ఈనాడు - గల్పిక
చరిత్ర చెప్పే పాఠం
కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - గల్పిక- 10 - 09-2011 )
శ్రీరామచంద్రుడి దయలేకపోతే ఎంత మంది శ్రీరాములున్నా ఏమీ సాయంచేయలేర్రా !
గాలి గారి గురించేనా నువ్వనేది బాబాయ్ ? వినాయక చవితినాడు పూజ చేయకముందే చంద్రుణ్ణి చూసేసినాట్లున్నాడు .
తెల్లరగట్లే బంగారు ఆసనంమీద సింహంలాగా కూర్చున్నవాడు. పొదుగూకే లోపలే చంచల్ గూడా జైల్లో చిట్టెలుకగా తేలాడంటే అదంతా జాతకచక్రంలోని దోషం వల్లనేరా ! ఎన్ని వందల సెల్ ఫోన్లుంటే మాత్రమేం యూజ్ ... 'సెల్" యోగం తప్పించలేనప్పుడు ! కోట్లుపోసి కొనుక్కుని పెట్టు కున్నాడు అన్నన్ని హెలికాప్టర్లూ, చాప్టర్లూ! ఒక్కటైనా ముగిసిపోయిన ఆయన చాప్టర్ మళ్ళీ తెరనగలగిందా
గోనెసంచుల్లో కుక్కి నేలమాళిగలో పూడ్చిపెట్టించాడు అన్నేసి వందలకోట్లు. తలలూపే నేతల్నీ, తోకలూపే అధికారుల్ని మేపటానికీ, ఓట్లను కొనడానికైతే అవి పనికొస్తాయేమోగానీ- జైలు చిప్పకూల్లో సంజుకోవడానికి ఒక్క పచ్చిమిర్చి కొండానికైనా అవిప్పుడు పనికొచ్చేనా?
తలరాతను తప్పించడం పుట్టించిన బ్రహ్మ తరం కూడా కాదు. సద్దాం హుసేన్ గుర్తున్నాడుగదా! .. చివరి రోజుల్లో కలుగులో కాలక్షేపం చేశాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ని పేకముక్కల్లా కూల్చేసిన బిన్ లాడెన్ బతుకేమైంది? అమెరికా కమెండో తుపాకీ గుండుకు టుపుక్కుమని సెకనులో చచ్చూరు కున్నాడు. హోస్నీ ముబారక్ కుక్కిమంచంలోనే ముక్కుతూ మూలుగుతూ కోర్టుల చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. ఎంత కిలాడీ అయినా, కాలం కలిసే వరకే వైకుంఠపాళిలో పైకి ఎగబాకేది . అందాకా అదంతా తమ ఘనకార్యమే అన్న భ్రమలో తేలుతుంటారు .. ఇదిగో .. ఈ గాలి సోదరులకు మల్లే . గాలి ఎదురు వీస్తే ఎన్ని మతిమరుపు వేషాలేసినా కొట్టుకుపోడమే! గడాఫీ లనుంచి కల్మాడీల దాకా అందరిదీ ఒకే స్టోరీ . అయినా, ఒక్కడికీ వంటబట్ట దేంట్రా ..చరిత్ర మొత్తుకునే పాఠాలో!
నువ్వెందుకు బాబాయ్ అంతలా తల బాదుకొంటావ్ ! గ్రహాల అనుగ్రహం వల్లే బిల్ క్లింటన్ పక్కన చోటు దక్కిందని రామలింగరాజు నాడు మురుసుకున్నాడా ! తమిళంలో మా గొప్ప కవితలు రాస్తానని గొప్పలు పోమే ఆ కరుణానిధి సొంత కూతురు కనిమొళి జాతకం . చివరికేమైంది? బడికెళ్లే చిన్నారి కూతురుకు 'టాటా.. బైబై ' చెప్పుకోలేనంత చిక్కుల్లో పడింది!
అవున్రా! ఎన్ని హెలికాఫ్టర్లు, లక్జోరియస్ బస్సులా కార్లూ జిప్సీలూ కొని దాచుకొంటే ఏంటి? కాలం కలిసి రానప్పుడు పోలీసువాడి వాహనంలోనే అత్తారింటికి ప్రయాణం! నేడు మధుకోడా, నేడు జనార్ధన్రెడ్డి , నకిలీస్టాం పుల తెల్గీ ' స్టాక్ మార్కెట్ కంపు హర్షద్ మెహతా, అక్కడెక్కడి రాడో అమర్సింగు.. అందరిదీ కొసమెరువు కథా ఒకటే ఒకటి. అయినా ఒక్కడూ పిసరంత నేర్చుకోడు!
