కోస్తే కన్నీళ్ళు తెప్పిస్తుంది. సరే కొయ్యక ముందే కన్నీళ్ళు తెప్పించే గడుసుదనం కూడా బహుశా కూటి కూరగాయలన్నింటిలోనో ఒక్క ఉల్లిపాయకే ఉంది. ఏడిపించినా ఇష్టపడే ప్రముఖులు ఎప్పుడూ కొందరు ఉంటారు. హిందీ చిత్రాల మీనాకుమారి, మన తెలుగు సినిమాల సావిత్రిల తరహాలో! ఈ కన్నీళ్ల కోవలోకి వచ్చిచేరే ఉల్లిపాయే ఎంత కన్నీళ్ళు తెప్పించినా ప్రియమే కదా! ఆ ప్రియమైన ఉల్లి ఇప్పుడు మండీలలో ప్రియమైనందుకే ఇంత లొల్లి. మన ఉప్పు మీద పన్ను వసూలు చేసి సంపన్నులవుతున్నారని కదా స్వాతంత్ర్యం రాక మునుపు తెల్లవారికి ఎదురు తిరిగి స్వదేశీ ఉప్పు ఉద్యమంతో బాపూజీ దండియాత్ర చేసింది! స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిపోయింది. ఇప్పుడు ఉల్లిగడ్డను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటే తప్ప వంటింటి పొయ్యిలో పిల్లి లేవనని మొండికేస్తోంది. ఉల్లికే కన్నీళ్ళు తెప్పించే లొల్లి ఇంకెన్ని నాళ్లీ తల్లీ!
ఉప్పు లేని కూర చప్పగా ఉన్నా అదో పెట్టు. బి.పి రోగం దాపురించిందనో.. దాపురించనుందనో సర్దుకుపోడం కద్దు! ఈ ఉల్లి సిగ దరిగిరి, ఒక్కసారి గాని రుచి మరిగితిమా.. ఎన్ని రోగాలు రొప్పులు వచ్చినా రానున్నా .. కోసే వేళ కన్నీళ్లు.. కోసుకొనే అవకాశం లేని వేళా కన్నీళ్లే! ఉల్లి కన్నీళ్ల కహానీ ఉల్లికే కన్నీళ్లు తెప్పించడానికి కారణం ఏ పాలకుల ఉద్ధరణో?
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదంటారు. ఆ నానుడి మన తెలుగువాడి నాలుక నాలుగు యుగాల బట్టి వాడేస్తోనే ఉంది. జిహ్వ చేత 'వాహ్వా.. ఎంత రుచి!' అంటూ సన్నాసుల నోట కూడా చాటుగా పాడించేస్తున్నది. అహారానికే కాదు.. అల్పాహారానికీ ఉల్లిని కోరుకోడమే ఎన్ని గోదాములు నిండుగా పండినా కరువు కోరల పాలిట పడటానికి ప్రధాన కారణంట! ఎన్నుకున్న పాలకుల ఈ పరిహాసాలకి.. ప్రజల సంగతి సరే ఉల్లికే కన్నీళ్లు తెప్పించే సరసమయిపోయింది!
ఉల్లి వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఎప్పుడూ ఏకరువు పెట్టే సోది జాబితాలోవే! మందుకైనా దొరకని ఈ కరువు రోజుల్లో అ ఉల్లి మహాతల్లి మేళ్లను ఎంతని హనుమాన్ చాలీసాల మాదిరి వల్లెవేస్తూ కూర్చోడం? తలుచుకుంటేనే చాలు కన్నీళ్ళు పెట్టించే ఉల్లి మీద కొత్త కబుర్లేమైనా చెప్పుకోవచ్చేమో.. చూద్దామా!
క్రీస్తు పుట్టడానికి ఐదు వేల ఏళ్ల ముందే ఉల్లిపాయ పుట్టిందని వినికిడి. రాతి యుగం నాటి మనిషికి రోటీలో ఉల్లిపాయ రోటిపచ్చడి కలిపి తినే యోగం లేకపాయ! రాగియుగం నాటి శాల్తీలకే రోజూ రాగి సంకటిలో ఇంత ఉల్లి తొక్కు చవులారా నంజుకు తినే లక్కు. గుండ్రంగా చెక్కులు తీసి మరీ పింగాణీ పేట్లలో వడ్డిస్తుంటారు కదా ఉల్లి ముక్కలు ఇవాళ్టి స్టార్ హోటళ్లలో! సరదా కోసమైనా సరే సుమా! ఆ తరహా ముక్కలు తెల్లారి రెండు పంటి కింద వేసుకునే జిహ్వచాపల్యం మహా ప్రమాదమని రెడ్ ఇండియన్ల గాఢనమ్మకం. రాత్రంతా నిలవున్న ఉల్లిపాయ ముక్కలంటే కొన్ని రకాల కొరివి దయ్యాలకు పరమ ప్రీతికరమని ఆ పిచ్చోళ్ల పిచ్చి నమ్మకం!
