Sunday, December 12, 2021

ఉల్లాసరసం- కర్లపాలెం హనుమంతరామ


 గోచిపాత సంరక్షణార్థం సంసారమనే గోదారిలో దూకి ఈదలేక ఇడుములు పడ్డ వెర్రిబాపడి కథ చెవినబడినంతనే చిన్నాపెద్దా తేడాలేకుండా అందరి పెదాల మీద ముందుగా  విరిసేవి మందహాస అరవిందాలే! 'పరిహాస ప్రసంగం’లేని వాక్యా'న్ని ప్రాచీనసాహిత్యమూ నిరసించింది. సంహితలనుంచి, బ్రాహ్మణకాలు. ఆరణ్యకాలవరకు వైదిక వాఙ్మయం నిండా ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. శ్రీ లలితాదేవి సౌందర్యవర్ణన సందర్భంగా పరమేశ్వరీదేవిని 'మందస్మిత  ప్రభాపూరమజ్జత్కామేశ మానస'గా అభివర్ణిస్తుంది  బ్రహ్మాండపురాణం..  హయగ్రీవాగస్త్య సంవాదం. శాస్త్రాలు, పురాణాలు ప్రసక్తానుప్రసక్తంగా చేసే ధర్మప్రబొధాలకు, నీతిప్రవచనాలకు సైతం చమత్కారం పై పూతగా గల   వృత్తాంతాలే ఉపరి బలం. హాసాన్ని హాస్యరసానికి స్థాయీభావంగా భావిస్తుంది ఆలంకారశాస్త్రం. అనుకూల, ప్రతికూల పరిస్థితుల్లో సైతం చెక్కుచెదరని ఆస్వాదయోగ్య స్థితి కలిగి ఉండటమే స్థాయీభావ లక్షణం.  నవరసాలలో శృంగార హాస్యరసాలకే ఈ స్థాయి ఉందని ‘ధ్వన్యాలోకం’ సూత్రీకరిస్తుంది. అందులో హాసరసానికి అగ్రతాంబూలమని ఆనందవర్థనుడి నొక్కిచెప్పాడు. 'రుద్రయశోభూషణం'కర్త విద్యానాథుడు  కృతక పలుకుబళ్ళకు, వేషభాషాదులకు హాసరస గౌరవం కల్పించినా.. అత్యాధునికత  ఆ తరగతిని నీచహాస్యం కింద 'ఛీ'కొడుతోంది. నేటిమనిషి తన స్వారస్య అవసరాలకు అనుగుణంగా హాసరసానికి ఎన్నో సగుణాత్మకమైన మార్పులు చేసుకొంటున్నాడు. మన తరందాకా ఎందుకు?  మద్యలో వచ్చిన ఆలంకారికుడు శారఙ దేవుడే నవ్వును 'ఆత్మీయం.. పరకీయం' అంటూ రెండుగా  విభజించాడు! లక్ష్య లక్షణాల చర్చలకు ఏముందిగానీ.. నవ్వొచ్చినప్పుడు లక్షణంగా నవ్వేసెయ్యడమే ఉత్తమ సంస్కారుల ముఖ్య లక్షణం. లక్షలు కోట్లు వెచ్చించినా దక్కని సౌభాగ్యం, ఆరోగ్యం ఉచితంగా పంచి పెట్టే హాస్యస్ఫూర్తిని ఒడిసిపడితే చాలు.. జీవితాంతం ప్రాణానికి తెరిపి.



 
మన ప్రాచీన కావ్యవాజ్ఞ్మయం సర్వస్వం ఈ దివ్యస్వారస్వ రసాధిదేవతకు  పట్టిన మంగళహారతి. శృంగార, హాస్యాలు ఆదిమకాలం నుంచి మానవజాతికి దగ్గరి బంధువులే.  హాస్యంతో చుట్టరికమయితే మరీ గట్టిది. 
ఆదికావ్యం రామాయణం నిండా ఉల్లాసభరితమైన  హాస్యోపకాండలే! 'రాముడి వద్దకు మిమ్ము నేరుగా మోసుకుపోతా'నంటూ అంగుష్ఠ రూపి ఆంజనేయుడి విన్నపం అంతశోకంలోనూ అశోకవనం సీతమ్మవారి నోట నవ్వుల పువ్వులు విరబూయిస్తుంది. 'నా యొడలు సేర్చినప్పుడు/ నీ యొడలెట్లగునొ దాని నీవెరిగెదు' వంటూ తిక్కన భాగపు భారతం నర్తనశాలఘట్టంలో సైరంద్రీవేషధారి భీముడిచ్చిన  హెచ్చరికలేవీ కీచకుడికి దుర్బుద్దికి ఆనవు కానీ..  ఆ కాముకుడికి ముందు ముందు పట్టబోయే పిడిగుద్దుల వడ్డింపులు ఊహకు తట్టి ఫెటేల్మంటూ చదువరుల పెదవులు విచ్చకుంటాయి! 
'నవ్వవు జంతువుల్' అని జాషువావంటి కవులెంతమంది అంటే ఏమిటిట! పశుపక్ష్యాదులతో, జంతుజాలంతో హాస్యప్రసంగాలు చేయించిన సరసహృదయం మనిషిది. ఓడి పాతాళంలొ పడివున్నా తనముందు దంభం ప్రదర్శించేటందుకు దేవేంద్రుడు పడ్డ పాట్లు చూసి గాడిద రూపంలో ఉండీ బలి పడీపడీ నవ్వేస్తాడు విష్ణుపురాణంలో. ఆనందరసాస్వాదన పైన గాడిదలకూ అంత  ప్రేముంటుంది మరి! 
రూపకాలలో వసంతకులు, ప్రహసనాలలో వికారులు, ఆస్థానాలలో విదూషకులు,  వినోదాలలో కేతిగాళ్ళు, ఆటపాటలలో వంతలు, జంతు ప్రదర్శనల్లో వింత   బఫూన్లు, చలనచిత్రాలల్లో హాస్యగాళ్ళు.. పప్పులో ఉప్పులు,, పాయసాన జీడిపప్పులు.  హాస్యరసం  అంతర్లీనంగా ప్రవహించని పక్షంలో  కరుణరసమే పరమ నీరసంగా ఈసడింపుల పాలవుతున్న  అభావయుగం ప్రస్తుతం నడుస్తున్నది. విరామమెరుగని వత్తిడి బతుకులకు హాస్యమే శ్రీరామ రక్ష అయిందిప్పుడు. 
వెన్నదొంగ కన్నయ్యను కన్నంలోనే పట్టేసుకుంటుంది భాగవతంలో యశోదమ్మ. 'వీరెవ్వరు శ్రీకృష్ణులు/ గారా! యెన్నడును వెన్నగానరట కదా!/చోరత్వం బించుకయును/ నేరరట ధరిత్రి నిట్టి నియతులు గలరే!'  అంటూ ఆ తల్లి చేత  తన  పట్టిని ఆటలు పట్తించి  మన మానసాలకు ఉల్లాసం కలిగిస్తాడు బమ్మెర పోతన! చలనచిత్ర దర్శకులు జంధ్యాల అన్నట్లు నవ్వడం ఈనాటి వత్తిళ్ల యుగంలో నిజంగా ఓ భోగమే. ఆవైభోగాన్ని ఉదారంగా జనావళికి పంచిపెట్టే  పోతన్నల వంటి అక్షరయోగులందరికీ అందుకే నిండు మనస్సుతో నమస్సుమాంజలులు అందించడం న్యాయం. 
నవ్వించడం ఓ యోగమయితే నవ్వులపాలయీ నలుగురితో కలిసి నవ్విపారేయడం మరింత ఉత్తమ యాగం!  'తమ్ము ఇతరులు పరిహసించి తమలోని తప్పులని బైటపెట్టినప్పుడు తమ తలనున్న బంగారు కిరీటం కిందపడునన్న దిగులు ఆ నాటి వారికి లేదు' అంటారు తెనాలి రామకృష్ణుని హాస్యాన్ని పరామర్శించే సందర్భంలో శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు. 'గ్రామము చేతనుండి, పరికల్పిత ధాన్యములింటనుండి శ్రీ /రామ కటాక్ష వీక్షణ పరంపరచె  గడతేరెగాక మా/ రామయమంత్రి భోజన పరాక్రమమేమని చెప్పవచ్చునా/స్వామి యెరుంగు దత్కబళ చాతురి తాళఫల ప్రమాణమున్'అంటూ శ్రీనాథకవి తాటికాయలంతేసి అన్నం ముద్దలు  ఆరగించే తన భోజన పరాక్రమం పైన కవిత్వం వెలగబెట్టినప్పుడు కించిత్తైనా కోపం తెచ్చుకోలేదుట  రామయమంత్రివర్య్లలు!  అంతులేని పెత్తనాలు  ప్రభుత్వ పరంగా చేతుల్లో ఉండీ  నోరారా నవ్వుకొనే హాస్యస్ఫూర్తిని మాత్రమే ప్రదర్శించారా పాలకులు.  ఆ సామరస్య సహనమే  నేటి నేతలకూ  తక్షణం నెత్తిన పెట్టుకోదగ్గ సులక్షణం.   పాలనలో లోపాలు రామరాజ్యంలోనే తప్పింది కాదు. పాలితులు నేరుగా కుపాలనను వేలెత్తి చూపలేని నిస్సహాయ స్థితుల్లో..  ప్రజాహితం కోరే బుద్ధిజీవులు ఏ కొందరో  హాస్యాన్ని.. వ్యంగ్యాన్ని ఆశ్రయిస్తుంటారు. ‘మహిష శతకం’ కాలంనుంచీ నడిచివస్తున్న ఈ నిరసన సంప్రదాయం. స్వీయవ్యక్తిత్వాన్ని ప్రశ్నించడంగా పాలకులు అపార్థం చేసుకోవద్దని హితవు చెప్పడమే ఈ  పాఠం ఉద్దేశమిక్కడ.  
విమర్శా  మల్లెపూల చెండుతో మోదినంత   సున్నితంగా  ఉంటేనే బావుంటుంది. శ్రీ శ్రీ సింధూరం మార్కు నవగీతం  జరుక్ శాస్త్రి 'మాగాయ, కందిపచ్చడి' కిందలాగా మారినప్పుడే పకాల్మని నవ్వొచ్చేది.  
'హాస్యమంటే చల్లని మంట' అంటాడు ఆస్కార్ వైల్డ్. గ్రీకుల నిర్వచనం ప్రకారమూ 'హ్యూమర్' పొడి తేమకు పర్యాయపదం. కళ్లను తడిపి.. గుండెను కుదిపి వత్తిళ్లనుంచి తెరిపిన పడవేసేదే ఉత్తమ హాస్య 'థెరపీ'. ఉత్తర రామాయణ నుంచి.. నేటి పత్రికల 'ఉత్తరాల కాలా'ల దాకా సర్వే సర్వత్రా సర్వమానవాళి ఆమోదం పొందుతున్నది   నిత్య జీవిత గత్తర్ల నుంచి  కనీసం ఒక్క క్షణం పాటైనా ఉపశమనమం కలిగించే  ఉల్లాసరసమే! 
-కర్లపాలెం హనుమంతరావు

తెలుగు సాహిత్యంలో హాస్యం- పుస్తకం: శేషేంద్ర వాహ్ ! తాజ్!!! సేకరణ ; కర్లపాలెం హనుమంతరావు


