Thursday, December 9, 2021

శ్రీ శ్రీ జ్ఞాన నేత్రం - కర్లపాలెం హనుమంతరావు

 సరదా 'కీ' సరదా



శ్రీ శ్రీ జ్ఞాన నేత్రం 

- కర్లపాలెం హనుమంతరావు 


శ్రీశ్రీకి దేవుడి మీద నమ్మకం లేదుగానీ... ఆయనిచ్చే వరాల మీద బోలెడంత ఆశ ఉంది. ఆ కారణంగా ఘోర తపస్సు చేయగా, చేయగా 'మహాకవి' కదా ఏమి కోరుకుంటాడో చూద్దామన్న ఆసక్తితో ప్రత్యక్షమయ్యాడు దేవుడు.


"అయ్యా, నేను బోలెడన్ని పుస్తకాలు రాశాను. సినిమాలకు మంచి మంచి పాటలు చేశాను. అయినా డబ్బు మిగలటం లేదు. ధనం సంపాదించే కనీస అర్హత నాకు ఉందా? లేదా? అంటూ శ్రీశ్రీ దేవుడిని దబాయించాడు. దేవుడు చిర్నవ్వు చిందిస్తూ “నువ్వు

ఇప్పుడు పాట రాస్తోన్న సినిమా నిర్మాతను కలువు" అని ఉచిత సలహా ఒహటి పారేసి చిత్రంగా మాయమయ్యాడు దేవుడు. 


నిర్మాతను కలిసి శ్రీశ్రీ మళ్లీ అదే ప్రశ్న వేశాడు. 


"మీరు గుడ్డి గుర్రం మీద పందెం కాసినా లక్షలకు లక్షలు రూపాయలు వస్తాయి. ఆ కిటుకేమిటో నాకూ చెబితే, మీకు లాగా ఒహ మంచి సినిమా తీయాలని ఉంది" ఆశగా నిర్మాత ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు శ్రీశ్రీ.


"చెప్పటం ఎందుకు?, స్వయంగా చూద్దురుగానీ ఉండండి." అంటూ తన పెద్ద కొడుకును పిలిచి "గోడ మీదున్న ఫొటోని చూడు! ముగ్గురు పెద్దాళ్లు, ఏడుగురు పిల్లలు - ఏడూ ఇంటూ మూడూ .... లెక్కేసి ఆ సంఖ్యగల గుర్రం మీద పందెం కాసిరా." అని పది వేల రూపాయలు ఇచ్చి పంపించాడు నిర్మాత.


అంతే శ్రీశ్రీకి జ్ఞాననేత్రం విచ్చుకుంది. తనూ వెళ్లి ఆ నంబరు గుర్రం మీద ఉన్నదంతా ఊడ్చి పందెం కాశాడు. 


అయితే 27వ నంబరు గుర్రం గెలిచింది.


" ఇదేంటి ఈసారి మీ జోస్యం ఇలా వికటించింది! " నిర్మాతను నిలదీశాడు శ్రీశ్రీ విచారపడుతూ.


"అదేం లేదే! మావాడు జాక్పాట్ పది లక్షల రూపాయలు కొట్టుకొచ్చాడుగదా! ” ఎదురుగా బల్లమీద పేర్చి ఉన్న డబ్బు కట్టల్ని చూపిస్తూ వివరించాడు నిర్మాత.


"అదెలాగా? ఏడు ఇంటూ మూడు ఈజిక్వల్టూ ఇరవై ఒకటేగదా?"


"మీరు మహాకవి కనుక అలా ఆలోచించారు. బడుద్దాయి గనుక మా వాడు 27 అని లెక్కవేశాడు." అన్నాడు తాపీగా నిర్మాత.


శ్రీశ్రీకి అప్పుడు తెలిసొచ్చింది. సంపద సృష్టికీ తెలివి తేటలకూ లంకె లేదనీ, కావాల్సింది సుడి  మాత్రమేనని. 


అదెటూ తనకు లేదని తెలుసుకున్నాక 'ఖడ్గసృష్టి' రాయటంతో సరిపెట్టుకున్నాడు మహాకవి. 

( శ్రీ శ్రీ గారికి క్షమాపణలతో ) 

( ఈ కట్టుకథ కేవలం నవ్వుకునేందుకే సుమా!)

- కర్లపాలెం హనుమంతరావు 

01 -01-2021 

సరదాకే! డబ్బులు గొప్పా- చర్చిలు గొప్పా-

 



సరదాకే! 

డబ్బులు గొప్పా- చర్చిలు గొప్పా- 

- కర్లపాలెం హనుమంతరావు 



చర్చిల్ పేరు తెలీనివారు ఉండరంటే అతిశయోక్తికాదు. 


మాట తీరుతో ఆకట్టుకునే గుణం ఆయనకు ప్రత్యేకం. 


ఆయన ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో ఒకసారి బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చింది. 


రేడియో స్టేషనుకని బయలుదేరాడు. పాపం దారిలో కారు పాడయిపోయింది. అటుగా వెళ్తున్న కార్లను ఆపాలని ప్రయత్నించాడు. కానీ చీకటి పడటంతో ఎవ్వరూ ఆయనను గుర్తుపట్టక వాహనాన్ని నిలపలేదు.


చివరికి ఓ టాక్సీ రావటం చూసి దారికి అడ్డంగా నిలబడ్డాడు చర్చిల్. 


బండి ఆగింది. డ్రైవరు తొంగి చూసి

" అడ్డం లేవయ్యా!, అర్జంటుగా ఇంటికి వెళ్లాలి. రేడియోలో చర్చిల్ స్పీచ్ వచ్చే టైం అయింది! " అంటూ విసుక్కున్నాడు.


"పది పౌండ్లు ఇస్తాను, రేడియో స్టేషనులో డ్రాప్ చేస్తావా?" డ్రైవర్ని బతిమాలాడాడు చర్చిల్. 


అయితే తమాషా చూద్దామనుకున్నాడో, లేకుంటే తన కోసం ఆదాయాలు కూడా వదులుకునేవారున్నారని చెప్పుకునేందుకోగానీ, తనే చర్చిలని మాత్రం వెల్లడించలేదు.


"కుదరదు" అంటూ డ్రైవరు తలుపేసుకోబోయాడు.


"అయితే ఇరవై పౌండ్లు ఇస్తాను" బేరానికి దిగాడు చర్చిల్. 


దాంతో డ్రైవరు ఒక్క క్షణం తటపటాయించి "సరే! ఎక్కు!" అన్నాడు.


దారిలో డ్రైవర్ని చర్చిల్ అడిగాడూ "మరి నీ అభిమాన నాయకుడి ప్రసంగం మిస్సయిపోతున్నావేమో గదా పాపం!"


దానికి "అయితే ఏంటంట? ఆయన కబుర్లు వింటూ కూర్చుంటే నా కడుపు నిండుతుందా?? నాకు ఆయనకులాగా మాటలు చెప్తే డబ్బిచ్చే వాళ్లెవ్వరూ లేరు కదా! అనేశాడు డ్రైవరు.


అందుకే అంటారు డబ్బు ముందు ప్రేమలూ, అభిమానాలూ బలాదూర్ అని. ఈ సత్యమే డ్రైవరు ద్వారా ఆనాడు చర్చిలుకూ  చక్కగా బోధపడిందిd.




వ్యంగ్యం మంత్రిగారితో ముఖాముఖి రచన- కర్లపాలెం హనుమంతరావు ( సూర్య దినపతిక - 30-09-2018 ప్రచురితం )

 



 వ్యంగ్యం 

మంత్రిగారితో ముఖాముఖి 

రచన-  కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దినపతిక - 30-09-2018 ప్రచురితం ) 


జార్ఖండ్ రాష్ట్రంలో గత ఏడాది పశువుల కాపరి ఒకడి పాప పంకిలాన్ని పరిశుధ్ధం చేసే పుణ్యకార్యంలో భాగంగా బహిరంగ ప్రదేశంలో పరమ కిరాతకంగా పరమపదసోపానం ఎక్కించారు కొంతమంది  స్వచ్చంద సేవాకార్యకర్తలు. ఆ పుణ్యాత్ములు ఎనిమిది మంది ఆధ్యాత్మిక లక్ష్యాన్ని అపార్థం చేసుకొని కథిన జీవిత కారాగార శిక్ష  విధించింది కింది కోర్టు. ఆ తప్పును సరిదిద్దుకుంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వారిని బెయిలు మీద విడుదల చేసిన సందర్భంలో.. కారాగారం నుండి విముక్తి చెందిన ఆ ప్రజాసేవాతత్పరులకు ఎదురేగి మరీ బహిరంగ సభలో పూలదండలతొ ఘనంగా సన్మానించారు శ్రీమాన్ కేంద్ర మంత్రివర్యులు  జయంత్ సిన్హాజీ! శ్రీవారి సదుద్దేశం దేశానికి తెలియచెయ్యాలన్న ఉద్దేశంతో ముఖాముఖీకి ప్రయత్నించినప్పటికి ఇంత వరకు ఆ పిచ్చాపాటికి అవకాశం లభించింది కాదు. దురదృష్టం. అయితే అదృష్టం మరోలా తన్నుకొచ్చింది. సరిగ్గా గౌరవనీయ సిన్హాజీ అడుగుజాడలలోనే ప్రస్థానించే మరో  రాజకీయ నేత ఈ వారంలో జైలు నుంచి విముక్తి చెందిన మరో నేరస్తుల ముఠాకి ఘన సన్మానం జరిపించి సభా సమక్షంలో పుష్పమాలాంకృతలను చేసి జాతికి మరో మారు దిగ్భ్రాంతి ప్రసాదించారు. పేరు వెల్లండించ వద్దన్న తమ షరతులకు అంగీకరించిన పిదప మీడియాతో వారు తమ మనోభావాలను మనసు విప్పి మరీ పంచుకొన్నారు. ఆ ముఖా ముఖీ తాలూకు కొన్ని విశేషాలుః

హంతకులను సన్మానించడం మంచి పద్ధతి కాదని ప్రజలు భావిస్తున్నారు. అందుకు మీ సమాధానం?

మంత్రివర్యునిగా నా దృక్పథం మరింత విశాలంగా ఉండడం అవసరమని నేను భావించడమే. ఏ ఒక్క వర్గం వారి అభిరుచుల మేరకో నడుచుకోవడం ప్రజాప్రతినిధికి సరి తూగదు. చాలా శతాబ్దాల బట్టి సమాజం నేరగాళ్ల పట్ల బహు క్రూరత్వం ప్రదర్శిస్తోంది. నేరస్తులు మాత్రం మనుషులు కాదా? వారికి మాత్రం భావోద్వేగాలు ఉండవా? 'దేవదాసు' సినిమా చూపిస్తే వాళ్ళూ కన్నీళ్లు పెట్టుకుంటారు. హంతకులూ సమాజంలో అంతర్భాగమే! క్రూరలను సైతం కూడగట్టుకుని ముందుకు సాగవలసిన అగత్యం మన సమాజానికి ఉంది. దొంగలూ దొరల వలె జీవించే మంచి భవిష్యత్తు కోసమే నేను కలలు కనేది. కానీ కొంత మంది కక్షపూరితంగా  నేరస్తుల మీద జుగుప్స పెంచుకుంటున్నారు. కిరాతకుల పట్ల  నేను ప్రదర్శించే సానుభూతిని మీడియాగా మీరూ సమర్థించాలి న్యాయంగా! 

మీ పార్లమెంటు సభ్యులలోనే మూడొంతుల మంది తీవ్రమైన నేరాలు చేసిన నేతలున్నట్లు రికార్డులు చెబుతున్నాయి కదా.. ?

 నిజమే! మా ఎంపీలలో 20 శాతానికి మించి తీవ్రమైన నేరస్తులున్నట్లు  నిందలు భరిస్తున్నారు. హత్యలు, మానభంగాలు, కిడ్నాపులు, వంటి ఆరోపణలల్లో మా స్వంత పార్టీనే ముందంజలో ఉందని లెక్కలు చెపుతున్నాయి. న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. అదృష్టం కొద్ది ఈ దేశంలో చట్టమూ తన పని తాను చేసుకుపోతోంది.

తన పని తానే చేసుకుపోతుందంటే మీ భావన?

పరిస్థితులన్నీ సవ్యంగా సాగుతున్నాయని అర్థం.  చాలా కేసుల్లో పోలీసుల విచారణ ఇంకా 'సాగు'తోనే ఉంది. కొన్ని కేసులే దారి తప్పి కింద కోర్టుల్లోకి ప్రవేశిస్తున్నాయి. అవీ అవసరాన్ని బట్టి క్రమంగా సర్దుకుంటాయి. సాధారణంగా ప్రతి ఎం.పి కి ఐదు నుంచి ఆరు దఫాలుగా ఎన్నికయే అవకాశం ఉంది. ఆ తరువాత అనారోగ్యం. భార్యో .. కొడుకో పదవి అందుకొనేందుకు సిద్ధంగా ఎటూ ఉంటారు. కొడుకు ఏ తాగుబోతో అయితే కూతురు రంగంలో దూకేందుకు సిద్ధమవుతుంది.

 కానీ మీరు దండలేసిన వ్యక్తులు న్యాయస్థానాలలో నేరస్తులుగా రుజువయినవాళ్లు కదా?  

