ఈనాడు- సంపాదకీయం
రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - 06 -09-2012 న ప్రచురితం )
నీరే ప్రాణాధారం
ఈనాడు- సంపాదకీయం
రచన: కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - 06 -09-2012 న ప్రచురితం )
నీరే ప్రాణాధారం
కొంతమేర తామరలు, కొంతమేర నల్లకలువలు, కొంతదూరం రెండూ కలిసి, కొన్నిచోట్ల వాటి పుప్పొడులు కలగలిసి.... అద్దంలా నిర్మలంగా ఉన్న గంగ సౌందర్యాన్ని రామాయణంలో వర్ణించే వేళ వాల్మీకి మహర్షి వెర్రెత్తిపోయాడు. ఏమీ తెలియని పసితనంనుంచి అన్నీ తెలుసుకుని అనుభవించిన ముదిమితనం దాకా నీరు అంటే ప్రాణం పెట్టని మనిషి లోకంలో ఉండడు. సర్వ జీవరాశులకు గాలి తరువాత నీరే ప్రధాన ప్రాణావసరం. ఆ తరవాతే ఆహారం. భూగోళంమీద మూడువంతులు నీరే. మనిషి శరీరంలో మూడింట రెండువంతులూ నీరే. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలమ్ నాందీ శ్లోకంలోనే 'యా సృష్టిః స్రష్టు రాద్యా' అన్నాడు. బమ్మెరపోతన మహాభాగవతం రెండో స్కంధం ప్రకారం నీరు అగ్నిజ. భూమి పుట్టింది నీటినుంచే. తల్లి లేనిదే బిడ్డ లేదు. నీరు లేనిదే భూమి లేదు. భూమి పై జీవరాశులూ లేవు. జీవాన్నిచ్చేది కనుకనే నీరును 'అమృతం' అన్నారు. తిరువళ్ళువర్ తిరుక్కరళ్ కావ్యాన్ని దైవస్తుతి అనంతరం వర్షరుతువు తోనే ప్రారంభించారు. 'వాన గురియుట చేత నిర్మిలు జగతి/ - కాన అమృత మగుగాదె వర్షమ్ము' అంటుంది తిరుక్కరళ్. ఇంత ముఖ్యమైన నీరు ఉత్తి పుణ్యానికి భువికి దిగిరాలేదు. అనంతమైన తపస్సు, శ్రమ, సంఘర్షణల సనాతన పురాతన సుదీర్ఘ ఇతిహాసం నీటిది. ప్రాణులకు పరమ శత్రువైన వృత్రుడు దుష్టబుద్ధితో సమస్తాన్నీ కట్టిపడేస్తే... ఇంద్రుడు కలగజేసుకుని ముందుగా జలవిబంధన చేయించాడని రుగ్వేదం సూక్తి. ముత్తాతల ముక్తికి సురగంగను భువనానికి మోసుకొచ్చిన భగీరథుడి ప్రయత్నం అందరికీ తెలిసిందే. సృష్టికర్త తోయజ సంభవుడు. అల్ప ప్రవాహం నుంచి వర్ష జలధార దాకా పది హేను యజుస్సుల్లో జలరూపాలకు నమస్కారం చెప్పారు రుషులు.
