ఈనాడు - సంపాదకీయం
నవరసాల వాకిళ్లు - కళ్లు
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - తేదీ నా నోట్స్ లో నమోదు కాలేదు )
ఆది దేవుడు మూడు కన్నులవాడు. మూడు కన్నులకు మూడు మూలార్థాలు. ఓ కంట వైభోగం, ఓ కంట వైరాగ్యం, రెండింటికి నడుమ పైనున్న నెన్నుదుటినంటిన కంట- కైవల్యం. త్రినేత్రుడి త్రికోణ దృక్కిరణ సంపుటే సంసార సారం అంటారు వేదాంతులు. వాల్మీకి రాముణ్ని 'రాజీవలోచనుడు'గా ఊహిస్తే, పోతన కృష్ణుణ్ని పద్మ నయనంబులవాడు'గా ఊరించాడు. 'కమలేశు జూడని కన్నులు కన్నులే తను కుడ్య జాల రంద్రములు(శరీరమనే గోడకున్న కన్నాలు) గాక' - అన్నంతదాకా పోయింది పోతున హరి భక్తి పారవశ్యం . ' కన్నీళ్ల రుచి తెలియకుండా కావ్యాలు రాయలేరెవరూ' అంటారు 'రుద్రాక్షలు' అనే కావ్యంలో తిరుమలవారు. నిజం. కంటికి ఇంత సూదంటుతనము ఉండబట్టేనేమో- మనుజేశ్వరాధములకు తనను అమ్మవద్దని చదువులమ్మ గుమ్మంమీద చేరి కుమిలిపోయిన వేళా పోతన చూపు తల్లి ' కాటుక కంటి ' వెంటే అలా పరుగులు తీసింది. 'జంట నేత్రము లంటి చూచితే జాజిపూవులు పూచెరా/ కంటిలో నొక పండువెన్నెల కాయుచున్నది యేమిరా!' అంటూ కందుకూరి రుద్రయ ప్రసిద్ధ జనార్దనాష్టకం నిండా దనుజ మర్దనుడి నయన తారా విలాసాలు ఎన్నని! లౌకికులకు నేత్రద్వయం కార్యక్షేత్ర సింహద్వారమైతే... భావుకులకు అవే కళ్లు నవరసాలకు వాకిళ్లు. జంటకవులు పింగళి- కాటూరి మేలిమి పంట ' సౌందరనందం'లో సుందరీనందుల సరాగస్థాయిని వర్ణించే ఓ సందర్భం ఉంది. ఎర్రనెరల(ఎర్రజీరల) నందుని చూపు లింతియా/ నేందునకు గెంపుల నివాళులెత్త, సతివ/ కజ్జలపు (కాటుక) చూడ్కి ప్రియుని వక్షః కవాటి/ గట్టు దోరణములు' - నల్ల కల్వపూల ప్రేమ ప్రారంభానికి కంటిచూపులే గదా నాంది? 'ఏటిలోని అలలు వంటి కంటిలోని కలలు కదిపి/ ఉప్పొంగిన ఉల్లములో' భావుకత్వం సృష్టించే తెప్పల థిల్లానాలను ఇలా చెప్పుకొంటూ పోతుంటే అదే ఓ బృహత్ దృష్టి కావ్యమైపోతుంది.
కంటిచూపులన్నీ ఒకేంకంగా ఉండవు. సమం, అలోకితం, సాచి, ప్రలోకితం, నిమీలితం, ఉల్లోకితం, అనువృత్తం, అవలోకితం- అనే అష్ట విధానాలే కాదు నాట్యశాస్త్ర నిర్వచనాలకు అందని చూపులు ఇంకెన్నో ! వసురాజు చిలిపి చూపులకు సిగ్గు సముద్రంలో మునిగి మోహావేశాన్నాపుకొన లేక తన మనోహరుడి వైపు వసుచరిత్ర గిరికాదేవి చూసిన ' లజ్జా మదనా మధ్యావస్థ' చూపు ఒకరకం. దర్బ ముల్లు కాలికి గుచ్చుకున్నదన్న మిషతో నిలిచి ధీరోదాత్తుడు దుష్యంతుడి ఉక్కుగుండె సైతం తుక్కు తుక్కయేలా కాళిదాసు- శకుంతల చూసిన ఓరచూపులు ఇంకోరకం. లతా విటపానికి(కొమ్మకు) ఏకావళి(ఒంటి పేట హారం) తగులుకొందన్న వంకతో ఊర్వశి పురూరవుడి ఎదమీదకూ అదేరకం మదనాస్త్రాన్ని దిగ్విజయంగా ప్రయోగించింది. జగన్నాథుడే అల్లుడయాడని ఉల్లాసపడే తల్లిదండ్రులకు పుత్రశోకం మిగల్చవద్దని యదువల్లభుడిని రుక్మిణి 'జడిగొన్న బాష్పములతో చూసిన ప్పటి చూపు' మరో రకం. కార్యసాధన కోసం స్త్రీలు కంటినే పదునైన కొరముట్టుగా వాడుకుంటుంటారని ఓ అపవాదు. చడీ చప్పుడు లేకుండా లక్ష్యాన్ని సూటిగా ఛేదించాలంటే కళ్లు రువ్వే నవ్వు పువ్వు లను మించిన మంచి సాధనం మరొకటి లేదు. కాంత కన్ను కల్లు పోస్తుందని నానుడి కనకనే ఆమె 'మదిరాక్షి' అయిందని ఓ రసికుడి చమత్కారం. మాటలు చాలని చోట మహామహా కవులే కంటిచూపులతో సరిపెట్టుకున్న సందర్భాలు అన్ని భాషా సాహిత్యాలలో బో లెడన్ని. సైరంధ్రిని కూర్చమని వేధించే సోదరుడిని వారించలేక ఒక వైపు, నీతి బాహ్యమైన పనికి సాటి స్త్రీని బలిపెట్టలేక మరోవైపు విరాటరాణి సుధేష్ణ పడే మనోవేదనను వర్ణించడానికి కవిబ్రహ్మ తిక్క నకే మాటలు చాలలేదు. 'అశ్రుపూరము కనుగొనలో మ్రింగికొనుచు ' అంటూ కంటి వర్జనతో సర్దుకునిపోవలసి వచ్చింది. వ్యాసుడైనా, కాళిదాసుడైనా కంటిభాషను మించిన వ్యాఖ్యానం చేయలేరు.