మధ్య ప్రాచ్యం ఈజిప్షియన్ల మేళం అందుకు పూర్తిగా విరుద్ధం. ఉల్లిపాయ గుండ్రటి చెక్కులు వాళ్ల సంస్కృతిలో దేవీ దేవతలతో సమానం. మనిషి తపించే చిరంజీవి తత్వానికి గుండ్రంగా కోసివుంచిన ఉల్లిపాయలు గొప్ప సంకేతం! ఈజిప్టు చక్రవర్తుల సమాధుల గోపురాలు ఉల్లి ఆకారంలో కనువిందు చేస్తుంటాయ్! మరణానంతరం కూడా తమను ఏలిన పాలకుల జీవితాలు సౌకర్యవంతంగా ఉండాలన్న కాంక్ష ఆ ఉల్లి గోపురాల నిర్మాణాల వెనుకున్నమర్మం. ఎన్నుకున్న సైతాను నేతలు ఎప్పుడు విరగడవుతారా అంటూ వెయ్యికళ్లతో ఎదురుచూసే మనకు నిజంగానే ఇదో వింత విశేషమే కదూ!
అంత కన్నా వింత విషయం.. ధార్మిక సాంప్రదాయాలలో ఉల్లికి ఇంతటి ప్రాధాన్యమున్నప్పటికీ ఉల్లి సాగులో మధ్య ఆసియా చాలా వెనకంజలో ఉండటం! ఈజిప్టు వంటకాలకు శ్రేష్టమైన రుచినిచ్చే నాణ్యమైన ఉల్లి నేటికీ పాకిస్తాన్, ఇరాన్ వంటి తూర్పు ఆసియా ప్రాంతాలలో సాగు కావడం గమనార్హం.
కరెన్సీ కాగితం రూపంలో ఉంది. కాబట్టి ఏ కలర్ ప్రింటింగ్ బట్టీల్లో అచ్చొత్తించినా అచ్చమైన నోట్ల మాదిరి దర్జాగా చలామణీ చేయించొచ్చు. ఇట్లాంటి పిచ్చి తిప్పలు వస్తాయనే మధ్య యుగాలల్లో మనుషులు ఉల్లిపాయనే నేరుగా కరెన్సీ కింద వాడేసుకొనేవాళ్లు.ఇంటి అద్దె వంటివి అంటే.. ఆఖరికి ఉల్లిపాయ కొనాలన్నా ఉల్లిపాయ కరెన్సీనే అక్కడి కొన్ని దేశాలల్లో! అప్పటి జనాల తిప్పలు వింటుంటే కన్నీళ్ళే కాదు సుమా.. ఉల్లిపాయ నవ్వులు కూడా పూయిస్తుందని తెలుసుకోవాలి ముందు. హాహాకారాలు మాత్రమే పుట్టించేదీ కుళ్ళు ఉల్లిపాయ అన్న అపోహలు ఇహనైనా చాలిస్తే మేలు. చాలినంతగా ఉల్లి ఉత్పాదన మీదా, సక్రమ పంపిణీ విధానం మీదా ఏలినవారు దృష్టి పెడితే చాలు! కన్నీళ్లతో పాటే హా.. హ్హా.. హ్హా అంటూ పాలకులకు హారతులు పడతారు వినియోగదారులు.
ఉల్లిపాయను కోస్తే సల్ఫర్ వస్తుంది. అది గాలిలోని తేమతో కలిసి సల్ఫూరిక్ ఆసిడ్ అవుతుది. కళ్ల మీద దాని దాడి ముందుగానే గ్రహించేస్తుంది. మన మొద్దు యంత్రాంగంలా కాదు సుమండీ మెదడు పద్ధతి! ఏ ప్రమాదం పసిగట్టినా తక్షణమే చర్యలు తీసుకునే బాధ్యత ఉంది కాబట్టి వెంటనే నీళ్లు కార్చి కళ్ళకు ఉల్లి నుంచి రక్షణ కల్పిస్తుంది. ఏ కోతలు , గీతలు లేకుండానే మరి కోతుల్లాంటి నేతలు తెప్పిస్తున్న కన్నీళ్ల సంగతో? ఉగాండాలో కూడా ఉల్లికి మా గొప్ప కరువుంగా ఉందనే ఊకదంపుళ్ళు మన నేతలవి. ఉల్లి బెంగ కన్నా ముందు ఈ నేతల వైనాల గురించి కదా జనాలు దిగాలు పడాల్సింది! నీళ్లలో తడిపినప్పుడో, కోసే కత్తి పీట పీకకు ఇంత తెలుపు వెనిగర్ బొట్టు రాస్తేనో ఎంత లావు ఉల్లిపాయైనా కన్నీళ్లు తెప్పించే శక్తి కోల్పోతుంది. ఏ ఉపాయాలు వాడి మరి మన కోతి బ్రాండ్ నేతల నుంచి వచ్చి పడే ఉపద్రవాల నుంచి జనం బైటపడేదీ?!
