేం ఖర్మ, మాకు రెండొందలపైన మరో రెండు కిటుకులు తెలుసునంటూ కొంగుబిగించి మరీ ధీమాగా చాటగల ధీరవనితలూ ఉండవచ్చు.  అయినా, భర్తను దారికి తెచ్చుకోవడానికి గుప్పెడు మనసు, పిడికెడు మమత చాలవూ? 'నీవు లేవనునట్టి కాలమే నాకు లేదు/ నా దారినుండి నిన్ను విడదీయు వేరు  మార్గమే లేదు/ నీవు లేనిచోటున నాకు చోటులేదు, సుఖము లేదు, లేదు ఉనికి' అన్న తిలక్ అనువాద కవిత దారిదీపమై- జీవితపథాన  పరస్పర అను రాగంతో జీవనయాత్ర సాగిపోతే ఏ దంపతుల మధ్యనైనా పొరపొచ్చాలూ రావు, వేధింపుల ప్రసక్తి ఉండదు!


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - నేను రాసిన సంపాదకీయం - 07 - 05 - 2009 న  ప్రచురితం ) 

ఈనాడు - సంపాదకీయం సర్వేజీవా సుఖినోభవంతు రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపాదకీయం - 24 -07 - 2011 )

  


ఈనాడు - సంపాదకీయం

సర్వేజీవా సుఖినోభవంతు

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 24 -07 - 2011 ) 


పరిణామ సిద్ధాంతం ప్రకారం- ఇన్ని దశలు దాటి రాకముందు జంతువే  మనిషి మూలరూపం.  విశ్వ సంస్కృతులు జంతు తతులను విభిన్న కాలాలలో  వేర్వేరు దృక్పథాలతో చూసినా, భారతీయతది మాత్రం సృష్టి ప్రారంభంనుంచి ఒకే విధానం .. దైవభావం. అదిదేవుడు  పశుపతి. స్థితిమూర్తి శేషశయనుడు. సృష్టికర్త హంసవాహనుడు.  సోమకాసురుని వాడి రెక్కలచే చీల్చి చెండాడి వేదరాశిని కాచింది మత్స్యరూపమైతే, క్షీరసాగర మధనంలో మందరగిరి కిందకు జారిపో యిన వేళ మూపు నడ్డుపెట్టి సురాసుర కార్యానికి సాయంపట్టింది కూర్మ మూర్తి .  ముక్కుతిమ్మన పారిజాతాపహరణంలో వర్ణించినట్లు 'అజాండ కర్వరము బీటలు వారగ మేను పెంచి మహీ మహిళా లలామను గొమ్ము  కొన దగిల్చి' నీటిమంచి యెత్తినది వరాహమూర్తి.  అరి వైరంతో ఆరాచకం చేసే హిరణ్యకశిపుని వధాయజ్ఞం నిర్విఘ్న నిర్వహణకు హరి ఎత్తింది అర నరావతారం.  పటిల నఖాగ్ర కుంచి'కల'తో ధర్మకార్యం పూర్తిచేసింది మిగతా సగం మృగావతారం.  భగ వంతుడెత్తిన  ఆ నృసింహావతారమే నరుడికి మృగానికి మధ్యగల బలమైన బంధానికి తిరుగులేని ఉదాహరణ.  సీతాన్వేషణలో ఉన్న రాము డికి ప్రథమంగా సమాచారం అందించింది జటాయువు.  స్నేహహస్తం చాచిన  సుగ్రీవుడు, బంటుభావంతో సేవించిన ఆంజనేయుడు, సేతు  నిర్మాణం పర్యవేక్షించిన  నీలుడు- చివరికి అల్పజీవి అయినా అనల్ప భక్తితో సాయానికొచ్చిన ఉడుత.. అంతా జంతుసంతతే!  విజ్ఞత, గ్రహణ శీలత, సున్నితత్వం, దయ, ఓర్పు, ధైర్యం, దూరదృష్టి,  సహానుభూతి వంటి సద్గుణ సంపదలే  దైవీయ భావనలనుకుంటే పశుపక్షి కీటక సముదాయాలను మించిన దేవతామూర్తులు నేలా నింగీ నీటా  మనిషికి మరేవీ తారసపడవు. 


