Monday, December 6, 2021

ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం రాజకీయ ముగ్గులు - రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 05 -01 - 2012 )


 

ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం 

రాజకీయ ముగ్గులు 

- రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 05 -01 - 2012 ) 


ధనుర్మాసం అంటేనే ముగ్గుల పండుగ. 


 ఇంటి గుమ్మాల ముందు ముద్దుగుమ్మలు రకరకాల రంగులు హంగులతో ముచ్చటగొలిపే రంగవల్లులు ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దేది  ఈ పండుగ నెలరోజులే. 

 

నేతాశ్రీలు వేసే ముగ్గులకు మాత్రం పండుగ నెల పట్టింపులు ఉండవు. ఎన్నికలైన నాటినుంచి, మళ్ళీ ఎన్ని కలొచ్చే దాకా అన్ని రోజులూ వారికి పండుగ రోజులే!


కొత్త సంవత్సరం మొదటిరోజు శుభాకాంక్షలందించే వంకతో తమిళ తంబి ఒకరు లక్షలు పోసి ఓ ప్రముఖ దినపత్రిక మొదటి పేజీ నిండా ఓ పెద్ద ముగ్గు వేయించేశాడు. హస్తినమ్మ పాదాలవద్ద ధూళిలా పడిఉం డేందుకు అంగుళం జాగా దొరికినా తన జన్మ ధన్యమైన ట్లేనన్నది ఆ ప్రజాప్రతినిధి ముగ్గు అంతర్యం. 


ఢిల్లీ అమ్మను పెద్ద గొబ్బెమ్మగా, ఆమె పుత్రరత్నాన్ని బుల్లి గొబ్బెమ్మగా భావించి 'తల్లీ శుభములీయవే, అబ్బీ పదవీనీయవే' అంటూ ముగ్గులో కూర్చో బెట్టి చుట్టూ గొబ్బిళ్ళు తట్టే నేతలు... పండుగలతో నిమిత్తం లేకుండా అన్ని కాలాలలోనూ ఇబ్బ డిముబ్బడిగా దర్శనమిస్తూ ఉంటారు.


పసుపు, మిరియం, అంకెల్లో సున్నా, చదరంగం ఆటే కాదు, ప్రపంచానికి మనం ప్రసాదిం చిన మరో ముఖ్యమైన కళ- 'ముగ్గులు' వేయడం కూడా! 


ఒలింపిక్స్ లో  ఈ పోటీలు ఉండి ఉంటే, స్వర్ణాలెప్పుడూ మన నేతాశ్రీలకే దక్కి వుండేవి . 


మహా నేత కాకముందు ఓ పెద్దాయన రాష్ట్రమంతటా  'పాదయాత్ర'  వంకతో చెడ తిరిగింది.. సందున్న చోటల్లా ఓ కర్ర ముగ్గో, చుక్కల ముగ్గో వేసేద్దామనే!  అధికారంలోకి వచ్చిన తరవాత ఉచిత విద్యుత్తు అని, కిలో బియ్యం రెండు రూపాయలకేననీ, ఉపకార వేతనాలనీ రకరకాల రంగవల్లులు తీర్చిదిద్దిందీ- అధికారం నిలబెట్టుకొందామనే!


'మా నాయన రెక్కల కష్టంతో వేసిన ముగ్గుల మధ్యే కులుకుతున్నదీ ప్రభుత్వం. ఇంతకన్నా నీచమైన రాజ కీయం ఇంకోటుందా..  అని అడుగుతున్నా' అంటూ ఆయన పుత్రరత్నం ఇప్పుడు 'ఓదార్పు ముగ్గు' బుట్ట పట్టుకుని వాడవాడలా తెగ తిరిగేస్తున్నాడు.


'ముగ్గు చుక్కలకీ వారసత్వం హక్కేమిటి? హంగులు

ఆయన నాయనవే కావచ్చు ' కానీ బియ్యప్పిండి అమ్మవే  గదా!' అంటూ ఆ ఢిల్లీ తల్లి  భక్తులు ఇటునుంచి ముగ్గులు వేసుకొంటూ వస్తున్నారు.


సందు చూసుకుని రెండు ముగ్గుల వరసలూ ఎప్పుడో కలిపేసుకుంటారు. 


