మనువు చెప్పిన స్త్రీ ధర్మాలు
- కర్లపాలెం హనుమంతరావు
మనువు అనగానే నేటితరం ఒంటికాలు పై లేచి నిందలకు పూనుకుంటుంది . ముఖ్యంగా స్త్రీలు . కారణం లేకపోలేదు. మనువు రాసినట్లుగా బాగా ప్రచారంలో ఉన్న మనుధర్మశాస్త్రం- ఐదవ అధ్యాయం( శ్లో. నెం 147 నుంచి 169 ) లో స్త్రీలకు సంబంధించి ధర్మాల పేరుతో మనువు మహిళల స్వేచ్ఛా స్వాతాంత్ర్యాల మీద కఠినంగా ఆంక్షలు నిర్దేశించాడు .
న్యాయానికి నేటి సమాజంలో మారుతున్న కాలానికి అనుగుణంగా విముక్తి కోసం స్త్రీలు.. స్త్రీ జానాభ్యుదయవాదులు చేసిన , చేస్తున్న ఉద్యమాల ప్రభావంతో మనువు ధర్మ శాస్త్రంలో విధించిన ఆంక్షలన్నీ దాదాపు ఔట్ డేటెడ్ అయిపోయాయి.
మనువు సూత్రాలు పాటించడం లేకపోయినా ఆ సూత్రాలను నిర్దేశించిన మనువు మాత్రం నేటికీ నిందల పాలవుతున్నాడు . ఇది గమనించ దగిన చిత్రం. ( నేను మనువును సమర్థించినట్లుగా భావించ వద్దని మనవి )
అసలు మనుధర్మ శాస్త్రంలో స్త్రీకి సంబంధించింనంత వరకు మనువు చేత చెప్పబడిననిగా ప్రచారంలో ఉన్న ధర్మాలు ఏమిటి?
ఆ అంశంపై పాఠకుల కోసం ఇక్కడ సంక్షిప్తంగా సంక్లిష్టంగా లేని భాషలో ఇవ్వడం జరిగింది . . ఆసక్తి గల పాఠకులు ఒకసారి దృష్టి పెడతారనే ఉద్దేశంతో .
- కర్లపాలెం హనుమంతరావు
02 - 12- 2021
బోథెల్ ; యూ. ఎస్. ఎ
పంచమ అధ్యాయం
స్త్రీ ధర్మములు
శ్లో . 147
బాలయా వా యువత్యా వా వృద్ధయా వాzపి యోషితా
న స్వాతంత్ర్యేణ కర్తవ్యం కించిత్కార్యం గృహేష్వపి.
బాలఅయినా, యువతిఅయినా, వృద్ధ అయినా స్త్రీ యింటిలో స్వతంత్రంగా ఏకార్యాన్నీ చేయతగదు.
శ్లో . 148
బాల్యే పితుర్వశే తిష్ఠే త్పాణి గ్రాహస్య యౌవనే
పుత్రాణాం భర్తరి ప్రేతే న భజేత్ స్త్రీ స్వతంత్రతామ్.
బాల్యంలో తండ్రి అధీనంలోను, యౌవనంలో భర్త అధీనంలోను, భర్త మరణించిన తరువాత పుత్రుల అధీనంలోను ఉండాలి. కాని ఎప్పుడూ స్వతంత్రంగా ఉండటానికి వీలులేదు.
శ్లో 149నుండి శ్లో 151 వరకు
స్త్రీ ఎప్పుడూ తండ్రిని, భర్తను, కొడుకులను వదలి ఉండాలని అనుకోరాదు. అలా ఎడబాసి ఉంటే మాతాపితరులవంశాలకు రెంటికీ చెడ్డపేరు తెస్తుంది. ఎల్లప్పుడు భార్య నవ్వుముఖంతో మసలుతు యింటిపనులన్నీ దక్షతతో నిర్వహిస్తూ, ఎక్కువ ధనవ్యయం లేకుండా నడచుకోవాలి. తండ్రి లేక తండ్రి అనుమతితో సోదరులు వివాహం చేసిన భర్తతో జీవితాంతం అతనికి శుశ్రూష చేస్తూ జీవించాలి. ఆయన ఆజ్ఞను ఉల్లంఘించకూడదు.
శ్లో 152నుండి -శ్లో . 155 వరకు
స్త్రీలకు వివాహ సమయంలో చెప్పే శాంతి మంత్రాలు, ప్రజాపతిహోమము మంగళార్థం చేయబడేవి. కాని మొదట వాగ్దాత్తం జరగటంలోనే భర్తకు భార్యమీద ఆధిపత్యం కలుగుతున్నది. భర్త భార్యకు ఋతుకాలంలోను, యితర సమయాలలోను యిహపర సుఖాల నిస్తాడు. సదాచార శూన్యుడైనా, పరస్త్రీలోలుడైనా, విద్యాదిసుగుణాలు లేనివాడైనా భర్తను పతివ్రత అయిన స్త్రీ నిరంతరం దేవునిలాగా పూజించాలి. పురుషుడు ఒక భార్య కాకపోతే వేరొక భార్యతో యజ్ఞం చేయవచ్చును. కాని స్త్రీకి భర్తతో కాక
వేరొక పురుషునితో యజ్ఞం లేదు. భర్త అనుమతి లేకుండా ఏవ్రతమూ లేదు . ఉపవాసమూ లేదు. ఎందువల్లనంటే భార్య భర్తృశుశ్రూషవల్లనే స్వర్గంలో పూజ్యురాలవుతుంది.
