Wednesday, December 8, 2021

ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం ఎపి ' రియల్ ' పూల్ - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 01 - 02 - 2003 )




ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం 

ఎపి ' రియల్ ' పూల్ 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 01 - 02 -  2003 ) 


ఎనిమిదో శతాబ్దంలో రోమ్ సామ్రాజ్యాన్ని కాన్స్టాంటైన్ అనే రాజు పరిపాలించే రోజుల్లో పౌరులకొక పెద్ద సమస్య వచ్చి  పడింది. ఆవుపాలు పొదుగుల్లో నుండి  ఎఱ్ఱబారివస్తున్నాయి. అరిష్టమని ఆందోళనపడటం ప్రారంభించారు జనం. మేధా వులు పరిష్కారం మాటలా ఉంచి కారణమే కనుక్కోలేక బుర్రలు గోక్కున్నారు . రాజుగారికేం చేయాలో పాలుపోలేదు. ఆయన కొలువులో 'క్లూగెల్' అనే విదూషకుడున్నాడు. విషమపరిస్థితుల్లో సమస్యల్ని పక్కదారి పట్టించేందుకు వినోదం కలిగించటమే అతని ప్రధానమయిన పని. ఎల్ బ్రెల్  అనే ప్రజాభిమానంగల నటికి నున్నంగా గుండు కొట్టించి ఊరేగించమని సలహా ఇచ్చాడు. ప్రజాగ్రహం పక్కదారి పట్టిందాకా నిదానించి ఆనక తీరిగ్గా ఆ నటి చేత 'చుండ్రు ఉండటంచేత నేనే ఈ గుండుకొట్టించుకున్నది ' అనే ప్రకటన ఇప్పించాడు. అప్పటికే వేలాదిమంది వీరాభిమానులు నిరసన తెలియ చేస్తూ స్వచ్ఛందంగా బోడిగుండ్ల బేచీలలో  చేరి ఉన్నారు. చాలాకాలం వారి గుండ్లు జనం వినోదానికి కారణమయ్యాయి. గాలిమారి పాలు మళ్ళీ తెల్లగా వచ్చిందాకా ఈ తంతును అత్యంత లాఘవంగా నడిపించి నందుకుగాను  రాజుగారు విదూషకుడికి పారితో షికంగా ఒక్కరోజు పట్టాభిషేకం చేశాడట. ఇది జరిగి ఈరోజుకి సరిగ్గా పన్నెండు వందల ఏళ్ళయింది. '


' నమ్మచ్చా ఇదీ ఏప్రియల్ పూల్లోని భాగమా?' 


'బోస్కిన్' యూనివర్సిటీ ప్రొఫెసర్ జోసెఫ్ గత శతాబ్దంలో పరిశోధనలు చేస్తూ ఈ విషయాలన్నీ బైట పెట్టాడు. అందుకే ఈ రోజు ప్రపంచంలోని విదూషక మేధావులందరూ కలిసి క్లూగెల్ స్మారకార్ధం  ఇందాకటిలాంటి స్టేట్ మెంట్లు కొన్ని ప్రచారం చేస్తున్నారు.' 


' నమ్మచ్చా ! నవ్వచ్చా ! నవ్వితే ఏప్రిల్ పూలంటారేమో! నమ్మకుంటే మెంటల్ అంటారేమో!' 


' పోనీ... బుష్ ఒక వంక ప్రజాస్వామ్య పరిరక్షణకోసం కొన్ని వందలకోట్ల డాలర్లు నీళ్లలా ఖర్చుపెట్టి ఇరాక్ ను  ధ్వంసం చేస్తున్నాడు - అంటే  నమ్ముతావా? !పునర్నిర్మాణం కోసం ఇంతకు రెట్టింపు ఖర్చు చేస్తానని హామీ ఇస్తే నవ్వుతావా?! 


సౌతాఫ్రికాలో క్రికెట్ ఫైనల్ చూడటానికి అంతెత్తున్న విమాన

మెక్కి పోవాలని ఉత్సాహపడ్డ మన ప్రధాని కాశ్మీర్ లో  పండిట్లు ఊచకోతకు గురైతే రాజధాని నుంచే  విచారం ప్రకటిం చేసి మోకాలు నెప్పని ఊరుకుంటే- నమ్ము తావా? ! నవ్వుతావా? ! 


ఆత్మహత్యకు పక్క రాష్ట్రం లక్ష ఇస్తుంటే... మేం హత్యకు రెండు మూడు లక్షలిస్తున్నామని పునరావాసశాఖ తరపున మన ముఖ్యమంత్రిగారు సగర్వంగా ప్రకటిం చుకుంటుంటే నమ్ముతావా?!... నవ్వుతావా?! 


సలక్షణంగా డిగ్రీలున్న డాక్టర్లు కు.ని. ఆపరేషన్లు చేయలేక ఆపసోపాలు పడుతుంటే ఏ పట్టాలేని నకిలీలు పట్టపగ్గాల్లే కుండా పొట్టలు పరఫరా కోసిపారేస్తున్నారంటీ  నమ్ముతావా?! నవ్వుతావా? !