మన ప్రాచీనాలంకారికులు చెప్పిన నవరసాల్లో హాస్యం కూడా ఒకటి. హాసం అంటే నవ్వు. ఆ నవ్వును పుట్టించేదే హాస్యం. నవ్వు నాలుగందాల చేటని కొందరు నీరసవాదులు నిరసించినా, నేడు “నవ్వు” అన్నదానికి, ఆరోగ్యానికి చాలా మంచిదని గుర్తించడం వల్లే చాలా ఊళ్లలో ‘హ్యూమర్ క్లబ్స్’ వెలిసాయి. పనిగట్టుకుని రోజూ గంటసేపు నవ్వడం ఆరోగ్యం కోసమే అని ప్రకటన ఇచ్చేవాళ్లు ఎక్కువయ్యారు. అయితే ‘అతి సర్వత్ర వర్జయేత్’ కాబట్టి అదుపాజ్ఞలు లేని నవ్వు కూడా సమర్ధనీయం కాదు. ప్రసన్నమైన చిత్తవృత్తిని ప్రకటించే చక్కని సాధనం నవ్వు. వాగ్గతమైన హాస్యం ఆరోగ్య ప్రదాయిని..
నవ్వించడమనేది సృజనాత్మక కళ. సంస్కారయుతమైన పదజాలంతో ఇతరులను నొప్పింపక తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం సామాన్యమైన విషయం కాదు. హాస్యం హృదయాల్ని తేలికపరుస్తుంది కాని దాని సృష్టి మాత్రం అంత తేలికకాదని ఒక ఆంగ్ల కవి ఇలా అన్నాడు. It lightens the heart, But the process to arrive at it requires serious thinking .
మనిషి జీవితం పుట్టుక నుండి చావు వరకు దుఃఖమే. అయితే అందులోనే తనకు కావలసిన ఆనందాన్ని వెతుక్కోవడానికి, పదిమందికి పంచడానికి మనిషి సాహిత్య సృష్టి చేసాడనుకోవచ్చు. ఈ ఆనందాన్వేషణ మనిషిని మిగిలిన జీవరాసులనుండి వేరు చేస్తోంది.
ఒక మహాకవి నవ్వు గురించి ఎంత అందంగా చెప్పాడో చూడండి.
“నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును, నవ్వులు చిత్త వృత్తికిన్
దివ్వెలు కొన్ని నవ్వులెటు తేలవు . కొన్ని విష ప్రయుక్తముల్
పువ్వుల వోలె ప్రేమరసముల్ వెలిగ్రక్కు విశుద్ధమైన లే
నవ్వులు సర్వదుఃఖదమంబులు వ్యాఖులకున్ మహౌషధుల్. “
జంతువులనుండి మనిషిని వేరు చేసే ‘నవ్వు’ విషపూరితం కాకుండా పువ్వుల మృదువైన ప్రేమరసాన్ని అందించి దుఃఖాన్ని, రోగాన్ని ఉపశమింప చేయాలని కవి సూచన. అలాంటి నవ్వే చిత్తవృత్తికి దివ్వె అవుతుంది. గాంధీగారు కూడా “If I had no sense of humor, I would long ago have committed suicide” అన్నారు. నవ్వగలగడం ఒక వరం. ఒక ఐశ్వర్యం. అందుకే కీ.శే.జంధ్యాల
“నవ్వడం ఒక యోగం
నవ్వించడం ఒక భోగం
నవ్వలేకపోవడం ఒక రోగం “ అన్నారు.
“A man is not poor if he can still laugh” అంటాడు హిట్లర్.
“Though the room is big if there is no place to humor , we can say it is congested” అని ఇంగ్లీషులో ఒక వాక్యముంది.
వాసనలేని పూవులా పరిహాస ప్రసంగం లేని వాక్యం వ్యర్ధమన్నాడు ఒక తెలుగు కవి. హాస్యం ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి విషాద విచ్చేధకమవుతుంది. రోజూ ఓ గంటసేపు నవ్వితే అమృతపానం చేసినంత ఫలితం.
“Humor cures the people – both the one who gives it and the one who receives it” అని ఇంగ్లీషులో మంచి వాక్యం కూడ ఉంది.
తనివితీరా నవ్వినప్పుడు, శ్వాసకోశమంతా ప్రాణవాయుమయమవుతుంది. అతికష్టమైన యోగాభ్యాసాన్ని నవ్వు ధర్మమా అని అతి సులువుగా చేయగలరన్నమాట.
అసలు “నవ్వంటే” నిర్వచనాన్ని ఒక మహాశయుడిలా చెప్పాడు. “ఎదుటి విషయంలోని వైషమ్యం వల్ల మనసుకు కలిగే ఆశ్చర్యాన్ని సమన్వయం చేసుకోలేని వేళ కండరాల బిగింపువల్ల అప్రయత్న నిర్బంధకంగా నోట్లోంచి వెలువడే నిశ్వాసమే “నవ్వు”
“అయ్యబాబోయ్! నిర్వచనం నవ్వుని మింగేస్తోంది”. కాని నవ్వడం చేతనైనపుడు అసలు నవ్వెలా వస్తోందో అంటే పై విధంగా అన్నమాట.
నవ్వులో చాలా రకాలున్నాయి. మన ప్రాచీనులు నవ్వు ఆరు రకాలుగా విభజించారు.
1.స్మితం
2.హసితం
3.నిహసితం
4. అవహసితం
5. అపహసితం
6. అతిహసితం
శ్రేష్ఠులకు స్మిత హసితాలు, మధ్యములకు నిహసిత, అవహసితాలు అధములకు అపహసిత, అతిహసితాలు అని కేటాయించారు. ధూషణ లక్ష్యంగా పెట్టుకోక, మర్యాద మరువక, శ్రుతి మించనీయక చేసే హాస్యమే నిజమైన హాస్యం.
అనేక గ్రంధాలలో పరిచయం, శబ్దార్ధాలపైన విశేషమైన అధికారం, విశిష్ట ప్రతిభ, అన్నింటికి మించి సమయజ్ఞత (Presence of mind) సమకూరితే తప్ప హాస్యరసాన్ని సర్వాంగ సుందరంగా ప్రదర్శించడం సాధ్యం కాదు. ప్రతి రసానికి ఒక రంగు ఉంటుంది.
హాస్యం రంగు తెలుపు. నవరసాల్లో నవనవలాడే నిత్యనూతనమైనది హాస్యమే. సుకుమారమైన హాస్యానికి పూర్ణాయుర్ధాయమే.
అయితే ఆంధ్ర సాహిత్యంలో ఈ హస్య రసం కవులచేత ఎంతవరకు గౌరవింపబడిందో స్థూలంగా దర్శిస్తే….
కీ.శే. ఆచార్య తూమాటి దోణప్పగారు “తెలుగు సాహిత్యంలో ప్రాచీన సాహిత్యపు పేరోలగంలో హాస్యరసానికి వేసిన పీట మాత్రం చాలా చిన్నది. ఆ రోజులలో వాళ్లు చాలా రసాలకు పట్టాభిషేకం చేసారు కాని హస్యం దాస్యం చేసింది. విధూషకులు, చెలికత్తెల ఆశ్రయంలో కాలం గడుపుతూ వచ్చింది. అయితే ఆంధ్రులు హస్యప్రియులు కారని గట్టిగా అనలేము. వదినా మరదళ్ల సరసాలు, పెళ్లిళ్లలో ఇరుపక్షాలవారి పరియాచకాలు … ఒకటేమిటి అడుగడుగునా, అనుక్షణమూ తెలుగువారి బ్రతుకుదారుల్లో హాస్యరసం జాలువారుతూనే ఉంది. తెలుగునాట వినోదాత్మక ప్రదర్శనల నిండా హస్యమే కనిపిస్తుంది” అంటారు.
తెలుగు సాహిత్యంలో తొలి తెలుగు రచన ఆంధ్రమహాభారతం.. కురువంశపు వీరులు, వారి చుట్టాలు, స్నేహితులు అందరూ గంభీరమూర్తులే. వారు నవ్వడం చాలా అపురూపం. కాగా భారతంలో మనం హాస్యరసాన్ని వెతుక్కుంటే అక్కడక్కడ దర్శనమిస్తుంది. అదీ స్మితమే. ఆదిపర్వంలో గరుత్మంతునిచేత పీడింపబడిన దేవతల పరుగులు, బకాసురుని వృత్తాంతంలో పసివాడి మాటలు దుర్యోధనుని భంగపాటు ఎంతో కొంత నవ్విస్తాయి.
నన్నెచోడుని కుమారసంభవంలో మన్మధుని ప్రగల్భాల కన్నా రతీదేవి భర్తని వారించడం పఠితను నవ్విస్తాయి. పరమేశ్వరుని తపోభంగం చేయడానికి తాను సపరివారంగా వెడుతున్నానని పల్కిన భర్తతో రతీదేవి…
“పరమశివుని విల్లు కనకసిరి, నీ విల్లు చెఱకుగడ, ఆయన బాణం పాశుపతం, నీ బాణం కేవలం పుష్పం. చిన్న పిల్లలు కూడా తిని, పిప్పి ఉమిసెడి చెఱకుగడను గొప్పవిల్లని విశ్వసించి, క్షణాలలో నశించే పూలని బాణాలుగా తగిలించుకొని, వేసవి ఎండకి బెదిరిపోయే వసంతుని గొప్ప స్నేహితుడని వెంటబెట్టుకొని, కాకి పిల్లల్ని చూసి బెదిరిపోయే కోకిలలు, ఆడవాళ్లు అదిలిస్తేనే ఆకాశంలోకి ఎగిరిపోయే చిలుకలు పెద్ద సైన్యంగా గర్వించి, పరమేశ్వరునిపై దాడికి వెళ్లడం మంచిది కాదు. ” అని హెచ్చరిస్తుంది. ఇలాంటి మాటల్లోని హస్యం సున్నితంగా మనసుని తాకి నవ్విస్తుంది.
తిక్కన రచనలో వ్యంగ్యం ఎక్కువ. నర్తనశాలలో స్త్రీ వేషంలో ఉన్న భీముడు కీచకునితో “నన్ను ముట్టి నీవు చెండి యు వనితల సంగతికి పోవు వాడవె” అని గూఢంగా అంటాడు. ఇలాంటి వాక్యాలు చిరునవ్వుకి పుట్టినిళ్లవుతాయి. ఇక ఉత్తరకుమారుని ప్రగల్భాలు, తీరా కురు సైన్యాన్ని చూసాక “ప్రాణములు తీపి యన వినవే” అనే అతని గోల బాగా నవ్విస్తాయి. అంతే కాదు.” పసులదయ్య మెరుగు, పడతుల సంతోషమేల నాకు, యనికి జాల నేను” అని రధం మీదనుండి క్రిందికి ఉరికి పరిగెత్తడం కడుపుబ్బ నవ్విస్తుంది. తిక్కన తన పాత్రలచేత నవ్వించిన నవ్వులు లెక్కలేనన్ని. తిక్కన పేర్కొన్న నవ్వుల జాబితా తయారు చేయడం గొప్ప ఆసక్తికరంగా ఉంటుంది. ఇన్ని రకాల నవ్వులుంటాయా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఏ నవ్వూ పాత్రోచిత్యాన్ని భంగం చేయదు. అదీ విశేషం.
గౌరన నవనాధ చరిత్రలో పురోహితుడు ఎలుగుబంటితో సరసాలాడడం, హరిశ్చంద్ర వాఖ్యానంలో కలహకంఠి, కాలకౌశికుల పోట్లాటలు, రోకళ్లతో కొట్టుకోవడాలు, విపరీతంగా నవ్విస్తాయి. కేయూరబాహు చరిత్రలో జంతు పాత్రౌచిత్యమైన మాటలు, చేష్టలు, విక్రమార్క చరిత్రలోని కొన్ని సన్నివేశాలు కొంత హాస్యరస స్ఫోరకాలే.
శ్రీనాధుని హరవిలాసంలో మాయా బ్రహ్మచారి పార్వతిని పరీక్షించాలని వచ్చి ఆమె ఎదుట శివుని నిందిస్తూ, వారి కళ్యాణాన్ని నిరసిస్తూ చేసిన ప్రసంగం,,
“రాయంచ యంచు చీరెక్కు జోకయగుగాక
పచ్చి మెనిక తోలు పచ్చ్చడంబు,”..
వంటి వ్యంగ్యాలు హాస్య రసాన్ని అందిస్తాయి. శ్రీనాధునివిగా ప్రసిద్ధి చెందిన చాటు పద్యాలలో కావలసినంత హాస్యం మనకు కనిపిస్తుంది.
ఒకసారి పల్నాడు వెళ్లిన శ్రీనాధునికి మంచి నీళ్లు కావలసి వచ్చి తన ఇష్ట దైవం శివుణ్ణి ఇలా దబాయించాడట.
సిరిగలవానికి చెల్లును
తరుణులు పదియారువేలు తన పెండ్లాడన్..
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగను విడుము పార్వతి చాలున్..
నీళ్లకోసం ఇలా గడుసుగా విసిరిన చమత్కారానికి ఎంత మాడుపు మొహమైనా వికసించక తప్పదు.
ఆయనదే మరో పద్యం..
పూజారి వారి కోడలు
తాజారగబిందె జారి దబ్బున పడియెన్
మైజారు కొంగు తడిసిన
బాజారే తొంగి చూసి ఫక్కుంజ నగియెన్…
ఎంత దగ్గరివారైనా ఇలాంటి సన్నివేశాల్లో దబ్బున జారిపడితే చూసినవాళ్లెవరికైనా ముందు వచ్చేది నవ్వే.. ఇలాంటి చాటువులు కోకొల్లలు..
శ్రీనాధుని యుగంలోనే అనంతామాత్యుడు భోజరాజీయమనే కథాకావ్యం వ్రాసాడు. సున్నితమైన హాస్యరసపోషణలో అనంతుడు సిద్ధహస్తుడు. మూషిక కన్య ప్రేమ వృత్తాంతం, ఎండ్రి పిల్ల కాశీ యాత్రకు ఉబలాటపడటం హస్య రసాన్ని చిందించే ఘట్టాలు. బ్రహ్మని హేళన చేస్తూ శివుడు విష్ణువుతో..
“వింటి కదా నీ తనయుని కొంటెతనము
..ఇటువంటివి పో పెక్కునోళ్ల వారల మాటల్” అంటాడు.
భక్త కవి పోతన శబ్దాలతో ఆడుకుంటాడు. ఆ శబ్దక్రీడ మన మనసుని తాకి హాయినిస్తుంది. శ్రీకృష్ణుని బాల్య చేష్టలు మనల్ని నవ్వించి పరవశింపచేసే హాస్యప్రసంగాలు.
ఇక రాయలకాలం అన్ని రసాలకి స్వర్ణయుగం. తెనాలి రామకృష్ణుడివిగా చెప్పబడే చాటుపద్యాలు హాస్యభాండాగారాలు. ఒకనాడు శ్రీకృష్ణదేవరాయలు సభలో
“కలనాటి ధనము లక్కర గల నాటికి దాత కమలగర్భుని వశమే” అని సమస్య ఇస్తే…
“నెల నడిమినాటి వెన్నెల యలవడునే గాదెవోయ యమవస నిశికీన్.. అని పెద్దన పూరించాడు.
‘అమవసనిసికి’నచ్చని రామకృష్ణుడు హేలనగా
“ఏమితిని సెప్పితివి కపితము
బెమపడి నెరి పుచ్చకాయ నడితిని సెపితో
ఉమెతక్కయ తినిసెపితో