అదే సామీ నేను మొత్తుకొనేదీ! పోలీసులు మా కార్యకర్తలకు సంబంధించిన కేసుల్లో మాత్ర,మే ఎందుకు త్వరత్వరగా విచారణ పూర్తిచేస్తున్నట్లు? అది అన్యాయమే కదా? న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. కానీ అవీ ఊహించని కారణాల వల్ల గత్తర గత్తరగా తీర్పులిచ్చేస్తున్నాయి! మా ప్రజాప్రతినుధుల పట్ల ఎంతో ఉదాసీనత చూపించే రాజ్యాంగ వ్యవస్థలు అభం శుభం తెలియని చిన్న నేరస్తుల మీదే ఎక్కువ గురిపెడుతున్నాయి! తాత్కాలిక సంఘ ప్రక్షాళనను గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు కాని.. భవిష్యత్తులో సమాజానికి అక్కరకొచ్చే ప్రతిభ తుడుచుపెట్టుకుపోతోందని అర్థంచేసుకోవడంలేదు. ఇప్పుడున్న రాజకీయనేతలంతా ఎక్కడ నుంచి పుట్టుకొచ్చింది? మా  అమాయక కార్యకర్తలు నిష్కారణంగా విక్టిమైజ్ అవుతున్నట్లు కాదా? వారు మానసికంగా మరింత కుంగిపోకుండా నియోజకవర్గ ప్రతినిధిగా వారిలో ఆత్మస్థైర్యం  నింపేందుకు ఏదైనా చెయ్యాలి.  మంత్రిగా అది నా విధుల్లో ఒకటి. అందుకే ఈ బహిరంగ సత్కారాలు!

ఈ హంతకులు మొత్తం పదిమంది ఉన్నారు. ఇందులో ఎవరి  భవిష్యత్తు మీద మీకు ఎక్కువ గురి ఉంది?

మళ్లీ మీరు మీ మీడియా బుద్ధి చూపిస్తున్నారు. నాకు ఎవరి మీద ప్రత్యేకమైన అభిమానంలేదు. అందరు నేరస్తులూ నాకు కావాల్సినవాళ్ళే! అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. నిజానికి వీరి కార్యకలాపాలు  గొప్ప టీం-వర్కుకి ఉదాహరణగా చెప్పుకోవాలి. సమృధ్ధిగా వనరులు, సరయిన వసతులు, శిక్షణ కల్పిస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తారనడంలో సందేహంలేదు.

భవిష్యత్తులో కూడా వాళ్లకి మీ సహాయ సహకారాలు ఉంటాయా?

సదుద్దేశంతో పోత్సహించాం.  ఆ సంకల్పానికి ముందు ముందూ ఆటంకం రాకూడదని అనుకుంటున్నాను. నా నియోజకవర్గంలోని మిగతా మండలాలు, జిల్లాలలో ఇదే తరహా సన్మానాలు కొనసాగాలి. అధికారులకు ఆ బాధ్యత అప్పగించడం జరిగింది. నిధులకు  కొరత లేకుండా  చూసుకోవడం నా బాధ్యత.అది తప్పక నిర్వహిస్తాను.

ముందు ముందు మరన్ని ఈ తరహా కార్యక్రమాలు మీ నుంచి ఆశించవచ్చా?

మా ప్రోత్సాహకాల కన్నా ముఖ్యమైనది వారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం. వివిధ మంత్రిత్వ శాఖలు ఆ దిశగా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసే పనిలో ఉన్నాయి. ఉదాహరణకు పెట్రోలు పోసే సందర్భంలో తమ వంటి మీద ఆ ఆయిల్ పడకుండా చూసుకోవడం ఎలా? పెట్రోలు పోసే సమయంలో తమ దగ్గరి అగ్గిపెట్టెలు పాలిథీన్ కవర్లలో ఉంచుకోవాలి. లేకపోతే తడిసి సమయానికి అక్కరకు రావు. ఆ జ్ఞానం లేక కొన్ని ప్రాణాలు వృథాగా అగ్నికి ఆహుతయ్యాయి! కొంత మంది కంగారులో వట్టి పెట్రోలు మాత్రమే పోసి అగ్గిపెట్టె కోసం వెదుకులాట మొదలుపెడతారు. సమయానికి ఎవరి దగ్గరా నిప్పు లేకపోతే సీను రివర్సయే ప్రమాదం ఉంది. చిన్న చిన్న పొరపాట్ల వల్ల  భారీ కార్యక్రమాలు భంగం కాకూడదు కదా! ఆ విధమైన శిక్షణ మీద మరింత దృష్టి పెట్టడం అవసరం. 

చివరి ప్రశ్న. న్యాయస్థానాలు తప్పు పట్టిన దోషులను రాజ్యాంగబద్ధ సంస్థల ద్వారా విడిపించడమే కాకుండా సమాజం ఎదుట వారిని ప్రజాప్రతినిధి హోదాలో మీరు  సన్మానించారు.. ఈ ప్రక్రియ మొత్తాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు?

మంచి ప్రశ్న. మా పార్టీ పాలనలో ఏ వ్యవస్థా అసలు పనే చెయ్యడం లేదని కదా విమర్శలు! నిత్యం కక్ష కొద్దీ విమర్శించేవారికి చెంపపెట్టు లాంటిది ఈ ప్రక్రియ మొత్తం అని నా  అభిప్రాయం. అసాంఘిక కార్యకలాపాలు చురుకుగా సాగుతున్నాయి. వారిని పర్యవేక్షించడంలో శాంతి భద్రతల శాఖలు తమ విధులు దివ్యంగా నిర్వహిస్తున్నాయి. కోర్టుల్లోనూ అంతో ఇంతో విచారణంటూ కొనసాగుతుందన్న  వాస్తవం దోషులకు పడ్డ శిక్షలు రువుజు చేసున్నాయి. చేసిన తప్పులు సరిదిద్దుకొనే  అవసరానికి రాజ్యాంగబద్ధ సంస్థలూ మినహాయింపు కాదన్న వాస్తవం ఆయా శాఖల పని తీరును బట్టి అర్థమవుతుంది. అంతిమంగా.. శిక్షలు పడే నేరస్తుల ఆత్మవిశ్వాసం పునరుద్ధరణ కోసం ప్రజాప్రతినిధులమైన మేమంతా రాజ్యాంగ విధులకు అతీతంగా పునరంకితమవుతున్నట్లు వట్టి మాటల ద్వారా కాకుండా గట్టి చేతల ద్వారా నిరూపించినట్లు కూడా అవుతుంది. సంఘాన్ని ఉద్ధరించే మా కార్యాచరణే మరోసారి మాకు గద్దె ఎక్కే అవకాశం ఇవ్వమని ప్రజల వద్దకు వెళ్లి గర్వంగా అభ్యర్థించే  అవకాశం ఇస్తుంది.  

మరో చివరి సందేహం. ఈ విధమైన కార్యాచరణ అన్ని రాష్ట్రాలలోనూ కొనసాగుతుందా?

కేవలం ఎన్నికలకు గడువు సమీపించిన రాష్ట్రాలకు మాత్రమే మా ప్రస్తుత కార్యాచరణ పరిమితమవుతుంది.

మరో చివరి ప్రశ్న. అన్ని వర్గాల  నేరస్తులూ మీ సన్మానాలను ఆశించవచ్చా?

మీ ప్రశ్న అభ్యంతరకరం. ప్రతిపక్షాల కోసం పనిచేసే నేరస్తుల మీద మా ఉక్కుపాదం మునుపటి కన్నా దృఢంగా మోపడం ఖాయం. మీ ద్వారా ప్రతిపక్షాలకు ఇదే నా హెచ్చరిక కూడా. 



రచన-  కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దినపతిక - 30-09-2018 ప్రచురితం

సరదాకే : ఉల్లికిపాటు - కర్లపాలెం హనుమంతరావు ( సూర్య దినపత్రిక సంపాదకీయ పుట ప్రచురణ )

 


                                                 

కోస్తే కన్నీళ్ళు తెప్పిస్తుంది. సరే కొయ్యక ముందే కన్నీళ్ళు తెప్పించే గడుసుదనం కూడా బహుశా కూటి కూరగాయలన్నింటిలోనో ఒక్క ఉల్లిపాయకే ఉంది. ఏడిపించినా ఇష్టపడే ప్రముఖులు ఎప్పుడూ కొందరు ఉంటారు. హిందీ చిత్రాల మీనాకుమారి, మన తెలుగు సినిమాల  సావిత్రిల తరహాలో! ఈ కన్నీళ్ల కోవలోకి వచ్చిచేరే ఉల్లిపాయే ఎంత కన్నీళ్ళు తెప్పించినా ప్రియమే కదా! ఆ ప్రియమైన ఉల్లి ఇప్పుడు మండీలలో ప్రియమైనందుకే ఇంత లొల్లి. మన ఉప్పు మీద పన్ను వసూలు చేసి సంపన్నులవుతున్నారని కదా స్వాతంత్ర్యం రాక మునుపు తెల్లవారికి ఎదురు తిరిగి స్వదేశీ ఉప్పు ఉద్యమంతో బాపూజీ దండియాత్ర చేసింది! స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిపోయింది. ఇప్పుడు ఉల్లిగడ్డను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటే తప్ప వంటింటి పొయ్యిలో పిల్లి లేవనని మొండికేస్తోంది. ఉల్లికే కన్నీళ్ళు తెప్పించే లొల్లి ఇంకెన్ని నాళ్లీ తల్లీ!

 ఉప్పు లేని కూర చప్పగా ఉన్నా అదో పెట్టు.  బి.పి రోగం దాపురించిందనో.. దాపురించనుందనో సర్దుకుపోడం కద్దు! ఈ ఉల్లి సిగ దరిగిరి, ఒక్కసారి గాని రుచి మరిగితిమా.. ఎన్ని రోగాలు రొప్పులు వచ్చినా రానున్నా .. కోసే వేళ కన్నీళ్లు.. కోసుకొనే అవకాశం లేని వేళా కన్నీళ్లే! ఉల్లి కన్నీళ్ల కహానీ ఉల్లికే కన్నీళ్లు తెప్పించడానికి కారణం  ఏ పాలకుల ఉద్ధరణో?

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదంటారు. ఆ నానుడి మన తెలుగువాడి నాలుక నాలుగు యుగాల బట్టి  వాడేస్తోనే ఉంది. జిహ్వ చేత 'వాహ్వా.. ఎంత రుచి!' అంటూ సన్నాసుల నోట కూడా చాటుగా పాడించేస్తున్నది. అహారానికే కాదు.. అల్పాహారానికీ ఉల్లిని కోరుకోడమే ఎన్ని గోదాములు నిండుగా పండినా  కరువు కోరల పాలిట పడటానికి ప్రధాన కారణంట! ఎన్నుకున్న  పాలకుల ఈ పరిహాసాలకి.. ప్రజల సంగతి  సరే ఉల్లికే కన్నీళ్లు తెప్పించే సరసమయిపోయింది! 

ఉల్లి వల్ల కలిగే ఆరోగ్య లాభాలు  ఎప్పుడూ  ఏకరువు పెట్టే సోది  జాబితాలోవే! మందుకైనా దొరకని ఈ కరువు రోజుల్లో అ ఉల్లి మహాతల్లి మేళ్లను ఎంతని హనుమాన్ చాలీసాల మాదిరి వల్లెవేస్తూ కూర్చోడం? తలుచుకుంటేనే చాలు  కన్నీళ్ళు పెట్టించే ఉల్లి మీద కొత్త కబుర్లేమైనా  చెప్పుకోవచ్చేమో..  చూద్దామా!


క్రీస్తు పుట్టడానికి ఐదు వేల ఏళ్ల  ముందే ఉల్లిపాయ  పుట్టిందని వినికిడి. రాతి యుగం నాటి మనిషికి రోటీలో  ఉల్లిపాయ రోటిపచ్చడి కలిపి తినే యోగం లేకపాయ! రాగియుగం నాటి శాల్తీలకే రోజూ రాగి సంకటిలో ఇంత ఉల్లి తొక్కు చవులారా నంజుకు తినే లక్కు. గుండ్రంగా చెక్కులు తీసి మరీ పింగాణీ పేట్లలో  వడ్డిస్తుంటారు కదా  ఉల్లి ముక్కలు ఇవాళ్టి స్టార్ హోటళ్లలో!   సరదా కోసమైనా సరే సుమా!  ఆ తరహా ముక్కలు  తెల్లారి  రెండు  పంటి కింద వేసుకునే జిహ్వచాపల్యం  మహా ప్రమాదమని  రెడ్ ఇండియన్ల గాఢనమ్మకం.  రాత్రంతా నిలవున్న ఉల్లిపాయ ముక్కలంటే కొన్ని రకాల కొరివి దయ్యాలకు పరమ ప్రీతికరమని ఆ పిచ్చోళ్ల పిచ్చి నమ్మకం!

