ఈనాడు - గల్పిక
దీనజనుల ఘోష
- రచన: కర్లపాలెం హనుమంతరావు
ఈనాడు - గల్పిక
దీనజనుల ఘోష
- రచన: కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - 15 - 12 -2011 - ప్రచురితం )
ఉన్నావా? అసలున్నవా? ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం
కుళ్ళు చూడుకున్నావా..
అదేం లేదు లేవయ్యా! పాలక కడలి .. అందులోనూ పాముపడగల మెత్త. . శ్రీదేవి కాళ్లు నొక్కుతుంటే- కాస్త కళ్లు అలా మత్తుగా మూతలు పడ్డాయంతే. దానికే ఇంత దీనంగా పాటెత్తుకోవాలా భక్తా! ఇంతకూ ఎందుకొ చ్చింది నాపై నీకా సందేహం?
నీ గుడిని లేపేసి మరో గుడికి ముడుపులిచ్చిన 'గాలి'కి నీ దీవెనలా? ... చెత్త పనులు చేసి చెరసాలపాలైతే ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తావా? ... నీ పేరు చెప్పుకోగానే బెయిళ్లు ఇప్పిస్తావా? చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటే బయటపడుతుంటే దిక్కుతోచక కన్నీళ్లు పెట్టుకుంటేనే కరిగిపోవాలా? నిజంగా నువ్వు తోడూనీడుగా ఉండవలసింది అభాగ్యులకు, అమాయకులకు కాదా మహాదేవా?
కాదని నేనెప్పుడన్నాను నాయనా! కన్నీరు పెట్టుకున్నా కరిగిపోకుండా ఉండటానికి నేనేమన్నా నిజం బండరాయినా! భక్తసులభుడిని
ఏం భక్త సులభుడివో. పేరుకు మాత్రమే నీవి ఉచిత దర్శనాలు. నిన్ను కలవడానికి ఎన్నెన్ని కష్టాలో పడాలి! సామాన్యులకు కిలో బియ్యం రూపాయికి దొరుకుతున్నా, నీ ఉచిత ప్రసాదం పది రూపాయలకు చేరుకుంది. లోకాన్ని చల్లగా కాపాడమని నువ్వు పదవులిచ్చిన వాళ్లందరూ, నిధులన్నింటినీ లడ్డూ ప్రసాదాలు చేసి భోంచేస్తున్నారు దామోదరా! నిజం చెప్పు నిరంజనా... నువ్వు అందరివాడివా, అందలాలెక్కి కూర్చున్న కొందరివాడివా? నువ్విలాగే శేషతల్పం మీద కునుకు తీస్తుంటే- నిన్ను నమ్ముకున్నవారే నిన్ను ఒంటరిని చేయడం ఖాయం .. గోవిందా!
ఎవరికి ఉందంత దుస్సాహసం?
భలేవాడివి స్వామీ! నీ భూముల సర్వే నెంబర్లు మార్చేసి అమ్మిపారేసుకుంటున్నా అలా చూస్తున్నావే! నీ గాలిగోపురాలనే కాపాడుకోలేని వాడివి- మానవాసురుల నుంచి మమ్మల్నేం కాపాడతావు?
తొందరొద్దు భక్తా! దేనికైనా పాపం పండాలి. శిక్షపడాలి. అదీ ధర్మరక్షణ విధానం.
అందాకా తమరు స్తంభంలో నక్కి ఉంటారా నరహరీ ! తమరు తీరిగ్గా గోళ్ళూ కోరలూ పెంచు కొచ్చేదాకా బక్కజీవులం ఆ క్రూరమృగాలకు కూరలో పులుసు ముక్కల్లాగా నలుగుతుండాల్సిందేనా! మా సంగతి తరువాత.. నీకు ముంచుకొ స్తున్న ముప్పు సంగతయినా ముందు చూసుకోవద్దా గోవిందా!