'నీరు కేవలం జలధారే కాదు, అందాల బిందు సందోహం. సౌందర్యలహరి సౌకుమార్య ప్రవాహం. క్రూరమైన వరద' అంటారు దాశరథి రంగాచార్య. శ్రీకాళహస్తి మాహాత్మ్యంలో ధూర్జటి మహాకవి 'హంస సంసదభీష్ట విహారహేతు/ వై బహూ దక హృద్యమై యప్ర తర్క్య/ మగుచు నద్వంద్వమై పంకజాక రంబు పొలిచె' అంటూ సరోవరాన్ని సంపూర్ణ పరబ్రహ్మ తత్వంతో పోల్చాడు. శివాగ్రహ దగ్ధుడు నత్కీరుడు ముక్తిసాధన కోసం చేసే తీర్ధయాత్రల మధ్యలో ఒక విచిత్రమైన సెలయేరును చూస్తాడు. ఒడ్డునున్న మర్రివృక్షం పండుటాకులు ఆ నీటిలో పడి మీనాలుగా, వెలుపల పడి విహంగాలుగా, అటూ ఇటుగా పడి మీనపక్షులుగా రూపాంతరం చెందే వింత కంటబడుతుంది. ఇది వినడానికి విచిత్రంగానే ఉన్నా... సర్వ జీవాల మీద జలప్రభావ విశేషాన్ని హృద్యంగా చిత్రించిన పద్యంగా భావించాలి. పారిజాతాపహరణంలో శ్రీకృష్ణుడు సత్యభామకు స్వర్గాన్ని చూపించే సందర్భంలో 'దరిజేరన్ రాక యుప్పొంగు' సంసారాన్ని అంబోనిధితో పోల్చాడు. నీటికి మనిషికి మధ్యగల బంధం అంత బలమైనది . కాబట్టే భారతంలో సైతం శకుంతల 'నుతజల పూరితం మాత్రులు సూరిటి కంటె సూనృతవ్రత యొక్క బావిమేలు' అంటుంది దుష్యంతుడితో. ప్రజలకు జలసౌకర్యం కలిగించడం పాలకుల ప్రధాన నిధుల్లో ప్రముఖమైనది. ఒకనాటి ధనవంతులు స్వచ్ఛందంగా పెద్దపెద్ద తటాకాలు తవ్వించిన దాఖలాలు నేటి తవ్వకాలలో సైతం తరుచుగా బైటపడుతుంటాయి. నీరు లేనిదే ఊరు లేదు. ఊరు లేనిదే రాజు లేడు . ఇప్పుడు ఎడతెగక పారు యేరు ఊరు ముఖ్యావసరాల్లో ఒక్కటిగా సుమతీ శతకకర్త ఏకాడో గుర్తించాడు.
నాగరికతలు వెల్లివిరిసింది నదీతీరాల వెంబడే . నీరు సామ్రాజ్యాల ఉత్థానపతనాలకు, జ్ఞానమార్గాలకు సాక్ష్యమో! ఎత్తు పల్లాలను తెలిపే నిమ్నగ నీరు. కంటికి కనిపించేది.. కనిపించకుండా తేమరూపంలో గాలితో కలిసి ఉండేది కూడా నీరే! శరీరం బరువులో అరవై అయిదు శాతం నీటిదే. నీరు లేనిచే ఎముకలకు, దంతాలకు దృఢత్వం రాదు. చర్మానికి తేజస్సు, మస్తిష్కా నికి చురుకు నీటి పుణ్యమే. దేహంలోని బ్రహ్మనాడి ద్వారా నోట ఊరే లాలాలమూ నీరే - అంటుంది యోగశాస్త్రం . గుంతలక్ష్మమ్మ పేర ఇంటి ఈశాన్యంలో తవ్విన గుంతకు పసుపు కుంకుమలతో పూజించే సంప్రదాయం ఒకనాటి మన తాతలది. ఈనాటి ఇంకుడు గుంతల ఆలోచనకు ఆ అచారమే పునాది కావచ్చు. బావి లేని పెరడు ఉండేది కాదు ఇటీవలి కాలం దాకా. ఏరు ఎండిపోయినా దాని మధ్య నున్న ఇసుక తిన్నెలో గుంత తీస్తే పానకం వంటి నీరు చెలమ నుండి ఊరుతుండేది . మతిలేని జల విధానాలతో భూగర్భం పూర్తిగా ఎండిపోతున్న దుస్థితి ప్రస్తుతం మనది. ముంతలోని నీరు ఒలక పోసుకొని మేఘాల వంక మోరెత్తి చూసే పరిస్థితి దాపురించింది. చంద్రమండలంమీదో .. అంగారక గ్రహ గర్భంలోనో నీటిజాడల కోసం చకోరాకు మల్లే ఎదురు చూస్తూ కూర్చుంటే గొంతు తడుస్తుందా? గాలిలోని తేమ నుంచి నీటిని తయారుచేసే క్రియను మార్క్ పేరెంట్ అనే ఫ్రెంచ్ నిపుణుడు కనుగొన్నాడు. కరీబియన్ దీవుల్లో ఉన్నప్పుడు, కనీస అవసరాలకు నీరు లభ్యం కాక ఆయన చేసిన పరిశోధనల సత్ఫలితం అది . ఒక యూనిట్ తేమ గాలి నుంచి వెయ్యి లీటర్ల నీరు తేలికగా తయారు చేసే ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి వస్తే నీటి సమస్య సగం తొలగిపోతుందని, వలసలు తగ్గుముఖం పడతాయని మార్క్ ఆశాభావం. శుభం.
- రచన: కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - 06 -09-2012 న ప్రచురితం )
No comments:
Post a Comment