ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం
భద్రం నాయనా!
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు ప్రచురితం 05 - 09- 2016 ప్రచురితం )
'వినాయకా! చవితి శుభాకాంక్షలు నాయనా!'
మరి నేనో తొమ్మిది రోజుల పాటు భూలోకంలో పర్యటించి రానా? భక్తబ్బం దాలన్నీ ఎదురు చూస్తున్నాయంటూ పొద్దుట్నుంచీ ఒహటే సందేశాలు చరవాణిలో!'
'భద్రం లంబోదరా! వెళ్ళేది జంబూ ద్వీపం. జెంబో జెట్టులెన్నున్నా పట్టనన్ని భక్త బృందాలు ఉన్నాయి నీకు! ఈ పాటికే భారీగా విరాళాలు పోగయి ఉంటాయ్! నూలుపోగైనా నోచుకోని బీదా బిక్కీ బోలెడంతమంది నా బాబూ నీ భక్త బృందాలలో ! వారిని ఇబ్బంది పెట్టే విధంగా ధరాతలం మీద ధరలెలా మండిపడుతున్నాయో తెలుసా? నీకేమో ఇరవయ్యొక్క పత్రుల్లో ఏ ఒక్కటీ తగ్గ
కూడదాయె పూజా పునస్కారాలకి! '
' చిట్టి చట్టి మూసలో ఇంత మట్టి వేసి తీసినా నీ ఆకారం మహా బాగా తయారవుతుందే! ఆ అంతులేని అడుగుల ఎత్తు విగ్రహాలతో అంత హడావుడి అవసరమా? అందునా కృత్రిమ రంగులు! వాటి పులుముళ్లతో నీ దేహం ఏమవుతుందో ఏమో! పర్యావరణం గురించి పట్టని నీ భక్తుల్లో కొందరివల్ల నీ ఒంటికే మవుతుందోనని బెంగగా ఉంది గణపతీ! జరంత భద్రంగా ఉండాలి నాయనా!'
' ఉండ్రాళ్లు... వడపప్పు... పానకాలు కనిపిస్తే చాలు నీకు ఒళ్లు తెలీని పూనకాలు ! కళ్ళు మూతలు పడేవరకు ఆరగించి ఆనక నడుం గుండ్రంగా తయారైందని దిగులుపడతావు! 'జీరో సైజు' నీ వల్ల అయ్యే పని కాదు గాని... ఏ ఫిజియోథెరపీ కంపెనీనో నాలుగు ఉండ్రాళ్లు ఆశచూపించి, తమ తరుపున ప్రచారం చేయ మంటే... 'నో' చెప్పేసెయ్ ! పుసుక్కుమని ఒప్పేసుకొని రాకు సుమా! తప్పుడు ప్రకటనలలో పాల్గొంటే తంటాలు తప్పవంట ఇప్పుడా దేశంలో . కాస్తంత కింద చూసుకొని నడుస్తుండీ తొమ్మిది రోజులు!'
'బాలాపూర్ లడ్డుండల సైజు చూసి భక్తులంతా కుబే రుడి పుత్రులు అనుకోకు ! నిరుపేదలే ఎక్కువ నీ భక్త సమూహాలలో ! నువ్వేదో వచ్చి వరాల వర్షాలు కురిపించేస్తావని మోరలె త్తుకొని మరీ ఆశగా ఎదురుచూస్తున్నారు జనం . అరచేతిలో కైలాసం చూపించి రావడం పచ్చి మోసం. గుర్తుంచుకో! పోయినసారి చవితికి ఇచ్చొచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయో ఓసారి పరిశీలించుకో!'
