ఈనాడు - గల్పిక
రుణ మూలం ఇదం జగత్
అప్పుల తిప్పలు
కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సంపాదకీయ పుట - గల్పిక- ప్రచురితం. ( తేదీ నమోదు చేయలేదు )
అయిపోయిందిరా.. అంతా.. అయిపోయింది !
ప్రపంచం యావత్తూ ప్రళయం అంచుకు వచ్చేసింది?
ఏమైంది బాబాయ్ ఎందుకీ ఆందోళన? పిన్నిగానీ నీకు రెండోసారి కాఫీ ఇవ్వను పొమ్మని తన్ని తరిమేసిందా ఏందీ?
పోరా! అక్కడ అమెరికావాడి పరపతికి గండిపడిపో తుంటే... ఇక్కడ నీకు పరాచికాలుగా ఉంది! వందేళ్లలో ఎప్పుడైనా విన్నామా... పెద్దన్న పరువు రేటు ఇలా దిగజారడం! ఇది కాలబ్రహ్మంగారూ ఊహించని దారుణంరా బాబూ!
ఆ.. అదా నీ బాద
నాదొక్కడిదే ఏందిరా! .. మన మునసబును పోయి చూసిరా! .... పాపం, మూడు రోజుల బట్టి మూసిన కన్ను తెరవకుండా ఒబామా.... ఒహమా ..అంటూ పాపం బహటే కలవరింతలు !
ఓస్.. ఆ దిగులు ఒబామాను గురించి అనుకున్నావా బాబాయ్! ఆయన గారమ్మాయి సత్యభామ న్యూయార్కులో ఉద్యోగం వెలగబెడుతోందిగా... ఆ పిల్ల పంపించే డాలర్లతో మన మాజీ మున్సబు ఇక్కడ అడ్డమైన షేర్లూ కొంటుంటాడు. అవేవో ఉన్నట్టుండి కుప్పకూలాయని ఈయన కుమి లిపోతున్నాడు. ఆ పిల్లకి పెళ్ళి పెట్టుకున్నాడు... ఈ శ్రావణంలో... కొందామంటే మార్కెట్లో బంగారం భగ్గుమని మండిపోతుందా... అదీ ఆయన కలవరింతలు ... ఒబామా ఒబామా అని కాదు. ఆ ఏడుపు- 'ఓ భామా... ఓ సత్య భామా' అన్నగోల అది . పెద్దతనం వల్ల నీకు సరిగ్గా వినబడలేదు.. అదే తేడా!
మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అంటారు. దీన్నే... అంతంత అప్పులు చేసి ఆస్తులు కూడబె ట్టకపోతే ఏ దేవుడేడ్చాడురా' కూతురికి ఇక్కడే ఒక మంచి సంబంధం చూసి మూడుముళ్లు వేయించేస్తే ప్రాణానికి ఎంత తెరిపి। అప్పులు చేసి ఆ పిల్లను అక్కడెక్కడికో అమెరి కాకు తరుమటమెందుకూ...ఇలా గుండెనొప్పులూ గట్రా తెచ్చుకోవడమెందుకూ?
అదేంటి బాబాయ్! తెలివిగలవాడివి... నువ్వు అంత మాట అనేశావ్! అపునలా అప్పును తుప్పుసామానుకింద తీసిపారే శావ్? అప్పిచ్చువాడు లేని ఊళ్లో ఉండొద్దన్న సుమతీశతకం నువ్వే కదా చిన్నప్పుడు నా చేత ఒప్పజెప్పించుకునేవాడివి: వేలె డంత లేడు నీ మనవడికి- కూడికలూ తీసివేతలూ నేర్పుతూ వేళ్ళు ముడిచి మరీ అప్పు తెచ్చుకోవడమెలాగో అంత కష్టపడి నేర్పిస్తున్నావ్! రోజూ నిద్రలేవగానే ముందు వినే ఆ సుప్ర భాతం ఎవరిది?... ఆ ఏడుకొండలవాడే పప్పన్నం పెట్టించడానికి కుబేరుడి దగ్గర అంతంత లావు అప్పులు చేయగా లేనిది... మానవమాత్రులం మనం. .
దేవుడూ, నువ్వూ ఒకటే ఎలాగవుతార్రా?
