వ్యంగ్యం
మంత్రిగారితో ముఖాముఖి
రచన- కర్లపాలెం హనుమంతరావు
( సూర్య దినపతిక - 30-09-2018 ప్రచురితం )
జార్ఖండ్ రాష్ట్రంలో గత ఏడాది పశువుల కాపరి ఒకడి పాప పంకిలాన్ని పరిశుధ్ధం చేసే పుణ్యకార్యంలో భాగంగా బహిరంగ ప్రదేశంలో పరమ కిరాతకంగా పరమపదసోపానం ఎక్కించారు కొంతమంది స్వచ్చంద సేవాకార్యకర్తలు. ఆ పుణ్యాత్ములు ఎనిమిది మంది ఆధ్యాత్మిక లక్ష్యాన్ని అపార్థం చేసుకొని కథిన జీవిత కారాగార శిక్ష విధించింది కింది కోర్టు. ఆ తప్పును సరిదిద్దుకుంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వారిని బెయిలు మీద విడుదల చేసిన సందర్భంలో.. కారాగారం నుండి విముక్తి చెందిన ఆ ప్రజాసేవాతత్పరులకు ఎదురేగి మరీ బహిరంగ సభలో పూలదండలతొ ఘనంగా సన్మానించారు శ్రీమాన్ కేంద్ర మంత్రివర్యులు జయంత్ సిన్హాజీ! శ్రీవారి సదుద్దేశం దేశానికి తెలియచెయ్యాలన్న ఉద్దేశంతో ముఖాముఖీకి ప్రయత్నించినప్పటికి ఇంత వరకు ఆ పిచ్చాపాటికి అవకాశం లభించింది కాదు. దురదృష్టం. అయితే అదృష్టం మరోలా తన్నుకొచ్చింది. సరిగ్గా గౌరవనీయ సిన్హాజీ అడుగుజాడలలోనే ప్రస్థానించే మరో రాజకీయ నేత ఈ వారంలో జైలు నుంచి విముక్తి చెందిన మరో నేరస్తుల ముఠాకి ఘన సన్మానం జరిపించి సభా సమక్షంలో పుష్పమాలాంకృతలను చేసి జాతికి మరో మారు దిగ్భ్రాంతి ప్రసాదించారు. పేరు వెల్లండించ వద్దన్న తమ షరతులకు అంగీకరించిన పిదప మీడియాతో వారు తమ మనోభావాలను మనసు విప్పి మరీ పంచుకొన్నారు. ఆ ముఖా ముఖీ తాలూకు కొన్ని విశేషాలుః
హంతకులను సన్మానించడం మంచి పద్ధతి కాదని ప్రజలు భావిస్తున్నారు. అందుకు మీ సమాధానం?
మంత్రివర్యునిగా నా దృక్పథం మరింత విశాలంగా ఉండడం అవసరమని నేను భావించడమే. ఏ ఒక్క వర్గం వారి అభిరుచుల మేరకో నడుచుకోవడం ప్రజాప్రతినిధికి సరి తూగదు. చాలా శతాబ్దాల బట్టి సమాజం నేరగాళ్ల పట్ల బహు క్రూరత్వం ప్రదర్శిస్తోంది. నేరస్తులు మాత్రం మనుషులు కాదా? వారికి మాత్రం భావోద్వేగాలు ఉండవా? 'దేవదాసు' సినిమా చూపిస్తే వాళ్ళూ కన్నీళ్లు పెట్టుకుంటారు. హంతకులూ సమాజంలో అంతర్భాగమే! క్రూరలను సైతం కూడగట్టుకుని ముందుకు సాగవలసిన అగత్యం మన సమాజానికి ఉంది. దొంగలూ దొరల వలె జీవించే మంచి భవిష్యత్తు కోసమే నేను కలలు కనేది. కానీ కొంత మంది కక్షపూరితంగా నేరస్తుల మీద జుగుప్స పెంచుకుంటున్నారు. కిరాతకుల పట్ల నేను ప్రదర్శించే సానుభూతిని మీడియాగా మీరూ సమర్థించాలి న్యాయంగా!
మీ పార్లమెంటు సభ్యులలోనే మూడొంతుల మంది తీవ్రమైన నేరాలు చేసిన నేతలున్నట్లు రికార్డులు చెబుతున్నాయి కదా.. ?
నిజమే! మా ఎంపీలలో 20 శాతానికి మించి తీవ్రమైన నేరస్తులున్నట్లు నిందలు భరిస్తున్నారు. హత్యలు, మానభంగాలు, కిడ్నాపులు, వంటి ఆరోపణలల్లో మా స్వంత పార్టీనే ముందంజలో ఉందని లెక్కలు చెపుతున్నాయి. న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. అదృష్టం కొద్ది ఈ దేశంలో చట్టమూ తన పని తాను చేసుకుపోతోంది.