జగజేతను నాకు ముప్పా!
అవును పరంధామా! దేవుడి పేరు చెప్పి రాష్ట్రాన్ని కొల్లగొట్టినవారి బాగోతాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి. వేలకోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి తవ్వించిన జలయజ్ఞం కాలువల్లోకి చుక్కనీరైనా తెప్పించలేకపోయావే నీవు . గుప్పెడు అటు కులకే కుచేలుడికి అప్లైశ్వర్యాలు గుప్పించిన ప్రేమ మూర్తివి. చిటికెడు ఉప్పు కూడా కొనలేని దౌర్భా గ్యస్థితికి మమ్మల్ని ఎందుకు దిగజార్చినావయ్యా మహానుభావా?
ఆగక్కడ. ఆదుకోవడానికి ఇప్పుడు మీ లోకంలో కుచేలురు ఎక్కడున్నారు? రోజుకు మూడు రూపా యలు మించి సంపాదన ఉంటే కుబేరుడే అవుతాడని
మీ సర్కారు లెక్కలే చెబుతున్నాయి గదా!
ఆ మాయా తమరి చలవే కదా మాయా వినోదా! ఏ వేళ లీలలు చూపించడం ప్రారంభించావోగానీ, ఇప్పుడు సర్కారు పెద్దలందరికీ నువ్వే ఆదర్శం. శిష్టరక్షణ కోసం అనాడు నువ్వు 'చక్రం' తిప్పావు. స్వీయర క్షణకోసం వీళ్లు దాన్ని ప్పుడు వాడుకుంటున్నారు .వామనావతారంలో మూడు అడుగులు ఆక్రమించి, దుష్ట సంహారం చేశావు. అక్రమార్కులు భూకబ్జాలు చేస్తూ వీళ్లు శిష్టులను బాధిస్తున్నారు. ఇలా పాపాలు పండించడం భావ్యమా లోకపాలకా ? లోకల్ పాలకులూ వాళ్ల తప్పుడు పాలనకు ఇప్పుడు తమరి పేరే పద్దాకా జపిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త! అని చెప్పడానికేనయ్యా ఈ ఆత్రుతంతా!
పరగడుపునే పరాచికాలా నాయనా!
పరాచికాలా! అందుకోసమే అయితే నిక్షేపం లాంటి నీ యోగ నిద్రనెందుకు పాడుచే స్తాను పరమాత్మా! రూపాయి విలువ పడిపోతోందంటే రేపో మాపో లేచి నిలబడుతుందనుకుంటాం. దేవుడి విలువే పడి పోతుంటే- మాబోటి దీనజనుల కింక దిక్కెవరు దేవదేవా? నీ పేరు మీద వీళ్ల బాగోతం ఇలాగే కొనసాగుతుండబట్టే- ఉన్నావా అసలున్నావా అంటూ బాధతో పాడుకోవాల్సి వస్తోంది'
అరెరే, ఇప్పుడు నేనేం చేయాలి భక్తా?
అల్పజీవిని. అదీ నీకు నేనే చెప్పాలా మహాజ్ఞానీ! నువ్వు మూలవిరాట్టువి. పండగ రోజుల్లో ఉత్సవ విగ్రహాలు ఊరేగుతాయి. నీ పేరును రకరకాలుగా దుర్వినియోగం చేసినవారంతా నాయకుల పేరిట ఊరేగుతున్నారు . నీ పేరు చెప్పి జనాలకు చిల్లర డబ్బులు విసిరి , ప్రజాధనంతో టోకున తమ వ్యాపారాలు పెంచుకుంటున్నారు . ఆ దుష్టుల భరతం పట్టడా నికి, దీనజనుల బాధలు తీర్చడానికి దిగిరావయ్యా కిందకు! నువ్వున్నావని నిరూపించుకోవయ్యా మాకందరకూ !
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - 15-12- 2011 - ప్రచురితం )
No comments:
Post a Comment