అమవసనిసికి యనుమాడి అలసనిపెదనా!”
అన్నాడు వికటకవి.. ఈ వెక్కిరింతకు ఆనాటి సభలోనివారికే కాదు మనకూ నవ్వు రాక మానదు. రామకృష్ణ కవి అద్భుత కృతి పాండురంగ మాహత్మ్యం. అందులో నిగమశర్మ అక్క మరవలేని తెలుగింటి ఆడపడుచు. దుష్టసావాసాలు చేస్తున్న తమ్ముడిని బాగు చేయడానికి పుట్టింటికి వచ్చిన ఆవిడ తమ్ముణ్ణి దగ్గర కూర్చోబెట్టుకొని ఎన్నో నీతులు చెబుతుంది. వాడు అన్నీ విన్నట్లే విని ఒకరోజు రాత్రి ఇంట్లో వస్తువులు పట్టుకుపోతూ పనిలో పనిగా అక్కగారి ముక్కుపుడక కూడా పట్టుకు చక్కా పోతాడు. తెల్లవారిన తర్వాత విషయం తెలిసిన ఆవిడ తమ్ముడు తన మాటలు తలకెక్కించుకోలేదన్న బాధ కన్నా తన ముక్కుపుడక పట్టుకుపోయాడని గొల్లుమనడం రసాభావమై పఠితల్ని ఫక్కుమనిపిస్తుంది.
రాయలవారి స్వీయక్ర్తి ఆముక్తమాల్యద. అందులొ ఒక సొగసైన పద్యం ఉంది. విల్లిపుత్తూరు వర్ణనలోని క్రింది పద్యం..
తలఁ బక్షచ్చట గ్రుచ్చి బాతువులు కేదారంపుఁ గుల్యాంతర
స్థలి నిద్రింపఁగఁ జూచి యారెకు లుష స్స్నాతప్రయాతద్విజా
వలి పిండీకృత శాటిక ల్సవి దదావాసంబుఁ జేర్పంగ రే
వుల డిగ్గ న్వెస బాఱువానిఁ గని నవ్వు న్శాలిగోప్యోఘముల్
విల్లిపుత్తూరు చుట్టుపక్కల ఉన్న పొలాల్లో వరిమళ్లకు కాలువలు తీసారు. ఆ కాల్వల నడుమ వేకువ సమయంలో బాతులు తమ రెక్కల సందుల్లో తలలు దూర్చు పడుకున్నాయి. నగర రక్షకులు వాటిని చూసి “తెల్లవారుఝామున కాల్వకు స్నానానికి వచ్చిన బ్రాహ్మణులు స్నానం చేసాక తమ వస్త్రాలను నీళ్లలో ముంచి తీసి పిండివేసి ఆ తడి ముద్దల్ని అక్కడ మర్చిపోయి ఇంటికి పోయారు” అని భావించి వాటిని వారి వారి ఇళ్లకు చేర్చడానికి రేవులో దిగారు. ఆ చప్పుడుకి చటుక్కున లేచి వేగంగా పరిగెత్తుతున్న బాతులను చూసి వరిపైరుకు కాపలాగా ఉన్న స్త్రీలు నవ్వారట. ఈ భ్రాంతిమదాలంకారం మనల్ని నవ్వించక మానదు.
కళాపూర్ణోదయంలో పింగలిసూరన, వైకుంఠంలో నేత్రహస్తుల బెత్తపు దెబ్బలకు జడిసి బ్రహ్మగారే పారిపోయారని చేసిన వర్ణన హస్యరసస్ఫోరకమే.
క్షీణయుగంలోని హాస్యం తన ఔచిత్యాన్ని కోల్పోయిందనక తప్పదు. చేమకూర వేంకటకవి చమత్కారాలు మాత్రం చక్కిలిగింతలు పెడతాయి.
ఇక శతక కర్తలు చాలామంది హాస్యప్రియులు. తెలుగువారి హాస్యం శతకాల్లో ఎక్కువగా దర్శనీయమౌతుంది. వేకువలో సున్నితమైన సునిశితమైన హాస్యం ఉంది.
మచ్చుకి రెండు పద్యాలు…
కోతిని పట్టి తెచ్చి కొత్తపుట్టము గట్టి
కొండముచ్చు లెల్ల కొలిచినట్టు
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వదాభిరామ వినురవేమ. … అన్నా
పాల సంద్రమునందు పవ్వళించిన హరి
గొల్ల యిండ్లకు పాలుకోరనేల
యెదుటివారి సొమ్ము యెల్లవారికి తీపి
విశ్వదాభిరామ వినురవేమ… అన్నా
సునిశితమైన హాస్యం సంఘజీవనంతో ముడిపడి శాశ్వతత్వాన్ని సంపాదించుకుంది.
ఉన్నంతలో దానం చేయడం, ఇతరులచే దానమిప్పించడం పురుషలక్షణం. అటువంటి వారికే మీసం అలంకారం అంటూ కవి చౌడప్ప చెప్పిన పద్యం వాడిగా వేడిగా హాస్యాన్ని అందిస్తుంది.
ఇయ్యక ఇప్పించగలడు
అయ్యలకే కాని మీసమందరికేలా
రొయ్యకు లేదా బారెడు
కయ్యానికి కుందవరపు కవి చౌడప్పా…
నల్లి బాధను బాగా అనుభవించిన ఒక కవి చాటువు..
శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింటనుండి రాజీవాక్షుం
డవిరలముగా శేషాద్రిపై
పవళించుట నల్లి బాధ పడలేక సుమీ…
అడిదం సూరకవి 18వ శతాబ్దంలో విజయనగర రాజుల సంస్థానంలో ప్రసిద్ధి కెక్కిన కవి. ఒకరోజు ఆయన భోజనం చేస్తుండగా ఆయన భార్య ప్రక్కన కూర్చును విసురుతూ గోముగా “అందరిమీదా పద్యాలు చెప్తున్నారు కదా? మన అబ్బాయి బాచన్న మీద ఒక పద్యం చెప్పవచ్చు కదా?” అని అడిగింది.
తరతమ బేధాలు లేని కవిగారు క్రింది పద్యంలో భార్య ముచ్చట తీర్చారట. పద్యం విని ఆవిడ ముఖం చిన్నబోయింది.
“బాబా బూచుల లోపల
బాచన్నే పెద్ద బూచి పళ్లున్ తానున్
బూచంటే రాత్రి వెరతురు
బాచన్నను జూచి పట్టపగలే వెరతురు”
కవి ఎంత నిరంకుశుడో చూడండి. ఎంత పళ్లెత్తైతే మాత్రం కన్నకొడుకు బూచి కన్నా భయంకరంగా ఉన్నాడని భర్త వర్ణిస్తే ఏ కన్నతల్లి మనసు చిన్నబోదు? అయినా మనకి జాలి కలగకపోగా కవిగారి చమత్కారానికి ఫక్కున నవ్వొస్తుంది.
అలాగే ఇంకో కవిగారు మహా పండితుడు. భోజనం చేసాక తాంబూలం వేసుకోవడానికి భార్యను సున్నం తెమ్మని సున్నితంగా పద్యరూపంలో అభ్యర్థించాడు.
“పర్వతశ్రేష పుత్రిక పతి విరోధి
అన్న పెండ్లాము అత్తను కన్నతండ్రి
ప్రేమతోడుత కన్నట్టి పెద్దబిడ్డ
సున్నంబుతేగదే సన్నుతాంగి..”
ఆయనకి భార్య మీద ఎంత అనురాగమో చూడండి.
పర్వత శ్రేష్ట పుత్రిక – హిమవంతుని కుమార్తె పార్వతియొక్క
పతి – భర్తయైన శివునియొక్క
విరోధి -శత్రువైన మన్మధునియొక్క
అన్నపెండ్లాము – అన్నగారైన బ్రహ్మదేవుని భార్య సరస్వతియొక్క
అత్తకు – అత్తగారైన లక్ష్మీదేవిని
కన్నతండ్రి – కన్నతండ్రైన సముద్రుని
ప్రేమతోడుత బిడ్డా – పెద్దకుమార్తె యైన జ్యేష్టాదేవి
సున్నంబు తేగదె సన్నుతాంగి – సున్నము తీసికొనిరా ( సన్నుతాంగి అనేది ఉత్తుత్తి సంబోధన)
“ఓ! దరిద్రపుగొట్టు పెద్దమ్మా! సున్నం పట్టుకురా” అన్నాడు. పాపం ఆవిడ చాలా పతివ్రత. పతిని అనుసరించే మాట్లాడుతుంది. అందుకే సున్నం తెస్తూ..
శతపత్రంబుల మిత్రుని
సుతు జంపిన వాని బావ సూనిని మామన్
సతతము తలదాల్చునాతని
సుతువాహన వైరి వైరి సున్నంబిదిగో…. అని అంటించింది.
శతపత్రంబుల మిత్రుని – సూర్యుని
సుతు – కర్ణుని
చంపినవాని – చంపిన అర్జునుని
బావ – శ్రీకృష్ణుని
సూనుమామన్ – కుమారునకు మేనమామయైన చంద్రుని
సతతము – నిత్యము
తలదాల్చునాతని – నెత్తిమీదమోసే శివునియొక్క
సుతు – కుమారుడైన వినాయకుని
వాహన – వాహనమైన ఎలుకకు
వైరి – శత్రువైన పిల్లికి
వైరి- శత్రువైన ఓ కుక్కా
సున్నంబిదిగో – ఇదిగో సున్నం తీసుకో.
“ఓ కుక్కా! సున్నమిదిగో అని వాత పెట్టింది. ఈ కొసమెరుపు చదివినవారందరికీ ఫక్కున నవ్విస్తుంది.
ఇలాంటి వెటకారపు పద్యాలు, వ్యంగ్య బాణాలు, చతురోక్తులు ఆధునిక తెలుగు సాహిత్యంలో కోకొల్లలు. వాస్తవానికి ఆధునిక యుగంలోనే హస్యప్రాధాన్యత ఆంధ్రులకు బాగా తెలియవచ్చిందనవచ్చు. ఇంగ్లండు, ఫ్రాన్స్, అమెరికా దేశాలు హస్యానికి నెలవుకాగా, ఆయాదేశాల్లో పుట్టిన సాహిత్యంలో హస్యం రాజ్యమేలింది. ఆంగ్లభాషతోనూ, ఆ సాహిత్యంతోనూ భారతీయులకు పరిచయమేర్పడ్డాక మన సాహిత్యంలో కొత్త ప్రక్రియలేర్పడ్డాయి. ఎక్కడ మంచి ఉన్నా గ్రహించి సాహిత్యం ద్వారా పఠితల కందించాలనే తపన మన కవులకున్న సుగుణం. అలాగే మార్క్ ట్వెయిన్ , డికెన్స్, మొలియర్ వంటి హాస్యవేత్తల మార్గంలో ఒకరిద్దరు తెలుగు రచయితలు హస్యాన్ని అందలమెక్కించే ప్రయత్నం చేసారు. ఏమైనా అంత గొప్ప హాస్యం మన సాహిత్యంలో ప్రవేశించలేదని ఒప్పుకుని తీరాలి.
కీ.శే. భమిడిపాటి, మొక్కపాటి, మునిమాణిక్యంగార్లు తెలుగులో హస్య కవిత్రయం. మునిమాణిక్యంగారి కాంతం కథలు, మొక్కపాటివారి బారిస్టర్ పార్వతీశం, చిలకమర్తివారి ప్రహసనాలు, పానుగంటి వారి సాక్షి వ్యాసాలు.. ఇలా ఎన్నో రచనలు హాస్యరసాన్ని పండించాయి. అయితే మన కవులు, రచయితలు తమ రచనలు ఏ రసప్రధానమైనవి అయినా వాటికి సాంఘిక ప్రయోజనం ఉండాలనే లక్ష్యంతో హాస్యాన్ని హద్దుల్లోనే ఉంచారు. మన నైతిక విలువలు హాస్యం పేరుతో దెబ్బతినకూడదనే భావన సుమారు పాతిక సంవత్సరాల క్రితం వరకు ఉన్నదనే చెప్పవచ్చు. ఆధునికయుగంలో సుప్రసిద్ధులైన కవి, రచయిత కీ.శే.చిలకమర్తివారు హస్యధోరణిలో పకోడీలను వర్ణిస్తూ పద్యాలు చెప్పారు. వాటి సారాంశం..
‘కోడి’ తినని శాకాహారులకు వాని రుచిలో సమానమైన ‘పకోడీ’ని బ్రహ్మ సృష్టించాడు. పెళ్లిళ్ల సమయంలో అక్షింతల వాడుక ఎక్కువగా ఉంటుంది కదా. పూజకి, ఆశీర్వచనానికి తలంబ్రాలకి ఇలా చాలా చోట్ల వాడతారు. అయితే మంగళ ప్రదమైన ఈ అక్షింతలు తల మీదనుండి క్రింది పడుటచే కాళ్లక్రింద పడి నలిగిపోతుంటాయి. కాబట్టి అక్షింతలకు బదులుగా మనం పకోడీలను వాడితే వచ్చినవాళ్లు వాటిని తొక్కకుండా జాగ్రత్తగా ఏరుకుని తింటూ హాయిగా కూర్చుంటారని, పెళ్లిపీటలమీద కూర్చున్న వధూవరులకు పకోడీల దండ వేయిస్తే వాళ్లు ఆ ఘుమఘుమలను ఆఘ్రాణిస్తూ అవకాశం వస్తే ఒకటి రెండు నములుకుంటూ కాలక్షేపం చేస్తారనే ఆయన సూచన హాస్యరసాన్ని పుష్కలంగా అందిస్తుంది.
అభ్యుదయ కవిగా, విప్లవ కవిగా ప్రసిద్ధి కెక్కిన శ్రీశ్రీ కూడా తన శతకాల్లో అక్కడక్కడ హాస్యాన్ని మెరిపించారు.
“దయ్యాలను చూపిస్తా
నయ్యారమ్మనుచు నొక్క ఆసామి నా
కయ్యో తన కూతుళ్లను
చెయ్యూపుచు పిలిచి చూపె సిరిసిరిమువ్వా ”
ఇక పేరడీ అనేది ఫక్కున నవ్వించే ప్రక్రియ
‘అప్పిచ్చువాడు వైద్యుడు’ అనే పద్యానికి శ్రీశ్రీ పేరడి ప్రసిద్ధమైనది.
“ఎప్పుడు పడితే అప్పుడు
కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్
చొప్పడిన యూరకుండుము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము మువ్వా ”
శ్రీశ్రీ రాసిన ‘ఏ దేశ చరిత్ర చూసినా’ కవితకు మచిరాజు దేవీప్రసాద్ గారి పేరడీ.
“ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణము
రహదార్ల చరిత్ర సమస్తం ధూళి ధూస పరివ్యస్తం. ”
ఆమోదయోగ్యమైన హాస్యాన్ని ఆనందంగా, అనుభవిస్తేనే ఆహ్లాదం, ఆరోగ్యం.
కీ.శే. జంధ్యాలవంటి రచయితలు హాస్యాన్ని అంగిరసంగా ఎన్నో రచనలు చేసారు. అగ్రస్థానంలో నిలబడ్డారు. ఆరోగ్యకరమైన హాస్యం అన్నివేళల అపురూపమే. ఆ ఆవశ్యకతను తెలిసికొని నిపుణులైన రచయితలు, కవులు తమ సృజనాత్మక శక్తితో రచనలు చేస్తే గొప్ప సంఘసేవ చేసినట్టే.
ఇది హస్యరసాన్ని గూర్చి కేవలం విహంగ వీక్షణం మాత్రమే. పద్యాలలో, వచనాలతో కవితలతో పరమాద్భుత విన్యాసాలు చేసి పఠితల్ని పరమానందభరితుల్ని చేసిన ఎందరో హస్యరస పోషకులు ఇంకా ఉన్నారు. అయినా ఇంకా మరెందరో వస్తేనే సమాజం సుహాసిని అవుతుంది.
పుస్తకం: శేషేంద్ర
వాహ్ ! తాజ్!!!
సేకరణ ; కర్లపాలెం హనుమంతరావు
23 - 12 - 2019

