Saturday, December 4, 2021

తల్లిని మించిన దైవం లేదు- ( భూలోక దైవం ) - ఈనాడు - సంపాదకీయం


ఈనాడు సంపాదకీయం 

తల్లిని మించిన దైవం లేదు ( భూలోక దైవం ) 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 13 -05 - 2012 ప్రచురితం ) 


ఖాండవ వనాన్ని అగ్ని దహించే వేళ కన్నబిడ్డల్ని కాపాడలేక ఓ తల్లి పులుగు తల్లడిల్లిన వైనం నన్నయ మహాభారతం ఆదిపర్వంలో ఉంది. 'కొడుకుల బ్రహ్మవిత్తములు గోరిన యట్టుల వీరి నల్వురుం / బడసితి నిమ్మహాత్ముల నపాయము నొందక యుండ బెంచుచున్ నడుపు' యటంచు మునినాథుడు మందపాలుడు అన్న మాటలను గుర్తుచేసుకొంటూ కుమిలిపోతుందా లావుక పక్షితల్లి. ఎనభైనాలుగు లక్షల జీవరాసులున్నాయి. ఏ జాతి లక్షణం దానిదే. అమ్మతనం మాత్రం అన్నింటిలో ఒకే విధం. ' పొదుగు గిన్నెను బాలు వాసి దూడకు నిచ్చి యర్రు నాకెడు పాడియావు... / బొండంపు దిత్తులు నిండదెచ్చిన మేత బిడ్డకు దినిపించు పిట్ట.../ పాలిండ్లు పట్టు దప్పని పిల్లతో గూడి గొమ్మ గొమ్మకు దాటు కోతి.../ తాంబూల రాగ దంతముల నవ్వుల సంతతుల మోయు దానిమ్మ మెలత... ' - ఆస్వాదించగల ఆర్ద్ర హృదయం ఉండాలేగానీ... కవిపీష్వా జాషువా భావించినట్లు- విశ్వవ్యాప్తంగా అమ్మ ఆప్తకుసుమ పరిమళాలకు కొదవేముంది! 'కొమ్మ ఒళ్ళో మొగ్గలాగ లాలిత్య తమకంలో సోలి పోతూ పెరిగేవేళ/ ఎన్నో నిత్య వసంతాల్ని ఏరుకొని తెచ్చి మధుర రహస్యంగా బిడ్డ హృదిలోకి ఊదేది' అమ్మ. 'నిద్ర పొత్తిళ్ల నిండా పాటల పరిమళాలు పరచి/ భావి జీవితానికి అత్తరు జవ్వాది బావు కతను నింపే వరదాయిని' అమ్మ. హృదయానికి హత్తుకోవడం వేరు. హృదయాన్నే గంపగుత్తగా ఇచ్చేయడం వేరు. 'అమ్మ' అనే పలుకులో ఇంత కమ్మదనం ఉంది కనుకనే కాళిదాసు కవిశిశువుగా జన్మ ఎత్తిన వెంటనే 'మాతా మరకతశ్యామా మాతంగీ...' అంటూ అమ్మ పదాలను పదే పదే పలవరించాడు. భారతీయుల ధర్మం ప్రకారం- తల్లిని మించిన దైవం లేదు. వెయ్యిమంది తండ్రులు, పదిమంది గురువులు అయినా తల్లితో సమానం కాబోరు. 


