ఈనాడు - సంపాదకీయం
మొక్కై వంగనిది...
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈ నాడులో ప్రచురితం)
తనయుడు అన్నా తనూజ అన్నా తనలోనుంచి జన్మించినవారనే అర్ధం. పున్నామనరకం నుంచి తప్పిస్తారనే కాదు, పుడమి మీద తమ పేరు నిలచెడతారనేదీ బిడ్డల కోసం తల్లిదండ్రులు పడే తాపత్రయం . చంద్రుడు రాత్రికి వెలుగు, సూర్యుడు పగటికి వెలుగు. ఇంటి దీపాలవంటి బిడ్డలు రేయింబవళ్ళు కంటికి వెలుగు. తైత్తిరీయోపనిషత్ 'మాతృదేవోభవ... పితృదేవోభవ' అని చెబుతుంది. తల్లికి సేవచేసే వేళ వచ్చిన తన ప్రత్యక్షదైవం రంగడిని ఓ పక్క ఇటుక రాయిమీద కూర్చోబెట్టేశాడు పుండరీకుడు. మాతాపితల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి గణాధిపత్యం సాధించుకు న్నాడు వినాయకుడు. తల్లిదండ్రులకన్నా మన హితం కోరుకునే వారు ఎవరూ ఉండరు. పుట్టిన బిడ్డను గంగార్పణం చేస్తూ తొట్టె లోని పొత్తిళ్ళు పసికందుకు ఎక్కడ వత్తుకుంటాయోనని వ్యాకులపడే మాతృహృదయం 'కుంతీకుమారి'లో కరుణశ్రీ కలం ద్వారా కళ్ళు చెమర్చేలా వర్ణితం. తండ్రి ప్రేమకు దశరథుడు ప్రతిరూపమైతే, తల్లి వాత్సల్యానికి యశోదమ్మ ప్రతీక. 'ఓయమ్మ! నీ కుమారుడు మా ఇండ్లను పాలుపెరుగు మననీడమ్మా!' అంటూ ఇరుగుపొరుగు అమ్మలక్కలొచ్చి కొండేలు చెబితే ఎంత ప్రేమ ఉన్నా బిడ్డను దండించకుండా ఉండలేకపోయింది ఆ తల్లి. గాంధారీ ధృతరాష్ట్రు లకు మల్లే గుడ్డిగా గారాబంచేసి బిడ్డలను ఎవరూ చెడగొట్టుకోవాలనుకోరు. తోటకూరనాడే తప్పు అని చెప్పనందుకు కొడుకుచేతే ముక్కు కొరికించుకునే దౌర్భాగ్యం పట్టకూడదనుకుంటే- మొక్కగా ఉన్నప్పుడే బిడ్డ చెడును తుంచాలి. నిదానంగానైనా భారవిలాగా బిడ్డలు పెద్దల మనసునర్ధం చేసుకుంటారు.
చేపను చూసి నీటిలో, పక్షిని చూసి గాలిలో తేలే మనిషి నేల మీదా మనిషిలాగే బతకాలని మన తాతలు బోలెడన్ని నీతులను పురాణాలు, ఇతిహాసాలుగా మలిచి చెప్పారు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో కణ్వమహర్షి- శకుంతలను దుష్యంతుని వద్దకు పంపుతూ మెట్టినింట ఎలా మెలగాలో కళ్ళకు కట్టినట్లు చెబుతాడు. దీనిని తెనిగించిన పిల్లలమర్రి పినవీరభద్రుడు కన్యకా ధర్మాలను ఎనిమిది పద్యాల్లో అత్యంత హృద్యంగా వర్ణించాడు. పిల్లను అత్తా రింటికి అంపకాలు పెట్టేవేళ 'నీతివాక్యములను నిర్మించి చెప్పెద ఖ్యాతితో నుండుము నాతిరో నీవు!' అంటూ తల్లి సుద్దులు చెప్పే చక్కటి సంప్రదాయం మనది. అప్పలనరసింహకవి తేటతేట తెలుగులో బాల బాలికలకు బతుకుబాటలో ఎలా నడుచుకుంటూ ముందుకు సాగాలో కుమారశతకం, కుమారీశతకంలో చెప్పుకొచ్చాడు. 'అమ్మకు రెండబ్బుకు రెండిమ్మహి దిట్టించు కూతురెందుకు; ధరనా దిమ్మరి పుట్టకపోయిన నిమ్మళమని యండ్రు జనులు' అంటూ ఆడపిల్లకూ, 'తనయుడు చెడుగై యుండిన జనకుని తప్పన్న మాట సత్యమెఱుగు గావున నీ జననీ జనకులకు నపఖ్యాతియగు రీతి గొనకు' అంటూ మగపిల్లవాడికి ఎన్నో నీతులు బోధించాడు. జోల పాటల నుంచి, ఉగ్గుపాటల దాకా, గోరుముద్దల దశనుంచి కోర మీసం ఎదిగేదాకా బిడ్డ- ప్రతి అడుగులో మంచిచెడ్డలను తరిచి చూసే మంచి కుటుంబ సంప్రదాయం మన సొంతం. పాల్కురికి సోమనాథుడి బసవపురాణంలో బెజ్జ మహాదేవి శివుడిని తన శిశు వుగా భావించి బాల్యోపచారాలు చేసే తీరు చూస్తే, ఆనాటి తల్లుల