నాలుక నివేదన

 

ఉప వ్యాఖ్యానం

సంపూర్ణ మద్యపాన ఉద్యమం - కర్లపాలెం హనుమంతరావు - వ్యంగ్యం - చుట్టుపక్కల చూడరా కాలమ్ - కౌముది అంతార్జాల పత్రిక


 

వివాహమే మహాభాగ్యం - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు, సంపాదకీయం, 03 -05 -2010)

 వివాహమే మహాభాగ్యం

- కర్లపాలెం హనుమంతరావు

 ( ఈనాడు, సంపాదకీయం, 03 -05 -2010)

 

జన్మతః మనిషి మూడు రుణాలతో పుడుతున్నాడన్నది ఉపనిషత్‌ వాక్యం.

ఋషుల రుణాన్ని బ్రహ్మచర్యంతో,

దేవతల రుణాన్ని యజ్ఞాలతో,

పితృరుణాన్ని వివాహంతో తీర్చుకోవాలని పెద్దల ఉవాచ.

తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవడానికి వివాహాన్ని ధార్మిక సంస్కారంగా ఆచరించే సంప్రదాయం మనది.

'పెళ్లి అనేది ఓ విచిత్ర వలయంలాంటిది. అందులో ఉన్నవారు బయటపడాలని తహతహలాడుతుంటారు. వెలుపల ఉన్నవారు లోనికి వెళ్లాలని ఉబలాటపడుతుంటారు' అని ఓ మేధావి చమత్కరించాడు. కానీ, భారతీయ సంస్కృతిలో పాటించాల్సిన నాలుగు ధర్మాల్లో గృహస్థాశ్రమమూ ఒకటి. 

ధర్మార్థ కామమోక్షాల సాధనకోసం కలసిమెలసి ప్రస్థానిస్తామంటూ- పెళ్లినాడు చేసిన ప్రమాణాల సాక్షిగా వధూవరులు అడుగిడే పొదరిల్లు అది! 'సతుల బడయనేల, సుతుల బడయనేల, వెతలు పడగనేల వెర్రితనము...' అన్న వేమన కూడా కామి కానివాడు మోక్షగామి కాలేడు పొమ్మని తేల్చిచెప్పాడు. ఆ పురుషార్థాన్ని ప్రసాదించేది గృహస్థాశ్రమమే. 

సుఖదుఃఖాల్లో, కలిమిలేముల్లో సహభాగస్వాములై భార్యాభర్తలు సాగించే సంసారయాత్రకు స్నేహదీపమే దిక్సూచి కావాలి. 'మాయ, మర్మములేని నేస్తము/మగువలకు, మగవారికొక్కటె/' అంటూ 'బ్రతుకు సుకముకు రాజమార్గము'ను నిర్దేశించాడు వైతాళికుడు గురజాడ. ఆధిక్యతా భావనలను, ఆధిపత్య ధోరణులను దరికి రానీయకుండా- 'మగడు వేల్పన పాత మాటది/ ప్రాణమిత్రుడ నీకు...' అన్న గురజాడ వాక్కుకు వారసుడిగా- తన జీవన సహచరికి ఆత్మీయతాహస్తాన్ని అందిస్తూ, దాంపత్యబంధంలో స్నేహ బాంధవ్యానికి పట్టం కట్టాల్సింది పురుషుడే.

 

'జీవితమనే రేడియో సెట్టుకి భర్త ఏరియల, భార్య ఎర్త్ ' అంటూ కవిత్వీకరించిన ఆరుద్ర- ఏకాభిప్రాయం అనే విద్యుచ్ఛక్తి లేకపోతే సెట్టు పలకడం సున్నా అన్నాడు.

భార్యాభర్తల సాహచర్యం-సమశ్రుతి చేసిన ఆ పేటికలో బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా తరంగితం కావాలి. దాంపత్యమంటే- మూడు ముడులతో పెనవడిన రెండు ఆత్మలు ఒక్కటై వాగర్థాలవలె కలిసి ఉండటం! మనుగడకు మూలమంత్రమైన మమతను గుండె నిండుగా నింపుకొని జీవన మహతిపై మహత్వ స్నేహగీతాన్ని పలికించడం! అలకలు-అనునయాలు; విరసాలు-సరసాలు; ఉక్రోషాలు-ఊరడింపులు; పంతాలు-పశ్చాత్తాపాలు; కించిత్‌ కోపాలు-కిలకిల నవ్వులు; గిల్లికజ్జాలు- గిలిగింతలు; సాధింపులు-సర్దుబాట్లు... ఆ వీణ మెట్లపై పల్లవించే గానానికి సప్తస్వరాలై ఊపిరులూదడం!

