Tuesday, December 7, 2021

పేరడీ ప్రక్రియ - రుక్మిణీనాథశాస్త్రి - పరిశీలన – కె.వి.ఆర్ - జరుక్ శాస్త్రి పేరడీలు ( P. 19-25 ) కె.వి. రమణారెడ్డి

 




పేరడీ ప్రక్రియ - రుక్మిణీనాథశాస్త్రి


పేరడీ ప్రక్రియమాత్రం తెలుగుకి కొత్తదే. పేరడీ అంటే కోతి కొక్కిరాయి కవిత్వమని నోరి నరసింహశాస్త్రి వర్ణించినట్లుగా ఇటీవల శ్రీశ్రీ రాశాడు. ఏ సాహిత్యంలోనైనా అలాంటిది వుంటుంది. ఎమి తిని కపితము సెపితివి గానీ, అండజ భీము ఉండ గానీ, మేక మెకమేక మెకమేక గానీ నోరివారి కోతికొక్కిరాయి కవిత్వమే. చంద్రరేఖా విలాసాన్ని చంద్రరేఖా విలాపంగా సాంతం మార్చింది. విదూషక తత్వం కాదు. దూషక తత్వమే. పేరడీ కవిత్వం అలాంటిది కాదు. ధూర్జటికవిని తెనాలి రామలింగకవి తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి... పద్ధతిలో ఏడ్పించడం పేరడీ అవుతుందా ? దీని దినుసు వేరే. ఇలాంటి ప్రక్రియను తెలుగులో ప్రవచించడానికి ఏ నమూనా దొరికిందో తెలీదు కాని, రుక్మిణీ నాథశాస్త్రి మాత్రం శ్రీశ్రీ విదూషకాంశను పట్టేసినట్టుంది. కుటుంబరావు ఒక మాటన్నాడు.


పేరడీ ప్రక్రియమాత్రం తెలుగుకి కొత్తదే. పేరడీ అంటే కోతి కొక్కిరాయి కవిత్వమని నోరి నరసింహశాస్త్రి వర్ణించినట్లుగా ఇటీవల శ్రీశ్రీ రాశాడు. ఏ సాహిత్యంలోనైనా అలాంటిది వుంటుంది. ఎమి తిని కపితము సెపితివి గానీ, అండజ భీము ఉండ గానీ, మేక మెకమేక మెకమేక గానీ నోరివారి కోతికొక్కిరాయి కవిత్వమే. చంద్రరేఖా విలాసాన్ని చంద్రరేఖా విలాపంగా సాంతం మార్చింది. విదూషక తత్వం కాదు. దూషక తత్వమే. పేరడీ కవిత్వం అలాంటిది కాదు. ధూర్జటికవిని తెనాలి రామలింగకవి తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి... పద్ధతిలో ఏడ్పించడం పేరడీ అవుతుందా ? దీని దినుసు వేరే. ఇలాంటి ప్రక్రియను తెలుగులో ప్రవచించడానికి ఏ నమూనా దొరికిందో తెలీదు కాని, రుక్మిణీ నాథశాస్త్రి మాత్రం శ్రీశ్రీ విదూషకాంశను పట్టేసినట్టుంది. కుటుంబరావు ఒక మాటన్నాడు.


Long rolling a ruinous red eve And lifting a mutinous lid


To all monarchs and matrons I said" | Would shock them" and did !


మాతృక లాగానే వుంటూ అర్ధాన్ని లఘువు చేస్తూ, అపహసిస్తూ తల్లివేలితో తల్లికన్నే పొడిచేలా రూపొందే రచనా పుత్రికను పేరడీ అనవచ్చు. మాతృకను మక్కీకి మక్కీ అనుసరించనక్కరలేదు. మొక్కట్లు కనిపిస్తే చాలు. రాయప్రోలువారి శైలిని హితోపదేశంలో ఎంత సరసంగా దురుద్దేశరహితంగా హేళనచేశారో(పుట103) తెలుపుతుంది. తల్లి నోట్లోంచి వూడిపడ్డట్టుగా తల్లినే మరిపించేదానికి ఆ పక్క పుటలోని కొత్త ఎంకిపాట చాలు. అబ్సర్డ్ స్థాయిని కొంచెం దించి హాస్యం పుట్టించేది మృత్కణానికీ, మత్కుణానికి సంబంధించింది (పు.113114లు). శుద్ధహేళనకు గొప్ప తార్కాణం, మల్లవరపు విశ్వేశ్వరరావుగారి రచనను యెద్దేవాచేసిన “కఞ-కఞ (పు 126-128లు). నాయని సుబ్బారావు ఖండిక "ఆసురకృత్యము" ముగ్ధప్రణయ విఘాతకుణ్ని గంభీరంగా నిరసిస్తే, పేరడీలోవాడు దగుల్బాజీ అయ్యాడు. విదూషకత్వం పరాకాష్ఠ పొందింది విశిష్టాదైత్వంలో. అక్షింతలు పేరడీ కాదు. ఆ ప్రయోగం విచిత్రమైన హస్తలాఘవంలాటి కూర్పు నేర్పరితనం. వీటన్నిటినీ తలదన్నేది వచన పేరడీలో వున్న ఒక శిలాశాసనం. రుక్మిణీనాథశాస్త్రి వ్యుత్పన్నత ప్రతిభాదీప్తిచేత అసాధారణంగా రాణించింది. నీదు మార్గాన నియంత నేతలేడు అని పేరడీ సందర్భంగా ఆయన మాటలను ఆయనకే అప్పజెప్పవచ్చు. శ్రీశ్రీ దేశచరిత్రలు కూడా పేరడీ అయిందట గాని కనిపించి చావందే ?


ఏ కాకి చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం ?


ఇలా మొదలైందని శ్రీశ్రీ, ఆరుద్రా చెబుతూన్న యీ పేరడీ విషయంలో చెరో చరణమో అంగులో గుర్తుందిగాని పూర్తిపాఠం ఎవరికీ


కంఠోపాఠం కాలేదు. ఆ లోటుని మాచిరాజు దేవీప్రసాద్ బాగానే భర్తీ చేశాడు. ఏమైనా రుక్మిణీనాథశాస్త్రి హస్తవాసి వేరే, పేరడీశాస్త్రం సారమెరిగి తాను పేరడీశాస్త్రి కాలేదు. శాస్త్ర నిర్వచనాలూ, గట్రా చూదామా?


అలెక్ట్ ప్రేమింజర్ ఎడిట్ చేసిన ప్రిన్స్టన్ ఎన్సైక్లోపీడియా పొయిట్రీ అండ్ పొయిటిక్స్ (1974)లో, PARODIA అనే గ్రీక్ మూలంనుంచి ఇంగ్లీషు శబ్దం పేరడీ ఏర్పడిందని వుంది. ఎదురు పాట (Counter song) అనే కావ్య విశేషం ఒకటి సుప్రసిద్దమే గదా, సదరు ఓడ్ను తలపించే ఎదురు ఓడ్ పేరోడియా అవుతుంది. వెబస్టర్ న్యూ వరల్డ్ డిక్షనరీ" (1956)లో రెండర్థాలిచ్చారు.


1. Literary or musical composition imitating the characteris tic style of some other work or of a writer or composer but treating a serious subject in a nonsensical manner in an attempt at humour or ridicule..


2. A poor or weak imitation.


మనకు కావలసింది పై వాటిలో మొదటిదే. సంగీత సాహిత్యాలలో ఒకానొకని కృతికి విలక్షణమైన శైలిని అనుకరిస్తూనే, గంభీరమైన ఆకృతి విషయాన్ని హాస్యం కోసమో, హేళన కోసమో అర్థరహితమయ్యేట్టు చూపే సాహిత్య సంగీత అనుకృతి పేరడీ.


విషయాన్ని అలాగే వుండనిచ్చి వికృతరూపమిస్తే ట్రేవెస్టీ అవుతుందనీ, నిజానికి మరీ అతిశయంగా, అడ్డూ ఆపూ లేనట్టుగా మూలాన్ని పేరుకి మాత్రమే అనుకరిస్తే బర్ట కాగలదనీ Cassell's Encyclopaedia of Literatureలో అనుకరణ భేదాల వివరణ వుంది. పరమోత్తమమైన పేరడీ, మూలరూపానికి మాత్రం విధేయంగా వుంటూ వస్తువుకేమో చేటు కలిగించేదని కొద్దిలో చెప్పారు. అయితే అలాంటి పరమోత్తమత చాలా అరుదట. ప్రాచీనకాలంలో ఆరిస్టొఫేనీజ్ మొదలు ఆధునిక యుగంలో జేమ్స్ జాయిస్ దాకా గొప్ప పేరడిస్టులుగా పేరు తెచ్చుకున్నవాళ్ళు విడి


విడి కావ్యఖండికలను గాక, కవులనూ, కవితారూపాలనూ అనుకరించారు. ఒకే ఒక కృతిని పేరడీ చేసి సెబాసనిపించుకున్న వారిలో బైరన్ ఒకడు. సౌతీ ఖండిక "ది విజన్ ఆఫ్ జడ్జ్మెంట్ (The vision of judgement) ను అనుకరించాడు. అలాగే వర్డ్స్ వర్త్ రచన పీటర్ బెల్ను షెల్లీ అద్భుతంగా అనుకరించాడు. అనుకరణలో సృజనాత్మకత ఎంత వుంటుందో విమర్శ అంత వుంటుంది పేరడీ ప్రతిసృష్టి.


ఉదాహరణకు సరదాపాట పెట్టినందువల్ల కూడా చిత్రమైన ఫలితం − ( 12\


కేవల విదూషక చర్యకు కోతి చాలు. నోరి నరసింహశాస్త్రి కోతి యిదే. కుశాగ్రబుద్ధి అయిన ప్రతిభాన్వితుడు ఎవరిని అనుకరించాలనుకుంటాడో వారి ఆనుపాను లెరిగి, వాటినేమిచేస్తే తానుద్దేశించిన ఫలితం కలుగుతుందో తెలుసుకోగలగాలి. మహోదాత్త మనిపించే మూలరచన పేరడీకి బాగా పనికిరాగలదు. దాన్ని తెలివిగా కదిపి కుదిపితే ఆ వుదాత్తత వుల్టా సీదా అవుతుంది. సందర్భశుద్ధి తప్పిందా, దాని గంభీరభావం అభావమై హేళనపాత్రమౌతుంది. అసలు శీర్షికను మార్చి తమాషా శీర్షిక కలుగుతుంది. శ్రీశ్రీ నవకవిత యిలా మారింది గాని దాని అర్థపుష్టికి ఏమీ కాలేదు గనక యిలాంటి పేరడీ మేలురక మనిపించుకోదు. పేరడీ అంటేనే అతిశయత్వం. మూలానికి గల సందర్భాన్ని మార్చినందుచేత దానిలో ప్రముఖంగా వుండిన అంశాలను విడగొట్టి వూతమిచ్చి చూపినట్ల వుతుంది. గొప్ప పేరడీలు కొన్ని వేరే సందర్భాలలోనైతే మూల కృతులుగానే చలామణి కావచ్చు. ఏవో కొన్ని మాటలను మాత్రమే అరువు తెచ్చుకుని అనుకృతిలో చేరిస్తే, దాన్ని పేస్టీష్ (Pastiche) అనవచ్చునేమో గాని పేరడీ రూపభేదమనడం సరి కాదు. కాల్పనిక కవిత పేరడీలకు భేషైన సదవకాశం. ద్వాదశి చూడండి. విశిష్టాద్వైతం కూడా ప్రణయం సైతం. దీనికి కారణం, ఆ ధోరణి కవితలోని భావోల్బణం.