మధ్య ప్రాచ్యం ఈజిప్షియన్ల మేళం అందుకు పూర్తిగా విరుద్ధం.  ఉల్లిపాయ గుండ్రటి చెక్కులు వాళ్ల సంస్కృతిలో  దేవీ దేవతలతో సమానం.  మనిషి తపించే  చిరంజీవి తత్వానికి గుండ్రంగా కోసివుంచిన ఉల్లిపాయలు గొప్ప సంకేతం! ఈజిప్టు  చక్రవర్తుల సమాధుల గోపురాలు ఉల్లి ఆకారంలో కనువిందు చేస్తుంటాయ్! మరణానంతరం కూడా తమను ఏలిన   పాలకుల జీవితాలు సౌకర్యవంతంగా ఉండాలన్న కాంక్ష ఆ ఉల్లి గోపురాల నిర్మాణాల వెనుకున్నమర్మం. ఎన్నుకున్న సైతాను నేతలు ఎప్పుడు విరగడవుతారా  అంటూ వెయ్యికళ్లతో ఎదురుచూసే మనకు నిజంగానే ఇదో వింత విశేషమే కదూ! 

అంత కన్నా వింత విషయం.. ధార్మిక సాంప్రదాయాలలో ఉల్లికి ఇంతటి ప్రాధాన్యమున్నప్పటికీ ఉల్లి సాగులో మధ్య ఆసియా  చాలా వెనకంజలో ఉండటం! ఈజిప్టు వంటకాలకు శ్రేష్టమైన రుచినిచ్చే నాణ్యమైన ఉల్లి నేటికీ పాకిస్తాన్, ఇరాన్ వంటి  తూర్పు ఆసియా ప్రాంతాలలో సాగు కావడం గమనార్హం.

కరెన్సీ కాగితం రూపంలో ఉంది. కాబట్టి ఏ కలర్ ప్రింటింగ్ బట్టీల్లో అచ్చొత్తించినా అచ్చమైన నోట్ల మాదిరి దర్జాగా చలామణీ చేయించొచ్చు. ఇట్లాంటి పిచ్చి తిప్పలు వస్తాయనే మధ్య యుగాలల్లో మనుషులు ఉల్లిపాయనే నేరుగా కరెన్సీ కింద వాడేసుకొనేవాళ్లు.ఇంటి అద్దె వంటివి అంటే.. ఆఖరికి  ఉల్లిపాయ కొనాలన్నా ఉల్లిపాయ కరెన్సీనే అక్కడి కొన్ని దేశాలల్లో! అప్పటి జనాల తిప్పలు వింటుంటే కన్నీళ్ళే కాదు సుమా.. ఉల్లిపాయ నవ్వులు కూడా పూయిస్తుందని తెలుసుకోవాలి ముందు. హాహాకారాలు మాత్రమే పుట్టించేదీ కుళ్ళు ఉల్లిపాయ అన్న అపోహలు ఇహనైనా చాలిస్తే మేలు.  చాలినంతగా ఉల్లి ఉత్పాదన మీదా, సక్రమ పంపిణీ విధానం మీదా  ఏలినవారు దృష్టి పెడితే చాలు! కన్నీళ్లతో పాటే హా.. హ్హా.. హ్హా అంటూ పాలకులకు హారతులు పడతారు వినియోగదారులు.

ఉల్లిపాయను కోస్తే సల్ఫర్ వస్తుంది. అది గాలిలోని తేమతో కలిసి సల్ఫూరిక్ ఆసిడ్ అవుతుది. కళ్ల మీద  దాని దాడి ముందుగానే గ్రహించేస్తుంది.  మన మొద్దు యంత్రాంగంలా కాదు సుమండీ మెదడు పద్ధతి! ఏ ప్రమాదం పసిగట్టినా తక్షణమే చర్యలు తీసుకునే బాధ్యత ఉంది కాబట్టి వెంటనే  నీళ్లు కార్చి కళ్ళకు ఉల్లి నుంచి రక్షణ కల్పిస్తుంది. ఏ  కోతలు , గీతలు లేకుండానే మరి కోతుల్లాంటి నేతలు తెప్పిస్తున్న కన్నీళ్ల సంగతో? ఉగాండాలో కూడా ఉల్లికి మా గొప్ప  కరువుంగా ఉందనే ఊకదంపుళ్ళు మన నేతలవి. ఉల్లి బెంగ కన్నా ముందు ఈ నేతల వైనాల గురించి కదా జనాలు దిగాలు పడాల్సింది!   నీళ్లలో తడిపినప్పుడో, కోసే కత్తి పీట పీకకు ఇంత  తెలుపు వెనిగర్ బొట్టు రాస్తేనో ఎంత లావు ఉల్లిపాయైనా కన్నీళ్లు తెప్పించే శక్తి కోల్పోతుంది. ఏ ఉపాయాలు వాడి మరి మన కోతి బ్రాండ్ నేతల నుంచి వచ్చి పడే ఉపద్రవాల నుంచి జనం బైటపడేదీ?!


ఇంకా నయం! ఇక్కడ ఇండియాలో పుట్ట బట్టి కరువుకు ఏదో కన్నీళ్లతో సరిపోతోంది. అదే లిబియానాలో పుట్టుంటేనా? ముప్పతిప్పలే! అక్కడివాళ్లకు తిండి తిప్పలంటే  ముందుగా గుర్తుకు వచ్చేది  ఉల్లిపాయలే! లిబియన్ల తలసరి సాలీనా  ఉల్లి   వినియోగం దాదాపు అరవై ఏడు పౌండ్లు!

ఉల్లి తొక్క మందంగా ఉంటే రాబోయే శీతాకాలంలో ఇబ్బందులు పెట్టే మందంలో మంచు కురుస్తుందని ఇంగ్లీషు జానపదులలో ఓ నమ్మకం.  తేలికపాటి ఉల్లిపొర తేలిగ్గా వెళ్లిపోయే చలికాలానికి  సంకేతమని వాళ్ల భావన.

 చూడ్డానికి వచ్చే పోయే వాళ్ల చెవులకు ఇంపుగా ఉండాలని న్యూయార్క్ నగరానికి ఆ 'బిగ్ ఏపిల్' అనే ట్యాగ్ తగిలించారు వందేళ్ల కిందట! అయితే ఆ మహా నగరం అసలు బిరుదు బిగ్ ఆపిల్ కన్నా ముందు బిగ్ ఆనియనే !  'ఆపిల్ చెట్టు కాయలం' అంటూ మహా గొప్పలు పోయే ఇక్కడి మన నేతల మూలాలదీ ఇదే తంతు. తీరిగ్గా తడిమే ఓపికలుండాలే గాని  తల్లివేర్లు  ఏ ఉల్లిజాతికో తగిలిందాకా ఆగేవి కాదు! ఆపిల్ కాయ అప్పికట్లలాంటి బుల్లి ఊళ్లల్లో కూడా దొరుకుతున్నది కానీ.. ఉల్లికే రాజధాని వంటి మహానగరాలల్లో కూడా ఉపద్రవం వచ్చిపడింది! పాలించమని చేతికి అధికార దండం అప్పగించింది మంది. పక్కవాడిని లాలించి లాగేసుకోడమా, చండుకు తిని చంతకు చేర్చేసుకోడమా అన్న మంత్రాంగంలోనే ఎక్కడి సమయమూ చాలడంలేదు ఏలికలకు. ఇహ ఉల్లి  ఆలనా పాలనా పైనా సమయం వృథా చేసుకునే పిచ్చితనమా? 

ఉల్లిసాగులో మన దేశానికన్నా ముందున్నది ఒక్క చైనా (సాలీనా 20,507,759 మెట్రిక్ టన్నులు) నే సుమా! అగ్రరాజ్యం అమెరికాది (13,372,100) కూడా మన (13,372,100) తరువాతి స్థానమే! అంటూ  సర్కార్లు ఏకరువు పెట్టే రెండేళ్ల కిందటి లెక్కలు  బీదా బిక్కీ డొక్కలు నింపుతాయనే! ఎంత ఏడిపించే ఉల్లిగడ్డకైనా కన్నీళ్లాగుతాయనే నేతల గడుగ్గాయి కూతలకు!

అమెరికన్ సివిల్ వార్ వేళలో 'ఉల్లిపాయలు ఇవ్వకుంటే  ఉన్న చోటు నుంచి ఒక్కంగుళమైనా ముందుకు కదిలేదిలేదు' అంటూ జనరల్ గ్రాంట్ బెదిరిస్తూ టెలిగ్రాం కొట్టించాడు ప్రభుత్వానికి. వట్టి తినడానికే అనుకునేరు.. అపచారం చుట్టుకుంటుంది.. యుద్ధంలో అయే కోతిపుండ్లు బ్రహ్మరాక్షసులవకుండా ఉండాలంటే  ఉల్లిపాయే అప్పట్లో చవకలో దొరికే  యాంటీ సెప్టిక్ మందు.  ఉన్నపళంగా వార్ డిపార్ట్ మెంట్ వారు మూడు రైలు బోగీలకు నిండుగా ఉల్లిపాయలు ఊరికే కూరల్లో పప్పుల్లో వాడేసుకోమని  పంపిస్తారా?

  ఉల్లి తడాఖా ముందు ఉగ్రవాదులూ తలొంచుతున్న కాలం ఇది! పాపం ఊళ్లల్లో బీదా బిక్కీకే కనీసం ముక్కులతో వాసన చూసుకునేందుకైనా ముక్క సరుకైనా దొరికడంలేదు!  

నెబ్రస్కా బ్లూ హిల్స్ అనే ఓ బుజ్జి దేశం ఉంది. అక్కడి నేరస్తుల శిక్షా స్మృతిలో  నేటికీ ఉల్లిపాయకు గౌరవప్రదమైన స్థానం ఉంది! పిరికి మగాడిని గేలిచేస్తున్నట్లుగా పెద్ద టోపీ తలకు తగిలించుకునే మహిళకు జీవితాంతం  ఉల్లి పదార్థాలేవీ కంచంలోకనిపించరాదన్నది శిక్ష. ఉన్న నాలుగు రోజులూ ఉల్లి మోజు తీరకుండానే పోయేది మేలా? ఆఖరి కోరికగా అయినా ఆరగా ఆరగా అద్దిన ఉల్లి ఊతప్పం మింగి 'హరీ'మనడం మేలా?

మొదటి శతాబ్దంలో జరిగిన ఒలపింక్స్ ఆటల బట్టి ఉల్లిపాయదే నేటి వరకూ ఎవరూ ప్రశ్నించలేని మొదటి స్థానం!  ఆ ఆటల్లో అఖంద విజేతలుగా నిలిచిన గ్రీకు కిలాడీలు బలవర్థక ఆహారం కింద పుచ్చుకున్న ప్రధాన ఆహారమంతా ఉల్లిపాయలతో తయారయినదేనని  ఈనాటికి జనాలకో నమ్మకం. గ్రీ

సు దేశంలో ఉల్లిపాయ బలవర్థక ఔషధం కింద లెక్క. ఇండియాలో ఇప్పటికీ కంటికి, కీళ్లకు, గుండెకు మేలు చేసే గట్టి మందుగా ఉల్లిపాయకు మంచి పేరు! 


2011 లో  పీటర్ గ్లేజ్ బ్రూక్ అనే బ్రిటిష్ రైతన్న 18 పౌండ్లు బరువున్న ఉల్లిపాయను పెంచి ఏకంగా గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కేసాడు. ఆ మాదిరి రికార్డులు .. అవి బద్దలవడాలు మనకొద్దులే! కానీ ఆర్నెల్లుగా ఆకాశానికలా ఎగబాకి ఎటెటో వెళ్లిపోయిన ఉల్లిపాయ..  ఎంతగా బతిమాలి బామాలినా కిందకు దిగిరాననే నీ మంకు పట్టు  మానేయడం మేలు!   ప్రపంచ మార్కెట్ గణాంకాల రీత్యా  శాఖాహార పంటలలో  ఇప్పటికీ ఉల్లిదే  ఆరో స్థానం! ఆ తల్లి కంటబడటం లేదని ఎంత కాలం ఇట్లా  దిగాలుబడి ఎదురుచూసేది?  దేవుళ్లకు ఎలాగూ ఉల్లి పొడ గిట్టదు.  ఆ మూలవిరాట్టుకు  మన ఉల్లి పాట్లు అర్థమయే అవకాశంలేదు. చంద్రయాన్ - మూడు  వెళ్ళి వెదికే వరకు ఉల్లిపాయ ' మూడ్' ఇట్లాగే ఉందా! సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుని వారసులం మనం. టెంకాయకు బదులుగా వంకాయ సృష్టి జరిగినట్లే  ఉల్లికి బదులుగా మరి ఏ వెల్లి సృష్టో జరిగిపోవచ్చు! రచ్చ    రాజకీయాల కోసమైతే ఎట్లాగూ ఏ రాజధాని,  పౌరసత్వం మాదిరి చిచ్చులో బొచ్చెడు కొత్తవి రగిలించుకోవచ్చుగా! పేదోడి కడుపు రగిలి  రవ్వ నిప్పుగా మారక  ముందే ఉల్లిపాయను పాడు చెర నుంచి ముందు బయటకు తెద్దురూ!  కన్నీళ్లు పెట్టించే ఉల్లి తల్లి కంటనే కన్నీళ్లు వరదలై పారుతున్నా నవ్వు తెప్పించే పిచ్చి చేష్టలిట్లా కొనసాగితే  కన్నీళ్లు పెట్టుకునేది ఎవరో తమరికి తెలియదా స్వాములూ?

