ఈనాడు - సంపాదకీయం
పితృదేవోభవ!
రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సంపా - 12-06-2011 ప్రచురితం )
ప్రాణి భూమి పై పడకముందే భగవానుడు రెండు అవతారాలతో సదా సిద్ధంగా ఉంటాడన్నది సర్వమత సమ్మతమైన సిద్ధాంతం. ఒకటి అమ్మ అవతారమైతే, రెండవది నాన్న అవతారమన్న భావన... ఎంత ఉదాత్తం! దేవుడనేవాడే లేడనేవారైనా కాదనలేనంత కమనీయ భావన కదా ఇది! బాల ధ్రువుడు తండ్రి ఒడిచేరలేక ఖిన్నుడైన వేళ తల్లి సునీతి- అందరికీ తండ్రి ఆ శ్రీమన్నారాయణుడే అని హితోపదేశం చేసింది. తల్లి మాటల్లోనే దైవత్వానికి పితృత్వానికి మధ్యగల అద్వైత తత్వం ధ్రువుడికి బోధపడుతుంది. పితృవాక్పరిపాలనా మహత్యాన్ని లోకానికి చూపదలచే సాక్షాత్ ఆ భగవత్స్వరూపుడు దాశరథిగా దివి నుంచి దిగివచ్చాడన్నది వాల్మీకి రామాయణ సారం. తండ్రి ఆదేశం మీద కన్నతల్లి శిరచ్ఛేదనకైనా వెన్నుచూపని మరో పితృవాక్పరిపాలనా శిరోధారి అవతారం భార్గవరాముడిది. కన్నవారిని జన్మంతా కావడిలో మోసుకు తిరిగిన శ్రావణ కుమారుడినుంచి జన్మనిచ్చిన తండ్రికి తన యౌవన సర్వసాన్ని తృణప్రాయంగా ధారపోసిన పురూరవుడిదాకా మన పురాణాలు, ఇతిహాసాలలో తల్లులతో సమానంగా తండ్రులనూ సమాదరించిన సత్పుత్రులు కోకొల్లలు. 'ఎవరి వలన ఈ భౌతిక దేహం ఉనికి కొచ్చిందో... ఆ మూల ప్రేరకుడు సర్వజ్ఞమూర్తి సాక్షాత్ భగ వత్ స్వరూపుడు నన్ను కన్నతండ్రి. ఆ జీవదాతకు వేనవేల నమస్కా రాలు' అన్నది తైత్తరీయోపనిషత్ చేసే కన్నతండ్రి ప్రార్ధన. మాతను సర్వ అర్ధమయిగా భావించిన మన సంప్రదాయమే పితనూ సర్వదేవతామయుడిగా సంభావించిందన్న సంగతి ఈ తరం మరచిపోరాదు.
పేగు అమ్మదైతే పేరు నాన్నది. అమ్మఒడి గుడి అయితే నాన్న భుజం లోకాన్ని చూపే బడి . అమ్మ జోలపాట ఎలాగో నాన్న నీతి పాఠం అలాగ. వెరసి ఇద్దరూ పెద్దబాలశిక్షలోని పదాలూ అర్థాలూ. కాళిదాసు చెప్పిన వాగర్థావివ సంపృక్తా శ్లోకం పరమార్ధం ఇదే. గుండెల్లో దాచుకున్న అమ్మప్రేమ గొప్పదా, గుండెలమీద గుద్దినా కిమ్మ నక నవ్వే నాన్నప్రేమ గొప్పదా? జన్మనిచ్చిన బ్రహ్మకైనా జవాబు తోచని చిక్కు ప్రశ్న ఇది. అమ్మానాన్నల కలగలసిన అనురాగం అలా నిత్య జలంలా ఊరకబోతే బిడ్డ బతుకుబావి నిర్జలం కావడం ఖాయం. అదొక్కటే సత్యం. కన్నప్రేమకు కలతచెందిన ద్రాక్షాఫలం నల్లబడింది. కలకండ బండబారింది. అమృతం స్వర్గానికి పారిపోయింది- అని శ్రీ సుభాషిత రత్నావళి చమత్కారం. 'నాది' అని బిడ్డ భావించే ప్రతిదానికి పునాదిగా ఉండి సాధనకు తోడుపడేవి బాల్యంలో తండ్రితో కలిసి ప్రేరణ పొందిన మధుర క్షణాలే - అంటుంది మన స్తత్వ శాస్త్రం. మబ్బులు మూగితే సూర్యచంద్రులు, డబ్బులు పోతే బంధుమిత్రులు, ఓపిక ఉడిగితే కన్నబిడ్డలు కనిపించకపోవచ్చుగానీ... ఉన్నవేళా, లేనివేళా ఉండేది ఎంత వ్యాపార ప్రపంచంలోనైనా, కన్న వారి ఆశీర్వాదాలే! 'మా నాన్న ముందు హిమాలయం ఓ మంచుగుట్ట. హిందూ మహాసముద్రం ఓ పిల్లకాలువ' అని ఓ హిందీ హైకూ. చైనా 'బా' అయినా బాంగ్లా 'బాబా' అయినా, హిబ్రూ 'అబ్బా' అయినా, లోకంలోని ఏ నాయనకైనా- కన్నబిడ్డ తోడిదే లోకం. ఏ శాస్త్ర విశ్లే షణకైనా అందని ఆకర్షణా విశేషం ఆయనది. తనకన్నా మిన్నగా బిడ్డ తయారు కావాలన్న కలలు కనేదీ పోటీ ప్రపంచంలో ఒక్క కన్నతండ్రే. కాలం బాటమీద కనిపించని సాధకుడు ఎక్కు పెట్టిన బాణం బిడ్డడైతే, వంచిన విల్లు, వారి తల్లిదండ్రులు- అంటాడు. ఖలీల్ జిబ్రాన్. శర లక్ష్యసాధనకు శక్తిమేరా వంగటమే తల్లిదం డ్రులతనం. ఎంత వంగితే అంత ఆనందమనుకునే ఆ కన్నవారి రుణం బిడ్డ ఎన్ని జన్మలెత్తినా తీరేదేనా?