హేళనకోసం హేళనే పేరడీ లక్షణం కాదు. దానికో కారణం వుండాలి. సకారణ హేళన పరోక్ష విమర్శ, పేరడీకారుడు తన కాలపు ఆచారు


వ్యవహారాలనూ, రాజకీయ, నైతిక పద్ధతులనూ, విలువలనూ వ్యంగ్యంగా నిరసించడం అవసరమౌతుంది. లేకుంటే పేరడీకి ప్రయోజనం లోపిస్తుందని ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో (14వ ఎడిషన్, 17వ వాల్యూము) ఇ.వి. నాక్స్ రాశాడు. ఇవేవీ లేనిపక్షాన పేరడీ పేరుతో వెలువడుతూ వున్నది క్షుద్రవినోదం అయే ప్రమాదం వుంది. ఛందస్సు, దాని నియమాలు ఎక్కడా భంగపడగూడదు. ఇది కత్తిమీద సామేగాని గారడీ మాత్రం కాదన్నమాట.


ధేసోస్ నివాసి హేజిమాన్ పేరడీ ప్రక్రియకు పితామహుడని ఆరిస్టాటిల్ అభిప్రాయం. హోమర్ మహేతిహాసం ఇలియాడ్ కు ఇఫీనస్ వాస్తవ్యుడైన హిప్పోనార్స్ అద్భుతమైన పేరడీ సృష్టించాడట. ఈస్కిలస్, యూరిపిడీజ్ గొప్ప నాటకకర్తలు. ఆరిస్టోఫేనీజ్ కూడా అంతే ఘనుడు. అయినా మొదటి యిద్దరికీ తాను పేరడీ చేశాడు. మధ్యయుగాల వీరశృంగార గాథాసంప్రదాయాన్ని సెర్వాంటెస్ డాన్ క్విక్సోట్లో చేసింది పేరడీయే. షేక్స్పియరంతటివాడు మార్లోను మర్కటించాడు. ఇంగ్లీషు సాహిత్యంలో పోప్ూ, థామ్సన్నూ, యంగ్నూ అనన్యంగా పేరడీ చేసి వదిలింది ఐజాక్ హాకిన్స్ బ్రౌన్. ఇతనితోటి పేరడీకి స్వర్ణయుగం ప్రారంభమైనట్టు భావిస్తున్నారు. ఇది నేటికీ అనుస్యూత మవుతూంది. ఏమైనా అనుకరణకు లక్ష్యం సంస్కరణ. హేళన మూలంగా ఇది సూచ్యం కావాలి. ఈర్ష్యాసూయలకూ, ద్వేషానికీ ఇది చోటివ్వగూడదు. a critical act of imaginative reproduction అనే నిర్వచనం సార్థకం కావాలి. మరెందుకైనా కాకున్నా, పేరడీ ప్రక్రియను ప్రచురం చేసి తెలుగు కవిత్వంలో దానికి ప్రసిద్ధి చేకూర్చినందుకు రుక్మిణీనాథశాస్త్రి కీర్తి చిరంజీవి.


5


రుక్మిణీనాథశాస్త్రి కావ్యాలు లభించినంతమట్టుకు ఈ సంపుటాని కెక్కుతున్నాయి. ఇది సమగ్రమని అనడం లేదు. సహకరించదగినవాళ్ళు


మాటకు కట్టుబడి వున్నా యిది సమగ్రమయేది కాదు. ఎందుకంటే, అవి మరెన్ని పత్రికలలో పడివున్నాయో నిశ్చితంగా తెలియదు. మారు పేర్లతో రాసే దురలవాటు వుండినందుచేత ఏవి ఆయనవో, ఏవి ఇతరులతో తెలిసే వీలు తక్కువ.


ఈ సంపుటానికి యీ మాత్రం నిండుదనమైనా చేకూరడానికి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, బంగోరె, అనంతం వంటివారు తలా ఒక చెయ్యి వెయ్యడం కొంతవరకు కారణం. పేరడీలకేగాక సాదా రచనలకు కూడా పూర్వాపరాలు చెప్పి విషయపరిజ్ఞానానికి తోడ్పడినవారు ఇం.హ.శా. ఆరుద్ర నడిగితే దీనికి అక్షింతలు అని పేరెట్టి వుండును. నేనాపని చెయ్యడం లేదు. ఆ పేరైనా రుక్మిణీనాథశాస్త్రి అంగీకారం పొంది వుండేదా? నమ్మకం లేదు.


నిజానికి శరత్పూర్ణిమ (జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి కథల సంపుటి) కంటె ఇది ముందు రావలసింది. బాపు చిత్రరచన వగైరా అవసరమైనందు చేత రెండవదిగా వెలువడుతోంది. నాటికలు, వ్యాసాలు, సమీక్షలు, ఇతర వచన రచనలు మూడో సంపుటిగా వస్తే రచయితగా రుక్మిణీనాథశాస్త్రి పూర్ణవ్యక్తి లోకం ఎదుట అక్షరరూపంలో సాక్ష్యాత్కరిస్తుంది. పెద్దమనస్సు చేసుకున్న నవోదయ పబ్లిషర్సు అభినందనీయులు. గైషామ్స్ వంటిదొకటి తెలుగు సాహిత్యంలో ఇప్పుడు మంచి దాన్ని కిందుజేసి కీతసరుకుని లాభసాటి చేస్తూ బళ్ళకు బళ్ళు దించుతున్న సమయంలో మరుగునపడిన మంచి రచయితలకు మళ్ళీ సూర్యాలోకం కలిగించడం విశేషం కాదా మరి? కనీసధర్మంగా, మధ్యే మధ్యే యిలాంటి మేలిరచనలను ప్రకటించినా ఫర్వాలేదనుకోవచ్చు. వెలలకోసం గాక, విలువలకోసం సాంస్కృతిక పోరాటం సాగుతూంది. సంస్థ నష్టపోగూడదుగాని, లాభాల వేటకు ఉత్తమత్వాన్ని బలిపెట్టనూ గూడదు. 


- పేరడీ ప్రక్రియ - రుక్మిణీనాథశాస్త్రి - పరిశీలన – కె.వి.ఆర్ - జరుక్ శాస్త్రి పేరడీలు ( P. 19-25 ) 


కె.వి. రమణారెడ్డి

జవహర్ భారతి కావలి

జరుక్ శాస్త్రి పేరడీలు

15-4-1982


మనువు చెప్పిన స్త్రీ ధర్మాలు - కర్లపాలెం హనుమంతరావు

 


మనువు చెప్పిన స్త్రీ ధర్మాలు 

- కర్లపాలెం హనుమంతరావు 


మనువు అనగానే నేటితరం ఒంటికాలు పై లేచి నిందలకు పూనుకుంటుంది  . ముఖ్యంగా స్త్రీలు . కారణం లేకపోలేదు. మనువు రాసినట్లుగా బాగా ప్రచారంలో ఉన్న మనుధర్మశాస్త్రం- ఐదవ అధ్యాయం( శ్లో. నెం 147 నుంచి 169 ) లో స్త్రీలకు సంబంధించి ధర్మాల పేరుతో మనువు మహిళల స్వేచ్ఛా స్వాతాంత్ర్యాల మీద కఠినంగా ఆంక్షలు నిర్దేశించాడు . 


న్యాయానికి నేటి సమాజంలో మారుతున్న కాలానికి అనుగుణంగా విముక్తి కోసం స్త్రీలు.. స్త్రీ జానాభ్యుదయవాదులు చేసిన , చేస్తున్న ఉద్యమాల ప్రభావంతో మనువు ధర్మ శాస్త్రంలో విధించిన ఆంక్షలన్నీ దాదాపు ఔట్ డేటెడ్  అయిపోయాయి. 


మనువు సూత్రాలు పాటించడం లేకపోయినా ఆ సూత్రాలను నిర్దేశించిన మనువు మాత్రం నేటికీ నిందల పాలవుతున్నాడు . ఇది గమనించ దగిన చిత్రం. ( నేను మనువును సమర్థించినట్లుగా భావించ వద్దని మనవి ) 


అసలు మనుధర్మ శాస్త్రంలో  స్త్రీకి సంబంధించింనంత వరకు మనువు చేత చెప్పబడిననిగా ప్రచారంలో ఉన్న  ధర్మాలు ఏమిటి? 


ఆ అంశంపై పాఠకుల కోసం ఇక్కడ సంక్షిప్తంగా సంక్లిష్టంగా లేని భాషలో  ఇవ్వడం జరిగింది . . ఆసక్తి గల పాఠకులు  ఒకసారి దృష్టి పెడతారనే ఉద్దేశంతో . 

- కర్లపాలెం హనుమంతరావు 

02 - 12- 2021 

బోథెల్ ; యూ. ఎస్. ఎ 


పంచమ అధ్యాయం


స్త్రీ ధర్మములు 


శ్లో . 147

బాలయా వా యువత్యా వా వృద్ధయా వాzపి యోషితా

న స్వాతంత్ర్యేణ కర్తవ్యం కించిత్కార్యం గృహేష్వపి.


బాలఅయినా, యువతిఅయినా, వృద్ధ అయినా స్త్రీ యింటిలో స్వతంత్రంగా ఏకార్యాన్నీ చేయతగదు.


శ్లో . 148

బాల్యే పితుర్వశే తిష్ఠే త్పాణి గ్రాహస్య యౌవనే

పుత్రాణాం భర్తరి ప్రేతే న భజేత్ స్త్రీ స్వతంత్రతామ్.


బాల్యంలో తండ్రి అధీనంలోను, యౌవనంలో భర్త అధీనంలోను, భర్త  మరణించిన తరువాత పుత్రుల అధీనంలోను ఉండాలి. కాని ఎప్పుడూ స్వతంత్రంగా ఉండటానికి వీలులేదు.