( సూర్య దినపత్రిక సంపాదకీయ పుట ప్రచురణ ) 


- కర్లపాలెం హనుమంతరావు 

20 - 10-2021 

బోధెల్ ; యూ. ఎస్.ఎ 

సరస్వతీ .. నమస్తుభ్యమ్ ! కర్లపాలెం హనుమంతరావు ( ఆదివారం - ఈనాడు - దినపత్రిక - సంపాదకీయం )

 



పలు సందియములు తొలచును | వెలయించున గోచరార్థ విజ్ఞానము - అన్నది చదువు మీది చిన్నయసూరి సదభిప్రాయం. 


అక్షరం లోకం చక్షువు. నిరక్షర కుక్షిని గుడ్డికుక్కతో పోల్చారు పురందర దాసు. 'సంతకు పోయి తిరిగిన దుడ్డు పెట్టె కాక దొరకేనా?' అని ఆ యోగి ఎకసెక్కాలాడి నట్లే గాలికి తిరిగి తన పుత్రులెక్కడ జనుషాంధులవుతారోనని  పంచతంత్రంలో సుదర్శన మహారాజు మహా మధనపడతాడు. 


అహరహము అరినామస్మరణ మరిగిన ముద్దుల పట్టిని తిరిగి దారికి తెచ్చుకుందామంటే హిరణ్యకశిపుడికి  ముందుగా తోచింది సద్గురువుల వద్ద లభించే సద సద్వివేక చతురత కలిగించు విద్యాబుద్ధులే! చదవని వాడు అజ్ఞుండగునని  రాక్షసుడైనా అక్షర మహిమను చక్కగా గ్రహించాడు. 


ఇప్పుడంటే విద్య పరమార్థం అర్ధసంపాదన గానీ... ఏకలవ్యుడు ఆ కాలంలో ఏ కాసుల కోసం బొటన వేలుని ఫణంగా పెట్టి మరీ విద్యల కోసం వెంపర్లాడినట్లు? 


కర్ణుడు పరశురాముని వద్ద పడీ పడీ శుశ్రూషలు చేసింది కాలక్షేపం కోసమైతే కాదు గదా! 


మృత సంజీవనీ విద్య కోసమై  కచుడు చేసిన సాహసం సామాన్య మైనదా? 


ఆత్మ పరమాత్మల పరమరహస్యాలను గురుముఖత: గ్రహించాలన్న కామనలోనే  గదా జాబాలి గౌతముని ముఖ్యాశ్రమం లో అన్నేళ్ళు ఎడతెగకుండా గొడ్లూ గోదలను కాసింది?! 


విద్యా ర్జనకెంత విలువ  లేకపోతే  గీతాచార్యుడు గోపాల బాలుడు బాల్యంలో సాందీప మహాముని పంచలో కూర్చుని గుంత ఓనమాలు దిద్దుకుంటాడు?! 


అవతార పురుషుడు ఆ తారక రాముడు సైతం తాటకి వధకు  పూర్వం వశిష్టులు వారి వేదాల పారాయణంలో   తర్పీదు పొందిన వాడే! 


విద్యా సముపార్జన ఓ విధిగా నిర్దేశించిన బ్రహ్మచర్యం చతురాశ్రమాలలో ప్రథమమైనదేకాదు.. ప్రధాన మైనది కూడ. 


భారతీయులకు చదువు చెప్పే గురువు సాక్షాత్ - పరబ్రహ్మ స్వరూపం . పురందరదాసు ప్రబోధించిన విధంగా గురువుకి గులాము అయ్యేదాకా ముక్తి దొరకదన్నా ! " అన్న సూక్తి మనిషికి చదువు సంధ్యం  మీదున్న భక్తి శ్రద్ధలకు పెద్ద నిదర్శనం.


భరృహరి బోధించిన విధంగా  విద్య నిగూఢ గుప్తమగు విత్తము. పూరుషాళికి రూపము. యశస్సు, భోగకరి. విదేశంలో ఆదుకునే ఆపద్బంధువు. హర్తకు  అగోచరమైన నిధి. సుఖపుష్ఠి  సత్కీర్తి  ఘటించు  ఈ దివ్య ధనం అఖిలార్థకోటికి  పూర్తిగా ధారపోసినా పెరుగు ద్రవ్యమేగాని కరుగు ద్రవ్యం కాదు. 


యుగాంతం వేళ కూడా అంతం కాని ఈ జగానికి ఎవరు అధిపతో వారు కుబేరుని మించిన ధన సంపన్నులు. మనిషికి భుజకీర్తులు, సూర్య చంద్రహారాలు పెద్ద అలంకారాలు కానే కావు. 


చందనస్నానాలూ, మందారమాలలు అందచందాలను కా ఏ మంత్ర పెంచేవి కావు. పెంచనూ లేవు. వాగ్భూషణం ఒక్కటే మనిషికి సుభూషణమ్-అన్న భర్తృహరి వాదన కాదనేందుకు లేద. 


ఆ రాజకవి  అన్నట్లు నిజంగా విద్యనృపాల  పూజితమే . కాకపోతే మనుచరిత్ర  కర్త అల్లసాని పెద్దనామాత్యులు 'ఎదురైనచో మద కరేంద్రము నిల్పి  కేయూత యొసగి  కృష్ణరాయలువారు సరదాకు  ఎక్కించుకోరుకదా? 


వల్మీకజుడైన వాల్మీకి మహర్షికి కమలజన్మునితో  సరిసమానమైన గారవాది మర్యాద లందలటానికి కల కారణం రామాయణా రచనా విశిష్టతే అంటే  ఏమనగలము?! 


సుభాషిత రత్నావళి  భాషించినట్లు చందమామకు తారా తోరణం, పతీపత్నులకు పరస్పర సాహచర్యం, పృథ్వీమతల్లికి  సద్భూపాల సుపరిపాలన భూషణాలయితే.. విద్య మాత్రం సర్వేసర్వత్ర సకల లోకాలకూ  ఒకే మాదిరి  సద్భూషణం. 


డొక్క శుద్ధిలేని మనిషి తేనె బొట్టులేని పట్టు' అంటారు ఖలీల్ జిబ్రాన్. మనిషి జన్మ ఎత్తినందుకైనా నాలుగు మంచి ముక్కలు నాలుక కింద ఉంచుకోనివాడిని వజ్రవైఢూర్య ఖచిత ఘటకంలో  తెలకపిండి వంటకం కోసం మంచి గంధపు చెక్కల్ని మంట పెట్టిన వానికి మించి వెయ్యి రెట్లు అధిక మూర్ఖునిగా చిత్రించింది. విద్యానీతి . 

చదువుకు మించిన  చక్కదనం, చక్కని ధనం  ముల్లోకాలు గాలించినా ఎక్కడా దొరకదనేదే సర్వశాస్త్రాల సారం. భాగవతంలో భక్త ప్రహ్లాదుడు కన్న తండ్రి ముందు మొరపెట్టుకున్న చదువుల మర్మం ఇదే!


చదువు సంధ్యలు చక్కని జంట పదం. జీవన సంధ్యను  రాగ రంజితం చేయగలిగే చేవ జీవితాంతం వదలని  చదువుకు మాత్రమే ఉందని ఎంతో  వింతగా ధ్వనిస్తున్నదీ పదం ! 


బతుకు ధర్మక్షేత్రం మంచి చెడ్డల  మధ్య జరిగే నిత్య కురుక్షేత్రం నుంచి మానవుడిని  మాధవుడిలా కాపాడగలిగేది ఓనామాలే .


సర్వరోగాలకి మూల కారణమైన తాపత్రయం వల్ల అంతిమంగా జరిగే నష్టం ఆయుక్షీణం  - అన్నది రుగ్వేద వాదం. ఆ యావ నుంచి మనసుని మళ్ళించి మంచి దోవకు అప్పగల  తారకమంత్రం  మన చేతిలోనే ఉందని మానసిక వైద్యులూ చెబుతున్నారు. 


ఆరోగ్యసిద్ధికి.. అమరత్వ లబ్ధికి పుస్తక పఠనమే ఉత్తమ సోపానం అని ఇప్పుడు లండన్ విశ్వవిద్యాలయ పరిశోధకులూ నొక్కి  చెప్పే మాట . ఒక దశ దాటినా  పిదప వయసుతో పాటు మనసు వడలి పోవడం సహజ పరిణామం . నిష్కాముకత్వం దానికి నిఖార్సైన  జాషధం  కావచ్చు  కానీ... ఆ యోగ తత్త్వం అందరికీ అంత సులువుగా అందివచ్చే అందలమేమీ కాదు. 


బద్దెన నీతిశాస్త్రంలో కుండబద్దలు కొట్టిన విధంగా  ధనం, ఉషోదయం, యవ్వనం, వండిన అన్నం, మూర్ఖుని స్నేహమల్లే  మానవుడి  జీవిత కాలమూ బుద్భుదప్రాయమే. 


'ఆయువునూరు సంవత్స రములందు సగంబు నశించె నిద్ర చే నా యరలో  సగంబు గత మయ్యెను బాల్య జరాప్రసక్తి  చే| బాయక తక్కిన  యట్టి సగబాలు గతించు బాలయసవృత్తి చే' అని సూక్తి . 


ఆ మిగిలిన సగభాగంలోనైనా పడుచుదనంతో  పరవళ్లు  తొక్కాలని ఉవ్విళ్లెవరికి ఊరవు ? పుస్తక పఠనం ఓ  వ్యసనంగా మలుచుకున్నవారి ఆయుర్దాయం పెరగడమేకాదు.. ఉన్నంతకాలం చలాకీగా  చిందులెయ్యగలుగు తారని అండాలండే  విశ్వ విద్యాలయ పరిశోధక  బృందం జరుపుతున్న  పరీక్షల ఫలితం తేల్చింది . మానవకణాలలోని క్రోమోజోన్ల  చివర్ల జీవిత కాలాన్ని నిర్దేశించే ' డెలోమెల్ ' ఉంటాయని, అవెంత దీర్ఘంగా ఉంటే జీవిత కాలమంత సుదీర్ఘంగా సాగుతుందని ఆ బృంద  నాయకుడు ప్రొఫెసర్  స్టీఫెన్ హోల్గేట్ వాదం. 


పుస్తకాల పురుగులలో ఈ'డెలోమెల్ ' పొడుగు  పెరుగుతుంటుందని  తేలిన పరిశోధనల సారాంశం. 


ఇంకేం! ఏడుపదులు దాటినా  చేతికి కర్ర రాకుండా చురుకుగా తిరగాలంటే  వెంటనే ఓ మంచి పుస్తకంతో పఠనాసనంలో బైఠాయిస్తే సరి!  దీర్ఘాయుష్మాన్ భవ! 


- కర్లపాలెం హనుమంతరావు 

02 -11-2021 

- కర్లపాలెం హనుమంతరావు 


( ఆదివారం - ఈనాడు - దినపత్రిక - సంపాదకీయం ) 


ఆత్రేయ - తన మూలం ఇదం జగత్

 


ఆత్రేయ గోత్ర నామం: మన'సు కవి'

అసలు పేరు: కిళాంబి వేంకట నరసింహాచార్యులు

పేరు తెచ్చిన పేరు: ఆచార్య ఆత్రేయ


ఆచార్య అంటే ప్రొఫెసర్ కాదు. అసలు పేరులోని తోక. రాయటం రాని రచయిత. ఎంతసేపటికీ ఎదుట కూర్చున్న రాతగాడికి డిక్టేట్ చేయటమే. రాత్రి సుష్టుగా భోచేసి, వెంటనే పడుకుని, రెండు గంటల వేళ లేచి తెల్లారే వరకూ రచనలు చేసే ఆత్రేయ - 'రాత్రేయ' బూతు పాటలు రాస్తారు గనుక 'బూత్రేయ'. ఎవరేమని పిలిచినా పట్టింపులేని మనస్తత్వం అంటారు ఆయనది. హాస్య స్ఫూర్తి ఉన్నా హాస్యం రాయటం రాదు. రాయక నిర్మాతల్ని, రాసి ప్రేక్షకుల్నీ ఏడిపించే మనసుకవి. మన 'సుకవి'. సరస్వతీ పుత్రుడేగానీ, లక్ష్మీపుత్రుడుగాదు. పొద్దున పదివేలు చేతి కొస్తే సాయంకాలానికి ఖాళీ! శుక్రవారంనాడు నిర్మాతల్నుంచి చచ్చినా ఒక్క పైసా రాలదు. కానీ ఆయన సాధించేవాడు! 'ఏ రోజు ఎంత కావాలో తెచ్చుకో! రేపటికి దాచుకోవద్దు!' అన్న సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలో పెట్టాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా 'చిన్నారి మనసులు' చిత్ర నిర్మాణానికి పూనుకున్న మహానుభావుడు. డబ్బు పెడతానన్న ఓ పెద్దమనిషి మాటల్ని నమ్మి సినిమా యజ్ఞానికి పూనుకుని సమిధగా మారిన ఎందరో మహానుభావుల్లో ఆత్రేయ మొదటివాడు కాదు, చివరి వాడూ కాదు. చివరికి చేసేది లేక 'చిత్రం'గా అనుకున్నదాన్ని 'పిల్లలతో చెలగాటం - పెద్దలకే ఇరకాటం' పేరుతో దూరదర్శన్‌ కు  పదమూడు భాగాలుగా తీయాల్సి వచ్చింది. కాల్చుకోవాల్సి వచ్చింది. . చేతులు

చివరి దశలో పెద్ద ఇల్లుపోయి చిన్న గదుల ఓ మేడమీద ఓ చిన్ని వాటాలో చిన్ని మంచం మీద గడిపినవాడు.