దాంపత్యమంటే-

ఆలుమగలై చెట్టపట్టాలుగా తొలిసారి వేసిన ఏడు అడుగులే, సప్తాశ్వాలుగా వారి జీవనరథం మలిసంధ్యలోనూ సాగిపోవడం! ఆత్రేయ అన్నట్లు 'నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి రాగాలు రంజిలు రోజు రాజీ' రానిమ్మనే ఆకాంక్షలూరే రెండు గుండెలు- కోరికలు తీరి, ఆఖరి మజిలీకి చేరుకున్నాక 'మన జీవిత పయనంలో చివరి కోర్కె ఏదనీ/ ఒకరికన్న ఒకరు ముందు కన్నుమూసి వెళ్లాలని...' నిరీక్షిస్తూ ఆర్ద్రమవుతుంటాయి. 


శృంగార అవసరాల్లేని వయసులోనూ పరస్పరం ప్రేమించుకునే జంటల 'చుట్టూ అల్లుకునే అనురాగమనే రాగలత శోభాయమైనది. లోకోత్తర సౌరభాలతో వెల్లివిరిసేది. పెనుగాలి వీచినా చెక్కుచెదరని ప్రదీప కళిక' అన్నది ముళ్లపూడి రమణీయ భాష్యం.

 

ఇతర దేశాల్లో మాదిరి కాకుండా మన సమాజంలో కుటుంబ వ్యవస్థను అవిచ్ఛిన్నంగా ఉంచుతున్నది వివాహబంధమే. స్త్రీ, పురుషుల మధ్య అనురాగబంధాన్ని దృఢతరం చేసేది వైవాహిక జీవితమేనన్నది సార్వజనీన సత్యం. మానసిక వ్యాకులతతో, నిరాశా నిస్పృహలతో కుంగిపోయే ప్రమాదం నుంచి మనుషుల్ని వివాహబంధం ఒడ్డున పడేస్తుందని, స్త్రీ-పురుషులిద్దరికీ ఇది వర్తిస్తుందని అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. ఆధునిక సమాజంలో వివిధ కారణాలు, ఒత్తిళ్లు, కౌటుంబిక సంబంధాల్లో వస్తున్న మార్పులు వంటివాటివల్ల వివాహబంధాలు తెగిపోవడం, భార్యాభర్తలు విడిపోవడం పరిపాటయిన రోజులివి. కాలానుగుణంగా విలువలూ మారుతుండటంతో- వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేనివారినీ తప్పు పట్టలేం. అయితే, మనుషులకు మనశ్శాంతి చేకూర్చేది వివాహబంధమేనని తేలడం- అనాదిగా వస్తున్న ఆ వ్యవస్థ ఔన్నత్యానికి పట్టం కట్టేదే. 


పెళ్లితో ఎక్కువగా మేలు పొందేది మహిళలు మాత్రమేనని ఇంతకుముందరి అధ్యయనాలు పేర్కొనగా- స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఇరువురికీ వివాహబంధం మానసిక స్వాస్థ్యం చేకూరుస్తుందని తాజాగా వెల్లడయింది. విడాకులు, లేదా జీవిత భాగస్వామి కనుమూయడం వంటి కారణాల వల్ల ఆ బంధం తెగిపోతే, మహిళలకన్నా పురుషులే మానసికంగా ఎక్కువ కుంగిపోతారని చెబుతున్న పరిశోధకులు- పెళ్ళితో నిమిత్తం లేకుండా సహజీవనం చేస్తున్నవారికన్నా, వివాహబంధంతో ఒక్కటైనవారే ఎక్కువ సంతోషంగా ఉన్నారంటున్నారు. అంతమాత్రాన- 'మనువేలనయ్యా, మనసు నీదైయుండ' అంటూ పరస్పర నమ్మకంతో, అన్యోన్యంగా జీవనయాత్ర సాగిస్తున్న వారిది భార్యాభర్తల సంబంధం కాకుండా పోదు. ఆనందమయంగా ఉంటుందనుకుంటే, స్త్రీ, పురుషులు వివాహబంధంతో ఒక్కటై బతుకుబాటలో పయనించడంలోను ఇబ్బంది ఉండదు. ఏ తీరులో ఉన్నా అది దాంపత్యమే. తాంబూలంలా రాగరంజితమైనదే. మహాకథకులు మల్లాది రామకృష్ణశాస్త్రి అన్నట్లు- తాంబూలమైనా, దాంపత్యమైనా ఆద్యంతం రసవంతమే!

-కర్లపాలెం హనుమంతరావు

 (ఈనాడు, సంపాదకీయం, 03 -05 -2010)


పలకరింపులే పట్టిస్తాయి సుమా!-సేకరణ


 సమస్యల'తో 'రణం ('పూ'రణం): October 2016

అర్జునుడు ద్వారకలోని శ్రీకృష్ణమందిరం చేరుకునేసరికి, శ్యామసుందరుడు శయనించివున్నాడు. అప్పటికే అక్కడికి విచ్చేసివున్న దుర్యోధనుడు (అతడు సైతం రాబోయే రణములో వాసుదేవుని సహాయం అర్థించడానికే వచ్చాడు), శయ్యకు శిరోభాగమున గల ఉచితాసనముపై ఉపవిష్టుడై గోచరించాడు. పార్థుడు సెజ్జకు పాదములవైపునున్న ఒక ఆసనముపై ఆసీనుడయ్యాడు.... కొంత సమయం తర్వాత, కళ్ళు తెరిచిన కమలాక్షునికి ఎదురుగా కవ్వడి (అర్జునుడు) కనిపించినాడు. పానుపు దిగివచ్చి, గోవిందుడు ఆప్యాయముగా అర్జునుని పలకరిస్తున్నాడు.
 "ఎక్కడినుండి రాక యిట? కెల్లరునున్ సుఖులే కదా! యశో
భాక్కులు నీదు నన్నలును, భవ్యమనస్కులు నీదు తమ్ములున్
జక్కగనున్నవారె? భుజశాలి వృకోదరు డగ్రజాజ్ఞకున్
దక్కగ నిల్చి శాంతుగతిఁ దాను జరించునె దెల్పు మర్జునా!"
(పాండవోద్యోగ నాటకము - తిరుపతివేంకటకవులు)
(యశోభాక్కులు = యశస్సుచే ప్రకాశించువారు, భవ్యమనస్కులు = పవిత్రహృదయులు, భుజశాలి = మహా బాహుబలం కలిగినవాడు, వృకోదరుడు = భీమసేనుడు, చరించునె = నడుచుకుంటున్నాడా)
భావము: "అర్జునా! ఎక్కడినుండి వస్తున్నావు? అందరూ కుశలమే కదా! కీర్తిచంద్రికలచే విరాజిల్లు నీ అన్నయ్యలు, పవిత్రమైన మనస్సు కలిగిన నీ తమ్ముళ్ళు బాగున్నారు కదా! మహాబలశాలియైన భీమసేనుడు, మీ పెద్దన్నగారి ఆజ్ఞకు లోబడి శాంతముగా నడుచుకుంటున్నాడా? చెప్పవయ్యా!" అన్నాడు గోపాలుడు.

చూడడానికి ఇది అతి సామాన్యమైన కుశలప్రశ్నల పద్యమే! కాని, కాస్త లోతుగా పరికిస్తే, కావలసినంత విషయం ఉంది ఇందులో!..... సుయోధనుని ఎదుటనే, అర్జునుని అన్నలను "యశోభాక్కులు" అని, తమ్ముళ్ళను "భవ్యమనస్కులు" అనీ సంభావించినాడు జనార్దనుడు. అంటే, వాళ్ళు ఎంతటి గుణసంపన్నులో పరోక్షముగా అతనికి తెలుపుతున్నాడన్నమాట! ' అన్నలను ప్రస్తావించినాడు కదా! మళ్ళీ భీముని ప్రసక్తి తేవడం ఎందుకు? ' అనిపిస్తున్నది కదూ! అదేమరి నందనందనుని నేర్పరితనం. భీముడిని "వృకోదరుడు" అని సంబోధించాడు ఇక్కడ. "వృకము" అంటే తోడేలు, "ఉదరము" అంటే కడుపు. అనగా ' తోడేలు యొక్క కడుపువంటి ఉదరము కలవాడు ' అని అర్థం. తోడేలుకు ఎంత తిన్నా, ఆకలి తీరదని చెప్తారు. ' రాబోయే కదనములో భీముడు ఆకలిగొన్న తోడేలు వలె, నీ అనుజుల పైకి లంఘిస్తాడు సుమా!' అని దుర్యోధనునికి బెదురు పుట్టిస్తున్నాడు. "భుజశాలి" అని పేర్కొని ' నీవలె గదాయుద్ధములోనే కాక, మల్లయుద్ధములో కూడా ఘనాపాఠీ ' అని సుయోధనుని గుండెల్లో గుబులు కలిగిస్తున్నాడు. ' అన్నయైన ధర్మజుని ఆజ్ఞకు బద్ధుడై నిగ్రహించుకుంటున్నాడుకాని, లేకుంటే మీ సంగతి ఏనాడో సమాప్తమయ్యేది ' అని చెప్పకనే చెప్తున్నాడు అచ్యుతుడు.... పాండవగుణ ప్రశస్తి అతని చెవులకు గునపాల్లా గుచ్చుకోవాలి. భీముని భుజబల ప్రసక్తి అతనికి ప్రాణాంతక మనిపించాలి. దుర్యోధనుని మనోస్థైర్యమును దెబ్బతీసే రాజనీతి ఇది.
-(ఈమాట- అంతర్జాతీయ పత్రిక నుంచి సేకరణః కవి పేరు నోట్ చేసుకోలేదు అప్పట్లో.. క్షమించమని మనవి!)

-కర్లపాలెం హనుమంతరావు


స్వర్గం నాకొద్దు!- కథానిక -కర్లపాలెం హనుమంతరావు

 


యమలోకం.

మృతజీవుల పాపపుణ్యాల విచారణ సాగుతోంది. చిత్రగుప్తుడు చిట్టా నుంచి ఒక్కో జీవినే పిలిచి యమధర్మరాజుగారి ముందు నిలబెడుతున్నాడు. గుప్తాజీ చదివే పాప పుణ్యాలను విచారించి  అర్హులైన జీవులను స్వర్గానికి పంపించెయ్యడం, పాపులైన జీవులను యమకింకరులకు అప్పగించి శిక్షలు విధి యధావిధిగా యమధర్మరాజుగారు ఆ రోజూ నిర్వహిస్తున్నారు.

'ప్రభూ! ఈ జీవులంతా తిరుమలస్వామి దర్శనార్థమని వెళుతూ ఘాట్ రోడ్ మీది బస్  ప్రమాదంతో నేరుగా తమ సమ్ముఖానికి వచ్చినవారు'

'భక్తుల మహాప్రస్థానాన్ని ఆపే అధికారం మనకీ లేదు. అందరినీ సరాసరి స్వర్గధామానికి సాగనంపండి!' యమధర్మరాజుగారి ఆజ్ఞ.

‘మరి వాహన చోదకుడిని కూడానా మహాప్రభో?'

'తప్పదయ్యా! ఆ చోదకుడు ఆ ఘాతుకమునకు ఒడిగట్టినందు వల్లనే కదా అంత మంది భక్తులు ఆఖరి క్షణములలో దైవనామస్మరణము నిరాటంకముగా సాగించినారు! సమూహం మొత్తంలో ఒకే దఫా పుణ్యకార్యమునకు ప్రేరేపించిన కారణమున ఈ వాహన చోదకునికి స్వర్గములో  ప్రత్యేక సౌకర్యములు సైతము అనివార్యం'

'చిత్తం స్వామీ!' అని  నసుగుతున్న చిత్రగుప్తుని వంక విచిత్రముగా చూసినారు యమధర్మరాజుగారు.