శ్లో 149నుండి శ్లో 151 వరకు 


స్త్రీ ఎప్పుడూ  తండ్రిని, భర్తను, కొడుకులను వదలి ఉండాలని అనుకోరాదు. అలా ఎడబాసి ఉంటే మాతాపితరులవంశాలకు రెంటికీ చెడ్డపేరు తెస్తుంది. ఎల్లప్పుడు భార్య నవ్వుముఖంతో మసలుతు యింటిపనులన్నీ దక్షతతో నిర్వహిస్తూ, ఎక్కువ ధనవ్యయం లేకుండా నడచుకోవాలి. తండ్రి లేక తండ్రి అనుమతితో సోదరులు వివాహం చేసిన భర్తతో జీవితాంతం అతనికి శుశ్రూష చేస్తూ జీవించాలి. ఆయన ఆజ్ఞను ఉల్లంఘించకూడదు.


శ్లో 152నుండి -శ్లో . 155 వరకు 


స్త్రీలకు వివాహ సమయంలో చెప్పే శాంతి మంత్రాలు, ప్రజాపతిహోమము మంగళార్థం చేయబడేవి. కాని మొదట వాగ్దాత్తం జరగటంలోనే భర్తకు భార్యమీద ఆధిపత్యం కలుగుతున్నది. భర్త భార్యకు ఋతుకాలంలోను, యితర సమయాలలోను యిహపర సుఖాల నిస్తాడు. సదాచార శూన్యుడైనా, పరస్త్రీలోలుడైనా, విద్యాదిసుగుణాలు లేనివాడైనా భర్తను పతివ్రత అయిన స్త్రీ నిరంతరం దేవునిలాగా పూజించాలి. పురుషుడు ఒక భార్య కాకపోతే వేరొక భార్యతో యజ్ఞం చేయవచ్చును. కాని స్త్రీకి భర్తతో కాక

వేరొక పురుషునితో యజ్ఞం లేదు. భర్త అనుమతి లేకుండా ఏవ్రతమూ లేదు . ఉపవాసమూ లేదు. ఎందువల్లనంటే భార్య భర్తృశుశ్రూషవల్లనే స్వర్గంలో పూజ్యురాలవుతుంది.


శ్లో .156 నుండి శ్లో. 160 వరకు 

వివాహిత సాథ్వి అయిన స్త్రీ భర్త ఉన్నా గతించినా భర్తకు విరుద్ధంగా ఏకార్యము చేయరాదు. గతించిన భర్త కప్రియమైన దే కొంచం చేసినా పరపురుషునితో కూడటం, శ్రాద్ధం చేయకపోవటంతో సమానమవుతుంది. భర్త మరణానంతరం పతివ్రత అయిన స్త్రీ కందమూల ఫలాలతో జీవించాలి. పరపురుషుని నామం కూడా ఉచ్ఛరించకూడదు. ఓర్పుతో నియమంతో ఏకభర్తకు విధించిన వ్రతాలను ఆచరిస్తూ ఆమరణం బ్రహ్మచర్యంతో ఉండాలి. బాల్యంలోనే బ్రహ్మచారులై వివాహం చేసుకోకుండా సంతానాన్ని పొందకుండా పుణ్యలోకాలను పొందిన బ్రాహ్మణ (సనకసనందన వాలఖిల్యాది) వంశములు వేనవేలున్నాయి. కనుక తనకు సంతానం లేదని దుఃఖించకూడదు. భర్త చనిపోయిన తరువాత పతివ్రత అయిన కాంత పుత్రులు లేనిదైనా పరపురుషసంగమం లేకుండా బ్రహ్మచర్య మవలంబిస్తే పుణ్యలోక ప్రాప్తిని పొందుతుంది.


శ్లో 161 నుంచి శ్లో 164 వరకు 


తనకు పుత్రుడు కలగాలనే కోరికతో పరపురుషసంగమాన్ని పొందే స్త్రీ యిహంలో నిందల పాలవుతుంది. పరంలో పుణ్యావాప్తిని పొందదు. పరపురుషునివల్ల కలిగిన సంతానం శాస్త్రీయసంతానం కాదు. ఇతరుని భార్యవల్ల కలిగిన సంతానం పుట్టించినవాడిది కాదు. పతివ్రతలయిన స్త్రీలకు ఎక్కడా రెండవ భర్త విధింపబడలేదు. దీనిని బట్టి వితంతువుకు పునర్వివాహం అప్రసిద్ధమని తెలుస్తుంది. నికృష్టుడైన భర్తను విడిచి గొప్పవాడైన మరొక భర్తను పొందే స్త్రీ యింతకు ముందే యింకొకడిని పెండ్లాడినది అనే లోకాపవాదుకు పాలవుతుంది. అంతే కాక మరణానంతరం నక్కగా పుడుతుంది లేక కుష్ఠు మొదలయిన నికృష్టమైన రోగాల పాలవుతుంది.


శ్లో 165 నుండి - శ్లో, 168 వరకు 


మనసా వాచా కర్మణా తన భర్తను వీడి పరపురుషుని కోరని స్త్రీ భర్త పొందిన పుణ్యలోకాలను పొందుతుంది. పతివ్రత అని పెద్దల చేత కొనియాడబడుతుంది. మనోవాక్కులచేత కూడా  వ్యభిచారం చేయరాదని దీని భావము. ఇలాంటి సత్ప్రవర్తన కలిగిన సవర్ణ అయిన భార్య తనకంటే ముందుగా మృతిచెందితే భర్త అయిన ద్విజుడు శ్రాతస్మార్తాగ్నులతోను, యజ్ఞపాత్రలతోను దహనం చెయ్యాలి. అలాంటి భార్యకై అంత్యక్రియలలో దక్షిణాగ్ని, గార్హపత్యా హవనీయాగ్నులను సమర్పించి, తనకు ఆమెవల్ల పుత్రులున్నా లేకున్నా, మరొకరిని పెండ్లాడి స్మార్తాగ్నులను గాని, వైది కాగ్నులనుగాని మరల ఆధానముచే ఏర్పరచుకోవాలి.


శ్లో . 169


ఈవిధానముతో మూడవ అధ్యాయంనుంచి చెప్పిన విధంగా పంచయజ్ఞాలను విడువకుండా భార్యతో కలసి రెండవదైన గృహస్థాశ్రమాన్ని డపాలి.


ఇది భృగుమహర్షిప్రోక్తమైన మానవధర్మశాస్త్రసంహితలో పంచమాధ్యాయము.


గమనిక: 

శ్లో 147-శ్లో 148... 9వ అధ్యాయంలో ప్రసిద్ధమైన వివాదగ్రస్తమైన 2, 3, 4 శ్లోకాలలోనూ  యిదే భావం పునరుక్తమవుతున్నది..


( ఆధారం-  మనుస్మృతి కి శ్రీ కె. ఎల్. వై. నరసింహారావు గారి తెనుగు సేత)  


మహాభారతంలో ధర్మరాజు చేసిన సూర్యస్తో త్రములోని ప్రకృతికి సంబంధించిన కొంత భాగం- ( వనపర్వం - 13 వ అధ్యాయం- శ్లో 14-25 )

 



మహాభారతంలో  ధర్మరాజు చేసిన సూర్యస్తో త్రములోని ప్రకృతికి సంబంధించిన కొంత భాగం- 

( వనపర్వం - 13 వ అధ్యాయం- శ్లో 14-25  ) 


త్వమాదాయాం శుభి స్తేజో నిదాఘే సర్వదేవానామ్ । సర్వేషధిరసానాం చ పునర్వరాసు ముఖ్చసి।


14


మీరు గ్రీష్మఋతువునందు మీ కిరణములచే సమస్త దేహ ధారుల యొక్క తేజమును సమస్త ఓషధుల యొక్క రసము యొక్క సారమును ఆకర్షించి తిరిగి వర్షాకాలమున దానిని వర్షిం జేయుచున్నారు


తపన్త్యన్యే దేహన్త్యన్యే గర్జన్యన్యే తథా ఘనాః ॥ 

విద్యోత స్ర్తీ ప్రవర్షన్తి తవ ప్రావృష రశ్మయః ॥


15


వర్ష ఋతువునందు మీ యొక్క కొన్ని కిరణములు తపించుచు కొన్ని మండింపజేయుచు కొన్ని మేఘములై గర్జించుచు కొన్ని మెఱుపులయి మెఱయుచు కొన్ని వర్షించుచు ఉన్నవి.


న తథా సుఖయత్యగ్నిర్న స్రావారా న కమ్బలాః | శీతవాతార్దితం లోకం యథా తవ మరీచయః ॥


10


శీతకాలపు గాలిచే పీడింపబడిన జనులకు మీ కిరణము లెంత సుఖమును కలుగ జేయునో అంత సుఖమును అగ్ని కాని కంబళ్ళు. కాని వస్త్రములుకాని కలుగ చేయజాలవు


త్రయోదశ ద్వీపవతీం గోభిర్భాస యసే మహీమ్ । త్రయాణామఎ లోకానాం హితాయైకః ప్రవర్తనే॥


17


మీరు మీ కిరణములద్వారా పదమూడు ద్వీపములతో కూడిన ఈ భూమిని ప్రకాశింపజేయుచున్నారు మఱి యు ఒంటరిగనే ముల్లోకములకును వాత మొనర్చుచున్నారు


తవ యద్యుదయో న స్యాదగ్ధం జగదిదం భవేత్ | 

న చ ధర్మార్థకామేషు ప్రవర్తేరన్ మనీషిణః ||


18


మీరు ఉదయించనిచో ఈ జగత్తంతయు గ్రుడ్డిది యగును మఱియు విజ్ఞులు ధర్మ అర్థ కామ సంబంధ కర్మములందు ప్రవృ త్తులే కారు


ఆధానపశుబన్ధేష్ణ  మ శ్రయజ్ఞ తపః క్రియాః | త్వత్ప్రసాదాదవాప్య ర్తే బ్రహ్మక్షత్ర విశాం గణైః || 


19


అగ్ని స్థావన పశువులను కట్టుట పూజ మంత్రములు యజ్ఞానుష్ఠానము తపస్సు మున్నగు క్రియ లన్నియు మీ యొక్క కృపచేతనే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులద్వారా జరుపబడు చున్నవి.


యదహర్ర్బహ్మణః ప్రోక్తం సహస్రయుగ సమ్మితమ్ | 

తస్య త్వమాదిర న్తశ్చ కాలక్షైః పరికీర్తితః ॥


20


వెయ్యి యుగములతో గూడిన బ్రహ్మ దేవునియొక్క దిన మేది చెప్పబడినదో కాలమానము నెఱిఁగిన విద్వాంసులు దాని ఆది అంతములు మీరే యని చెప్పుచున్నారు


మనూనాం మరుపుత్రాణాం జగతో మానవస్య చ | 

మన్వ స్తరాణాం సర్వేషామీశ్వరాణాం త్వమీశ్వరః ||


21


మనువు యొక్కయు మను పుత్రులయొక్కయు జగత్తు యొక్కయు అమానవునియొక్కయు మన్వంతరము లన్నిటి యొక్క యు ఈశ్వరులయొక్కయు ఈశ్వరుడు మీరే అయి యున్నారు.


