Saturday, December 4, 2021

ఈనాడు ; వ్యంగ్యం పండుగ వైరాగ్యం ( ఈనాడు - 14 - 01.2011 )

 



ఈనాడు ; వ్యంగ్యం 

పండుగ వైరాగ్యం 

( ఈనాడు - 14 - 01.2011 ) 


'పండక్కి పిల్లలకు పిండివంటలు చేసిపెడదామని బజారులో సరకుల కోసమెళ్ళిన పెద్దాయన కిరాణా ధరలు విని ధడాలని దుకాణం ముందే కుప్పకూలిపోయాడట పాపం... విన్నావా అబ్బాయ్? '


' పో  బాబాయ్! పండగ రోజుల్లోనూ నువ్విలా వెటకారాలాడటం ఏ బాగాలేదు. ఈ గడ్డమీద పుట్టడానికి ఎన్ని జన్మల్లోనో పుణ్యం చేసుకుని ఉండాలని ఒబామానుంచి జియబావో దాకా అందరూ పొగిడిపోతే ప్రతిపక్షాలకు నకలుగా  ఏవేవో వంకలు పెడుతున్నావ్"


''మరే! ఆ మేరా భారత్ మహాన్' అంటున్న బ్యాచిని  ఒక్కపూట వరదలో మునిగిన పేదోడి  పూరిగుడిసె పైకప్పు ఎక్కించి, పులిహోర పొట్లాలు అందకుండా చూడాలి. అప్పుడుగాని తెలిసిరాదు. పండుగనాడు పిల్లల నోరు తీపిచెయ్యలేని పాడుబతుపోయింది. ఎరువుల సబ్సిడీ మళ్ళీ తగ్గించేశారు. వర్షాలు వచ్చి ఊడ్చుకెళ్లినా, పాత కరవు నష్టపరిహారం అయినా చేతికి అందలేదు. గాదెలు నిండకపోతే మానె తడిసిన ధాన్యాలైనా  కొనే నాథుడు కరవయ్యాడు. ఏం చూసి, చేసుకోవాలి రైతాంగం  పెద్ద పండుగ? ' 


' హు.. .. ' 


' ఏంటా మూలుగుళ్లు ? నేరాల పట్టిక ఏమన్నా తగ్గుముఖం పట్టిందా అంటే అదీ లేదు. అవే కుంభకోణాలు, అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలూను ! పెద్దపెద్ద నేరాల సంగతి పక్కన పెట్టు!  బస్టాండుల్లో గొలుసులు లాగే కేసులకూ విరామం లేదు. చదువుకని బస్తీకెళ్ళిన కొడుకు ఏ కేసులో ఇరుక్కుంటాడో, ఎదిగిన ఆడబిడ్డ మీద ఏ క్షణాన ఏ బడుద్దాయ్ దాడి చేస్తాడో, ఏ క్షణాన ఏ పాడు జబ్బు ఇంటిల్లపాదినీ మంచమెక్కిస్తుందో, ఏ సెజ్జు రాత్రికి రాత్రే పుట్టుకొచ్చి కొంపాగోడును కొండచిలువలా మింగేస్తుందోనని అనుక్షణం దిగాలుపడుతూ పడుండేవారికి ఇంకేం పండుగ రోజులురా ఇవి? పండగ శోభంటే- పాలన వ్యవహారాల్లోని పారదర్శకత మాదిరి బ్రహ్మపదార్థమైపోయింది. ప్రధానినుంచి ప్రధాన ప్రతిపక్షందాకా అందరూ అవినీతిమీద శివ తాండవం చేస్తామని బెదిరించేవారే!  అయినా, లంచం లేకుండా పింఛను కాగితాలైనా అంగుళం ముందుకు కదలని

పరిస్థితుల్లో మార్పు ఏమైనా వచ్చిందా?' 


'పండగకే ఈ రొటీన్ సినిమా కష్టాలకి సంబంధం ఏంటంట ? ఆవు వ్యాసం లాగా  అన్నిటికి ధరల్ని, అవినీతిని ఏకరువు పెడుతున్నావు.  కాబట్టే వినేవాడికి అవి పట్టించుకో వాల్సిన సమస్యలుగా అనిపించటంలేదు... తెలుసా! '


' ఆహా ! అలాగైతే నీకు షాకు తగిలేలా, పండుగ సంద ర్యానికి తగ్గట్లు వాతలు పెట్టాలంటావు ! రావమ్మా మహా లక్ష్మీ రావమ్మా!' అంటూ హరిదాసులాగా అలా ఊరూరా చిడతలు కొట్టుకుంటూ తిరగటమేగానీ- ఆ మహాలక్ష్మి వాటాకు న్యాయంగా దక్కాల్సిన చట్టసభ సీట్ల బిల్లు రాజ్య సభ గడప దాటిరానీయటంలేదు  గదా మనం ! ' అంబపలుకు జగదంబ పలుకు' అంటూ బతిమాలుకుంటున్నామేగానీ హస్తినలో అధిష్టానమ్మ నోటిని మాత్రం తెరిపించలేకుండా  ఉన్నాం. 'అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టూ' అంటూ బూరా ఊదుకునే గంగిరెద్దులవాడికైనా ఓ చింకి చీరో, పాతపంచో  దక్కుతుందేమో గానీ ... మన గౌరవ ప్రజాప్రతినిధుల సన్నాయి నొక్కులకు మాత్రం పది జనపథం'ముంగిట్లో ముసిముసినవ్వులనైనా ముష్టిగా విసిరే దయామములు  లేరు. 'గొప్ప చదువులూ గొప్పనౌకరీ తప్పవు తండ్రీ పండగనాడు' అంటూ ఊదరగొట్టడమే కనిపిస్తోంది గానీ.. వాస్తవానికి పిల్లకాయలకు క్రమంగా ఉపకారవేతనాలు, పనివాళ్ళకు సక్రమంగా

నెలసరి వేతనాలూ అందుతున్నదెక్కడ? ఇంట్లో పిల్లలు సజ్జు పండుగనాడు ' మా అన్నా బండీమీదా వస్తాడూ, మా బావా బస్సుమీదా వస్తాడూ' అంటూ సంబరపడిపోతున్నారే. గానీ నిజానికి ఏ బండి ఏ రాస్తారోకోలో చిక్కడిపోతుందో ఆ  దేవుడికే  తెలియాలి!  బయలుదేరినవారు క్షేమంగా ఇంటికి చేరడమే పర్వదినమై పోయిందిప్పుడు. కోటిలాభాలు కలగాలన్న కాశీ పండితుడి నోటివాక్యం నిజంగా ఫలించాలంటే ముక్కోటి దేవతలూ ఏకాభిప్రాయా నికి రావాల్సిన రోజులొచ్చాయి నాయనా! ఢిల్లీ పెద్దలు చెప్పిన దానికల్లా తలాడించుకొచ్చే డూడూ బసవ న్నలు దండిగా మనకు ఉన్నంతకాలం నిజమైన పండుగ జరుపుకొనేది నీలాంటి నాలాంటి తెల్లకార్డుల వాళ్ళు కాదురా అమాయకుడా! ' పండుగ దుస్తులు, పప్పు దప్పళాలు మెండుగ తీయని మిఠాయి పొట్లాల్' అంటూ ప్రాసలు తీస్తూ పాడుకోవడానికి హుషారుగానే ఉండొచ్చేమో గానీ - కనబడ్డ  ప్రతి వస్తువుపైనా 'వ్యాట్' వేటు వేయకుండా ఉండలేని పాలనలో, ఇదిగో ఇందాక నేను చెప్పానే... ఏ అపరాల దుకాణం ముందో గుట్టుచప్పుడు కాకుండా గుటుక్కు మనడంకన్నా పెద్దపండుగ ఇంకేమీ ఉండబోదురా పిచ్చినాయనా!  చలి కాచుకునేందుకు  భోగిమంటలే అక్కర్లేదిప్పుడు. ఏ రాజా, నాడియా వంట దొరలు, దొరసానం పేర్లు  తలచుకుం టేచాలు బుర్రలా  వేడెక్కడం ఖాయం.  నేతలు పోటీలుపడి వేస్తున్న పిల్లిమొగ్గల ముందు మన ఆడపిల్లలు వేస్తున్న ముగ్గులు బలాదూర్.  సర్కార్ల మనుగడే గాలిపటాల మాది రిగా మారినప్పుడు మళ్ళీ వేరే పతంగుల పండుగ మనం జరుపుకోవడం దండగ కదా! అట్లా బజారు దాకా  వెళ్లి చూడు. దీక్షాశిబిరాలు- బొమ్మల కొలువును మించి సందడిగా ఉన్నా యబ్బాయ్! జనాలకన్నా పోలీసులే ఎక్కువ తిరుగుతున్న నగరంలో ప్రస్తుతానికి ఇంటిపట్టునే ఉండి 'శుభ సంక్రాంతి' సంక్షిప్త సందేశాలు సెల్ఫోన్లో చదువుకోవటాన్ని మించిన పెద్ద పండుగ మరోటి లేనేలేదు...!' 


- కర్లపాలెం హనుమంతరావు

14 - 01 - 2011 

కాలజ్ఞానం - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపాదకీయం - 06 -12 - 2009 )

 



కాలజ్ఞానం 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 06 -12 - 2009 ) 


'కన్ను తెరిస్తే  జననం- కన్నుమూస్తే మరణం- రెప్పపాటేగదా ఈ పయనం '  అన్నాడొక కవి. నిజానికి కంటిరెప్ప కొట్టుకోవడానికి జీవితకాలం  అక్కర్లేదు. 'కాలపత్రంమీద కాలాతీత సిరాతో రాసిన ప్పుడు ఏర్పడిన చిత్రం పేరు మనిషి' అని ఆచార్య గోపి ఎంత గొప్పగా చెప్పినా అసలు చిత్రమంతా ఉన్నది అనంతంనుంచి అనంతంలో నిరంతరాయంగా  సాగే కాల జీవప్రవాహంలోనే! మనిషి అందులోని ఓ అల. అతని జీవితకాలం ఆ అల లేచిపడినంత. ఐన్ స్టీన్  సాపేక్ష సిద్ధాంతం రానంతవరకూ కాలం ఓ అంతుబట్టని వింత . మహాభారతంలో యక్షుడు ' సూర్యుడిని నడిపించేదెవరు? ' అని అడిగినప్పుడు ధర్మరాజు సమాధానంగా చెప్పిన ‘బ్రహ్మం'' అంటే ఈ 'కాలం' అనే భావం. పెను విస్పోటన (బిగ్ బ్యాంగ్) సిద్ధాంతం ప్రకారం- కాలం విశ్వంతోసహా పుట్టిన పదార్థం. అది విశ్వమున్నంత వరకూ ఉండేది. కాలం అతిక్రమించలేనిది' అంటుంది వాల్మీకి రామాయణం. కురుక్షేత్ర యుద్ధసమయంలో సాక్షాత్ శ్రీకృష్ణపర మాత్ముడంతటివాడూ, అస్తమించే సూర్యుడిని ఆపలేక సుదర్శన చక్రాన్ని అడ్డు పెట్టాడు! కాలం మనిషికి అయాచితంగా దక్కిన వరం. కోరకుండానే దొరికిన పెన్నిధి. 'టైమ్ ఈజ్ మనీ' అనటం సరికాదు. సమయమనేది నిధి మాదిరి పోగేయలేనిది. బదిలీకి కుదరనిది .  తిరిగిరానిది. గడియారాన్ని కొనగలంగానీ, దానిలోని కాలాన్ని  కొనగలమా? జ్ఞానార్జనకోసం తననాశ్రయించిన శశాంకునితో  బృహస్పతి 'నిజానికి నాకన్నా నీవే జ్ఞానివి నాయనా!' అంటాడు. తనవద్దలేని యౌవన విజ్ఞానం చంద్రుని వద్ద ఉన్నదని  మహర్షి భావన. 