ఒకటి కాం సరే... ఒప్పుకొంటాగానీ, మరి మొన్న గుళ్ళో పురాణం చెప్పే శాస్త్రులూ పంచభూతాల్లో అప్పూ ఒక టని చెప్పాడే..
''ఆ అప్పు.. ఈ అప్పు కాదురా బాబూ! నీళ్లు.
సరే.. ఆ నీళ్లే .. ఆ అప్పే. . మన ఒంట్లో పంచదాతువుల సమ్మిశ్రితంగా ఉందని అంటావుగదా నువ్వే! ఒంటిలోపల ఉన్నప్పుడు.. గొప్పదైనప్పుడు ఒంటి బైట ఉంటే అది తప్పెట్లా అవుతుంది.. చెప్పు!
నీ వాదనేదో తలతిక్కగా ఉందనిపిస్తోందిరా అబ్బాయ్....
తలతిరుగుతోందా! పోనీ అదలా వదిలేసి.. ఆ తలనే తీసుకో బాబాయ్... తల తాకట్టు పెట్టి అయినా ఆడపిల్ల పెళ్ళి చేయాలంటుంది. మా బామ్మ. పెళ్ళిళ్లు పురుళ్లకూ పనికొచ్చే తాకట్లు, చేబ దుళ్లు షేర్లు కొంటానికి, సరదాగా బళ్లు, బంగళాలు కొనటా నికి ఎట్లా చేదైపోతాయ్ బాబాయ్? సందు దొరికింది కదా అని ఇప్పుడు అమెరికాను ఆడిపోసుకుంటున్నావుగానీ... అసలు ఆ అమెరికా పుట్టుకకే అప్పు మూలం తెలుసా! అప్పు చేసి తిరుగుతున్న ట్రిపుల్లోనేగదా కొలంబస్ అమెరికాను కని పెట్టింది! అప్పనేదే లేకపోతే అప్పుడే కాదు... ఇప్పుడూ అసలు అమెరికా అనేదే ప్రపంచపటంలో ఉండేది కాదు. అప్పు చేశారో... పప్పు చేశారో... ఇవాళ ప్రపంచానికంతటికీ అదేగదా రారాజు: మరి అప్పు గొప్పే అవుతుందిగాని.... ముప్పెలా అవుతుందో చెప్ప బాబాయ్... వింటా'
అరేయ్.. నీ అమెరికా అభిమానం మరీ ముదిరి పాకాన పడుతోందిరా! నీ ధోరణిచూస్తే నాకు గుండెల్లో దడ మొదలైంది. అమెరికా అంటే నాకెందుకుంటుందిరా పగ ? ఇవాళ మనూళ్ళో ఇంటికొకడు నాలుగు రాళ్లు సంపాదించి.. ఇంటికి పంపించగలుగుతున్నాడంటే అదంతా ఆ అమెరికా వెళ్ళిన పుణ్యమే! ఒప్పుకుంటా! కాకపోతే కాస్త వెనకా ముందూ చూసుకొని కదా వ్యయం చేసుకోవాలి? పక్ష మంతా సంపాదించుకొన్నది శని .. ఆదివారాలలో ఎవరో తరుముతున్నట్లు ఆసాంతం ఖర్చుపెట్టేయడమే: అంత అవసరమా అన్నది నా ప్రశ్న. రేపంటూ ఒకటుంటుదని... రోగం రొష్టు ఎప్పుడొస్తుందో ఆ పుట్టించిన బ్రహ్మ వుడికైనా తెలియదన్న తెలివే లేకపోవటం ఒక్కటే నాక విచారం కలిగిస్తోంది. అన్నింటికీ అమెరికావాడిని గుడ్డిగా అనుకరించే మన పిల్లకాకులు ఎక్కడ ఉండేలు దెబ్బ తగిలి పడిపోతారన్నదేరా బాబూ నా దిగులు'
అమెరికా సంగతి ఆ ఒబామా బృందానికి వదిలెయ్ బాబాయ్! సంపాదించుకొన్న దాంట్లోనుంచే ఖర్చు చేసుకోవాలని ఆంక్ష పెడితే డబ్బు చలామణీ మందగించి మళ్ళీ ఆ ఆర్థికమాంద్యం పుంజుకొంటుంది. అప్పనే పదార్థం ఒకటి లేక పోతే బ్యాంకుల్లాంటి వాటికసలు ఉనికే ఉండదు తెలుసా ! వాళ్ల డిపాజిట్లు ఏంటి.. జనం దగ్గరనుంచి తీసుకున్న అప్పులే గదా! వాటినే మళ్ళా అప్పులుగా పంచిపెడుతుంటారు. సంపాదించిన దాంతోనే కొనుక్కోవాలంటే మనం మామూలు ఇళ్లు కాదు కదా కనీసం... పిచ్చుక గూళ్లు కూడా కట్టలేం
అదే నేననేది . సులభ వాయిదాల్లో వస్తున్నాయని సురభి కామధేనువునూ పెరట్లో కట్టేసుకోవాలనుకోవడమే కొంప ముంచేస్తుందిరా! ఇప్పుడు అమెరికా వాడికి జరిగిందే... రేపు మనకూ జరగదని గ్యారంటీ... ఏంటీ? అప్పు నిప్పుతో సమానందా నాయనా!