సంహారకాలే సమ్ప్రా ప్తే  తవ క్రోధ వినిః సృతః | 

సంవర్తకాగ్ని స్త్రైలోక్యం భస్మీకత్యావతిష్ఠతే ॥


22 


ప్రళయకాల మేతెంచగా మీ వలన ప్రకటనగు సంవర్తక మను అగ్ని మూడు లోకములను భస్మ మొనర్చి తిరిగి మీ యందే స్థితిని పొందుచున్నది


త్వద్దీధితి సముత్పన్నా నానావర్ణా మహాఘనాః ।

సైరావతాః సాశనయః కుర్వన్త్యాభూత సమ్లవమ్ ॥


23 


మీ యొక్క కిరణముల చేతనే ఉత్పన్నములగు ఐరావతాది రంగురంగుల మహామేఘములు మెఱపులు సమస్త ప్రాణుల యొక్క సంహారము నొనర్చుచున్నవి.


కృత్వా ద్వాదశధాత్మాZZనం  ద్వాదశాదిత్యతాం గతః | సంహృత్యై కార్జనం సర్వం త్వం శోషయసి రశ్మిభిః || 


24


పిదప  మీరే మిమ్ములను పండ్రెండు స్వరూపములుగ విభ జించుకొని పండ్రెండుగురు సూర్యుల రూపమున ఉదయించి మీ కిరణములద్వారా ముల్లోకములను సంహార మొనర్చుచు ఏకార్ణ వము యొక్క జలమునంతను శోషింప చేయుచున్నారు.


త్వామిన్ద్రమాహు స్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం ప్రజాపతిః | త్వమగ్నిస్త్వం మనః సూక్ష్మం ప్రభుస్త్వం బ్రహ్మ శాశ్వతమ్ ||


25 


మిమ్ములనే ఇంద్రుడని చెప్పుచున్నారు మీరే రుద్రుడు మీరే విష్ణువు మీరే ప్రజాపతి అగ్ని సూక్ష్మమనస్సు ప్రభువు సనాతన బ్రహ్మము మీరే అయి యున్నారు


- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

01 - 12 - 2021 


మాతృక : భారతరత్నాకరము 

ఎమర్జెన్సీలో వచ్చిన తెలుగు లొంగుబాటు కవిత్వం

 


6:28 PM

 

సుడిగాలినెదుర్కునేదే అసలయిన పాట

 

పేరుకే ప్రజాస్వామ్యం. దానికి కష్ట మొచ్చినప్పుడు మన తెలుగు కవులు నిర్వహించిన పాత్ర ఆశ్చర్యం కలిగిస్తుంది. లబ్దప్రతిష్ఠులు ఎందరో ఇందిరమ్మ అత్యవసర పరిస్థితికి వత్తాసుగా కవిత్వం రాయడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ అమ్ముడుపోయిన కవులలలో శ్రీ శ్రీ గురించి అందరం చెప్పుకుంటుంటాం. ఆయనకు తోడుగా జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినార్, ప్రభుత్వ కవి దాశరథి, జె,బాపురెడ్డి, భీమన్న, దివాకర్ల, పరిమళా సోమేశ్వర్, ముని సుందరం, పి.ఎస్. ఆర్. ఆంజనేయ శాస్త్రి, గుత్తికొంద సుబ్బారావు, విహారి&శాలివాహన, జ్యోతిర్మయి, లసూరా, భద్రిరాజులు గట్రా.

జనం శ్రమ నుంచి ముక్కు పిండి వసూలు చేసిన సొమ్మును సర్కారిచ్చే సంబావనల కింద పుచ్చుకుని పేదల గురించి కన్నీళ్లు పెట్టుకున్న కవులు కొందరైతే, ఇవాళుండి రేపు పోయే ప్రాణానికి భయపడి కలాన్ని కదిలించిన ఉద్యమకవులు ఇంకొందరు. అలవాటుగా ప్రభుత్వం ఏది  చేసినా తప్పెట్టలు కొట్టే  పాంప్లెట్ కవులను గురించి పెద్దగా చెప్పుకొనవలసిన అవసరం లేదు. కానీ అప్పటి వరకు తమ భావజాలమని సగర్వంగా ప్రకటించుకున్న ఉద్దేశాలకు పూర్తి విరుద్ధంగా ప్రసిద్ధ కవులు రాసిన కవితలే అబ్బురం కలిగిస్తాయి.

 

దేశీయులలో తనకు కలిగిన అప్రతిష్ట సంపూర్ణంగా తెలిసున్న ఇందిర కొత్త పంథాలో కొద్ది మంది మేధావులకు ఇన్ని రొట్టె ముక్కలు విసిరి పోగుచేసుకున్న ప్రగల్భాల కవిత్వాన్ని పాకెట్స్ రూపంలో విదేశాలలో పంచి ప్రపంచం దృష్టిలో తానో విప్లవ పాలకురాలిగా ముద్ర వేయించుకునే ప్రయత్నం అప్రతిహతంగా సాగింది. 'ఇందిరే ఇండియా.. ఇండియానే ఇందిర' అనే భావన బలంగా ముద్రపడే దిశగా అంతఃపుర తైనాతీలు చేపట్టని నికృష్ట చర్యలు లేవు. దేశంలోని ఇతర ప్రాంతాల ప్రతిస్పందన గురించి ఇంత చిన్న వ్యాసంలో వివరంగా చర్చించుకోడం కుదరదు. కానీ తెలుగు గడ్డ వరకు కవులు ప్రజావ్యతిరేకతకు స్వార్థబుద్ధితో చేసిన కొంత లాలూచీ చీదర కవిత్వం గురించి రేఖామాత్రంగా చెప్పడమే ఇక్కడ ఉద్దేశం.

 

కొంత మంది తెలుగు కవుల  కవిత్వం ఏ విధంగా సాగిందో ఓసారి తిలకించి తరిస్తారనే ఈ చిన్న వ్యాసం.

వీర నారి మన ఇందిర

విజయ శంఖ మూదిందిరా!

ప్రజాస్వామ్యమును పడద్రోసే

వారిని అణచి వేసిందిరా!

  • అనే పదాలతో గవర్నమెంట్ కవి దాశరధి తొలి శంఖం పూరించారు. ప్రజాస్వామ్యాన్ని పడద్రోసిందెవరు? ఇందిరాగాంధీనా, జయప్రకాశ్ నారాయణా, మొరార్జీయా, అటల్ బిహారీ వాజ్ పేయీనా? నిజాం రాజు బూజు దులిపిన ఉద్యమంలో ఘనమైన పాత్ర వహించినట్లు చెప్పుకునే దాశరథి కే తెలియాల్సుంది.
  • 'ప్రగతి శక్తుల బలం పెరిగింది నేడు

విషమ శక్తుల నడుం విరిగింది నేడు'

తన పేరుకు ముందు జ్ఞానపీఠ పురస్కారం గ్రహీత అని ట్యాగ్ లైన్ తాగిలించుకోనిదే తోచని కవి సి. నారాయణరెడ్డిగారి స్త్రోత్ర గానం ఇది.

'పూర్వదిక్కున పూర్వ పుణ్యమే దిక్కుగా

హృదయేందిరదె వెలసె, హృదయ మ!' అని బోయి భీమన్నగారు ఉద్బోధన సాగిస్తే ..

దివాకర్లవారు సైతం తన వంతు పంచరత్నాలతో నియంత  ఇందిరమ్మకు మరింత శొభను చేకూర్చే  అలంకారాలు సమకూర్చి  ధన్యులయారు.

 పెద్దలే ఈ మాదిరి తమ దద్దమ్మతనం నిర్బీతిగా ప్రకటించుకున్న సందర్భంలో అసలు సిసలు గవర్నమెంట్ పాంప్లెట్ జె. బాపురెడ్డి అధికారంలో ఉన్నవారిని అన్ని విధాలా ప్రస్తూతిస్తూ కవిత్వం రాయడంలో అబ్బురమేముంది.  

ఆయనగారి కవిత్వం ఎలా సాగిందో జస్ట్ మచ్చుక్కిః

'అరాచకత్వ వర్షం వెలిసింది

అలజడుల బురద బెడద తగ్గింది

ఇరవై రంగుల ఇంద్రధనుస్సు

ఈ దేశాన్ని పాలిస్తున్నది'

ఇందిరమ్మ ఇరవై సుత్రాల పథకం ఇరవై రంగుల ఇంద్రధనుస్సు లా తోచింది కవిగారికి.

పరీక్ష సమయం వచ్చింది

విజృభించింది ఇందిరా ప్రియదర్శిని'

అంటూ పరిమళా సోమేశ్వర్ గారు మరో తప్పెట పుచ్చుకున్నారు అప్పట్లో.

 ముని సుందరం అనే మరో కవిమహాశయులకు ఈ మాత్రం నాజూకుతనం కూడా నచ్చింది కాదు ప్రగతి శీల శక్తుల పట్ల ఆయనకున్న కక్షనంత ఆక్షరాలలో కూర్చి మరీ 'పత్రికల్ని, ప్రజా వ్యతిరేకుల్ని బుట్టలో బంధించిన యీ దినం - నీకూ నాకూ పర్వం' అంటు అత్యవసర కాలపు అఘాయిత్యాలను సూటిగా ఎదుర్కొన్న పత్రికలను, ప్రజలను తిట్టిపొసేశారు. అతనికి చరిత్ర చెప్పిందట సామాన్యులు కోరేది హక్కులు కానే కాదుట!

'బ్రేకుల్లేని బ్రెయిన్లతో జాతి జీవనాన్ని

కలుషితం చేస్తున్న కడు పెద్ద మనుషులు..

అందుకే ఈ అత్యవర పరిస్థితి '

అంటూ ఇంత 'కూడూ-గుడ్డా-గూడా' సంపాదించుకుని తరించాడు.  సరసుడు- పాపం -ఆధునికుడు.

పి.ఎస్. ఆర్. శాస్త్రి కైతే 'ఇదే ఇదే శాసనాసి - పాపం, శమించుగాక!

ఇక గుత్తికొండ సుబ్బారావు, విహారి & శాలివాహన & కో, జ్యోతిర్మయి, లసూనా, భద్రిరాజులు  ఈ దారిలో సాగిపోయిన 'బాటసారులు' .