కాలమనేది లేకపోతే అన్ని పనులూ ఒకేసారి చేయవలసి  వచ్చేది. ఎంత ఇబ్బంది? అని చమత్కరించాడు బెర్నార్డ్ షా. కాలం విలువ  ఒక్కొక్కరికి  ఒక్కోరకంగా ఉంటుంది. ఏడాది విలువ పరీక్ష పోయినవాడికి తెలుస్తుంది. నెల విలువ నెల తక్కువ బిడ్డను కన్నతల్లికి తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? వారం వారపత్రికలకు సర్వం. రోజు అనేది రోజుకూలీకి ఉపాధి. గంట అంటే పరీక్ష రాసే విద్యార్థికి, నిమిషమంటే అంబులెన్సులోని రోగికి తెలుస్తుంది. ఒలింపిక్స్ పరుగుపందేలలో  సెకండులో వెయ్యో  వంతు తేడాతో ఓడిపోయిన క్రీడాకారులు కోకొల్లలు! ఊరునుంచి ఊరికి పోతూ దారిలో కారులోనే వీలున్నంతవరకు ఓ కునుకు లాగించే  గాంధీగారి అలవాటు వెనుక  ఎంతో కాలప్రణాళిక ఉండేది. పరీక్ష ముందు పెట్టి పాఠం తరవాత నేర్పే వింత గురువు- కాలం. మామూలు మనిషికి కాలం సాపేక్షికత ఓ పట్టాన అర్ధం కాదు. వివరంగా చెప్పమని వేధించేవారికి ఐన్ స్టీన్  'ఇష్టమైన వారికోసం ఎదురుచూసే వేళ క్షణమొక యుగం... వారు ఎదు రుగా ఉన్నవేళ యుగమొక క్షణంగా గడవటమే సాపేక్షికత'  అని సరదాగా ఉదాహరించేవాడు. ఇరవై ఏళ్ల వయసులో రోజుకు ఇరవైనాలుగు గంటలున్నా చాలని కాలం, అరవైల్లో గంటకు అరవై నిమిషాలున్నా గడవటం భారంగా అనిపించటమే సాపేక్షికత అంటారు 'థియరీ ఆఫ్ ఎవ్విరిథింగ్' నిర్మాత స్టీఫెన్ హాకింగ్.


జారిపోయే ప్రతి క్షణాన్ని మాలిమి చేసుకోవడంలోనే  మనిషి 

నిజమైన ప్రజ్ఞ దాగి ఉంది అంటున్నారు వ్యక్తిత్వ వికాసవేత్తలు. కావాలంటే ఓా గంట కునుకుతీయి. రోజంతా సుఖంగా ఉండాలంటే కొత్త ప్రదేశానికి వెళ్లు. ఏడాదంతా ఏ దిగులూ వద్దంటే ఏదైనా బ్యాంకులో నీ సంపాదన దాచుకో!  అదే జీవితాంతం ఆనందంగా గడవాలంటే ఇరుగుపొరుగుతో కలిసిపో!  అంటుంది ఓ చీనీ  సూక్తి. 'ఆపన్నులను ఆదుకుంటే  ఆ దేవుడిచ్చిన విలువైన కాలంలోని సగభాగం  ఆదా చేసినట్లు' అంటారు మదర్ థెరెసా .  చేద్దాంలే... చూద్దాంలే అనుకోవద్దు. 'మనిషి జీవితకాలం 60 ఏళ్లు. కానీ,  వాస్తవంగా చూస్తే 13 ఏళ్లే అంటున్నారు 'ది రోడ్స్ ట్రావెల్' రచయిత స్కాట్ పెక్. చదువు సంధ్యలకు పాతికేళ్ళు, పనిపాటలకు రోజుకు ఎనిమిది గంటల చొప్పున పన్నెండేళ్ళు. స్నానపానాలు, ఆహారవిహారాలు, ఒంట్లో బాగోలేకపోవడం వంటి వాటికి మరో పదేళ్ళు పోగా మిగిలేది 13 ఏళ్లే! మనం చేసే పనిలో ప్రతి ఎనిమిదేసి నిమిషాలకు, ఐదు నిమిషాలకు తక్కువలేకుండా రోజుకు కనీసం ఏడుసార్లు ఆటంకాలు ఏర్పడతాయని టైం మేనేజ్ మెంట్ నిపుణుల నిర్ధారణ . రోజూ ప్రయాణానికి అరగంట, సెల్ ఫోనులో  పనికిరాని మెసేజీలు   చదివి తొలగించేందుకు  పావు గంట, టీవీ రిమోట్ వాడకానికి మరో పావుగంట. . అన్నింటికన్నా ముఖ్యం- అయినదానికీ కానిదానికీ అనవసరంగా వాదించి ఓడిపో వటానికో, ఓడించి ఎదుటివాడి సమయం  పాడుచేయటానికో 37 నిమిషాలు మనిషి వృథాగా వాడుతున్నాడని వాళ్ళు వాపోతున్నారు. ఆవులింతకు ఆరు సెకన్లు పడుతుందని ఆపుకోలేంగానీ, ఈ అనవసరమైన కాలయాపనను అదుపు చేసుకోలేమా? ' సమయాన్ని సమయానుకూలంగా, తనకిష్టమైన రీతిలో ప్రతిభావంతంగా వాడు కునే సాధనలో సాధించే విజయమే మనిషి నిజమైన సంపద' అంటున్నారు 'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత కియోసాకి.  'నిన్న' చెల్లని చెక్కు. ' రేపు' చేతికిరాని డబ్బు. ' నేడు '  అనేదే మనం నిజంగా వాడుకునే చిల్లర!  చిల్లరమల్లరగా దీన్ని వాడుకోరాదనే దానికి మించిన కాలజ్ఞానం మనిషికి ఇంకేముంటుంది?


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 06 -12 - 2009 ) 


... బతుకంతా ... దేశానిది - ఈనాడు - సంపాదకీయం

 


ఈనాడు - సంపాదకీయం

... బతుకంతా .. . దేశానిది ! 

కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 12 - 04 2009 ) 


దుర్మార్గులైన పాలకులను పుట్టిస్తున్నాడని బ్రహ్మదేవుడిమీద ధూర్జటి మహాకవికి ఒకసారి చాలా కోపం వచ్చింది. సృష్టికర్తను తూలనాడటం తప్పేగాని, తనకది తప్పడం లేదంటూ నిరసన ప్రకటించాడు. 'ఈ లోకంలో ఆయన విద్వాంసులను ఎందుకు సృష్టించాలి? పోనీ బుద్ధి వైభవంతో పుట్టించాడు సరే, వారికి ఆకలిదప్పుల బాధను ఎందుకు అంటగట్టాలి? వారి ఇబ్బందులను ఈతిబాధలను పట్టించుకోని ప్రభు వులను, తమ రాజ్యంలోని విద్వాంసులను సజ్జనులను నిర్లక్ష్యంచేసే దుర్మార్గులైన పరిపాలకులను పనిగట్టుకుని మరీ పుట్టించవలసిన అవసరం ప్రజాపతికి ఎందుకు కలిగింది? ' అని ధూర్జటి నిలదీశాడు. పుట్టి నప్పుడు ఉత్తములుగా పుట్టి, నడమంత్రపు సిరి మూలంగా నరులు చెడిపోయినట్లు- అధికారం దక్కగానే చాలామంది ఎందుకు పతనమ వుతున్నారనీ వితర్కించాడు. 'కృపయు ధర్మంబు ఆభిజాత్యము విద్యా జాతక్షమ సత్యభాషణము విద్వన్మిత్ర సంరక్షణయున్ సౌజన్యంబు కృతంబు నెరుంగుటయున్ విశ్వాసంబు...' అంటూ సజ్జనగుణ పరంపరను ఏకరువు పెట్టాడు. ఇలాంటి సద్గుణాలు మొదట్లో ఉండవచ్చు. సముద్రుణ్ని చేరిన తీయని నదీజలాలు తమ మాధుర్య లక్షణాలను పోగొట్టుకున్నట్లుగా అధికారం దగ్గరయ్యేసరికి మంచివాళ్లూ చెడిపోతు న్నారని మధనపడ్డాడు. ఆ మధనంలో ఒక సత్యం స్పురించింది. పాలకుల ధనవ్యామోహమే ఈ దుస్థితికి ముఖ్య కారణంగా తోచింది. రాజు అర్థాతురుడైనచో ఎచట ధర్మంబుండు? ఏ రీతి నానాజాతి క్రియలు ఏర్పడున్' గుణము మాన్యశ్రేణికి ఎట్లు అబ్బు? అని కల వరపడ్డాడు. అలా అని రాజులను ఆశ్రయించడం ధూర్జటికి తప్పలేదు.


సరిగ్గా ఇవాళ ప్రజల పరిస్థితీ అంతే. వ్యక్తుల్లో మంచి గుణాలు, మాటల్లోంచి తొంగిచూసిన ఆదర్శాలు నమ్మి, వారిని ఎన్నుకుని ప్రజలు అందలాలెక్కిస్తారు. అధికారం రుచి మరిగిన తరువాత వారిలో చాలా మంది దుర్మార్గులుగా మారిపోతారు. దానివల్ల విద్వాంసులు నిర్లక్ష్యానికి గురి అవుతారు. ప్రజాపాలన పెడదారి పడుతుంది. ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. అలా రాజ్యంలో ప్రగతి కుంటువడినప్పుడు, పరిపాలన దారి తప్పినప్పుడు విద్వాంసులు నిర్వహించే పాత్ర అమోఘమై నది. వారు రాజుకు మార్గదర్శకత్వం వహిస్తారు. రాజ్యానికి మేలు జరి గేలా చూస్తారు. ప్రజల పక్షాన నిలుస్తారు. ప్రభువులను నిలదీస్తారు. ఈ పాత్రను పురాణకాలంలో రుషులు నిర్వహించేవారు. ప్రజాస్వామ్యయుగంలో ఈ బాధ్యత మేధావులది! విద్వాంసుల విష యంలో ఏ కాలంలో అయినా పరిపాలకులు గౌరవాన్ని పాటించవల సిందే! విద్వాంసులు విడిచిన రాజ్యంలో నీతి, ధర్మం నశిస్తాయనీ, దేశం చెడిపోతుందనీ హితోపదేశం చెబుతుంది. రోగానికి సేవించే ఔషధం చేదుగా ఉన్నా- గుణం కలగాలంటే దాన్ని సేవించక తప్పదు. అలాగే విద్వాంసులు బోధించే అంశాలు రుచించకపోయినా వాటిని వినక తప్పదు. ఆచరించకా తప్పదు. విదురుడు చెప్పే మాటలు ధృత రాష్ట్రుడికి నచ్చేవికావు. అయినా వినక తప్పలేదు. ఎందుకంటే అవి సూనృత వాక్యాలు కనుక అన్నీ విన్నాక ఆయన వాటిని ఆచరణలో పెట్టకపోయేసరికి చివరికి ఏ గతి పట్టిందో భారతం వివరించింది. విశ్వామిత్రుడు రాజుగా ఉన్నప్పుడు ఆయనకు హితం బోధించవలసిన అగత్యం బ్రహ్మర్షి అయిన వసిష్ఠుడికి ఏర్పడింది. విశ్వామిత్రుడు



రాష్ట్రుడికి నచ్చేవికావు . విశ్వామిత్రుడు చిన్నాడు కాదు.  వసిష్ఠుడికి ఎదురు తిరిగాడు. యుద్ధం ప్రకటించాడు. ఒక్క రుషి చేతిలో విశ్వామిత్రుడి సమస్త సైన్యమూ సర్వనాశనమైపో యింది. విద్వాంసుడి బలం ముందు రాజు నిలవలేడని వసిష్ఠుడు ఘంటాపథంగా రుజువు చేశాడు. పాలకుడు అవివేకియై తమ సూచనలను పెడచెవిన పెడుతుంటే ఇక ఆ రాజ్యంతో విద్వాంసులకు పని ఏముందని భోజరాజీయం ప్రశ్నించింది.


మేధావుల పాత్ర ఎలాంటిదో తెలుసుకోవాలంటే 1975 ఆత్యయిక స్థితిలో జయప్రకాశ్ నారాయణ్ చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్య మాన్ని గుర్తు చేసుకోవాలి. పుటక నీది చావు నీది బ్రతుకంతా దేశా నిది' అంటూ ఆయనకు కవి కాళోజీ నివాళులర్పించారు. మేధావులు బతుకు దేశానిది! ఈ విషయాన్ని విస్మరించడంవల్లనే దేశానికి దుర్గతిపడుతోంది. ప్రజల పక్షాన నిలిచి పాలకులను నిలదీయడమే కాదు, ప్రలోభాలకు లోనయ్యే ప్రజలను సంస్కరించవలసిన అవసరం కూడా మేధావులకు ఉంది. అలాగే, దుర్మార్గులను గద్దె దించే విషయంలో ప్రజలు చూపించే కసిని - సన్మార్గులను ఎక్కించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తగా మలిచే బాధ్యత ముమ్మాటికీ మేధావులదే! 'ఓట్ల డబ్బాకు గర్భస్రావం జరుగుతుంది. ప్రజాస్వామ్య శిశువు ప్రసవం ఎన్నడూ జర గదు' అని శేషేంద్ర చింతించడానికి కారణం మేధావుల అలసత్వమే! ప్రజలపట్లే కాదు, ఓటింగ్ పట్లా  మేధావులు నిర్లిప్తత పాటించడం పరిపాటి అయింది. 'మంచి పౌరులు, మేధావులు ఓటు విషయంలో చూపించే నిర్లక్ష్యం మూలంగా ఒకోసారి చెడ్డ నాయకులు విజయాలు సాధిస్తారు' అనేది ఒక అంచనా. ఒక తారక మేల్కాంచెను... ఒక వీరుడు కనువిచ్చెను... ఒక మెళుకువ... ఒక్క వెలుగు... నవ జగతీ యువనేతలు భవిష్యత్తుకధినేతలు మహాక్రాంతి... మహాక్రాంతి... ' అంటూ సోమసుందర్ ఝళిపించిన 'వజ్రాయుధం' మెరుపు వెలుగుల్లో తళుక్కున మెరిసే భావి నేతలను మేధావులు గుర్తుపట్టాలి;  భుజం తట్టాలి..  సానపట్టాలి. నవభారత నిర్మాణానికి గణనీయమైన పాత్ర పోషించేందుకై నడుం కట్టాలి..  మనసు పెట్టాలి..  'మడి' కట్టాలి. మరో వైపు ప్రజలను జాగృతం చేసేందుకు కృషిచేయాలి. వారికీ వీరికీ మధ్య వారధులై నిలవాలి .. సారథులై నడపాలి..  సమరంలో గెలవాలి. ' నదులు కనే కలలు ఫలిస్తాయి పొలాల్లో... కవులు కనే కలలు ఫలిస్తాయి. మనుషుల్లో' అన్నారు శేషేంద్ర. మేధావుల కలలు ఫలించాలి. దేశంలో! అవును! ధనాన్ని కాదు జనాన్ని గెలిపించాలి. జనం గెలవాలి మేధావుల సాయంతో!


