హాస్య కథ:
కప్పగంతులు
- కర్లపాలెం హనుమంతరావు
( కౌముది అంతర్జాల పత్రిక కథల పోటీలో బహుమతి గెల్చకున్న కథ )
పదవులు చాలామంది పెద్దమనుషులకు తృణప్రాయం. కొద్దిమంది బుద్ధిజీవులకు ఆ తృణమే ప్రాణం కన్నా ప్రియం.
అధికారం మూజూసి కె.డి.వి. కప్ప(కప్ప దాటు వెంకప్ప)గారికి ఈ దఫా మూణ్ణెల్లు దాటిపాయ! మూడు తరాల కోసరంగా కూడేసిన సంపత్తుకు విపత్తాయ! మనీ పరుసుకేనా? పెద్దమనిషి పరువుకూ ఆపత్తు! ‘ఇంకా బిడియమా! అయితే ఏ కోర్టు బోనులోనో తలొంచుకు నిలబడ్డం ఖాయం!’అంటూ అంతరాత్మ పోరూ అంతకంతకూ ఎక్కువయిపోయిందీ మధ్యన. అందుకే పాపం.. వెంకప్పగారు మనసొప్పక పోయినా పనికి మాలిన సిగ్గూశరాలనో చెత్త కుప్పన పారబోసి సత్ ‘గతి’ ప్రాప్తికై ఆపద్ధర్మంగా సర్కారీ పార్టీలోకి దూరిపోయే ప్రయాసలు ముమ్మరం చేసేసారు!
లోపాయికారీ మంత్రాంగంలో లోపమేం లేదు. కానీ పదవీ ప్రాప్తికి అడ్డొచ్చేది ఒకే ఒక మెలిక. గెలిపించిన ఓటర్లంతా ఓ.కే చేసిన ఓ తీర్మానం కొత్తపార్టీ అప్లికేషనుకు తప్పనిసరిగా జతచేయాలని షరతు.
కార్యకర్తల చేతనయితే చేతులెత్తించడమేం ఖర్మ.. ఏకంగా కాళ్లే ఈజీగా మొక్కించేయచ్చు! కానీ ఆ స్వామిభక్తి పరాయణత్వం చచ్చు నియోజకవర్గం ప్రజానీకానికి ఉండి చావద్దూ! ‘నమ్మి అసెంబ్లీకి పమ్మిస్తే ‘ఇదేం వెన్నుపోట’ని నడిబజార్న పెట్టి నిలదీస్తేనో!
వెంకప్పగారీ సంకటంలో ఉండగానే గది తలుపులు ధడాల్మని ఊడిపడ్డయ్!
ఈ.డీ గాడా? సి.బి.ఐ వాడా? ఉలిక్కిపడి చూస్తే ఈ రెండూ కాడు. కూతురు మొగుడు! తన పాలిట యముడు. ఆ యములోడి పక్కనే మెడ లోడ్ గార్లండ్సుతో మెలికలు తిరుగుతో అతగాడి డార్లింగు!
' అరేఁ! అల్లుడుగారూ! ఆ మెడ నిండా పూల దండలెందుకమ్మా బంగారూ! ఆషాఢ పట్టీ మాసం వచ్చేసిందనేనా ఈ కంగారూ ?’ వెంకప్పగారి శంక.
' సారీ మాంగారూ! నో.. నో.. మాజీ మాంగారూ! మీ బేటీ కాదీ బంగారు. ఆ కాకి బంగారా న్నెప్పుడో వదిలిబెట్టేసాంగా! కారణం ఆషాఢం పట్టీ.. ఆకాశం ముసురు పట్టీ కాదు మాజీ మామాజీ! ఈ పూల దండల వెనకున్న చంద్రబింబం పైన పిచ్చగా మనం మోజు పడ్డం! ఈ సింగారి చెయ్యి పట్టుకోవాలంటే మీ బంగారి మోకాలు అడ్డం!’
పిచ్చి కోపంతో రెచ్చి పోయారు వెంకప్పగారు.
' నాతి చరామి' అంటూ పెళ్ళినాడు మరి మా పిల్లకు తమరిచ్చిన మాటో?’
' ధర్మపన్నాలా! మరి దిబ్బలగూడెం జనాలకు ఎన్నికలప్పుడు తమరిచ్చిన హామీ? పవరున్న పార్టీలోకి తమరిప్పుడు వేసే గంతు .. ఏ ప్రజా సేవకో సెలవిస్తారా వెం.. కప్ప స్వామీ?’