చిత్రగుప్తుడు సమీపముగా వచ్చి చెవిలో సాగించిన గుసగుసలకు స్పందనగా 'సరి!  అర్థమయినది! మృతుల విచారణ  ప్రారంచమని మా ఆజ్ఞ!' అని హూంకరించారు యమధర్మరాజుగారు కైకాల సత్యనారాయణగారి స్టైల్లో.

తన ముందుకొచ్చి నిలబడిన ఒక యువ మృతజీవి వంక గుర్రుమని చూచి అడిగారీ సారి 'ఈ జీవి నిర్యాణమునకు కారణమేమి? కరువులా? కాటకములా? వరదలా? ప్రమాదములా? కరోనా వైరస్సులా? వాటి నిరోధమునకు వాడు టీకా చికిత్సలా?'

‘అవి ఏవియును కాదు మహాప్రభో! తాను అభిమానించి చలనచిత్ర కథానాయకుని చిత్రరాజము మొదటి రోజునే బర్రుమని చేదేసిందన్న దుగ్ధతో పురుగుల మందు తాగినందువలన..’

‘అర్థమయినది. ఆ  పురుగుల మందు వలననా?’ తల పంకించి  ‘ఓ మృతజీవీ! నీకు చలనచిత్రములన్నచో అంత ప్రీతిపాత్రమా? అని గుడ్లురిమారు' యమధర్మరాజుగారు.

'ప్రాణం చిన్నమాట సామీ! పిచ్చి.. మదపిచ్చి!' గర్వంగా చెప్పింది మృతజీవి.

'అయినచో.. ఆ చిత్రరంగమునకు సంబంధించినదే ఒక చిన్న ప్రశ్న సంధించెదను. ఉచిత సమాధానమిచ్చినచో  సముచిత రీతిన స్వర్గప్రాప్రి ప్రసాదించెదను. సిద్ధమా?'

'డబుల్ సిద్ధమ్. అడుక్కో సామీ!'

‘షారుఖ్ ఖాన్ అను బాలీవుడ్ నటుడు ఇంత వరకు ఎన్ని చుంబన సన్నివేశములందు తన నటనాకౌశలము ప్రదర్శించెను?'

'ఇదేం పిచ్చి ప్రశ్నయ్యా మహానుభావా? ప్రతి చిత్రంలోనూ కిస్సింగ్ సీన్సు ఒకటో రెండో ఉంటయ్ కదా! అవి లెక్కెట్టుకుంటూ కూర్చుంటే రెక్కలు పడిపోతయ్ నాయనా! షారుఖ్ పెద్ద రొమాంటిక్ హీరో. అతగాడు నటించిన  చిత్రాలన్నిటిలో ఓటో .. అరో కిస్ సీన్లుండకపోతే ముందు  హీరోయిన్లే డిజప్పాయింటయిపోతారు. కిస్సుల్లేకపోతే ముందు ఫ్యాన్సే ఆయన్ని మర్డర్ చేసేస్తారు'

'నో! ఒక్క చిత్రములోనైనను ఆ నటుడు ఏ కథానాయిక చెక్కిలిని చుంబించనే లేదింతవరకు.  అది అతని ప్రతిజ్ఞ. నిత్యమూ చిత్ర ప్రపంచములో మునిగి తేలు నీకు ఇంతటి స్వల్ప విషయము తెలియకుండుట విచిత్రమే! సరి. మరియొక అవకాశం ఇచ్చుచుంటిని. జీవించి ఉన్నకాలములో భవిష్యత్తులో నీవు ఏమి కావలయునని వాంఛించెడివాడివో సెలవిమ్ము మృతజీవీ! యాక్టరా.. డాక్టరా.. లాయరా.. టీచరా..రాజకీయ నేతయా.. లేక మీ ఆంధ్రదేశమందు అందరూ అభిలషించు ఆ కంప్యూటర్ ఇంజను పనియా?’

'ఆఁ..ఏదీ.. ఇదీ.. అని ఇతమిత్థంగా అనుకోలేదయ్యా సామీ ఇంకా! మనకంత టైమెక్కడుందసలు మహానుభావా? అఁ! ఏ ప్రొఫెషన్లో సెటిలయినా డబ్బు మాత్రం  బిల్ గేట్స్ కు మించి  సంపాదించాలనే ఆత్రం మా  గట్టిగా ఉందయ్యా మా రాజా!'

'అటులనా? అయినచో.. ఆ బిల్ గేట్స్ ఫోర్బ్స్  కుబేరుల జాబితాలో ఏ స్థానములో ఉండెనో ఏమైనా అంచనా కలదా జీవా నీకు?'

'ఫోర్బ్సా?! ఫోర్డ్ కారు పేరు విన్నానే కానీ.. ఈ ఫోర్బ్సులూ, గీర్బ్సులూ ఎప్పుడూ జాన్తానై! ఇదేంటయ్యా సామీ? జి.కె అంటే ఏవో ఎబ్రివేషన్సూ, యుద్ధాలూ, డేట్సూ అవార్డుల్లాంటి వాటిని గురించి గీకుతారని విన్నాగానీ, మరీ ఇంత అన్యాయ మైన బిట్ పేపరా ..!'

'మంచిది జీవా!  జి.కె మోడల్ బిట్ క్వశ్చన్లే కదా మరి నువ్ కోరేది?  నోబెల్ బహుమానము స్వీకరించిన మీ దేశీయుల పేర్లేవో ఓ అయిదు చెప్పగలవా టక టకా? వాటిలో అందరికీ తెలిసిన రబీంద్రనాథ్ ఠాగోరు, రామానుజం, అమర్త్యసేన్ వంటి ప్రసిద్ధుల పేర్లు నిషిద్ధం సుమా?'

'మహాత్మా గాంధీ!;

'మీ మహాత్మునుకి ఆ పురస్కారం దక్కనేలేదయ్యా మహాశయా! సరి! సాధారణ జ్ఞానము కూడా తమరికి శూన్యమని తేటతెల్లమయిపోయినది. సాధారణముగా మీ యువతకు 'ప్రేమ' అన్న మహా ప్రీతికరమైన అంశము కదా!  పోనీ ఆ క్షేత్రమునకు సంబంధించిన ప్రశ్న సంధించమందువా?'

'సంధిస్తే సంధించండి గానూ మహాప్రభో! ఎక్కడో అడుగు బొడుగువి ఏరి మరీ సంధించి నా ప్రాణం తీయకండి.. ప్లీజ్.. ప్లీజ్!'

'పిచ్చిజీవీ! నీ ప్రాణములు తీయు కార్యక్రమం ఏనాడో అయిపోయిందయ్యా!  ఇప్పటి ఈ ప్రయాస సర్వమూ నీ స్వర్గము నీకు తిరిగి ప్రాప్తింపచేయుడకు! అందాల పోటీలో గెలుపొందిన సుందరాంగుల పేర్లు రెండు చెప్పుము.. చూతము.. అయిశ్వర్యా రాయి, సుస్మితా సేన్ తక్క’

'ఈ తక్కలతోనే నాకు తిక్క రేగేది. నాకు తెల్సిన రెందు పేర్లూ నువ్వే చెప్పేసి.. ఇంకా చెప్పమంటే నేనెట్లానయ్యా సామీ చావడం? ఇంత తొండయితే నేనస్సలు ఇక్కడ ఉండనే ఉండను .. ఫోండి!'

చిత్రగుప్తుడు యమకంగారుగా యమధర్మరాజుగారిని  సమీపించి  ప్రభువుల రెండు చెవులు బరబరా కొరికేశారో రెండు నిమిషాలు.  సమవర్తీ సాభిప్రాయంగా తలాడించి మృతజీవి వంక చూస్తూ 'మాజీ మానవా! ఎన్న సరళ ప్రశ్నలు సంధించిననూ సముచితమయిన సమాధానము ఒక్కటీ రాక సంధి ప్రేలాపనలు చేయుచున్నావు. నీ వంటి వ్యర్థజీవి మా నరకమునకు కూడా పెనుభారమే. నీ పక్షము నుంచి సహకారమందనిచో  స్వర్గప్రాప్తియు నీకు దుస్సాధ్యము. కనుక ఈ ఒక్క సారికి నీకు తెలిసిన అంశముల నుంచి మాత్రమే ప్రశ్నలు సంధింపబడును. సహనముతో నీవు సమాధానాములు ఇచ్చితీరవలయును. మీ లోకములో  నీకు ఇష్టమైన వారు ఓ నలుగురు ఎవరో  చెప్పుము!'

'అమ్మయ్య! ఇదీ క్వశ్చన్ పేపరంటే! మా అమ, చెల్లాయి, తమ్ముడు, దోస్తు దాసు నా కిష్టమయిన ఆ నలుగురు'

'ఇందులో మీ నాయనగారి పేరు లేదేమీ?'

'ఆయనంటే నాకు చచ్చే కోపమయ్యా'

'ఎందుచేతనో?'

'నా చిన్నతనంలోనే వళ్లు కాల్చుకుని చచ్చిపోయాడు పొలంలో పంట సరిగ్గా పండలేదని. ఇల్లంతా, పాపం, మా అమ్మ ఒక్కతే నడిపింది ఇంతకాలం.. నానా అగచాట్లు పడి! అయినా ఇంట్లో నిష్టదరిద్రమే. రెండు పూటలా మింగే ఒక ముద్దకే రోజంతా ఎద్దులా చాకిరి చేయాల్సొచ్చేది, పాపం.. అమ్మ. ఇహ నేను మాత్రం చదువు సక్రమంగా వెలగబెట్టేదెట్లా? గొప్పవాణ్ణవడం కల్లో కూడా ఉహించలేని మాట. అందుకే, మమ్మిల్నిట్లా నట్టేట్లో ముంచిపోయిన మా అయ్యంటే నాకు మహా మంట.  ఆయనే కనక బతికుండుంటే ఎంత బాగుండేది!  పెద్దయ్యాక నేనో పేద్ద సినీ స్టారునై కోట్లు కోట్లు గడుంచేవాణ్ణి గదా!’

'సరే నిర్జీవీ! నీ కన్ని కోట్లు నిజంగానే వస్తే ముందుగా సంబరపడేదెవరు?’

'ఇంకెవరూ.. మా అమ్మ! ఆనక చెల్లెలు, తమ్ముడూ! అయిపోయాయా బాబయ్యా నీ తలా తోకా లేని ప్రశ్నలు?'

మృతజీవి చిరాకు చూసి చిరునవ్వుతో ఆడిగాడు యమధర్మరాజుగారు 'చివరి ప్రశ్న ఒకటి ! మీ చెల్లాయి ఏ మహేష్ బాబో, జూనియర్ ఎంటీఅరో, దేవరకొండోలాంటి కథానాయకుణ్ణి ప్రేమించి అతగాడితోనో పెళ్లి జరిపించాలని ఇంట్లో పట్టుబడితే!, లేకుంటే చచ్చిపోతానని  బెదిరిస్తే. ఏం చేస్తావ్ నువ్వు?'

'చంపి ఉప్పుపాతరేసేస్తాను!' అంటూ ఊగిపోయింది కుర్ర మృతజీవి. అంతటితో ఆగితే అదో రకం. యమధర్మరాజుగారి మీదనే ఇంతెత్తున లేచింది ఇహ సహనం కోల్పోయి 'ఇదేం యమలోకం? నువ్వేం యమధర్మరాజువయ్యా? ఇట్లా ఉంటుందా  విచారణంటే? మా లోకంలో టీవీ సిరియల్సు కన్నా సిల్లీగా ఉంది. ఇదేదో 'బిగ్ బాస్' తరహాలో ముందే మేనేజ్ చేసిన ఫార్శుడ్  ప్రోగ్రాం లాగుంది. నిజమా .. కాదా? కమాన్.. టెల్ మీ ది ట్రూత్! అబ్సొల్యూట్ ట్రూత్!’