'రియో ఒలింపిక్సులో ఓడొచ్చిన కచ్చలో ఉందిప్పుడు ఆసేతు హిమాచలమంతా! వచ్చే ఒలింపిక్సన్నింటిలోనూ వరస బెట్టి స్వర్ణాలు తెచ్చే ఛాంపియన్ల వేటలో ప్రస్తుతముంది. కొత్తగా ఏర్పాటయిన వెతుకులాట సంఘం.. నిన్నూ ఉబ్బేసి చేతికో 'పోల్ జంప్' గడకర్ర ఇస్తే పొంగిపోయి ఒప్పంద పత్రంమీద సంతకం గిలికి రాకు! ఆనక మీ చందమామయ్య ఎగతాళ్లకు దిగాడని అనమాకు.. గణపతీ! జర భద్రం!'
'అవునూ!నీ ఒంటికింత సింగారం అవసరమా బంగారూ! భద్రాద్రి సీతమ్మవారి నగానట్రకే భద్రత లేకుండా పోయిందిట కింద. జాగ్రత్త వినాయకా!
'చవితి వచ్చీ రాగానే చెంగు చెంగున కిందకు పరుగులెత్తుతావు ! పోతే పో ! కానీ.. నీ మూషికం గుంటూరు ధర్మాసుపత్రిలో చేసిన నిర్వాకం ఇంకా పోలీసు ఠాణా విచారణ దశలోనే ఉంది! కందిపప్పుకు బదులు పసికందుల్ని మెక్కుతార్రా ఎంత తిండిగింజలకి నకనకలాడుతున్నా! పోలీసులు కేసు నీ మీదకు మళ్ళించవచ్చు ... ఆచితూచి అడుగెయ్యి.. నువ్విప్పుడు చిన్న కూచివి కాదు నాయనా!'
వెళ్లేది ఖైరతాబాదు! ఆ ట్రాఫిక్కు ఎలా తట్టుకుంటావో ? హెల్మెట్ లేదంటూ వ్యాను డ్రైవరు. పైనా కేసులు రాసేస్తున్నారట ! ఎలుకా వాహనమే.. డ్రైవింగు లైసెన్సు తప్పనిసరిగా తీసుకో!.. ఎక్స్ పైరవీ అవీ కుండా సావధానం సుమా! ఆదిదేవుడి ప్రథమ సంతానం అంటే అర్ధమవుతుందో లేదో... గుర్తింపు కార్డొకటి సంపాదించుకుని పో... ! బ్యాంకు ఖాతాలో సున్నా బ్యాలె న్సున్నాసరే.. ఆదాయపన్ను వాళ్ల పాన్ కార్డు తప్పని సరి నాయనా! పన్ను పీకే శాఖ పట్ల జర భద్రం బిడ్డా! ఉన్నదే ఒక్క పన్ను ముందు నుంచీ నీకు!
' నీ పండగంటే తెలుగు హాస్యగాళ్లకందరికీ . . రేఖాచిత్ర కామలకీ నిజంగా పండుగే ! ఫేసుబుక్కుల్లో.. వాట్సప్పుల్లో వాళ్ల రాతలు చూసి ఉడుక్కోకేం . అచ్చు పత్రికల్లో వాళ్ల గీతలు చూసి ఉలిక్కిపడొద్దులే! ఏడాది పొడుగూతా ఏవేవో ఏడుపులు.. పెడబొబ్బల జీవితాలే కదా.. పాపం.. బీదా బిక్కీ జీవులవి! నీ చలవవల్ల అయినా ఈ తొమ్మిది రోజులు చల్లంగా.. నవ్వుకోనివ్వు బొజ్జ వినాయకా!'
' అన్నట్లు ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం కూడా! ఆది గురువువి. అందుకూ నీకు మరోసారి శుభాకాంక్షలు గణపతీ! మానవత్వానికి కులం.. మతం.. ప్రాంతం.. అనే తేడా లేవీ లేవని.. మా ఆదిదంపతుల మాటగా కూడా మన భక్తులందరికీ నచ్చ చెప్పి రా! లాభంగా కాకపోయినా.. క్షేమంగా తిరిగి వస్తే మళ్ళీ చవితివరకూ నాకూ.. మీ నాయనకు మనసు నిండా శాంతి.
- కర్లపాలెం హనుమంతరావు
( 05 - 09- 2016 ప్రచురితం)
No comments:
Post a Comment