తన పని తానే చేసుకుపోతుందంటే మీ భావన?
పరిస్థితులన్నీ సవ్యంగా సాగుతున్నాయని అర్థం. చాలా కేసుల్లో పోలీసుల విచారణ ఇంకా 'సాగు'తోనే ఉంది. కొన్ని కేసులే దారి తప్పి కింద కోర్టుల్లోకి ప్రవేశిస్తున్నాయి. అవీ అవసరాన్ని బట్టి క్రమంగా సర్దుకుంటాయి. సాధారణంగా ప్రతి ఎం.పి కి ఐదు నుంచి ఆరు దఫాలుగా ఎన్నికయే అవకాశం ఉంది. ఆ తరువాత అనారోగ్యం. భార్యో .. కొడుకో పదవి అందుకొనేందుకు సిద్ధంగా ఎటూ ఉంటారు. కొడుకు ఏ తాగుబోతో అయితే కూతురు రంగంలో దూకేందుకు సిద్ధమవుతుంది.
కానీ మీరు దండలేసిన వ్యక్తులు న్యాయస్థానాలలో నేరస్తులుగా రుజువయినవాళ్లు కదా?
అదే సామీ నేను మొత్తుకొనేదీ! పోలీసులు మా కార్యకర్తలకు సంబంధించిన కేసుల్లో మాత్ర,మే ఎందుకు త్వరత్వరగా విచారణ పూర్తిచేస్తున్నట్లు? అది అన్యాయమే కదా? న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. కానీ అవీ ఊహించని కారణాల వల్ల గత్తర గత్తరగా తీర్పులిచ్చేస్తున్నాయి! మా ప్రజాప్రతినుధుల పట్ల ఎంతో ఉదాసీనత చూపించే రాజ్యాంగ వ్యవస్థలు అభం శుభం తెలియని చిన్న నేరస్తుల మీదే ఎక్కువ గురిపెడుతున్నాయి! తాత్కాలిక సంఘ ప్రక్షాళనను గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు కాని.. భవిష్యత్తులో సమాజానికి అక్కరకొచ్చే ప్రతిభ తుడుచుపెట్టుకుపోతోందని అర్థంచేసుకోవడంలేదు. ఇప్పుడున్న రాజకీయనేతలంతా ఎక్కడ నుంచి పుట్టుకొచ్చింది? మా అమాయక కార్యకర్తలు నిష్కారణంగా విక్టిమైజ్ అవుతున్నట్లు కాదా? వారు మానసికంగా మరింత కుంగిపోకుండా నియోజకవర్గ ప్రతినిధిగా వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు ఏదైనా చెయ్యాలి. మంత్రిగా అది నా విధుల్లో ఒకటి. అందుకే ఈ బహిరంగ సత్కారాలు!
ఈ హంతకులు మొత్తం పదిమంది ఉన్నారు. ఇందులో ఎవరి భవిష్యత్తు మీద మీకు ఎక్కువ గురి ఉంది?
మళ్లీ మీరు మీ మీడియా బుద్ధి చూపిస్తున్నారు. నాకు ఎవరి మీద ప్రత్యేకమైన అభిమానంలేదు. అందరు నేరస్తులూ నాకు కావాల్సినవాళ్ళే! అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. నిజానికి వీరి కార్యకలాపాలు గొప్ప టీం-వర్కుకి ఉదాహరణగా చెప్పుకోవాలి. సమృధ్ధిగా వనరులు, సరయిన వసతులు, శిక్షణ కల్పిస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తారనడంలో సందేహంలేదు.
భవిష్యత్తులో కూడా వాళ్లకి మీ సహాయ సహకారాలు ఉంటాయా?
సదుద్దేశంతో పోత్సహించాం. ఆ సంకల్పానికి ముందు ముందూ ఆటంకం రాకూడదని అనుకుంటున్నాను. నా నియోజకవర్గంలోని మిగతా మండలాలు, జిల్లాలలో ఇదే తరహా సన్మానాలు కొనసాగాలి. అధికారులకు ఆ బాధ్యత అప్పగించడం జరిగింది. నిధులకు కొరత లేకుండా చూసుకోవడం నా బాధ్యత.అది తప్పక నిర్వహిస్తాను.
ముందు ముందు మరన్ని ఈ తరహా కార్యక్రమాలు మీ నుంచి ఆశించవచ్చా?