ఉద్రేకంతో ఊగిపోయే మృతజీవి వంక చూస్తూ 'శహ్ భాష్!' అంటూ ప్రశంశాపూర్వకంగా చప్పట్లు చరిచారు యమధర్మరాజుగారు. 'ఇప్పటికయ్యా నీకు వంటి మీదకు స్పృహ వచ్చింది! నువ్వు తెలివిలో కొచ్చావు  కాబట్టే తెలివైన ప్రశ్న సంధించావు! నాకు నచ్చావు. కాకపోతే నాదో చిన్న సందేహం. నీ అబిమాన కథానాయకుడి చలనచిత్రం ఆడకపోతేనే పురుగుమంది తాగి ఇక్కడికి  పరుగెత్తుకొచ్చావే! మరి ఆ చలనచిత్ర రంగ పరిజ్ఞానం కూడా ఎందుకంత శూన్యం నీకు? బిల్ గేట్సుకు మించి  బోలెడంత సంపాదించాలన్న  యావే కానీ,  మనీ ప్రపంచానికి చెందిన ఫోర్బ్స్  కుబేరుల జాబితా సైతం తెలీనంత అజ్ఞానంలో పడికొట్టుకుంటున్నావ్ నువ్వు! కోడెవయసులో ఉండీ అందాల ప్రపంచానికి చెందిన రాణుల పేర్లు కనీసం రెండుకు మించి తెలీని తెలిబితక్కువతనం నీది! చదివేది కళాశాల చదువులే అయినా, కనీసం మహాత్మునికి నోబెల్ పురస్కారం దక్కలేదన్న  జ్ఞానం కూడా లేకపోయె నీకు! పంటలు పండకపోవదానికి వెరే కారణాల మాటెట్లా ఉన్నా, ప్రకృతి వైపరీత్యాలదే ప్రథమ బాధ్యత అని  తెలిసీ వళ్లు కాల్చుకున్నాడు మీ నాయన. ఆ అన్నదాతకూ.. చిత్రాల విజయాపజయాలకు, నిజజీవితాల గెలుపు ఓటములకు  మధ్య  సంబంధం లేదని తెలిసీ పురుగుల మందు తాగిన నీకూ తేడా ఏముంది? అమ్మ, చెల్లి, తమ్ముడంటే ప్రాణమని నువ్వే అంటివి! మళ్లీ వాళ్లందర్నీ నట్టేట ముంచి నువ్వొక్కడివే పైకొచ్చి స్వర్గ సుఖాలు చవిచూద్దామని చొంగలు కారుస్తుంటివి! సరే! ఫో! అనుమతి ఇస్తున్నాను. స్వర్గానికే పో! అదిగో! అక్కడ.. పుష్పకవిమానం సిద్ధంగా ఉంది నీ కోసం.. ఫో!'

'నాకే స్వర్గమూ వద్దు మహాప్రభో!' అని బిగ్గరగా అరిచింది మృతజీవి. 'తప్పు తెలిసింది యమధర్మరాజా! తిరిగి నన్ను మా భూలోకానికి పంపించెయ్యండి.. ప్లీజ్! బుద్ధిగా చదువుకొని మా నాన్న లేని లోటును పూరిస్తా! మా ఇంటినే నేను  స్వర్గధామంగా మార్చుకుంటా!'

కుమిలిపోయే మృతజీవి భుజం తట్టి 'తథాస్తు!' అని లేచి నిలబడ్డారు యమధర్మరాజుగారు.

అక్కడ భూలోకంలో మృతుని శరీరం మళ్లీ జీవం పోసుకుని లేచికూర్చుంది. ఇంటిల్లిపాదికీ అంతులేని సంతోషం!

***

ఇక్కడ యమలోకంలో చిత్రగుప్తుడు అన్నాడు 'మృతుడు తాగిన పురుగుల మందు పరమ కల్తీది మహాప్రభో! ఆ సత్యం తెలియక మన కింకర కుంకలు మృతుడి ప్రాణాలు పట్టుకొచ్చేశారు. కింది లోకంలో  విచారణ జరుగున్నది. ఆ విషయమే నేను  మొదట్లో మీ చెవిలో వేసేందుకు ప్రయత్నించింది.  కింద విచారణలో  మృత జీవి తాగింది కల్తీ పురుగుల మందేనని నిర్ధారణ అయిన దాకా తమరు.. మహాతెలివిగా మన యమలోక విచారణ 'షో' నడిపించారు. అటు మృత జీవికి తాను చేసిన తప్పేమిటో తెలిసివచ్చేలా చేశారు.ఇటు  మన  కింకరుల పొరపాటు త్రిలోకాధిపతుల దాకా పోయి నరకలోకం  పరువు పోకుండా  కాపాడారు! మీ సాగదీత విచారణా ప్రతిభకు ఇవే నా జోహార్లు' అంటూ చిత్రగుప్తుడు వంగి వంగి  ప్రణమిల్లితే గుబురు మీసాలు దువ్వుకుంటూ  కైకాలవారి స్టయిల్లో 'యముండ' అని చిద్విలాసం చిందించారు యమధర్మరాజుగారు.

-కర్లపాలెం హనుమంతరావు

10 -03 -2010

బోథెల్, యూఎస్ఎ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఆ'పరేషాన్ ' - చిన్న కథ - కర్లపాలెం హనుమంతరావు

 

 

మా కొలీగ్ సుబ్బారావు తనకు వంట్లో బావోలేదని ఆసుపత్రికి వెళుతుంటే నేనూ తోడు వెళ్ళా.

బైట బోలెడంత క్యూ. గంటకయినా లోపలికి పోవడం అనుమానమే. ఆఫీసుకి టైమయిపోతుందని నేను కంగారు పడుతుంటే కారిడార్లలో గుర్నాథం కనిపించాడు. నన్ను గుర్తుపట్టి పలకరించాడు.

గుర్నాథం హైస్కూల్లో నా క్లాస్ మేట్. చాలా ఏళ్ళతరువాత అనుకోకుండా ఇక్కడ కలిసాడు. నేను వచ్చిన పని కనుక్కొని చనువుగా 'డాక్టరుగారు నాకు బాగా తెలుసులేరా! నువ్వెళ్ళు! మీ ఫ్రెండు పని నేను చూస్తాలే!' అన్నాడు.

 

ఆ సాయంత్రం సుబ్బారావు గుర్నాథాన్ని ఒహటే పొగడటం! 'మీ ఫ్రెండుకి మా చెడ్డ ఇన్ఫ్లుయన్సుందండీ! చకప్పులూ అవీ చకచకా చేయించేసాడు. రిపోర్టులు తీసుకొని తనే వస్తానన్నాడు' అన్నాడు సంబరంగా.

గుర్నాథం స్కూలురోజుల్లో యావరేజి. వెనుక బెంచీలో కూర్చోని ఎప్పుడూ ఏవేవో పెన్నులు రిపేరు చేస్తుండేవాడు. వాడి సంచీలో పుస్తకాలు అన్నీ ఉన్నా లేకపోయినా.. రకరకాల కలం కేపులు, పాళీలు, నిబ్బులు, సిరాబుడ్డి, చెత్తగుడ్డపీలికలు మాత్రం నిండుగా ఉండేవి. మూడుపైసలకు కేపు, రెండు పైసలకు నిబ్బు, పైసాకి పాళీ.. పెన్నుమొత్తమయితే అణా.. అలా అమ్మేవాడు పాత కలాలని. అణాలు, పైసలు చలామణిలో ఉండే జమానాలేండి అది. అప్పట్లో ఇప్పట్లా బాల్ పెన్నులు కాకుండా సిరా నింపుకొని రాసుకొనే రకం కలాలు వాడకంలో ఉండేవి. మా మాస్టార్లుకూడా ఈ గుర్నాథం బుట్టలో పడుతుండేవాళ్ళు! అవసరం వచ్చినప్పుడు వాడు వాళ్ళకీ పేనాలు ఉచితంగా తయారు చేసిస్తుండేవాడు.  అందుకని ఏమనేవాళ్ళు కాదు.

పదో తరగతి పరీక్షలు రాసే రోజుల్లో సమాధాన పత్రాలు తారుమారు చేసాడని డిబారు చేసారు వాణ్ణి. ఆ తరువాత ఇదిగో ఇప్పుడే.. మళ్ళీ దర్శనం!

గుర్నాథం తెచ్చిన రిపోర్టులు చూసి గుండె ఆగిపోయినంత పనయింది  సుబ్బారావుకి. కిడ్నీలో ప్రాబ్లమున్నట్లు తేలింది. 'ఆపరేషన్ అవసరమంటున్నాడు డాక్టర్' అన్నాడు గుర్నాథం తాపీగా.

కిడ్నీ ట్రాన్సప్లాంటేషనంటే మాటలా? దానికి ముందు డయాలసిస్. డయాలసిస్ అంటే లక్షల్లో వ్యవహారం. ముందు డోనర్ దొరకడమే గగనం. కిడ్నీదాత బంధువు కాకపోతే ఆథరైజేషన్ కమిటీ అప్రూవల్ అవసరం. అదంత తేలికగా తెమిలే వ్యవహారం కాదు. అన్నింటికన్నా ముఖ్యంగా డాక్టర్లు రిస్కు తీసుకోవడానికి బాగా జంకుతున్నారు. మరీ ఈ మధ్య ఈ కిడ్నీ కేసుల చుట్టూతా గవర్నమెంటు నిఘా  పెరిగిన తరువాత.

'కేసులవుతాయేమోనని భయం. అవన్నీ నేను చూసుకొంటాగాని.. మనీ సంగతిమాత్రం మీరు చూసుకోండి' అని అభయమిచ్చాడు గుర్నాథం.

'ఎంతవుతుందేమిటీ?'  సుబ్బారావు సందేహం.

'సుమారు నాలుగయిదు లక్షలు'

'అమ్మో! గవర్నమెంటు ఉద్యోగినికూడా కాదు. ఎక్కణ్ణుంచి తవ్వి తేవాలీ అంత డబ్బు?' అంటూ సుబ్బారావు గుండెలు బాదుకొన్నాడు. '

'ఇదింకా చీపండీ! లివరయితే ఏడు లక్షలు. హార్టు, లంగ్సు ఆపరేషనయితే అంతకు రెట్టింపు. కంటిగుడ్డుకు వాడే కార్నియానే ఐదు లక్షలు పోస్తేగాని దొరకడంలేదు మార్కెట్లో'

రైతుబజారులో కూరగాయల దరవరల్లాగా ఏకరువు పెడుతున్నాడు గుర్నాథం.

'చూస్తూ చూస్తూ వంట్లోని పార్టుల్ని ఎవరమ్ముకొంటార్రా? ఏదో సినిమాల్లో అలా చూపిస్తుంటారుగానీ' అన్నాను నేను అక్కడికీ నమ్మకం కుదరక.

'పేదరికం ఎంత పనయినా చేయిస్తుంది బాబూ! మెదడు చచ్చిపోయినా గుండె కొట్టుకొంటుంటే చాలు.. ఇలా చాలా అవయవాలని తీసి హాయిగా వాడుకోవచ్చు. ఇవాళా రేపూ ఆ వ్యాపారం బాగా ఊపందుకొందికూడా మిత్రమా! పేపర్లలో వచ్చేవే వార్తలు కావురా బాబూ! వాటికి వెనకాల సమాంతరంగా అంతకుమించిన ప్రపంచం పరుగెడుతోంది' అన్నాడు గుర్నాథం.

'ఎంత అన్యాయం!' గుండెలమీద చెయ్యివేసుకొన్నాడు సుబ్బారావు తబ్బుబ్బయిపోతూ.