మమతానురాగాలు ఎంత విశాలంగా ఉంటాయో తెలిసి ఒళ్ళు పుల కరిస్తుంది. రాయి రప్ప, చెట్టు పుట్టలలో సైతం దైవత్వాన్ని కనుగొ ని అమృతతుల్యమైన మాతృ వాత్సల్యాన్ని చూపించే తత్వం భార తీయత్వం. బిడ్డలను ప్రయోజకులుగా సాకే మెలకువలను ఉగ్గు పాలతో పట్టించేదే తరతరాల మన ఘన సంస్కృతీ వారసత్వం!
ప్రపంచం చిన్నదైపోతున్నా మనిషి మనసు చిన్నదైపోరాదు. పండుటాకుల్లాగా మారి రాలిపోయేదాకా తల్లిదండ్రులను గుండెల్లో పెట్టుకునే మన నిండు కుటుంబ వ్యవస్థను వదులుకుని అవస్థల పాలు కావటం వివేకం కాబోదు. కాటికి మోసుకుపోయే వేళా మనిషి తిరిగొస్తాడేమోనని దింపుడు కళ్ళెం పేరుతో ఆశపడే ప్రేమలను కాదనుకుంటే మనకీ బండరాయికీ తేడా ఏముంటుంది? పెద్దరికాన్ని హేళనగా చూడటం, ఆడపిల్లలను ప్రేమ పేరుతో ఏడి పించటం, చిన్న కారణాలకే ప్రాణాలు తీయటం, తీసేసుకోవటం, డబ్బుకోసం ఏం చేసినా తప్పు కాదనుకోవటం, చూసినదంతా తానొ క్కడే అనుభవించేయాలని ఈ తరంలో ఎక్కువమంది యావపడుతున్నారనేదే పెద్దల ఫిర్యాదైతే- ఆ పాపంలో సింహభాగం వారిదే. ఏమి చేసైనా సరే సంతానాన్ని అమెరికా తోసేయటానికి చదివిస్తు న్నామే గానీ... మంచి పౌరుడిగా మలిచే విద్యాబుద్ధులపై శ్రద్ధ పెడుతున్నామా? మొక్కై వంగనిది మానై వంగునా అన్నది నానుడి. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియని తల్లిదండ్రులు చిన్నారు ల దృష్టిలో కేవలం ఏటీఎం (ఎనీటైం మనీ)లుగా మిగిలిపోతున్న దుస్థితి ఇప్పుడుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, విడాకుల కారణంగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి చెంతే పిల్లలు పెరగాల్సి రావడం- పెంపకాన్ని సమస్యగా కాదు, సామాజిక సంక్షోభంగా మార్చేస్తోంది. పిల్లలను పెంచడంపై ప్రత్యేక కోర్సులు ప్రారంభిం చిన విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలోనే మదురై కామరాజ్ యూనివర్శిటీ సైతం- అమ్మానాన్నలుగా ఎలా వ్యవహరించాలో దూరవిద్యద్వారా బోధించనుంది. చైనా నమూనాలో చెప్పనున్న చదువు భారతీయ బుడతల్ని ఎలా దారిన పెడుతుందో చూడాలి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన ఫలితంగా మొగ్గ తొడిగిన ఈ రుగ్మత- మానవీయ సంబంధాలను మళ్ళీ ముడివేసుకోవడం ద్వారానే నయం కాగలదన్న స్పృహ కలిగేదాకా పెంపకం పాఠాలను బట్టీయం పట్టాల్సిందేమరి!
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు- సంపాదకీయం - తేదీ నా నోట్సులో నమోదు కాలేదు )
No comments:
Post a Comment