"మనిషి పుట్టినప్పుడు ఎలా ఉంటాడో. (గిట్టనప్పుడు) గిట్టనప్పుడూ  అలాగే ఉండి 'పోతాడు'. చివరి దశా తొలిదశ ఒకేలాగా మారటం అంటే ఆ మనిషి జీవితం అనే గీతంలో పదాలు, చరణాలు.. సరిగ్గా పడలేదనే అర్ధం" అంటాడు ఆత్రేయ వేదాంత ధోరణిలో! ఎంతయినా మనసు కవి కదా!


' సీను రాస్తే రాత్రేయే రాయాలి' అనిపించుకున్నాడుగానీ, 'బ్రతికితే ఆత్రేయలాగే. బ్రతకాలి' అని మాత్రం అనిపించుకోలేకపోయాడు. అతని ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యమే అందుకు కారణం. '

- కర్లపాలెం హనుమంతరావు 

( రియల్ ఎస్టేట్స్ - మాసపత్రిక - ధనమూలం ఇదం జగత్ కాలమ్ - ప్రచురితం ) 

ధనమూలం ఇదం జగత్

 


కహానీలు : కర్లపాలెం హనుమంతరావు 

( రియల్ ఎస్టేట్స్ : కాలమ్ - మాసపత్రిక - ధన్ మూలమ్ ఇదం జగత్ ) 


పావలా శక్తి!


నేల మీద పడింది చెల్లని పావలా బిళ్లయినా సరే... వంగి తీసుకోకుండా ఉండలేరు. నడుము నొప్పి ఉన్నవాళ్లయినా సరే!


7


తెలుగు మార్క్ !


భూమిలోన పుట్టు భూసారమెల్లను

తనువులోన పుట్టు తత్వమెల్ల

శ్రమలోన పుట్టు సర్వంబు ధనమౌను

విశ్వదాభిరామ వినురవేమ !


అచ్చ తెనుగులో ఉన్న దీన్ని వివరించాల్సిన పనిలేదు. శ్రమలోన పుట్టు సర్వంబు ధనమౌను' అంటూ మారి కన్నా ఎంతో ముందుగా మన వేమన చెప్పటమే ఇక్కడ విశేషం.


'ఏడు(పు)


ఏదైనా లెక్కించేటప్పుడు గత తరంవాళ్లు ఒకటికి బదులు లాభం అంటూ మొదలు పెట్టేవాళ్లు. ఏడు అంకెకు బదులు ఆరున్నొక్కటి అనేవాళ్లు. ఏడు అంటే అశుభం ధ్వనిస్తుందని భావించేవారు మరి. లెక్కల్లోనయినా ధనలక్ష్మికి ఇష్టం లేని మాటలను ఉపయోగించటం మంచిది కాదని మన పెద్దవాళ్ల ఆలోచన. తథాస్తు దేవతలుంటారని భయం పాపం!


జోకాభిరామాయణం


ఉపాధ్యాయుడు : 

మన దేశంలోనే అప్పులు ఎందుకు ఎక్కువగా ఉన్నాయిరా? 


విద్యార్థి : తీసివేతలు నేర్పే రోజుల నుంచీ మాకు. చిన్న అంకెలో నుంచి పెద్ద అంకె పోకపోతే పక్క స్థానం నుంచి అప్పు తెచ్చుకోవటం నేర్పుతుంటారు గదా సార్! అందుకూ!

- కర్లపాలెం హనుమంతరావు 

03-11-2021 


( REAL ADVISER - DECEMBER 2011) 


ఈనాడు - సంపాదకీయం జీవన శిల్పం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - 20-03-2011 - ప్రచురితం )

 ఈనాడు - సంపాదకీయం 

జీవన శిల్పం

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 20-03-2011 - ప్రచురితం ) 


భారతీయ కాలమానం ప్రకారం ఏడాది చివర్లో వచ్చే పౌర్ణమి, ఫాల్గుణంలోనే శిశిరంలో రాలిన ఆకుల స్థానే కొత్త చివుళ్ళతో ప్రకృతి పచ్చగా పలకరించడం ప్రారంభించేది.  మరునాటి నుంచీ మొదలయ్యే వసంతంతోనే 'రాగవర్ణ రంజితమైన వసంతాగమనం ముందుంది. ' సంబరాలు జరుపుకొనేటందుకు పండుగ ఓ మంచి సందర్భం' అన్న పెద్దల ఆశావాద ఆదేశ ఫలితమే ఫాల్గుణ పౌర్ణమి హేళికా పౌర్ణమిగా వన్నె లీనడానికి కారణం. 'హేళి' అంటే దేవభాషలో వినోదం. 'హేళిక' అనే శిశుఘాతకి రఘునాథుడనే మహారాజుచేత మరణం పాలయింది  పౌర్ణమినాడే అని చెబుతారు. హిరణ్యకశిపుని సోదరి హేళిక, సోదరుని ఆదేశానుసారం మేనల్లుడితో సహా అగ్నిప్రవేశం చేసినా విష్ణుభ క్తి ప్రభావంతో తాను బలయ్యీ ప్రహ్లాదుని కాపాడింది. ఆ త్యాగమూర్తి స్మరణగా జరుపుకొనేదీ  ఈ హేళికా పర్వదినమని మరో  కథనం. ఆదిశంకరుడు మంచుకొండ పై  యోగముద్రలో ఉన్నవేళ పర్వత రాజపుత్రిక పరిచర్యలు ఆచరించేది. తారకాసుర వధ నిమిత్తం సంభవించే  కుమార జన్మ కై  వారిమధ్య అదను కొరకు  వేచి ఉన్న పూ విలుకాడి వాడి శరాఘాతానికి శివుడి  తపోభంగమైనది . ఉగ్ర రుద్రుడు ముక్కంటి మంటతో మరుడిని  బూడిద చేశాడు. స్త్రీ పురుష శక్తులను పరస్పరానుసంధానం చేసి సృష్టి చలనము కై   ప్రధాన  ప్రేరకుడిగా ఉండ వలసిన పుష్పశరుడు మాడి మసి అయితే జీవప్రవాహం ఘనీభవించిపోదా! రతీ విలాపంతో పతి ఆనతితో  పార్వతి మన్మథుడికి  పునర్జీవితం ప్రసాదించినదీ  ఈ ఫాల్గుణ పున్నమి  నాడేనని లింగపురాణ కథనం.  ఆ కామదేవుని పునర్జన్మ భూమి మీద పర్వదినమైంది. ఈ రంగుల పండుగ వసంతుని ఆగమనానికి  యువహృదయం పట్టే స్వాగత హారతి  అన్నాడో కవి. అర్థవంతమైన వ్యాఖ్యానం కదూ! 


వసంత రుతువేళ చెట్టు పుట్ట గుట్ట ఏ తరహా ప్రణయ భావనలకు దోహద కారకమవుతుందో వివరించని ప్రబంధకవులు లేరు. ప్రబంధాల ప్రధాన లక్షణాలలో  రుతువర్ణన ప్రముఖమైనదైతే. . అందులో వసంతకాలపు  వర్ణన మరింత ప్రధానమైనది. గోదాదేవి విరహతాపం  వర్ణితమయ్యే   సందర్భంలో రాయలవారి ఆముక్తమాల్యద ఐదుపదుల పద్యాలతో వసంత రుతువు  శోభను ఆవిష్క రించింది . మన్మథుడి ధనుస్సు పుష్పమయం. వింటినారి తుమ్మెదల బారు. అతగాడి సామంతుడైన వసంతుడికి మాధవుడని మరో పేరూ కద్దు. ఆ మిషతో మాధవుడు బలినణచిన వామనుడివలె త్రిలోకాలను ఎలా ఆక్రమించెనో  కవి ఆలంకారిక శైలిలో  చెప్పుకొచ్చాడు . పూవుల  మకరందం పాతాళాన్ని, పూవులు  పృధ్వినీ , పూ పరిమళం అంబరాన్ని  ఆక్రమించాయంటాడు  కవి. కవి ప్రజ్ఞకు వసంత రుతువర్ణన గీటురాయి. రాయలవారికి సమ ఉజ్జీ రామరాజ భూష ణుడు. మన్మథుడి చెలికాడైన మాధవుడి తపోఫలం మరుత్కుమా రుడు. ఆ పసివాడిని వసంతకాలంలో వృక్షాలు పెంపుడు తల్లులై ఊయలలేర్పాటు చేసి జోలలు  పాడేవట. ఆ వైనాన్ని వసుచరిత్ర కర్త అద్భుతమైన పద్యంలో హృద్యంగా వర్ణించాడు. అశోకపుష్పాల మక రందం తాగిన తుమ్మెదల ఝంకారాలకు కోకిలల పంచమరాగాలు తోడై బండి గురివెందల పుప్పొడులు  నిండిన ఆకాశం సందడి చేస్తుంటే 'లతికలు  హితకోటి ససినయపుడు , మదన  క్రీడోత్సవ నదిక సరుల దరుణులు విరులయోవరుల  సిరుల రాచజాతరల్సేయుట  అరుదా ' అని ఆ కవి  సందేహం వెలిబుచ్చాడు. సందేహం లేదు కనకనే, విశ్వసాహిత్యం మంతటా  వసంత విలాసాన్ని గురించి అంత రసస్మృష్టి సాగటం .


శిశిరంలో జీవకళ తగ్గి పేలవంగా ఉండే ప్రకృతి కన్నె వసంతుని చూడగానే పులకిస్తుంది. ఈ వసంతవేళా  సీతాన్వేషణలో ఉన్న రాముడు సోదర సమేతంగా పంపానదీ తీరప్రాంతంలో  చైత్రమాస వనశోభను పోలిన సతిసౌందర్యాన్ని స్మృతికి తెచ్చుకుని విల పిస్తాడు. సీతా వియోగ శోకంతో ఉన్న తనను  మన్మథుడు మరీ పీడిస్తున్నాడన్నది రాముని ఆరోపణ . మధుమాస వేళ తావలచిన గోవిందుడు సమీపాన లేని రాధ బాధా అదే . ముక్కు మూసుకుని తపమాచరించే ముముక్షువులకే వాసంతికాశోభ తాపాలు రేకెత్తించగా లేనిది యౌవనం లో గం  యువతీయువకుల తుళ్లింతలను ఆపడం దాని తరమా  ' అంటుంది  జయదేవుడి  గీతగోవిందమ్.  'రసమయమైన ప్రకృతి ఆరాధనే ముక్తికి ఒక మధుర సాధన' అని రసతత్వవేత్త సంజీవదేవ్ వాదన కూడా . జీవి జననం, జీవనం, మరణం ప్రకృతితోనే అనుసంధానిమితులు . ప్రకృతిని ప్రేమించడంవల్ల మనిషిలోని దైవత్వ భావనకు విస్తృతి ఏర్పడుతుంది' అన్న వర్డ్స్ వర్త్ మాటలు అక్షరసత్యాలు, కవులు, గాయకులు, చిత్రకారులు, తత్వవేత్తలు, ద్రష్టలు.. తమ ప్రతిభా వ్యుత్పత్తుల  ద్వారా ప్రకృతికి సౌందర్య రూపం సృజించడం ఈ దైవత్వ సాధనకోసమే కావచ్చు. రసికుల హృదయాలలో  రసతరంగాలు రేకెత్తించే రచనలు సృష్టించిన కవుల జాబితాకు కొదవ లేదు. కొడవటిగంటి చెప్పినట్లు అందరం కాళిదాసులం, రవివర్మలం, పురందరదాసులం కాలేకపోవచ్చు...! కంటిముందున్న ఈ రస జగత్తును అర్ధం  చేసుకుని ఆస్వాదించగలిగితే అంతకుమించిన జీవన శిల్పం మరొకటి లేదు. ' చలిత చలిత మచ్చరణ కటకమం/ జీరగళ స్రుత శంజితమ్ము/ పిలిచి పిలిచినా పలుకరించినా' చలించక పోవడానికి, దేవులపల్లివారు సందేహించినట్లు - మన ఎడద జడశిల కాదుగదా! అలా కాకూడదనే కాలపురుషుడు ఏడాదిలో మూడు నెలలపాటు మోడువారే బీడు బతుకు పత్రాల పై  వసంతమనే మధు సంతకాన్ని మనకోసం క్రమం తప్పకుండా అంత అందంగా చేసి అందించేది . అందిస్తూనే ఉండేది . ఆటవిడుపుగానైనా రసాస్వాదన చేయడం మనకే కాదు .. మన మనసులకీ హితకరం.  అదే, ఈ వసంతోత్సవం ఇచ్చే సందేశం.