'ఇందులో అన్యాయం ప్రసక్తేముంది?అవసరం అలాంటిది. ఇంద్రుడు వజ్రాయుధంకోసం దధీచి పక్కటెముకలు లాగేసుకోలా? కవచకుండాలలనికూడా దానం చేసిన కర్ణుడికథ మనకు కొత్తా? డబ్బు పడేస్తే లివర్లయినా ఫ్లవర్లలో పెట్టి ఇస్తున్నారు సార్ ఈ కాలంలో! గుండెకాయలు బెండకాయల్లా, కంటిగుడ్లు కోడిగుడ్లలా మారకం జరిగిపోతున్నాయి. యూరప్ లాంటి డెవలప్డ్ కంట్రీసులో అయితే ఏకంగా 'యునైటెడ్ నెట్ వర్క్ ఫర్ ఆర్గాన్స్ సేల్' అని భారీ నెట్ వర్కే నడుస్తోంది బ్రహ్మాండంగా’.

'చట్టం చూస్తూ వూరుకొంటుందా?!’

'ఎందుకూరుకొంటుంది సార్? తనపని తాను చేసుకు పోతుంటుంది. నెట్ వర్కూ తనపని తాను చేసుకు పోతుంటుంది. ఇక్కడిలాగానేఒకరి పనిలో ఇంకోరు జోక్యం చేసుకోకుండా డబ్బుమూట చూసుకొంటుంది'

గుర్నాథం చెప్పిందాంట్లో అతిశయోక్తేమీ లేదనే అనిపిస్తోంది. డబ్బుకు చట్టం చుట్టం కానిది ఎక్కడలేండి?! ప్రాణంతీపిముందు ఎన్ని ధర్మపన్నాలైనా చేదుగానే ఉంటాయికదా!

'మీరు ఆలోచించుకొని కబురు చేయండి!.. వస్తా!' అని విజిటింగ్ కార్డొకటి ఇచ్చి కాఫీతాగి వెళ్ళిపోయాడు గుర్నాథం.

 

సుబ్బారావుగారింట్లో రెండు రోజులు ఒహటే మల్లగుల్లాలు. పాపం! సుబ్బారావు గవర్నమెంటు ఉద్యోగైనా కాదు.. కనీసం ఖర్చులైన్నా రాబట్టుకోడానికి. ఇంట్లోని బంగారం, ఊరి బైట అప్పుడెప్పుడో కొనుక్కున్నస్థలం అమ్మైనా సరే .. ఆపరేషన్ చేయించుకోవాల్సిందేనని పట్టుపటుకు కూర్చొంది సుబ్బారావుభార్య. 

గుర్నథాన్ని పిలిపించి పరిస్థితి వివరించాం. ‘ఉన్నంతే ఇవ్వండి. మిగతా సర్దుబాట్లేవన్నా ఉంటే చూసుకోడానికి నేనున్నాగా!’ అంటూ అభయహస్తం ఇచ్చాడు.  

డోనర్ని చూపించమన్నాడు సుబ్బారావు. అన్నంరాజు అనే అతన్ని కలవమని అదేదో అనాథ శరణాలయం చిరునామా ఇచ్చాడు గుర్నాథం.

గుర్నాథం మనుషులమని నమ్మకం కుదిరాక  సగం రేటుకే బేరం కుదురుస్తానని ఉత్సాహం చూపించాడా అన్నంరాజు.

డోనర్ని మాత్రం ఇప్పుడే చూపించకూడదంట! 'లోపాయికారీ వ్యవహారాలు  కదండీ ఇవన్నీ! పదేళ్ళబట్టీ ఈ వ్యాపారంలో ఉన్నాను. నన్ను మీరు నమ్మాలి' అన్నాడు అన్నంరాజు. నమ్మకమాత్రం చేసేదేముంది గనక?

సగం పైకం ముందే గుంజుకొన్నాడు అన్నంరాజు.

'డాక్టరుగారు ఆపరేషన్ డేట్ ఇచ్చిందాకా కిడ్నీకి రెంట్ కడుతుండాలి. నెలకు నాలుగువేలు. డోనరు కిడ్నీని వేరేవారికి అమ్ముకోకుండా ఆపటానికి, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. ఆ మాత్రం భరించక తప్పదు. ఆఫ్ట్రాల్ ఆపరేషన్ అయిన తరువాత  ఆ కిడ్నీ మనదే అవుతుంది కదండీ చివరికి?' అని ఆ పెద్దమనిషి లా పాయింటూ!

డాక్టరుగారి డేట్ మూడు నెలలకుగాని దొరకలేదు. అంత బిజీట ఆయన! ఈ మూడు నెలలు క్రమం తప్పకుండా డయాలసిస్ తప్పటంలేదు సుబ్బారావుకి.

 

సుబ్బారావీ మధ్య చిత్రంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. 'ప్రతీ మనిషికి కనీసం నాలుగు కిడ్నీలైనా ఉండాలి. అలాగే ఆరేడు జతల చేతులు, పది జతల కాళ్ళు, నాలుగైదు జోళ్ళ చెవులు, కళ్ళు, రెండు మూడు ముక్కులు, వందనాలికలు, నాలుగయిదు  గుండెలుకూడా ఉంటే బావుంటుంది.' ఇలా సాగుతోంది సుబ్బారావు ధోరణి.

రెండు చేతులుంటేనే మనిషిచేసే ఆగం తట్టుకోలేక పోతోంది లోకం. ఇహ పదులు.. ఇరవైలు మొలుచుకొస్తే జరిగే ఆగడాలని ఊహించగలమా?!

'ఒక్క తలకే  ఇంత లావున తిరుగుతోంది మీకు! పదేసుంటే ఇహ పట్టుకోగలమా తమర్నీ.. తమ తి.క్కనీ! ' అని శాపనార్థాలకు దిగింది సుబ్బారావుగారి శ్రీమతి. భర్త పిచ్చిమాటలు  విని విని పాపం ఎంతగా విసిగిపోయిందో ఆ ఇల్లాలు!

'ఇందులో తిక్కేముందే పిచ్చిదానా! శివుడికి మూడు కళ్ళు లేవూ? విష్ణుమూర్తికి నాలుగు చేతులు, బ్రహ్మదేవుడికి నాలుగు ముఖాలు, రావణాసురుడికి పది తలకాయలు, కార్తవీర్యుడికి వెయ్యి చేతులు, దేవేంద్రుడికి వెయ్యి కళ్ళు!  దేవుళ్లందరికీ అన్నేసి అవయవాలుండగా లేనిది మానవులకు అందులో కనీసం సగమైనా ఉండాలని కోరుకోవడం తిక్కా?!'

ఒక అవయవం పాడైనా మరోటి పనికొస్తుందని కాబోలు సుబ్బారావు ఆశ. 'ఈసారి దేముడు కనబడితేమాత్రం రకానికో జత స్పేరుగా ఇవ్వమని పట్టుబట్టడం ఖాయం' అంటో సుబ్బారావు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మనసంతా దేవినట్లయిపోయింది.

 

ఎలాగైతేనేం.. సుబ్బారావుకి ఆపరేషన్ అయిపోయింది.

మూడో రోజు గుర్నాథం పేరు వార్తాపత్రికల్లో వచ్చింది ప్రముఖంగా ఫొటోలతో సహా. ఏ టీవీ ఛానల్లో చూసినా ఆ రోజంతా ఆ మహానుభావుణ్ణి గురించిన సమాచారమే!

మానవ శరీరావయవావలను అమ్మే వ్యవహారంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని ఓ ప్రముఖ వార్తాపత్రిక వివరాలతోసహా వరుస కథనాలను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ గోల్ మాల్ మొత్తంలో గుర్నాథానిదీ ఓ ప్రధాన పాత్ర!

అరెస్టు చేయడానికని వెళ్ళిన పోలీసులు అతగాడు గుండెనొప్పి వచ్చిందన్నాడని కోర్టు ఆదేశాలమీద నిమ్సు ఆసుపత్రిలో చేర్చి బైట పహరా కాస్తున్నారు.

నేర పరిశోధక బృందం అన్నంరాజు అనాథ శరణాలయంమీద ఆకస్మిక దాడి చేసినప్పుడు బోలెడన్ని అవయవాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి బైటపడ్డాయని వార్త! కిడ్నీలు, లివర్లు, కళ్ళు.. వంట్లో అమ్ముకోవడానికి వీలున్న ఏ అవయవాన్నైనా సరే చెట్టుమీదనుంచి కాయలు కోసిచ్చినట్లు కోసిచ్చే ఏర్పాట్లు ఆ అనాథ శరణాలయంలో  జరుగుతున్నాయిట! అందుకు అనుగుణంగా అక్కడ  పెరుగుతున్న అనాథ బాలబాలికలను చూసి  నోరు వెళ్లబెట్టడం నేర పరిశోధక బృందం వంతయిందట!

కూరగాయలే సరిగ్గా దొరకని ఈ కరువురోజుల్లో అంతంత మందని  సేకరించి పెంచడమంటే మాటలా?!

ఆ ముక్కే ఎవరో పనిలేని చానెల్ వాళ్ళడిగితే ఆసుపత్రి శయ్యమీద విలాసంగా శయనించిన గుర్నాథంగారు చిద్విలాసంగా నవ్వి వినయపూర్వకంగా ఇచ్చిన సమాదానం

'అంతా ఆ పై వాడి దయ. ఆపైన సర్కారు పెద్దల సహకారం'

అన్నంరాజు అనాథశరణాలయంలోని పసిపిల్లలు తరుచుగా చనిపోతున్నారన్న విషయం అప్పుడు బైటపడింది! అనుమాన నివృత్తికోసం ముందురోజు పోయిన పిల్లలిద్దరి బాడీలను రీపోస్టుమార్టమ్ చేయిస్తే.. వచ్చిన రిజల్టు ‘షాకింగ్’!

 

బాడీల్లో చాలా పార్టులు మిస్సింగు!

ఉదయంబట్టీ వరసబెట్టి వస్తున్న ఆ వార్తల్ని చూసి చూసి సుబ్బారావు ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయాడు! మళ్లా ఆసుపత్రిలో అడ్మిట్ చేయాల్సొచ్చింది మాకు అర్జంటుగా!

ఎందుకైనా మంచిదని సుబ్బారావుబాడీని ఫుల్ స్కానింగు చేయించాం.  మా అనుమానం నిజమే అయింది. సుబ్బారావు వంట్లోని కిడ్నీలు మాయం!

గుర్నాథం రికమెండ్ చేసిన డాక్టరు  ఆపరేషన్ చేసింది- సుబ్బారావు కిడ్నీజబ్బు మాయం చేయడానికి కాదు. మంచి కిడ్నీని మాయం చేయడానికని ఆలస్యంగా తెలిసింది!

కిడ్నీధర కనీసం నాలుగయిదు లక్షలకు తక్కువ  పలికని రోజుల్లో .. నాలుగో వంతుకే ఆపరేషన్ చేయిస్తానని గుర్నాథం ఆఫరిచ్చినప్పుడే  అన్నిరకాలుగా ఆలోచించుకొని ఉండాల్సింది మేం!

'ఎలాగూ పోయే శాల్తీనేగదా అని ఆయన మంచి కిడ్నీని మా ఆపరేషన్ ఖర్చులకింద రాబట్టుకొన్నాం.. వ్యాపార ధర్మంగా! అదీ తప్పే?!' అంటూ బుకాయింపులకి దిగాడు బైలునుంచి  L బైటికొచ్చిన పిదప అతికష్టంమీద సెల్లో దొరికినప్పుడు గుర్నాథం!


( సూర్య  -దిన పత్రిక ప్రచురణ ) 

***

-కర్లపాలెం హనుమంతరావు

14 మార్చి 2021 

బోథెల్ ; యూ ఎస్ ఎ 





మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...