ఈనాడు - హాస్యం
తీరం దాటని తుఫాను
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం - 20 -05 - 2003 న ప్రచురితం )
మంగళవారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారానికల్లా బలపడి గురు వారం తమిళనాడు తీరాన్ని తాకటంతో ఆంధ్ర ప్రదేశ్ లో పెనుతుపాను మొదలయింది. 'గాలులు మాకూ... వానలూ తమిళనాడుకూనా ' అని ఆంధ్రులు ఆవేశంతో ఊగిపోతున్నారు.
' ఇది ప్రభుత్వ వైఫల్యం... కడలూరులో వానలు పడకుండా ఆపలేని అసమర్థ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి' అని కాంగ్రెస్ విరుచుకుపడింది.
ఆంధ్రాలోని అనావృష్టిని... తమిళ నాడు అతివృష్టిని పార్టీ హైకమాండ్ ఖండించింది.
రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి ప్రపంచ బ్యాంకు ఆదేశానుసారం తుఫానుని తమిళనాడుకు తరలించిన చంద్రబాబు చర్యను తీవ్రంగా నిరసిస్తూ విశాఖపట్నం నుంచి మచిలీపట్నం దాకా మానవహారం నిర్మించాలని వామపక్ష ప్రగతిశీల ప్రజాస్వామ్య లౌకిక శక్తుల ఐక్య సంఘటన పిలుపు నిచ్చింది .
'తుపాకులతోనే తుపానులు సాధ్యం' అని వార్ తూర్పు దిక్కు పడమర శాఖ కోర్ కమిటీ ఒక కరపత్రంలో ప్రకటిస్తూ 'ఆంధ్రా బంద్' అంది.
తూప్రాను మున్సిపాలిటీ భవనం మీద నుంచి ఒక పౌరుడు డిప్రెషన్తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రాష్ట్రం అంతటా ర్యాలీలు, ధర్నాలు రాస్తారోకోలు... వాతావరణం తుపాను తరువాతి పరిస్థితికన్నా అస్తవ్యస్తంగా ఉంది.
'మిత్రపక్షాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా ఏకపక్షంగా తుపానులనిలా పొరుగు తీరాలకు తరలించటం ప్రభుత్వానికి తగని పని. సముద్రంలో మళ్ళీ ఇప్పటికిప్పుడు తుపాను సృష్టిం చటంలో కేంద్రానికెన్ని ఇబ్బందులున్నాయో కనుక్కోవాలి' అంది మిత్రపక్షం గోడమీది పిల్లివాటుగా.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వమూ ఒక ప్రకటన చేయా ల్సొచ్చింది. 'తుపాను హెచ్చరిక కేంద్రాన్ని అనేకసార్లు హెచ్చ రించాం. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ అనర్థం జరిగింది. నివేదిక అందిన తరువాత అదే రుజువవుతుంది. తుఫాను రాజకీ యాలు మంచివి కాదు. తుపానుగాలి బాధితులకు అన్నివి ధాలా ప్రభుత్వం సహాయ పడుతుంది' అని హామీ ఇచ్చింది.
'తుపాను జన్మభూమిని నిర్వహించుకుందాము. అవగాహన సదస్సులను ఏర్పాటు చేసుకుందాము. వీడియో కాన్ఫరెన్సుల ద్వారా నేను ప్రతి క్షణమూ తుఫాను పరిస్థితిని సమీక్షిస్తుం టాను. ఆవిధంగా మనం ముందుకు పోదాం ' అంటూ ముఖ్యమంత్రి ప్రజలతో ముఖాముఖీలో ప్రకటించారు.
బందరు ఓడరేవులో అధికారులు సమయానికి రెండో నెంబరు జెండా కనపడక తెలుగుదేశం జండా ఎగరేశారని, అందువల్లే తీరందాకా వచ్చిన తుపాను అలిగి గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయిందని అఖిలపక్ష కమిటీ నిజనిర్ధారణ చేసింది.
తొందరలో ఎన్నికలున్నందువల్లనేమో తుపానుకు ముందే ఈసారి కేంద్రబృందం రాష్ట్రంలో పర్యటించి పరిస్థితుల్ని అంచనా వేసిపోయింది.
తుపాను గాలి బాధితుల సహాయనిధికి పంపే విరాళాలకు పన్నుపోటు ఉండదని ఆదాయపు పన్ను శాఖ ఆనందంగా ప్రకటించింది.
సముద్రంలోకి వెళ్ళకుండా పస్తులుంచినందుకు నష్టపరిహారంగా ఉచితంగా బ్యాంకు రుణాలిప్పించి ఆదుకోవాలని అఖిల భారత ఆంధ్ర కోస్తా మత్యకా రుల సంఘం డిమాండు చేసింది.