వెంకప్పగారు నోరు కప్పలా తెరుచుకుంది.
***
' కెవ్వు..కెవ్వు!’ కేకలు. ఆ వెనకనే ఏడుపులు.. పెడబొబ్బలు!
ఏడుపులు కింద పడ్డ బిడ్డవి. పెడబొబ్బలు కంగారు పడ్డ బిడ్డ తల్లివి. అయిదో నిమిషంలో అంబులెన్స్ ప్రత్యక్షం! క్షణాల్లో సీన్ ఛేంజ్.
***
‘ఒన్ నాట్ యైట్ ‘లో వెంకప్పగారి బంగారి పాప.. యములాడితో మెగా ఫైటు చేసేస్తోంది.
‘డైవర్!..డ్రైవర్! అర్జెంట్.. అర్జెంట్! అపోలో.. అపోలో!' వెంకప్పగారి అరుపులు.
ఆ అరుపుల్లో ‘అలోపతి.. అప్పలాచారి..’ అన్న రెండు ముక్కలు తప్పించి డ్రైవర్ గారు స్పష్టంగా ముక్కిందేమీ వినిపించింది కాదు.
ఐనా వెంకప్పగారు అలా ఇలా తాలాడించేసారు!
అరగంట తరువాత .. అంకం.. అప్పలాచారి డిస్పెన్సరీ.
మూలికలు, మండలు, కషాయాలు, నూనెలు, కల్వాల్లో చూర్ణాలు నూరే చప్పుళ్ళు తప్ప మరేవీ వినిపించడంలేదు ఆపరేషన్ థియేటర్ నుంచి!
మరో మూడు గంటల నిలువుకాళ్ల జపం తరువాతే.. వైద్యనారాయణుడి దర్శనభాగ్యం.
' మనం చేసే మానవ ప్రయత్నాలన్నీ ఫినిషైపోయాయండీ పూర్తిగా! తులసి తీర్థం తెచ్చుకోండి … రోగి గొంతులో పోసుకుందురు తృప్తిగా!’
' చోద్యం. తులసి తీర్థమా? ఇదేం మాయదారి అలోపతి వైద్యం?’ గంపెడంత దుఃఖంలోనూ గయ్యిమంటం మర్చిపోలే వెంకప్పగారు.
' అలోపతా!? హలో! ఇక్కడ .. అద్భుతాలు సృష్టించే నెంబర్ వన్ ఆయుర్వేద జాతి!’ డాక్టర్ అప్పలాచారి సమాధానం.
' మోసం.. దగా! ఏడ్రా ఆ అంబులెన్స్ గాడిద? వాడా కూత ముందే కూసుండాలి గదా!’
' ముందే కూతలెయ్యడం.. ఆనక అంతా అపోలోలకి పరుగులెయ్యడం! అబ్బో! ఎన్ని చూసామండీ బాబూ మీ లాంటి తొండి కేసులు! కోట్లు తగలేసామండీ ఎం.డీ చదువులకీ, ఈ మందుల కొట్టు కట్టడానికి! ఆ లాసులేవీ పూడ్చుకోవద్దని ఏ బైలాసులో రాసుందో.. ముందు చెప్పండి! అబ్బో! ‘మోసం.. మోసం’ అంటూ అంతలా ఆయాసం వద్దబ్బా! దిబ్బలగూడెం జనాలకంత సునాయాసంగా సున్నం పెడుతుందెవరో చెప్పు ముందు వెం.. కప్పా! మహా గొప్పగా పొడిచేస్తారని కదా ప్రజానీకం తమర్ని ఎన్నుకున్నది! ఆ అమాయకులకి ఎందుకయ్యా మరి వెన్నుపోటు పొడిచేస్తున్నది? హ్హి..హ్హి..హ్హీ! తమరే స్వామీ స్వచ్చమైన నమ్మక ద్రోహికి అచ్చమైన హాల్ మార్క్!’
కె.డి.వి.కప్పగారు షాక్!
ఒన్స్ మోర్ సన్నివేశం ఛేంజ్!
***
పంజగుట్ట పోలీస్టేషన్ ఫోన్.