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 12 - 04 2009 ) 


ఈనాడు: సంపాదకీయం : పేగు బంధం కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపాదకీయం - 03 - 05-2009 )

 


ఈనాడు: సంపాదకీయం : 

పేగు బంధం 

కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 03 - 05-2009 ) 



వత్సం అంటే ఆవుదూడ . అది పుట్టినప్పుడు దాని ఒంటినిండా మావి అలముకుని జుగుప్సావహంగా ఉంటుంది. అప్పుడు వత్సల(గోమాత) బిడ్డ దేహంమీద మకిలి అంతటినీ స్వయంగా తన నాలుకతో శుభ్రం చేస్తుంది. ప్రేమగా, ఆత్మీయంగా, శ్రద్ధగా తల్లిగోవు ఆ పని చేస్తున్న ప్పుడు వ్యక్తమయ్యే గొప్ప భావమే  వాత్సల్యం. 


వాత్సల్యం తల్లుల సొత్తు. మాతృత్వం అనేది సృష్టిలోని ఒకానొక మహత్వపూర్ణ మైన అనుభూతి. అది బిడ్డకు జన్మ, తల్లికి పునర్జన్మ! తల్లి అనిపించు కోవడానికి స్త్రీ ప్రాణాల్ని సైతం పణంగా పెడుతుంది. అమితమైన బాధను ఓర్చుకుంటుంది. ప్రసవ వేదన ఎంతటిదో అనుభవిస్తేనే తెలు స్తుంది. రైలు పట్టాలమీద పెట్టిన నాణెం చక్రాలకింద నలిగి వెడల్ప వుతుంది చూశారా! కాన్సులో బాధను దానితో పోల్చి చెప్పిందొక కవ యిత్రి. 


దుర్బరమైన నొప్పులను ఓర్చుకున్న అమ్మ నలుసును చూడ గానే సంతోషంగా నవ్వుతుంది. అమ్మనొప్పులకు కారణమైన ఆ బిడ్డ మాత్రం ఏడుస్తాడు. అదే సృష్టిలోని చిత్రం! కన్న తరువాతా  కొన్నాళ్ళ పాటు తన నోటిని కట్టేసుకుని తల్లి పథ్యం చేస్తూ  బిడ్డకు మాత్రం తియ్యని పాలిచ్చి పెంచుతుంది. సంతానాన్ని పెంచి పెద్దచేసే క్రమంలో ముఖ్యభూమిక వహిస్తుంది. 


తల్లి పెంపకంలో గొప్పగొప్ప యోధులైనవారు చరిత్రలో మనకు చాలామంది కనిపిస్తారు. పురాణ కాలంలో పాండవులు మొదలు, ఆధునిక యుగంలో శివాజీ దాకా మహాయోధులైన వారెందరిపైనో తల్లి ప్రభావం స్పష్టంగా కనపడు తుంది. దాన్ని గుర్తించాడు కాబట్టే ప్రపంచంలో గొప్పవారంతా తమ తల్లుల లక్షణాలను అధికంగా పుణికిపుచ్చుకున్నవారే అని నిర్ధారించా డొక తత్వవేత్త.  'ఒడిలో కూర్చొనియుండ, నీవు మమతాయోగమ్ము పాటించి ప్రేముడిపై దేహమునెల్ల తాకునపుడేమో గాఢసంరక్షలో గుడిలో దీపము వోలెనుండి.... అనే  ఒక మహాసహస్రావధాని మాట- అమ్మ ఒడిలోని భద్రస్థితికి కవితాకర్పూర నీరాజనం. 


అమ్మ జన్మదాత అనుకుంటే- నాన్న జీవదాత దేహం తండ్రి.

ప్రసాదం అని వేదం స్పష్టంగా చెప్పింది. పురుషహవా... అనే ఐత

రేయమంత్రం- తండ్రి శుక్రం ద్వారా తల్లి గర్భంలో దేహాన్ని మొదటి జన్మగా చెప్పింది. శిశువు రూపంలో  భూమిమీద పడటం రెండో జన్మ. అక్కడినుంచి తండ్రి సంరక్షణ మొదలవుతుంది. 


తల్లీతండ్రీ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అపురూపంగా పెంచుకుంటారు. వాళ్ళకోసం అవసరమైతే, తాము పస్తులుండటానికి సిద్ధపడతారు. తమ పిల్లలు తమకన్నా అన్నివిధాలా చాలా పెద్దస్థాయిలో జీవించాలని కోరుకుంటారు. తపనపడతారు. త్యాగాలు చేస్తారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించడం, పెద్దవాళ్ళను చెయ్యడం తమ బాధ్యతగా భావిస్తారు. ఇష్టంగా నిర్వహిస్తారు. ఊహ తెలియగానే పిల్లవాణ్ని 'నీ బతుకు నువ్వు చూసుకో' అనడానికి భారతీయ తల్లిదండ్రులకు మనసొప్పదు. భార్య భర్త అనే రెండు తాళ్ళు ముడివేస్తే- ఆ ముడి సంతానం' అన్నాడు భర్తృహరి. తల్లిదం డ్రులకు పిల్లలకు మధ్య ఆ పేగుముడే  మనిషి అసలైన జీవ లక్షణం. 


చమురు ఆవిరైతే దీపం ఏమవుతుంది? బంధం శిథిలమైతే బతు కులో ఇక ఏముంటుంది? భార్యాభర్తలు విడిపోవచ్చు. చెడిపోవచ్చు. గాని- తల్లిదండ్రులుగా మారాక బాధ్యతగా జీవించవలసిందేనని మన పెద్దల తీర్మానం.  భార్యా భర్తల  మధ్య ముందు ఏర్పడ్డ దూరం పిల్ల 'లనే ముడితో తరిగిపోతుందంటారు వేటూరి ప్రభాకరశాస్త్రి.  


సంతానం కలగడంతో ఎన్నో సమస్యలు సమసిపోయి  భార్యాభర్తలు దగ్గరవడం  మనం చూస్తున్నాం. అలాగే ప్రేమపెళ్ళిళ్లను ఆమోదిం చలేక విడిపోయిన కుటుంబాలు సైతం కొత్త జంటకు పిల్లలు కలిగే పేసరికి తిరిగి కలగలసిపోవడం మనం ఎరుగుదుం. అదే సుతాకారపు 'ముడి' అంటే: దాని ప్రభావం తీయనిదే కాదు .. బలమైనది కూడా. 


అనుబంధాలూ ఆత్మీయతలూ లేకుంటే జీవితానికి అర్థమే ఉండదు. తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమానురాగాలు పంచి ఇవ్వాలి. పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రుల్ని సాదరంగా, ఆత్మీయంగా చూసుకో వాలి. ఆ సంప్రదాయ పరంపర తరవాతి తరానికి ఆదర్యం కావాలి.


గడపడానికీ, జీవించడానికీ మధ్య తేడా అదే! తన తల్లిదండ్రుల పాదపద్మాలను ప్రీతిగా ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూములకన్నను విమల తరము..' అని స్తుతించాడు పాండురంగడు. స్వతహాగా చదువూసంధ్యా అబ్బకపోయినా- కౌశికుడంతటివానికి జ్ఞానబోధ చేయగలిగే స్థాయి వివేకం తనకు దక్కడానికి కారణం తల్లిదండ్రులకు చేసిన సేవలే అన్నాడు- భారతంలో ధర్మ వ్యాధుడు. 


ఆడపిల్లలు తండ్రిమీద, మగపిల్లలు తల్లిపైన ప్రేమ అధికంగా కలిగిఉంటారని చెబుతారు. మనమూ పిల్లల్ని నువ్వు ' అమ్మ పార్టీయా, నాన్న పార్టీయా' అని ఆరా తీస్తుంటాం. 'వాడు అమ్మ కూచి. ఆమె నాన్న కూచి' అంటూ ముద్రలు వేస్తుంటాం. ఏ రకంగా ముద్రలు వేసినా, ఎటువైపు మొగ్గుచూపినా పిల్లలందరూ తమ తల్లిదండ్రులు ఇద్దరూ కలిసిమెలిసి ఉండాలనే కోరుకుంటారు. అమ్మానాన్నా ఒకరినొకరు మనసారా ప్రేమించడం, గౌరవించడమే పిల్లలకు ఇష్టంగా ఉంటుంది. 


ఇటీవల హైకోర్టు ధర్మాసనం సైతం ఇదే విషయాన్ని ఒక జంటకు వివరించింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక కాపురంలో కలతలు మొదలై ఆ జంట విడిపోయింది. పిల్ల లిదరూ చెరో చోటా ఉండిపోయారు. అయిదేళ్ళు గడిచాక విడాకుల కేసు కోర్టుకు వచ్చినప్పుడు చిన్నపాపను న్యాయమూర్తి పిలిచి 'నీకు అమ్మానాన్నల్లో ఎవరు కావాలి? అని అడిగారు. ఆ పిల్ల చేతులు జోడించి 'నాకు అమ్మ, నాన్న, అక్క ముగ్గురూ కావాలి' అని దీనంగా అడిగింది. దాంతో న్యాయమూర్తి చలించిపోయారు. జనం కరిగిపో యారు. తల్లీతండ్రీ కన్నీటితో సతమతమయ్యారు. కరుణ రసాత్మక మైన ఆ ఘటనతో వారిద్దరూ పశ్చాత్తాపానికి లోనయ్యారు. తిరిగి ఒకటవుతామని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 


పేగుబంధం తన ప్రభావాన్ని చూపించింది. కుటుంబం ఆనందాశ్రువులతో ఒక్కటైంది. సమాజంలో వస్తున్న గొప్ప మార్పునకు సంకేతంగా నిలిచింది.


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 03 - 05-2009 ) 

ఈనాడు - సంపాదకీయం మాతృదేవికి వందనం - కర్లపాలెం హనుమంతరావు

 



ఈనాడు - సంపాదకీయం 

మాతృదేవికి వందనం

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 11-05-2014 ) 


శిశువు తొలిసారి కనురెప్పలు విప్పినప్పుడు కనిపించే రూపం అమ్మ.  పెదాల వెంట మొదటి మాటగా వినిపించే పిలుపు అమ్మ. అవనిపై ఏ జీవికైనా ప్రథమ ప్రత్యక్ష దైవం అమ్మేనని ఆర్షధర్మ వాక్యం సైతం ప్రస్తుతించింది. 


వేటూరి మాటల్లో జీవన్నాట కంలో అమ్మది అమృతమయమైన పాత్ర. అమ్మంటే ఎన్నటికీ తర గాని ఒక అమృత పాత్ర.  తరతరాల వెలుగు తాలుపులైనా, తరుగెరుగని ఇలవేలుపులైనా నేలపై కాలుమోపాలంటే.. తల్లి గర్భంలో నెలల తరబడి నునుపు తేలక తప్పదు. మనుగడలో మీగడ పరచి ముద్దులనే ముద్దలు కలిపి తినిపించే తీయని అమ్మ చేతి హాయి కోసమేనేమో అది అంతాలు తెలియని దేవుళ్లు సైతం అవతారాల నెపంతో నేలమీదకు దిగివచ్చారని చదువు కున్నాం. 'జలజలోచన దేవ సద్గుణ కలాప/ తలపులోపల మెలగు తత్వ ప్రదీప' అంటూ అమ్మ అడ్డు కాలుమీదేసుకుని లాల పోస్తుంటే ఎంతటి బ్రహ్మాండ నాయకుడూ ఇంత చిన్ని బిడ్డయి గారాలు పోవడం.. అదో వింత! 


