పలు సందియములు తొలచును | వెలయించున గోచరార్థ విజ్ఞానము - అన్నది చదువు మీది చిన్నయసూరి సదభిప్రాయం.
అక్షరం లోకం చక్షువు. నిరక్షర కుక్షిని గుడ్డికుక్కతో పోల్చారు పురందర దాసు. 'సంతకు పోయి తిరిగిన దుడ్డు పెట్టె కాక దొరకేనా?' అని ఆ యోగి ఎకసెక్కాలాడి నట్లే గాలికి తిరిగి తన పుత్రులెక్కడ జనుషాంధులవుతారోనని పంచతంత్రంలో సుదర్శన మహారాజు మహా మధనపడతాడు.
అహరహము అరినామస్మరణ మరిగిన ముద్దుల పట్టిని తిరిగి దారికి తెచ్చుకుందామంటే హిరణ్యకశిపుడికి ముందుగా తోచింది సద్గురువుల వద్ద లభించే సద సద్వివేక చతురత కలిగించు విద్యాబుద్ధులే! చదవని వాడు అజ్ఞుండగునని రాక్షసుడైనా అక్షర మహిమను చక్కగా గ్రహించాడు.
ఇప్పుడంటే విద్య పరమార్థం అర్ధసంపాదన గానీ... ఏకలవ్యుడు ఆ కాలంలో ఏ కాసుల కోసం బొటన వేలుని ఫణంగా పెట్టి మరీ విద్యల కోసం వెంపర్లాడినట్లు?
కర్ణుడు పరశురాముని వద్ద పడీ పడీ శుశ్రూషలు చేసింది కాలక్షేపం కోసమైతే కాదు గదా!
మృత సంజీవనీ విద్య కోసమై కచుడు చేసిన సాహసం సామాన్య మైనదా?
ఆత్మ పరమాత్మల పరమరహస్యాలను గురుముఖత: గ్రహించాలన్న కామనలోనే గదా జాబాలి గౌతముని ముఖ్యాశ్రమం లో అన్నేళ్ళు ఎడతెగకుండా గొడ్లూ గోదలను కాసింది?!
విద్యా ర్జనకెంత విలువ లేకపోతే గీతాచార్యుడు గోపాల బాలుడు బాల్యంలో సాందీప మహాముని పంచలో కూర్చుని గుంత ఓనమాలు దిద్దుకుంటాడు?!
అవతార పురుషుడు ఆ తారక రాముడు సైతం తాటకి వధకు పూర్వం వశిష్టులు వారి వేదాల పారాయణంలో తర్పీదు పొందిన వాడే!
విద్యా సముపార్జన ఓ విధిగా నిర్దేశించిన బ్రహ్మచర్యం చతురాశ్రమాలలో ప్రథమమైనదేకాదు.. ప్రధాన మైనది కూడ.
భారతీయులకు చదువు చెప్పే గురువు సాక్షాత్ - పరబ్రహ్మ స్వరూపం . పురందరదాసు ప్రబోధించిన విధంగా గురువుకి గులాము అయ్యేదాకా ముక్తి దొరకదన్నా ! " అన్న సూక్తి మనిషికి చదువు సంధ్యం మీదున్న భక్తి శ్రద్ధలకు పెద్ద నిదర్శనం.
భరృహరి బోధించిన విధంగా విద్య నిగూఢ గుప్తమగు విత్తము. పూరుషాళికి రూపము. యశస్సు, భోగకరి. విదేశంలో ఆదుకునే ఆపద్బంధువు. హర్తకు అగోచరమైన నిధి. సుఖపుష్ఠి సత్కీర్తి ఘటించు ఈ దివ్య ధనం అఖిలార్థకోటికి పూర్తిగా ధారపోసినా పెరుగు ద్రవ్యమేగాని కరుగు ద్రవ్యం కాదు.
యుగాంతం వేళ కూడా అంతం కాని ఈ జగానికి ఎవరు అధిపతో వారు కుబేరుని మించిన ధన సంపన్నులు. మనిషికి భుజకీర్తులు, సూర్య చంద్రహారాలు పెద్ద అలంకారాలు కానే కావు.
చందనస్నానాలూ, మందారమాలలు అందచందాలను కా ఏ మంత్ర పెంచేవి కావు. పెంచనూ లేవు. వాగ్భూషణం ఒక్కటే మనిషికి సుభూషణమ్-అన్న భర్తృహరి వాదన కాదనేందుకు లేద.
ఆ రాజకవి అన్నట్లు నిజంగా విద్యనృపాల పూజితమే . కాకపోతే మనుచరిత్ర కర్త అల్లసాని పెద్దనామాత్యులు 'ఎదురైనచో మద కరేంద్రము నిల్పి కేయూత యొసగి కృష్ణరాయలువారు సరదాకు ఎక్కించుకోరుకదా?
వల్మీకజుడైన వాల్మీకి మహర్షికి కమలజన్మునితో సరిసమానమైన గారవాది మర్యాద లందలటానికి కల కారణం రామాయణా రచనా విశిష్టతే అంటే ఏమనగలము?!