' సార్! ఈ గాడిద కొడుకు మీ కొడుకేనా? మొక్కట్లు చూస్తే ముమ్మూర్తులా మీవే! గోడ దూకుతుంటే.. అదే సార్.. పేకాట క్లబ్ గోడ.. దూకుతుంటే పట్టేసుకున్నాం! అహఁ! గోడలు దూకే రకం కదా.. అందుకనే అడుగుతున్నాం’
పోలీసు బలగం రాబట్టిన వివరాలను బట్టి మాజీ వి.ఐ.పి - కె.డి.వి.కప్పగారు తాజాగా గజం జాగా అయినా తల దాచుకునేందుకు లేనంతగా దివాలా తీసిన వి.పి!
అబ్బ అడ్డదిడ్డంగా మేసి కూడబెట్టిందంతా బిడ్డ బెట్టింగుల్లో పెట్టి తగలేసినట్టు రెండు తగలంగానే బైటపడ్డది గుట్టు. నెత్తి మీద సత్తు కాణీ పెట్టినా అర్థ కాణీ చెయ్యని అర్భక సన్నాసి.. సన్ ఆఫ్ కె.డి.వి.కప్ప హోదాలో అదనంగా కొన్ని లక్షలు చేసే అప్పుపత్రాల పైన అప్పనంగా సంతకాలు కూడా దర్జాగా గిలికేసాడు!
' అంత లేసి హక్కులు నీ కెక్కడివిరా అబ్బీ?’ అని దబాయిస్తే ‘దాన వినిమయ విక్రయాదులతో సహా సంపూర్ణ హక్కు భుక్తాలన్నీ నీ యావదాస్తుల పైన నువ్వే నాకు ఇచ్ఛాపూర్వకంగా పూర్తి స్పృహలో ఉండి మరీ ధారాదత్తం చేస్తివిగా తండ్రీ! నా కాలేజీ దరఖాస్తులని సంబరాలు పడుతూ తమరు బరబరా గిలికేసిన సంతకాలన్నీ లాయర్లు పక్కాగా తయారు చేసిన అస్తిపాస్తుల దస్తావేజులే పిచ్చి డాడీ!’ అంటూ కూసాడా ‘గాడిద’ కొడుకు.
' కన్న తండ్రిని! నా మీదట్రా.. నమ్మించి ఇంత కుట్ర! ఛీఁ.. ఛీఁ! సిగ్గనిపించలేదుట్రా.. త్రాష్టా!’
' దిబ్బలగూడెం జనాలూ నిన్నిప్పుడిట్లాగే తిట్టుకుంటున్నారు అబ్బా! నిజం చెప్పనా! నీ బిడ్డగా పుట్టినందుకే నాకిప్పుడు ఎక్కువ సిగ్గేస్తోంది నాయనా!"
' నిజంగా వీడు నా కడుపున పుట్టిన బిడ్డేనా.. సతీ సావిత్రీ?
కుప్పకూలిపోయారు శ్రీమాన్ కె.డి.వి. కప్పగారీ సారి. సీను మారిందింకో సారి.
***
' సారీ స్వామీ! ఇప్పటికైనా నిజం కక్కకపోతే నా బతుక్కిక నిష్కృతి లేదు నాథా!’
వెక్కి వెక్కి ఏడుస్తోంది పక్కనే పక్కలో పడుకునున్న సతీ సావిత్రీదేవి.
' ఏవిటే సావిత్రీ.. నీ బతుక్కంత నిష్కృతి లేని ఆ నిజం?' బితుకు బితుకు మంటూ చూసారు వెంకప్పగారు వైఫు వైపు!
' నా కడుపున కాసిన కాయల్లో ఒకటి.. ఒకే ఒకటి.. మీ రక్తం పంచుకు పుట్టలేదేమోనని.. అనుమానంగా ఉందండీ!’
' ఒకరు నా రక్తం పంచుకుని పుట్టలేదా?! ఈ దౌర్భాగ్యంలో కూడా మళ్లీ సస్పెన్సా? ఎవరే సావిత్రీదేవీ ఆ ఒహ్.. ఖరూ?’ విలవిలలాడిపోతున్నారు వెంకప్పగారు.
' ఏమోనండీ.. ఎంత గింజుకున్నా సమయానికి గుర్తుకొచ్చి చావడం లా! రెండు పుష్కారాల కిందటి మూడ్సూ.. ముచ్చట్లాయ! ఏ పుణ్య పురుషోత్తముడి ప్రేమ ఫలమో! గుర్తొస్తే కనీసం పేరైనా చెప్పిచావనా! నన్ను నమ్మండీ!’
' నిన్నా? నమ్మటమా?’
