ఈనాడు- హాస్యం
ముక్కంటీ! . నీవే దిక్కంటి!
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - గల్పిక- 01/03/2003 - శివరాత్రి పర్వదిన సందర్భంగా - ప్రచురితం )
కైలాసం
పరమేశ్వరుడు ధ్యానంలో వున్నాడు.
పార్వతమ్మ సరసన చేరి సరసంగా అంది ' స్వామీ! యోగ నిద్రా?
'కాదు భద్రా! బడ్జెట్ ముద్ర'
' ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. సర్వజగత్తూ ఆపూర్వంగా ఆ వేడుకను జరు పుకొంటుంటే, మనమీ మంచుకొండల మధ్య వణుక్కుంటూ కూర్చోటమేంటి? సరదాగా అలా భూలోకం చుట్టొద్దాం... రండీ! '
'నాకూ రావాలనేవుంది . కానీ కింది లోకంలో దారిద్ర్యరేఖకు దిగువనున్న వారి లెక్కలు తీస్తున్నారిప్పుడు. మనమెక్కడ చిక్కుల్లో పడతామేమోనని.. సందేహిస్తున్నా దేవీ! '
'అదేనే శంక? ... లేక క్రికెట్ ప్రత్యక్ష ప్రసారాల మధ్య మనం ప్రత్యక్షమైనా ఎవరూ పట్టించుకోరేమోనని.. ఇదో వంకా ? ' అంది చిలిపిగా ఓంకారి శంకరునివంక చూసి .
'భక్తవశంకరులం మాకు శంకలా!... సరే... నీ ముచ్చటెందుక్కాదనాలి. పోదాం పద! నందిని పిలు గిరినందినీ!| అంటూ కరిచర్మాంబరుడు లేచి నిలబడ్డాడు.
'నంది ఇప్పుడు భూలోకంలోనే వుంది నాథా ! రవీంద్రభారతిలో అదేదో అవార్డు ఫంక్షనుందిటగా' అంది పార్వతీదేవి. ' అందుకే ఓ కారు కొందామని చెవినిల్లు కట్టు కొని పోరేది. ఓంకారం తప్ప మరేమీ ఆ చెవికెక్కించుకోరాయె! కారే గనకుంటే ముల్లోకాల్లో ఎంచక్కా షికార్లు కొట్టి రావ చ్చు'
'బికారిని నేను కారెలా కొనగలను కాత్యాయనీ? కుబేరుని వద్ద కుదవబెట్టేందుకు విబూది తప్ప మరేదీ లేదే మన దగ్గర! '
' కార్లు కూడా భూలోకంలో కారుచౌకగా దొరుకుతున్నాయట స్వామీ! చూద్దాం పదండి. పనిలో పనిగా మన భక్తుల్నీ చూసినట్లుంటుంది.'
*****
'శివ శివా!'
పిలిచావా భక్తా!'
'లేదు. దోమలు కుడుతుంటే భరించలేక అరిచానంతే! తమరెవరూ?'
' శివుడిని నాయనా! ఈమె పార్వతీదేవి'
' శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటా రుగా స్వామీ! ఈ దోమల బారినుండి కాపాడరాదా! '
'శివుడాజ్ఞ లేనిదే చీమలు కుట్టవు. దోమలు కుడతాయి నాయనా! వాటిమీద ఆదిశక్తికే అదుపులేదు. '
' పోనీ... కాస్త గంగనైనా విడవరాదా! రెండు బిందెలు నీళ్ళు పట్టుకుంటాము. వారం రోజుల్నుండీ నల్లాల్లో నీళ్ళు రావటం లేదు. మడి కూడా పొడిగా కట్టుకొన్నా'
' గంగాజలం కలుషితంగా వుంది భక్తా! టీవీ సీరియల్సులో ఆడపడుచులలా పెడబొబ్బలు పెట్టేడుస్తుంటారు కదా! ఆ కన్నీళ్ళు రెండు బకెట్లకు పట్టుకుంటే కరవు తీరుతుందిగా సుబ్బారావ్!'