బాలకృష్ణుణ్ని దేవకీ పరమానందంగా సంబోధించాడు బమ్మెర పోతనామాత్యుడు భాగవ తంలో.  భారతం అరణ్యపర్వం యక్షప్రశ్నల సందర్భంలో 'ధరణి కన్నా ప్రేకన(బరువు) అయినది తల్లిపేగు' అంటాడు ధర్మనంద నుడు. గర్భధారణ, శిశుచింతన, ప్రసవవేదన, బిడ్డ రక్షణ.. 'మాతృషోడశ' చెప్పే పదహారు ఈతిబాధల్లో కొన్ని మాత్రమే. గర్భవాసాన సరే.. ప్రసవానంతరం సైతం వంశాంకురం తల్లిపై మోపే భారమో? 


భూమాత భరించే బరువు భౌతికం. భూమి మీది మాత బిడ్డ కోసం సహించే బరువు మానసికం. ఆ భారాన్ని 'తూచే 'రాళ్లు' మనిషి ఇంకా తయారుచేయలేదు.


" ప్రేమలన్నీ కవితలే అయితే/ అమ్మ ప్రేమ మాత్రం అమర "కవిత అని ఓ ఆధునిక కవి ఉవాచ . భాష్యానికి అందనిది ఆ 'అమ్మ కవిత.  బాపూజీ బోధించిన 'మూడు కోతుల' సూత్రం తల్లి అంతరంగానికి అతికినట్లు సరిపోతుంది. చెడు వినదు, చెడు కనదు, చెడు అనదు- బిడ్డ విషయంలో . తల్లి, 'ఓయమ్మ! నీ కుమా రుడు/ మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా!' అంటూ మొత్తుకుంటూ వచ్చిన వాడ వనితల గోడు యశోదమ్మ చెవిన పెట్టిందా! ఆ వచ్చిన వాళ్లపై ఎదురుదాడికి దిగింది. 


నాలుగు చేతులు... మూడు కళ్ళు.. మనసు ఆనక... ముందు ఆకారమే వికారం శిశుపాలుడిది జన్మతః. ఐనా తల్లి సాత్వతి ప్రాణం నెమ్మ దించిందా? మేనల్లుడైన శ్రీకృష్ణుడే 'శిశు హంతకుడి'గా మారతాడని తెలిసిన ఉత్తరక్షణంలో 'బిడ్డ అపరాధశతంబు' వరకు శిక్ష వాయిదాను వరంగా సాధించింది. తనయుడు ఎంత తుచ్ఛు డైనా నూరు తప్పులు చేయబోడని  ఆ పిచ్చితల్లి విశ్వాసం. శ్రీనాథుడి కాశీ ఖండం గుణనిధి తల్లిదీ అదే అంధ ప్రేమ. అవగుణాల నిధి కొడు కని తెలుసు. అయినా వాడి గురించి భర్త దగ్గర అడ్డంగా ఎన్నో అబద్ధాలు ఆడుతుంది. తండ్రి కోపాగ్ని నుంచి బిడ్డను కాపాడుకో వాలన్నది ఆ తల్లి తాపత్రయం. 'మా తండ్రి లోకాన్ని బూచిగా చూపించి బెదిరిస్తే ఆ బూచి నుంచి నన్ను కాపాడుకోవాలని మా తల్లి జీవితాంతం ఓ కంచెగా మారి జీవించింది' అంటారు ప్రముఖ ఆంగ్ల కవి జార్జి బెర్నార్డ షా. 


అంతరంగం విషయంలో సత్యహీన శిశువు జీవనం ఎంత దైన్యమైనచో మహాకవి ' వ్యాయోగం'లో విస్తారంగా వివరిస్తాడు. తల్లిలేకుండా తాను పడ్డ కష్టాలు తల్లిలేని శివయ్య పడదని తానే తల్లిగా బాల్యోపచారాలకు సిద్ధపడింది బెజ్జ మహాదేవి అనే సిద్ధురాలు.  'ప్రపంచమెల్ల ఎల్లవేళల తినుచున్నయన్నమే  తినుచున్నదిన్నాళ్ళు అని విశ్వనాథ వారు అనుకోవడం విని లేనిపోని చాదలేస్తావేమిటిరా?! మడిగా  ఏ పూటకాపూట వండి వారుస్తుంటేనూ!' అని మండిపడిందిట కవిగారి తల్లి . ఆ కవిగారి అంతరంగంలోని  వింతకోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో శ్రీరమణ కలం నుంచి జాలువారిన చమత్కారం అది. 


 ఎంత రాసినా పూర్తిగాని  ప్రేమకావ్యం తల్ల.  ఎంత తీర్చినా  పూర్తిగా చెల్లిపోని పేగురుణం  అమ్మది. భార్యాబిడ్డలకోసమో, బంధంగానో ఉందనో  రక్తమాంసాదుల్ని పంచి ఇచ్చిన తల్లిని వృద్ధాప్యంలో పంచలపాలు చేయడం కుపుత్రుల  దుర్లక్షణమని సుభాషిత రత్నమాలిక ఈ సడించింది . ఆచార్య ఆత్రేయ అన్నట్లు'  భువిని మా అమ్మ కడుపున పుట్టుటొకటె / నేను చేసిన పుణ్యము నేటివరకు'  అన్న గుర్తింపు కలిగి ఉండటం ఏ బిడ్డకైనా  తప్పనిసరి.  ' నీ కోసం ప్రాణం ఇస్తా'  అనడం వినడానికి అతిశయోక్తి అనిపిస్తుంది. నిజమే కాని, బిడ్డ విష యంలో తల్లికి మాత్రం అది శుద్ధ స్వభావోక్తి. ' మాతృదినోత్సవం' అంటూ ఓ సందర్భం కల్పించుకుని ఒక అందమైన గ్రీటింగ్ కార్డో, ఖరీదైన కానుకో.. మరీ భేషజానికి పోయి మెడపట్టని పూలదండో  సమర్పించుకుంటే అమ్మకు పండుగ అవుతుందా? ప్రేమమూర్తికి ప్రేమే బహుమానం. జయాపజయాలకు అతీతంగా జగజ్జేతగా సదా కంటి ముందు చల్లగా కదులుతుంటే చాలు, కన్నతల్లులకు అదే బిడ్డలిచ్చే నిజమైన నీరాజనం. 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 11-05-2014 ) 






ఈనాడు - సంపాదకీయం

మాతృదేవికి వందనం

కర్లపాలెం హనుమంతరావు

ఈనాడు - గల్పిక మహర్జాతకం - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - గల్పిక- తేదీ తెలియదు )

 


ఈనాడు - గల్పిక

మహర్జాతకం 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - గల్పిక- తేదీ తెలియదు ) Editorial,Eenadu,


సభలో పంచాంగం చదివిన పంతులుగారేమ న్నారో తెలుసా?


ఏమన్నారూ? 


ఈ సంవత్సరం చిత్రభాను గనక చిత్రంగా అంతా మంచే జరుగుతుందని జోస్యం చెప్పారు.


నా వరకు నాకు ఆ జ్యోతిష్యం నిజమే అయిందనిపి స్తుంది. సంసారం, ఝంఝాటం లేకుండా హాయిగా వున్నాను. అప్పులూ, చాలీచాలని జీతం, ఎప్పుడూ పెరిగే ధరలు, వేపుకుతినే వెళ్ళాం, వేధించే పిల్లకాయలు, టీవీ సీరి యల్సూ పొగతో నిండిన రోడ్లు, పొగరుబోతు మనుషులు, లంచగొండి ఉద్యోగస్తులూ, కాకారాయుళ్ళు,  కల్తీ సరుకులు, గతుకుల రోడ్లు, నీటి ఎద్దడి, అమెరికా పిచ్చి. . ఏవీ లేకుండా హాయిగా, ప్రశాంతంగా, సంతోషంగా, తేలిగ్గా తెరి పిగా వున్నాను. పంతులుగారు చెప్పింది నా విషయంలో మాత్రం నూరు పాళ్లు నిజమే అయింది సుమా!


అదే పంతులుగారు నాకు జాతకచక్రం వేసిచ్చారు. జీవి తకాలం జోస్యం పది పేజీలు రాసిచ్చారు. ఫీజూ వెయ్యి రూపాయలు.. సమయానికి దగ్గరలేక అయిదొందలే ఆయన చేతిలో పెట్టా అప్పుడు. మొన్న ఇంట్లో దొరికిందీ జాతకం. 


దగ్గర వుంటే చదవరాదూ.. .. కాలక్షేపమవుతుంది


కాలక్షేపానికెవరన్నా ఫిక్షన్ చదువుకుంటారు. న్యూస్ పే పర్ చదువుకుంటారు. జాతకచక్రాలు చదువుకొంటారా!


పుర్రెకోబుద్ధి.. పూటకోరుచి.. వెరైటీగా వుంటుంది. చద వరాదూ!


సరే విను ! పంతులుగారు నాకు డెబ్బైయ్యేళ్ల ఆయుష్షు ప్రసాదించారు. గురువు, శని ఒకే ఇంట్లో కలుసుకుంటున్నందు వల్ల రాబోయే పది సంవత్సరాలు నాది మహర్జాతకం అనేశారు . ఆదాయం.. వ్యయం ఈ పదేళ్ళల్లోనూ అనులోమానుపాతంలో ఉంటుందని ఆశపెట్టారు . ఈ సంవ త్సరానికైతే ఆదాయం 15 వ్యయం ఒకటి. రోగాలూ చొప్పులూ ఉండవు. ఉద్యోగంలో ప్రమోషన్ ఖాయం. బదిలీ వుండదు. భార్య ఆరోగ్యం బాగుపడుతుంది. పిల్లకి మంచి సంబంధం కుదురుతుంది. పిల్లాడు అమెరికా వెళతాడు. ఇల్లు కట్టుకోవటం పూర్తవుతుంది. అనుకోని వైపు నుంచి ఆస్తి లాభం . అన్నదమ్ములతో స్నేహం కుదురుకుంటుంది . పుణ్యక్షేత్రాలు వెళ్ళి వస్తారు. చరాస్తి పెరుగుతుంది. పాత అప్పులు వసూలు అవుతాయి. అధికారులు అనుగ్రహానికి పాత్రులవుతాను . సినిమాల్లో అవకాశం వస్తుంది.


ఇహనేం! నీ జీవితాశయం నెరవేరబోతుంది.  నువ్వు మాటలు, పాటలు రాయాలని తెగ ఉవ్విళ్ళూరి పోయే వాడివి కదా!


ఇంకా విను. దానాలు చేస్తాను. సోషల్ వర్క్ కూడా  ‌ చేస్తానని రాశారు. 


నిజమే మరి. నువ్వీ మధ్య రచనలూ అవీ చేయటం లేదు గదా! ...


సెటైరా! సరే. ఇలాగే ఏవో చాలా చాలా రాశారు .


ఫీజు  వెయ్యి రూపాయలకు ఒప్పుకున్నావయ్యే మరి. ఆ మాత్రం బరువుండొద్దూ! 


కానీ అందులో అయిదొందలే ఇచ్చానన్నాగా అప్పుడు. మిగిలిన అయిదొందలు ఇవ్వకుండానే ఇలాగయ్యింది..


డెబ్బైయ్యేళ్లు గ్యారంటీ అన్నారుగా! ఎప్పుడో ఎక్కడో తారసపడతారు . అప్పుడివ్వచ్చులే! 


కానీ ఎలా ఇచ్చేది?


మెసెంజరొచ్చి డిస్టర్బ్ చేశాడు.


మీటింగుకు టయమయిపోతుంది . మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు. మన 'దయ్యాల సంఘం'లో కొత్త మెంబర్  చేరబోతున్నాడు. పరిచయం చేస్తారంట- అని వెళ్ళిపోయాడు మెసెంజరుదయ్యం. 


కొత్త మెంబర్ను చూసి కంగు తినటం మావంతయింది. 


 సభలో పంచాంగం చెప్పిన పంతులుగారే! వయస్సు కూడా ఆట్టీ ఏం లేదు . . పాపం


ఎలా జరిగింది?- అని అడిగాను సానుభూతిగా,


వచ్చే ఏడాది పంచాంగానికి మేటర్ తయారుచేసే పని 'మధుర పోతున్నాను. ట్రైన్ ఎక్సిడెంటయింది... మీరూ...


ఏభై ఏళ్ళు బతుకుతానని మీరు దివ్యమైన జాతకం చ్చారుగా!  ఆ కాగితాలు పట్టుకుని హుషారుగా ఇంటి స్తుంటే.. లారీ గుద్దేసింది నడిరోడ్డు మీద... 


ఐ యామ్ సారీ..! అన్నారు పంతులుగారు. "


దీన్ని బట్టి మనం జాతకాలని నమ్మాల్సిన పనిలేదు. రుజువయిందిగా! - అన్నాన్నేను.


ఇదివరకు నేను నమ్మేవాడిని కాదు. ఇప్పుడు నమ్ము తాను- అనేశాడు నా మిత్రుడు. 


ఇంత చూసిన తరువాత కూడానా ! 