ఇంకా నయం! ఇక్కడ ఇండియాలో పుట్ట బట్టి కరువుకు ఏదో కన్నీళ్లతో సరిపోతోంది. అదే లిబియానాలో పుట్టుంటేనా? ముప్పతిప్పలే! అక్కడివాళ్లకు తిండి తిప్పలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఉల్లిపాయలే! లిబియన్ల తలసరి సాలీనా ఉల్లి వినియోగం దాదాపు అరవై ఏడు పౌండ్లు!
ఉల్లి తొక్క మందంగా ఉంటే రాబోయే శీతాకాలంలో ఇబ్బందులు పెట్టే మందంలో మంచు కురుస్తుందని ఇంగ్లీషు జానపదులలో ఓ నమ్మకం. తేలికపాటి ఉల్లిపొర తేలిగ్గా వెళ్లిపోయే చలికాలానికి సంకేతమని వాళ్ల భావన.
చూడ్డానికి వచ్చే పోయే వాళ్ల చెవులకు ఇంపుగా ఉండాలని న్యూయార్క్ నగరానికి ఆ 'బిగ్ ఏపిల్' అనే ట్యాగ్ తగిలించారు వందేళ్ల కిందట! అయితే ఆ మహా నగరం అసలు బిరుదు బిగ్ ఆపిల్ కన్నా ముందు బిగ్ ఆనియనే ! 'ఆపిల్ చెట్టు కాయలం' అంటూ మహా గొప్పలు పోయే ఇక్కడి మన నేతల మూలాలదీ ఇదే తంతు. తీరిగ్గా తడిమే ఓపికలుండాలే గాని తల్లివేర్లు ఏ ఉల్లిజాతికో తగిలిందాకా ఆగేవి కాదు! ఆపిల్ కాయ అప్పికట్లలాంటి బుల్లి ఊళ్లల్లో కూడా దొరుకుతున్నది కానీ.. ఉల్లికే రాజధాని వంటి మహానగరాలల్లో కూడా ఉపద్రవం వచ్చిపడింది! పాలించమని చేతికి అధికార దండం అప్పగించింది మంది. పక్కవాడిని లాలించి లాగేసుకోడమా, చండుకు తిని చంతకు చేర్చేసుకోడమా అన్న మంత్రాంగంలోనే ఎక్కడి సమయమూ చాలడంలేదు ఏలికలకు. ఇహ ఉల్లి ఆలనా పాలనా పైనా సమయం వృథా చేసుకునే పిచ్చితనమా?
ఉల్లిసాగులో మన దేశానికన్నా ముందున్నది ఒక్క చైనా (సాలీనా 20,507,759 మెట్రిక్ టన్నులు) నే సుమా! అగ్రరాజ్యం అమెరికాది (13,372,100) కూడా మన (13,372,100) తరువాతి స్థానమే! అంటూ సర్కార్లు ఏకరువు పెట్టే రెండేళ్ల కిందటి లెక్కలు బీదా బిక్కీ డొక్కలు నింపుతాయనే! ఎంత ఏడిపించే ఉల్లిగడ్డకైనా కన్నీళ్లాగుతాయనే నేతల గడుగ్గాయి కూతలకు!
అమెరికన్ సివిల్ వార్ వేళలో 'ఉల్లిపాయలు ఇవ్వకుంటే ఉన్న చోటు నుంచి ఒక్కంగుళమైనా ముందుకు కదిలేదిలేదు' అంటూ జనరల్ గ్రాంట్ బెదిరిస్తూ టెలిగ్రాం కొట్టించాడు ప్రభుత్వానికి. వట్టి తినడానికే అనుకునేరు.. అపచారం చుట్టుకుంటుంది.. యుద్ధంలో అయే కోతిపుండ్లు బ్రహ్మరాక్షసులవకుండా ఉండాలంటే ఉల్లిపాయే అప్పట్లో చవకలో దొరికే యాంటీ సెప్టిక్ మందు. ఉన్నపళంగా వార్ డిపార్ట్ మెంట్ వారు మూడు రైలు బోగీలకు నిండుగా ఉల్లిపాయలు ఊరికే కూరల్లో పప్పుల్లో వాడేసుకోమని పంపిస్తారా?