జంతుజాలాలలోని  ఈ విశిష్టతలవల్లే భారతీయులు చెట్టుమీది పిట్టనీ, పుట్టలోని పామునీ దేవతా స్వరూపాలుగా సుభావించి కొలిచేది.  ఆవును సాక్షాత్ గోమాత స్వరూపంగా కరుణశ్రీ వంటి కవులు భావించి కీర్తించింది ఈ దైవీయ  భావనతోనే.  జాంబ పురాణం ప్రకారం అనంత కాలాల కిందటే జన్మించిన మూలపురుషుడు జాంబవంతుడు.  కన్నబిడ్డ డొక్కలను కొలిమిగా, చర్మాన్ని తిత్తిగా, హస్తాలను పట్టుతెరలుగా, బొటనవేళ్లను ఉలులుగా మలచి  విశ్వకర్మకే పరికరా లను సమకూర్చిన నిపుణుడు ఆయన.  భూదేవికి వరాహపురాణం విని సించిన మేధావి ఆదివరాహమూర్తి.  సామవేదాన్ని గానంగా వినిపిం చిన మహాముని శుకుడు.  భోజరాజీయంలోని గోవు అభిజ్ఞాన శాకుం తలంలోని కణ్వమహర్షితో సమానమైన ప్రతిభా విశేషాలతో తన చిన్ని దూడకు సుద్దులు చెబుతుంది. రఘునాథ నాయకుడి  'నలచరిత్ర' కలహంస  కథానాయకుడి చేతజిక్కినప్పుడు చెప్పే సంసార ధర్మాలు పండితుల పలుకులకు తీసిపోనివి.  నలదమయంతుల మధ్య రాయ బారం నడిపి వారి ప్రేమను పండించిన పెళ్ళిపెద్ద అది. శృంగారం మదన శివాలు తొక్కి, నాయిక పరకీయగ  మారే ప్రమాదాన్ని గ్రహించి రాత్రికో  మడతపేచీ  కథ చొప్పున చెప్పుకొస్తూ మగడు ఇల్లు చేరినదాకా ఇంటి పరువును, ఇంతి పరువును గుట్టుగా కాపాడిన చతుర, కదిరీపతి 'శుక సప్తతి ' చిలుక.  రాబర్ట్ బ్రూస్ వంటి మహారాజుకే పాఠాలుచెప్పిన  సాలెపురుగులోని  యంత్రరహిత నూలు నిర్మాణ కౌశలం అద్భుతం. ' ఈశ్వరశక్తి నీ కడుపులోనే లీనమై  యుండునో అంటూ జాషువా వంటి మహాకవుల మన్ననలందుకున్న జంతుజాలాల విశేషాలు ఎంత చెప్పుకొన్నా సశేషాలే!


మనిషి తన తోటి మనిషిని చిన్నబుచ్చడానికి జంతువులతో పోల్చడం ఎంతవరకు సమంజసం? 'బూడిద బుంగవై యెడలు పొడిమి దప్పి మొగంబు వెల్లనై/ వాడల వాడలం దిరిగి వచ్చెడు వారలు చొచ్చొచోయనన్/ గోడల గొందులందొదిగి కూయుచు నుండెడు' వారిని శ్రీనాథుడంతటి మహా పండితుడు గాడిదలని తూల నాడటం తగునా? పిల్లిమీద, ఎలుకమీద పెట్టి తిట్టే అన్యాపదేశాలు సాహిత్యంలో అలంకారాలు- అన్నంత వరకైతే సరిపుచ్చుకోవచ్చు కానీ, చిన్నజీవులపట్ల పెద్దమనసు కలిగి ఉండటం బుద్ధిమంతుల లక్షణం. ' తీయని పదాల రామా రామా యటంచు/ తీయ తీయగా రాగాలు తీయుచున్న/ కమ్మకైతల క్రొమ్మావి కొమ్మమీది' ఆదికవి వాల్మీకిని మనం 'కోకిలస్వామి'గా కొలుచుకుంటున్నాం. కర్ణాటక రాజ్యాధిపతులు ఒకప్పుడు 'ధరణీ వరాహ'మనే బిరుదును గొప్ప గౌరవంగా ధరించడం గమనీయం. నృత్య విశేషాలను మయూర భంగిమలతోను, చురుకు వేగాన్ని అశ్వతేజంతోను, సునిశితమైన వినికిడిని పాము చెవులతోను, సూక్ష్మదృ ష్టిని విహంగవీక్షణంతోను సరిపోల్చుకొని సంబరపడే మనిషి సాటి జీవాన్ని అల్పదృష్టితో చూడటం సృష్టిదోషం. విష్ణుశర్మ పంచతం త్రంలో జంతుపాత్రలు అందించే నీతిచంద్రికలు మనిషి మనసులో ముసిరి ఉన్న చీకట్లను పారదోలేవి. విశ్వాసానికి శ్వపతి(కుక్క), శుచి శుభ్రతలకు మార్జాలం, బృందస్ఫూర్తికి పిపీలక సందోహం, ఐక్యతకు కాకిమూక, సమానత్వ భావనకు వానరజాతి... మనసు తెరచుకుని ఉండాలేగానీ క్రిమికీటకాలనుంచి పశుపక్ష్యాదులదాకా సర్వజీవావళి మనిషి పాలిట పరమ గురువులే. సాధు హృదయంతో చేరదీయడమొక్కటే మనం చేయవలసిన సత్కార్యం. మైమీ విశ్వవిద్యాలయం, సెయింట్ లూయీస్  విశ్వవిద్యాలయం జంతువులను పెంచి పోషించే వారిమీద చేసిన ప్రయోగాల ఫలితం ప్రకారం- అది మానవ జాతికే ప్రయోజనకరం. పెంపుడు జంతువుల యజమానుల్లో ఆత్మవిశ్వాసం. ఆరోగ్యవంతమైన శరీరం, కలుపుగోలుతనం, సామాజిక స్పృహ, నిర్బ యత్వం- జంతుజాలాలకు దూరంగా ఉండేవారిలో కన్నా ఇరవైశాతం అధికంగా ఉంటాయని పరిశోధన బృంద నాయకుడు అలెన్ ఆర్ మెక్కానిల్ చెబుతున్నారు. ఆసుపత్రులకు దూరంగా ఉండాలంటే సాటి జీవాలకు చేరువ కావడమే దగ్గరి దారి. 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 24 -07 - 2011 ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...