'సేవే లక్ష్యం అన్న నటుడు తన ముగ్గును హస్తం ముగ్గుతో అలాగే కలిపేశాడు' అంటూ పసుపుపచ్చ రంగు డబ్బా పట్టుకుని పొలం గట్లమీద ముగ్గులు వేసుకుంటూ తిరుగుతున్నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు.


ముగ్గు గొడవల మధ్య కొత్తగా పెగ్గుగొడవ ఒకటొచ్చి పడింది 

జనాలను  ముగ్గులోకి దింపటానికా?


ముఖ్యమంత్రికీ, పార్టీ పెద్దమనిషికీ, ఇక ఎరుపు, కాషాయం, గులాబీ రంగు ముగ్గుల సంగతి చెప్పేదేముంది?


గజగజా వణుకుతున్నది శీతకాలం చలికో, అయిదు రాష్ట్రాల ఎన్నికలకో అర్థం కాకుండా ఉంది హస్తిన నేతల పరిస్థితి. ఉత్తరప్రదేశ్ మొత్తానికి ఒకే పెద్ద ముగ్గు వేయడం కుదిరే పని కాదనుకొన్నదో ఏమో, ఓ అమ్మ  రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేయాల్సిందే అని గర్జిస్తోంది .


యూపీలో అధికారం పార్టీకి దక్కిస్తానంటున్న రాహుల్ బాబు 'ఆహార భద్రత, ఉపాధి హామీ పథకాల' వంటి  రథం ముగ్గులకు రంగం సిద్ధం చేస్తున్నాడు. 


గారాలపట్టికి ఇన్నేళ్లయినా కనీసం మూడు చుక్కల ముగ్గయినా వేయడం రావడంలేదన్నదే ఢిల్లీ అమ్మ బాధ. 


అజిత్ సెంగ్  చుక్కల వరస కుదరక ఏమో, తన గీతలను హస్తం గీతలకు కలిపేశాడు. బెంగాల్ రాష్ట్రంలో  మొన్నటి దాకా ఒకరి బుగ్గలు ఒకరు గిల్లుకున్న సోనియా, మమతా టపటపా మెటికలు విరిచేసుకోడంలో మునిగివున్నారిప్పుడు . 


ఒకరి ముగ్గంటే మరొకరికి పడటం లేదు. పేరుకే కూటమి వేసే ఒకే ముగ్గు అనేగాని, ఒకరు గీసిన గీతను ఇంకొకరు చెరిపేస్తున్నారు. ఒకరు వేసిన చుక్కలను మరొకరు తొక్కేస్తున్నారు.


అన్నా హజారే బృందం వేసిన 'జన్ లోక్ పాల్' ముగ్గులోకి దిగడానికి అధికార, ప్రతిపక్ష సభ్యులెవరూ అంగీకరించడం లేదు. ఎవరికి వారు హజారే బృందాన్ని తమ తమ ముగ్గుల్లోకి లాగాలని చూస్తున్నారు. 


వేసీ చెరిపీ, వేసీ చెరిపీ చివరికి వేసిన సర్కారీ 'లోక్ పాల్ ' ముగ్గు రేఖలు ఎక్కడా కలవడమే లేదు.


పండుగ రోజుల్లో వీధుల్లో నడిచేటప్పుడు ముగ్గులు తొక్కకుండా నడవడానికి ఎంత అప్రమత్తంగా ఉంటాం! 


మాయ నేతలు నిత్యం వేస్తున్న ముగ్గులోకి దిగకుండా మరింత జాగ్ర త్తగా ఉండటం ప్రజలందరికీ మంచిది!


పూల తివాచీ, సీతాకోకచిలుక, నక్షత్రాలు, రథం, గోపురం ముగ్గులు ... చూపులకు అన్నీ వేరు వేరే . తీరుగా చూస్తే చుక్కల లెక్కల్లో తేడా ఉన్నా, అన్నింటి రాజకీయ వరసవా చివరికి ఒకటే. 


ముగ్గుపిండి ఆట్లకు పనికిరాదని సామెత.  పైపైన పచ్చగా కనిపించే పథకాలు బతుకుల్ని పచ్చగా మారుస్తాయన్న గ్యారంటీ లేదు . మాయ ముగ్గుల్లో కాలుపడకుండా నడ వడం నేర్చినవారికే నిజమైన పెద్ద పండుగ. 


ఈ ముగ్గుల పండగ మనబోటి సగటు జీవులందరికీ ఇచ్చే సందేశం అదే!


రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 05 -01 - 2012 ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...