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 20-03-2011 - ప్రచురితం ) 

Wednesday, December 8, 2021

ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం ఎపి ' రియల్ ' పూల్ - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 01 - 02 - 2003 )




ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం 

ఎపి ' రియల్ ' పూల్ 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 01 - 02 -  2003 ) 


ఎనిమిదో శతాబ్దంలో రోమ్ సామ్రాజ్యాన్ని కాన్స్టాంటైన్ అనే రాజు పరిపాలించే రోజుల్లో పౌరులకొక పెద్ద సమస్య వచ్చి  పడింది. ఆవుపాలు పొదుగుల్లో నుండి  ఎఱ్ఱబారివస్తున్నాయి. అరిష్టమని ఆందోళనపడటం ప్రారంభించారు జనం. మేధా వులు పరిష్కారం మాటలా ఉంచి కారణమే కనుక్కోలేక బుర్రలు గోక్కున్నారు . రాజుగారికేం చేయాలో పాలుపోలేదు. ఆయన కొలువులో 'క్లూగెల్' అనే విదూషకుడున్నాడు. విషమపరిస్థితుల్లో సమస్యల్ని పక్కదారి పట్టించేందుకు వినోదం కలిగించటమే అతని ప్రధానమయిన పని. ఎల్ బ్రెల్  అనే ప్రజాభిమానంగల నటికి నున్నంగా గుండు కొట్టించి ఊరేగించమని సలహా ఇచ్చాడు. ప్రజాగ్రహం పక్కదారి పట్టిందాకా నిదానించి ఆనక తీరిగ్గా ఆ నటి చేత 'చుండ్రు ఉండటంచేత నేనే ఈ గుండుకొట్టించుకున్నది ' అనే ప్రకటన ఇప్పించాడు. అప్పటికే వేలాదిమంది వీరాభిమానులు నిరసన తెలియ చేస్తూ స్వచ్ఛందంగా బోడిగుండ్ల బేచీలలో  చేరి ఉన్నారు. చాలాకాలం వారి గుండ్లు జనం వినోదానికి కారణమయ్యాయి. గాలిమారి పాలు మళ్ళీ తెల్లగా వచ్చిందాకా ఈ తంతును అత్యంత లాఘవంగా నడిపించి నందుకుగాను  రాజుగారు విదూషకుడికి పారితో షికంగా ఒక్కరోజు పట్టాభిషేకం చేశాడట. ఇది జరిగి ఈరోజుకి సరిగ్గా పన్నెండు వందల ఏళ్ళయింది. '


' నమ్మచ్చా ఇదీ ఏప్రియల్ పూల్లోని భాగమా?' 


'బోస్కిన్' యూనివర్సిటీ ప్రొఫెసర్ జోసెఫ్ గత శతాబ్దంలో పరిశోధనలు చేస్తూ ఈ విషయాలన్నీ బైట పెట్టాడు. అందుకే ఈ రోజు ప్రపంచంలోని విదూషక మేధావులందరూ కలిసి క్లూగెల్ స్మారకార్ధం  ఇందాకటిలాంటి స్టేట్ మెంట్లు కొన్ని ప్రచారం చేస్తున్నారు.' 


' నమ్మచ్చా ! నవ్వచ్చా ! నవ్వితే ఏప్రిల్ పూలంటారేమో! నమ్మకుంటే మెంటల్ అంటారేమో!' 


' పోనీ... బుష్ ఒక వంక ప్రజాస్వామ్య పరిరక్షణకోసం కొన్ని వందలకోట్ల డాలర్లు నీళ్లలా ఖర్చుపెట్టి ఇరాక్ ను  ధ్వంసం చేస్తున్నాడు - అంటే  నమ్ముతావా? !పునర్నిర్మాణం కోసం ఇంతకు రెట్టింపు ఖర్చు చేస్తానని హామీ ఇస్తే నవ్వుతావా?! 


సౌతాఫ్రికాలో క్రికెట్ ఫైనల్ చూడటానికి అంతెత్తున్న విమాన

మెక్కి పోవాలని ఉత్సాహపడ్డ మన ప్రధాని కాశ్మీర్ లో  పండిట్లు ఊచకోతకు గురైతే రాజధాని నుంచే  విచారం ప్రకటిం చేసి మోకాలు నెప్పని ఊరుకుంటే- నమ్ము తావా? ! నవ్వుతావా? ! 


ఆత్మహత్యకు పక్క రాష్ట్రం లక్ష ఇస్తుంటే... మేం హత్యకు రెండు మూడు లక్షలిస్తున్నామని పునరావాసశాఖ తరపున మన ముఖ్యమంత్రిగారు సగర్వంగా ప్రకటిం చుకుంటుంటే నమ్ముతావా?!... నవ్వుతావా?! 


సలక్షణంగా డిగ్రీలున్న డాక్టర్లు కు.ని. ఆపరేషన్లు చేయలేక ఆపసోపాలు పడుతుంటే ఏ పట్టాలేని నకిలీలు పట్టపగ్గాల్లే కుండా పొట్టలు పరఫరా కోసిపారేస్తున్నారంటీ  నమ్ముతావా?! నవ్వుతావా? !


జాతీయ జెండా పైనుండే రంగేదో కూడా తెలియని నాయకులు డెబ్బై ఏళ్లు ఇప్పటికే దేశాన్ని ఏలిపారేసి .. కనీసం ఇంకో డెబ్బై ఏళ్లయినా ఏలాలని 

ఉవ్విళూపోతున్నారంటే పూలయితే నమ్ముతాం. మెంటలయితే నవ్వుతాం. 


ఒక్క వీరప్పన్ను పట్టుకోటానికి రెండు రాష్ట్రాల పోలీసు బెటాలియన్లకు పన్నెండేళ్ళ న సమయం చాలటంలేదు. ప్రత్యూష మరణం మిస్టరీని మాత్రం పోస్టు మార్టం కన్నా ముందే తేల్చేసిన  పోలీసులు ప్రతిభను చూసి నమ్ముతావా? నవ్వు తావా?! .. చెప్పు'


ఆకాశంలో సగభాగు మాదని ఊదర గొట్టే ఆడవాళ్ళకు శాసనసభలో మూడోవంతైనా సీట్లివ్వటానికి పార్టీలు కొన్నేళ్లుగా చేసే ఆగం చూసి నమ్ముతావా?? నవ్వుతావా?! 


యాగాలు చేస్తే ఆటల్లో గెలుస్తారనీ. యోగాలు చేస్తే ఎమ్మెల్యేలు మారతారని, రొట్టెలు పట్టుకుంటే  కరపు మాయమవుతుందనీ... విగ్రహాలు పాలు తాగుతాయని, పసరు పిండితే పెట్రోలు కారుతుందనీ.. చెయ్యి ఊపితే విబూది  రాలుతుందనీ నమ్ముతున్నప్పుడు తప్పా?! చెప్పు ఇదిమాత్రం నమ్మితే తప్పా చెప్పు! 


కులాతీత మతాతీత సర్వసత్తాక ప్రభుత మనదని ఘనతరమైన పదాల గారడీతో నాయకులెంత ఊదరగొట్టినా కులం పేరుతోనో, మతంపేరుతోనో ధను అండచేరి మురాలు కట్టే వాళ్ళకి తప్ప ఓటేయలేని మన చేతగాని తనానికి నవ్వుదామా... ఏడుద్దామా!


ఏప్రిల్ ఫస్టని నేనిప్పుడొచ్చి కొత్తగా పూల్ చేసేందుకేంలేదు భాయీ! బడ్జెట్ మార్చిలోనే వచ్చి ఆ ముద్దులు  ఇచ్చేసింది . లేదంటే రేపొచ్చే ఉగాది ఆ ముచ్చటా తీర్చేస్తుంది


ఇడియట్ అని తిట్టినా అదేదో సినిమా బిరుదని పొంగిపోతాం మనం. ఇడియట్ బాక్సుని నట్టింట్లోనే పెట్టుకు మురిసిపో తుంటుందీ జనం!


పేలని బాంబుల్ని చూసి భయపడి పేలే బాంబులసలు పట్టించుకోం.. వేరే ఎవరో వచ్చి ఏప్రిల్ ఫస్టుకే పనిగట్టుకొని మనల్ని ఫూల్ చెయ్యటమెం దుకు... ఫస్టు మనకి మనమే ఆపని చేసు కుంటాం కాదా! 


పిలిచి నెత్తిమీద చేతులేయించుకొనే దేవుడిని కొలిచే బోళాభక్తులం మరి మనం. 

అందుకే గిరీశం మనవాళ్ళొట్టి వెధవాయలోయ్' అంది. రామాయణంలో పట్టాభిషేకమప్పుడు లక్ష్మన్న ఫెళ్లున నవ్విందీ అందుకే. ' అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయిష '  కొండుభట్లు  ఊరికే అన్నాడా? 


'మూర్ఖస్యనాన్యౌషధమ్' అన్నాడు భర్తృహరి.  ప్రేమికులకి వేలెంటైన్స్ డే,  శ్రామికులకు వర్కర్స్ డే... ఇలా. అందరికీ విడివిడిగా ఎన్ని డే లున్నా  అందరూ కలిసి సందడిగా ఉండేదుకు మాత్రం వీలైంది మాత్రం ఒక్క మన 'ఆల్' ఫూల్స్ డేనే- అంటే నమ్ముతావా ? నవ్వేసి వెళ్లిపోతావాతా ?' 


' పూలు ' కు  భాషా భేదం  లేదు. ఇంగ్లీషు ఫూలుకు  హిందీ ' ఫూల్' సింబాలిక్  అయితే  తెలుగువాళ్ళం ఆ పూలని చెవుల్లో దోపుకుని  మరీ 'చవటాయను నేనూ... నీకన్నా పెద్ద చవటాయను నేనూ'  అని పాట కూడా అందుకుంహాం ! 


మనం ఏపి రియల్ పూల్సుం! అందుకే ఏడాది పొడుగూతా టోపీల పండుగ జరుపుకొంటూనే ఉంటాం.



- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 01 - 02 -  2003 ) 

 

ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం భద్రం నాయనా! - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు ప్రచురితం 05 - 09- 2016 ప్రచురితం )


 


ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం 

భద్రం నాయనా! 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు ప్రచురితం 05 - 09- 2016 ప్రచురితం ) 


'వినాయకా! చవితి శుభాకాంక్షలు నాయనా!'


మరి నేనో తొమ్మిది రోజుల పాటు భూలోకంలో పర్యటించి రానా? భక్తబ్బం దాలన్నీ ఎదురు చూస్తున్నాయంటూ పొద్దుట్నుంచీ ఒహటే సందేశాలు చరవాణిలో!' 


'భద్రం లంబోదరా! వెళ్ళేది జంబూ ద్వీపం. జెంబో జెట్టులెన్నున్నా పట్టనన్ని భక్త బృందాలు ఉన్నాయి నీకు! ఈ పాటికే భారీగా విరాళాలు పోగయి ఉంటాయ్! నూలుపోగైనా నోచుకోని బీదా బిక్కీ బోలెడంతమంది  నా బాబూ నీ భక్త బృందాలలో ! వారిని ఇబ్బంది పెట్టే విధంగా ధరాతలం మీద ధరలెలా మండిపడుతున్నాయో తెలుసా? నీకేమో ఇరవయ్యొక్క పత్రుల్లో ఏ ఒక్కటీ తగ్గ

కూడదాయె పూజా పునస్కారాలకి! '


' చిట్టి చట్టి మూసలో ఇంత మట్టి వేసి  తీసినా నీ ఆకారం మహా బాగా తయారవుతుందే! ఆ అంతులేని అడుగుల ఎత్తు విగ్రహాలతో అంత హడావుడి అవసరమా? అందునా కృత్రిమ రంగులు! వాటి పులుముళ్లతో నీ దేహం ఏమవుతుందో ఏమో! పర్యావరణం గురించి పట్టని నీ భక్తుల్లో కొందరివల్ల నీ ఒంటికే మవుతుందోనని బెంగగా ఉంది గణపతీ! జరంత భద్రంగా ఉండాలి నాయనా!'


' ఉండ్రాళ్లు... వడపప్పు... పానకాలు కనిపిస్తే చాలు నీకు ఒళ్లు తెలీని పూనకాలు ! కళ్ళు మూతలు పడేవరకు ఆరగించి ఆనక నడుం గుండ్రంగా తయారైందని దిగులుపడతావు! 'జీరో సైజు' నీ వల్ల అయ్యే పని కాదు గాని... ఏ ఫిజియోథెరపీ కంపెనీనో నాలుగు ఉండ్రాళ్లు ఆశచూపించి, తమ తరుపున ప్రచారం చేయ మంటే... 'నో' చెప్పేసెయ్ ! పుసుక్కుమని ఒప్పేసుకొని రాకు సుమా! తప్పుడు ప్రకటనలలో  పాల్గొంటే తంటాలు తప్పవంట ఇప్పుడా దేశంలో . కాస్తంత కింద చూసుకొని నడుస్తుండీ తొమ్మిది రోజులు!'


'బాలాపూర్ లడ్డుండల సైజు చూసి భక్తులంతా కుబే రుడి పుత్రులు అనుకోకు ! నిరుపేదలే ఎక్కువ నీ భక్త సమూహాలలో ! నువ్వేదో వచ్చి వరాల వర్షాలు కురిపించేస్తావని మోరలె త్తుకొని మరీ ఆశగా ఎదురుచూస్తున్నారు జనం . అరచేతిలో కైలాసం చూపించి రావడం పచ్చి మోసం. గుర్తుంచుకో! పోయినసారి  చవితికి ఇచ్చొచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయో ఓసారి పరిశీలించుకో!' 