అందుకే మరి.. పంతులుగారేమన్నారు? నీ దగ్గరా మిగిలినా బాకీ అయిదొందలు ఎప్పటికైనా వసూలు చేసుకొంటానన్నారు  గదా! వసూలు చేసుకోవటానికి ఎక్కడిదాకా వచ్చాడో చూశావా!.. కాబట్టి జోస్యం సత్యం అన్నాడు- మిత్రుడు.


అతని వంక జాలిగా చూడటం తప్ప నేను మాత్రం చేయగలి దేముంది!


***


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - గల్పిక- తేదీ నమోదు చేయలేదు )  


ఈనాడు- హాస్యం ముక్కంటీ! . నీవే దిక్కంటి! - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - గల్పిక- 01/03/2003 - శివరాత్రి పర్వదిన సందర్భంగా - ప్రచురితం ) కైలాసం

 ఈనాడు- హాస్యం 




ముక్కంటీ! . నీవే దిక్కంటి! 

- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- 01/03/2003 - శివరాత్రి పర్వదిన సందర్భంగా - ప్రచురితం ) 




కైలాసం 


పరమేశ్వరుడు ధ్యానంలో వున్నాడు. 


పార్వతమ్మ సరసన చేరి సరసంగా అంది ' స్వామీ! యోగ నిద్రా? 


'కాదు భద్రా! బడ్జెట్ ముద్ర'


' ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. సర్వజగత్తూ ఆపూర్వంగా ఆ వేడుకను జరు పుకొంటుంటే, మనమీ మంచుకొండల మధ్య వణుక్కుంటూ కూర్చోటమేంటి? సరదాగా అలా భూలోకం చుట్టొద్దాం... రండీ! '


'నాకూ రావాలనేవుంది . కానీ కింది లోకంలో దారిద్ర్యరేఖకు దిగువనున్న వారి లెక్కలు తీస్తున్నారిప్పుడు.  మనమెక్కడ చిక్కుల్లో పడతామేమోనని.. సందేహిస్తున్నా  దేవీ! ' 


 'అదేనే  శంక? ... లేక క్రికెట్ ప్రత్యక్ష ప్రసారాల మధ్య మనం ప్రత్యక్షమైనా ఎవరూ పట్టించుకోరేమోనని.. ఇదో వంకా ? ' అంది చిలిపిగా ఓంకారి శంకరునివంక చూసి . 


'భక్తవశంకరులం మాకు శంకలా!... సరే... నీ ముచ్చటెందుక్కాదనాలి. పోదాం పద! నందిని పిలు గిరినందినీ!| అంటూ కరిచర్మాంబరుడు లేచి నిలబడ్డాడు.


'నంది ఇప్పుడు భూలోకంలోనే వుంది నాథా ! రవీంద్రభారతిలో అదేదో అవార్డు ఫంక్షనుందిటగా' అంది పార్వతీదేవి. ' అందుకే ఓ కారు కొందామని చెవినిల్లు కట్టు కొని పోరేది. ఓంకారం తప్ప మరేమీ ఆ చెవికెక్కించుకోరాయె! కారే గనకుంటే ముల్లోకాల్లో ఎంచక్కా షికార్లు కొట్టి రావ చ్చు'


'బికారిని నేను కారెలా కొనగలను కాత్యాయనీ? కుబేరుని వద్ద కుదవబెట్టేందుకు విబూది తప్ప మరేదీ లేదే  మన దగ్గర! ' 


' కార్లు కూడా భూలోకంలో కారుచౌకగా దొరుకుతున్నాయట స్వామీ! చూద్దాం పదండి. పనిలో పనిగా మన భక్తుల్నీ చూసినట్లుంటుంది.' 


*****


'శివ శివా!'


పిలిచావా భక్తా!' 


'లేదు.  దోమలు కుడుతుంటే భరించలేక అరిచానంతే! తమరెవరూ?'


' శివుడిని నాయనా! ఈమె పార్వతీదేవి' 


' శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటా రుగా స్వామీ! ఈ దోమల బారినుండి కాపాడరాదా! ' 


'శివుడాజ్ఞ లేనిదే చీమలు కుట్టవు. దోమలు కుడతాయి నాయనా! వాటిమీద ఆదిశక్తికే అదుపులేదు. ' 


' పోనీ... కాస్త గంగనైనా విడవరాదా! రెండు బిందెలు నీళ్ళు పట్టుకుంటాము. వారం రోజుల్నుండీ నల్లాల్లో నీళ్ళు రావటం లేదు. మడి కూడా పొడిగా కట్టుకొన్నా' 


' గంగాజలం కలుషితంగా వుంది భక్తా! టీవీ సీరియల్సులో ఆడపడుచులలా పెడబొబ్బలు పెట్టేడుస్తుంటారు కదా! ఆ కన్నీళ్ళు రెండు బకెట్లకు పట్టుకుంటే కరవు తీరుతుందిగా సుబ్బారావ్!'


' సీరియలంటే గుర్తొచ్చింది స్వామీ! కనీసం ఈ ఎపిసోడ్లు ఎప్పుడయి పోతాయో ?  అదన్నా  చెప్పగలరా ఆదిదేవా! ... టెన్షన్తో చేస్తున్నాము. ' 


' మహాలింగానికైనా ఆది, అంతూ కను క్కోగలంగానీ, ఈ సోదికి మాత్రం తుది కనుక్కోవాలంటే నేనైనా ఏదైనా సోదికి పోవాల్సిందే సుబ్బారావ్ ! ఇంకేదైనా అడగరాదా ! ' 


'ఏదడిగినా ఏదో వంక చెబుతున్నావు.. నువ్వసలు నిజంగా ఒరిజినల్ శంకరుడి వేనా స్వామీ? '


'ఒరిజినల్‌ నే నాయనా! నీ పంచాక్షరి విని ముచ్చటేసి ఏదైనా వరమిచ్చి పోదామని వచ్చాను' 


' ఇది పంచాక్షరి కాదే!  అంత్యాక్షరి.. ఇదో రకమైన సినిమా పేర్లతో ఆటయ్యా శివయ్యా! '


'అదేంటి? నువ్వనేది. ఓం నమశ్శివాయ' అని కాదా?' 


. కాదు. 'ఓం... నమసినిమాయ' అని. శివరాత్రికి నైటంతా స్పెషల్ గా  సినిమాలేస్తు నారు ... అందుకని'


' ఏదీ మమ్మల్నీ ఒక్కసారి ఆ  చిత్రం చూడనీయి! ' 


'వద్దులెండి స్వామీ! మదనుడేదో ఓ సారలా ఓరగా చూశాడనే మండిపడి కాల్లి పారేశారు గతంలో . ఈ చిత్రాలు చూస్తే ఇంకెం మందిని మసి చేస్తారో!' 


' నీ అనుమానం అసంబద్ధం భక్తా! అర్జెంటుగా ఏదైనా వరం కోరుకో!  ఇచ్చేసి  వెళ్ళిపోతాము. పన్ను రాయితీలు కాకుండా,  పెట్రో రేట్లు తగ్గింపు కాకుండా, డొనేషల్లేని కాన్వెంట్ సీటు కాకుండా, తప్పులేని తెలుగు వాచకం కాకుండా, అమెరికాకు వీసా కాకుండా, వీరప్పన్ వేరెబౌట్స్ కాకుండా, కాశ్మీరు ఇష్యూ కాకుండా, ఫ్రీ కరెంటు కాకుండా, ప్రమాదంలేని రైలు ప్రయాణం కాకుండా .. ఏదైనా ఒక వరం కోరుకొంటే ఇచ్చేసి వెళ్లి పోతాను భక్తా! ' 


' ఈ కాకుండా' ల లిస్టే చేంతాడంతుందే.... ఏమడగాలబ్బా! సరే .. టి.వీ లో పిక్చరోస్తుంది. చూడాలి. బ్రేకు టైములో ఆలోచించి అడుగుతా గానీ... ఈలోగా తమరు ఇతర భక్తుల్ని పరామర్శించి రండి స్వామీ! 


******


| ఏయ్.. ఎవరు మీరు? అర్ధరాత్రి పూట ఆడకూతుర్నేసుకుని ఏంటా పచార్లు? ' 


' నేను అయ్యవారు. ఈమె అమ్మవారు'


'వార్ ' వాళ్ళన్నమాట. సిటీలో లా అండ్ ఆర్డర్ పిటీబుల్ గా  వుంది. ఐడెంటిటీ చూపించండి! ' 


' ఐడెంటిటీనా ... అంటే?' 


' గుర్తింపు పత్రాలు.. మీరు మీరేనని ఋజువు పరిచే పత్రాలు . ' 


' ఇవిగో .. రక్షక భట భక్తా ! ' 


' ఇవేంటి?  చేతుల్లో ఆకులు పెట్టేశావు?'


' పత్రాలు అడిగావు కదా బిడ్డా  ! మా 'రేడు' కు మారేడు పత్రాలే గుర్తింపు పత్రాలు పుత్రా!' అంది పార్వతి ప్రేమతో. 


'ఏందో .. గోల! ఒకే! ఆ చేతిలో ఆ శూలమేంటి? కొంపతీసి శివ సేన బాపతా? ' 


'సేన ఏం ఖర్మ నాయనా శివుడినే ! లయకారుడిని '


'లయకారుడైనా సరే...లైసెన్సుండాల్సిందే! నడవండి స్టేషనుకు ' 


' మేమొచ్చి స్టేషన్లో కూచుంటే భోజనాలు మానేసి భజనలు చేసే భక్తజనులను ఆదు కొనే నాథుడేడీ? ' 


' ఎక్కడో తిక్కశంకరంలాగున్నావే ! మీ బోళా తనం చూస్తే జాలేస్తుంది. పోనీ.. విడిచి పెడతాగానీ.. నా చేతిలో ఏదన్నా పెడ తావా?'


'ఇదిగో!'


'ఇదేంది. బూడిదిచ్చావు?' 


' ఆదిదేవుడి దగ్గర వుండేది బూడిదే బాబూ! ' 


'ముక్కంటీ! మీ ముక్కు మరీ సూటి.  మీతో పనికాదుగానీ ముందా నందిని పిలవండి!' అంది పార్వతి పరమచిరాగ్గా. 


'నంది మీకు బంధువా తల్లీ! మరా ముక్కముందే చెప్పారు 

కాదేం ' అంటూ కానిస్టేబుల్ కనకాంబరం ఫోన్లో నెంబరు

కలిపి శివుడి చేతిలో పెట్టాడు రిసీవరు. 


అవతల్నుంచీ నంది గొంతు . 


' సర్వ జగత్ రక్షకా!  భూతలమంతా కాలుష్యభూతమా వరించి వుంది.  చూశారుగా స్వామీ! ధ్వని కాలుష్యం, పొగ కాలుష్యం, వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం, సాంఘిక కాలుష్యం, సాంస్కృతిక కాలుష్యం. ఆఖరికి భక్తిలో కూడా కాలుష్యమే... భూతనాథా! జగన్మాతతో కలిసి మీరే ఈ కాలుష్య భూతాలనంతమొందించాలి। ముక్కంటి నీవే దిక్కంటీ! ' 


'భూలోకం మరిగి  బాగానే ఉపన్యా సాలు దంచుతున్నావూ! 


‘లౌక్యం లేనిదే ఈ లోకంలో రాణించ లేము స్వామీ!  కాసులోనే తిరకాసంతా వుంది కాశీ పతీ!  ' 


' సర్సరే! భూలోకం వచ్చి బుద్ధొచ్చింది. ముందు మనందరం కైలాసం చేరే మార్గం చూడు.. నందీ! '


' ఒన్ మినిట్ .. ఓంకార స్వామీ! ' 


' ఓ.కే! ఒక్క నిమిషం కూడా మేముండలేనిదీ భూలోకం . పని తొందరగా కానీయి నందీ! ' 


' చిత్తం. ఈ రక్షక భట భక్తుడితో  ఇప్పుడే మాట్లాడాను మహాదేవా!  బొందితో కైలాసం తీసుకెళతామని బేరం కూడా పెట్టాను.  'వద్దు వరల్డు కప్పు చూడాలనుంది. సౌతాఫ్రికా పంపించండి .. చాలని బేరమాడుతున్నాడు' 


' ఈ  భూమ్మీది స్టేషన్ సెల్ లో చీమలు తెగ కుట్టి చంపేస్తున్నాయి. .. నా అనుమతి లేకుండానే! సరే అనేసెయ్ ! సరాసరి కైలాసానికెళ్లి పోతాం గౌరీ .. నేనూ! 