ఇక్కడ పేర్కొన్నది కొద్ది మంది మాత్రమే. ప్రసిద్ధులు, కాస్తో, కుస్తో పది మంది దృష్టిని ఆకర్షించే ప్రబుద్ధిజీవులు కనక.

ఈ బాణీలో సాగిన కవుల కవాతు వినిపిస్తూ పోతున్న కొద్దీ  ఈ చిన్ని వ్యాసం లక్ష్యం పలచబడుతుందన్న  దిగులుతో ఇటీవలి కాలంలో ఈ తరహా లొంగుబాటు ప్రదర్శించిన మరో దివంగత  ప్రఖ్యాత ప్రజాగాయకుని వైఖరిని నిరసిస్తూ నేను  రాసుకున్న నిరసన కవిత ప్రస్తావన అసందర్భం కాదనుకుంటా!

 

 

 

"పాట రద్దయి పోదు!"

(ప్రజాకళ-జూలై-2012 సంచికలోని నా కవిత)

 

కాలం ముందు చేతులు కట్టుకుని నిలబడటం ఎంత దయనీయం!

ఇలాంటి విషాద ఘడియ ఒకటి వచ్చి పడుతుందని ఊహించనే లేదు .

భ్రాంతి దిగ్ భ్రాంతి గా మారిన దురదృష్టపు క్షణాలివి.

 

వసంతానికి తప్ప దేనికీ గొంతు విప్పని చిలుక

కొండచిలువతో కలిసి బృందగానం ఆలపించటం కన్నా విషాదం మరేముంటుంది ?

కత్తి అంచున నిలబడి గొంతెత్తి పాడుతూ ఆడి పాడిన ఆ పాట నిజామా?

కొత్త నేస్తం తో చెట్టపట్టాల్ పట్టి చిందులేసే ఈ పాట నిజామా?

నిప్పుకుండను పుక్కిట పట్టిన ఆ పాటేనా

బజారులో రెండు రూపాయలకమ్మే నీటి పాకెట్లా ఇలా కలుషితమయిపోయిందీ!నీ పాట తాకట్టు కొట్టువాకిట్లో తచ్చాడుతున్నప్పుడే నాకు స్పృహ వచ్చి వుండవలసింది

కలల్ని మింగి హరయించుకోవటం కష్టమని నీ కిప్పుడనిపించిందా!

మరి నీ రాగాన్ని భుజాన మోసుకు తిరుగుతున్న వాడి గతేమిటి పాటగాడా!

దగా, మోసమని నడి బజారులో వాడు నిన్నలా నిలదీస్తోంటే

నీ గురించి కాదు గాని

నిన్ను నమ్ముకున్న పాటను గూర్చి జాలేస్తుంది.

జనం భుజాలమీద మోసుకునే పదాలను నువ్వలా రాజు పాదాల ముందు పరచావు

పాట పరుసవేది స్పర్స అంటకముందు నీవూ ఆ జనం మనిషివేనని మరిచావు

ఏ బలహీన క్షణాలలో రుద్రుడు కాముడి మాయలో పడి ఓడిపోయాడో

ఆ మాయదారి క్షణాలే మళ్ళి నీ పాటకూ దాపురించాయని సరిపెట్టు కోమంటావా?

వేళ్ళు నరికినా తలను తెంపినా

నీ పాటనే మొండిగా పాడుకొనే మొండెం నిన్నిప్పుడు అడుగుతుంది మిత్రమా!

బదులు చెప్పు!

కవాతుకు ఒక పాట తగ్గింది ..అంతేగా !

వేల గీతాలు ఈ అపస్వరాన్న్నితొక్కుకుంటూ వెళ్ళిపోతాయి

పాట ఆగితే ఆట ఆగదు

ఇది దొరలు గడీలో ఆడుకునే కుర్చీలాట కాదుగా !

సుడిగాలినెదుర్కునేదే అసలయిన పాట

నెత్తురు గడ్డ మీద పూచిన పూవు అంత తొందరగా వాడిపోదులే!

పాట మడుగును అడుగుకింతని నువ్వమ్ముకున్నా

అడుగునున్న తడి మాత్రం ఏ అమ్మకానికీ కుదరదు.

నాలిక మెలికలు తిరిగినంత తేలికగా పాట ఆత్మ మడత పడదు.

నువ్విలా చివరి అంకపు స్త్రోత్ర పాఠపు సర్వేజనా సుఖినో భవన్తులాగా

ఎంత జీరబోయినా

పాట రద్దయి పోదు

రద్దయేది పాటగాడిగా నువ్వు మాత్రమే మిత్రమా !

-కర్లపాలెం హనుమంత రావు

***

(జనవిజయం పేరుతో శ్రీ సదాశివరావు వెలువరించిన చిన్ని పొత్తం లోని ("కవులంటే"- వ్యాసం ఆధారం పు. 277 -287)

 

 

 

 

ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం మాయ ( దారి ) వినోదం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ప్రచురణ తేదీ - 17 -07 - 2002 )


 


ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం 

మాయ ( దారి ) వినోదం 

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ప్రచురణ తేదీ - 17 -07 - 2002 ) 


ఆగ్రాలో తాజ్ మహల్ ను  మాయం చేసినాయన మనూరొచ్చి మేజిక్ చేస్తున్నాడు. తెలుసా?'


ఇక్కడేం మాయంచేయబోతున్నాడో! చార్మినారా... గోలుకొండా... అసెంబ్లీనా! అసెంబ్లీని మాయంచేస్తే మనకు పన్ను లేసిపెట్టే వాళ్ళెవరుంటారూ..? ఏ చార్మినార్తోనో... గోలకొండతోనే సరిపెట్టుకుంటా 

డనుకుంటా! 


వాటికన్నా ఊరికడ్డంగా పారే ఈ మురుక్కాలవల్ని మాయం చేసిపారెయ్ కూడదూ... పుణ్యం... పురుషార్ధం రెండూ దక్కుతాయి. '


' ఛ' వూరుకో ! ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రముఖ మెజీషనాయన... మనూళ్ళో మురుక్కాలవల్ని మాయం చేయమంటే బావుంటుందా? మొన్న జరిగిన ఫుట్ బాల్  వరల్డ్ కప్ మేచీలప్పుడు మేజిక్ చెయ్యమని  జపాన్, కొరియా వాళ్ళే కోరి మరీ అడిగారీయన్ని... తెలుసా!


తెలుసులే! మా ఇండియన్స్ ఎవరూ  ఆడటంలేదు కనక, నేనూ మేజిక్ చేస్తే అంత బావుండ దని చెప్పి తప్పుకున్నాడని విన్నాను. నిజ మైన దేశవిరక్తి అంటే అదీ! మొత్తం మీద ఒకటి మాత్రం బలంగా రుజువైండోయ్ భగవానూ ! ప్రపంచం మన ఆటల్ని గుర్తించటం లేదుగానీ, మన మాయల్ని మాత్రం బాగా గుర్తించినట్లు కని పిస్తోంది.


అవును మనవాళ్ళ మాయ సామాన్యమైనదా ? శూన్యంలోనుంచి బూడిదను సృష్టించే వాళ్ళూ, ఆకుల్లో నుంచి పెట్రోలు పిండే వాళ్లు, విగ్రహాలకు పాలు పట్టించేవాళ్ళూ, కాశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా కోకొల్ల లుగా వున్న దేశమాయ  మనది.  డిస్కవరీ ఛానల్ చూడలా! ఇండియా అనంగానే నాలిక్కిసూదులు గుచ్చుకొనేవాళ్ళనీ, ముళ్ళ మీద బాసింపట్టేసుక్కూర్చున్న గడ్డాల వాళ్ళనీ, కొరడాలతో  వాళ్ళ ఒళ్ళు వాళ్ళే చీరే సుకునేవాళ్ళనీ తెగ చూపించేస్తుంటారు! 


అవును ఒక రకంగా అదీ నిజమేగా ! పొద్దున లేచింది మొదలు పొద్దుపోయేవరకూ ఇక్కడ జరిగేటన్నిమాయలు ప్రపంచంలో ఇంకెక్కడా జరుగుతాయనుకోను. రాత్రి జేబులో  వేసుకున్న చిల్లర తెల్లారిచూసుకుంటే మాయమవుతుంది . కాలేజీలో వుండాల్సిన  కుర్రవాడు సినిమా హాల్లో ప్రత్యక్షమవు తాడు. పాత పేంటుల్ని, చొక్కాల్నీ క్షణంలో స్టీలుసామాను కింద మార్చేస్తుంది మా ఆవిడ. ఇవన్నీ గృహ మాయలు.  సర్దుకుపోవచ్చు . 

బజారుమాయ సంగతి తల్చుకుంటేనే గుండె బేజారయిపోతుంది . 


మార్కెట్లో కిలో తూగిన వంకాయలు ఇంట్లో తొమ్మిదొందల గ్రాములే వుంటాయి! షాపులో తళతళ లాడుతూ మురిపించే చీర కొనుక్కొని ఇంటికి తెస్తే వెలవెల పోతుంటుంది. క్లోనింగ్.. క్లోనింగని సైంటిస్టులిప్పుడు ఊరికే చంకలు గుద్దుకుంటున్నారుగానీ, మనవాళ్ళా ట్నెక్నిక్  ఎప్పుడో పట్టేశారు. ఒరిజినల్ డూప్లికేటు కూడా తేడా తెలియని విధంగా సరుకు తయారుచేసే మెజీషియన్లు చాలామందున్నారు మన వినియోగదారుల మార్కెట్లో. ఒరిజినల్ కన్నా డూప్లికేట్ ప్రింట్ అదీ బాగుంటుందని వంద రూపాయల నోటుని చూసినవాళ్ళెవరైనా ఒప్పుకోకతప్పుడు. 


ఆఫీసులో ఫైళ్ళు, జైళ్ళల్లో ఖైదీలు, వంట్లో కిడ్నీలు మాయమవటం లాంటివి మనకు అతిమామూలు మేజిక్ కిందే లెక్క. రోగాలు మాయమవాల్సింది పోలి రోగులు మాయమవటం అంతకన్నా మరీ   మేజిక్ • 


మేటర్ మరీ సీరియస్ గా మారుతోంది . 


మిత్రమా! నేను చూసినది కేవలం వినోదానికి సంబంధించిన మాయ గురూ.. వాటరాప్ ఇండియాని చూడు! ఒక ఖాళీ చెంబులో నుండి కార్యక్రమం అయిపోయినంత సేపూ  నీటిని వూరిస్తూనే ఉంటాడు ! ' 


ఆ టెక్నికేదో మన వాటర్ వర్క్స్ వాళ్ళకు నేర్పితే బాగుణ్ణు!  వర్షాకాలంలో

కూడా వాళ్ళు వేసి బోరుల్లో నీళ్ళు రాక జనం భోరుభోరుమంటున్నారు'


'నువ్వలాగే అంటావని అనుకున్నా. కళ్ల గ్గంతలు కట్టుకుని ఒక పెద్దబోర్డు మీద మన  ఐఐటి  అమ్మమొగుడు ఫార్ములాన్ని చిటికెలో సాల్వ్ చేసిపారేశాడు! 