వెంటబడి వేధించే తుంటరి ఓ పిచ్చి కూత కూస్తే... పెదాలతో ఏం పలకాలో తెలీక బేల ఛీత్కారంగా చూసే చూపు- కొంగను మాడ్చే సిన కౌశికుని చూపుకున్నా వేడి! నవ మాసాలూ మోసి కన్న పసివగ్గు వంక ప్రసవ ప్రయాసనుంచి తేరుకున్న తల్లి చూసే తొలిచూపు అనుభూతి ఏ భవభూతీ యధానువాదం చేయలేనిది. నయనం సర్వేంద్రియాలకే కాదు ప్రధానం. . సర్వోదాత్తమైన అనిర్వచనీయ భావోద్వేగాలకూ అదే ప్రధాన ద్వారం. నేత్రావధానంతోనే సర్వకార్యాలూ చక్కబెట్టే ఆడవారూ, అధికారులే అందుకు సాక్ష్యం . చూపు లేకుండానే 'ద్వారం' వారు ఎంతో మధురంగా 'వయోలిన్' వాయించే వారు . ఆ జ్ఞానేంద్రియమూ ఉండుంటే ఇంకెంత ఇంద్రజాలం చేస్తుండేవారో గదా! దృష్టికి దూరమైన మరో దురదృష్టవంతురాలు అమెరికన్ రచయిత్రి హెలెన్ కెల్లెర్. వికలాంగుల హక్కులకోసం కలం పట్టిన యోధ మూర్తి ఆమె . రెండో ప్రపంచయుద్ధంలో పెద్దపాత్ర పోషించిన అమెరికా ముప్ఫైరెండో అధ్యక్షుడు రూజ్వెల్ట్, కంటి వెలుగు పోవడ మంటే స్వర్గాన్ని పోగొట్టుకోవడమే' అన్న జాన్ మిల్టన్, అంతుబట్టని అంతరిక్ష రహస్యాలను కనుగొన్న గెలీలియో, విశ్వసాహిత్య పురస్కా రాల సుప్రసిద్ధుడు పులిట్జర్- కాంతి దర్శనానికి జీవితంలో ఏదో ఒక దశ నుంచీ దూరమైన ఈ తరహా క్రాంత దర్శకుల జాబితా చిన్నదేమీ కాదు. విద్యుత్ సరఫరాకు అంతరాయమేర్పడి కొవ్వొత్తి వెలిగే ఐదారు నిమి షాలలోనే సర్వం కోల్పోయినంతగా వ్యధ చెందుతాం మనం. ' వెలుగు దీపం దొరకడం మాకో జీవితకాలం మాత్రమేగా ఆలస్యం!' అంటారు కొందరు అంధ ధీరోదాత్తులు. అది వారి దర్పానికి దర్పణం. కంటి రెటీనా కిందిభాగంలోనూ మూలకణాలున్నాయని, వీటిని అభివృద్ధి చేయడంద్వారా నిర్జీవమైన కటకాన్ని పునరుజ్జీవింప చేయవచ్చని పరిశోధకులు ఇప్పుడు భావిస్తున్నారు. 'న్యూయార్క్ న్యూరల్ స్టెమ్ సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీజెనరేటివ్' పరిశోధన సంస్థ నిపుణులు సాగిస్తున్న కృషి ఫలించి దృష్టిదోషమన్న మాట సృష్టిలోనే లేకుండా పోవాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - తేదీ నా నోట్స్ లో నమోదు కాలేదు )
No comments:
Post a Comment