గురుస్థానం ఉచ్ఛ స్థితిలో ఉన్నంత కాలమే ఏ చంద్రస్వామి ప్రభావమైనా! ఏల్నాటి శని ఎప్పుకొచ్చి పడేనో ఎవడికి తెలుసు!ఎవడికీ ముందస్తు ఏర్పాట్లు ఉండవు! అందుకే మహామహా నేతలు, కుబేరులు, శాంతిదూతలంతా వలకు చిక్కిన చేపల్లా గిలగిలా కొట్టుకునేది! ... ఆ టూ-జీ రాజా కథ టూకీగా చదివినా చరిత్ర చెప్పే పాఠం ఈజీగా అర్థమవుతుంది . ' కాగ్' డ్రస్సులో శనేశ్వరుడొచ్చి ఎప్పుడు అడ్రస్ చేస్తాడో !ఊహూ .. ఒక్కడికీ ఊహ ఉండదు!
గుబురు మీసాల వీరప్పన్ గుర్తున్నాడా? పాడు గంధం చెక్కలకోసం ఎంత గ్రంథం నడిపాడూ! చచ్చినాక చచ్చినోడు పుచ్చు కట్టెలతో బూడిదయ్యాడు! అదే మరి! ఓపిగ్గా వినాలేగానీ .. హిస్టరీ బోల్డన్ని స్టోరీలు చెబుతుంది.
రాశి చక్రంలో రాజపూజ్యం రాసి ఉన్నంత వరకే బాబాయ్.. గోచి గుడ్డ క్కూడా గోల్డు లైనింగు. రాష్ట్రాధినేతలు రాసిచ్చే గనులు!
ఆ తరాజు ఒక్కసారి అవమానం వైపు తూలిందా .. అంతటా అవమానాలే! తలరాత తల కిందులవడానికి ఒక్క రాత్రి చాలదుట్రా! పరువు నష్టం,పరుసు నష్టం.. ముదనష్టం ఎట్లాగైనా పానీ గానీ.. కనాకష్టంగా పడుకునేందుకు పరుపు దొరకడం కూడా కష్టమే!
'నీ జోకులకు నవ్వాలనే ఉందిగానీ, పాపం.. గాలి సోదరులు నెత్తికి పెట్టిన గోల్ట్ కిరీటంవా ఏడుకొండలవాడి అవస్థ చూసి ఏడుపొస్తోంది .
అన్ని తలకాయలున్న రావణాసురుడే భూమాత పుత్రిక సీతమ్మ నెత్తుకెళ్లినందుకు 'రామా' అంటూ నేలకూలాడు. వెధవలకు చివరికి మిగిలేది ఎవరం తీర్చలేని వ్యథలే! వేదకాలం బట్టి చరిత్ర మొట్టి చెప్పుకొస్తున్న పాఠం ఇదే! దుండగులు బండ వెధవలు, పాఠాల సారం వాళ్ల బుర్రల కెక్కకే ఇన్నేసి గండాలు! అసలైన ఆనందం..
అర్థమయిందిలే బాబాయ్ ! ఆలు బిడ్డల్తో ఓ ఆదివారం పూట ఏ టూస్టార్ హోటల్లోనో తృప్తిగా ఇంత అని ఓ చక్కటి మూవీ చూసింటికి వస్తే అంతకు మించిన భోగం భాగ్యం ఇంకోటి లేదనేగా నీ పాఠం టీకా .. తాత్పర్యం?
గుడ్ ! చరిత్ర చేసే హెచ్చరికా చెవిన పెట్టి బుద్ధిగా నడుచుకోడం అంతా కన్నా ముఖ్యం . ఇనప గనులు తవ్వి ఇంట్లో ఇనప్పెట్టెల్నిండా బంగారం పోగేసినా చివర్లో బావుకొనేదేమీ ఉండదు.. చేసిన చెత్త పన్లకి బావురమంటం తప్పించి!
అన్న దమ్ములకు ముష్టి అయిదూళ్లు వదలడానిక్కూడా మనసొప్పక రాజ్యమంతా దౌర్జన్యంగా అనుభవించాలనుకున్న బడుద్ధాయ్ ధుర్యోధనుడికి పట్టిన గతే పడుతుంది. భీమసేనుడి చేత తొడలు విరగ్గొట్టించుకునే ముందు కూడా మురికి చెరువు అడుగున ముక్కు మూసుక్కూర్చోవాల్సిన దిక్కుమాలిన ఖర్మ!
పురాణాలు, ఇతిహాసాలే కాదబ్బీ . . చరిత్ర మొదటినుంచీ చెప్పుకొస్తున్న పాఠం కూడా ఇదే!
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - గల్పిక- 10 - 09-2011 )
No comments:
Post a Comment