కళ్ళగంతలు కట్టుకొనేగా మనవాళ్ళు పిల్లకాయల ఎమ్సెట్ .. గట్రా ప్రశ్న పత్రాలు సెట్  చేసేది! ఫలితాలు వచ్చినా  వాళ్లు  కట్టుకున్న గంతలు ససేమిరా విప్పునేవిప్పరు!  మన విద్యావేత్తల  కన్నా ఆయన గొప్ప మెజీషియనా?


ఒక అందమైన అమ్మాయిని రంపం పెట్టి పరపరా కోసి మళ్ళీ క్షణంలో అతికించి బతికించాడు తెలుసా?


ఈ రంపం కోతలు. . అందులోనూ  ఈ దేశంలో అడవాళ్లకు . వాళ్ళ శీలమంత సహజమైనవేలే!  పేపర్లో చదవలా..  మొన్నామధ్య .. అదేదో ఊళ్ళో ఒకావిడని శీలపరీక్ష చేసుకోమని అత్తగారూ వాళ్లూ  ఒత్తిడి చేస్తే కాలే ఇనప చువ్వలని  అరచేతుల్తో పట్టుకొని మరీ తన సచ్చీలాన్ని నిరూపించుకున్న మేజిక్ ; వీడియో కూడా తీశారంట భావితరాల వాళ్ళకు గైడ్ గా  వుండటానికని! 


వంద నోటును చూస్తూండగానే   రూపాయి నోటు కింద మార్చేశాడు.. ! 


ప్రతిబడ్జెట్ లో ఫైనాన్స్ మినిష్టరు   చేసే ఫీట్ అదేగా! 


పదివేల రూపాయల కట్టను మనకళ్ళ ముందే బుట్టలో పడేసి  మాయం చేశాడయ్యా మహానుభావుడూ! 


పదివేలేం ఖర్మ!  పది వేల కోట్లయినా ఏ బుట్టా తట్టల్లో పెట్టకుండానే చిటికెలో మాయం చేసే మహామాయ బ్యాంకులు మనదేశంలో ఎన్నిలేవు సుబ్బారావ్? 


సరే ! ఇంతకీ సరదాకోసం చేసేని  ఈ మాయ..  మాయకోసం చేసేది ఆ సరదా! రెంటికీ తేడా లేదంటావా వెంకట్రావ్ ? 


చచ్చేటంత ఉంది. కానీ వినోదాన్ని మాయగామార్చేస్తున్నాయ్ మన సినిమాలు..  టీవీలు . అనీ  పెద్ద విషాదం.  ఇంతకి ఈ మాయా వినోదుడి పేరేమిటన్నావ్? 


పి.సి.సర్కార్ 


సర్కారుకూ .. మేజిక్కీ  మధ్యేదో  కనిపించని  లింకున్నట్లే అనిపిస్తుందయ్యా  సుబ్బారావ్ ! 


ఎట్లా? 


పి.సి. సర్కారు మేజిక్కును  చూసి ఇంప్రెస్ అయే  కాబోలు ..  

రాత్రికి రాత్రే ఆర్టీసీ టిక్కెట్లలోని   పైసల్ని మాయంచేసింది మనా ఎ.పి. సర్కార్ ! 


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ప్రచురణ తేదీ - 17 -07 - 2002 ) 


ఈనాడు - సంపాదకీయం వెలుగు దారి రచన- కర్లపాలెం హనుమంతరావు ( ప్రచురణ తేదీ - 01 - 01- 2014 )

 


ఈనాడు - సంపాదకీయం 

కాలమనే  కడలిలో మరో కొత్త అల లేచింది. కొత్తదనమనగానే చిత్తానికెందుకో అంత ఉత్తేజం! 'అంతరంగం వింత విహంగమై/ రెక్కలు తొడుక్కుని ఎక్కడెక్కడికో ఎగిరిపోవాలని ఉబలాటపడే' శుభవేళ ఇది.  'అక్కయ్యకి రెండో కానుపు/ తమ్ముడికి మోకాలి వాపు/ చింత పండు ధర హెచ్చింది. చిన్నాన్నకు మతిభ్రమ కలిగింది. ఇలా నిద్ర నుంచి మేల్కొన్న మరుక్షణంనుంచీ గోరుచుట్టులా మనిషిని సలిపే సమస్యలు సవాలక్ష. 'ఆనందాన్ని చంపేందుకు/ అనంతంగా ఉంది. లోకం/ కులాసాని చెడగొట్టేందుకు అలాస్కా దాకా అవకాశం ఉంది' అన్న కవి తిలక్ పలుకులు నిరాశ కలిగించేవే అయినా అవి నేటికీ సరిపోయే నిష్ఠుర సత్యాలే. చుట్టుముట్టిన చీకట్లను తిట్టుకుంటూ కూర్చుంటే వెలుగుదారి వెతుక్కుంటూ రాదు కదా! కానేపైనా గోర్వం కల రెక్కలమీద ఊహావసంతాల చుట్టూ చక్కర్లుకొట్టి రాకపోతే ఈ చికాకుల లోకంనుంచి మనిషికి మరి తెరిపేదీ! 'మనసూ మనసూ కల గలిసిన మైమరుపు ముందు మద్యం ఎందుకు? ' అంటాడొక నవ కవి. ఎవరెస్టుకన్నా ఎత్తైన శిఖరాలనూ  ఊహల్లో త్రుటిలో లేపేయగల చేవ   సృష్టిమొత్తంలో ఉన్నది మనిషికే. అదో అదృష్టం. ప్రతి క్షణం ఓ రుబాయత్ పద్యంలా సాగిపోవాలంటే సాధ్యపడకపోవచ్చు. పాతంతో కోటల గతించి, సరికొత్తదనం మన జీవితం గడపలోకి కొత్త పెళ్ళికూతురులా అడుగుపెట్టే వేళా మనసు ఒమర్‌  ఖయ్యాం కాకపోతే జీవితానికింకేం కళ! నేటి హేమంత శిథిలాల మధ్య నిలచి/ నాటి వసంత సమీరాలను తలచుకొనే శుభసందర్భం కొత్త ఏడాది తొలి పొద్దుపొడుపే ! ఉషాకాంతుల వంటి బంగరు ఊహలతో దివ్య భవితవ్యానికి సర్వప్రపంచం సుస్వాగతాలు పలికే సంప్రదాయం వెనకున్న రహస్యం-  మనిషి నిత్య ఆశావాది కావడమే!


ఆదిమానవుణ్ణ్ని అణుమొనగాడిగా మలచింది ఆశావాదమే. 'మని షికి మనిషికి నడుమ/ అహం గోడలుండవని/ అంతా విశ్వజనని సంతానం కాగలరని/ శాంతియనెడి పావురాయి/ గొంతునెవరు నులమరని/ విశ్వసామ్య వాదులందు/ విభేదాలు కలగవ' ని  మనిషి కనే కల వయసు మనిషి పుట్టుక అంత పురాతనమైనది. ఎదురుదెబ్బలెన్ని పడినా బెదరక కాలానికి ఎదురేగి మరీ ఊరేగే సుగుణమే మనిషిని మిగతా జీవరాశికి అధిపతిగా నిలబెట్టింది. శిశిరం వచ్చి పోయిందనీ తెలుసు. తిరిగి వచ్చి విసిగిస్తుందనీ తెలుసు. అయినా మధుమాసం రాగానే మావికొమ్మమీద చేరి కోయిల కూయడం మానదు. చినుకు పడుతుండా, వరద కడుతుందా... అని చూడదు. వానకారు కంటపడితే చాలు- మయూరం పురివిప్పి నాట్యమాడకుండా ఉండదు. అత్తారింట్లో అడుగుపెట్టే కొత్తకోడలి అదృష్టం లాంటిది భావి.  గతానుభవాలతో నిమిత్తం లేదు. రాబోయే కాలమంతా సర్వజనావళికి శుభాలే కలగాలని మనసారా అపేక్షించే  అలాంటి స్వభావమే మనిషిదీ. ' సకల యత్నముల నుత్సాహంబె మనుజులకు సకలార్ధ మూలము' అని రంగనాథ రామాయణ ప్రవచనం. ' నానాటికి బ్రదుకు నాటకము/ పుట్టుటయు నిజము పోవుటయు నిజము/ నట్ట నడిమి పని  నాటకము' అని అన్నమయ్య వంటివారు ఎన్నయినా వేదాంతాలు వల్లించవచ్చుగాక..  రక్తి కలగాలంటే నాటకానికైనా  ఆసక్తి రగిలించే అంశం అవస రమేగా! పర్వదినాలు ఆ శక్తిని అందించే దినుసులు . కొత్త ఆంగ్ల సంవత్సరంలో ఉత్సాహంగా మునుముందు జరుపుకోబోయే పండుగలన్నింటికీ జనవరి ఒకటి నాంది. గురజాడవారు భావించినట్లు ' నవ వసంతము నవ్య వనరమ/ మావి కొమ్మల కమ్మ చివురుల/ పాట పాడెడి పరభృతంబు(కోయిల)ను' పాడకుండా ఆపటం ఎవరితరం! కొత్త సంవత్సరం మొదటిరోజున మనిషి చేసుకునే సంబరాలను ఆపబోవడమూ ఎవరి తరమూ కాదు. ఎవరికీ భావ్యమూ కాదు.