మా ప్రోత్సాహకాల కన్నా ముఖ్యమైనది వారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం. వివిధ మంత్రిత్వ శాఖలు ఆ దిశగా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసే పనిలో ఉన్నాయి. ఉదాహరణకు పెట్రోలు పోసే సందర్భంలో తమ వంటి మీద ఆ ఆయిల్ పడకుండా చూసుకోవడం ఎలా? పెట్రోలు పోసే సమయంలో తమ దగ్గరి అగ్గిపెట్టెలు పాలిథీన్ కవర్లలో ఉంచుకోవాలి. లేకపోతే తడిసి సమయానికి అక్కరకు రావు. ఆ జ్ఞానం లేక కొన్ని ప్రాణాలు వృథాగా అగ్నికి ఆహుతయ్యాయి! కొంత మంది కంగారులో వట్టి పెట్రోలు మాత్రమే పోసి అగ్గిపెట్టె కోసం వెదుకులాట మొదలుపెడతారు. సమయానికి ఎవరి దగ్గరా నిప్పు లేకపోతే సీను రివర్సయే ప్రమాదం ఉంది. చిన్న చిన్న పొరపాట్ల వల్ల భారీ కార్యక్రమాలు భంగం కాకూడదు కదా! ఆ విధమైన శిక్షణ మీద మరింత దృష్టి పెట్టడం అవసరం.
చివరి ప్రశ్న. న్యాయస్థానాలు తప్పు పట్టిన దోషులను రాజ్యాంగబద్ధ సంస్థల ద్వారా విడిపించడమే కాకుండా సమాజం ఎదుట వారిని ప్రజాప్రతినిధి హోదాలో మీరు సన్మానించారు.. ఈ ప్రక్రియ మొత్తాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు?
మంచి ప్రశ్న. మా పార్టీ పాలనలో ఏ వ్యవస్థా అసలు పనే చెయ్యడం లేదని కదా విమర్శలు! నిత్యం కక్ష కొద్దీ విమర్శించేవారికి చెంపపెట్టు లాంటిది ఈ ప్రక్రియ మొత్తం అని నా అభిప్రాయం. అసాంఘిక కార్యకలాపాలు చురుకుగా సాగుతున్నాయి. వారిని పర్యవేక్షించడంలో శాంతి భద్రతల శాఖలు తమ విధులు దివ్యంగా నిర్వహిస్తున్నాయి. కోర్టుల్లోనూ అంతో ఇంతో విచారణంటూ కొనసాగుతుందన్న వాస్తవం దోషులకు పడ్డ శిక్షలు రువుజు చేసున్నాయి. చేసిన తప్పులు సరిదిద్దుకొనే అవసరానికి రాజ్యాంగబద్ధ సంస్థలూ మినహాయింపు కాదన్న వాస్తవం ఆయా శాఖల పని తీరును బట్టి అర్థమవుతుంది. అంతిమంగా.. శిక్షలు పడే నేరస్తుల ఆత్మవిశ్వాసం పునరుద్ధరణ కోసం ప్రజాప్రతినిధులమైన మేమంతా రాజ్యాంగ విధులకు అతీతంగా పునరంకితమవుతున్నట్లు వట్టి మాటల ద్వారా కాకుండా గట్టి చేతల ద్వారా నిరూపించినట్లు కూడా అవుతుంది. సంఘాన్ని ఉద్ధరించే మా కార్యాచరణే మరోసారి మాకు గద్దె ఎక్కే అవకాశం ఇవ్వమని ప్రజల వద్దకు వెళ్లి గర్వంగా అభ్యర్థించే అవకాశం ఇస్తుంది.
మరో చివరి సందేహం. ఈ విధమైన కార్యాచరణ అన్ని రాష్ట్రాలలోనూ కొనసాగుతుందా?
కేవలం ఎన్నికలకు గడువు సమీపించిన రాష్ట్రాలకు మాత్రమే మా ప్రస్తుత కార్యాచరణ పరిమితమవుతుంది.
మరో చివరి ప్రశ్న. అన్ని వర్గాల నేరస్తులూ మీ సన్మానాలను ఆశించవచ్చా?
మీ ప్రశ్న అభ్యంతరకరం. ప్రతిపక్షాల కోసం పనిచేసే నేరస్తుల మీద మా ఉక్కుపాదం మునుపటి కన్నా దృఢంగా మోపడం ఖాయం. మీ ద్వారా ప్రతిపక్షాలకు ఇదే నా హెచ్చరిక కూడా.
రచన- కర్లపాలెం హనుమంతరావు
( సూర్య దినపతిక - 30-09-2018 ప్రచురితం )
No comments:
Post a Comment