*****

-  కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- 01/03/2003 - శివరాత్రి పర్వదిన సందర్భంగా - ప్రచురితం ) 

ఈనాడు- సంపాదకీయం అమ్మపాలే అమృతం కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపాదకీయం - ( 31 -07 - 2011 )

 

ఈనాడుసంపాదకీయం

అమ్మపాలే అమృతం

కర్లపాలెం హనుమంతరావు

ఈనాడు - సంపాదకీయం - ( 31 -07 - 2011 ) 

 



ఈనాడు- సంపాదకీయం 

అమ్మపాలే అమృతం 

కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - ( 31 -07 - 2011 ) 


పుట్టి పుట్టకముందే తనువు చాలిస్తున్న జీవులకు అందించేటం దుకు చాలినంత అమృతం లేక అమ్మను సృష్టించి దైవం తనకు మారుగా భూమ్మీదకు పంపించాడని ఓ ప్రాచీన కావ్య చమ త్కారం. తల్లిని మించిన దైవం ధారుణిమీద లేదన్నది సర్వకాల సర్వావస్థలలో  సకల శాస్త్రాలూ విశ్వవ్యాప్తంగా ఏకీభవించిన ధర్మ సూక్తం.  జగద్గురువు శంకర భగవత్పాదులు ప్రస్తుతించినట్లు మాత- ఒక్క మానవ జాతికే కాదు... సురాసుర దేవ మునీశ్వర మానస మందిరాల్లో కొలువై ఉన్న మమకార దేవత. జగన్మాత అయినా అంబికమ్మ ఒడిలో బాలషణ్ముఖి చేరగానే స్తన్యమందించి ఓ మామూలు తల్లిలా ఎలా పరవశిస్తుందో 'కుమార సంభవం'లో కాళిదాసు మహాద్భుతంగా వర్ణించాడు. ఆ సందర్భంలో ఆ మహా కవి అన్నట్లు 'బిడ్డను చూసి పరవశించని తల్లి ముల్లోకాల్లో ఎక్క డైనా ఉంటుందా?' అని. ' తల్లికి కన్న పేగును తనివితీరా చూసుకోనేందుకు  తనువంతా కళ్లున్నా ఎలా చాలవో... పసిపోగుకీ తల్లిఒడిలో చేరి ఆడుకునేందుకు  అంతకు వెయ్యిరెట్లు రెక్కలున్నా సరిపోవు'  అంటాడు చలం. ఉయ్యాలలో  కక్కటిల్లిపోయే బిడ్డడు పుట్టు బిందెలు బూని పులిగోళ్లు బూని జనకుడూ మీ తాత వచ్చె ఏడ వకూ!' అని మరిపించబోయినా ఏడుపు ఆపలేదు. 'ఉగ్గు బంగరు గిన్నె ఉయ్యాల కొనుచూ ఊర్మిళ పినతల్లి వచ్చె నేడవకూ!' అని మురిపించబోయినా మారాము మానలేదు. అయోధ్యకెళదాము... అయ్య ఏడవకూ!' అని బులిపించబోయినా అల్లరి ఆపని ఆ బుల్లిపిడుగు సీతమ్మ తల్లొచ్చి చెంగు అడ్డుపెట్టుకొని స్తన్యమందించగానే నోరింత చేసుకొని కేరింతలు కొట్టాడని- ఓ జానపద గీతం ముచ్చట. స్తన్యమందించడమనే ప్రాకృతిక ధర్మం తల్లీబిడ్డల పేగుబంధాన్ని మరింత సుదృఢంగా మారుస్తుంది.


రక్తానికి రంగుమార్చి క్షీరధారగా- పేగు తెంపుకొని పుట్టిన పసి కందు నోటికందించటానికి తహతహ పడని తల్లి ఉంటుందా ఏ లోకంలోనైనా?  ఆయుర్వేదం ప్రకారం పసివగ్గు తొలి ఆరు మాసాలూ సంపూర్ణంగా పాలమీదే ఆధారపడే క్షీరద.  చనుబాలు పసిబాల జన్మహక్కు. జాషువా భావించినట్లు 'అక్షయంబైన మాతృ క్షీర మధురలంబుగా తెచ్చుకున్న అతిథి - బుజ్జిపాపాయి. కన్నబిడ్డకు తనివితీరా తల్లి చన్నివ్వలేని దురదృష్ట పరిస్థితుల్లో సైతం పాలివ్వదగిన, పాలివ్వగలిగిన 'ధాత్రి, ఉపమాత వ్యవస్థల ను ఏర్పాటు చేసుకున్న సంస్కృతి మనది. భోజరాజీయంలో- చంపి భోంచేస్తానని హుంకరించిన బెబ్బులికి బెదరలేదు గంగిగోవు. ఆ తల్లి బెంగంతా 'మునుమును పుట్టి... ఏడెనిమిదినాళ్ల పాటి గలిగి ఇంత పూరియు మేయనేరని ముద్దుల పట్టి' గురించే. తల్లిలేని కైలాసవాసుడికి తనను తానే తల్లిగా భావించుకుని చన్నిచ్చి సాకే ప్రయత్నం చేసింది బసవ పురాణంలోని బెజ్జమహాదేవి. హాలాహలం మినహా ఏ అమృతం రుచి ఎరుగని ఆ ఫాలాక్షుడికీ బహుశా తల్లిపాల చవి అంత నచ్చినందువల్లనేనేమో- ఆ అమ్మకు నిత్యత్వం ప్రసాదించింది! రొమ్ము గుద్దినా సరే... కమ్మని పాలు కడుపారా కన్నబిడ్డకు అందించడంలోనే జన్మసార్థకత ఉందని తల్లులు తలచే ధర్మకాలం మారుతోందా మెల్లమెల్లగా! శిశువుకు  చన్నివ్వడం శరీరాకృతిని వికృతంగా మార్చే హీనచర్య అనే అపోహ మాతలను బెబ్బులికన్నా ఎక్కువగా బెదరగొడుతోందా? బతుకు పోరాటంలో పెరుగుతున్న ఒత్తిళ్లు పొత్తిళ్ల పాపాయిలను తల్లి ఒడినుంచి ఎడమ చేయడం కాదనలేని చేదునిజం.


ప్రసవానంతరం మూడు రోజులపాటు స్రవించే ముర్రుపాలు శిశుదశలోనే రోగనిరోధక శక్తి సామర్ధ్యాన్ని అపరిమితంగా పెంచే దివ్యౌషధం. ఎదుగుదల దశలో బిడ్డ ఎదుర్కొనే వివిధ వ్యాధు లకు నివారణ మంత్రం- తదనంతరమూ తల్లిద్వారా అందే ఆ క్షీరామృతం.  తాగినంత కాలమే కాదు తల్లిపాలతో మేలు... పాలు తాగడమనే చిన్న కిస్తీ క్రమం తప్పకుండా చెల్లిస్తే చాలు ముందున్న బతుకంతా అందుతుంది ఆరోగ్య బీమా . స్తన్యక్షీరం ఒక్క కన్నయ్యకే కాదు... కన్నతల్లి దైహిక మానసిక వికాసానికీ ఎంతో మేలు- అంటోంది అష్టాంగ హృదయ సంహిత. నివార్య మైన ఎన్నో తల్లి రుగ్మతలకు సంతోషకరమైన సంజీవని సూత్రం చంటిబిడ్డకు చెంగుచాటు నుంచి చన్నిచ్చే సహజ కార్యం. తనివి తీరా చిట్టిపాపకు చనుబాలు అందించడం అందాన్ని హరించే హీన చర్య కాదు. గుండెబరువును దింపుకొనే ఆ ఆనందకర యోగం ఆడతనం అందాలను మరింత మెరుగులు పరచే సౌందర్య సాధనమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆయుర్వే దంలోని నస్యకర్మ విధి కోసమూ, కంటివ్యాధులకు చేసే 'తర్పణం' చికిత్స విధానం కోసమూ ఓ మందుగా వాడుతుండటమే చనుబాల విశేష ఔషధగుణానికి తిరుగులేని తార్కాణం. నాలుగు వందల పోషక పదార్థాలు రంగరించి ఉండే తల్లిపాలకు ఏ ఆవు, మేక, ఒంటె, డబ్బా పాలు ప్రత్యామ్నాయాలు కాలేవు. 'నాలుగు వేల క్షీరదాల్లో అత్యున్నతమైనది మానవజన్మ. మరి మనిషికొక్క డికే ఈ తల్లిపాల విషయంలో శషభిషలెందుకో? స్తన్య స్పర్శ హర్షానుభూతి తల్లికీ, క్షీరామృత ప్రేమ వర్షానుభూతి బిడ్డకీ  ఎన్ని జన్మలెత్తితే మళ్ళీ అనుభవానికందేను? 'తల్లిపాలు తాగి పెరిగే కన్నయ్యలకే లోకమంతా వ్రేపల్లెలా లోకులంతా యశోదమ్మలుగా తోచే అవకాశం అధికంగా ఉందని 'ది జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్' తాజా వ్యాసం చెబుతోంది. ప్రాశస్త్య ప్రస్తుతితో సరిపుచ్చకుండా పాలివ్వడంలోని సవాలక్ష అపోహల మీద తల్లులకు సమగ్రావగాహన కల్పించగలిగితేనే  'తల్లిపాల వారోత్సవాల'  సంకల్పసిద్ధి నెరవేరేది!


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - ( 31 -07 - 2011 ) 

రుణ మూలం ఇదం జగత్ అప్పుల తిప్పలు కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపాదకీయ పుట - గల్పిక-

 




ఈనాడు - గల్పిక

రుణ మూలం ఇదం జగత్ 

అప్పుల తిప్పలు 

కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సంపాదకీయ పుట - గల్పిక- ప్రచురితం. ( తేదీ నమోదు చేయలేదు ) 


అయిపోయిందిరా.. అంతా.. అయిపోయింది ! 

ప్రపంచం యావత్తూ ప్రళయం అంచుకు వచ్చేసింది?


ఏమైంది బాబాయ్ ఎందుకీ ఆందోళన?  పిన్నిగానీ నీకు రెండోసారి కాఫీ ఇవ్వను పొమ్మని తన్ని తరిమేసిందా ఏందీ?


పోరా!  అక్కడ అమెరికావాడి పరపతికి గండిపడిపో తుంటే... ఇక్కడ నీకు పరాచికాలుగా ఉంది! వందేళ్లలో ఎప్పుడైనా విన్నామా... పెద్దన్న పరువు రేటు ఇలా దిగజారడం!  ఇది కాలబ్రహ్మంగారూ ఊహించని దారుణంరా బాబూ! 


ఆ.. అదా నీ బాద 


నాదొక్కడిదే ఏందిరా! .. మన మునసబును పోయి చూసిరా! .... పాపం, మూడు రోజుల బట్టి మూసిన కన్ను తెరవకుండా ఒబామా.... ఒహమా ..అంటూ పాపం బహటే కలవరింతలు ! 


ఓస్.. ఆ దిగులు ఒబామాను గురించి అనుకున్నావా  బాబాయ్! ఆయన గారమ్మాయి సత్యభామ న్యూయార్కులో ఉద్యోగం వెలగబెడుతోందిగా... ఆ పిల్ల పంపించే డాలర్లతో మన మాజీ మున్సబు  ఇక్కడ అడ్డమైన  షేర్లూ కొంటుంటాడు. అవేవో ఉన్నట్టుండి కుప్పకూలాయని ఈయన కుమి లిపోతున్నాడు. ఆ పిల్లకి పెళ్ళి పెట్టుకున్నాడు... ఈ శ్రావణంలో... కొందామంటే మార్కెట్లో బంగారం భగ్గుమని మండిపోతుందా... అదీ ఆయన కలవరింతలు ... ఒబామా ఒబామా అని కాదు.  ఆ ఏడుపు- 'ఓ భామా... ఓ సత్య భామా' అన్నగోల అది . పెద్దతనం వల్ల  నీకు సరిగ్గా వినబడలేదు.. అదే తేడా!


మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అంటారు. దీన్నే... అంతంత అప్పులు చేసి ఆస్తులు కూడబె ట్టకపోతే ఏ దేవుడేడ్చాడురా'  కూతురికి ఇక్కడే ఒక మంచి సంబంధం చూసి మూడుముళ్లు వేయించేస్తే ప్రాణానికి ఎంత తెరిపి। అప్పులు చేసి ఆ పిల్లను అక్కడెక్కడికో అమెరి కాకు తరుమటమెందుకూ...ఇలా గుండెనొప్పులూ గట్రా తెచ్చుకోవడమెందుకూ? 


అదేంటి బాబాయ్! తెలివిగలవాడివి... నువ్వు అంత మాట అనేశావ్! అపునలా అప్పును తుప్పుసామానుకింద తీసిపారే శావ్? అప్పిచ్చువాడు లేని ఊళ్లో ఉండొద్దన్న సుమతీశతకం నువ్వే కదా చిన్నప్పుడు నా చేత ఒప్పజెప్పించుకునేవాడివి:  వేలె డంత లేడు నీ మనవడికి- కూడికలూ తీసివేతలూ నేర్పుతూ వేళ్ళు ముడిచి మరీ అప్పు తెచ్చుకోవడమెలాగో అంత కష్టపడి నేర్పిస్తున్నావ్! రోజూ నిద్రలేవగానే ముందు వినే ఆ సుప్ర భాతం ఎవరిది?... ఆ ఏడుకొండలవాడే పప్పన్నం పెట్టించడానికి  కుబేరుడి దగ్గర అంతంత లావు  అప్పులు చేయగా లేనిది... మానవమాత్రులం మనం. . 