' వైషమ్యాలు శమింపలేదు; పదవీ వ్యామోహముల్ చావలే/ దీషణ్మాత్రము గూడ; మూతపడలేదే కైతవ ద్వారముల్/ మరి యెన్నాళ్ల కిటు వర్ధిల్లున్ బ్రజాభాగ్యముల్?' అంటూ రణక్షేత్రం మధ్య అర్జునుడిలా మనసు జీవితక్షేత్రంలో విషాదయోగంలో పడే సందర్భాలు బోలెడన్ని కద్దు. భుజంతట్టి లేపి, నిలబెట్టి చైతన్యమార్గం చూపించే నాటి ఆచార్యుని 'గీత'  లక్ష్యమే నూతన సంవత్సర శుభాకాంక్షల అంతరార్థం. ' ఘన ఘనా ఘనము చీకటి మేడ వెలిగించు దివ్వెల నూనె తరుగలేదు! పవలు రేలును తీరుబడి లేక ఘోషించు/ తోయధీశుని గొంతు రాయలేదు'- మరి ఎందుకు మధ్యలో ఈ విషాదయోగం? నియతి తప్పక నడిచే కాలమూ మనిషికిచ్చే సందేశం- శిశిరంలో సైతం వసంతాన్నే కలగనమని. అంది వచ్చిన కాలాన్ని ఆనందంగా అనుభవించాలని. కొనలేనిది, పట్టుకొనలేనిది, సృష్టించలేనిది, వృథా  అయినా తిరిగి సాధించలేనిది, మొక్కినా వెనక్కి తెచ్చుకోలేనిది... మనిషి కొలమానానికి అందనంత అనంతమైన వింత- కాలం. జీవితంలో ప్రేమించడమొక్కటే కాలాన్ని వశపరచుకోగల ఏకైక మంత్రం. కాలగమనాన్ని సూచించే పర్వదినం జనవరి ఒకటి ప్రత్యేకతే వేరు. కుల మతాలు, చిన్నా పెద్దా, ఆడా మగ, తెలుపూ నలుపూ  ఏ తేడా లేకుండా సర్వే జనా స్సుఖినో భవంతు' అనే ఒకే ఉద్వేగభావంతో ప్రపంచమంతా సంబరాలు చేసుకొనే అపూర్వ పర్వదినం నూతన సంవత్సరం మొద టిరోజు మొదటి క్షణం. అంత ఉత్తేజకరమైనది, ఉత్సాహభరితమైన పండుగ మళ్ళీ వచ్చేది వచ్చే ఏటి మొదటిరోజు ఇదే సమయానికి మాత్రమే. అందుకే ఈ రెండు పండుగల నడుమ కాలమంతా సర్వప్రపంచంలో సుఖ ఐశ్వర్య శాంతులతో ప్రశాంతంగా సాగిపోవాలని కోరుకుందాం!


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ప్రచురణ తేదీ - 01 - 01- 2014 ) 

Monday, December 6, 2021

తెలుగు పాత్రికేయం సమానార్థకాలకు ప్రయత్నలోపం - సి. రాఘవాచారి


తెలుగు పాత్రికేయం

సమానార్థకాలకు ప్రయత్నలోపం

- సి. రాఘవాచారి

తెలుగు పత్రికల భాషాసేవ అనన్య సామాన్యమైనది. వివిధ రంగాల్లోని సమాచారాన్ని పాఠకులకు తెలియజేయడంతో పాటు తెలుగుభాషా వికాసం కూడా పత్రికల కర్తవ్యంలో భాగంగా ఉండేది. వార్తాసంస్థలు ఇంగ్లీషులో పంపించే వార్తలను అనువాదంచేసి, ప్రచురించేటప్పుడు  సాధ్యమైనంతవరకు తెలుగు పదాలే వినియోగించాలని ఒకనియమం స్వచ్ఛందంగానే పాటించడం జరిగేది. దానిని నియమం అనడంకన్నా స్వభాషపట్ల అనురక్తిగా చెప్పడం ఇంగ్లీషు పదాలకు సమానార్థకాలు సృష్టించడం, అవి ప్రజలకు సులభంగా అర్థమయ్యేరీతిలో రూపొందించడం ఆరోజుల్లో సంపాదకవిభాగంలో పనిచేసేవారి ప్రాథమ్యంగా ఉండేది. కొత్తపదం వచ్చినప్పుడు మక్కికి మక్కి కాకుండా అర్ధాన్ని బట్టి, తెలుగులో సులభంగా అర్ధంగ్రహించటానికి వీలయ్యే సమానార్థకాన్నే స్థిరపరచి వాడేవారు. తెలుగును అధికారభాషగా ప్రకటించిన తరువాత ఈ ప్రయత్నంపట్ల ఉండాల్సిన శ్రద్ధాశక్తులు ఏ కారణంతో లోపించినా విచారకరం.


తెలుగుపాత్రికేయుల్లో సంపాదకులతోపాటు అనుభవజ్ఞులైనవారు ఈ విషయమై ఆవేదన పడుతున్నారు. ఆందోళన చెందుతున్నారు. ఇంగ్లీషు అనేకాదు, సంస్కృతం, ఉర్దూ పదాల వెల్లువలో తెలుగుభాష తన స్వరూపాన్ని పోగొట్టుకుంటున్నదా అనే బాధ సహజం. అవసరమైనప్పుడు అన్యభాషా పదాలు బాగా ప్రచారంలో ఉన్నవయితే వాటిని తెలుగుభాష విసర్గ సౌందర్య సౌష్టవాలు చెడకుండా వాడడంలో ఆక్షేపణలకు తావుండరాదు. కానీ, ఇప్పుడు జరుగుతున్నది అదికాదు. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రమున్నట్లు ఇంగ్లీషుపదాలు శీర్షికల్లోనూ, వార్తల్లోనూ విశృంఖల స్వైరవిహారం చేస్తున్నాయి. సమస్యను పరిష్కరించడానికి పాత్రికేయులతోబాటు విశ్వవిద్యాలయాలు, వివిధ అకాడమీలు (ప్రత్యేకించి ప్రెస్ అకాడమీ) కలిసి ప్రయత్నిస్తే సమానార్థకాలసృష్టి అసాధ్యమేమీకాదు. తెలుగుభాష సమయ సందర్భాలనుబట్టి అన్యభాషాపదాలను స్వీకరించడానికి అనువైనది. ప్రాచీన సాహిత్యంనుంచి నేటి పత్రికలభాష వరకు వెయ్యేళ్ళచరిత్ర ఈ విషయాలను నిరూపిస్తోంది. గతంలో తెలుగుపత్రికలకు తెలుగులోనే వార్తలు పంపాలని విధిగా ఆదేశాలున్నరోజుల్లో సమానార్థకాలకోసం విలేకరి కొంత ప్రయాస పడాల్సివచ్చేది. కానీ ఆ ప్రయాస ఫలప్రదంగా

భాషకు, విలేకరి భాషాభివృద్ధికి తోడ్పడుతుండేది. 


అప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తరువాత కూడా ఇంగ్లీషు పదాల వాడకం పెరగడం ఒక విచిత్రమైన వైవిధ్యం, 

గతంలో వలె పత్రికల్లో రాజకీయాలకు పరిమితం కాకుండా, ఈ రోజు అనేక శాస్త్ర విజ్ఞాన విషయాలకు సంబంధించిన వార్తలను పాఠకులకు అందజేయడం విరివిగా పత్రికల్లో అదాజేయడం జరుగుతున్నది. పత్రికలలో ఉండే సహజమైన వత్తిళ్ల  కారణంగా పారిభాషక పదాలకు సమానార్థకాల ఇబ్బందితో కూడుకున్నప్పటికీ, ఆ కారణంతో అన్యభాషాపదాలను అదేపనిగా ఉపయోగించడం సరైనదికాదు. పరిభాష వెనుకఉండే భావాన్ని - సమానార్థకాలు స్వీకరించే సదవకాశం ఎక్కువ. సోవియట్ యూనియన్ లో గోర్బచెవ్  సంస్కరణలుగా 'గ్లాస్ నోస్త్ ', 'పెరిస్త్రోయికా' అనేపదాలు విరివిగా వార్తల్లో వచ్చేవి.  వాటికి  స్థూలంగా దగ్గరైన  'గోప్యరాహిత్యం', 'పునర్వ్యవస్థీకరణ' అనేపదాలు తెలుగులో వాడినందువల్ల పాఠకులు సులభంగా గ్రహించేపరిస్థితి ఉండేది. ఏదైనా సమానార్థకంకన్నా అన్య భాషా  పదమే పాఠకులకు అర్థమవుతుందనుకుంటే అది వినహాయింపు తప్ప సూత్రం కారాదు.


పారిభాషిక పదాలకు తెలుగులో సమానార్థకాలు రూపొందించడం లక్ష్యంగా తెలుగు అకాడమీవంటి సంస్థలను ఏర్పాటుచేశారు. శాసన, పరిపాలనా సంబంధమైన పదాలకు స్పష్టమైన ప్రసిద్ధమైన సమానార్థకాలు రూపొందించినప్పటికీ వాటివినియోగం పత్రికల ద్వారా ఆశించినంతగా లేకపోవడం బాధాకరమే. ఉదాహరణకు 'టాక్స్'ను తీసుకుంటే దానికి పన్ను' అని రాస్తుంటాం. అంతేగాకుండా సెస్సు, డ్యూటీ, లెవీ అనే బడ్జెట్ పారిభాషిక సాంకేతికార్థం భిన్నంగా ఉంటుంది. అయినా పైసంస్థలు రూపొందించిన పదాలకంటే ఎక్కువగా పాఠకులకు  ఆమోదయోగ్యమైనవాటిని పత్రికలు తమకుగా తాము సృష్టించుకుంటే అభ్యంతరం ఉండరాదు . ఆ ప్రయత్నం లేకపోగా సమానార్థకాలపట్ల అలసత్వం, తేలికభావన చోటుచేసుకోవడం విచారించదగిన విషయం.


జన వ్యవహారంలో అలవాటుపడిన అన్యభాషా పదాలు అన్ని భాషల్లోనూ ఉంటాయి. వాటికి భాషా ఛాందసం జోడించి విశ్వామిత్ర సృష్టితో సమానార్థకాలు రూపొందించాల్సిన పనిలేదు. ఒకవేళ అలా సృష్టించినా అవి ఆమోదయోగ్యత పొందడం కష్టం. తెలుగుమాత్రమేవచ్చి అన్ని రంగాలకు చెందిన సమాచారాన్ని పత్రికలద్వారా తెలుసుకోవాలనుకొనే పాఠకుడు ప్రమాణంగా ఉండాలి. తెలుగు పత్రిక చదవటానికి మరో రెండుభాషల పరిచయం అర్హతగా ఉండాల్సినస్థితి అపహాస్యభాజనం. బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో అధికారభాషాయంత్రాంగం నిర్వహించిన కీర్తిశేషులు పి.వి. నరసింహరావు, పరిపాలనారంగంలో తెలుగు వినియోగంపై శాసనసభలో శ్వేతపత్రం (వైట్‌ పేపర్) ప్రకటించినప్పుడు అందులోని సమానార్థకాలపట్ల పత్రికల్లో పెద్దవిమర్శ సాగింది. 


ఒక ప్రసిద్ధసంపాదకుడు అయితే ధారావాహిక సంపాదకీయాల్లో భూరాజసము (ల్యాండ్ రెవిన్యూ) లాంటి పదాలను ఉటంకించి ప్రత్యాఖ్యానం వెలువరించారు. దీనికి స్పందించి నరసింహారావుగారు తెలుగురాక మరిన్ని భాషలు చదివినవారు తెలుగు భాషాభివృద్ధికి ఆటంకమని చెప్పినదాంట్లో అతిశయోక్తి ఉండవచ్చేమోగానీ ఇప్పటి స్థితినిబట్టి ఎంతో కొంత సరైన ప్రతిస్పందన అనిపిస్తోంది.