శ్లో .156 నుండి శ్లో. 160 వరకు
వివాహిత సాథ్వి అయిన స్త్రీ భర్త ఉన్నా గతించినా భర్తకు విరుద్ధంగా ఏకార్యము చేయరాదు. గతించిన భర్త కప్రియమైన దే కొంచం చేసినా పరపురుషునితో కూడటం, శ్రాద్ధం చేయకపోవటంతో సమానమవుతుంది. భర్త మరణానంతరం పతివ్రత అయిన స్త్రీ కందమూల ఫలాలతో జీవించాలి. పరపురుషుని నామం కూడా ఉచ్ఛరించకూడదు. ఓర్పుతో నియమంతో ఏకభర్తకు విధించిన వ్రతాలను ఆచరిస్తూ ఆమరణం బ్రహ్మచర్యంతో ఉండాలి. బాల్యంలోనే బ్రహ్మచారులై వివాహం చేసుకోకుండా సంతానాన్ని పొందకుండా పుణ్యలోకాలను పొందిన బ్రాహ్మణ (సనకసనందన వాలఖిల్యాది) వంశములు వేనవేలున్నాయి. కనుక తనకు సంతానం లేదని దుఃఖించకూడదు. భర్త చనిపోయిన తరువాత పతివ్రత అయిన కాంత పుత్రులు లేనిదైనా పరపురుషసంగమం లేకుండా బ్రహ్మచర్య మవలంబిస్తే పుణ్యలోక ప్రాప్తిని పొందుతుంది.
శ్లో 161 నుంచి శ్లో 164 వరకు
తనకు పుత్రుడు కలగాలనే కోరికతో పరపురుషసంగమాన్ని పొందే స్త్రీ యిహంలో నిందల పాలవుతుంది. పరంలో పుణ్యావాప్తిని పొందదు. పరపురుషునివల్ల కలిగిన సంతానం శాస్త్రీయసంతానం కాదు. ఇతరుని భార్యవల్ల కలిగిన సంతానం పుట్టించినవాడిది కాదు. పతివ్రతలయిన స్త్రీలకు ఎక్కడా రెండవ భర్త విధింపబడలేదు. దీనిని బట్టి వితంతువుకు పునర్వివాహం అప్రసిద్ధమని తెలుస్తుంది. నికృష్టుడైన భర్తను విడిచి గొప్పవాడైన మరొక భర్తను పొందే స్త్రీ యింతకు ముందే యింకొకడిని పెండ్లాడినది అనే లోకాపవాదుకు పాలవుతుంది. అంతే కాక మరణానంతరం నక్కగా పుడుతుంది లేక కుష్ఠు మొదలయిన నికృష్టమైన రోగాల పాలవుతుంది.
శ్లో 165 నుండి - శ్లో, 168 వరకు
మనసా వాచా కర్మణా తన భర్తను వీడి పరపురుషుని కోరని స్త్రీ భర్త పొందిన పుణ్యలోకాలను పొందుతుంది. పతివ్రత అని పెద్దల చేత కొనియాడబడుతుంది. మనోవాక్కులచేత కూడా వ్యభిచారం చేయరాదని దీని భావము. ఇలాంటి సత్ప్రవర్తన కలిగిన సవర్ణ అయిన భార్య తనకంటే ముందుగా మృతిచెందితే భర్త అయిన ద్విజుడు శ్రాతస్మార్తాగ్నులతోను, యజ్ఞపాత్రలతోను దహనం చెయ్యాలి. అలాంటి భార్యకై అంత్యక్రియలలో దక్షిణాగ్ని, గార్హపత్యా హవనీయాగ్నులను సమర్పించి, తనకు ఆమెవల్ల పుత్రులున్నా లేకున్నా, మరొకరిని పెండ్లాడి స్మార్తాగ్నులను గాని, వైది కాగ్నులనుగాని మరల ఆధానముచే ఏర్పరచుకోవాలి.
శ్లో . 169
ఈవిధానముతో మూడవ అధ్యాయంనుంచి చెప్పిన విధంగా పంచయజ్ఞాలను విడువకుండా భార్యతో కలసి రెండవదైన గృహస్థాశ్రమాన్ని డపాలి.
ఇది భృగుమహర్షిప్రోక్తమైన మానవధర్మశాస్త్రసంహితలో పంచమాధ్యాయము.
గమనిక:
శ్లో 147-శ్లో 148... 9వ అధ్యాయంలో ప్రసిద్ధమైన వివాదగ్రస్తమైన 2, 3, 4 శ్లోకాలలోనూ యిదే భావం పునరుక్తమవుతున్నది..
( ఆధారం- మనుస్మృతి కి శ్రీ కె. ఎల్. వై. నరసింహారావు గారి తెనుగు సేత)
No comments:
Post a Comment