ఉల్లి తడాఖా ముందు ఉగ్రవాదులూ తలొంచుతున్న కాలం ఇది! పాపం ఊళ్లల్లో బీదా బిక్కీకే కనీసం ముక్కులతో వాసన చూసుకునేందుకైనా ముక్క సరుకైనా దొరికడంలేదు!
నెబ్రస్కా బ్లూ హిల్స్ అనే ఓ బుజ్జి దేశం ఉంది. అక్కడి నేరస్తుల శిక్షా స్మృతిలో నేటికీ ఉల్లిపాయకు గౌరవప్రదమైన స్థానం ఉంది! పిరికి మగాడిని గేలిచేస్తున్నట్లుగా పెద్ద టోపీ తలకు తగిలించుకునే మహిళకు జీవితాంతం ఉల్లి పదార్థాలేవీ కంచంలోకనిపించరాదన్నది శిక్ష. ఉన్న నాలుగు రోజులూ ఉల్లి మోజు తీరకుండానే పోయేది మేలా? ఆఖరి కోరికగా అయినా ఆరగా ఆరగా అద్దిన ఉల్లి ఊతప్పం మింగి 'హరీ'మనడం మేలా?
మొదటి శతాబ్దంలో జరిగిన ఒలపింక్స్ ఆటల బట్టి ఉల్లిపాయదే నేటి వరకూ ఎవరూ ప్రశ్నించలేని మొదటి స్థానం! ఆ ఆటల్లో అఖంద విజేతలుగా నిలిచిన గ్రీకు కిలాడీలు బలవర్థక ఆహారం కింద పుచ్చుకున్న ప్రధాన ఆహారమంతా ఉల్లిపాయలతో తయారయినదేనని ఈనాటికి జనాలకో నమ్మకం. గ్రీ
సు దేశంలో ఉల్లిపాయ బలవర్థక ఔషధం కింద లెక్క. ఇండియాలో ఇప్పటికీ కంటికి, కీళ్లకు, గుండెకు మేలు చేసే గట్టి మందుగా ఉల్లిపాయకు మంచి పేరు!
2011 లో పీటర్ గ్లేజ్ బ్రూక్ అనే బ్రిటిష్ రైతన్న 18 పౌండ్లు బరువున్న ఉల్లిపాయను పెంచి ఏకంగా గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కేసాడు. ఆ మాదిరి రికార్డులు .. అవి బద్దలవడాలు మనకొద్దులే! కానీ ఆర్నెల్లుగా ఆకాశానికలా ఎగబాకి ఎటెటో వెళ్లిపోయిన ఉల్లిపాయ.. ఎంతగా బతిమాలి బామాలినా కిందకు దిగిరాననే నీ మంకు పట్టు మానేయడం మేలు! ప్రపంచ మార్కెట్ గణాంకాల రీత్యా శాఖాహార పంటలలో ఇప్పటికీ ఉల్లిదే ఆరో స్థానం! ఆ తల్లి కంటబడటం లేదని ఎంత కాలం ఇట్లా దిగాలుబడి ఎదురుచూసేది? దేవుళ్లకు ఎలాగూ ఉల్లి పొడ గిట్టదు. ఆ మూలవిరాట్టుకు మన ఉల్లి పాట్లు అర్థమయే అవకాశంలేదు. చంద్రయాన్ - మూడు వెళ్ళి వెదికే వరకు ఉల్లిపాయ ' మూడ్' ఇట్లాగే ఉందా! సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుని వారసులం మనం. టెంకాయకు బదులుగా వంకాయ సృష్టి జరిగినట్లే ఉల్లికి బదులుగా మరి ఏ వెల్లి సృష్టో జరిగిపోవచ్చు! రచ్చ రాజకీయాల కోసమైతే ఎట్లాగూ ఏ రాజధాని, పౌరసత్వం మాదిరి చిచ్చులో బొచ్చెడు కొత్తవి రగిలించుకోవచ్చుగా! పేదోడి కడుపు రగిలి రవ్వ నిప్పుగా మారక ముందే ఉల్లిపాయను పాడు చెర నుంచి ముందు బయటకు తెద్దురూ! కన్నీళ్లు పెట్టించే ఉల్లి తల్లి కంటనే కన్నీళ్లు వరదలై పారుతున్నా నవ్వు తెప్పించే పిచ్చి చేష్టలిట్లా కొనసాగితే కన్నీళ్లు పెట్టుకునేది ఎవరో తమరికి తెలియదా స్వాములూ?
( సూర్య దినపత్రిక సంపాదకీయ పుట ప్రచురణ )
- కర్లపాలెం హనుమంతరావు
20 - 10-2021
బోధెల్ ; యూ. ఎస్.ఎ
No comments:
Post a Comment