చిన్నతనాన నాన్న చెప్పుల జతతో తప్పటడుగులతోనే ఏ బిడ్డ యినా జీవిత పరుగుపందెం ప్రారంభించేది. గెలుపు వడుపు నేర్పిన తండ్రి తలపే చిన్న తనమనిపించే పెద్దరికం ఎవరి ఉద్ధరణ కొరకు? ' సర్వమతములకు సమ్మతమైన పేరిడి/ నిన్ను పెంచిన వారెవరే? ' అని త్యాగయ్యలాగా ఎవరైనా అడిగితే తటాలున వేలు చూపాల్సింది. . ముందు పాలిచ్చి పెంచిన తల్లినీ, పిదప తన జీవితంలోని పాలు ( వాటా ) ఇచ్చి పోషిం చిన తండ్రినే గదా! మరి వెన్న అరచేతిలో ఉన్నా నేతికోసం వెతుకు లాడే మితిమీరిన తెలివితేటలు నేటితరంలో దేనికి సంకేతం? 'అమ్మాయయ్య యటంచు నెవ్వరిని నేనన్నన్ శివా! నిన్నే సుమ్మీ' అన్న ధూర్జటి తరంనుంచి 'అమ్మా లేదు... నాన్నా లేడు... ఏక్ 'నిరంజన్' అని శోకన్నాలు పెట్టడమే పెద్ద నాగరికత అనుకునేదాకా మనం సాధించిన ప్రగతి నిజానికి పురోగతా, తిరోగతా? సత్కుటుం బంలో పుట్టి చెడు నడతలు పట్టిపోయే పట్టికి పది హేడుమంది పరమ మూర్ఖుల్లో ప్రథమ తాంబూలమిచ్చింది మహాభారతం. జన్మ నివ్వడం, ఉపనయనం, చదువు చెప్పడం, తిండి పెట్టడం, భయం పోగొట్టడం పంచప్రాణ లక్షణాలని చాణక్య నీతి. ఆ పంచప్రాణాలను పంచి, పెంచి, పోషించి తనను మించినవాడిగా తయారుచేయడానికి తపించే తల్లిదండ్రులను పెద్దతనంలో పంచకో, పంచుకొనేటందుకో మాత్రమే బిడ్డలు పరిమితం చేయడం దారుణం. చిట్టిచిట్టి చేతులు పట్టి లోక చిత్రాలను చూపించిన కన్నవారి చేతులు పిన్నవారికోసం చివరి శ్వాసదాకా అలా ఆశగా చాచే ఉంటాయి. ఆ చాచిన చేతుల్లో బిడ్డ లేకపోవడాన్ని మించిన శోకం ఈ లోకంలో తల్లిదండ్రులకు మరేదీ ఉండదు। ఇహపరాలు సాధించే హితమిచ్చిన కన్నవారు కనిపించినప్ప ప్రతిసారీ కన్నీళ్లతో కాళ్లు కడగ పనిలేదు కానీ- వారి కంటిలో చివరి క్షణందాకా నీటిచుక్క ఊరకుండా చూసుకుంటే చాలు... అదే పున్నామ నరకాన్ని తప్పించినంత సంతోషం. పితృదినోత్సవంనాడే కాదు. ప్రతి క్షణం అలా నడుచుకునే పిల్లలున్న తల్లిదండ్రులకు జీవితమంతా నిజంగా ఒక ఉత్సవమే.
రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సంపా - 12-06-2011 ప్రచురితం )
No comments:
Post a Comment