దేవుడూ, నువ్వూ ఒకటే ఎలాగవుతార్రా? 


ఒకటి కాం సరే... ఒప్పుకొంటాగానీ, మరి మొన్న గుళ్ళో పురాణం చెప్పే శాస్త్రులూ పంచభూతాల్లో అప్పూ ఒక టని చెప్పాడే..


''ఆ అప్పు.. ఈ అప్పు కాదురా బాబూ! నీళ్లు. 


సరే.. ఆ నీళ్లే .. ఆ అప్పే. . మన ఒంట్లో పంచదాతువుల సమ్మిశ్రితంగా ఉందని అంటావుగదా నువ్వే! ఒంటిలోపల ఉన్నప్పుడు..  గొప్పదైనప్పుడు ఒంటి బైట ఉంటే అది తప్పెట్లా  అవుతుంది.. చెప్పు! 


 నీ వాదనేదో తలతిక్కగా ఉందనిపిస్తోందిరా అబ్బాయ్....


తలతిరుగుతోందా! పోనీ అదలా వదిలేసి.. ఆ తలనే తీసుకో బాబాయ్... తల తాకట్టు పెట్టి అయినా ఆడపిల్ల పెళ్ళి చేయాలంటుంది. మా బామ్మ. పెళ్ళిళ్లు పురుళ్లకూ పనికొచ్చే తాకట్లు, చేబ దుళ్లు షేర్లు కొంటానికి, సరదాగా బళ్లు, బంగళాలు కొనటా నికి ఎట్లా చేదైపోతాయ్ బాబాయ్?  సందు దొరికింది కదా అని ఇప్పుడు అమెరికాను ఆడిపోసుకుంటున్నావుగానీ... అసలు ఆ అమెరికా పుట్టుకకే అప్పు మూలం తెలుసా! అప్పు చేసి తిరుగుతున్న ట్రిపుల్లోనేగదా కొలంబస్ అమెరికాను కని పెట్టింది! అప్పనేదే  లేకపోతే అప్పుడే కాదు... ఇప్పుడూ అసలు అమెరికా అనేదే ప్రపంచపటంలో ఉండేది కాదు. అప్పు చేశారో... పప్పు  చేశారో... ఇవాళ ప్రపంచానికంతటికీ అదేగదా రారాజు: మరి అప్పు గొప్పే అవుతుందిగాని.... ముప్పెలా అవుతుందో చెప్ప బాబాయ్... వింటా'


అరేయ్.. నీ అమెరికా అభిమానం మరీ ముదిరి పాకాన పడుతోందిరా! నీ ధోరణిచూస్తే నాకు గుండెల్లో దడ మొదలైంది. అమెరికా అంటే నాకెందుకుంటుందిరా పగ ? ఇవాళ మనూళ్ళో ఇంటికొకడు నాలుగు రాళ్లు సంపాదించి.. ఇంటికి పంపించగలుగుతున్నాడంటే  అదంతా ఆ అమెరికా వెళ్ళిన పుణ్యమే!  ఒప్పుకుంటా! కాకపోతే కాస్త వెనకా ముందూ  చూసుకొని కదా వ్యయం  చేసుకోవాలి? పక్ష మంతా సంపాదించుకొన్నది శని .. ఆదివారాలలో  ఎవరో తరుముతున్నట్లు ఆసాంతం ఖర్చుపెట్టేయడమే: అంత అవసరమా అన్నది నా ప్రశ్న. రేపంటూ ఒకటుంటుదని... రోగం రొష్టు ఎప్పుడొస్తుందో ఆ పుట్టించిన బ్రహ్మ వుడికైనా తెలియదన్న తెలివే లేకపోవటం ఒక్కటే నాక విచారం కలిగిస్తోంది. అన్నింటికీ అమెరికావాడిని గుడ్డిగా అనుకరించే మన పిల్లకాకులు ఎక్కడ ఉండేలు దెబ్బ తగిలి పడిపోతారన్నదేరా బాబూ నా దిగులు'


అమెరికా సంగతి ఆ ఒబామా బృందానికి వదిలెయ్ బాబాయ్! సంపాదించుకొన్న దాంట్లోనుంచే ఖర్చు చేసుకోవాలని ఆంక్ష పెడితే డబ్బు చలామణీ మందగించి మళ్ళీ ఆ ఆర్థికమాంద్యం పుంజుకొంటుంది. అప్పనే  పదార్థం ఒకటి లేక పోతే బ్యాంకుల్లాంటి వాటికసలు ఉనికే ఉండదు తెలుసా ! వాళ్ల డిపాజిట్లు ఏంటి.. జనం దగ్గరనుంచి తీసుకున్న అప్పులే గదా! వాటినే మళ్ళా అప్పులుగా పంచిపెడుతుంటారు. సంపాదించిన దాంతోనే కొనుక్కోవాలంటే మనం మామూలు ఇళ్లు కాదు కదా కనీసం... పిచ్చుక గూళ్లు కూడా కట్టలేం


అదే నేననేది . సులభ వాయిదాల్లో వస్తున్నాయని సురభి కామధేనువునూ పెరట్లో కట్టేసుకోవాలనుకోవడమే కొంప ముంచేస్తుందిరా! ఇప్పుడు అమెరికా వాడికి జరిగిందే... రేపు మనకూ జరగదని గ్యారంటీ... ఏంటీ? అప్పు నిప్పుతో సమానందా నాయనా! 






బాబాయ్! సంపాదించుకొన్న దాంట్లోనుంచే ఖర్చు చేసుకోవా లని ఆంక్ష పెడితే డబ్బు చలామణి మందగించి మళ్ళీ ఆర్థి కమాంద్యం పుంజుకొంటుంది. అప్పుడే పదార్థం ఒకటి లేక పోతే బ్యాంకుల్లాంటి వాటికసలు ఉనికే ఉండదు తెలుసా? వాళ్ల డిపాజిట్లు ఏంటి.... జనం దగ్గరనుంచి తీసుకున్న అప్పులే గదా... వాటినే మళ్ళా అప్పులుగా పంచిపెడుతుం టారు. సంపాదించిన దాంతోనే కొనుక్కోవాలంటే మనం మామూలు ఇళ్లు కాదు కదా కనీసం... పిచ్చుక గూళ్లు కూడా కట్టలేం! 


'అదే నేననేది.  సులభ వాయిదాల్లో వస్తున్నాయని సురభి కామధేనువునూ పెరట్లో కట్టేసుకోవాలనుకోవడమే కొంప ముంచేస్తుందిరా! ఇప్పుడు అమెరికా వాడికి జరిగిందే... రేపు మనకూ జరగదని గ్యారంటీ... ఏంటీ? అప్పు నిప్పుతో సమానంరా నాయనా! 


బాబాయ్... నువ్ మారాలి. ముళ్ళపూడి అని ఒక పెద్దాయన ఈ అప్పులమీదే పెద్ద గ్రంథం రాశాడు. ముందది ఎక్కడన్నా అరువు తెచ్చుకొని చదివి చూడు. అప్పుడుగానీ... నీకు అప్పు గొప్పతనం బోధపడదు. లోకంలో రెండే రకాలు. అప్పులిచ్చేవాళ్లు, అప్పు తీసుకొ నేవాళ్లు.  అప్పంటే  ఎదుటివాడు చెమటోడ్చి సంపాదించిన దాన్ని మనం ఎంచక్కా చొక్కా మడత నలగకుండా ఖర్చు పెట్టుకునే సౌకర్యం. చాటుమాటు డబ్బు వ్యవహారాలకు బహిరంగ గౌరవవాచకం అప్పు.  కరుణానిధి కూతుర్ని చూడు. .  టూజీలో నొక్కేసిన రెండువందల కోట్లను అప్పుగా చూపించి తప్పించుకోవాలనుకుంటోంది. పావలా వడ్డీ రుణాల పేర్లు చెప్పి సింహాసనాలెక్కిన మహా నేతలు మనకున్నారు. పంటరుణాలు తీసుకుని పెంచిన పొలా లనుంచే నువ్వైనా నేనైనా.... రోజూ ఇంత అన్నం తినేది. అప్పు మన రక్తంలో ప్రవహిస్తోంది బాబాయ్! 


మానవ సంబంధాలన్నీ రుణానుబంధాలే.. అంటావ్ ! 


అందీ మంచి మాట! ... ఓ పాతిక ఉంటే కొట్టూ... రెండోసారి కాఫీ పడక... గుండె కొట్టుకుంటోంది!'


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సంపాదకీయ పుట - గల్పిక- ప్రచురితం. ( తేదీ నమోదు చేయలేదు ) 

ఈనాడు - గల్పిక దీనజనుల ఘోష - రచన: కర్లపాలెం హనుమంతరావు

 



ఈనాడు - గల్పిక

దీనజనుల ఘోష

రచనకర్లపాలెం హనుమంతరావు


ఈనాడు - గల్పిక

దీనజనుల ఘోష

- రచన: కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - 15 - 12 -2011 - ప్రచురితం ) 


ఉన్నావా?  అసలున్నవా? ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం

కుళ్ళు చూడుకున్నావా..


అదేం లేదు లేవయ్యా! పాలక కడలి .. అందులోనూ పాముపడగల మెత్త. . శ్రీదేవి కాళ్లు నొక్కుతుంటే- కాస్త కళ్లు అలా మత్తుగా మూతలు పడ్డాయంతే. దానికే ఇంత దీనంగా పాటెత్తుకోవాలా భక్తా! ఇంతకూ ఎందుకొ చ్చింది నాపై నీకా సందేహం? 


నీ గుడిని లేపేసి మరో గుడికి ముడుపులిచ్చిన 'గాలి'కి నీ దీవెనలా? ... చెత్త పనులు చేసి చెరసాలపాలైతే ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తావా? ... నీ పేరు చెప్పుకోగానే బెయిళ్లు ఇప్పిస్తావా? చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటే బయటపడుతుంటే దిక్కుతోచక కన్నీళ్లు పెట్టుకుంటేనే కరిగిపోవాలా? నిజంగా నువ్వు తోడూనీడుగా ఉండవలసింది  అభాగ్యులకు, అమాయకులకు కాదా మహాదేవా?


కాదని నేనెప్పుడన్నాను నాయనా! కన్నీరు పెట్టుకున్నా కరిగిపోకుండా ఉండటానికి నేనేమన్నా నిజం బండరాయినా! భక్తసులభుడిని


ఏం భక్త సులభుడివో. పేరుకు మాత్రమే నీవి ఉచిత దర్శనాలు. నిన్ను కలవడానికి ఎన్నెన్ని కష్టాలో పడాలి! సామాన్యులకు కిలో బియ్యం రూపాయికి దొరుకుతున్నా, నీ ఉచిత ప్రసాదం పది రూపాయలకు చేరుకుంది. లోకాన్ని చల్లగా కాపాడమని నువ్వు పదవులిచ్చిన వాళ్లందరూ, నిధులన్నింటినీ లడ్డూ ప్రసాదాలు చేసి  భోంచేస్తున్నారు దామోదరా! నిజం చెప్పు నిరంజనా... నువ్వు అందరివాడివా, అందలాలెక్కి కూర్చున్న కొందరివాడివా? నువ్విలాగే శేషతల్పం మీద కునుకు తీస్తుంటే- నిన్ను నమ్ముకున్నవారే నిన్ను ఒంటరిని చేయడం ఖాయం .. గోవిందా!


ఎవరికి ఉందంత దుస్సాహసం? 


భలేవాడివి స్వామీ!  నీ భూముల సర్వే నెంబర్లు మార్చేసి అమ్మిపారేసుకుంటున్నా అలా చూస్తున్నావే! నీ గాలిగోపురాలనే కాపాడుకోలేని వాడివి- మానవాసురుల నుంచి మమ్మల్నేం కాపాడతావు?


తొందరొద్దు భక్తా! దేనికైనా పాపం పండాలి. శిక్షపడాలి. అదీ ధర్మరక్షణ విధానం. 


అందాకా తమరు స్తంభంలో నక్కి ఉంటారా నరహరీ ! తమరు తీరిగ్గా గోళ్ళూ కోరలూ పెంచు కొచ్చేదాకా బక్కజీవులం ఆ క్రూరమృగాలకు కూరలో పులుసు ముక్కల్లాగా నలుగుతుండాల్సిందేనా! మా సంగతి తరువాత.. నీకు ముంచుకొ స్తున్న ముప్పు సంగతయినా  ముందు చూసుకోవద్దా  గోవిందా! 


జగజేతను నాకు ముప్పా! 