జాతీయ జెండా పైనుండే రంగేదో కూడా తెలియని నాయకులు డెబ్బై ఏళ్లు ఇప్పటికే దేశాన్ని ఏలిపారేసి .. కనీసం ఇంకో డెబ్బై ఏళ్లయినా ఏలాలని 

ఉవ్విళూపోతున్నారంటే పూలయితే నమ్ముతాం. మెంటలయితే నవ్వుతాం. 


ఒక్క వీరప్పన్ను పట్టుకోటానికి రెండు రాష్ట్రాల పోలీసు బెటాలియన్లకు పన్నెండేళ్ళ న సమయం చాలటంలేదు. ప్రత్యూష మరణం మిస్టరీని మాత్రం పోస్టు మార్టం కన్నా ముందే తేల్చేసిన  పోలీసులు ప్రతిభను చూసి నమ్ముతావా? నవ్వు తావా?! .. చెప్పు'


ఆకాశంలో సగభాగు మాదని ఊదర గొట్టే ఆడవాళ్ళకు శాసనసభలో మూడోవంతైనా సీట్లివ్వటానికి పార్టీలు కొన్నేళ్లుగా చేసే ఆగం చూసి నమ్ముతావా?? నవ్వుతావా?! 


యాగాలు చేస్తే ఆటల్లో గెలుస్తారనీ. యోగాలు చేస్తే ఎమ్మెల్యేలు మారతారని, రొట్టెలు పట్టుకుంటే  కరపు మాయమవుతుందనీ... విగ్రహాలు పాలు తాగుతాయని, పసరు పిండితే పెట్రోలు కారుతుందనీ.. చెయ్యి ఊపితే విబూది  రాలుతుందనీ నమ్ముతున్నప్పుడు తప్పా?! చెప్పు ఇదిమాత్రం నమ్మితే తప్పా చెప్పు! 


కులాతీత మతాతీత సర్వసత్తాక ప్రభుత మనదని ఘనతరమైన పదాల గారడీతో నాయకులెంత ఊదరగొట్టినా కులం పేరుతోనో, మతంపేరుతోనో ధను అండచేరి మురాలు కట్టే వాళ్ళకి తప్ప ఓటేయలేని మన చేతగాని తనానికి నవ్వుదామా... ఏడుద్దామా!


ఏప్రిల్ ఫస్టని నేనిప్పుడొచ్చి కొత్తగా పూల్ చేసేందుకేంలేదు భాయీ! బడ్జెట్ మార్చిలోనే వచ్చి ఆ ముద్దులు  ఇచ్చేసింది . లేదంటే రేపొచ్చే ఉగాది ఆ ముచ్చటా తీర్చేస్తుంది


ఇడియట్ అని తిట్టినా అదేదో సినిమా బిరుదని పొంగిపోతాం మనం. ఇడియట్ బాక్సుని నట్టింట్లోనే పెట్టుకు మురిసిపో తుంటుందీ జనం!


పేలని బాంబుల్ని చూసి భయపడి పేలే బాంబులసలు పట్టించుకోం.. వేరే ఎవరో వచ్చి ఏప్రిల్ ఫస్టుకే పనిగట్టుకొని మనల్ని ఫూల్ చెయ్యటమెం దుకు... ఫస్టు మనకి మనమే ఆపని చేసు కుంటాం కాదా! 


పిలిచి నెత్తిమీద చేతులేయించుకొనే దేవుడిని కొలిచే బోళాభక్తులం మరి మనం. 

అందుకే గిరీశం మనవాళ్ళొట్టి వెధవాయలోయ్' అంది. రామాయణంలో పట్టాభిషేకమప్పుడు లక్ష్మన్న ఫెళ్లున నవ్విందీ అందుకే. ' అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయిష '  కొండుభట్లు  ఊరికే అన్నాడా? 


'మూర్ఖస్యనాన్యౌషధమ్' అన్నాడు భర్తృహరి.  ప్రేమికులకి వేలెంటైన్స్ డే,  శ్రామికులకు వర్కర్స్ డే... ఇలా. అందరికీ విడివిడిగా ఎన్ని డే లున్నా  అందరూ కలిసి సందడిగా ఉండేదుకు మాత్రం వీలైంది మాత్రం ఒక్క మన 'ఆల్' ఫూల్స్ డేనే- అంటే నమ్ముతావా ? నవ్వేసి వెళ్లిపోతావాతా ?' 


' పూలు ' కు  భాషా భేదం  లేదు. ఇంగ్లీషు ఫూలుకు  హిందీ ' ఫూల్' సింబాలిక్  అయితే  తెలుగువాళ్ళం ఆ పూలని చెవుల్లో దోపుకుని  మరీ 'చవటాయను నేనూ... నీకన్నా పెద్ద చవటాయను నేనూ'  అని పాట కూడా అందుకుంహాం ! 


మనం ఏపి రియల్ పూల్సుం! అందుకే ఏడాది పొడుగూతా టోపీల పండుగ జరుపుకొంటూనే ఉంటాం.



- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 01 - 02 -  2003 ) 

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...