తల్లి ముఖం చూడని బిడ్డ వాన ముఖం తెలియని పైరుతో సమానం. 'చులకన జలరుహ తంతువు/ చులకన తృణకంకణము దూది చుల్కన సుమ్మీ/ యిల నెగయు ధూళి చుల్కన చులకన మరి తల్లిలేని సుతుడు కుమారా/' అని సూక్తి. తల్లి లేకనే త్రైలోక్య పతి తపసి అయ్యాడని 'బసవ పురాణం'లోని బెజ్జమహాదేవి బాధ. ' ఎన్నండు వచ్చునో చిన్నారి కందువుం గన్నార గాంచు బంగారు గడియ/ ముద్దారు మూర్తి యే పొద్దు నా ప్రక్కలో బొజ్జుండునో మేను పుల్కరింప' అంటూ కలవరించని తల్లి సృష్టి మొత్తంలో ఏ జీవరాశిలో కనిపించదు. కానరాని మహాశిల్పి లోన జేరి/ రాత్రింబ వళుల యందు విశ్రాంతి లేక సృజించే ఆ శిశు కళాచాతుర్యమే ఏ అమ్మ కైనా కళ. అమ్మను సృష్టించే వేళ బ్రహ్మ పడే హైరానా శారదమ్మకే ఆశ్చర్యం కలిగించిందని ఓ కవి భావన. 'రెండు జతల చేతులు.... మూడు జతల కళ్లు తగుమాత్రపు తిండితోనే బ్రహ్మాండంగా పనిచేయాలి గదా  మరి! ఊయలై పాపాయిని ఊపేందుకో చేయి, ఒంటికి లాలలు పోయడానికింకో చేయి, నోటికి బువ్వందించేందుకు వీలుగా మూడో చేయి, దిష్టి చుక్క పెట్టేందుకు నాలుగో చేయి. ముందు నుంచి చూసేందుకు రెండు కళ్లు, వెనకనుంచి కాచేందుకు మరో జత కళ్లు కరుణ మమతలు కురిపించేందుకు మూడో జత కళ్లు' అంటూ విధాత వివరించుకుంటూ పోతుంటే- శారదమ్మ కళ్లు పంట కాలువలై పారాయని ఆ కవి చమత్కారం. పానుగంటి వారు కల్యాణరాఘవంలో భావించినట్లు తండ్రిప్రేమది పారమార్థికపు చింత... బిడ్డప్రేమది ఐహికాపేక్ష... కట్టుకున్నవారిది కలకాలం తమకే దక్కాలన్న కాంక్ష... తల్లిదయలో ద్యోతకమయ్యేది మాత్రం శుద్ధ దివ్యతత్వమే.  జనని- చెడును పీల్చి మంచిని పంచే ప్రేమ'ధమని' అని వేటూరివారి చమత్కారం. 'నిన్నటిలో చీకటి తుడిచి, మనుగడలో మీగడ పరచి/ ముద్దులనే ముద్దలు కలిపి తినిపించే 'అమ్మ' ప్రేమ కమ్మదనం వ్యాసవాల్మీకులకైనా సంపూర్ణంగా పొగడతరం కానిది. బిడ్డ- తల్లికి 'కోరిక లుబ్బగా దిగిన కుచ్చుల పల్లిక (బుట్ట)' . తల్లి బిడ్డను 'కొండ కొమ్ముకు చేర్చే పల్లకి' . ఆవంత్స సోమసుందర్ భాషలో చెప్పాలంటే, 'రక్తంలో నిక్షిప్తమైన ఒక సుందర స్వప్నం అమ్మ'. తల్లీబిడ్డల అనుబంధాన్ని మించిన అందమైన కావ్యం, తల్లీ బిడ్డల్ని సృష్టించిన దైవం కూడా సృజించలేనిది. 'ఊపిరి ఉన్న చాలు కొడుకో గిడుకో ఎవరైన నొక్కటే/ చేపిన ప్రేమ జుర్రుకొను చిట్టి పెదాలెవియైన నొక్కటే/ లోపలి పేగు బంధమెదలో మెదిలే మమతానుబంధమున్ చూపెడి పాంచ భౌతిక రూపపు సృష్టిక ర్తగా/ అమ్మడో... గుమ్మడో... ఏ పసికూనయైన నొకటే' అనే అమ్మను మించిన చెలి, గురువు, చేయిపట్టుకుని నడిపించే మార్గ దర్శి- బిడ్డకు మరెక్కడైనా దొరుకుతుందా! కన్నతల్లి ఒడిలో ఒయ్యా రంగా కూర్చున్న చిన్నికన్నయ్య రూపాన్ని సంభావించుకున్న తర వాతే బమ్మెర పోతన మహాభాగవతాన్ని ఆరంభించాడు. ముఖా న్నెంత అరచేతులతో ఆదిమిపెట్టుకున్నా వేళ్ల సందుల గుండానైనా పొంగి పొర్లకుండా ఉండలేనిది 'అమ్మ' నది. నీరింకిపోవచ్చు ప్రవా హపు అచ్చులు శాశ్వతం. బిడ్డల జ్ఞాపకాలవెంట అలుపెరుగని పరుగే అమ్మకిష్టమైన ఆట. అమ్మ మెట్లమీద నుంచే ఏ ఆకాశ మైనా బిడ్డకు అందివచ్చేది. బిడ్డల సేవలో ముగ్గయిపోయినా తల మీది ఆకాశాన్ని తోసేయాలనిపించకపోవమే తల్లిదనం. బట్టకట్టే బిడ్డకోసం నెత్తురై ప్రవహించే తల్లికి ఏమి చెల్లిస్తే రుణం తీరేను?! నేడు మాతృదినోత్సవం. కవితలకు వస్తువుగా, ఉత్సవాలకు సందే శంగా సరిపుచ్చితే సరా! అమ్మను చదువుకుంటూ జీవితం నెగ్గితే చాలదు... అందరూ 'అమ్మ'ను తలచుకునే తీరులో ఎదగడమే బిడ్డ ఏ తల్లికైనా ఇచ్చే నిజమైన నివాళి.


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 13 -05 - 2012 ప్రచురితం ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...