అవును పరంధామా! దేవుడి పేరు చెప్పి రాష్ట్రాన్ని కొల్లగొట్టినవారి బాగోతాలు ఇప్పుడిప్పుడే  వెలుగు చూస్తున్నాయి. వేలకోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి తవ్వించిన జలయజ్ఞం కాలువల్లోకి చుక్కనీరైనా తెప్పించలేకపోయావే నీవు . గుప్పెడు అటు కులకే కుచేలుడికి అప్లైశ్వర్యాలు గుప్పించిన ప్రేమ మూర్తివి. చిటికెడు ఉప్పు కూడా కొనలేని దౌర్భా గ్యస్థితికి మమ్మల్ని ఎందుకు దిగజార్చినావయ్యా  మహానుభావా?


ఆగక్కడ. ఆదుకోవడానికి ఇప్పుడు మీ లోకంలో కుచేలురు ఎక్కడున్నారు? రోజుకు మూడు రూపా యలు మించి సంపాదన ఉంటే కుబేరుడే అవుతాడని 

మీ సర్కారు లెక్కలే చెబుతున్నాయి గదా! 


ఆ మాయా తమరి చలవే కదా  మాయా వినోదా! ఏ వేళ  లీలలు చూపించడం ప్రారంభించావోగానీ, ఇప్పుడు సర్కారు పెద్దలందరికీ నువ్వే ఆదర్శం. శిష్టరక్షణ కోసం అనాడు నువ్వు 'చక్రం' తిప్పావు.  స్వీయర క్షణకోసం వీళ్లు దాన్ని ప్పుడు వాడుకుంటున్నారు .వామనావతారంలో మూడు అడుగులు ఆక్రమించి, దుష్ట సంహారం చేశావు.  అక్రమార్కులు భూకబ్జాలు  చేస్తూ వీళ్లు  శిష్టులను బాధిస్తున్నారు. ఇలా పాపాలు పండించడం భావ్యమా లోకపాలకా ? లోకల్ పాలకులూ వాళ్ల తప్పుడు పాలనకు ఇప్పుడు తమరి పేరే  పద్దాకా జపిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త!  అని చెప్పడానికేనయ్యా ఈ ఆత్రుతంతా!


పరగడుపునే పరాచికాలా  నాయనా! 


పరాచికాలా! అందుకోసమే అయితే నిక్షేపం లాంటి నీ యోగ నిద్రనెందుకు పాడుచే స్తాను పరమాత్మా! రూపాయి విలువ పడిపోతోందంటే రేపో మాపో లేచి నిలబడుతుందనుకుంటాం. దేవుడి విలువే పడి పోతుంటే- మాబోటి దీనజనుల కింక దిక్కెవరు దేవదేవా? నీ పేరు మీద వీళ్ల బాగోతం ఇలాగే కొనసాగుతుండబట్టే- ఉన్నావా అసలున్నావా అంటూ బాధతో పాడుకోవాల్సి వస్తోంది'


అరెరే, ఇప్పుడు నేనేం చేయాలి భక్తా? 


అల్పజీవిని. అదీ నీకు నేనే చెప్పాలా మహాజ్ఞానీ! నువ్వు మూలవిరాట్టువి. పండగ రోజుల్లో ఉత్సవ విగ్రహాలు ఊరేగుతాయి. నీ పేరును రకరకాలుగా దుర్వినియోగం చేసినవారంతా నాయకుల పేరిట ఊరేగుతున్నారు . నీ పేరు చెప్పి జనాలకు చిల్లర డబ్బులు విసిరి , ప్రజాధనంతో టోకున తమ వ్యాపారాలు పెంచుకుంటున్నారు . ఆ దుష్టుల  భరతం పట్టడా నికి, దీనజనుల బాధలు తీర్చడానికి దిగిరావయ్యా కిందకు! నువ్వున్నావని నిరూపించుకోవయ్యా మాకందరకూ ! 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు -  15-12- 2011 - ప్రచురితం ) 

ఈనాడు - గల్పిక చరిత్ర చెప్పే పాఠం కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - గల్పిక- 10 - 09-2011 )

 



ఈనాడు - గల్పిక

చరిత్ర చెప్పే పాఠం 

కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - గల్పిక- 10 - 09-2011 ) 


శ్రీరామచంద్రుడి దయలేకపోతే ఎంత మంది శ్రీరాములున్నా ఏమీ సాయంచేయలేర్రా ! 


గాలి గారి గురించేనా నువ్వనేది బాబాయ్ ? వినాయక చవితినాడు పూజ చేయకముందే చంద్రుణ్ణి చూసేసినాట్లున్నాడు . 


తెల్లరగట్లే బంగారు ఆసనంమీద సింహంలాగా కూర్చున్నవాడు. పొదుగూకే లోపలే చంచల్ గూడా జైల్లో చిట్టెలుకగా  తేలాడంటే  అదంతా జాతకచక్రంలోని దోషం వల్లనేరా  ! ఎన్ని వందల సెల్ ఫోన్లుంటే మాత్రమేం యూజ్ ... 'సెల్" యోగం తప్పించలేనప్పుడు ! కోట్లుపోసి కొనుక్కుని పెట్టు కున్నాడు అన్నన్ని హెలికాప్టర్లూ,  చాప్టర్లూ! ఒక్కటైనా ముగిసిపోయిన ఆయన చాప్టర్ మళ్ళీ తెరనగలగిందా 


గోనెసంచుల్లో కుక్కి  నేలమాళిగలో పూడ్చిపెట్టించాడు అన్నేసి వందలకోట్లు.  తలలూపే నేతల్నీ, తోకలూపే అధికారుల్ని మేపటానికీ,   ఓట్లను కొనడానికైతే అవి పనికొస్తాయేమోగానీ- జైలు చిప్పకూల్లో సంజుకోవడానికి ఒక్క  పచ్చిమిర్చి  కొండానికైనా  అవిప్పుడు పనికొచ్చేనా? 


తలరాతను తప్పించడం పుట్టించిన బ్రహ్మ తరం కూడా కాదు. సద్దాం హుసేన్ గుర్తున్నాడుగదా! .. చివరి రోజుల్లో కలుగులో కాలక్షేపం చేశాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ని పేకముక్కల్లా కూల్చేసిన బిన్‌ లాడెన్ బతుకేమైంది? అమెరికా కమెండో తుపాకీ గుండుకు టుపుక్కుమని సెకనులో చచ్చూరు కున్నాడు. హోస్నీ ముబారక్ కుక్కిమంచంలోనే ముక్కుతూ మూలుగుతూ కోర్టుల చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. ఎంత కిలాడీ అయినా, కాలం కలిసే  వరకే వైకుంఠపాళిలో పైకి ఎగబాకేది . అందాకా  అదంతా తమ ఘనకార్యమే అన్న భ్రమలో తేలుతుంటారు .. ఇదిగో .. ఈ  గాలి సోదరులకు మల్లే . గాలి ఎదురు వీస్తే ఎన్ని మతిమరుపు వేషాలేసినా కొట్టుకుపోడమే! గడాఫీ లనుంచి కల్మాడీల దాకా అందరిదీ ఒకే స్టోరీ . అయినా, ఒక్కడికీ వంటబట్ట దేంట్రా ..చరిత్ర మొత్తుకునే  పాఠాలో! 


నువ్వెందుకు బాబాయ్ అంతలా తల బాదుకొంటావ్ ! గ్రహాల అనుగ్రహం వల్లే బిల్ క్లింటన్ పక్కన చోటు దక్కిందని రామలింగరాజు నాడు మురుసుకున్నాడా ! తమిళంలో మా గొప్ప కవితలు   రాస్తానని గొప్పలు పోమే   ఆ కరుణానిధి సొంత కూతురు కనిమొళి జాతకం . చివరికేమైంది?  బడికెళ్లే చిన్నారి కూతురుకు 'టాటా.. బైబై  ' చెప్పుకోలేనంత చిక్కుల్లో పడింది! 


అవున్రా! ఎన్ని హెలికాఫ్టర్లు, లక్జోరియస్  బస్సులా కార్లూ జిప్సీలూ కొని దాచుకొంటే ఏంటి? కాలం కలిసి రానప్పుడు   పోలీసువాడి వాహనంలోనే అత్తారింటికి ప్రయాణం!  నేడు మధుకోడా, నేడు  జనార్ధన్రెడ్డి , నకిలీస్టాం పుల తెల్గీ ' స్టాక్ మార్కెట్ కంపు హర్షద్ మెహతా, అక్కడెక్కడి రాడో అమర్సింగు.. అందరిదీ  కొసమెరువు కథా ఒకటే ఒకటి. అయినా ఒక్కడూ పిసరంత నేర్చుకోడు! 


గురుస్థానం ఉచ్ఛ  స్థితిలో ఉన్నంత కాలమే ఏ చంద్రస్వామి ప్రభావమైనా! ఏల్నాటి శని ఎప్పుకొచ్చి పడేనో  ఎవడికి తెలుసు!ఎవడికీ ముందస్తు ఏర్పాట్లు ఉండవు! అందుకే   మహామహా నేతలు, కుబేరులు, శాంతిదూతలంతా వలకు చిక్కిన చేపల్లా గిలగిలా  కొట్టుకునేది! ... ఆ టూ-జీ రాజా కథ టూకీగా చదివినా చరిత్ర చెప్పే పాఠం ఈజీగా అర్థమవుతుంది . ' కాగ్' డ్రస్సులో  శనేశ్వరుడొచ్చి ఎప్పుడు అడ్రస్ చేస్తాడో !ఊహూ .. ఒక్కడికీ ఊహ ఉండదు!  


గుబురు మీసాల వీరప్పన్ గుర్తున్నాడా? పాడు గంధం  చెక్కలకోసం ఎంత గ్రంథం నడిపాడూ! చచ్చినాక చచ్చినోడు పుచ్చు కట్టెలతో బూడిదయ్యాడు! అదే మరి! ఓపిగ్గా వినాలేగానీ .. హిస్టరీ బోల్డన్ని స్టోరీలు చెబుతుంది.  


రాశి చక్రంలో రాజపూజ్యం రాసి ఉన్నంత వరకే బాబాయ్.. గోచి గుడ్డ క్కూడా గోల్డు లైనింగు. రాష్ట్రాధినేతలు రాసిచ్చే గనులు! 


ఆ తరాజు ఒక్కసారి అవమానం వైపు తూలిందా ..  అంతటా అవమానాలే! తలరాత తల కిందులవడానికి ఒక్క రాత్రి చాలదుట్రా! పరువు నష్టం,పరుసు నష్టం.. ముదనష్టం ఎట్లాగైనా పానీ గానీ.. కనాకష్టంగా పడుకునేందుకు పరుపు దొరకడం కూడా కష్టమే! 


'నీ జోకులకు  నవ్వాలనే ఉందిగానీ, పాపం.. గాలి సోదరులు నెత్తికి పెట్టిన గోల్ట్  కిరీటంవా  ఏడుకొండలవాడి అవస్థ చూసి ఏడుపొస్తోంది . 

అన్ని తలకాయలున్న రావణాసురుడే  భూమాత పుత్రిక  సీతమ్మ  నెత్తుకెళ్లినందుకు 'రామా' అంటూ నేలకూలాడు.  వెధవలకు చివరికి మిగిలేది ఎవరం తీర్చలేని వ్యథలే! వేదకాలం బట్టి చరిత్ర మొట్టి చెప్పుకొస్తున్న పాఠం ఇదే! దుండగులు బండ వెధవలు, పాఠాల సారం  వాళ్ల  బుర్రల కెక్కకే ఇన్నేసి గండాలు!  అసలైన ఆనందం.. 


అర్థమయిందిలే బాబాయ్ ! ఆలు బిడ్డల్తో  ఓ ఆదివారం పూట ఏ టూస్టార్ హోటల్లోనో తృప్తిగా ఇంత అని ఓ చక్కటి మూవీ చూసింటికి వస్తే అంతకు మించిన  భోగం భాగ్యం ఇంకోటి లేదనేగా నీ పాఠం టీకా .. తాత్పర్యం? 


గుడ్ ! చరిత్ర చేసే హెచ్చరికా చెవిన పెట్టి బుద్ధిగా నడుచుకోడం అంతా కన్నా ముఖ్యం .  ఇనప గనులు తవ్వి  ఇంట్లో ఇనప్పెట్టెల్నిండా బంగారం పోగేసినా చివర్లో బావుకొనేదేమీ ఉండదు.. చేసిన చెత్త పన్లకి బావురమంటం తప్పించి! 

అన్న దమ్ములకు ముష్టి అయిదూళ్లు వదలడానిక్కూడా మనసొప్పక రాజ్యమంతా  దౌర్జన్యంగా అనుభవించాలనుకున్న   బడుద్ధాయ్ ధుర్యోధనుడికి పట్టిన గతే పడుతుంది. భీమసేనుడి చేత తొడలు విరగ్గొట్టించుకునే ముందు కూడా మురికి చెరువు అడుగున ముక్కు మూసుక్కూర్చోవాల్సిన దిక్కుమాలిన ఖర్మ! 

 పురాణాలు, ఇతిహాసాలే కాదబ్బీ . . చరిత్ర మొదటినుంచీ చెప్పుకొస్తున్న పాఠం కూడా ఇదే! 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - గల్పిక- 10 - 09-2011 ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...