' భగవంతుడా! ఏ ఆడదానికీ రాకూడదయ్యా ఇంతటి కష్టం’
కుళ్లి కుళ్లి ఏడిచే అర్థాంగిని చూసి నవ్వాలో.. ఏడ్వాలో.. అర్థం కాని పరిస్థితి గౌరవనీయులు వెంకప్పగారిది.
' ఇప్పటి దాకా దాపెట్టిన ఆ గుట్టు ఈ వయసులోనుటే నా గుప్పెట్లో పెట్టేదీ.. తప్పుడుదానా!’
అగ్గి బరాటా అయిపోయింది సతీ సావిత్రి ‘ఐనా తప్పంతా నా ఒక్క దానిదేనా హనీ! పెళ్లిచూప్పులకని వచ్చి మిర్చి బజ్జి నచ్చిందని కదా నన్ను చేసుకుంటిరి తమరు? ఛీ! ఎంత సేపూ సొంత కడుపు కక్కుర్తే! ఎత్తు కడుపు వైఫు ఎంత సేఫో ఆలోచించంది ఎవరూ?’
'తాళి కట్టిన వాడికి ఇలా ద్రోహం చేసింది చాలక..'
' ఆగండక్కడ! తమరు చేసే ద్రోహాల ముందు నా దోషం చీమ తలంత. ‘నరకాలు నాశనం చేస్తా.. స్వర్గాలు సృష్టించిపారేస్తా!’ అంటూ తుపాకీ రాముళ్లా మాటలు గుప్పిస్తేనే గదా దిబ్బలగూడెం నియోజకవర్గమంతా మిమ్మల్నంతలా ఆదరించింది! తమ పక్షమే అని జనం నమ్మబట్టే తమరు గెలిచి ఎమ్మెల్యే అయింది . జనం ప్రయోజనాలు తమరన్నీ పూర్తిగా మరచిపోయారు. సొంత లాభాల కోసం ఇప్పుడు కప్పల్లా సర్కారు తక్కెట్లో తూగేందుకు తయారయ్యారు ! తమరు మాట జారడమేమో మహా పుణ్య కార్యం! నేను కాలు కొద్దిగా జారడం మాత్రం కిరాతకమూనా!’ అమ్మోరిలా విరుచుకుపడింది సతీ సావిత్రి.
ఉలిక్కిపడి గభిక్కున లేచి కూర్చున్నారు వెంకప్పగారు. నిద్ర మొత్తం తేలిపోయింది. ఇప్పటి దాకా తాను కన్నవన్నీ వట్టి పీడకలలేనని తేలిపోయింది. వెంకప్పగారి మనసు తేలికయింది.
***
' తేలికవడానికి కారణం పీడకలల నుంచి బైటపడ్డం కాదప్పా! పీడాకారపు శరీరాన్నుంచి బైట పడ్డం! చచ్చినా భలే గుర్రు కొడ్తున్నావే! ఇదేవఁన్నా తమరి అసెంబ్లీనా సామీ! లే! నరకం కావాలా? స్వర్గం కావాల్నా? తొందరగా తెముల్చు’ గంభీరమైన ఆ గొంతు విని తానిప్పుడున్నది వేరే లోకాల కెళ్లే దారులు చీలిక దగ్గరని బుర్రకెక్కింది వెంకప్పగారికి.
ఎదురుగా యమ భటులు.. దేవ దూతలు!
' ఎవడ్రా నన్నిట్లా చంపుకొచ్చింది అన్యాయగా! చంపవతల పారేస్తా! కంటి ముందుకు రండొరే ముందు.. గుండెల్లో దమ్ముంటే!’ వెంకప్పగారి వీరావేశం.
' ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టిన మొదట్రోజునే తప్పు చేసావు వెంకప్పా! అందుకే నీకీ దిక్కుమాలిన చావు. సభాపతి సమక్షంలో చేసిన ప్రమాణ ప్రమాణ స్వీకార పాఠం గుర్తుంటే చెప్పు?’