'రియో ఒలింపిక్సులో ఓడొచ్చిన కచ్చలో ఉందిప్పుడు ఆసేతు హిమాచలమంతా! వచ్చే ఒలింపిక్సన్నింటిలోనూ వరస బెట్టి స్వర్ణాలు తెచ్చే ఛాంపియన్ల వేటలో ప్రస్తుతముంది. కొత్తగా ఏర్పాటయిన వెతుకులాట సంఘం.. నిన్నూ ఉబ్బేసి చేతికో 'పోల్ జంప్' గడకర్ర ఇస్తే పొంగిపోయి ఒప్పంద పత్రంమీద సంతకం గిలికి రాకు! ఆనక మీ చందమామయ్య ఎగతాళ్లకు దిగాడని అనమాకు..  గణపతీ! జర భద్రం!' 


'అవునూ!నీ ఒంటికింత సింగారం అవసరమా బంగారూ! భద్రాద్రి సీతమ్మవారి నగానట్రకే భద్రత లేకుండా పోయిందిట కింద. జాగ్రత్త వినాయకా! 


'చవితి వచ్చీ రాగానే చెంగు చెంగున కిందకు పరుగులెత్తుతావు ! పోతే పో ! కానీ.. నీ మూషికం గుంటూరు ధర్మాసుపత్రిలో చేసిన నిర్వాకం ఇంకా పోలీసు ఠాణా విచారణ దశలోనే  ఉంది! కందిపప్పుకు బదులు పసికందుల్ని మెక్కుతార్రా ఎంత తిండిగింజలకి నకనకలాడుతున్నా! పోలీసులు కేసు నీ మీదకు  మళ్ళించవచ్చు ... ఆచితూచి అడుగెయ్యి.. నువ్విప్పుడు  చిన్న కూచివి   కాదు నాయనా!'


వెళ్లేది ఖైరతాబాదు! ఆ ట్రాఫిక్కు ఎలా తట్టుకుంటావో ?  హెల్మెట్ లేదంటూ   వ్యాను డ్రైవరు. పైనా కేసులు రాసేస్తున్నారట ! ఎలుకా వాహనమే.. డ్రైవింగు లైసెన్సు తప్పనిసరిగా  తీసుకో!.. ఎక్స్ పైరవీ అవీ కుండా సావధానం సుమా! ఆదిదేవుడి ప్రథమ సంతానం అంటే  అర్ధమవుతుందో లేదో... గుర్తింపు కార్డొకటి  సంపాదించుకుని  పో... ! బ్యాంకు ఖాతాలో సున్నా బ్యాలె న్సున్నాసరే.. ఆదాయపన్ను వాళ్ల పాన్ కార్డు తప్పని సరి నాయనా! పన్ను  పీకే శాఖ పట్ల జర భద్రం బిడ్డా! ఉన్నదే ఒక్క పన్ను ముందు నుంచీ నీకు!  


' నీ పండగంటే తెలుగు హాస్యగాళ్లకందరికీ . . రేఖాచిత్ర కామలకీ  నిజంగా పండుగే ! ఫేసుబుక్కుల్లో.. వాట్సప్పుల్లో వాళ్ల రాతలు చూసి ఉడుక్కోకేం . అచ్చు పత్రికల్లో వాళ్ల గీతలు చూసి ఉలిక్కిపడొద్దులే!  ఏడాది పొడుగూతా ఏవేవో  ఏడుపులు.. పెడబొబ్బల జీవితాలే  కదా.. పాపం.. బీదా బిక్కీ  జీవులవి! నీ చలవవల్ల అయినా ఈ తొమ్మిది రోజులు చల్లంగా.. నవ్వుకోనివ్వు బొజ్జ వినాయకా!'


' అన్నట్లు ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం కూడా! ఆది గురువువి. అందుకూ  నీకు మరోసారి శుభాకాంక్షలు గణపతీ! మానవత్వానికి కులం.. మతం.. ప్రాంతం.. అనే తేడా లేవీ లేవని.. మా ఆదిదంపతుల మాటగా కూడా మన భక్తులందరికీ నచ్చ చెప్పి రా! లాభంగా కాకపోయినా.. క్షేమంగా తిరిగి వస్తే మళ్ళీ చవితివరకూ నాకూ.. మీ నాయనకు మనసు నిండా శాంతి. 


- కర్లపాలెం హనుమంతరావు

(  05 - 09- 2016 ప్రచురితం) 

 




హాస్య కథ: 

కప్పగంతులు


 - కర్లపాలెం హనుమంతరావు 

( కౌముది అంతర్జాల పత్రిక కథల పోటీలో బహుమతి గెల్చకున్న కథ )  


పదవులు చాలామంది పెద్దమనుషులకు  తృణప్రాయం.  కొద్దిమంది బుద్ధిజీవులకు ఆ తృణమే ప్రాణం కన్నా ప్రియం.  


అధికారం మూజూసి  కె.డి.వి. కప్ప(కప్ప దాటు వెంకప్ప)గారికి ఈ దఫా మూణ్ణెల్లు దాటిపాయ! మూడు తరాల కోసరంగా కూడేసిన సంపత్తుకు విపత్తాయ! మనీ పరుసుకేనా? పెద్దమనిషి  పరువుకూ ఆపత్తు! ‘ఇంకా బిడియమా! అయితే ఏ కోర్టు బోనులోనో తలొంచుకు నిలబడ్డం ఖాయం!’అంటూ అంతరాత్మ పోరూ అంతకంతకూ ఎక్కువయిపోయిందీ మధ్యన.     అందుకే పాపం.. వెంకప్పగారు మనసొప్పక పోయినా పనికి మాలిన సిగ్గూశరాలనో చెత్త కుప్పన  పారబోసి సత్ ‘గతి’ ప్రాప్తికై ఆపద్ధర్మంగా సర్కారీ పార్టీలోకి  దూరిపోయే  ప్రయాసలు ముమ్మరం చేసేసారు! 


లోపాయికారీ మంత్రాంగంలో లోపమేం లేదు.  కానీ  పదవీ ప్రాప్తికి  అడ్డొచ్చేది ఒకే ఒక మెలిక.    గెలిపించిన ఓటర్లంతా ఓ.కే చేసిన ఓ తీర్మానం కొత్తపార్టీ అప్లికేషనుకు తప్పనిసరిగా జతచేయాలని షరతు. 


కార్యకర్తల చేతనయితే చేతులెత్తించడమేం ఖర్మ.. ఏకంగా కాళ్లే ఈజీగా మొక్కించేయచ్చు! కానీ  ఆ స్వామిభక్తి పరాయణత్వం చచ్చు నియోజకవర్గం ప్రజానీకానికి ఉండి చావద్దూ! ‘నమ్మి అసెంబ్లీకి పమ్మిస్తే ‘ఇదేం వెన్నుపోట’ని నడిబజార్న పెట్టి  నిలదీస్తేనో! 


వెంకప్పగారీ సంకటంలో ఉండగానే  గది తలుపులు ధడాల్మని ఊడిపడ్డయ్! 

 

ఈ.డీ గాడా? సి.బి.ఐ  వాడా? ఉలిక్కిపడి చూస్తే ఈ రెండూ కాడు. కూతురు మొగుడు! తన  పాలిట యముడు. ఆ యములోడి పక్కనే మెడ లోడ్ గార్లండ్సుతో  మెలికలు తిరుగుతో  అతగాడి డార్లింగు!  


' అరేఁ! అల్లుడుగారూ! ఆ మెడ నిండా పూల దండలెందుకమ్మా బంగారూ! ఆషాఢ పట్టీ  మాసం  వచ్చేసిందనేనా ఈ కంగారూ ?’ వెంకప్పగారి శంక.


' సారీ మాంగారూ! నో.. నో.. మాజీ మాంగారూ! మీ బేటీ కాదీ బంగారు. ఆ కాకి బంగారా న్నెప్పుడో వదిలిబెట్టేసాంగా! కారణం  ఆషాఢం పట్టీ.. ఆకాశం ముసురు పట్టీ  కాదు మాజీ మామాజీ! ఈ పూల దండల  వెనకున్న చంద్రబింబం పైన  పిచ్చగా మనం మోజు పడ్డం! ఈ సింగారి చెయ్యి పట్టుకోవాలంటే  మీ బంగారి మోకాలు అడ్డం!’ 


పిచ్చి కోపంతో  రెచ్చి పోయారు వెంకప్పగారు. 


' నాతి చరామి' అంటూ పెళ్ళినాడు మరి మా పిల్లకు  తమరిచ్చిన మాటో?’ 

 

' ధర్మపన్నాలా! మరి దిబ్బలగూడెం జనాలకు ఎన్నికలప్పుడు తమరిచ్చిన హామీ? పవరున్న పార్టీలోకి తమరిప్పుడు వేసే గంతు .. ఏ ప్రజా సేవకో సెలవిస్తారా  వెం.. కప్ప స్వామీ?’ 


వెంకప్పగారు నోరు కప్పలా తెరుచుకుంది.

***


' కెవ్వు..కెవ్వు!’  కేకలు. ఆ వెనకనే ఏడుపులు.. పెడబొబ్బలు! 


ఏడుపులు కింద పడ్డ బిడ్డవి. పెడబొబ్బలు కంగారు పడ్డ బిడ్డ తల్లివి. అయిదో నిమిషంలో అంబులెన్స్ ప్రత్యక్షం! క్షణాల్లో సీన్ ఛేంజ్. 

***

‘ఒన్ నాట్ యైట్ ‘లో వెంకప్పగారి బంగారి పాప.. యములాడితో మెగా ఫైటు చేసేస్తోంది. 


‘డైవర్!..డ్రైవర్! అర్జెంట్.. అర్జెంట్! అపోలో.. అపోలో!' వెంకప్పగారి అరుపులు. 


ఆ అరుపుల్లో ‘అలోపతి.. అప్పలాచారి..’ అన్న రెండు ముక్కలు తప్పించి డ్రైవర్ గారు స్పష్టంగా ముక్కిందేమీ వినిపించింది కాదు. 

ఐనా వెంకప్పగారు అలా ఇలా తాలాడించేసారు!

 

అరగంట తరువాత .. అంకం.. అప్పలాచారి డిస్పెన్సరీ.


మూలికలు, మండలు, కషాయాలు, నూనెలు,   కల్వాల్లో చూర్ణాలు నూరే చప్పుళ్ళు తప్ప మరేవీ వినిపించడంలేదు ఆపరేషన్ థియేటర్ నుంచి! 


మరో మూడు గంటల నిలువుకాళ్ల జపం తరువాతే.. వైద్యనారాయణుడి  దర్శనభాగ్యం. 


' మనం చేసే మానవ ప్రయత్నాలన్నీ ఫినిషైపోయాయండీ పూర్తిగా! తులసి తీర్థం తెచ్చుకోండి … రోగి గొంతులో పోసుకుందురు  తృప్తిగా!’


' చోద్యం. తులసి తీర్థమా? ఇదేం మాయదారి అలోపతి వైద్యం?’ గంపెడంత దుఃఖంలోనూ గయ్యిమంటం మర్చిపోలే వెంకప్పగారు.


' అలోపతా!? హలో! ఇక్కడ .. అద్భుతాలు సృష్టించే  నెంబర్ వన్ ఆయుర్వేద జాతి!’  డాక్టర్ అప్పలాచారి  సమాధానం.


' మోసం.. దగా! ఏడ్రా ఆ అంబులెన్స్ గాడిద? వాడా కూత  ముందే కూసుండాలి గదా!’ 


' ముందే  కూతలెయ్యడం.. ఆనక అంతా అపోలోలకి  పరుగులెయ్యడం! అబ్బో! ఎన్ని చూసామండీ బాబూ మీ లాంటి తొండి కేసులు! కోట్లు తగలేసామండీ  ఎం.డీ చదువులకీ, ఈ మందుల కొట్టు కట్టడానికి! ఆ లాసులేవీ పూడ్చుకోవద్దని ఏ బైలాసులో    రాసుందో.. ముందు చెప్పండి! అబ్బో! ‘మోసం.. మోసం’ అంటూ అంతలా ఆయాసం వద్దబ్బా! దిబ్బలగూడెం జనాలకంత సునాయాసంగా సున్నం పెడుతుందెవరో చెప్పు ముందు  వెం.. కప్పా! మహా గొప్పగా  పొడిచేస్తారని కదా  ప్రజానీకం తమర్ని ఎన్నుకున్నది! ఆ అమాయకులకి  ఎందుకయ్యా మరి వెన్నుపోటు పొడిచేస్తున్నది? హ్హి..హ్హి..హ్హీ! తమరే స్వామీ స్వచ్చమైన  నమ్మక ద్రోహికి అచ్చమైన హాల్ మార్క్!’

 

కె.డి.వి.కప్పగారు షాక్!


ఒన్స్ మోర్ సన్నివేశం ఛేంజ్!

***


పంజగుట్ట  పోలీస్టేషన్  ఫోన్. 


' సార్! ఈ గాడిద కొడుకు మీ కొడుకేనా? మొక్కట్లు చూస్తే ముమ్మూర్తులా మీవే!  గోడ దూకుతుంటే.. అదే సార్.. పేకాట క్లబ్ గోడ.. దూకుతుంటే పట్టేసుకున్నాం! అహఁ! గోడలు దూకే రకం కదా.. అందుకనే అడుగుతున్నాం’ 


పోలీసు బలగం రాబట్టిన వివరాలను  బట్టి మాజీ వి.ఐ.పి - కె.డి.వి.కప్పగారు  తాజాగా  గజం జాగా అయినా తల దాచుకునేందుకు లేనంతగా దివాలా తీసిన  వి.పి! 