సుభాషిత రత్నావళి భాషించినట్లు చందమామకు తారా తోరణం, పతీపత్నులకు పరస్పర సాహచర్యం, పృథ్వీమతల్లికి సద్భూపాల సుపరిపాలన భూషణాలయితే.. విద్య మాత్రం సర్వేసర్వత్ర సకల లోకాలకూ ఒకే మాదిరి సద్భూషణం.
డొక్క శుద్ధిలేని మనిషి తేనె బొట్టులేని పట్టు' అంటారు ఖలీల్ జిబ్రాన్. మనిషి జన్మ ఎత్తినందుకైనా నాలుగు మంచి ముక్కలు నాలుక కింద ఉంచుకోనివాడిని వజ్రవైఢూర్య ఖచిత ఘటకంలో తెలకపిండి వంటకం కోసం మంచి గంధపు చెక్కల్ని మంట పెట్టిన వానికి మించి వెయ్యి రెట్లు అధిక మూర్ఖునిగా చిత్రించింది. విద్యానీతి .
చదువుకు మించిన చక్కదనం, చక్కని ధనం ముల్లోకాలు గాలించినా ఎక్కడా దొరకదనేదే సర్వశాస్త్రాల సారం. భాగవతంలో భక్త ప్రహ్లాదుడు కన్న తండ్రి ముందు మొరపెట్టుకున్న చదువుల మర్మం ఇదే!
చదువు సంధ్యలు చక్కని జంట పదం. జీవన సంధ్యను రాగ రంజితం చేయగలిగే చేవ జీవితాంతం వదలని చదువుకు మాత్రమే ఉందని ఎంతో వింతగా ధ్వనిస్తున్నదీ పదం !
బతుకు ధర్మక్షేత్రం మంచి చెడ్డల మధ్య జరిగే నిత్య కురుక్షేత్రం నుంచి మానవుడిని మాధవుడిలా కాపాడగలిగేది ఓనామాలే .
సర్వరోగాలకి మూల కారణమైన తాపత్రయం వల్ల అంతిమంగా జరిగే నష్టం ఆయుక్షీణం - అన్నది రుగ్వేద వాదం. ఆ యావ నుంచి మనసుని మళ్ళించి మంచి దోవకు అప్పగల తారకమంత్రం మన చేతిలోనే ఉందని మానసిక వైద్యులూ చెబుతున్నారు.
ఆరోగ్యసిద్ధికి.. అమరత్వ లబ్ధికి పుస్తక పఠనమే ఉత్తమ సోపానం అని ఇప్పుడు లండన్ విశ్వవిద్యాలయ పరిశోధకులూ నొక్కి చెప్పే మాట . ఒక దశ దాటినా పిదప వయసుతో పాటు మనసు వడలి పోవడం సహజ పరిణామం . నిష్కాముకత్వం దానికి నిఖార్సైన జాషధం కావచ్చు కానీ... ఆ యోగ తత్త్వం అందరికీ అంత సులువుగా అందివచ్చే అందలమేమీ కాదు.
బద్దెన నీతిశాస్త్రంలో కుండబద్దలు కొట్టిన విధంగా ధనం, ఉషోదయం, యవ్వనం, వండిన అన్నం, మూర్ఖుని స్నేహమల్లే మానవుడి జీవిత కాలమూ బుద్భుదప్రాయమే.
'ఆయువునూరు సంవత్స రములందు సగంబు నశించె నిద్ర చే నా యరలో సగంబు గత మయ్యెను బాల్య జరాప్రసక్తి చే| బాయక తక్కిన యట్టి సగబాలు గతించు బాలయసవృత్తి చే' అని సూక్తి .
ఆ మిగిలిన సగభాగంలోనైనా పడుచుదనంతో పరవళ్లు తొక్కాలని ఉవ్విళ్లెవరికి ఊరవు ? పుస్తక పఠనం ఓ వ్యసనంగా మలుచుకున్నవారి ఆయుర్దాయం పెరగడమేకాదు.. ఉన్నంతకాలం చలాకీగా చిందులెయ్యగలుగు తారని అండాలండే విశ్వ విద్యాలయ పరిశోధక బృందం జరుపుతున్న పరీక్షల ఫలితం తేల్చింది . మానవకణాలలోని క్రోమోజోన్ల చివర్ల జీవిత కాలాన్ని నిర్దేశించే ' డెలోమెల్ ' ఉంటాయని, అవెంత దీర్ఘంగా ఉంటే జీవిత కాలమంత సుదీర్ఘంగా సాగుతుందని ఆ బృంద నాయకుడు ప్రొఫెసర్ స్టీఫెన్ హోల్గేట్ వాదం.
పుస్తకాల పురుగులలో ఈ'డెలోమెల్ ' పొడుగు పెరుగుతుంటుందని తేలిన పరిశోధనల సారాంశం.
ఇంకేం! ఏడుపదులు దాటినా చేతికి కర్ర రాకుండా చురుకుగా తిరగాలంటే వెంటనే ఓ మంచి పుస్తకంతో పఠనాసనంలో బైఠాయిస్తే సరి! దీర్ఘాయుష్మాన్ భవ!
- కర్లపాలెం హనుమంతరావు
02 -11-2021
- కర్లపాలెం హనుమంతరావు
( ఆదివారం - ఈనాడు - దినపత్రిక - సంపాదకీయం )
No comments:
Post a Comment