బాబాయ్! సంపాదించుకొన్న దాంట్లోనుంచే ఖర్చు చేసుకోవా లని ఆంక్ష పెడితే డబ్బు చలామణి మందగించి మళ్ళీ ఆర్థి కమాంద్యం పుంజుకొంటుంది. అప్పుడే పదార్థం ఒకటి లేక పోతే బ్యాంకుల్లాంటి వాటికసలు ఉనికే ఉండదు తెలుసా? వాళ్ల డిపాజిట్లు ఏంటి.... జనం దగ్గరనుంచి తీసుకున్న అప్పులే గదా... వాటినే మళ్ళా అప్పులుగా పంచిపెడుతుం టారు. సంపాదించిన దాంతోనే కొనుక్కోవాలంటే మనం మామూలు ఇళ్లు కాదు కదా కనీసం... పిచ్చుక గూళ్లు కూడా కట్టలేం!
'అదే నేననేది. సులభ వాయిదాల్లో వస్తున్నాయని సురభి కామధేనువునూ పెరట్లో కట్టేసుకోవాలనుకోవడమే కొంప ముంచేస్తుందిరా! ఇప్పుడు అమెరికా వాడికి జరిగిందే... రేపు మనకూ జరగదని గ్యారంటీ... ఏంటీ? అప్పు నిప్పుతో సమానంరా నాయనా!
బాబాయ్... నువ్ మారాలి. ముళ్ళపూడి అని ఒక పెద్దాయన ఈ అప్పులమీదే పెద్ద గ్రంథం రాశాడు. ముందది ఎక్కడన్నా అరువు తెచ్చుకొని చదివి చూడు. అప్పుడుగానీ... నీకు అప్పు గొప్పతనం బోధపడదు. లోకంలో రెండే రకాలు. అప్పులిచ్చేవాళ్లు, అప్పు తీసుకొ నేవాళ్లు. అప్పంటే ఎదుటివాడు చెమటోడ్చి సంపాదించిన దాన్ని మనం ఎంచక్కా చొక్కా మడత నలగకుండా ఖర్చు పెట్టుకునే సౌకర్యం. చాటుమాటు డబ్బు వ్యవహారాలకు బహిరంగ గౌరవవాచకం అప్పు. కరుణానిధి కూతుర్ని చూడు. . టూజీలో నొక్కేసిన రెండువందల కోట్లను అప్పుగా చూపించి తప్పించుకోవాలనుకుంటోంది. పావలా వడ్డీ రుణాల పేర్లు చెప్పి సింహాసనాలెక్కిన మహా నేతలు మనకున్నారు. పంటరుణాలు తీసుకుని పెంచిన పొలా లనుంచే నువ్వైనా నేనైనా.... రోజూ ఇంత అన్నం తినేది. అప్పు మన రక్తంలో ప్రవహిస్తోంది బాబాయ్!
మానవ సంబంధాలన్నీ రుణానుబంధాలే.. అంటావ్ !
అందీ మంచి మాట! ... ఓ పాతిక ఉంటే కొట్టూ... రెండోసారి కాఫీ పడక... గుండె కొట్టుకుంటోంది!'
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సంపాదకీయ పుట - గల్పిక- ప్రచురితం. ( తేదీ నమోదు చేయలేదు )
No comments:
Post a Comment