' సీరియలంటే గుర్తొచ్చింది స్వామీ! కనీసం ఈ ఎపిసోడ్లు ఎప్పుడయి పోతాయో ? అదన్నా చెప్పగలరా ఆదిదేవా! ... టెన్షన్తో చేస్తున్నాము. '
' మహాలింగానికైనా ఆది, అంతూ కను క్కోగలంగానీ, ఈ సోదికి మాత్రం తుది కనుక్కోవాలంటే నేనైనా ఏదైనా సోదికి పోవాల్సిందే సుబ్బారావ్ ! ఇంకేదైనా అడగరాదా ! '
'ఏదడిగినా ఏదో వంక చెబుతున్నావు.. నువ్వసలు నిజంగా ఒరిజినల్ శంకరుడి వేనా స్వామీ? '
'ఒరిజినల్ నే నాయనా! నీ పంచాక్షరి విని ముచ్చటేసి ఏదైనా వరమిచ్చి పోదామని వచ్చాను'
' ఇది పంచాక్షరి కాదే! అంత్యాక్షరి.. ఇదో రకమైన సినిమా పేర్లతో ఆటయ్యా శివయ్యా! '
'అదేంటి? నువ్వనేది. ఓం నమశ్శివాయ' అని కాదా?'
. కాదు. 'ఓం... నమసినిమాయ' అని. శివరాత్రికి నైటంతా స్పెషల్ గా సినిమాలేస్తు నారు ... అందుకని'
' ఏదీ మమ్మల్నీ ఒక్కసారి ఆ చిత్రం చూడనీయి! '
'వద్దులెండి స్వామీ! మదనుడేదో ఓ సారలా ఓరగా చూశాడనే మండిపడి కాల్లి పారేశారు గతంలో . ఈ చిత్రాలు చూస్తే ఇంకెం మందిని మసి చేస్తారో!'
' నీ అనుమానం అసంబద్ధం భక్తా! అర్జెంటుగా ఏదైనా వరం కోరుకో! ఇచ్చేసి వెళ్ళిపోతాము. పన్ను రాయితీలు కాకుండా, పెట్రో రేట్లు తగ్గింపు కాకుండా, డొనేషల్లేని కాన్వెంట్ సీటు కాకుండా, తప్పులేని తెలుగు వాచకం కాకుండా, అమెరికాకు వీసా కాకుండా, వీరప్పన్ వేరెబౌట్స్ కాకుండా, కాశ్మీరు ఇష్యూ కాకుండా, ఫ్రీ కరెంటు కాకుండా, ప్రమాదంలేని రైలు ప్రయాణం కాకుండా .. ఏదైనా ఒక వరం కోరుకొంటే ఇచ్చేసి వెళ్లి పోతాను భక్తా! '
' ఈ కాకుండా' ల లిస్టే చేంతాడంతుందే.... ఏమడగాలబ్బా! సరే .. టి.వీ లో పిక్చరోస్తుంది. చూడాలి. బ్రేకు టైములో ఆలోచించి అడుగుతా గానీ... ఈలోగా తమరు ఇతర భక్తుల్ని పరామర్శించి రండి స్వామీ!
******
| ఏయ్.. ఎవరు మీరు? అర్ధరాత్రి పూట ఆడకూతుర్నేసుకుని ఏంటా పచార్లు? '
' నేను అయ్యవారు. ఈమె అమ్మవారు'
'వార్ ' వాళ్ళన్నమాట. సిటీలో లా అండ్ ఆర్డర్ పిటీబుల్ గా వుంది. ఐడెంటిటీ చూపించండి! '
' ఐడెంటిటీనా ... అంటే?'
' గుర్తింపు పత్రాలు.. మీరు మీరేనని ఋజువు పరిచే పత్రాలు . '
' ఇవిగో .. రక్షక భట భక్తా ! '
' ఇవేంటి? చేతుల్లో ఆకులు పెట్టేశావు?'