రాహుకాలంలో పుట్టిన వాయుగుండు ప్రభుత్వానికి యమగండంగా మారనున్నందున పక్షం రోజులు భగవాన్ శ్రీ ముక్తేశ్వరస్వామివారి ఆశ్రమంలో శాంతి యజ్ఞం నిర్వహించనున్నా మని... భక్తులు విరివిగా పాల్గొని విరాళాలు సమర్పించుకోవచ్చని బ్రహ్మశ్రీ ధనానంద స్వామి విజ్ఞాపన చేశారు.
తుఫాను రావాల్సిన దినాలలో కార్యాలయాలు తెరిచి ఉంచినందుకు నష్టప రిహారం కింద అదనపు జీతంతోపాటు తుపానుభత్యం కూడా ఇవ్వాలని ప్రభుత్వోద్యోగుల సమన్వయ సంఘం ముఖ్యమంత్రి కి మెమోరాండం సమర్పించింది. నిబంధనల ప్రకారం సైక్లోన్ రిలీఫ్ రుణాలిచ్చే దాకా 'వర్క్ టు రూల్' పాటిస్తామని కూడా హెచ్చ రించింది.
ఈ సందర్భంగా 'సైక్లోస్ క్లోనింగ్ సబబా...!' అనే చర్చను భారతీయ సంస్కృతి విలువల పరిరక్షణ సమితి చేపట్టింది.
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తుపానులు అవసరమా . . కాదా - అనే అంశం పై ఇంటర్నెట్లో పోలింగ్ పెడితే 'చెప్పలేమని' తొంభైయ్యెనిమిది శాతం చెప్పారు.
తుఫాను తమిళనాడు తీరంనుంచి ఒరిస్సా వైపు కదులుతున్నదన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మొత్తంలో పాకిస్థాన్ ఐ.ఎస్.ఐ. హస్తమేమైనా ఉందేమో సమగ్రంగా పరిశీలించాల్సుందని కేంద్ర హోం శాఖ అభిప్రాయపడింది.
'తుఫాను కదలికల విషయంలో మూడో శక్తి జోక్యం సహించేది లేదన్న మన విధాన ప్రకటనకు ఆమె రికా ఆమోదంకోసం ఎదురుచూస్తున్నాం' అని విదేశీ వ్యవహా రాల శాఖ ప్రకటించింది.
తుపాను పరిస్థితులను అధ్యయనం చేయటానికి అన్ని రాజ కీయ పార్టీల సభ్యులతో కూడిన ఒక నిపుణుల కమిటీ జపానులో తుఫాన్ పర్యటనకు బయలుదేరి వెళ్ళింది.
మూడో రోజే జపాన్ ప్రధానమంత్రి నుంచి ఫోన్... దయచేసి మీ పర్యటన బృందాన్ని వెనక్కి పిలిపించండి బాబూ ! కావలిస్తే తుఫాను గాలినే పంపించండి. దానికైతే ఏదయినా నేర్పించగ లమ'ని గోల.
బృందంలోని మంత్రివర్గ సభ్యులు ముఖ్యమంత్రిని విడిగా కలిసినప్పుడు 'తుపాను సృష్టించటం కష్టం. వదంతిని పుట్టించడం తేలిక. వచ్చే ఎన్నికల్లో మనం నెగ్గాలంటే కచ్చితంగా జనం దృష్టిని మళ్లించాల్సిందే. తుపాన్ని మళ్ళించిన ఘనుడెవడో తెలిస్తే బాగుణ్ణు.. ఉపాయం కనుక్కోవచ్చు' అవి రహస్య నివేదిక అందించారు.
ముఖ్యమంత్రిగారు ముసిముసిగా నవ్వారు 'బందరు రేవులో రెండో నంబరు జండాను దాచిపెట్టిందెవరనుకున్నారూ!... తెలుగుదేశం జండా చూస్తే ఎంత భయంకరమైన తుఫానైనా వెనక్కి తగ్గుతుంది మరి!' అన్నారు.
మంత్రుల మొహంలో ఆశ్చర్యాభినయం.
'నువ్వెప్పుడూ ఇట్లాంటి తిరకాసు కబుర్లే అల్లుతావురా.... తుపాను తప్పినందుకు రాష్ట్రంలో సంతోషపడ్డ వాళ్ళే లేరా? ' అనడిగాడు సంతోషరావు చిరాగ్గా.
'ఎందుకులేరోయ్...? జిల్లా యంత్రాంగం.. మినరల్ వాటర్ అండ్ బాటిల్ వ్యాపారస్తుల సంఘం మరీ ముఖ్యంగా మేడమీద వడియాలారేసుకున్న మా బామ్మ... అలిండియా రేడియో...
'చివర్లో ఈ రేడియో ఎందుకూ?!'
' తుఫాను సమయంలో ఆకాశవాణివారు ప్రసారం చేసిన వాతావరణ సూచనలు ఉత్తమ వినోద కార్యక్రమంగా గుర్తించి కేంద్ర సమాచార శాఖ అవార్డు ఇవ్వబోతొంది .. అందుకూ..!
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం - 20 -05 - 2003 న ప్రచురితం )
No comments:
Post a Comment