అబ్బ  అడ్డదిడ్డంగా మేసి కూడబెట్టిందంతా  బిడ్డ బెట్టింగుల్లో పెట్టి తగలేసినట్టు రెండు తగలంగానే బైటపడ్డది గుట్టు.   నెత్తి మీద సత్తు కాణీ పెట్టినా అర్థ కాణీ చెయ్యని అర్భక సన్నాసి..  సన్ ఆఫ్ కె.డి.వి.కప్ప హోదాలో  అదనంగా కొన్ని లక్షలు చేసే అప్పుపత్రాల పైన అప్పనంగా సంతకాలు కూడా దర్జాగా గిలికేసాడు! 



' అంత లేసి హక్కులు నీ కెక్కడివిరా అబ్బీ?’ అని దబాయిస్తే ‘దాన వినిమయ విక్రయాదులతో సహా  సంపూర్ణ హక్కు భుక్తాలన్నీ నీ యావదాస్తుల పైన  నువ్వే  నాకు ఇచ్ఛాపూర్వకంగా పూర్తి స్పృహలో ఉండి మరీ ధారాదత్తం చేస్తివిగా తండ్రీ!  నా కాలేజీ దరఖాస్తులని సంబరాలు పడుతూ  తమరు బరబరా గిలికేసిన సంతకాలన్నీ లాయర్లు పక్కాగా తయారు చేసిన అస్తిపాస్తుల  దస్తావేజులే పిచ్చి డాడీ!’ అంటూ కూసాడా ‘గాడిద’ కొడుకు. 


' కన్న తండ్రిని! నా మీదట్రా.. నమ్మించి ఇంత  కుట్ర! ఛీఁ.. ఛీఁ! సిగ్గనిపించలేదుట్రా.. త్రాష్టా!’


' దిబ్బలగూడెం జనాలూ   నిన్నిప్పుడిట్లాగే తిట్టుకుంటున్నారు  అబ్బా! నిజం చెప్పనా!  నీ బిడ్డగా పుట్టినందుకే నాకిప్పుడు ఎక్కువ సిగ్గేస్తోంది నాయనా!" 


' నిజంగా వీడు నా కడుపున పుట్టిన బిడ్డేనా.. సతీ సావిత్రీ?


కుప్పకూలిపోయారు శ్రీమాన్ కె.డి.వి. కప్పగారీ సారి. సీను మారిందింకో సారి.

***


' సారీ స్వామీ! ఇప్పటికైనా నిజం కక్కకపోతే నా బతుక్కిక నిష్కృతి లేదు నాథా!’ 


వెక్కి వెక్కి ఏడుస్తోంది పక్కనే పక్కలో పడుకునున్న సతీ సావిత్రీదేవి.


' ఏవిటే సావిత్రీ..  నీ బతుక్కంత నిష్కృతి లేని ఆ నిజం?' బితుకు బితుకు మంటూ చూసారు వెంకప్పగారు వైఫు వైపు!  


' నా కడుపున కాసిన కాయల్లో  ఒకటి.. ఒకే ఒకటి.. మీ రక్తం పంచుకు పుట్టలేదేమోనని..  అనుమానంగా ఉందండీ!’  


' ఒకరు నా రక్తం పంచుకుని పుట్టలేదా?!   ఈ దౌర్భాగ్యంలో కూడా  మళ్లీ సస్పెన్సా? ఎవరే సావిత్రీదేవీ ఆ ఒహ్.. ఖరూ?’ విలవిలలాడిపోతున్నారు వెంకప్పగారు.


' ఏమోనండీ.. ఎంత గింజుకున్నా సమయానికి  గుర్తుకొచ్చి చావడం లా! రెండు పుష్కారాల కిందటి మూడ్సూ.. ముచ్చట్లాయ! ఏ పుణ్య పురుషోత్తముడి ప్రేమ ఫలమో! గుర్తొస్తే కనీసం పేరైనా చెప్పిచావనా! నన్ను నమ్మండీ!’


' నిన్నా? నమ్మటమా?’ 


' భగవంతుడా! ఏ ఆడదానికీ రాకూడదయ్యా ఇంతటి కష్టం’ 

కుళ్లి కుళ్లి ఏడిచే అర్థాంగిని చూసి నవ్వాలో.. ఏడ్వాలో.. అర్థం కాని పరిస్థితి గౌరవనీయులు వెంకప్పగారిది. 


' ఇప్పటి దాకా దాపెట్టిన ఆ గుట్టు  ఈ వయసులోనుటే నా గుప్పెట్లో పెట్టేదీ.. తప్పుడుదానా!’  


అగ్గి బరాటా అయిపోయింది  సతీ సావిత్రి ‘ఐనా తప్పంతా నా ఒక్క దానిదేనా హనీ!  పెళ్లిచూప్పులకని వచ్చి మిర్చి బజ్జి నచ్చిందని కదా నన్ను చేసుకుంటిరి తమరు? ఛీ! ఎంత సేపూ సొంత కడుపు కక్కుర్తే! ఎత్తు కడుపు వైఫు ఎంత సేఫో ఆలోచించంది ఎవరూ?’ 


'తాళి కట్టిన వాడికి ఇలా ద్రోహం చేసింది చాలక..' 


' ఆగండక్కడ! తమరు చేసే ద్రోహాల ముందు నా దోషం చీమ తలంత. ‘నరకాలు నాశనం చేస్తా.. స్వర్గాలు సృష్టించిపారేస్తా!’ అంటూ తుపాకీ రాముళ్లా మాటలు  గుప్పిస్తేనే గదా  దిబ్బలగూడెం నియోజకవర్గమంతా మిమ్మల్నంతలా ఆదరించింది! తమ పక్షమే అని జనం నమ్మబట్టే తమరు గెలిచి ఎమ్మెల్యే అయింది . జనం ప్రయోజనాలు తమరన్నీ  పూర్తిగా మరచిపోయారు. సొంత లాభాల కోసం ఇప్పుడు  కప్పల్లా సర్కారు తక్కెట్లో తూగేందుకు తయారయ్యారు !  తమరు మాట జారడమేమో    మహా పుణ్య కార్యం! నేను  కాలు కొద్దిగా జారడం మాత్రం  కిరాతకమూనా!’ అమ్మోరిలా విరుచుకుపడింది సతీ సావిత్రి.   


ఉలిక్కిపడి గభిక్కున లేచి కూర్చున్నారు వెంకప్పగారు. నిద్ర మొత్తం తేలిపోయింది.  ఇప్పటి దాకా తాను కన్నవన్నీ వట్టి పీడకలలేనని తేలిపోయింది.  వెంకప్పగారి మనసు తేలికయింది.

***


' తేలికవడానికి కారణం పీడకలల నుంచి బైటపడ్డం కాదప్పా!  పీడాకారపు  శరీరాన్నుంచి  బైట పడ్డం! చచ్చినా భలే  గుర్రు కొడ్తున్నావే! ఇదేవఁన్నా తమరి అసెంబ్లీనా సామీ! లే! నరకం కావాలా? స్వర్గం కావాల్నా? తొందరగా తెముల్చు’ గంభీరమైన ఆ గొంతు   విని తానిప్పుడున్నది వేరే లోకాల కెళ్లే దారులు చీలిక  దగ్గరని బుర్రకెక్కింది వెంకప్పగారికి. 

 

ఎదురుగా యమ భటులు.. దేవ దూతలు!


' ఎవడ్రా నన్నిట్లా చంపుకొచ్చింది అన్యాయగా! చంపవతల పారేస్తా! కంటి ముందుకు రండొరే ముందు.. గుండెల్లో దమ్ముంటే!’ వెంకప్పగారి వీరావేశం.


' ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టిన మొదట్రోజునే  తప్పు చేసావు వెంకప్పా!  అందుకే నీకీ దిక్కుమాలిన చావు. సభాపతి సమక్షంలో చేసిన   ప్రమాణ  ప్రమాణ స్వీకార పాఠం గుర్తుంటే చెప్పు?’  


' కప్పదాటు  వెంకప్ప అను నేను దిబ్బలగూడెం నియోజక వర్గ ప్రజల ఆంకాక్షల మేరకు నిస్వార్థంగా కర్తవ్యం  నిర్వహిస్తానని, నా ప్రజల యొక్క  హక్కులకు భంగం కలగనీయనని,  భయ రాగ ద్వేషాలకు అతీతంగా భారత రాజ్యాంగానికి లోబడి   పని చేస్తానని దైవం సాక్షిగా  ప్రమాణం చేస్తున్నాను'


' దేవుడి సాక్షిగా చేసిన ప్రమాణం. ఆ బెదురైనా లేదేమప్పా మీ ప్రజాప్రతినిధులకు.. విడ్డూరం ! నిధులు, నీళ్లు, నియామకాలనేవి ప్రజాస్వామ్యంలో నిజానికి  జనాలకు మాత్రమే చెందిన వనరులు. అధికారం దక్కితే వాటాలప్పుడు తమకన్యాయం జరగకుండా కాపాడతారని, ప్రతిపక్షంలో కూర్చున్నా తమ పక్షానే పోరాడతారని పౌరుల  ఆరాటం. ఆ ఆశతోనే కదా ఓటర్లంతా పొలోమని పోలింగ్ బూతులకట్లా పరుగెత్తేది!  అర్థరాత్రి, అపరాత్రన కూడా సరకు చేయరే ముసలీ ముతకా ఓటేసే వరకు! ఇంత నమ్మి మిమ్ముల్ని చట్టసభలకు పమ్మిస్తే.. సొంత లాభం తప్ప మరేమీ పట్టదా వెంకప్పా మీ కప్పగంతుల నేతలకు? గోడ దూకుడు మీదనేనా ఎప్పుడూ  ధ్యాసంతా? జనం గోడు పట్టని పాడు పాలిటిక్సులోకి పనిమాలా దేవుణ్ని కూడా ఈడ్చుకొస్తున్నారు చూడు.. ఇట్లా ప్రమాణ స్వీకారాల వంకతో! ఆ దైవ ద్రోహానికే నీకీ అర్థాంతరం చావు. అర్థమయిందా?  మళ్లా ఎన్నికల దాకా ఓడ మల్లయ్యల్ని నువ్వు  బోడి మల్లయ్యలను చేయచ్చేమో కానీ.. తన పేరు  మీద నమ్మక ద్రోహం చేసిన నేరానికి  దేవుడైతే  అస్సలూరుకోడు! ఏ ఎన్నికల కోడుతో శిక్షలు తప్పించుకొనే వెసులుబాటు ఈ పైన బొత్తిగా లేదు.. 


తలొంచుకున్నారు కప్పదాటు వెంకప్పగారు.


' ప్రాయశ్చిత్తం చేసుకునే ఉద్దేశముంటే చెప్పు. మరో ఛాన్స్ ఇచ్చేందుకు  నేను సిద్ద్జం. మీ లోకానికి తిరిగి పో! గెలిపించిన పార్టీకే తిరిగి మళ్లిపో! సొంత లాభం కోసం కాదు ప్రజాప్రాతినిధ్యం.  అధికారంలో ఉన్నా ప్రజలందరి సంక్షేమం నీకు సమానంగా ప్రధానం . అధికారం లేకున్నా   ఆ సమసంక్షేమం కోసం పోరాడడం ప్రతిపక్షంగా నీ ధర్మం. ప్రజాస్వామ్యం అంటే కప్పల తక్కెడ కాదు. ముందది మనసుకు ఎక్కించుకోడం ముఖ్యం!’    


రెండు చేతులు జోడించి తలాడించేసారు కప్పదాట్ల వెంకప్పగారు.


గభాలున మెలుకవ వచ్చింది వెంకప్పగారికి. సీను మారింది మళ్లీ! 


గిచ్చుకుని చూసుకుంటే తెలిసొచ్చింది ఇదే అసలైన వాస్తవ జీవితమని. 


పక్కనున్న సెల్ ఫోన్ పదే పదే  మోగుతున్నది. నెంబరు చూస్తే అధికార పార్టీ మధ్యవర్తిది. అప్పటి దాకా తను తహ తహ పడ్డది. 


క్లైమాక్సు సీనులో భగవంతుడొచ్చి చేసిన బోధనంతా మళ్లీ గుర్తుకొచ్చింది! 


సెల్ ఫోన్ అందుకున్నారు కె.డి.వి.కప్పగారు. 'గోవిందా.. గోవిందా అందామయా.. రావయ్యా.. రావయ్యా.. రావయ్యా.. రావయ్యా !' అంటూ అదే పనిగా గీ పెట్టే సెల్ ఫోన్ పీక నొక్కి ఓ పక్కకు  గిరాటేశారు  కప్పదాటు  వెంకప్ప గారు!


ఆయన మనసంతా  ప్రశాంతంగా ఉందిప్పుడు*

 

- కర్లపాలెం హనుమంతరావు 

( కౌముది అంతర్జాల పత్రిక కథల పోటీలో బహుమతి గెల్చకున్న కథ )  

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...