' పత్రాలు అడిగావు కదా బిడ్డా ! మా 'రేడు' కు మారేడు పత్రాలే గుర్తింపు పత్రాలు పుత్రా!' అంది పార్వతి ప్రేమతో.
'ఏందో .. గోల! ఒకే! ఆ చేతిలో ఆ శూలమేంటి? కొంపతీసి శివ సేన బాపతా? '
'సేన ఏం ఖర్మ నాయనా శివుడినే ! లయకారుడిని '
'లయకారుడైనా సరే...లైసెన్సుండాల్సిందే! నడవండి స్టేషనుకు '
' మేమొచ్చి స్టేషన్లో కూచుంటే భోజనాలు మానేసి భజనలు చేసే భక్తజనులను ఆదు కొనే నాథుడేడీ? '
' ఎక్కడో తిక్కశంకరంలాగున్నావే ! మీ బోళా తనం చూస్తే జాలేస్తుంది. పోనీ.. విడిచి పెడతాగానీ.. నా చేతిలో ఏదన్నా పెడ తావా?'
'ఇదిగో!'
'ఇదేంది. బూడిదిచ్చావు?'
' ఆదిదేవుడి దగ్గర వుండేది బూడిదే బాబూ! '
'ముక్కంటీ! మీ ముక్కు మరీ సూటి. మీతో పనికాదుగానీ ముందా నందిని పిలవండి!' అంది పార్వతి పరమచిరాగ్గా.
'నంది మీకు బంధువా తల్లీ! మరా ముక్కముందే చెప్పారు
కాదేం ' అంటూ కానిస్టేబుల్ కనకాంబరం ఫోన్లో నెంబరు
కలిపి శివుడి చేతిలో పెట్టాడు రిసీవరు.
అవతల్నుంచీ నంది గొంతు .
' సర్వ జగత్ రక్షకా! భూతలమంతా కాలుష్యభూతమా వరించి వుంది. చూశారుగా స్వామీ! ధ్వని కాలుష్యం, పొగ కాలుష్యం, వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం, సాంఘిక కాలుష్యం, సాంస్కృతిక కాలుష్యం. ఆఖరికి భక్తిలో కూడా కాలుష్యమే... భూతనాథా! జగన్మాతతో కలిసి మీరే ఈ కాలుష్య భూతాలనంతమొందించాలి। ముక్కంటి నీవే దిక్కంటీ! '
'భూలోకం మరిగి బాగానే ఉపన్యా సాలు దంచుతున్నావూ!
‘లౌక్యం లేనిదే ఈ లోకంలో రాణించ లేము స్వామీ! కాసులోనే తిరకాసంతా వుంది కాశీ పతీ! '
' సర్సరే! భూలోకం వచ్చి బుద్ధొచ్చింది. ముందు మనందరం కైలాసం చేరే మార్గం చూడు.. నందీ! '
' ఒన్ మినిట్ .. ఓంకార స్వామీ! '
' ఓ.కే! ఒక్క నిమిషం కూడా మేముండలేనిదీ భూలోకం . పని తొందరగా కానీయి నందీ! '
' చిత్తం. ఈ రక్షక భట భక్తుడితో ఇప్పుడే మాట్లాడాను మహాదేవా! బొందితో కైలాసం తీసుకెళతామని బేరం కూడా పెట్టాను. 'వద్దు వరల్డు కప్పు చూడాలనుంది. సౌతాఫ్రికా పంపించండి .. చాలని బేరమాడుతున్నాడు'
' ఈ భూమ్మీది స్టేషన్ సెల్ లో చీమలు తెగ కుట్టి చంపేస్తున్నాయి. .. నా అనుమతి లేకుండానే! సరే అనేసెయ్ ! సరాసరి కైలాసానికెళ్లి పోతాం గౌరీ .. నేనూ!
*****
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - గల్పిక- 01/03/2003 - శివరాత్రి పర్వదిన సందర్భంగా - ప్రచురితం )
No comments:
Post a Comment