' కప్పదాటు వెంకప్ప అను నేను దిబ్బలగూడెం నియోజక వర్గ ప్రజల ఆంకాక్షల మేరకు నిస్వార్థంగా కర్తవ్యం నిర్వహిస్తానని, నా ప్రజల యొక్క హక్కులకు భంగం కలగనీయనని, భయ రాగ ద్వేషాలకు అతీతంగా భారత రాజ్యాంగానికి లోబడి పని చేస్తానని దైవం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను'
' దేవుడి సాక్షిగా చేసిన ప్రమాణం. ఆ బెదురైనా లేదేమప్పా మీ ప్రజాప్రతినిధులకు.. విడ్డూరం ! నిధులు, నీళ్లు, నియామకాలనేవి ప్రజాస్వామ్యంలో నిజానికి జనాలకు మాత్రమే చెందిన వనరులు. అధికారం దక్కితే వాటాలప్పుడు తమకన్యాయం జరగకుండా కాపాడతారని, ప్రతిపక్షంలో కూర్చున్నా తమ పక్షానే పోరాడతారని పౌరుల ఆరాటం. ఆ ఆశతోనే కదా ఓటర్లంతా పొలోమని పోలింగ్ బూతులకట్లా పరుగెత్తేది! అర్థరాత్రి, అపరాత్రన కూడా సరకు చేయరే ముసలీ ముతకా ఓటేసే వరకు! ఇంత నమ్మి మిమ్ముల్ని చట్టసభలకు పమ్మిస్తే.. సొంత లాభం తప్ప మరేమీ పట్టదా వెంకప్పా మీ కప్పగంతుల నేతలకు? గోడ దూకుడు మీదనేనా ఎప్పుడూ ధ్యాసంతా? జనం గోడు పట్టని పాడు పాలిటిక్సులోకి పనిమాలా దేవుణ్ని కూడా ఈడ్చుకొస్తున్నారు చూడు.. ఇట్లా ప్రమాణ స్వీకారాల వంకతో! ఆ దైవ ద్రోహానికే నీకీ అర్థాంతరం చావు. అర్థమయిందా? మళ్లా ఎన్నికల దాకా ఓడ మల్లయ్యల్ని నువ్వు బోడి మల్లయ్యలను చేయచ్చేమో కానీ.. తన పేరు మీద నమ్మక ద్రోహం చేసిన నేరానికి దేవుడైతే అస్సలూరుకోడు! ఏ ఎన్నికల కోడుతో శిక్షలు తప్పించుకొనే వెసులుబాటు ఈ పైన బొత్తిగా లేదు..
తలొంచుకున్నారు కప్పదాటు వెంకప్పగారు.
' ప్రాయశ్చిత్తం చేసుకునే ఉద్దేశముంటే చెప్పు. మరో ఛాన్స్ ఇచ్చేందుకు నేను సిద్ద్జం. మీ లోకానికి తిరిగి పో! గెలిపించిన పార్టీకే తిరిగి మళ్లిపో! సొంత లాభం కోసం కాదు ప్రజాప్రాతినిధ్యం. అధికారంలో ఉన్నా ప్రజలందరి సంక్షేమం నీకు సమానంగా ప్రధానం . అధికారం లేకున్నా ఆ సమసంక్షేమం కోసం పోరాడడం ప్రతిపక్షంగా నీ ధర్మం. ప్రజాస్వామ్యం అంటే కప్పల తక్కెడ కాదు. ముందది మనసుకు ఎక్కించుకోడం ముఖ్యం!’
రెండు చేతులు జోడించి తలాడించేసారు కప్పదాట్ల వెంకప్పగారు.
గభాలున మెలుకవ వచ్చింది వెంకప్పగారికి. సీను మారింది మళ్లీ!
గిచ్చుకుని చూసుకుంటే తెలిసొచ్చింది ఇదే అసలైన వాస్తవ జీవితమని.
పక్కనున్న సెల్ ఫోన్ పదే పదే మోగుతున్నది. నెంబరు చూస్తే అధికార పార్టీ మధ్యవర్తిది. అప్పటి దాకా తను తహ తహ పడ్డది.
క్లైమాక్సు సీనులో భగవంతుడొచ్చి చేసిన బోధనంతా మళ్లీ గుర్తుకొచ్చింది!
సెల్ ఫోన్ అందుకున్నారు కె.డి.వి.కప్పగారు. 'గోవిందా.. గోవిందా అందామయా.. రావయ్యా.. రావయ్యా.. రావయ్యా.. రావయ్యా !' అంటూ అదే పనిగా గీ పెట్టే సెల్ ఫోన్ పీక నొక్కి ఓ పక్కకు గిరాటేశారు కప్పదాటు వెంకప్ప గారు!
ఆయన మనసంతా ప్రశాంతంగా ఉందిప్పుడు*
- కర్లపాలెం హనుమంతరావు
( కౌముది అంతర్జాల పత్రిక కథల పోటీలో బహుమతి గెల్చకున్న కథ )
No comments:
Post a Comment