ప్రస్తుతం తెలుగు పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో అవసరంలేకున్నా ఇంగ్లీషుపదాలు వాడటం ఎబ్బెట్టుగా తోస్తోంది. అచ్చమైన తెలుగుమాట దేవుడెరుగు, అసలు ఇంగ్లీషుమాటలు వాడితేనే అదేదో శ్రేష్ఠమన్న భావన చోటు చేసుకున్నది. ఒక పత్రికలో గతంలో పతాకశీర్షికల్లో కూడా భారత్ బదులు ఇండియా అని వాడేవారు. అది అప్పుడు చివుక్కుమనిపించినా ఇప్పటి పరిస్థితుల్లో కొంత మేలేమో అనిపిస్తోంది.  ప్రాంతీయ ప్రత్యేకతలను బట్టి భాషలో అక్కడికక్కడే అర్థమయ్యే పదాలు ఇతరత్రా వాడినందువల్ల గందరగోళం తప్ప మరేమీ

ఉండదు, 

కోస్తా ప్రాంతాల్లో వెలువడే ఎడిషన్లలో 'షురూ' అనే ఉర్దూ పదం కనిపిస్తోంది. ఏమైనా ఏ భాషపట్ల వ్యతిరేకత అక్కర్లేదుగానీ, మనభాషను సుసంపన్నం చేసుకోవడం అభిలషణీయం. ఈ అంశంపై పాత్రికేయుల్లోనే ఆత్మపరిశీలన అవకాశం కల్పించడం ద్వారా మిత్రులు టంకశాల అశోక్ ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో జర్నలిస్టులు, ప్రెస్ అకాడమీ, వివిధ విశ్వవిద్యాలయాల్లోని జర్నలిజం శాఖలు భాగస్వాములైతే ఆ ఫలితం అందరికీ చెందుతుంది.

( ' వార్త' 15-06-05- ఆధారంగా ) 

- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

                   07-11-2021 


ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం రాజకీయ ముగ్గులు - రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 05 -01 - 2012 )


 

ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం 

రాజకీయ ముగ్గులు 

- రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 05 -01 - 2012 ) 


ధనుర్మాసం అంటేనే ముగ్గుల పండుగ. 


 ఇంటి గుమ్మాల ముందు ముద్దుగుమ్మలు రకరకాల రంగులు హంగులతో ముచ్చటగొలిపే రంగవల్లులు ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దేది  ఈ పండుగ నెలరోజులే. 

 

నేతాశ్రీలు వేసే ముగ్గులకు మాత్రం పండుగ నెల పట్టింపులు ఉండవు. ఎన్నికలైన నాటినుంచి, మళ్ళీ ఎన్ని కలొచ్చే దాకా అన్ని రోజులూ వారికి పండుగ రోజులే!


కొత్త సంవత్సరం మొదటిరోజు శుభాకాంక్షలందించే వంకతో తమిళ తంబి ఒకరు లక్షలు పోసి ఓ ప్రముఖ దినపత్రిక మొదటి పేజీ నిండా ఓ పెద్ద ముగ్గు వేయించేశాడు. హస్తినమ్మ పాదాలవద్ద ధూళిలా పడిఉం డేందుకు అంగుళం జాగా దొరికినా తన జన్మ ధన్యమైన ట్లేనన్నది ఆ ప్రజాప్రతినిధి ముగ్గు అంతర్యం. 


ఢిల్లీ అమ్మను పెద్ద గొబ్బెమ్మగా, ఆమె పుత్రరత్నాన్ని బుల్లి గొబ్బెమ్మగా భావించి 'తల్లీ శుభములీయవే, అబ్బీ పదవీనీయవే' అంటూ ముగ్గులో కూర్చో బెట్టి చుట్టూ గొబ్బిళ్ళు తట్టే నేతలు... పండుగలతో నిమిత్తం లేకుండా అన్ని కాలాలలోనూ ఇబ్బ డిముబ్బడిగా దర్శనమిస్తూ ఉంటారు.


పసుపు, మిరియం, అంకెల్లో సున్నా, చదరంగం ఆటే కాదు, ప్రపంచానికి మనం ప్రసాదిం చిన మరో ముఖ్యమైన కళ- 'ముగ్గులు' వేయడం కూడా! 


ఒలింపిక్స్ లో  ఈ పోటీలు ఉండి ఉంటే, స్వర్ణాలెప్పుడూ మన నేతాశ్రీలకే దక్కి వుండేవి . 


మహా నేత కాకముందు ఓ పెద్దాయన రాష్ట్రమంతటా  'పాదయాత్ర'  వంకతో చెడ తిరిగింది.. సందున్న చోటల్లా ఓ కర్ర ముగ్గో, చుక్కల ముగ్గో వేసేద్దామనే!  అధికారంలోకి వచ్చిన తరవాత ఉచిత విద్యుత్తు అని, కిలో బియ్యం రెండు రూపాయలకేననీ, ఉపకార వేతనాలనీ రకరకాల రంగవల్లులు తీర్చిదిద్దిందీ- అధికారం నిలబెట్టుకొందామనే!


'మా నాయన రెక్కల కష్టంతో వేసిన ముగ్గుల మధ్యే కులుకుతున్నదీ ప్రభుత్వం. ఇంతకన్నా నీచమైన రాజ కీయం ఇంకోటుందా..  అని అడుగుతున్నా' అంటూ ఆయన పుత్రరత్నం ఇప్పుడు 'ఓదార్పు ముగ్గు' బుట్ట పట్టుకుని వాడవాడలా తెగ తిరిగేస్తున్నాడు.


'ముగ్గు చుక్కలకీ వారసత్వం హక్కేమిటి? హంగులు

ఆయన నాయనవే కావచ్చు ' కానీ బియ్యప్పిండి అమ్మవే  గదా!' అంటూ ఆ ఢిల్లీ తల్లి  భక్తులు ఇటునుంచి ముగ్గులు వేసుకొంటూ వస్తున్నారు.


సందు చూసుకుని రెండు ముగ్గుల వరసలూ ఎప్పుడో కలిపేసుకుంటారు. 


'సేవే లక్ష్యం అన్న నటుడు తన ముగ్గును హస్తం ముగ్గుతో అలాగే కలిపేశాడు' అంటూ పసుపుపచ్చ రంగు డబ్బా పట్టుకుని పొలం గట్లమీద ముగ్గులు వేసుకుంటూ తిరుగుతున్నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు.


ముగ్గు గొడవల మధ్య కొత్తగా పెగ్గుగొడవ ఒకటొచ్చి పడింది 

జనాలను  ముగ్గులోకి దింపటానికా?


ముఖ్యమంత్రికీ, పార్టీ పెద్దమనిషికీ, ఇక ఎరుపు, కాషాయం, గులాబీ రంగు ముగ్గుల సంగతి చెప్పేదేముంది?


గజగజా వణుకుతున్నది శీతకాలం చలికో, అయిదు రాష్ట్రాల ఎన్నికలకో అర్థం కాకుండా ఉంది హస్తిన నేతల పరిస్థితి. ఉత్తరప్రదేశ్ మొత్తానికి ఒకే పెద్ద ముగ్గు వేయడం కుదిరే పని కాదనుకొన్నదో ఏమో, ఓ అమ్మ  రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేయాల్సిందే అని గర్జిస్తోంది .


యూపీలో అధికారం పార్టీకి దక్కిస్తానంటున్న రాహుల్ బాబు 'ఆహార భద్రత, ఉపాధి హామీ పథకాల' వంటి  రథం ముగ్గులకు రంగం సిద్ధం చేస్తున్నాడు. 


గారాలపట్టికి ఇన్నేళ్లయినా కనీసం మూడు చుక్కల ముగ్గయినా వేయడం రావడంలేదన్నదే ఢిల్లీ అమ్మ బాధ. 


అజిత్ సెంగ్  చుక్కల వరస కుదరక ఏమో, తన గీతలను హస్తం గీతలకు కలిపేశాడు. బెంగాల్ రాష్ట్రంలో  మొన్నటి దాకా ఒకరి బుగ్గలు ఒకరు గిల్లుకున్న సోనియా, మమతా టపటపా మెటికలు విరిచేసుకోడంలో మునిగివున్నారిప్పుడు . 


ఒకరి ముగ్గంటే మరొకరికి పడటం లేదు. పేరుకే కూటమి వేసే ఒకే ముగ్గు అనేగాని, ఒకరు గీసిన గీతను ఇంకొకరు చెరిపేస్తున్నారు. ఒకరు వేసిన చుక్కలను మరొకరు తొక్కేస్తున్నారు.


అన్నా హజారే బృందం వేసిన 'జన్ లోక్ పాల్' ముగ్గులోకి దిగడానికి అధికార, ప్రతిపక్ష సభ్యులెవరూ అంగీకరించడం లేదు. ఎవరికి వారు హజారే బృందాన్ని తమ తమ ముగ్గుల్లోకి లాగాలని చూస్తున్నారు. 


వేసీ చెరిపీ, వేసీ చెరిపీ చివరికి వేసిన సర్కారీ 'లోక్ పాల్ ' ముగ్గు రేఖలు ఎక్కడా కలవడమే లేదు.


పండుగ రోజుల్లో వీధుల్లో నడిచేటప్పుడు ముగ్గులు తొక్కకుండా నడవడానికి ఎంత అప్రమత్తంగా ఉంటాం! 


మాయ నేతలు నిత్యం వేస్తున్న ముగ్గులోకి దిగకుండా మరింత జాగ్ర త్తగా ఉండటం ప్రజలందరికీ మంచిది!


పూల తివాచీ, సీతాకోకచిలుక, నక్షత్రాలు, రథం, గోపురం ముగ్గులు ... చూపులకు అన్నీ వేరు వేరే . తీరుగా చూస్తే చుక్కల లెక్కల్లో తేడా ఉన్నా, అన్నింటి రాజకీయ వరసవా చివరికి ఒకటే. 


ముగ్గుపిండి ఆట్లకు పనికిరాదని సామెత.  పైపైన పచ్చగా కనిపించే పథకాలు బతుకుల్ని పచ్చగా మారుస్తాయన్న గ్యారంటీ లేదు . మాయ ముగ్గుల్లో కాలుపడకుండా నడ వడం నేర్చినవారికే నిజమైన పెద్ద పండుగ. 


ఈ ముగ్గుల పండగ మనబోటి సగటు జీవులందరికీ ఇచ్చే సందేశం అదే!


రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 05 -01 - 2012 ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...